cover

ఇద్దరికీ రెండేసి నమస్కారాలు

Download PDF EPUB MOBI

(ఇవాళ మార్చి 29న పతంజలి జయంతి సందర్భంగా ఆయన పేరిట పురస్కారాన్ని ఆర్టిస్ట్ మోహన్‌ అందుకుంటున్నారు.)

కె. ఎన్. వై పతంజలిని తెలుగువాళ్లకి కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. కాని కొన్ని జ్ఞాపకాలను మాత్రం బుద్ధి గడ్డి తిన్న ఆవులా నెమరువేసుకోవడం ఎన్నిసార్లయినా చేసుకోవచ్చు. నిజానికి చాలామంది సమీక్షకులు గట్టిగా పతంజలి రచనలపై చర్చించి సద్విమర్శ చేసినది బహుతక్కువ. బుద్ధి గడ్డి తినడం అట్టి విధంగా జరిగింది. మరి నేనెందుకు తీరి కూర్చుని ఆయన రచనలపై సమీక్ష చేయలేదు? బుద్ధిని గడ్డివాము కింద దాచిపెట్టి ఉంటాను. ముందెప్పుడో చేయవలసిన పని ఇప్పుడు ఆయనలేని ముహూర్తం చూసి చేయడం దేనికని పెన్ను కట్టుకు కూర్చున్నాను. అందుకే ప్రస్తుతానికి పతంజలి జ్ఞాపకాల వంటివి తోడదామనిపించింది. బండెనక బండి పదహారు బండ్లు లాగ – ఒక్క పతంజలి మాట వస్తే చాలు కాలం తీరి, తీరకుండానూ నిశ్శబ్దంగా వెళ్ళిపోయిన మిత్ర పెద్దలూ, పెద్ద మిత్రులూ గుర్తు రాక మానతారా? ఇలాంటి చాలామందికి పెద్ద సర్కస్‌ డేరా లాంటిది ‘ఉదయం’ అనే సమావేశ స్థలం, కళాశాల మరియు పికడెల్లీ సర్కిల్. పత్రిక, ఉద్యోగం అన్నవి మాట వరసకు అన్నట్టయి అసలు కొసరు మహా దివ్యంగా లాగించేసింది. కాబట్టి “ఆ రోజులే వేరు” అని ముసిలి మహనీయుల్లాగ ఆకాశానికేసి కళ్ళప్పగించి నటించవచ్చు కూడా.

అప్పట్లో సిగరెట్టొకటి దేదీప్యమానంగా వెలిగించి నుసి విదిలించేలోగా ఎడిటోరియల్ పని పట్టే సమయానికి పతంజలి గారి గది నిండా నవ్వుల గోల, నమస్కారాల హోరు తరచూ కనిపించే దృశ్యం. గళ్ళ చొక్కా, లూజుఫాంటు (“టకాపి”) టక్ చేసుకుని బెల్టు సవరించుకుంటూ ఓసారి రావిశాస్త్రిగారొస్తారు, కసాపిసా కిళ్ళీ నముల్తూ చేతి వేలి సున్నం అలాగే ఉంచేసుకుని కా.రా గారొస్తారు, పాతకాలం రైలింజన్లా గుప్ఫు గుప్ఫున పొగ వదుల్తూ చుట్ట నలుపుతూ చాసో గారొస్తారు, బట్టతల మీద లేని జుట్టును సవరించుకుంటూ కండువాతో తమ లావుపాటి పెదాలను అద్దుకుంటూ మధురాంతకం రాజారాం వస్తారు, అలాగే ఆంగ్ల జోకులో చివరి పదం పూర్తి చేయకుండానే ఫెడేల్మని నవ్వేసే హరిపురుషోత్తమరావు (రిహ, హరి), పెన్సిల్ గీతలాటి సన్నటి నవ్వుతో సకల కవిజన సన్మిత్రులు రామడుగు రాధాకృష్ణమూర్తిగారు, అతినెమ్మదిగా బిడియపడుతూ వాక్యం పూర్తి చేసే సి ధర్మారావు గారు, స్థానిక జుల్స్‌వెర్న్ మరియు రిటైర్డ్ డిటెక్టివ్ వాలకంతో సదాశివరావు గారూ సకాలంలోనే అకాలంగా విచ్చేసి వెడుతోండేవారు. అలాటి పెద్దలెవరు వచ్చినా సరే ఫక్తు ఆగ్ మార్క్ ఒబిడియెంట్ స్టూడెంటు కుర్రాడిలా పొడవాటి ముక్కు మీదగా నుదుటి మీదకు అరచేతిని నైంటీ డిగ్రీలో పెట్టి నమస్కరించే పతంజలిగారిని చూస్తే “బాబోయ్ ఈయనగారు గొప్ప బుద్ధిమంతులు” అనుకునేవాడిని. కానీ సభానంతర కార్యక్రమంలాగ ఆయన గదికి అలా వచ్చి వెళ్ళే పెద్దల సాహిత్యం మీద, లేక వారు చేసిన వ్యాఖ్యల పైన మహా సరదాగా జోకులు, సద్విమర్శ, వీలైతే రివాల్వర్ పేలుళ్ళు చేసేవారు. ఆ సమయంలో పతంజలి నా కంటికి ఒక కొండ మిరపకాయలా కనిపించేవారు. అబ్బూరి వరదరాజేశ్వర రావు గారో, పురాణం సుబ్రహ్మణ్యశర్మ గారో, ఎ.ఆర్. కృష్ణ గారో పని మీద ఆహ్వానిస్తే అక్కడికి పతంజలి, మోహన్, మరియు నేను వెడితే బుద్ధిమంతుడిలా ఉండటం మానేసి పతంజలి గారు పతంజలి లాగే పుస్తకాల మీద, రచయితల మీద కిరీటాలు పెట్టడమో, కందిరీగల్లాటి మాటలు వదలడమో చేసేవారు.

సాయంత్రం నీడలు మరీ చీకటయ్యే లోపు ఒంటరిగా ‘సమయం’ చెట్ల నీడలో కుర్చీలో ఉన్న పతంజలిని కదిలిస్తే చాలు చెహోవ్, దాస్తోయెవ్‌స్కీ మీద విశాఖ సముద్రపుటలలు బండరాళ్ళను కొట్టుకున్నంత ఉద్రేకపు ప్రేమ విరుచుకుపడేట్టు మాట్లాడతారు. లేదా హెన్రీ జేమ్స్, ఓ.హెన్రీల మీద బుస్సుమని పడగ విప్పుతారు. మహానగరంలో గడిచిందే చాలన్నట్టు రాయడానికి చదవడానికి మంచి సబెడిటర్లని గుర్తించి ప్రేమించడానికి, సాయంత్రపు అంచున ఆశ్రమాలకు దారి తీయడానికి అన్నిటికీ గల వల్లమాలిన ప్రేమ ఆ వెనక ఘాటైన అభిప్రాయాలూ చేతిలో సిగరెట్టులాగ సదా సిద్ధంగా ఉంటాయి పతంజలికి. సకల తెలుగుపత్రికల్లో పని చేసిన పతంజలికి ఉద్యోగం ముఖ్యం కాదు. చదవడం రాయడం రాసిన ప్రతి అక్షరంలో సూరేకారం నూరి దట్టించడం తన వేలి వంకర గోటి పనికి ముఖ్యం. తప్పో ఒప్పో నోటి బాణాలు మహా తీక్షణంగా గుప్పించి తీరిగ్గా వాటిని పునస్సమీక్షించుకోవడంలో నికార్సైన పతంజలితనం కనిపించేది. సముద్రపుటలలను ఒక్కొక్కటే ఫైల్లో పెట్టుకున్నట్టే ఆయన తీరు. సద్విమర్శగల సూచనలు, వాటిలో ప్రిజుడిసెస్ అనే నామకరణం చేయదగినవీ పుంఖానుపుంఖంగా తరుముకొచ్చే మాటల వెనుక ఉంటాయి. ఒక్కోసారి వాటిలో లౌక్యం గుండుసున్న. వీటి వల్ల ఆయనకి లాభించిందేమీ లేదు – బలహీనులైన శత్రువుల్ని తెచ్చిపెట్టింది మినహా. (“అదర్ దేన్ రైటింగ్ సమ్ బాడ్ పొయెట్రీ అతనేం జేస్తుంటాడండీ, కొంచెం ఆయన కుడి చేతి బొటనవేలిని నాకు పంపమని చెప్తారా, విల్యూ?” – ఇదీ వరస)

అద్దె ఇంటి వానరుడు రివాల్వర్ పుచ్చుకుని సిద్ధంగా ఉన్నా, తను తయారు చేసి అమ్మకం కోసం పెట్టిన ఊరగాయ చెంచాడు అమ్ముడవకపోయినా, కంటి వెనుక బోలెడంత నీరు సిద్ధంగా ఉన్నా, పుస్తకం చదవటం మానిన రోజు, చదివింది నా వంటి మిత్రులకి వివరించడం మరిచిన రోజు లేదని జ్ఞాపకం. (“రాత్రి ఇక పుస్తకం మానీసీద్దామని అనుకుంటుండగానే తెల్లారిపోయిందండి. అందుకని చెంబెడు మంచినీళ్ళు తాగి మళ్ళీ పుస్తకం పట్టీసాను.”) కొందరి తెలివి అష్టవంకర్లూ తిరిగి వాక్యం నిండా అజ్ఞాన సందర్శనం జరుగుతుంది. పతంజలి వాక్యాల్లో మాత్రం గొప్ప పరిశీలనాశక్తి, క్లుప్తంగా సాచి లెంపకాయ కొట్టినట్టుండే ఇమేజరీ వచ్చి మన ఒళ్ళో వాలడం ఖచ్చితంగా జరుగుతుంది.

ప్రపంచ దేశాల్లో గొప్ప గొప్ప రచయితలెవరూ తిన్ననైన వాళ్లు కారనిపిస్తుంది. వట్టి పిండిముద్దల్లా పడివుండరు. అందుకే వాళ్ళ జబర్దస్తీ రచనలు మన గుండెల్లో బైఠాయిస్తాయి కదా – పతంజలి రాతలూ అట్టివే.

ఖాళీ సమయం దొరికితే పతంజలి బుర్రలో ఫాక్టరీలు బోలెడు బయటికి వస్తాయి. ఆయన సబ్బులు తయారు చేయటం, అవి చాలామంచివని అనిపించటం ఒక నాటక దృశ్యం. తను తయారు చేసిన సబ్బుతో ముఖం కడిగి వచ్చిన ప్రకాష్‌ని చూసి “మోహన్, ప్రకాష్ ఏడి?” అని అనడం… ఇలా సరదా, వెటకారం, తిక్కదనం, రాతల్లో గొప్ప విస్ఫోటక శక్తి గల కథాగమనం వీటిలో దేన్నీ పతంజలి జ్ఞాపకాల్లోంచి విడదీయగలం చెప్పండి. కొన్నాళ్ళు స్వదేశీ వైద్యం గాక పచ్చళ్ళూ, కారాలు, జున్నూ అమ్మే దుకాణం నడిపేరు. నిజానికి ఆ దుకాణం, ఇల్లు అనే సబ్బుల ఫాక్టరీ, వెరసి సాహిత్య సమీక్షా కబుర్ల కేంద్రాలు. ఒకసారి వనమూలికా వైద్యం నిర్వహిస్తూనే కొన్ని మూలికల గుళికలతో ‘షివాజ్ రీగల్’ తల్లి గారి భర్తని సృష్టించగలనని చెప్పి కొంత నవ్వులు పుట్టించే సీరియస్ పని కానిచ్చేవారు. చివరికి సాయంత్రం ఆలస్యమవుతూంటే ఆ తయారైన సరుక్కి పాపం స్థానిక సరుకు తొంభై తొమ్మిది శాతం చేర్చి “తయారైంది చూడండి” అన్నారు. ఇక అలా అక్కడి నుంచి విప్లవ సాహిత్యం, గద్దర్, వంగపండు (“ఏం పిల్లడో ఎల్దమొస్తవా” అని కులుకుతూ పాడటం), అటు నుంచి నామిని రచనల్లో పచ్చదనపు వాసన, ఇటు ‘రా.రా’ అటు ఇస్మాయిల్ ఇలా పేకముక్కలు పైకి లాగినట్టు మాట్లాడటం, రాత్రి పన్నెండు గంటలకు ఖాళీ రోడ్ల మీద ఆటో కోసం ధ్యానించడం… ఆయన్ని ఆసాంతం చూస్తే గమనిస్తే వింటుంటే ఒకరిద్దరు ఫ్రెంచి ఆర్టిస్టులు కవులూ లాటిన్ అమెరికన్ రచయితలూ ఇప్పుడే దెబ్బలాడుకుని టై సర్దుకుని బయటకొచ్చినట్టు అనిపిస్తారు. ఇక ఆయన వైఖరి ఉయ్యాల ఊపుల్లాటిది – మరీ ముందుకి, చాలా వెనక్కీను. అయినా అన్నీ దుఃఖసముద్రపు వెంటే వచ్చి చేరే మంచి నీటి నదులు. నాలాటి వాళ్లకి చదవటానికి, బోలెడు వినడానికీ పనికొచ్చే పెద్దలు, మిత్రులు, గొప్ప రచయితలూ అలా ఒకరొకరే వెళ్ళిపోతే ఏం బావులేదు. పతంజలి గురించి ఏం గుర్తొచ్చినా ఏం తోచకుండా అయిపోతుంది. గొంతులో చిన్న నొప్పి కలుగుతుంది. దెష్ట దరిద్రంపై పోరులో ఉండి కూడా ఒళ్ళు పులకరించే ఆయన రచనలపై చర్చ జరక్కపోతే పోనీండి. త్రిపుర వంటి పెద్దలెందరో పతంజలివి గొప్ప వర్క్స్ అండీ అని మురిసిపోవడం చాలదూ! పతంజలికొక షేక్ హేండ్ ప్లస్ నమస్కారం మరియూ సెల్యూట్. పతంజలిలోని రచయితను బాగా ప్రేమించాను గనుక ఆయన పేరిట పురస్కారం మిత్రులు ఆర్టిస్ట్ మోహన్‌ గారికి ఇవ్వడం కూడా సవ్యంగా సరిపోయింది.

మోహన్ గారితో 1983 నుంచీ నాకు స్నేహం. ఆ తరువాత ‘ఉదయం’ మొదలైనప్పటి నుంచీ మొన్న సాయంత్రం వరకూ మోహన్ వేసిన, సగం వేసి వదిలేసినవి, అసలు వేయనివి, వేయవలసినవీ వేలాది కార్టూన్లు, కార్టూన్ కథలతో ఇంకా తయారవనివీ అనేకానేక చిట్టి ఏనిమేషన్ చిత్రాలతోను నాకు బోలెడు గట్టి సంబంధం ఉంది. అది నాకెంతో బాగుంది.

ఒక పెద్ద ఆర్కెస్ట్రా హోరు, నాటకం రిహార్సిల్ జోరు కలగాపులగం అయ్యి ఓ పెద్ద రైల్వే ఫ్లాట్‍ఫాం మీద జరుగుతోన్నట్టు ఉండే గందరగోళభరిత అపార్ట్‌మెంట్ గదిలో మోహన్ పనితనాన్ని అనేక సంవత్సరాలుగా చూస్తున్నాను. అది ఒక గొప్ప రంగుల కామిక్ స్టోరీ బోర్డు చూసినంత ఇదిగా ఉంటుంది. నాకు, మీకూ తెలిసి చాలామంది చిత్రకారులు తమ పనిని నాలుగు గోడల మధ్య రహస్యోద్యమం లాగానో, దొంగ చీట్ల పేక వ్యవహారంలాగానో చేసి అవతలి ప్రేక్షకుడు గింజుకుని “ఇదెలా చేసే సారూ!” అనిపిస్తారు. కానీ మోహన్ రూటు మాత్రం వేరు. గేరు మార్చినట్టు నిబ్బులు మారుస్తూ సర్రున కారు తోలినట్టే జర్రున కాయితం మీద బొమ్మ గీసి పడేసి “ఆ ఇందాక ఏదో చెప్పేవు గురూ.. వినలేదు మళ్ళీ చెప్పు” అని మోహన్ అడగటం చాలాకాలంగా చూస్తూనే ఉన్నాను.

వేడి వేడి శాఖాహారమో మాంసాహారమో తరిగిన ఏపిల్ ఫలమో సరాసరి మోహన్ చదువుతోన్న పుస్తకం మీదో వాడుతున్న కుంచెల మీదో ప్రేమతో పెట్టి తినమనే మిత్రుడు, బొమ్మ వేస్తున్న మోహన్ చేతికీ, మొహానికీ మధ్య చోటు చేసుకుని ప్రేమగా పలకరించే శిష్యమిత్ర ముఖం, ఎదర కుర్చీల్లో సాహిత్య విప్లవ విశేషాలు, సబెడిటర్ల బదిలీ విషాద గాథలు సాగుతోంటే పాత పుస్తకాల దుకాణం నుంచీ అసాధారణ పుస్తక వివరం చెప్పే కీలక సమాచారవేత్త కేకలూ, ఇంకో వైపు చెవికి సుఖంగా ఒకరి వేణుగానం, భూకంపం తెప్పించే నవ్వులూ, కంప్యూటర్, టీవీ రొదలూ, సెల్‍ఫోన్ రణగొణధ్వనులూ, పదార్థ మహిమ చేత ఒకరిద్దరు రచయితల నాట్య విన్యాసం… ఇలాంటి వేదనాష్టకాల మధ్య బొమ్మలు వేయడం, కార్టూను పుట్టించడం మోహన్ ఒక్కరికే సుసాధ్యమని చాలాకాలంగా నా నమ్మిక.

ఇంకా ఇంకా చాలాచాలా బొమ్మలు, కొన్నేనా చిట్టి పొట్టి ఏనిమేషన్ ముచ్చట్లూ తీర్చుకోవలసిన మోహన్‌కు ఇప్పుడు సదవకాశం, సానుకూలత కలగాలని నా వంటి మిత్రులందరి కోరిక. పతంజలి గురించి మోహన్ గురించీ ఇద్దర్నీ చేర్చేవి, విడగొట్టేవి, విడీవిడనివి అంటూ సరదాలు గుర్తున్నన్ని రాయాలంటే అప్పుడవి నాలుగైదు ‘కోతికొమ్మచ్చు’లవుతాయి. ఇక ఫోన్లలో వేలాది గంటలు చెప్పుకున్న నా కార్టూన్ అయిడియాలు వ్యర్థపదార్థములు కాకుండుగాక! మోహన్ నోటి ముందు విషపాత్ర, చెవి దగ్గర రివాల్వర్, మెడ మీద కత్తి వగైరా ఆయుధాలు పెట్టి ఆయన చేత మళ్ళీ మంచి కార్టూన్ స్ట్రిప్‌లు వేయించగలవారికి నా సుస్వాగతం.

– శివాజీ

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి.
Posted in 2015, మార్చి, వ్యాసం and tagged , , , , , , , , .

9 Comments

  1. ఎప్పుడో 36 ఏళ్ల కంద ‘చతుర’ లో ఖాకీవనం చదివినప్పటినుండీ ఈనాటి వరకూ పతంజలి అంతే తెలుసు. ఇలాగే తెలుసు. రాతల్లోనే తెలుసు. ఆ మనిషిని చూస్తే బావుణ్ణనుకునేవాణ్ణి. అయ్యే పని కాదులే, అని ఊర్కొనేవాణ్ణి. మంచిదయింది. ఇప్పటికీ ఆయన సజీవుడే, నావరకూ. ఖాకీవనం రచనను, అంతకు చాలా కాలం కిందే నాకు ‘బుడుగు’ ను ఇచ్చిన మా నాన్నకు పరటాగా ఇచ్చాను. అందుకు మహా గర్వ సంబర పడిపోయేశాను కూడా, మా నాన్న ‘బావుందిరా’ అన్నప్పుడు. తర్వాత మానాన్న, నేను వంతులవారీగా ‘సర్దార్ అప్పలనాయుడు’ చదివేసిన ముచ్చట ఇప్పటికీ తాజా బెల్లపు జీడి బంక లాగ వదలడం లేదు మానాన్న జ్ఞాపకాల తో కూడి. తరువాత పతంజలి దొరికినప్పుడల్లా కొనుక్కున్నా, వీలు చిక్కించుకొని చదూకున్నాను.
    తల్లావజ్ఝుల శివాజీ గారూ! బాగా పలకరించారు మమ్మల్ని, పతంజలి కమ్మని ఘాటైన జ్ఞాపకాలతో. పతంజలికి శ్రధ్ధాంజలి కుదిరే పదం కాదు. తప్పదనుకుంటే స్మృత్యంజలి .. అంతే. మీలాగ చెప్పగలిగిన వారు చెబుతూ ఉంటే ఇంకా ఇంకా మాకు పతంజలి సాహిత్య పలకరింపులు దొరుకుతూనే ఉంటాయి. ధన్యవాదాలు.

  2. Patanjali గురించి ఏం గుర్తొచ్చినా ఏం తోచకుండా అయిపోతుంది. గొంతులో చిన్న నొప్పి కలుగుతుంది. దెష్ట దరిద్రంపై పోరులో ఉండి కూడా ఒళ్ళు పులకరించే ఆయన రచనలపై చర్చ జరక్కపోతే పోనీండి. త్రిపుర వంటి పెద్దలెందరో పతంజలివి గొప్ప వర్క్స్ అండీ అని మురిసిపోవడం చాలదూ! పతంజలికొక షేక్ హేండ్ ప్లస్ నమస్కారం మరియూ సెల్యూట్.
    పతంజలిలోని రచయితను బాగా ప్రేమించాను గనుక ఆయన పేరిట పురస్కారం మిత్రులు ఆర్టిస్ట్ మోహన్‌ గారికి ఇవ్వడం కూడా సవ్యంగా సరిపోయింది…
    Installation of the environment !

  3. Pingback: వీక్షణం-129 | పుస్తకం

  4. కె. ఎన్. వై పతంజలి, ఆర్టిస్ట్ మోహన్‌ గార్లను అద్భుతంగా ఆవిష్కరించిన తల్లావజ్ఝల శివాజీ గారికి నమస్కారములు. “పతంజలి గురించి త్రిపుర వంటి పెద్దలెందరో పతంజలివి గొప్ప వర్క్స్ అండీ అని మురిసిపోవడం చాలదూ!” యీ మాటకూ మురిసిపోయాను.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.