cover

మా ఊర్ల పాకిస్తానోల్లు

Download PDF EPUB MOBI

నాగ్లచ్మి, నేను, సేమీలు వినోద్ గాడు స్కూలు ఇడ్సినంక ఇండ్లకు పోతా ఈడనే ఆగుతం ఎప్డూ. కరెట్టుగ ఆ టయానికి – కొత్త సిన్మా మార్నప్పుడల్ల రషీదు సిన్మా పోస్ట్రు మార్సుతాడు.

రషీదు మా స్కూలు ఆపేసి పదేండ్లు అయ్యింటాది.

మా ఊర్ల పేద్ద రౌండు కట్ట ఉంటాది. ఒగ రోడ్డు బస్ స్టాండ్ పోతాది. ఇంగోటి శ్రీన్వాస తియేటర్, ఇంగోటి పార్కు పోతాది. లాస్టు రోడ్డు మా ఇంటికి పోతది. మా ఇంటికి బోయే రోడ్లోన అట్లొకటి ఇట్లొకటి ఒక్కో యాప సెట్టు ఉంటాది.

యాప సెట్ల మింద అట్లొకటి ఇట్లొకటి సిన్మ పోస్ట్ర్లు పెడ్తరు. అవి జూస్కుంటనే ఇంటికి పోతం మేము. మా స్కూలు అయ్యే టయానికే, సిన్మా మార్నప్పుడల్లా, కొత్త సిన్మా పోస్ట్రు ఏస్తరు.

నాకు, నాగ్లచ్మికి, సెమీలు వినోద్ గాడికి.. మాకే ఫస్ట్ తెల్సేది యమ్నూర్లొ కొత్త సిన్మా వచ్చ అని.

రషీదు పోస్టరు మార్సతా ఉంటే ఉంటది సుడు సస్పెన్స్! వాయబ్బ… నాగ్లచ్మి , సెమీలు వినోద్ గాడు సస్తరులే సిన్మా యాదో చప్పల్లని! రషీదు గుడ అట్లనే చేస్త్డుల్యాప్ప! ఊర్కనే మమ్మల్ని జూసి కొంచం కొంచం పోస్ట్రు ముక్కలు పెడ్తడు. ఒక్కో సారి పైన ముక్క పెడ్తాడు. నేనేమో అప్డు యెన్ టి ఆర్ మొగం కంపిస్తనే చెప్తుంటి సూడు… ఫట్ట ఫట్ట అని… మా ఊర్కి వచ్చే యెన్ టి ఆర్ సిన్మాలన్ని. ఒగ్గో సారి కింద అర్దం పేరు ఒచ్చే పోస్ట్రు ముక్క పెడ్తా ఉండె రషీదు. అప్పుడింగా సస్పెన్స్ మాకి. ‘రాముడు’ అని సూస్తానే ఇంగ అడివి రాముడు, డ్రైవర్ రాముడు సరదా రాముడు, అట్ల గబ్బ గబ్బ చెప్పె ఓళ్ళం.

రషీద్ నవ్వతా ఉంటుండె మమ్మల్ని జూసి.

* * *

ఫస్ట్రోజు -

ఆ రోజు గూడా నవ్వుతా ఉండాడు రషీదు. నాగ్లచ్మి అర్సింది “రషీద్ ! ‘స్రీవారి ముచ్చట్లు’ గదా” అని. అవునంటానే ముగ్గురం అర్సినం ‘ఏ ఏ’ అని.

ఇంగ అందర్ము సంతోషంగ ఇండ్ల దారి పట్న్యాం.

నాగ్లచ్మి ఇల్లు దగ్గర పడ్తా ఉంటే అనె “ఇజ్జి ! రషీదొల్లు పాకిస్తానోల్లు తెల్సా” అని.

నేను ఒగ్గ సారి ఆచ్చిర్యం పన్నా ఏంద్రా నాగ్లచ్మి అట్లనేస్యా అని.

సెమీలు వినోదు గాడు “అవుల్యా! నాగ్గూడ మా యన్న చప్త ఉండ్య. మొన్న చర్చి నుండి వస్తా ఉంటె”

“నేను గూడా ఉంటిని గద ఇనోద్ గప్పుడు అందరం ఒస్తుంటిమి” అంటి… ‘నాకిన బల్యా ఏమప్పా’ అన్ కంటా.

“ల్యా ఇజ్జి! పాస్టరంకుల్ పిల్సెకదా నిన్ని. అప్పుడు చెప్తుండలే మాయన్న”

“ఓ అట్లనా” అని తలూపితి.

నాగ్లచ్మి మల్లా అనే “వాల్లు సుడి… ఎడ్మ నుండి కుడ్లోకి రాస్తారు. మనం రాస్త్ మా”

“ల్యా” అంటి.

“మల్ల వాల్లు ఆవును తింటారు. మనం తింటమా చెప్పు” అనే.

“ల్యా” అంటి.

“ఇంగా జూడు వాల్లు మన ఉజ్జోగాల్కూడా జెయ్రు”

“ల్యా నాగ్లచ్మి మన్ ఉర్దు సారు ఉండాడు కద” అంటి.

“మల్ల వాల్లు ఉర్దునే చెప్పుకంటరు ఇజ్జి!” అని దీర్ఘం తీస్య.

నేను ‘యప్పో నాగ్లచ్మికి అందుకే క్లాస్ పస్ట్ నాకు సెకండు వస్తాది’ అనుకుంటి.

నాగ్లచ్మి మా ఇంటి కాడనే ఉంటాది. వాల్లు కోంటోల్లు. వాల్ల శాపు చిన్న రౌండు కట్ట తాన ఉంటది. వాల్లమ్మనే చూస్కొంటది శాపు. వాల్నాయ్న సీడు యాపారం చేస్తాడు గూడా. వల్లమ్మ మాదేవికి నేనంటే శానా ఇష్టం. శాపు దగ్గర కన్‌పిస్తే గొట్టాలు ఇస్తాది. ఏళ్ళకు పెట్టుకుని తింటా పోతా ఉరుక్కుంట.

నాగ్లచ్మి ఇంత కిలియర్గ సెప్తా ఉంటే ఆచ్చిరమాయె నాకి.

“యినోదు! వాల్లు మీసాలు పెట్టు గోరు గడ్డం పెట్టుకుంటరు గదా” అని సెమీలు ఇనోదు గాడి నడిగె.

నాగ్లచ్మి కాటుకంత సెర్పి పోయి గమ్మత్తుగుంటయ్ లే కండ్లు. కొసెన్లు ఏసినప్పుడు ఇట్ల పెద్దగ తిప్తది కండ్లు.

సెమీలు ఇనోదు గాడు “అవ్ ఇజ్జి! నాగ్లచ్మి కరెట్టు జెప్పె. మన్మేమో గడ్డం దీసి మీసాల్పెట్టుకుంటము” అనె. వాడు ఉండి ఇంగా అనె “మనం పాకిస్తాన్ తో యుద్దం బోతే వాల్లు రారు ఇజ్జి. తెల్సా?” అని ఆడిగ నన్ని.

నేను తలూపే లోప్ల వాడు అనె “ఇజ్జి! వాల్లంతా ఒగటే. కల్సుంటారు. మన మిందకైతే ఎగురుకుంట వస్తారు. వాల్లు మల్ల బాగుంటరు”

సెమేలూ ఇనోదుకి గూడా ఎట్ల తెలిసెప్ప ఇదంతా అనుకుంటి నేను.

నాగ్లచ్మి “అవునప్పోయ్ వాల్లు పాకిస్తానోల్లు మల్ల. వాల్లు వాల్లు ఒగటే! పాకిస్తాన్ నీ జుట్టు పీకిస్తాన్” అనే.

నాగ్లచ్మికి బలే నవ్వొస్తాదిలే ఎవుర్నన్న ఎక్కిరిస్తే.

నవ్వతనే ఉంది సూడు ఇండ్లొచ్చ దాంక.

* * *

సెకండ్రోజు -

స్కూలు నుండి వచ్చినంక చూస్తే మా ఇల్లు వరండ రూముల మబ్బూలు కూసోని ఉండాడు. మా నాయ్న లోపల్నే ఉన్నట్లుండాడు. మబ్బూలు రషీదు వాల్ల నాయ్న. నన్ను జూస్తానే కింద గుసున్నోడు లెచి వచ్చి నన్ను పట్టుకుని ‘ఇజ్జి బాగుండవా!’ అనే. మబ్బూలు ఐస్ పేక్ట్రీల పంజేస్తడు. మా ఇంటికి అర్దం కిలోమీటర్ ఉంటదేమో వాల్లిల్లు. మబ్బూల్కి రషీదు, పరీదక్క ఇద్దరు పిల్లోల్లు. పరీదక్క తెల్లగుంటది. ఇంట్లనే బుర్కేస్కునుంటాది ఎప్పుడు జూస్నా. వాల్లమ్మ గూడా అంతే.

మా నాయ్న కట్ బన్యన్ ఏస్కొని వచ్చే. మబ్బూలుండి “నమస్తే సార్!” అని లేసి కూసుండ్య.

నేను లోపల్కి పోయి పుస్తకాల సంచి పెట్టి మా నాయ్‌న ఒల్లోకి వచ్చి కూసింటి. మా నాయ్న కట్ బన్యన్ ఏసుకున్నప్పుడు పొట్ట తగుల్తా ఉంటే ఈపంతా ఎచ్చగుంటాది నాకు.

మా నాయ్న “ఏం మబ్బుల్! ఇబ్రయీం పంపెనా?” అని ఆడిగె. ఇబ్రయీమొల్లదే మబ్బూలు పంజేసే ఐసు పేక్ట్రి.

మబ్బూల్ ఇబ్రయీం దగ్గర గాసగాడు.

“అవ్ సార్! ఇబ్బాల్, ఇబ్రయీంని తండానికి ఒచ్చినట్ల ఒచ్చ ఇయాల. పొద్దున మన్సుల్నేస్కొని వచ్చ పేక్ట్రి దగ్గర్కి”

“ఆ…. ఏమాయ్య? మొన్న ఇబ్బాల్ స్థలం సగం సగం పెట్టుకుందాం లే అన్య. మల్లే ఏమంట గిప్పుడు” మా నాయ్న అనే.

మబ్బూలు సేతులు తుడ్సుకుంట అన్య “అందుకే గద సార్ ఇబ్రయీం మల్ల నీ తానకి పంప్య. మల్లొక్క సారి నీవేమన్న సంది పెడ్తవా అని”

“ఇంతకేమంటాడప్ప ఇబ్బాలు. నేను ‘యేం ఇబ్బాల్’ అని ఎంత జెప్తిని?! ‘ఇబ్రయీం సగం స్తలమియ్యడ్మే ఎక్కువ. ఆయందే స్తలం. పేపర్లు గూడా ఉండాయ్. మా రిజిస్టర్ ఆఫీస్ల గూడ మల్ల రికార్డులు జూస్న’ అని గూడ చెప్తి. ‘వస్తలె సార్ ఒగ్సారి ఆఫీసుకి… అయ్నా ఇంగ నీవు చెప్తె నేన్యాడ అరుస్తలె’ అని గూడా అనె. ఇప్పుడు మల్ల యేమయ్య మబ్బూల్?”

గోడకు సదురుకుంటా మబ్బూలు అనె “సార్, రావ్డం రావ్డమే వచ్చి నన్ని పట్టుకున్య. ఇబ్రయీం ఇంగా నమాజుకు బొయి వచ్చిండ్ల్యా. నేనంటి ‘ఇబ్బల్బాయ్ నీవ్ అన్నేయంగ వస్తుండావ్. ముందు సారి ఎం ఎల్ యే గౌడు ధని గూడా చెప్పే కదా. ఇంగ సారు గూడ చెప్పె కదా’!” అని మా నాయ్న తుక్కు చెయ్ చూపి అనె.

కొంచుం ఆగి “నేను కూడా అరిస్తి సార్ ఇంగ తట్టుకోల్యా. వాండ్లు గూడా అర్సిరి ఇంగ. ఫుల్లు గలాటా ఆయ. నువ్వేమన్న అన్‌కో సార్ ఇబ్బాల్‌ది నాయం కాదు. అర్దం స్తలం ఇచ్చినా ఇంగా ఇబ్రయీం మీద అరుస్తడు.”

మా నాయ్న ఒక కన్ను గాల్లో పెట్టి జూస్తా అడ్గినాడు. “నీక్యాల అంత మబ్బూల్. ఇబ్రయీం యాడ్కి పోయిండె?” అని అడిగే.

మబ్బూలు ఉండుకొని అనే “సార్ ఇబ్రయీం మంచోడు. నేను ఆయ్న కింద గాస్గాన్ లాక్క పదైదు సంత్సరల్నుండి జేస్తునా. ఆయప్ప ఒకర్ని ఒక మాట అనడు. ఇబ్బాల్ కి నాకి ఇంగ పెద్ద గలాటా ఆయ. నాకి కోపం పట్ల్యా. నాకేం బయం సార్ ఆయ్న ఎంత మందినేసుకొస్తే?! నేను గూడా తగ్గల్య. అంగీ పట్టుకుంటి” అన్య.

మా నాయ్న ఒగ్గ సారి ఉలిక్కి పడే “వార్నీ! మబ్బూల్ నీకేమొచ్చే. వాడు లంగ నాయాలప్ప. ఇబ్రయీం ఓప్క పడ్తే గౌడ్ ఒచ్చినంక పంచాయ్తీ పెట్టేటోల్లం గద!”

మబ్బూల్ కొంచం కోపం మొగం పెట్టుకుని “సార్, ఇబ్బాల్‌కి ఆ అర్దం స్తలం సాలదా? ఇంగెంత కావల్ల? యమ్నూరు మొత్తం రాసియల్లనా?” అనే గట్టిగనే.

నేను మా నాయ్న ముగం లోకి జూస్నా. నాయ్న ఉండుకుని అన్య “మబ్బూల్, నా మాట ఇను. ఇబ్రయీం కు పోయ్ జెప్పు. గౌడు ధని మంచోడ్లే ! ఇంగ నేను గూడా ఇబ్రయీం పక్కన చెప్తే ఇంటాడు. ఎందుకు ల్యా అని నేను గూడా ఇన్నాండ్లు మద్దె రకంగా చెప్పిన….” అని నాయ్న యాదో చెప్తుండె పరీదక్క ఉర్కెత్తుకుని మా ఇంట్లకి ఏందో తుఫాను వచ్చినట్ట వచ్చ. పరీదక్కకు బుర్కా లేకుండె. తెల్లగుండే మొగం మీద అంతా చెమట్లు.

పరీదక్క ను జూసి మా నాయ్న ఆగిపాయ.

మబ్బూల్ నోట్ల ఎదో మాటొస్తుండె. ఎంటనే పరీదక్క అర్సినట్ల గట్టిగా అనె ‘రషీద్ కో ఇబ్బాల్ మారా అబ్బా! ఎద్దుల్బండి గూటం తీస్కొని కాల్లు ఇరగ్గొట్టినారంటా” అని గస ఆప్కోకుండా కండ్ల నీల్లు గబ గబ కార్చె.

నాకే పరీదక్క ను జూస్తే గుండె దఢాల్మనె.

మబ్బూల్ “సార్ జూస్తివా” అని గబుక్కున లేచి కల్లు తుడ్సుకుంటా చేతులు పట్టుకున్య.

మా నాయ్న ఇంట్లోకి పోయి అంగీ ఏస్కొని నిమిషం కూడా కాలే అంత స్పీడుగొచ్చె.

మబ్బూలు అప్పటికే పరీదక్క తో కల్సి ఇంటి బయటకు ఉరికినాడు.

నాకు తత్తర బట్టే.

నేను నాగ్లచ్మి వాల్లింటికి ఉరికితి ‘మనూర్లో పాకిస్తానోల్లు ఒకల్నొకలు గొట్టుగున్నారని’ చెప్పల్ల అని.

– పి. విక్టర్ విజయ్ కుమార్

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి.
Posted in 2015, కథ, మార్చి and tagged , , , , .

9 Comments

  1. గొప్ప కథ రాశావన్నా… పిల్లల మాటల్లో పెద్దలకు బుద్ధి చెప్పే కథ. ఇందులో రాసిన చాలా విషయాలు నాకు అనుభవంలో ఉన్నవే.

  2. ‘పాకిస్తాన్ నీ జుట్టు పీకిస్తాన్’ ఇది నా చిన్నతనం లోనూ విన్న మాటే. ఈ మాట చాలు ముస్లిమ్ లను మనం ఎలా చూస్తాం అనేది తెలియడానికి. అయితే కథ చెప్పే అబ్బాయి తండ్రి పాత్రలో ఉన్న కలసి మెలిసి ఉండే కోణం కూడా మనం గుర్తించాలి. కధనం అద్భుతం. ప్రస్తుత సందర్భానికి అవసరం. అభినందనలు!

  3. ముఫస్సిల్ టౌన్ల పిల్లల దృష్టిలోంచి రోజువారీ ప్రపంచాన్ని చూపిస్తూనే పెద్ద విషయాల్నీ పెద్దల విషయాలనీ ఎంతో సున్నితంగా, అవలీలగా ఆవిష్కరించారు. అయితే వెనుక దాగిన విష ప్రచారం ఏమంత సున్నితమైనది కాదు; అత్యంత ప్రమాదకరం కూడా. మెతుకు పట్టుకొని అన్నం సంగతి తెలుసుకోవడం అంటే ఇదే. స్నేహితులెవరో ఫేస్ బుక్ లో పెడితే ఆలస్యంగా చూశాను. తెలంగాణా యాస నాకు అర్థం కాదు అనుకొనే వాడిని. అది నిజం కాదని ఈ కథతో తెలిసిపోయింది. గొప్ప కథ.

  4. ఇదీ కథంటే ! ఇంత చక్కటి వ్యంగ్యమా? విజయ్ కుమార్ గారూ, చాలా చాలా అభినందన వందనాలు. పిల్లలు ఇలా మాట్లాడుకోవటం నిజంగా మీ అనుభవమా? సృష్టించారా? అభ్యంతరం లేకపోతే చెప్పండి. ‘పాకిస్తాన్ పిలక పీకేస్తాన్’ అనే పిల్లల మాటల వరకూ చిన్నప్పుడు నేనూ విన్నాను.