cover

బ్రాహ్మణవాది కంచ ఐలయ్య

Download PDF EPUB MOBI

‘వై ఐయామ్‌ నాట్‌ ఎ హిందూ’ అనే మౌలిక ప్రశ్నను రేకెత్తించిన ఐలయ్య, చివరికి ఆ ప్రశ్నని బ్రాహ్మణ వాదంలో లయం చెయ్యడం నేటి విషాదం.

ఫాసిజం డైనమిక్‌గా పనిచేస్తుంది. అది తర్కం కోసం సమయాన్ని వెచ్చించదు. అప్పటికే దానికి కావలసిన తర్కాన్ని ప్రగతిశీలురనే ప్రతిష్ఠ పొందిన మేధావులు అందిస్తారు. దీనికి కారణం ఏమిటి?

మీరు పరిశీలించండి. యూరప్‌లోనైనా భారతదేశంలోనైనా నాజీలూ హిందూవాదులూ గొప్ప సృజనశీలమైన వ్యక్తీకరణ శక్తి గలవారు కారు. మూర్ఖమైన పడిగొట్టు పదాలూ, మాటల్లోనూ, చేతల్లోనూ దాడిచేసే దుందుడుకుతనం వారి స్వభావం. ‘అబద్ధం వా సుబద్ధం వా కుంతీ పుత్రో వినాయకః’ అన్నట్లు తాము పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనేది వారి తంతు.

కాని వట్టి మూఢ విశ్వాసాలపైన ఫాసిస్టులు ఆధారపడ్తారనే వాదన తప్పు. నేడు మనం మూఢ విశ్వాసాలుగా భావించే వాటి వెనక కూడా వొక తర్కం, ఆలోచన పనిచేయడం వల్లే అవి మనగలిగాయి. మానవుడు ఆలోచనా జీవి. ఆలోచన, తర్కం లేకుండా యాంత్రికంగా పనిచేశాడన్న వాదన కుదరదు. భూమి బల్లపరపుగా వుందన్న విశ్వాసానికి కూడా దాని తర్కం దానికి వుండేది. దాని వెనక కూడా మానవ ఆలోచనా క్రమం పనిచేసింది కాని దానికంటే మెరుగైనదనిపించే ఆలోచన దాన్ని కొట్టేసింది.

ఫాసిజం, హిందూవాదం కూడా ఆలోచన లేకుండా పనిచేయవు. అసలు మానవ ఆలోచనే ఫాసిస్టు. మానవుడు తనని ప్రకృతి నుంచి తోటివారి నుంచి వేరు పరచుకొని వొక తెగగా జీవిస్తూ, మరొక తెగపై దాడి చేయడంలో ఫాసిజానికి ప్రాచీన మూలాలు వున్నాయి. యిదే పద్ధతి నేటి వరకు కొనసాగింది.

యూరోపియన్‌ ఫాసిజానికి మూలాలు ప్రొటెస్టెంట్‌ క్రైస్తవంలో దాని యూదు ముస్లిం వ్యతిరేకతలో వున్నాయి. ప్రొటెస్టెంటిజానికి మూల పురుషుడు మార్టిన్‌ లూథర్‌ ఆలోచనల్లో యిటువంటి ద్వేషం క్రూరంగా వ్యక్తమైంది. అలాగే హెగెల్‌ లాంటి తత్త్వవేత్తలలోనూ, మేధావులలోనూ యిటువంటి ఆలోచనలు ఉన్నాయి. యీ ఆలోచనా ధారే హిట్లర్‌ ఫాసిజానికి హేతుబద్ధతని అందించింది. అంటే దాని వెనక గొప్ప గొప్ప బుర్రలే పనిచేశాయి. (రైజ్‌ అండ్‌ ఫాల్‌ ఆఫ్‌ థర్డ్‌ రీక్‌ – విలియం. ఎల్‌. షీరర్‌).

భారతదేశంలో హిందూ ఫాసిజానికి మూలాలు యూరోపియన్‌ నేషనలిజం నుంచి స్ఫూర్తి పొందిన వీరసావర్కార్‌, గోల్వాల్కర్‌, నారాయణ ఆప్టే లాంటి ఆధునిక బ్రాహ్మణ మేధావుల్లో వున్నాయి. ఐతే వీరెవరూ స్వతంత్ర చింతనాపరులు కారు. వీరు పాశ్చాత్య ప్రొటెస్టెంటిజానికీ, జాతీయవాదానికీ, వాటికి కొనసాగింపైన ఫాసిజానికీ వారసులు. వీరు వలస మేధావులు, వలస బ్రాహ్మణులు, నయా బ్రాహ్మణులు. పెరియార్‌కైనా, అంబేద్కర్‌కైనా, నేటి కంచ ఐలయ్య కైనా మూల పురుషులు వీళ్ళే.

అదేమిటి బ్రాహ్మణులంటే కంచ ఐలయ్య గారన్నట్లు ఇరవై కూరలూ నెయ్యితో భోంచేస్తూ, పూజా పునస్కారాలు చేసేవాళ్ళు కదా? అంటే అది నిజం కాదు. హిందూత్వ సిద్ధాంతానికి మూలపురుషుడుగా చెప్పబడే సావర్కార్‌ పరమ నాస్తికుడు. గోవుల్ని పూజిస్తూ గుళ్ళచుట్టూ తిరిగే వాళ్ళని అవహేళన చేశాడు. తాను చనిపోయినపుడు కర్మకాండ జరపవద్దని వీలునామా రాసిన తీవ్ర హేతువాది సావర్కార్‌. ఈయన పాశ్చాత్య జాతీయవాదం మంచి స్ఫూర్తి పొంది విశాల హిందూ ఐడెంటిటీ గురించి కలగన్నాడు. మిగిలిన హిందూ వాదులు కూడా ఆంగ్ల విద్య నభ్యసించి, కులాలకు అతీతంగా ముస్లింలకి వ్యతిరేకంగా బౌద్ధ, జైన ‘హిందూ’ మతాల వారిని ఒకే గొడుగు కిందికి తెచ్చి విశాల హిందూ జాతీయవాదాన్ని తీసుకు రావాలని సంకల్పించిన ఆధునికులు.

యీ ఆధునిక బ్రాహ్మణులు బహుళత్వంతో మీమాంస, వేదాంత, వైష్ణవ, శైవాది భేదాలతో కూడిన ధార్మిక అస్తిత్వాన్ని పక్కన పెట్టి, పాశ్చాత్య, క్రైస్తవ తరహా జాతీయవాదం కోసం ఉవ్విళ్ళూరారు. దానికోసం వాళ్ళు తమ బ్రాహ్మణ వారసత్వాన్ని విడనాడారు. పాశ్చాత్యాన్ని అనుకరించారు. స్థానికంగా బ్రాహ్మణేతరుణ్ణి అనుకరించారు. అతడే వివేకానంద స్వామి.

ప్రాచీన బ్రాహ్మణుడి ఆత్మహననం నుంచి ఆధునిక బ్రాహ్మణుడు పుట్టాడు. యీ ఆధునిక బ్రాహ్మణుని అనుకరణే బ్రాహ్మణ వాదం. అది వలస క్రైస్తవ అనుకరణకి మారుపేరు. బ్రాహ్మణవాదమే బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలకి మూలం.

బ్రాహ్మణుడు ఆధునికీకరించబడ్డాడు. వలసీకరించబడ్డాడు. బ్రిటీష్‌ కొలువుల్లో చేరి, అందరికంటె ముందే నగరాలకి వలస పోయాడు. 19వ శతాబ్దానికి ముందే బెంగుళూరు నగరానికి పెద్దెత్తున తరలిపోయిన వారు వివిధ శాఖల బ్రాహ్మలు. మొదట బ్రాహ్మలకి వాళ్ళలో వాళ్ళకే విభేదాలు మొదలయ్యాయి. వివిధ శాఖల మధ్య కొట్లాటలు మొదలయ్యాయి. తరువాత తమిళ బ్రాహ్మలకీ, కర్ణాటక బ్రాహ్మణులకీ కొట్లాటలు మొదలయ్యాయి. యిదంతా నగరాల్లోని బ్రిటీష్‌ కొలువుల కోసం స్థానికులకే ఉద్యోగాలు అనే నినాదం ఆరోజుల్లోనే మొదలైంది కాని దాని అర్థం స్థానిక బ్రాహ్మణులకే ఉద్యోగాలు అని. తర్వాత లింగాయతులు లాంటి సంపన్న శూద్ర కులాలు బ్రాహ్మణ వ్యతిరేక వాదాన్ని లేవనెత్తాయి. యిది కూడా బ్రిటీష్‌ కొలువుల కోసమే. ‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష’ అన్నట్లు యీ ఉద్యోగ స్వామ్యం బ్రాహ్మణుల నుంచి యితరులకీ పాకింది. (బియింగ్‌ బ్రాహ్మణ్‌, బియింగ్‌ మోడర్న్‌ – రమేష్‌ బైరీ)

తమిళనాడులో పెరియార్‌ పుట్టుకొచ్చింది యీ తర్కం నుంచే. యీ తర్కంలోనే హిందూ వాదం దాగి వుంది. ఎందుకంటే నువ్వు నీ వర్గానికీ కులానికీ యెక్కువ ఉద్యోగాలు సంపాదించాలంటే, యితరుల్నీ, యితర వర్గాల్ని తరిమికొట్టాలి. అందుకే పెరియార్‌ బ్రాహ్మణులతో పాటు ముస్లింలని కూడా ద్వేషించాడు. యీ యిద్దరి వల్ల శూద్రులకి ఉద్యోగాల్లో తగిన స్థానం లభించడం లేదని వాదించాడు. మైనార్టీలకి ప్రత్యేక హక్కులనే భావనని మొదట్లోనే తుంచెయ్యాలని చూశాడు. అందుకే పెరియార్‌లో హిందూత్వాన్ని బట్టబయలు చేస్తున్నారు కొందరు ప్రగతిశీల మేధావులు. (పెరియార్స్‌ హిందుత్వ – రవికుమార్‌)

యీ పెరియార్‌ తర్కం నుంచే దళితులలో కొందరు మరికొందరి హక్కుల్ని కాలరాయాలని చూస్తున్నారు, ప్రతిభాహీనులని కూడా నిందిస్తున్నారు.

విశాల ఏకీకరణ అనేది కొందర్ని వేరుపరచడం, వెలివేయడం ద్వారా సాధ్యమౌతుంది. ఒకే జాతి, ఒకే మతం, ఒకే దేశం అనే భావనల్లోని ఏకత్వం సాధ్యం కావాలంటే కొందరు శత్రువులు అవసరం. మనిషి తీవ్ర ద్వేషం, భయం ద్వారానే గుంపు కడ్తాడు. భారతదేశం ఒకే జాతిగా ఎప్పుడూ లేదు. విద్యానాధుడు అనే కవి ‘ప్రతాపరుద్రీయం’లో ప్రతాపరుద్రుని గర్జనని ‘రేరే ఘూర్జర జర్జరోసి సమరే లంపాక కిం కంపసే’ ఇత్యాదిగా రాశాడు. అంటే ఘూర్జర, లంపాక యిత్యాది అనేక రాజ్యాలని గురించి ప్రస్తావించాడు. ఆ రాజులపై గర్జించాడు. అంటే వివిధ రాజ్యాలు ఉన్నాయి కాని ఒకే జాతి లేదు, ఆ జాతిని కలపగల ఒకే మతమూ, విశ్వాసమూ లేవు.

బ్రాహ్మణులందరూ ఒకటి కాదు. బ్రిటీష్‌ కాలంలో మధ్వులు స్మార్తులు నశించాలని పూజలు చేసేవారు. (బియింగ్‌ బ్రాహ్మిన్‌ – బియింగ్‌ మోడర్న్‌), మధ్వాచార్యులు శంకరుణ్ణి రాక్షసుడని నిందించాడు. అందుకే బ్రాహ్మణ మతం అంటూ ఏమీ లేదు. హిందూమతం అనేది ప్రచ్ఛన్న క్రైస్తవం తప్ప మరేమీ కాదు.

ఆల్‌బెరూనీ (11వ శతాబ్దం) భారతదేశంలో మాటల యుద్ధం తప్ప మత యుద్ధం అనదగ్గదేదీ లేదని రాశాడు. కాని తరువాతి కాలంలో శైవ వైష్ణవ విద్వేషాలు హింసాత్మకంగా మారడం కనబడ్తుంది. యివి మోనోథీయిస్టు మతాల అనుకరణ నుంచి వచ్చి వుండవచ్చు కాని, వీటి సమన్వయం కూడా సాధ్యమైంది. అదే శివ విష్ణువులు ఒకటేనన్న హరి హర అద్వైత సిద్ధాంతం. తిక్కన భారతంలోని ప్రతి ఆశ్వాసంలోనూ హరిహరమూర్తిని ప్రార్థిస్తూ పద్యాలు రాశాడు.

అంటే భారతదేశంలో పుట్టుకొచ్చే విశ్వాసాల మధ్య విద్వేషం కొంగ్రొత్త విశ్వాసాల ద్వారానే పరిష్కరించబడ్తుంది. తర్కం ద్వారా కాదు. ఎందుకంటె ఆలోచన అనేదే ఫాసిస్టు. నువ్వు ఎంత హేతుబద్ధంగా తర్కాన్ని నిర్మిస్తే అన్ని పగుళ్ళు దానిలో ఏర్పడ్తాయి. అందువల్ల ఆలోచన ద్వారా వచ్చే సమన్వయం సమన్వయం కానే కాదు.

బాబ్రీ మసీదుని హిందూవాదులు కూల్చేసినపుడు వి. ఎస్‌. నయీపాల్‌ అనే మేధావి ఆ చర్యని ‘యాక్ట్‌ ఆఫ్‌ హిస్టారికల్‌ బ్యాలెన్సింగ్‌’ గా సమర్ధించాడు. తర్కం ద్వారా ఏర్పడే బాలన్స్‌ యిలా వుంటుంది. ఆలోచన, తర్కం అనేవి ఒక వ్యక్తి, వర్గం యొక్క స్వార్థాన్ని ప్రతిబింబించక తప్పదు.

కనుక కార్యకారణ సంబంధానికి అతీతంగా స్థలకాలాల కతీతంగా స్పాంటేనియస్‌గా సహజంగా వచ్చే ప్రతిస్పందనల ద్వారా శాంతి, సమన్వయం సాధ్యపడ్తూ వుంటుంది. యిటువంటిది భారతదేశంలో ఎంతో సృజనాత్మకంగా వ్యక్తీకరించబడ్తూ వుంటుంది. నక్సలిజం ఆవిర్భావంలో కూడా యాదృచ్ఛికత పాత్ర యెక్కువ అని సబాల్టర్న్‌ స్టడీస్‌కి చెందిన మేధావులు అంటారు. కలకత్తా కాళికారాధన బెంగాల్‌ నక్సలైట్‌ ఉద్యమానికి అవ్యక్త ప్రేరణగా నిలిచిందని ఒక మేధావి తనతో చెప్పినట్లు నయపాల్‌ రాశాడు. (ఇండియా, ఎవూండెడ్‌ సివిలైజేషన్‌)

ప్రకృతిలో సమాజంలో సమన్వయాన్ని నిలిపే పని హేతువుకి అతీతంగా సహజంగా జరిగిపోతుంటుంది భారతదేశంలో. దీన్నే నేను సనాతనం అంటాను. సనాతనం అంటే స్థల కాలబద్ధం కానిది. అంటే స్పష్టమైన వివరణకి అందనిది అన్న మాట.

ఇటీవలి కాలానికి వస్తే హిందూత్వ అభివృద్ధి నినాదంతో ప్రకృతి విధ్వంసమూ విద్వేషమూ కలగలిసి విజృంభించాయి. దీనికి సమాధానంగా రెండు శక్తులు హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాయి. ఒకటి రాజకీయపరమైనది, రెండు విశ్వాస పరమైనది 1) ఢిల్లీలో ఆప్‌ విజయం 2) షిరిడీ సాయి బాబాపై చర్చ.

కంచ ఐలయ్యగారు షిరిడీసాయి బాబా వివాదం గురించి మౌనం వహించారు. ఆప్‌ని అంబేద్కర్‌వాద వ్యతిరేకిగా ముద్ర వేశారు. యీ వైఖరుల గురించి చర్చించాలి మనం.

యీ రెండు వివాదాలూ యించుమించు ఒకే సమయంలో సంభవించాయి. ఒకటి రాజకీయ వివాదం రెండోది ధార్మికమైన మతపరమైన వివాదం. యీ రెండూ హిందూత్వకి సమాధానాలుగా వచ్చినవే.

ఆమ్‌ ఆద్మీ పార్టీపై కంచ ఐలయ్య గారు విరుచుకు పడ్డారు. అది అంబేద్కరిజాన్ని మరుగుపరుస్తూ, లోహియా వాదాన్ని పైకెత్తుతూ దూసుకువచ్చిన బనియాల పార్టీ అన్నారు. ఈ సందర్భంగా ముగ్గురు బనియాలపై విరుచుకు పడ్డారు. వాళ్ళు గాంధీ, రామ్‌ మనోహర్‌ లోహియా, అరవింద్‌ కేజ్రీవాల్‌. వీళ్ళ వల్ల మండల్‌ కమీషన్‌ స్ఫూర్తి దెబ్బతింటోందని కూడా అన్నారు.

రామ్‌మనోహర్‌ లోహియాని నిందించిన కంచ ఐలయ్య, నెహ్రూ బ్రాహ్మణుడై నప్పటికీ అంబేద్కర్‌ని అర్థం చేసుకోవడానికి మార్గంగా ఉపయోగిస్తాడని వ్యాఖ్యానించాడు.

బ్రాహ్మణుడైనప్పటికీ నెహ్రూ అంబేద్కర్‌ వాదానికి మార్గదర్శకుడెలా అయ్యాడు? బనియాలపై కంచ ఐలయ్య ప్రత్యేక ద్వేషానికి కారణమేమిటి? దీన్ని గురించి మనం ఆలోచించవలసి వున్నది.

గాంధీ కాని రామ్‌మనోహర్‌ లోహియా కాని యంత్ర నాగరికతని, బడా పరిశ్రమల్ని వ్యతిరేకించారు. ఇవి ఆసియాలో పనికిరావని, ప్రత్యామ్నాయ నాగరికతని ఆలోచించవలసి వున్నదని భావించారు. రామ్‌మనోహర్‌ లోహియా కమ్యూనిస్టులూ, పెట్టుబడిదారులూ యిద్దరూ ఆకాశానికెత్తుతున్న నగరీకరణనీ భారీ సాంకేతికతనీ వ్యతిరేకించాడు. అంటే వలస వాద ఆధునికతపై విమర్శనాత్మక దృష్టి వీరిది. లోహియా నెహ్రూ ఆడంబర జీవిత విధానంపై పార్లమెంటులో కూడా విరుచుకు పడేవాడు.

ఆధునిక బ్రాహ్మణుడు నెహ్రూ ఏం చేశాడు? భారీ పరిశ్రమల్నీ, భారీ ప్రాజెక్టుల్నీ ఆధునిక దేవాలయాలుగా కీర్తించాడు. అందుకే కుటీర పరిశ్రమలకి చిహ్నమైన చరఖాని జాతీయ జెండాపై చేర్చాలన్న ప్రతిపాదనని తిరస్కరించాడు. పైగా వేగానికి చిహ్నమైన చక్రాన్ని జెండాపై చేర్చడం ద్వారా యంత్ర నాగరికతకి స్వాగతం పలికాడు. బౌద్ధ చక్రం బౌద్ధుల వ్యాపార దృక్పథాన్ని కూడా ప్రతిబింబిస్తుంది.

గాంధేయ గ్రామీణ స్వరాజ్య చిహ్నమైన చరఖాని జాతీయ జెండా నుంచి తొలగించడాన్ని హిందూ బ్రాహ్మణుడైన సావర్కార్‌ స్వాగతించాడు. ఈ విధంగా పరస్పర భిన్న దృక్పథాలు కలవారిగా కనబడే సావర్కార్‌, నెహ్రూలు ఒకే ఆధునిక దృక్పథం గలవారిగా నిరూపించుకున్నారు. (సావర్కార్‌ హిందూత్వ – ఎ.జి. నూరాని) వారి వారసుడే కంచ ఐలయ్య. అందుకే కేజ్రీవాల్‌ని బనియాగా మండల వ్యతిరేకిగా నిందించి ఫక్తు హిందూవాది నరేంద్రమోడీని మండలీకరణకు మార్గం ఏర్పరుస్తున్న వాడిగా కీర్తించాడు.

కంచ ఐలయ్యకి బనియాలంటే ద్వేషం. బ్రాహ్మణులంటే బ్రాహ్మణ వాదమంటే ప్రేమ. బ్రాహ్మణ వాదానికి వారసులైన శూద్రులపట్ల కూడా ప్రేమే. కారణం కంచ ఐలయ్య ఫక్తు బ్రాహ్మణ వాది.

బ్రాహ్మణులే వలసవాద ఆధునికతని మొదట అందిపుచ్చుకున్నవాళ్ళు, బ్రాహ్మణ సంస్కర్తలే మొదట బ్రిటీష్‌ వాళ్ళనీ, వాళ్ళ పరిపాలననీ, వాళ్ళ జ్ఞానాన్నీ కీర్తించారు. ప్రాచీన భారతీయ విలువల్ని మొత్తంగా మూఢ విశ్వాసాలుగా కొట్టివేశారు. ఉదాహరణ – వీరేశలింగం, గురజాడ మొదలైనవాళ్ళు. వీరినే దళిత, బహుజన వాదులు అనుకరిస్తున్నారు.

గాంధీ, లోహియాలాంటి బనియాలు ఇంగ్లీషు భాషనీ, పాశ్చాత్య విలువల్నీ ప్రశ్నకి గురి చేశారు. మొత్తంగా పాశ్చాత్య పారిశ్రామికీకరణనే ప్రశ్నించారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ మొత్తంగా పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకి కాకపోయినా, హిందూ కార్పొరేట్‌ విధానాలు దూసుకువస్తున్న సమయంలో ఒక అడ్డుకట్టగా నిలబడ్డాడు. ప్రజల మౌలిక అవసరాల గురించి మాట్లాడడం ద్వారా కార్పొరేట్‌ మాయాజాలంపై ప్రశ్నని సంధించాడు. ఈ బనియా సంస్కృతిని బ్రాహ్మణవాదం (హిందూవాదం) ద్వారా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు కంచ ఐలయ్య. ఐలయ్య లాగే హిందూవాదులు కూడా కేజ్రీవాల్‌ని కులం పేరుతో నిందించడం గమనార్హం.

బనియాలు బ్రాహ్మణులకంటె భిన్నంగా స్థానిక సంస్కృతి పునాదుల్ని కలిగి వుండడానికి కారణమేమిటి? బౌద్ధ మాయావాదం వీరిని సోకకపోవడమే కారణం కావచ్చు. జైనం, వైష్ణవం యీ రెండూ బనియా సంస్కృతిలో భాగాలు. యివి రెండూ జగత్తు సత్యమని సిద్ధాంతాన్ని బలంగా స్థాపించాయి. పైగా ప్రపంచం బహుళత్వంతో కూడి వున్నదనే సత్యాన్ని స్థాపించాయి. రామానుజ వైష్ణవంపై జైనం ప్రభావం వుందని మాధవాచార్యులు సర్వదర్శన సంగ్రహంలో రాశాడు. గాంధీలో యీ రెండు సిద్ధాంతాల ప్రభావం కనబడ్తుంది. అందుకే గాంధీ ఎప్పుడూ జగత్తు మిథ్య అని అనలేదు.

మహాయాన బౌద్ధమే మొదటి మాయావాదాన్ని స్థాపించింది. జగత్తు స్వప్నం వలె మిధ్య అని ఆ సిద్ధాంత సారాంశం. దానినే శంకరాచార్యులు అనుసరించాడు. ఈ మాయావాదాన్నే కొత్త రూపంలో అమెరికాకి మోసుకువెళ్ళి విశ్వవ్యాప్తం చేశాడు వివేకానంద.

యిప్పుడు నయాశంకరుడైన వివేకానందుడినే ఆధునిక బ్రాహ్మణులు ఆరాధిస్తారు. ఎందుకంటె అమెరికన్‌ జీవిత విధానంలో ప్రాక్టికల్‌ వేదాంతం వుందని ఆయన అన్నాడు. అంటే అర్థమేమిటి అమెరికన్‌ అత్యాధునిక కార్పొరేట్‌ జీవిత విధానమే అద్వైతం అన్నమాట.

దీనితో కంచ ఐలయ్యకి విభేదం ఏమీ లేదు. ఎందుకంటె కంచ ఐలయ్య కూడా మాయావాదే. సకల సమస్యలకీ పరిష్కారం భాషలో వుందని కంచ ఐలయ్య వాదన. అది ఇంగ్లీషు భాషలో వుంది. అంటే భౌతిక జగత్తు అనేది మిధ్య. అన్ని సమస్యలూ భాషా సమస్యలే. మన భాషని సంస్కరించుకుంటే చాలు అంటే ఇంగ్లీషు భాషని అభ్యసిస్తే చాలు. సకల సమస్యలూ పరిష్కారమవుతాయి.

భూమి సమస్య, గిరిజనుల ఆవాస సమస్య, నీటి సమస్య అన్నీ అన్నీ… ఇంగ్లీషు నేర్చేసుకుంటే పరిష్కారమైపోతాయి. మానవ సమాజపు సకల సమస్యల పరిష్కారానికీ ఒకే ఒక మార్గం భాష, ఇంగ్లీషు భాష. యిదే బౌద్ధం యొక్క అత్యాధునిక మాయా వాదం. ఎందుకంటె కంచ ఐలయ్య బౌద్ధుడే. (ఆంగ్లం ద్వారా అందు కోవాలనుకుంటున్న కార్పొరేటీకరణ కూడా మాయాజాలమే).

కంచ ఐలయ్య నేల గురించి, నీటి గురించి ఎప్పుడూ మాట్లాడకపోవడం యీ మాయావాదంలో భాగమే. ఒక బహుళజాతి సంస్థ పేరు వేదాంత. ఈ కంపెనీ వల్ల తాము నిర్వాసితులమౌతామని గిరిజనులు పోరాడుతున్నారు. యిటువంటి పోరాటాల్ని కంచ ఐలయ్య పట్టించుకోరు. కారణం యీ సమస్యలన్నీ మిథ్యాపూర్వకమైనవి. భాషలో మాత్రమే అడవులూ గిరిజనులూ వున్నారు. వాస్తవంగా వారి వునికి భాషాగతమైంది మాత్రమే. అందువల్ల చక్కని ఇంగ్లీషు భాష నేర్చుకుంటే ఆ సమస్యలు పరిష్కారమైపోతాయి. ఎందువల్లనంటే దానికి కంచ ఐలయ్య గారి సమాధానం అగ్రవర్ణాల వారందరూ తమ పిల్లల్ని ఇంగ్లీషు మీడియంలోనే చదివిస్తున్నారు. అందువల్లనే వారు సమస్యల నుంచి బయటపడ్డారు అని కంచ ఐలయ్య సమాధానం.

ఇంగ్లీషు చదువుల వల్ల కోటు వేసుకున్న కొందరు ఆధునిక బ్రాహ్మణులు తయారయ్యారు. ఈ బ్రాహ్మణులే యితర వర్ణాల వారందరికీ ఆదర్శంగా మారారు. ప్రజల నుంచి దూరం కావడానికి, అనాగరిక గ్రామీణుల నుంచి వేరుపరుచు కోవడానికి ఆధునిక బ్రాహ్మణులు వేసుకున్న కోటు యితర కులాల వారందరికీ ఆదర్శంగా మారింది. యిదే మార్గంలో అతిశూద్ర కులానికి చెందిన నరేంద్రమోడీ లక్షల విలువ చేసే కోటు వేసుకొని అమెరికా అధ్యక్షుడి కరచాలనం చేశారు. బ్రాహ్మణీయ కోటు కొంపముంచింది. బనియా నిరాడంబరత్వమే గెలిచింది. ఆప్‌ చరిత్రని సృష్టించింది. ఎందుకంటే దేశంలో ఎక్కువ గ్రామీణ జనాభా గాంధీలా నిరాడంబర వేషధారణ కలవారే. యీనాటికీ గ్రామాల్లో ఎవరూ కోటు వేసుకోరు. కోటు సీఈవోలకి సింబల్‌.

ఇంగ్లీషు భాష కూడా యీనాటికీ అతికొద్దిమంది బడా బాబుల్ని తయారు చేస్తుంది. ఇంగ్లీషు భాష నుంచి గోరటి వెంకన్న లాంటి సహజ స్వరాలు వికసించవు. పంచభూతాలనీ, అవి అందకపోవడం వల్ల కలుషితం కావడం వల్ల వచ్చే ముప్పునీ ఇంగ్లీషు మాయాజాలం, కార్పొరేట్‌ మాయాజాలం, ఆధునిక బ్రాహ్మణ వాదం కప్పిపుచ్చుతాయి. ఆ బ్రాహ్మణ వాదం నుంచి పుట్టిన మాయావాదే కంచ ఐలయ్య. (ఇంగ్లీషు భాషని గాంధీ, లోహియాలాంటి బనియాలు మాత్రమే విమర్శించారు, బ్రాహ్మణులు కాదు).

ఇంటింటికీ మంచినీళ్ళు యిస్తానని కాకుండా, వీధి వీధికీ యింగ్లీషు బడులు పెడ్తానని ప్రకటిస్తే కంచ ఐలయ్య ఆప్‌ని సమర్థించేవాడు. ఇంగ్లీషు భాష సకల సమస్యలనీ పరిష్కరిస్తుంది.

ప్రశ్నించే తత్వాన్ని ఇంగ్లీషు భాష పెంపొందిస్తుందని కంచ ఐలయ్య భావిస్తున్నాడా? నిజానికి ఇంగ్లీషు భాష విముక్తిని కాదు దాస్యాన్ని పెంచి పోషిస్తుందని గుగీ లాంటి ఆఫ్రికన్‌ రచయితలు భావిస్తున్నారు. తమ మాతృభాషలలో రచనలు చేస్తున్నారు. (డీకలొనైజింగ్‌ మైండ్‌ – గుగీ)

కంచ ఐలయ్య గారిలోని యీ భావదాస్యానికి కారణం ఆయన బ్రాహ్మణుల నుంచి అలవర్చుకున్న క్రైస్తవ దాస్య బుద్ధి. క్రైస్తవం వచ్చి యిస్లాం కాని ముస్లింలు కాని చేయలేని మంచి పని చేసిందని, ఆధిపత్యాల్ని ప్రశ్నించిందని ఐలయ్య వాదిస్తాడు. నిజానికి క్రైస్తవం ఆధిపత్యాల్ని ప్రశ్నించే స్వభావాన్ని చంపేసి బ్రాహ్మణవాదాన్ని బలపరిచింది. ఈనాటికీ బ్రాహ్మణవాదాన్ని వ్యతిరేకిస్తున్నది బనియా సంస్కృతి, ముస్లింల సూఫీయిజమూ (క్రైస్తవం కానే కాదు).

అరవింద కేజ్రీవాల్‌ అనే బనియా హిందూ కార్పొరేట్‌ మాయావాద ప్రభుత్వాన్ని గడగడ లాడించడానికి కొంతకాలం ముందే, షిరిడీసాయి బాబా గడగడ లాడించాడు. బనియాల్ని దుమ్మెత్తి పోసే కంచ ఐలయ్య, ఆధునిక బ్రాహ్మణుణ్ణి ఆదర్శంగా తీసుకునే ఐలయ్య, క్రైస్తవుల్ని విముక్తి ప్రదాతలుగా ఆకాశానికెత్తే ఐలయ్య మాత్రం మరణించిన వంద సంవత్సరాల తర్వాత నిద్రలేచి జనాల్ని నిద్ర లేపి హిందూవాదుల్ని నిలదీసిన షిరిడీ సాయి బాబా గురించి ఒక్క మాట కూడా మాట్లాడడు.

నిజానికి షిరిడీ సాయిబాబా కొంతకాలంగా సీసీ కెమెరాల ఫుటేజిల్లో ప్రత్యక్షమవుతూనే వున్నాడు. యిలా మరణించిన సుదీర్ఘకాలం తర్వాత కూడా భారతీయ ప్రజల హృదయాలని తన్మయం చేస్తున్న షిరిడీసాయి బాబా ఎవరు? అతని తల్లిదండ్రులెవరు? ఎవరికీ తెలియదు. ఆయనొక మసీదులో ప్రవేశించి దీపాలు వెలిగించి ద్వారకామాయి అని పేరు పెట్టాడు. ఆయన హిందువులకి హిందువులా, ముస్లింలకి ముస్లింలా తోస్తాడు. అందుకే యిద్దరూ పూజిస్తారు. ఇటీవల హిందూవాదులూ చట్టసభల్లోనూ బయట కూడా ముస్లింలని నిందిస్తూ మాట్లాడ్తూ వచ్చారు. షిరిడీ సాయిబాబాని కూడా నిషేధించాలనుకొన్నారు సాధుసంతులు ఆయన హిందూ దేవుడు కాడని, షిరిడీ భక్తులు గంగాస్నానం చేసే అర్హతని కోల్పోతారని ప్రకటించారు. దాంతో సాయిభక్తులంతా గంగలో మునిగి నిరసన తెలియజేశారు. హిందూవాది నరేంద్ర మోడీ ఎన్నికల్లో గెలిచి గంగకి హారతులిచ్చిన కొంతకాలానికే షిరిడీ సాయిబాబా వివాదం ముదిరింది. షిరిడీ సాయిబాబా భక్తులు గంగపై తమ హక్కుని స్థాపించడం ద్వారా, యిక్కడి ప్రకృతిపై అందరికీ హక్కు వుందని చాటారు.

హిందూ సాధుసంతులు షిరిడీ సాయిబాబా హిందూ దేవుడు కాదని వాదిస్తుంటే, గుజరాత్‌లో కొన్ని దేవాలయాల్లో సాయి విగ్రహాల్ని తొలగిస్తుంటే, దేశంలోని భక్తులంతా నిరసన తెలియజేశారు. అమర పురాణ పురుషుడిగా వర్ధిల్లుతున్న షిరిడీసాయి బాబా సృష్టించిన సంచలనం యిది. చారిత్రక పురుషుల కన్న పురాణ పురుషులే ఎక్కువ ప్రభావాన్ని కలిగిస్తారంటాడు మహాబనియా లోహియా.

మతం మత్తు మందు అని మాటిమాటికీ కొటేషన్‌ యిస్తూ మెలకువలో కంటె మత్తులోను మైమరపులోను సత్యం దాగి వుందన్న విషయాన్ని మరిచిన కమ్యూనిస్టులకీ, బౌద్ధాన్ని గురించి మాట్లాడ్తూ క్రైస్తవాన్ని ఆరాధిస్తూ బ్రాహ్మణ వాదంలో మునిగి తేలుతున్న కంచ ఐలయ్యకీ షిరిడీ సాయి వివాదం అర్థమే కాదు.

కంచ ఐలయ్య కన్నా సినిమా నిర్మాత, నటుడు మోహన్‌బాబు గొప్ప మేధావి. షిరిడీ సాయిబాబాపై హిందూవాదులూ, కొందరు సన్యాసులూ, పీఠాధిపతులూ రేపుతున్న వివాదాన్ని తీవ్రంగా ఖండించారు. అంతేకాదు ముస్లిం యువకునికీ, ‘హిందూ’ స్త్రీకి మధ్య జరిగిన ప్రేమకథని సినిమాగా తీసి, చివరికి ఆ వివాదంలో పద్మశ్రీ బిరుదుని కూడా కోల్పోయిన విప్లవకారుడు మోహన్‌బాబు.

సినిమా వాళ్ళంతా మూఢ విశ్వాసాల్లో కూరుకుపోయారని నిందిస్తాడు కంచ ఐలయ్య (జైపూర్‌ లిటరరీ ఫెస్టివల్‌లో హిందీ సినిమా కవి జావేద్‌ అక్తర్‌తో ఐలయ్య వివాదం). భారత ప్రజలు కాని, సినిమా వాళ్ళు కాని కంచ ఐలయ్యంత మూఢవిశ్వాస పరులు కాదు. కంచ ఐలయ్యకి బ్రాహ్మణ వాదం, క్రైస్తవం, అమెరికనిజం, ఇంగ్లీషు, బౌద్ధం వీటన్నింటిపైన మూఢ విశ్వాసం. అందుకే యివన్నీ కలిసి ఆధునిక కాలంలో సృష్టిస్తున్న విధ్వంసాన్ని ప్రశ్నించరు కంచ ఐలయ్య.

ఇంతటి విప్లవాన్ని సృష్టించిన షిరిడీ సాయిబాబా గురించి ఎందుకు మాట్లాడరు? గాడ్‌ యాజ్‌ ఎ పొలిటికల్‌ ఫిలాసఫర్‌ అంటూ బుద్ధున్ని బౌద్ధాన్నీ ఆకాశానికెత్తే కంచ ఐలయ్య బ్రాహ్మణ వాదంపై షిరిడీ సాయిబాబా నిశ్శబ్ద విప్లవాన్ని ఎందుకు ఆహ్వానించరు? ఎందుకంటే కంచ ఐలయ్య కూడా బ్రాహ్మణవాదే. అందుకే బౌద్ధ టెర్రరిస్టులు ముస్లింలపై దాడులు చేస్తుంటే మన పక్కనే వున్న బుద్ధిస్టు శ్రీలంక తమిళులని ఊచకోత కోస్తుంటే కంచ ఐలయ్య బుద్ధిస్టులని ఆకాశానికెత్తుతాడు. మేధావులందరి కంటె, బౌద్ధులే ఎక్కువ జ్ఞానం కలిగి వున్నారంటాడు.

యింతకీ ఎక్కువ జ్ఞానం కలిగిన బౌద్ధులు ఎవరు? ఒకసారి మానవ హక్కుల మేధావి కన్నబిరాన్‌ శ్రీలంక బౌద్ధ సన్యాసితో తమిళులపై రాజ్యహింస గురించి ప్రస్తావించాడు. ఆ బౌద్ధ సన్యాసి సమాధానం ఏమిటంటే – బౌద్ధ అహింసా వాదం బౌద్ధుల వరకే పరిమితమైనది, అది యితరుల పట్ల వర్తించదు అని. యిదీ బౌద్ధ సన్యాసుల వైఖరి.

కంచ ఐలయ్య ముస్లింలలో మేధావులు తక్కువగా వున్నారంటాడు. ఈ కంచ ఐలయ్యని నిలదీసిన హిందీ సినీ కవి జావేద్‌ అక్తర్‌ మేధావిగా కనబడలేదా? జైపూర్‌ లిటరరీ ఫెస్టివల్‌లో బౌద్ధంపై కంచ ఐలయ్య గ్రంథం గురించి వ్యాఖ్యానిస్తూ, జావేద్‌ అక్తర్‌ ‘‘ఏ మతమైనా ఒకటే. ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే ఏ పద్ధతి అనుసరిస్తే నేమిటి అంటూ మతాలన్నీ అసమానతలకి నిలయాలే”నని విమర్శించారు. అలాగే అన్ని మతాలు సమానత్వం పునాదులపై నిర్మించబడాలని సూచించారు కూడా. యిది కంచ ఐలయ్య లాంటి నయా బౌద్ధులకి ఒక ముస్లిం మేధావి చేసిన హెచ్చరిక.

ఎందుకంటె ఇస్లాంని సంస్కరించదగిన అనాగరిక మతంగా, ముస్లింలని క్రైస్తవుల దగ్గర పాఠాలు నేర్చుకోదగినవారుగా అభివర్ణిస్తారు కంచ ఐలయ్య. ఐలయ్య దృష్టిలో బౌద్ధం కూడా కాదు, క్రైస్తవమే గొప్ప మతం. అదే భారతీయ అనాగరికుల్ని నాగరికతలోకి నడిపి కాపాడింది. ఇస్లాం తెచ్చిన మార్పు కూడా యేమీ లేదు. ఇస్లాం క్రైస్తవం దగ్గర పాఠాలు నేర్చుకోవలసిన మతం, సంస్కరణ చెందవలసిన మతం.

బౌద్ధం పేరుతో ఇస్లాంకి ఒక ప్రత్యర్థిని నిలపడమే కంచ ఐలయ్య లక్ష్యం. వివేకానంద స్వామి వారు కూడా బౌద్ధాన్ని కీర్తించి, ఇస్లాంని క్రూరమైన అనాగరికమైన మతంగా విమర్శించాడు. కంచ ఐలయ్య సున్నితంగా అవే భావాలు వెళ్ళబుచ్చాడు.

కంచ ఐలయ్య ముస్లింలలో మేధావులు తక్కువ అని విమర్శించడమే కాదు, ఇర్ఫాన్‌ హబీబ్‌ లాంటి చరిత్రకారులు కులవ్యవస్థని గురించి రాయలేదన్నారు. అది నిజం కాదు. కంచ ఐలయ్యలా బ్రాహ్మణులు కులవ్యవస్థకి మూలమని భావించడు. బౌద్ధంలోనే కుల వివక్షకు మూలాలు ఉన్నాయంటాడు ఇర్ఫాన్‌ హబీబ్‌. (రెలిజియన్‌ ఇన్‌ ఇండియన్‌ హిస్టరీకి ముందుమాట).

బౌద్ధాన్ని హేతుబద్ధ మతంగా వర్ణిస్తూ, ఇస్లాంని అనాగరిక మతంగా సంస్కరించబడవలసిన మతంగా అభివర్ణించే కంచ ఐలయ్య గారిలాంటి బ్రాహ్మణ మేధావులకి ఇర్ఫాన్‌ హబీబ్‌, జావేద్‌ అక్తర్‌ మొదలైన ముస్లిం మేధావులు విరుగుడుగా కనబడ్తారు.

ఐజాక్‌ మహమ్మద్‌ చాలాకాలం క్రితమే హిందూ సంస్థల కొంగ్రొత్త వైఖరి గురించి కుండబద్దలు కొట్టారు. బాబ్రీ మసీదుని కూలగొట్టడంలో పాత్ర వహించిన వారు ఉమాభారతి, కళ్యాణ్‌ సింగ్‌, వినయ్‌కతియార్‌ వంటి శూద్రులు ఉన్నారు. దళిత రాజకీయ నాయకురాలు మాయావతి బిజెపితో చేతులు కలిపింది. నిమ్న కులాలు కూడా హిందూత్వంలో భాగం కావడాన్ని గురించి మాట్లాడ్తూ ఐజాక్‌ అహ్మద్‌, హిందూవాదం సంప్రదాయేతర సాంస్కృతిక దుందుడుకుతనాన్ని ప్రదర్శిస్తోందన్నారు. హిందూవాదం సొంత పునాది లేని బూర్జువా వర్గం. దానికి స్వంత సంస్కృతి అంటూ ఏమీ లేదు అని హిందూ వాదం నిజరూపాన్ని బట్టబయలు చేశారు.

కంచ ఐలయ్య గారికి కూడా సొంత పునాది లేదు. ఒకవేళ వున్నా దాన్ని క్రైస్తవం కోసం తాకట్టు పెట్టారు. తాను హిందువుని కానని, తన దేవతలు, బ్రాహ్మణ దేవతలూ వేరు వేరని ప్రకటించుకున్నారు నిజమే కాని చివరికా దేవతలని పాతర వేసి ప్రొటెస్టెంటు క్రైస్తవాన్ని ఆశ్రయించారు. ప్రొటెస్టెంటు క్రైస్తవంతో కింది నుంచి పైవరకూ నిండిపోయిన అమెరికాని ఆదర్శంగా భావించారు. ఆ అమెరికా ఖండాన్ని ఏకం చేసి అమెరికన్‌ జాతీయతకు పునాదులు వేసిన అబ్రహాం లింకన్‌ని ఫక్తు హిందూవాది నరేంద్ర మోడీలో చూసుకుంటున్నారు.

కంచ ఐలయ్యలో పెరియార్‌ హిందుత్వ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. పెరియార్‌ బ్రాహ్మణుల్ని ముస్లింలనీ కూడా శూద్రులకి ముప్పుగా భావించారు. బ్రాహ్మణ్ణి కాదని ముస్లింలని అంగీకరించడం పేడలో కాలు తీసి మలంలో కాలు పెట్టడం లాంటిదన్నాడు పెరియార్‌. (పెరియార్స్‌ హిందుత్వ – రవికుమార్‌)

అందుకే పెదవులపై బౌద్ధాన్ని స్మరిస్తూ సర్వాత్మనా క్రైస్తవాన్ని ఆరాధిస్తున్నారు కంచ ఐలయ్య. చివరికి ప్రచ్ఛన్న క్రైస్తవమైన హిందూవాదాన్ని వరిస్తున్నారు. యిదే ఆధునిక బ్రాహ్మణవాదం.

నిజానికి బ్రాహ్మణ వాదం కింద పడి నుగ్గై మరణించినవాడు బ్రాహ్మణుడే. మురళీమనోహర్‌ జోషీ పక్కకి నెట్టివేయబడితే, మాయావతి ఆవేదన వ్యక్తం చేసింది. హిందూవాదానికి అందమైన మేలిముసుగుగా భాసించిన వాజపేయి రాజకీయంగా కూడా వృద్ధుడై అంపశయ్య జేరాడు. బ్రాహ్మణుని సాత్విక గుణమనే ముసుగు హిందూ వాదానికి యింక అవసరం లేదు. ఆ అవసరం తీరిపోయింది. శూద్రులు, అతిశూద్రులు ఆ స్థానాన్ని ఆక్రమించుకున్నారు. భవిష్యత్తు శూద్రులదేనన్న వివేకానంద హిందూవాణి నిజమైంది.

కంచ ఐలయ్య పరిభాషలో మోడీత్వ విజయం హిందూ సంస్థల మండలీకరణని సూచిస్తోంది. మోడీ మరో అబ్రహాం లింకన్‌గా అవతరించవచ్చునని కలగంటున్నారు ఐలయ్య.

ఈ ఆలోచనలు ప్రాతినిధ్యాన్నే సారంగా భావిస్తాయి. ఒబామా అనే నల్లజాతివాడు అధ్యక్షుడయ్యాడు కనుక నల్లజాతి ప్రజల విముక్తి జరిగినట్లేనని భావించడం ఎటువంటిదో, అతిశూద్రుడు ప్రధాని అయ్యాడు కనుక ఆ జాతి ప్రజలు విముక్తి చెందారని భావించడం కూడా అంతే. కంచ ఐలయ్య బౌద్ధ మాయావాది అనే సంగతిని మరోసారి గుర్తుకు తెచ్చుకోవాలి. అందుకే ఆయన సమస్యల మూలాల్లోకి వెళ్ళడు. మోడీ కార్పొరేట్‌ అనుకూల విధానాలు పేద ప్రజలకి తెచ్చే ముప్పు గురించి ఆయన ఆలోచించకపోవడం ఆయన బౌద్ధ దృక్పథంలో భాగమే.

హిందూ సంస్థల్లో హిందూ వాదుల్లో అబ్రహాం లింకన్‌ని చూసిన వాళ్ళల్లో మొదటివాడు ఒకప్పటి ఆరెస్సెస్‌ అధ్యక్షుడు దేవరస్‌. ఆయన అన్నదేమిటంటే అబ్రహాం లింకన్‌ దక్షిణ ఉత్తర అమెరికాల్ని ఏకతాటి మీదికి తెచ్చి ఐక్య అమెరికాని తయారు చేశాడు. బలమైన దృఢమైన అమెరికాని సృష్టించాడు. బానిస వ్యవస్థ రద్దుకంటె అమెరికా ఏకీకరణే తన ప్రధాన లక్ష్యమని లింకన్‌ వాక్యాల్ని ఉటంకిస్తాడు దేవరస్‌ (‘అబ్రహాం లింకన్‌ అండ్‌ ఆర్‌ ఎస్‌ ఎస్‌ – వాటీజ్‌ కామన్‌’).

ఒక కార్పొరేట్‌ అఖండ భారత్‌ని సృష్టించడమే మోడీ లక్ష్యం కూడా, కాశ్మీర్‌ స్వయం ప్రతిపత్తి రద్దు గురించి వివాదం రగుల్తూనే వుంది. కాశ్మీర్‌ హక్కుల గురించి మాట్లాడి, టెర్రరిజం ముస్లింలకే ప్రత్యేకం కాదని మాట్లాడి తీవ్రవివాదానికి కారణమయ్యాడు ప్రశాంత్‌ భూషణ్‌ అనే ఆప్‌ రాజకీయ నాయకుడు.

యింతకీ కంచ ఐలయ్య కోరుకుంటున్నదేమిటి? మోడీ లక్ష్యమే ఆయన లక్ష్యమా?

హిందూవాదుల లక్ష్యమే ఆయన లక్ష్యమా? అందరినోళ్ళూ మూయించి, కార్మిక హక్కులు రద్దు చేసి, మైనార్టీలని అణచివేసి, వ్యాపారమూ లాభమే గీతాసారంగా భావించే అఖండ భారత నిర్మాణమే ఐలయ్య లక్ష్యమా? యీ లక్ష్యం కోసం తమ జాతివాళ్ళే శూద్రులే కృషి చేయాలని, వారే రాజకీయ అగ్రస్థానాల్లో వుండి పనులు చక్కబెట్టాలని ఐలయ్య ఉద్దేశ్యమా?

ఇటీవల వీరమణి అనే పెరియార్‌ అనుయాయి అన్నదేమిటంటే బిజెపిలో అతిశూద్ర కులాలకి స్థానం లభించడం తమ ద్రవిడ ఉద్యమాల విస్తరణ వల్లనేనని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. (‘The Periyar Legates’ Chandra Bhanu Prasad)

అంటే బ్రాహ్మణులు వలసవాదుల ప్రాపకంతో పైకి ఎగబాకడానికి చేసిన ప్రయత్నాన్నే నేటి శూద్ర అతిశూద్ర కులాలు అనుసరిస్తున్నాయి. అందుకోసం బ్రాహ్మణుడిలాగే తమ సంస్కృతినీ ఉనికినీ తాకట్టు పెడ్తున్నాయి, కంచ ఐలయ్య తన కుల అస్తిత్వాన్ని తాకట్టు పెట్టినట్లు.

కంచ ఐలయ్య తనకీ తన అస్తిత్వానికీ బ్రాహ్మణులతో సంబంధం లేదని, తన దేవతలు ఆచార వ్యవహారాలూ పూర్తిగా భిన్నమైనవి గుర్తించడంలో తన సనాతన అస్తిత్వాన్ని బలపరిచారు. వివిధ శ్రామిక కులాల వారు జ్ఞానాన్ని వృద్ధి చేసిన తీరుని ప్రస్తావించారు. అదీ బాగుంది కాని కంచ ఐలయ్య దృష్టిలో యీ ప్రాచీన అస్తిత్వం అతిక్రమించదగినది, ఇంగ్లీషు భాష క్రైస్తవాల ద్వారా యీ సనాతన అస్తిత్వం అధిగమించదగింది (బౌద్ధం విమర్శనాత్మక వైఖరిగా మాత్రమే గుర్తించబడింది).

క్రైస్తవులు అంతర్జాతీయ అభిప్రాయాన్ని ప్రభావితం చేయగలిగి వుంటారు. అంటే పాశ్చాత్య సమాజాన్ని అడ్రస్సు చేయగలుగుతారు యిది కంచ ఐలయ్యకి క్రైస్తవం పట్ల గల ఆసక్తికి ప్రధాన కారణం. పాశ్చాత్యంతో సంభాషణ మాత్రమే హేతుబద్ధమైనది.

యిటువంటి సంభాషణ ఇస్లాం ద్వారా సాధ్యం కాదని కంచ ఐలయ్య గుర్తించారు. గుజరాత్‌లో ముస్లింలు తమపై దాడి జరిగినపుడు అంతర్జాతీయ సంస్థల్ని ప్రభావితం చేయలేకపోయారు. ముస్లింలకి కలుపుగోలుతనం లేదు. ఎస్సీ బీసీలే వారి మీద దాడిచేశారంటే కారణం క్రైస్తవానికి వుండే విశాల దృక్పథం, సేవాభావం లేకపోవడమే కారణం. బ్రాహ్మణ్యానికీ ఇస్లాంకీ ఒకటే తేడా. నువ్వు బ్రాహ్మణుడిగా మారలేవు. కాని ఇస్లాంలోకి కన్వర్షన్‌ సాధ్యం. ఇంతే తేడా తప్ప దొందూ దొందే. యిద్దరిదీ వొంటెత్తు పోకడేనని భావం. యిదీ కంచ ఐలయ్య ధోరణి.

బ్రాహ్మణ సంప్రదాయాన్నీ ఇస్లాంనీ పోల్చడం క్రైస్తవుల నుంచి వచ్చిందే. రవి జెకర్యా అనే క్రైస్తవ ప్రచారకుడు తన ఉపన్యాసంలో ఒకమాట అంటాడు. క్రైస్తవంలా జనసామాన్యంలోకి అందరిలోకీ వెళ్ళగలిగిన విశాల దృష్టి ముస్లింలకీ బ్రాహ్మణులకీ కూడా లేదు. బైబిలు జనసామాన్యంలోకి వాళ్ళ వాళ్ళ భాషల ద్వారానే చొచ్చుకుపోయింది అంటాడు రవి జెకర్యా.

ఇది నిజమే పైకి చూస్తే క్రైస్తవం క్రైస్తవ సమాజం ఉదార స్వభావం కలవిగానే కనబడ్తాయి. కాని వేమన ఏమన్నాడు పైకి కనబడేదే సత్యం కాదన్నాడు. మేడిపండుని ఉదాహరణ చూపాడు. దృష్టి గోచరమైనదే సత్యం కాదని తెలుసుకోవడానికి తాత్విక గాఢత్వమూ నిజాయితీ కావాలి. అవి ఐలయ్యకి లేవు.

ఎందుకంటే ప్రస్తుత చరిత్రని గమనిస్తే ఇస్లాం టెర్రరిజంగా భాసిస్తుంది. ఇస్లాంని ఎదిరించి ఆధునిక విద్యని అభ్యసించి బుల్లెట్‌ దెబ్బకి గురైన మలాలా గుర్తుకొస్తుంది. ఆమెకి నోబుల్‌ బహుమతీ అంతర్జాతీయ గుర్తింపు రావడం గుర్తుకొస్తాయి. యిటువంటి గుర్తింపు నివ్వడం ద్వారా పాశ్చాత్య క్రైస్తవ సమాజపు విశాల దృక్పథం కనబడ్తుంది. కాని ఆ టెర్రరిజానికి మూలం అమెరికా యూరప్‌ల అంతర్జాతీయ రాజకీయాలేనని, ఆ రాజకీయాలే, ఆ యుద్ధనీతే అసలు సిసలు టెర్రరిజమని కంచ ఐలయ్యకీ చంద్రభాను ప్రసాదులకీ ఎవరు చెప్తారు? ఆఫ్ఘనిస్తాన్‌పై అమెరికా దాడిని విముక్తి యుద్ధంగా, స్త్రీల విముక్తికి మార్గంగా వ్యాఖ్యానించాడు చంద్ర భాను ప్రసాద్‌ దళితుడి డైరీలో. కవి స్మైల్‌ గారు ముక్కుమీద వేలు వేసుకున్నారు.

కంచ ఐలయ్య పౌరహక్కుల సంఘంలో పనిచేసిన మిత్రులు సుబ్రహ్మణ్యం గారి దగ్గర పాఠాలు నేర్చుకోవలసి ఉంది. సుబ్రహ్మణ్యంగారు అంటారు క్రైస్తవుల మీద దాడి జరిగినపుడు శిక్షలు పడ్తాయి. కాని ముస్లింల మీద దాడి జరిగినపుడు యెటువంటి శిక్షలూ వుండవు అంటారు. గ్రాహంస్టెయిన్‌ని అనే మిషనరీని ఒక ఒరిస్సా గిరిజనుడు హత్య చేస్తే ఉరిశిక్ష పడింది. క్రైస్తవుల మీద దాడి జరిగినపుడే ప్రభుత్వం స్పందిస్తుంది. ముస్లింల గురించి స్పందన ఉండదు అంటారు సుబ్రహ్మణ్యం గారు.

అంతెందుకు మొన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చర్చిలపై దాడులు జరిగాయి. ఒబామా భారతదేశాన్ని పర్యటించినపుడు మత సామరస్యాన్ని గురించి మాట్లాడడం ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. వెంటనే మన ప్రధాని మోడీ ఎప్పుడూ లేనట్లు మతాంతరీకరణల్ని కూడా సమర్ధిస్తూ మాట్లాడారు. క్రైస్తవ సమావేశానికి వెళ్ళి సంఘీభావం తెలిపారు. గుజరాత్‌లో ముస్లింలపై దాడి జరిగినపుడు మోదీని అమెరికా గడ్డపై అడుగు పెట్టకుండా హుకుం జారీ చేసిన అమెరికా, ప్రధాని కాగానే ఆహ్వానం పలికింది. ఐతే ముస్లింల ఉనికి కంటె క్రైస్తవుల ఉనికి క్రైస్తవ మతపు ఉనికి పవిత్రమైనవని మోదీకి ‘గీత’ గీసింది, గీతాసారం బోధించింది అమెరికా. ఒబామా నల్లనయ్యగానూ, మోదీ అర్జునుడిగానూ కనబడ్తారు యీ సన్నివేశంలో.

యీ క్రైస్తవ గీతాసారం కంచ ఐలయ్యకి కూడా తెలుసు. చాలామంది కంటె బాగా తెలుసు.

ఒకరోజు ఒక తెలుగు సైన్సు ఫిక్షన్‌ రచయిత ఫోను చేసి నాకు హితబోధ చేశాడు. ‘‘చూడు నువ్వు మాట్లాడితే కులం మతం అంటావు. అమెరికన్‌ సమాజం చూడు ఎంత సెక్యులరో. మనం ఎదగాలన్నా అటువంటి లౌకిక దృక్పథం అవసరం’’ అన్నాడు.

అమెరికన్‌ సమాజమంత మత దృష్టి కలిగిన సమాజం మరొకటి లేదు అని కుండబద్దలు కొడ్తాడు ఐలయ్య. అమెరికాలో రాజకీయంగా పైకి ఎదగాలంటే ప్రొటెస్టెంట్‌ క్రైస్తవుడు కావడం తప్పనిసరి. ఒక కేథలిక్కు రాజకీయంగా ఉన్నతస్థితికి ఎదగడం అసాధ్యం. అధ్యక్షుడు కావడం అసంభవం. (అందుకే ఒబామా క్రైస్తవుడా కాదా అనే విషయంపై పెద్ద చర్చ జరిగింది) భారతదేశానికి ఒబామా రాక సందర్భంగా వచ్చిన రాయబారి రిచర్డ్‌ రాహుల్‌వర్మ హిందువైనప్పటికీ క్రైస్తవమతంలోకి మారినవాడే. యిటువంటి రహస్యాలన్నీ బట్టబయలు చేస్తాడు కంచ ఐలయ్య.

ఐతే యింతగా ప్రొటెస్టెంట్‌ క్రైస్తవంతో నిండినప్పటికీ అమెరికా సమాజం విశాలదృక్పథం, సహనం కలిగి వుందని అంటాడు ఐలయ్య. ఇస్లాంలోని టెర్రరిస్టు పోకడలు, హిందూ ఛాందసం వంటివి అమెరికన్లలో కానరావని కితాబిస్తాడు.

ఐతే కొందరు అమెరికన్‌ నల్లజాతి నాయకులు క్రైస్తవాన్ని విడిచిపెట్టి ఇస్లాంలోకి మారమని ఎందుకు పిలుపునిచ్చారు? అక్కడి జాతి వివక్ష మాటేమిటి? జాతి వివక్షని స్వయంగా నల్లజాతివాడైనా ఒబామా ఎందుకు ఎదుర్కోలేకపోతున్నాడు? ఇటువంటి ప్రశ్నలేవీ కంచ ఐలయ్య వెయ్యడు సరికదా ఆ ప్రశ్నల్ని మరుగుపరిచి అమెరికన్‌ సమాజాన్ని లిబరల్‌ అంటాడు. హిట్లర్‌ కాన్సెంట్రేషన్‌ క్యాంపుల్ని తలదన్నే అబూగరీబులూ, అమెరికన్‌ ద్వంద్వనీతి, ఆయుధ వ్యాపారమూ, స్వార్థ యుద్ధనీతీ, వీటన్నిటిని మరుగుపరిచే పారదర్శకత లేని అబద్ధపు మీడియా… యివన్నీ అమెరికన్‌ లిబరలిజాన్ని నేతి బీరకాయ అని నిరూపిస్తున్నాయి.

నిజానికి కంచ ఐలయ్యే ప్రొటెస్టెంట్‌ క్రైస్తవ దృక్పధంతో వ్యాధిగ్రస్తుడయ్యాడు. జర్మనీ నాజీయిజం నుంచి అమెరికన్‌ లిబరలిజం వరకు ప్రొటెస్టెంట్‌ క్రైస్తవం అవతారాలు మారుస్తూ వస్తోంది.

కంచ ఐలయ్యని అర్థం చేసుకోవాలంటే ప్రొటెస్టెంట్‌ క్రైస్తవాన్ని అర్థం చేసుకోవాలి. భారత దేశ ఆధునికత వలస ఆధునికత. అలాగే భారతీయ సంస్కరణ భావాలన్నీ క్రైస్తవం నుంచి వచ్చినవే. బ్రాహ్మణుడు, శూద్రుడు కూడా వలసవాదం నుంచి ఆవిర్భవించినవారే. అందువల్ల పాశ్చాత్య మత సంస్కరణభావాలూ, వాటి పరిణామాల్ని అర్థం చేసుకోవాలి.

అందులో భాగంగా ప్రొటెస్టెంట్‌ క్రైస్తవాన్ని అర్థం చేసుకోవాలి. జర్మనీ నాజీయిజానికి విజయాన్ని అందించింది ప్రొటెస్టెంట్‌ క్రైస్తవమే.

ఒకే మతం, ఒకే రాజ్యం, ఒకే చర్చి అంటూ తీర్మానం చేస్తూ, పాస్టర్లంతా హిట్లర్‌కి బద్ధులై ఉండాలని ప్రతినలు తీసుకున్నారు. ఆర్యులను గురించి పేరాలను పవిత్ర గ్రంథాల్లో జేర్చాలన్నారు. నేషనల్‌ సోషలిజంకు అనుగుణంగా బైబిల్‌ని సంస్కరించాలన్నారు. దేశమంతటికీ ఒకే చర్చి ఉండాలని 1933లో ప్రొటెస్టెంట్‌ ప్రతినిధుల ముసాయిదా పార్లమెంటులో ఆమోదం పొందింది. హిట్లర్‌ ఎన్నికలో విజయం చెందడం వెనక ప్రొటెస్టంటులు వున్నారు. శిలువ స్థానంలో స్వస్తిక్‌ని చిహ్నంగా స్వీకరించాలని వారు భావించారు.

ఎందుకంటె ప్రొటెస్టెంట్‌ క్రైస్తవ పితామహుడు మార్టిన్‌ లూథర్‌ జాతి విద్వేషి. ఆధునిక పెట్టుబడిదారీ సమాజం ఆవిర్భావాన్ని కలగంటూ, జాతి విద్వేషంతోనూ ప్రజా ఉద్యమాల పట్ల విద్వేషంలోనూ చెలరేగిపోయాడు. జర్మనీ చరిత్రలో చెప్పుకోదగిన ప్రజా ఉద్యమం 1525 నాటి రైతుల ఉద్యమం. ఆ సందర్భంగా లూథర్‌ యువరాజుకి యిచ్చిన సలహాయేమిటంటే ఆ పిచ్చికుక్కల్ని కఠినాతి కఠినమైన చర్యలు గైకొంటూ నిర్దాక్షిణ్యంగా అణచి వెయ్యి. అదీ నిస్సహాయులైన పేదరైతుల గురించి అతడు వాడిన పదజాలం. యూదుల గురించీ అంతే. యూదులని దేశం నుంచి తరిమెయ్యాలని, వారి సంపదనంతా వశం చేసుకోవాలని, వాళ్ళ జీవితాన్ని దుర్భరం చేసి జర్మనీ క్రైస్తవులని మొరపెట్టుకొనేలా చెయ్యాలని అన్నాడు. దీనిని పోలిన విద్వేషం సావర్కార్‌ హిందుత్వంలో ముస్లింల పట్ల కనబడ్తుంది. లూథర్‌ కూడా ముస్లింలని అనాగరికులని నిందించాడు. హిట్లర్‌ యీ ప్రొటెస్టెంట్‌ క్రైస్తవ పరిభాషతోనే జర్మన్లని రెచ్చగొట్టాడు. (రైజ్‌ అండ్‌ ఫాల్‌ ఆఫ్‌ థర్డ్‌ రీక్‌ – విలియమ్‌. ఎల్‌. షీరర్‌)

నాజీ కాన్సంట్రేషన్‌ క్యాంపుల్లో హింసని అనుభవించిన ప్రీమొలివి అంటాడు. నిజమైన ప్రవక్తలూ అబద్ధపు ప్రవక్తల్ని వేరు చేసి గుర్తించడం కష్టం. అందువల్ల ప్రవక్తల్నే సందేహించాలి. (ఖైదీ నెం. 174517 – ప్రీమొలివి, హెచ్‌.బి.టి.ప్రచురణ)

క్రైస్తవమతాన్ని సంస్కరించి ప్రజలకందరికీ చేరుస్తానంటూ బయలుదేరింది ప్రొటెస్టంటిజం. కాని అంతిమంగా ప్రజలందరిలో జాతి విద్వేషాన్ని నింపింది. ఉదారవాద సామ్యవాద భావాలకి శత్రువుగా పరిణమించింది. వైమర్‌ రిపబ్లిక్కుని వ్యతిరేకించింది. కేథలిక్కులనీ సోషలిస్టులనీ ఒకే గాట కట్టి ద్వేషించింది. అంటే ప్రొటెస్టింటిజపు సంస్కరణ తత్వం ఆధునిక నియంతృత్వ పోకడలకి, వైవిధ్యాన్ని నశింపజేసే ఏకశిలా సదృశస్థితికి సమాజాన్ని నెట్టింది.

దానికి కొనసాగింపే అమెరికా. అమెరికా తన నియంతృత్వానికి, బహుళత్వాన్ని హతమార్చే ఏకశిలా సదృశ సంస్కృతికి అందమైన ముసుగు వేసింది. ఆ ముసుగే ఉదారవాద ప్రజాస్వామ్యం. అది వాక్స్వాతంత్య్రం పేరుతో మీడియా నియంతృత్వాన్ని కొనసాగిస్తుంది. సరుకుల మాయతో ఆలోచించే శక్తిని హరిస్తోంది.

నిజమే అబ్రహాంలింకన్‌ గొప్పవాడే కావచ్చు బానిసత్వాన్ని రద్దు పరచి వుండవచ్చు. అమెరికా ఏకీకరణ అనేది అతని ప్రధాన లక్ష్యం. అంతిమంగా అమెరికా ఒక అఖండశక్తిగా అవతరించి, సామ్రాజ్యవాదాన్ని విస్తరించింది. దీని వెనక ప్రొటెస్టెంట్‌ స్వభావం సహకరించింది. ఐతే అమెరికాలో ప్రొటెస్టెంటిజం లిబరల్‌ రూపాన్ని ప్రజాస్వామ్య ముసుగునీ ధరించింది. ఆధునిక సంస్కరణలన్నీ తీవ్ర హింసాత్మకమైనవని చరిత్ర తెలియజేస్తోంది.

యీ ప్రొటెస్టెంట్‌ చరిత్ర నుంచే కంచ ఐలయ్య ఆవిర్భవించాడు. అందుకే ఆయన ప్రజా ఉద్యమాలని వ్యతిరేకిస్తాడు. నక్సలైట్లు ఉన్నచోట హిందూవాదులు బలపడ్తున్నారంటాడు. కాని ద్రవిడ కులవ్యతిరేక ఉద్యమాలు పుట్టిన తమిళనాట, హిందూవాదులని తలదన్నుతూ ద్రవిడ పార్టీలు మతాంతరీకరణ వ్యతిరేక చట్టాలూ, మైనార్టీలని హింసించే ‘పోటా’లాంటి క్రూర చట్టాల్ని అమలుపరిచిన సంగతిని ప్రస్తావించరు. దానికి కారణాల్ని విశ్లేషించరు. మోడీ అబ్రహాంలింకన్‌ అవుతాడో కాదో కాని ఐలయ్య మాత్రం మరో మార్టిన్‌ లూథర్‌.

అందుకే పాశ్చాత్య సమాజంలోని క్రైస్తవీకరణని ప్రస్తావిస్తూనే, అక్కడి వారిని ముస్లింలు ప్రభావితం చేయలేకపోయారంటాడు. దానికి కారణం ముస్లింల లోని ఇస్లాంలోని సహజ సిద్ధ లోపంగా వ్యాఖ్యానించడం ద్వారా రేసిస్టుగా బయటపడ్తాడు ఐలయ్య. చివరికి ముస్లింలపై అణచివేతకి అంతర్జాతీయ గుర్తింపు రాకపోవడానికి ముస్లింలలోనే లోపం వుందంటాడు. నిజానికి ముస్లింలపై అణచివేతకి దారి ఏర్పరచింది ఆ పాశ్చాత్య అమెరికన్‌ సమాజమే, వారి స్వార్ధపూరిత చమురు రాజకీయమేనన్న సంగతి ఐలయ్యకీ తెలుసు. కాని ఆయన అటువంటి విశ్లేషణలకు దిగడు. ఎందుకంటే ఆయన బ్రాహ్మణవాది. బ్రాహ్మణవాది అనే పదానికి అర్థం ఇప్పటికే తెలిసి వుంటుంది: ప్రొటెస్టంటీకరించబడిన బ్రాహ్మణులనుంచి స్ఫూర్తి పొందినవాడు.

భారతదేశానికి సిక్కు మతస్తుడు ప్రధానమంత్రి కాగలిగాడు. ముస్లిం రాష్ట్రపతి కాగలిగాడు. యిది అమెరికాలో అసాధ్యం. ప్రొటెస్టెంట్‌ క్రైస్తవుడు మాత్రమే ఉన్నత రాజకీయ పదవులు అలంకరించగలడు. ఎంతో కొంత సనాతన ఛాయలు యింకా మిగిలివుండడం వల్లే యీమాత్రం ప్రజాస్వామ్య లక్షణాలు భారతఖండంలో ప్రత్యక్షమవుతున్నాయి.

కాని భావవ్యక్తీకరణకి భారతదేశంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పుస్తకాలపై ఆంక్షలూ కళాకారులు దేశం నుంచి పారిపోవలసిన స్థితీ చూస్తుంటే, జర్మన్‌ ప్రొటెస్టంట్‌ ఫాసిజం గుర్తొస్తోంది. దీని నుంచి భారతదేశం అమెరికనిజం (అమెరికన్‌ లిబరల్‌ ఫాసిజం) లోకి ప్రయాణించడానికి సమయం పట్టవచ్చు. ఎందుకంటె భారతదేశపు చరిత్ర అంతా వలసవాద చరిత్రే. భారత జాతీయత అనేదే వలసవాదం అనుకరణ నుంచి పుట్టింది. దానికి స్వంత పునాదులు లేవు.

హిందూవాదులకీ కంచ ఐలయ్యకీ మధ్యగల తేడా యేమిటంటే – జర్మన్‌ ఫాసిజానికీ అమెరికన్‌ ఫాసిజానికీ గల తేడా. ఐలయ్యది అమెరికన్‌ ఫాసిజం.

అమెరికనీకరణ చెందడం వల్లే ఐలయ్య గారి అభిప్రాయాలు ఉదార స్వభావం కలవిగా కనబడ్తాయి. కాని అంతర్గతంగా ఫాసిజం ఉంటుంది. ఏది మంచి ఆహారమో తేల్చెయ్యడానికి కంచ ఐలయ్య ఎవరు, హిందూవాదులెవరు? శాకాహారం మంచిదా, బీఫ్‌ మంచిదా అని తేల్చేవారెవ్వరు?

వివేకానందస్వామి భారతీయులు బలవంతులుగా మారాలంటే, డైనమిక్‌ (రాజస) ప్రవృత్తి కలవారు కావాలంటే బీఫ్‌ తినాలన్నాడు. Beef, Biceps, Bhagavadgeetha ఈ మూడూ భారతీయుల ఉన్నతికి అవసరమన్నాడు. అది బ్రిటీష్‌ వాళ్ళు పరిపాలిస్తున్న కాలం. బ్రిటీష్‌ వాళ్ళు బీఫ్‌ తినడం వల్ల రైతులకి పశువుల కొరత ఏర్పడ్తోందన్నాడు జ్యోతి బాఫులే ‘గులాంగిరి’లో. మాంసాహారులు కావడంవల్లే ముఖ్యంగా బీఫ్‌ తినడం వల్లే బ్రిటీష్‌ వాళ్ళు ప్రపంచాన్ని జయించారనే నమ్మకం చాలామందికి వుండేది. యిదే అభిప్రాయంతో ఫక్తు శాకాహార కులానికి చెందిన గాంధీ మాంసాహారం తినడం అలవాటు చేసుకోవాలనుకున్నాడు. తర్వాత తన అభిప్రాయం మార్చుకొని వలసవాదానికి వ్యతిరేకంగా శాకాహార వాదాన్ని ఎక్కుపెట్టాడు. బ్రిటీష్‌వాళ్ళు వెళ్ళిపోయాక బీఫ్‌ అనేది ముస్లిం ఆహారంగా ముద్రపడి జాతి వ్యతిరేక వ్యక్తీకరణలో భాగమైంది.

నిజానికి గోవధ నిషేధాన్ని ముస్లిం స్వతంత్ర రాజ్యమైన తెలంగాణాలో అమలైంది. ఆ నిషేధం కోసం పోరాడినవాడు దళితుడు భాగ్యరెడ్డి వర్మ. నిషేధించిన వాడు నిజాం నవాబు (వర్మ గారి కుమారుడు జె. బి. గౌతమ్‌ ఇంటర్వ్యూ. ఆంధ్రజ్యోతి 10-11-2002)

కంచి పరమాచార్యులు శాకాహార వాదాన్ని వ్యతిరేకించారు. ఆయనకి గాంధీ పట్ల గౌరవం వుంది కాని శాకాహారాన్ని అందరూ ఆశ్రయించడం సరికాదని, దానివల్ల ఆహార సంక్షోభం వస్తుందని అన్నారు.

కంచ ఐలయ్య బీఫ్‌లో విటమిన్స్‌ ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు. మరికొందరు పరిశోధకులు మాంసాహారం కేన్సర్‌కి కారణంగా భావించడం చూస్తున్నాం. నిజానికి ఏది మంచి ఆహారం?

నిజానికి సైంటిస్టులకంటె, ప్రజలకే ఏది మంచి ఆహారమో బాగా తెలుసు. వారి అనుభవమే వారికి తెలియజేసింది. నిజానికి ఆహారం అనేది తరతరాల వృత్తుల్ని బట్టి ప్రవృత్తుల్ని బట్టి వేరువేరుగా వుంటుంది. అందరికీ ఒకే ఆహారం అనేదే ఫాసిజం.

యిప్పుడు యీ ఆహార చర్చల వెనుక ఉపయోగితా విలువ కంటె, రాజకీయమే ప్రధాన కారణం. మనం ఆహారం తింటంలేదు, ఆలోచనల్ని తింటున్నాం (యూజీ). గోవుని పూజించడం, గోమాంసం తినడం రెండూ పక్కపక్కనే వర్థిల్లడమే సనాతనం. గోపంచకాన్ని పవిత్రమైనదిగా బ్రాహ్మణులు భావిస్తారు. గోపంచకాన్ని వ్యవసాయ వర్థకంగా రైతులు భావిస్తారు. గోమాంసాన్ని అమృతంగా దళితులు భావిస్తారు. (డక్కలి జాంబ పురాణం) వైరుధ్యాల సమన్వయమే సనాతనం.

గోరక్షణ కోసం ప్రాణాలివ్వబోయిన దిలీపమహారాజు కథని కాళిదాసు రచించిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత, భవభూతి ఉత్తర రామ చరిత నాటకంలో ఒక బ్రాహ్మణ రుషి గోమాంసాన్ని అతిథికి వడ్డించిన కథని వ్రాశాడు. భారతదేశ వైవిధ్యం అంతుబట్టనిది, సరళ హేతువుకి అందనిది. అలా హేతుబద్ధతకి అందక పోవడంలోనే దాని శక్తి వుంది.

కాని మొత్తం ఆహార చర్చని రెండు శిబిరాల మధ్య బాహాబాహీగా మార్చేసి, యేదో ఒక ఆహార విధానాన్ని ఏకైక బలవర్ధకంగా నిర్థారించాలని చూడడమే ప్రొటెస్టెంట్‌ ఫాసిజం. యిదంతా బ్రాహ్మణ వాదం యొక్క అత్యాధునిక రూపం.

ప్రజాస్వామ్యం-ఫాసిజం, లిబరలిజం-నియంతృత్వం యిటువంటి ద్వంద్వాలకి అర్థం లేకుండా చేసింది అమెరికనిజం. అందువల్ల యిటువంటి చర్చలో భాగంగా కాకుండా, చర్చకి బయటవుండి గమనించడం ద్వారా మాత్రమే సత్యాన్ని తెలుసుగోగలం.

నిజానికి ఇంగ్లీషు చదువులు చదివినవాళ్ళ నుంచి కాకుండా సామాన్య జనం నుంచి మనం సమాధానాలు వెతకాలి. షిరిడీ సాయిబాబాని పూజించకూడదనడానికి కారణం ఆయన ముస్లిమని, గొడ్డు మాంసం తినడాన్ని సమర్థించాడని టీవీల్లో హిందూవాదులు గొంతుచించుకున్నారు. వాళ్ళకి ప్రజలు సమాధానం ఇస్తూనే వున్నారు. సాయిబాబాని కొలవడం ద్వారా ఆ సమాధానం యిస్తున్నారు. అనుకూలంగా వ్యతిరేకంగా గొంతుచించుకోవడంలో కాదు సనాతన పద్ధతుల్లో దేశ కాలాలకతీతంగా సమాధానం దొరుకుతూనే వుంటుంది.

నిజానికి బీఫ్‌కి ప్రతిష్ఠని తీసుకురాదలిస్తే కంచ ఐలయ్య లాంటి వాళ్ళు క్రైస్తవాన్ని వ్యతిరేకించవలసి వుంది. గ్రామ దేవతలకి రకరకాల జంతువుల్ని బలి యివ్వడం ప్రాచీన ఆచారం. వలస క్రైస్తవుల వల్ల ప్రభావితులైన సంస్కర్తలు యీ విధానాన్ని వ్యతిరేకించారు. గురజాడ కూడా కొండుభట్టీయం నాటకంలో యిటువంటి సంస్కరణని కోరాడు.

‘‘తదన్నాః తస్య దేవతాః’’ అంటుంది రామాయణం. మనం ఎటువంటి ఆహారాన్ని స్వీకరిస్తామో దానినే తమ దేవతకి ప్రసాదంగా పెట్టాలి. మాంసాహారి మాంసాన్నే దైవానికి సమర్పించాలి.

క్రైస్తవం యిటువంటి బలుల్ని మూఢ విశ్వాసంగా కొట్టివేసింది. క్రైస్తవం మూఢవిశ్వాసంగా కొట్టివేసిన విషయాలే నిజమైన సైన్సు అని వాదించినపుడు చర్చ మలుపు తిరుగుతుంది. కాని ఐలయ్యకి కాని హిందూవాదులకి కాని అటువంటి మౌలిక చర్చ అవసరం లేదు. ఎందుకంటె యిద్దరూ క్రైస్తవ ఆధునికతలో భాగంగా వున్నవాళ్ళే. కనీసం చర్చిలో దేవుడికి మాంసాహారాన్ని నైవేద్యం పెట్టాలని, ఆవిధంగా దేవుణ్ణి మానవ జగత్తులోకి తీసుకురావాలని ఐలయ్య కోరవచ్చు.

బీఫ్‌ని మొత్తంగా అగ్రవర్ణ బ్రాహ్మణ వ్యతిరేకంగా చూపడంలో చారిత్రకత లేదు సరికదా విజ్ఞత కూడా లేదు. యిటువంటి చర్చలు ప్రజల బుర్రల్ని మొద్దు బారుస్తాయి. వీళ్ళకి కావలసింది అదే.

ప్రొటెస్టెంట్‌ క్రైస్తవం నుంచి వచ్చిన ఒకే గ్రంథం, ఒకే మతం, ఒకే జీవన విధానానికి విరుగుడు సనాతనంలో లభిస్తూంటుంది. హఠాత్తుగా వినాయకుడు పాలు తాగి, రాముణ్ణి రామాలయాన్ని మరిపిస్తాడు. యింకొంత సేపటికి షిరిడీసాయి పటాల నుంచి విభూతి రాల్తుంది. భగవద్గీతని బైబిలుగా నిలపాలన్న ప్రయత్నం విఫలమౌతుంది. యిదంతా ఒక పౌరాణిక పరిష్కారంగా కనబడ్తుంది.

యివన్నీ మూఢవిశ్వాసాలనీ, సైన్సు వ్యతిరేకమైనవనీ ఆంగ్ల విద్యావంతులు అనవచ్చు కాని సైన్సు వ్యాపింపజేసే మూఢ విశ్వాసాలు మరింత బలీయమైనవి. ప్రముఖ డాక్టర్‌ హెగ్డే స్వయంగా యిటీవల చెప్పినమాట యేమిటంటే బహుళజాతి మందుల కంపెనీలు తమ లాభం కోసం స్వైన్‌ఫ్లూ భయాల్ని వ్యాపింపజేస్తున్నాయి. బిగ్‌బ్యాంగ్‌ థియరీ వెనుక క్రైస్తవ దృక్పథం దాగివుందని యూరోపియన్‌ కమ్యూనిస్టులే వాదిస్తున్నారు. (Reason In Revolt – Alan Woods and Ted Grant)

వాస్తవం ఏమిటి, సత్యం ఏమిటి అనే ప్రశ్నలకి సమాధానాల్ని కంచ ఐలయ్య గారి లాంటి ఆంగ్ల విద్యావంతుల నుంచి, ప్రొఫెసర్ల నుంచి తెలుసుకోవడం మానెయ్యాలి. ఎందుకంటె వారి ఇంద్రియాలు యింగ్లీషు భాషవల్ల సహజ స్పందనని కోల్పోయాయి.

అంతకంటె గ్రామీణ విశ్వాసాల్లోనే సత్యాన్ని అన్వేషించడం మంచిది. కనీసం వారి విశ్వాసాల వల్ల ఆధునిక తర్కం వ్యాపింపజేస్తున్న ఫాసిజానికి సహజమైన అడ్డుకట్టలు బడ్తాయి. సహజంగా ఏర్పడిన మడ అడవులు వరద ప్రవాహాన్ని నిలువరించినట్లు ఆధునికత తీసుకువచ్చే ముప్పునుంచి గ్రామీణ స్వభావమే కాపాడ్తుంది. ఆంగ్ల జ్ఞానం మాత్రం కాదు.

ఒకప్పుడు బ్రాహ్మణులు చేసిన పాపాన్నే యిప్పుడు కంచ ఐలయ్య చేస్తున్నాడు. గ్రామీణుల పట్ల, సనాతనం పట్ల చిన్న చూపు.

నిజానికి హిందూవాదం మరింత సంస్కరణకి గురవ్వడమే అసలు ప్రమాదం. కేథలిక్‌ క్రైస్తవంలో వున్న బహుళత్వాన్ని చంపి, ప్రొటెస్టెంట్‌ సంస్కరణ వాదం ఫాసిజానికి ద్వారాలు తెరిచింది. సామ్రాజ్యవాదానికి ద్వారాలు తెరిచింది. హిందూయిజం మరింత ప్రొటెస్టెంటీకరణ చెందడం (దళితీకరణ, మండలీకరణ) వల్ల కూడా యిదే ప్రమాదం పొంచి వుంది.

ఒకప్పుడు ప్రజామోదం కోసం స్వదేశీ నినాదాన్ని ఉచ్చరించే హిందూవాదం ఫక్తు బహుళజాతి కంపెనీల యేజెంటుగా మారిపోవడం దీని పరిణామమే. మేక్‌ ఇన్‌ ఇండియా నినాదం దీని పర్యవసానమే.

ఆధునిక బ్రాహ్మణులకే పరిమితమైన హిందూవాదం నాజీ ఫాసిజంలా ప్రజా సమూహాల్లోకి సామాన్య జనంలోకి చొచ్చుకుపోవడం దళిత బహుజన రాజకీయాల వల్ల సులభమైపోయింది. బ్రాహ్మణ వాద విస్తరణ కోసం యీ రాజకీయాల కృషి తీవ్రమైనది.

మనం గుడి రాజకీయాల్ని అర్థం చేసుకోవడానికి చర్చి రాజకీయాల్ని అర్థం చేసుకోవాలి. హిందూవాదాన్ని అర్థం చేసుకోవడానికి క్రైస్తవాన్ని అర్థం చేసుకోవాలి.

వై ఐయామ్‌ నాట్‌ ఎ హిందూ’ గ్రంథంలో కంచ ఐలయ్య కట్ట మైసమ్మ లాంటి గ్రామీణ దేవతల్ని ప్రస్తావిస్తారు. ఆ దేవతల్నీ ఆ ఆచారాల్నీ పూనకాల్నీ మూఢ విశ్వాసాలుగా కొట్టివేస్తూనే క్రైస్తవ చర్చి విస్తరించింది.

బ్రాహ్మణ ఆచారాలకంటె, శూద్ర, అతిశూద్ర ఆచారాలపైనే యెక్కువ దాడి చేసింది చర్చి. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదట క్రైస్తవ మిషనరీలని వ్యతిరేకించింది మాలదాసరులు. (ఆంధ్రుల చరిత్ర – బి ఎస్‌ ఎల్‌ హనుమంతరావు) అలాగే బిర్సా ముండా అనే గిరిజనుడు క్రైస్తవానికి వ్యతిరకేకంగా సూర్య ఆరాధనని బోధించి పోరాడి అమరుడయ్యాడు.

బ్రాహ్మణుల్ని క్రైస్తవం వ్యతిరేకించలేదు. క్రైస్తవాన్ని బ్రాహ్మణులు వ్యతిరేకించలేదు. బ్రాహ్మణులు తెలివిగా క్రైస్తవాన్ని బ్రాహ్మణీకరించడానికి ప్రయత్నిస్తూ వచ్చారు. క్రైస్తవులు బ్రాహ్మణ్యాన్ని క్రైస్తవీకరించడానికి ప్రయత్నిస్తూ వచ్చారు.

బైబిల్ని వేదంతో పోల్చడం ద్వారా బ్రాహ్మణుల్ని ఒప్పించడం కోసం వేదాల్ని అధ్యయనం చేశారు క్రైస్తవులు. ఒక పాశ్చాత్య క్రైస్తవుడు జగద్గురు తత్వ బోధక స్వామి అని పేరు మార్చుకొని, బైబిలే నిజమైన వేదమని బోధించాడు. అతడు రహస్యంగా వేదాన్ని అభ్యసించాడు. అతడి పేరు రాబర్టోడీ నోబిలీ (17వ శ.) (కథలు గాథలు – దిగవల్లి శివరావు)

మాక్స్‌ ముల్లర్‌ వేదాధ్యయనం వెనక క్రైస్తవ వ్యాప్తే అసలు ఉద్దేశ్యం. బ్రాహ్మణుణ్ణి సంస్కరించాలనే క్రైస్తవుల లక్ష్యం నుంచే బ్రాహ్మణ వాదం పుట్టింది.

బ్రాహ్మణ సంస్కృతితో పోలిస్తే, శూద్ర కులాల సంస్కృతి అనాగరికమైందని వ్యాఖ్యానించారు. వారి బలులనీ పూనకాలనీ మూఢవిశ్వాసాలుగా కొట్టి వేశారు. అంతరింప జేయాలన్నారు. యీ పని చేసింది బ్రాహ్మణులు కాదు క్రైస్తవులే. (దక్షిణ భారత గ్రామ దేవతలు – హెన్రీ వైట్‌ హెడ్‌)

యిలా క్రైస్తవుల ప్రయత్నం వల్ల శూద్ర సంస్కృతి క్షీణించింది. దాని స్థానాల్లో వలస బ్రాహ్మణ సంస్కృతి (బ్రాహ్మణ వాదం) విస్తరించింది. అదే దళిత వాదంగా పేరు మార్చుకుంది.

దళిత పాంథర్స్‌ కొందరు హిందూవాద పార్టీల్లో సభ్యులు కావడాన్ని అరుంధతీ రాయ్‌ ప్రస్తావించింది, (అన్‌హిలేషన్‌ ఆఫ్‌ క్యాస్ట్‌ ముందు మాటలో), యిది యాదృచ్ఛికం కాదు. కంచ ఐలయ్య కూడా క్రైస్తవ మతాంతరీకరణలోని గొప్పతనాన్ని గురించి పదే పదే మాట్లాడడం ద్వారా తన శూద్ర సంస్కృతిని తానే రద్దు చేసుకుంటున్నాడు. మోడీలో బహుజన విముక్తిని కలగనడంతో తన సంస్కృతి నుంచి తాను పూర్తిగా విముక్తి చెందాడు ఐలయ్య.

స్థానిక సంస్కృతులన్నిటితో బాటు ఇస్లాంని కూడా టార్గెట్‌ చేసింది క్రైస్తవమే. చర్చిలలో పంచే ప్రొటెస్టెంట్‌ క్రైస్తవ సాహిత్యంలో అరబ్బులపైన ముస్లింల పైన తీవ్రమైన దాడి కనబడ్తుంది. క్రైస్తవ దేశాలు నిలబెట్టిన యిజ్రాయిలుని యూదులకి దైవం ప్రసాదించిన దేశంగా వర్ణించడం, పాలస్తీనా వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కనబడ్తాయి. యివే భావాలు హిందూవాదులు అరువు తెచ్చుకుంటున్నారు. దీన్ని గురించి ఐలయ్య ప్రస్తావించడు. పైగా క్రైస్తవులని ముస్లింలు గురువులుగా స్వీకరించి సంస్కరించబడాలని అంటాడు.

దీని భావమేమి తిరుమలేశ! కంచ ఐలయ్య హిందూవాదులకీ క్రైస్తవ దేశాలకీ మధ్య దుబాసీ కాదు కదా. కొంపముంచి యీయన నుండి మరో ‘దళారీ పశ్తాత్తాపం’ వెలువడదు కదా!

సూచన : ఈ వ్యాసంలో నేను ప్రస్తావించిన విషయాలకు సంబంధించిన ఐలయ్య ఇంగ్లీషు వ్యాసాలు, ఇంటర్వ్యూలూ ఇంటర్నెట్‌లోనూ, యూట్యూబ్‌ లోనూ లభిస్తున్నాయి.

– రాణి శివశంకర శర్మ

(రాణి శివశంకర శర్మ ‘ది లాస్ట్‌ బ్రాహ్మిణ్‌’ గ్రంథ రచయిత. పురాణ వేదం, అమెరికనిజం, గ్రహాంతర వాసి యితర ప్రధాన రచనలు).

కంచ ఐలయ్య వ్యాసాలు కొన్నింటికి లింక్స్:—

 1. Cultural Globalisation (Outlook)
 2. Ghar wapsi in the American embassy? (The Asian Age)
 3. The Muslim stagnation
 4. Untouchables & Muslims (Islami City.com)
 5. The Rise Of Modi (Outlook)
 6. Modi: Lincoln or Bush? (Deccan Chronicle)

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి.
Posted in 2015, ఏప్రిల్, వ్యాసం and tagged , , , , , , , .

50 Comments

 1. ఒక మతం లో ఉంటూ, ఒక మతానికి సంబందిచి Sheppard (పశువుల కాపరి) గా ఉంటూ, వేరే మతానికి సంబంధించిన కులాల మీద విడి విడి గా దాడి చేస్తూ అంతర్లీనంగా హిందూ మతం మీద కంచ ఐలయ్య గారు దాడి చేయటం గర్హనీయం.

  ఇది ఉగ్రవాడుల బౌతిక దాడుల కన్నాప్రమాదకరమైన సంకేతం. గౌ||కంచ ఐలయ్య గారికి సంబందించిన మత పెద్దలు కుడా అతని దోరణిని కండించవలసిన పరిస్టితి ఉంది.

  ఫైగా ప్రస్తుతం ఒక వైశ్య కులానికి చెందినవారు మాత్రమే కాకుండా, హిందూ మతస్తులందరూ కండించవలసిన విషయం..

  అన్ని కులాలు కలిస్తే ఒక మతం అని చదువుకున్నాం! మనది మానవతా కులం అనుకున్నాం!

  ఒక కులాన్ని గాని మతాన్ని గాని విమర్శించే హక్కు ఎవరికుంది, కనీసం ఆ కులం కాదు మతం అంతకన్నా కాదు,
  నువ్వెలా విమర్శిస్టావ్!

  కులాలు వేరైనా మతం ఒక్కటే!!!

  నీది కాని మతం గురించి నీకేల, ఇదేనా విద్యాదికులు చేయవలసిన పని, హిందూ మతం లోని ఒక కులం గురించి అన్యేతరులు మాట్లాడటం అసమంజసం.

  దేశం లో అత్యదికులు ఉన్న ఒక హిందూ మతం లోని ఒక కులం గురించి నువ్వు ఎలా మాట్లాదతావ్!!!

  ఎంత మంది మనసులు నోచుకున్తున్నాయో తెలుస్తుందా!!

  ఇది తెలియని వారు విజ్ఞులు ఎలా అవుతారు మీరే ఆలోచించండి.

  జి. టి. రావు
  ట్రైనర్
  gtrao.trainer@gmail.com

 2. రాణీ శివ శంకర శర్మ గారి రచనలలో, నేను చదివిన వాటిల్లో అత్యంత ఉత్తమైన వ్యాసం. పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఇది కేవలం ఐలయ్య గురించి కాదు. ఐలయ్యని నిమిత్తమాత్రం గా తీసుకున్నారు.

 3. శ్రీనివాసుడుగారు,నమస్కారం.చాలా కాలం తరువాత మీ మాట వినడం సంతోషం. సమానహృదయం కలవారి మాట కలవడం కంటే సంతోషం ఏముంటుంది? మీరన్నది నిజం. వినిపించుకోని వారితో మాటలాడడం వ్యర్థం. అందుకే నేను ఇటీవల సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నాను. మనమాట వినేవారిసంఖ్య తగ్గిపోయింది. మీరిచ్చిన లింకులు తప్పక చూస్తాను. ధన్యవాదాలు. కినిగె పత్రిక తిరిగి కనిపిస్తుందని కనిపించవలెనని మీలాగే ఇంకా చాలామంది పాఠకులవలె నేనూ కోరుకొంటున్నాను.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.