cover

అమృతానంద ఫలాని

Download PDF EPUB MOBI

amrutanandapalaaniivoryగెడ్డాం బూత రెండు బస్తాల నిండా సంస్కృతం పుస్తకాలు పోసుకుని సంస్కృతం పాఠాలు చెప్పడానికొచ్చీసేడు. అమృతానంద ఫలములూ అని గెట్టిగా బోర్డు మీద సుద్ద ముక్కతో రాసి అరుస్తునాడు. పెద్దమ్మగార్ని కాకా పట్టి నెలకో శనివారం మధ్యనాళ. “మీ పిల్లల్చేత సంస్కృత విశారదా వరుకూ కట్టించుతాను అమ్మగారండీ, అసలు కొత్త నిబంధన గ్రంథం సంస్కృతంలో ఉన్నాది మీరు చదివేరూ?” అనీసి సిష్టర్ అసింతానీ, సిష్టర్ సబీనానీ, రెవరెండ్ మదర్ మేరీ ఫిలిప్పానీను. వాన్రాకుండా బడొదిలెస్తారనీసి చంద్రమ్మ టీచరన్న మాట నమ్ముకుని గుడ్డ బేగు నెత్తి మీద సద్దుకుని వాటర్ బోటిల్ పట్టుక్కూచున్నాది. ఒకటే న…ల్ల మబ్బు స్కూలు మీంచి మైదానం మీంచి బోర్డింగు, చర్చి, కళ్ళాలవతల చీఁవ చింత తోపులవరుకూ మూసిపెట్టీసున్నాది. మేడ మీది క్లాసుల మధ్యన అట్ట గోడల్ని అటూ ఇటూ జరిపీసి ఆరూ ఏడూ ఎనిమిదీ మూడు క్లాసుల పిల్లల్నీ ఎలిమింట్రీ పిల్లల్నీ కంబైన్ పెట్టీసి అమృతానంద ఫలానీ అనరుస్తునాడు. ఆత్మనై పదక్రియలు – పరస్మై పద క్రియలూ అనుకుంటూనూ ఇలా… గ వాల్మీకి మహాముని లాగ వంగిపోయి. రాత్తిరి భోయనాలకి మనింటికే కదా వొస్తాడు గెడ్డాలు బూత అనుకున్నాది. “ఏఁవే ఓరుగంటి కాసన్నబాబు మనవరాలివి?! క్లాసెగ్గొట్టీసి ఎక్కడికే?” అని దబాయిస్తాడు చూసేడంటేను. సిష్ట్రసింతా చూడకుండా బేగూ వాటర్ బోటిల్ పట్టుకుని పిల్లిలాగ కాళ్ళు ఎత్తెత్తి అడుగులేసుకుంటూ మెట్లు దిగిపోయింది. సుగంధం టీచరు “ఏయ్ పిల్లా? ఎవరు పిల్లా… థర్డ్ లేంగ్వేజ్ కంపల్సరీ! ఏయ్ మొహం…. ఎవరే నువ్వూ?” అని అరుస్తున్నా వినపణ్ణట్టు గబ గబా లేవెట్రీస్ వైపు వెళ్తున్నట్టు. జాఁవి ప్రశాంతీ ఉప్పూ కారం పేకట్టు పట్టుకుని జుత్తంతా చిందరవందరగా మొహమ్మీద ఎగురుతుంటే తన్దుక్కే చూస్తునాది. సీఁవ చింత బొట్టల మీదికి విసరడానికి సూది రాళ్ళు ఏరుకుంటూ, పుస్తకాల సంచీ పక్కన పడీసి “అబ్బ ఏటండ్లెద్దురూ ఇంత లేటూ? ప్లీజండివే…” అనుకోని. ఏరిన చీఁవ చింత బొట్టలు ఇంకా ఏరినవేర్నట్టే లాక్కుని. “ఎర్రటి గుడ్లు తియ్యగా ఉంటాయి ఉప్పూ కారం ఎందుకండివే?” అనీసి మళ్ళీ ఉప్పూ కారం పేకట్టు జామింట్రీ బాక్సులో పడీసి.

రెండు గుప్పిళ్ళ బొట్టలేనా ఏరకుండానే పెద్ద చుక్క పడింది. మెడకోళ్ళ మీద ఒక చుక్క, మళ్ళీ నెత్తి మీద చుక్కా. “ఎహె పదండ్లెద్దురూ క్లాసుకెళిపోదామా?” అన్నాది జాంప్రశాంతీ. బేగులోంచి కొత్త పలక తీసి నెత్తి మీద పెట్టుకుని. తొమ్మిది రోజుల కిందట వాళ్తమ్ముడు పోయినప్పుడు పలక మీద ‘జామి సతీష్ ఆత్మ శాంతి కోసం’ అని కొత్త పలకల మీద రాయించినవి ఒకొక్కళ్ళకీ ఒకొక్క పలకా, ఒక పెద్ద అరిటి పళ్ళ గెల దింపించి ఒకొక్కళకీ ఒకొక్క అరిటిపండూ పంచిపెట్టేరు వాళ్ళ నానగారు, వాళ చిన్నానా. “ఉబ్బు కామెర్లొచ్చి పోయేడండి అమ్మగారండీ!” అనీసి ఇలాగ మొహాలు పెట్టుకోని వెళిపోయేరు, వాళ్ళ రిక్షాలు వాళ్ళే తొక్కుకుంటూను. ఆ పలకలు నెత్తి మీద పెట్టుకోని తడవకుండా మళ్ళీ మెట్లెక్కుతుంటే సుగంధం టీచరు చూసేరు గాని చూణ్ణట్టుగే ఒదిలీసేరు, జాం ప్రశాంతీ మొహం చూసి. “ఏఁవే ఓరుగంటివారమ్మలూ? కిమితి వేళాతిక్రమహ కృతాహ్?” అనీసరుస్తునాడు గెడ్డాం బూత. “అహమ్ చీమ చింత ఫలమ్ భుక్త్వా అస్మి!” అనీసి జాం ప్రశాంతీ చెవులోన అంటే “ఎహ్హే ఎల్లండ్లెద్దురూ! ప్లీజండివే!!” అనీసి ఇంకొక్క బొట్టిమ్మని బతిమాల్తునాది. వాన ఈడ్చీడ్చి కొడుతుంటే గెడ్డం బూత ఎంతరుస్తునా ఎవళకీ వింపించటం లేదు. పిల్లలందర్నీ హాలు మధ్యలోకొచ్చీసి కూచోమన్నారు తడిసిపోకుండాను. ఎలిమింట్రీ పిల్లలు గాలీ వానకీని వో వోమని గొల్లు పెడుతూవుంటే చంద్రమ్మ టీచరు, మైకులు, స్ఠీవెనూ బెత్తాలు పట్టుకుని “ఏయ్ పిల్లల్లారా! సైలెన్స్”మనుకోని. నాలిక మీద వెలుగురాసినట్టుగైపోయి చీఁవ చింత బొట్ట తియ్యగా నఁవుల్తూను “అమ్రుతానంద ఫలహా అహమ్ శరణమ్ గఛ్ఛామీ” అనరిస్తే సుగంధం టీచరు నవ్వుకోనొచ్చి “ఏదే పిల్లా? ఏయ్ మొహం? ఏది ఒక రెండు బొట్టలిమ్మి?” అని లోగొంతుకతోటి రహస్య గూఢాచారి లాగ. రెండు బొట్టలొలిచీసి పలక మీద పెడితే “ఓహో! ఆ పలకలా ఇవీ??! ఆ పిల్లడు పోయినప్పుడు పంచినవి?!” అనీసి షాక్కొట్టినట్టు చెయ్యి వెనక్కి లాక్కుని బొట్టలు తీస్కొకుండానే అటు అమ్మగారి వైపు వెళిపోయేరు సుగంధం టీచరు. “ఏయ్ మొహాలు! ఆపండే పిల్ల కాకి గొడవ!” అనుకుంటూను.

*

Download PDF EPUB MOBI

Posted in 2015, కథ, మార్చి and tagged , , , , , .

3 Comments

  1. సీమ చింత (చీమ చింత కూడా దాన్నిండా చీమలుంటాయి ) చెట్లు , మబ్బు పడితే బడి ఒదిలేయటం , ఏయ్ మొహాలు … , ఇవన్నీ మా బళ్లోనూ ఉండేవి.
    పూడిక తీసి మళ్ళీ ఊట తెప్పించిన బావిలా ఉంది మనసు. ధన్యవాదములు కనక ప్రసాద్ గారూ.

  2. “ఓహో! ఆ _______ జ్ఞాపకo పుస్తకాలా ఇవీ??! ఆ త్రి – – పోయినప్పుడు పంచినవి?!” అనీసి షాక్కొట్టినట్టు చెయ్యి వెనక్కి లాక్కుని తీస్కొకుండానే అటు వైపు వెళిపోయేరు. “కిమితి వేళాతిక్రమహ కృతాహ్?” అని అరవాలనిపిస్తోంది నాకూ.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.