cover

బొమ్మకు రెండు కవితలు

గత నెల పైనున్న బొమ్మ ఇచ్చి కవిత గానీ కథ గానీ రాయమన్నాం. వచ్చిన కవితల్లో రెంటిని ఎంపిక చేసి ఇస్తున్నాం.

రిషి శ్రీనివాస్ ఎమ్.
విహాయస నేస్తం !
కావ్…కావ్…కావ్…
కావ్…కావ్…కావ్…
నువ్వునాటిన విత్తనం మొక్కైనా…
నువ్వుపెంచిన మొక్క చెట్టైనా…
కొడుకంత చెట్టు…
చెట్టంతా కొడుకు…
వాడి గురించి కనకు కలలు…
ఎన్నటికీ అవి నిజాలు కావ్…కావ్…కావ్
కావ్…కావ్…కావ్…
రేగడి మట్టి… పారపట్టి…
కంచె కట్టి… గెత్తం పెట్టి…
అరువు తెచ్చి… ఎరువేసి…
కీడునుంచి… పీడనుంచి…
విడిపించి… ఏపుగా పెంచిన
కొడుకు దాఖలాల్లేవ్…లేవ్…లేవ్…
లేవ్…లేవ్…లేవ్…
కాళ్ళున్నా కదలలేని కొడుకు…ఒళ్ళున్నా మెదలలేని కొడుకు…
ఊడల జులపాల కొడుకు…పచ్చ పచ్చాటి కొడుకు…
ఎండకు ఎండిపోయి…ఉండుండి పండిపోయి…
వసంతంలో పూసిపోయి…శిశిరంలో రాలిపోయిన…
కొడుకు జ్ఞాపకాలు నిన్నొదిలి
పోవ్…పోవ్…పోవ్…
పోవ్…పోవ్…పోవ్…
రోడ్లెయ్యాలన్నా…మేడలు నిలుపుకోవాలన్నా…
కలపకావాలన్నా…కూడళ్ళు కలుపుకోవాలన్నా…
నీ కొడుకే చావాలన్నా..!
వేర్లూడిపోయి…వేళ్ళు పైకి పొడుచుకుపోయి…
మోడైపోయి… మనసంతా పాడైపోయి…
రంపాలు,గొడ్డళ్ళు,కత్తులు,కొడవళ్ళు…
పట్టుకుని మీదడిపోతే నాయాళ్ళు…
పరిగెట్టడం కూడా చేతకాలేదు…
అణువంతైనా చలించలేదు…
కోపం,ద్వేషం,ఖేదం,మోదం…
నీ కొడుక్కి రావ్…రావ్…రావ్…
రావ్…రావ్…రావ్…
కొడుక్కి పిండం పెడితే నువ్వు…
తిని ఎగిరిపోతాననుకున్నావు…
కృతజ్ఞత లేకపోవడానికి…
మనిషిని పోలిలేదు నా మనికి…
ఈ కాకి ఉండగా నువ్వు
ఏకాకివి కానే కావ్ !
కావ్…కావ్…కావ్…
కావ్…కావ్…కావ్…

 

ఆనంద్ గుర్రం
నేను రోజు చస్తున్నా
ఆకలి కావుల ఈకలతో
అప్పుడే వచ్చింది పిచ్చి పక్షి
పావలా బరువులేని పచ్చి మాంసం కోసం
పుట్టగానే పాలబొట్టు కోసం, ఫుట్‌పాత్ మీద చోటు కోసం
పగలు పని కోసం, రాత్రి పనికిమాలిన పని కోసం
బలిసిన బూటు కింద ఎంగిలి మెతుకులు ఏరుకోలేక
నేను రోజు చస్తున్నా
మేఘాలనంటే మేడలు చూడలేక మెడలు విరిగి
తళతళలాడే తార్రోడ్లపై నడవలేక నడుం విరిగి
పొలం పుట్ట, చెట్టు గుట్ట నీడలేక నేల విరిగి
మెత్తని పచ్చనోట్ల దెబ్బలకి వెచ్చని రక్తం చిందకుండానే
నేను రోజు చస్తున్నా
రోజుకో మాట విని, రోజుకో ముసుగునమ్మి
తెలియనితనంతో, తెలిసి తేల్చలేననే తెలివితో
అనంత లోయల ఆశల్లో, ఆకాశపుటంచుల ఊహల్లో
అద్దంలో అబద్ధం వెతుకుతూ రేపు లేని దాని కోసం
నేను రోజు చస్తున్నా
పిండం పుట్టకముందే చస్తున్నా
తరతరాల ముందే చస్తున్నా
పావల బరువులేని పచ్చి మాంసం
పక్షికి దక్కనీయకుండా
బతుకుతూ చస్తున్నా
నేను రోజు చస్తున్నా

*

Posted in 2015, ఏప్రిల్ and tagged , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.