cover

బ్రాహ్మణవాది కంచ ఐలయ్య

Download PDF EPUB MOBI

‘వై ఐయామ్‌ నాట్‌ ఎ హిందూ’ అనే మౌలిక ప్రశ్నను రేకెత్తించిన ఐలయ్య, చివరికి ఆ ప్రశ్నని బ్రాహ్మణ వాదంలో లయం చెయ్యడం నేటి విషాదం.

ఫాసిజం డైనమిక్‌గా పనిచేస్తుంది. అది తర్కం కోసం సమయాన్ని వెచ్చించదు. అప్పటికే దానికి కావలసిన తర్కాన్ని ప్రగతిశీలురనే ప్రతిష్ఠ పొందిన మేధావులు అందిస్తారు. దీనికి కారణం ఏమిటి?

మీరు పరిశీలించండి. యూరప్‌లోనైనా భారతదేశంలోనైనా నాజీలూ హిందూవాదులూ గొప్ప సృజనశీలమైన వ్యక్తీకరణ శక్తి గలవారు కారు. మూర్ఖమైన పడిగొట్టు పదాలూ, మాటల్లోనూ, చేతల్లోనూ దాడిచేసే దుందుడుకుతనం వారి స్వభావం. ‘అబద్ధం వా సుబద్ధం వా కుంతీ పుత్రో వినాయకః’ అన్నట్లు తాము పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనేది వారి తంతు.

కాని వట్టి మూఢ విశ్వాసాలపైన ఫాసిస్టులు ఆధారపడ్తారనే వాదన తప్పు. నేడు మనం మూఢ విశ్వాసాలుగా భావించే వాటి వెనక కూడా వొక తర్కం, ఆలోచన పనిచేయడం వల్లే అవి మనగలిగాయి. మానవుడు ఆలోచనా జీవి. ఆలోచన, తర్కం లేకుండా యాంత్రికంగా పనిచేశాడన్న వాదన కుదరదు. భూమి బల్లపరపుగా వుందన్న విశ్వాసానికి కూడా దాని తర్కం దానికి వుండేది. దాని వెనక కూడా మానవ ఆలోచనా క్రమం పనిచేసింది కాని దానికంటే మెరుగైనదనిపించే ఆలోచన దాన్ని కొట్టేసింది.

ఫాసిజం, హిందూవాదం కూడా ఆలోచన లేకుండా పనిచేయవు. అసలు మానవ ఆలోచనే ఫాసిస్టు. మానవుడు తనని ప్రకృతి నుంచి తోటివారి నుంచి వేరు పరచుకొని వొక తెగగా జీవిస్తూ, మరొక తెగపై దాడి చేయడంలో ఫాసిజానికి ప్రాచీన మూలాలు వున్నాయి. యిదే పద్ధతి నేటి వరకు కొనసాగింది.

యూరోపియన్‌ ఫాసిజానికి మూలాలు ప్రొటెస్టెంట్‌ క్రైస్తవంలో దాని యూదు ముస్లిం వ్యతిరేకతలో వున్నాయి. ప్రొటెస్టెంటిజానికి మూల పురుషుడు మార్టిన్‌ లూథర్‌ ఆలోచనల్లో యిటువంటి ద్వేషం క్రూరంగా వ్యక్తమైంది. అలాగే హెగెల్‌ లాంటి తత్త్వవేత్తలలోనూ, మేధావులలోనూ యిటువంటి ఆలోచనలు ఉన్నాయి. యీ ఆలోచనా ధారే హిట్లర్‌ ఫాసిజానికి హేతుబద్ధతని అందించింది. అంటే దాని వెనక గొప్ప గొప్ప బుర్రలే పనిచేశాయి. (రైజ్‌ అండ్‌ ఫాల్‌ ఆఫ్‌ థర్డ్‌ రీక్‌ – విలియం. ఎల్‌. షీరర్‌).

భారతదేశంలో హిందూ ఫాసిజానికి మూలాలు యూరోపియన్‌ నేషనలిజం నుంచి స్ఫూర్తి పొందిన వీరసావర్కార్‌, గోల్వాల్కర్‌, నారాయణ ఆప్టే లాంటి ఆధునిక బ్రాహ్మణ మేధావుల్లో వున్నాయి. ఐతే వీరెవరూ స్వతంత్ర చింతనాపరులు కారు. వీరు పాశ్చాత్య ప్రొటెస్టెంటిజానికీ, జాతీయవాదానికీ, వాటికి కొనసాగింపైన ఫాసిజానికీ వారసులు. వీరు వలస మేధావులు, వలస బ్రాహ్మణులు, నయా బ్రాహ్మణులు. పెరియార్‌కైనా, అంబేద్కర్‌కైనా, నేటి కంచ ఐలయ్య కైనా మూల పురుషులు వీళ్ళే.

అదేమిటి బ్రాహ్మణులంటే కంచ ఐలయ్య గారన్నట్లు ఇరవై కూరలూ నెయ్యితో భోంచేస్తూ, పూజా పునస్కారాలు చేసేవాళ్ళు కదా? అంటే అది నిజం కాదు. హిందూత్వ సిద్ధాంతానికి మూలపురుషుడుగా చెప్పబడే సావర్కార్‌ పరమ నాస్తికుడు. గోవుల్ని పూజిస్తూ గుళ్ళచుట్టూ తిరిగే వాళ్ళని అవహేళన చేశాడు. తాను చనిపోయినపుడు కర్మకాండ జరపవద్దని వీలునామా రాసిన తీవ్ర హేతువాది సావర్కార్‌. ఈయన పాశ్చాత్య జాతీయవాదం మంచి స్ఫూర్తి పొంది విశాల హిందూ ఐడెంటిటీ గురించి కలగన్నాడు. మిగిలిన హిందూ వాదులు కూడా ఆంగ్ల విద్య నభ్యసించి, కులాలకు అతీతంగా ముస్లింలకి వ్యతిరేకంగా బౌద్ధ, జైన ‘హిందూ’ మతాల వారిని ఒకే గొడుగు కిందికి తెచ్చి విశాల హిందూ జాతీయవాదాన్ని తీసుకు రావాలని సంకల్పించిన ఆధునికులు.

యీ ఆధునిక బ్రాహ్మణులు బహుళత్వంతో మీమాంస, వేదాంత, వైష్ణవ, శైవాది భేదాలతో కూడిన ధార్మిక అస్తిత్వాన్ని పక్కన పెట్టి, పాశ్చాత్య, క్రైస్తవ తరహా జాతీయవాదం కోసం ఉవ్విళ్ళూరారు. దానికోసం వాళ్ళు తమ బ్రాహ్మణ వారసత్వాన్ని విడనాడారు. పాశ్చాత్యాన్ని అనుకరించారు. స్థానికంగా బ్రాహ్మణేతరుణ్ణి అనుకరించారు. అతడే వివేకానంద స్వామి.

ప్రాచీన బ్రాహ్మణుడి ఆత్మహననం నుంచి ఆధునిక బ్రాహ్మణుడు పుట్టాడు. యీ ఆధునిక బ్రాహ్మణుని అనుకరణే బ్రాహ్మణ వాదం. అది వలస క్రైస్తవ అనుకరణకి మారుపేరు. బ్రాహ్మణవాదమే బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలకి మూలం.

బ్రాహ్మణుడు ఆధునికీకరించబడ్డాడు. వలసీకరించబడ్డాడు. బ్రిటీష్‌ కొలువుల్లో చేరి, అందరికంటె ముందే నగరాలకి వలస పోయాడు. 19వ శతాబ్దానికి ముందే బెంగుళూరు నగరానికి పెద్దెత్తున తరలిపోయిన వారు వివిధ శాఖల బ్రాహ్మలు. మొదట బ్రాహ్మలకి వాళ్ళలో వాళ్ళకే విభేదాలు మొదలయ్యాయి. వివిధ శాఖల మధ్య కొట్లాటలు మొదలయ్యాయి. తరువాత తమిళ బ్రాహ్మలకీ, కర్ణాటక బ్రాహ్మణులకీ కొట్లాటలు మొదలయ్యాయి. యిదంతా నగరాల్లోని బ్రిటీష్‌ కొలువుల కోసం స్థానికులకే ఉద్యోగాలు అనే నినాదం ఆరోజుల్లోనే మొదలైంది కాని దాని అర్థం స్థానిక బ్రాహ్మణులకే ఉద్యోగాలు అని. తర్వాత లింగాయతులు లాంటి సంపన్న శూద్ర కులాలు బ్రాహ్మణ వ్యతిరేక వాదాన్ని లేవనెత్తాయి. యిది కూడా బ్రిటీష్‌ కొలువుల కోసమే. ‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష’ అన్నట్లు యీ ఉద్యోగ స్వామ్యం బ్రాహ్మణుల నుంచి యితరులకీ పాకింది. (బియింగ్‌ బ్రాహ్మణ్‌, బియింగ్‌ మోడర్న్‌ – రమేష్‌ బైరీ)

తమిళనాడులో పెరియార్‌ పుట్టుకొచ్చింది యీ తర్కం నుంచే. యీ తర్కంలోనే హిందూ వాదం దాగి వుంది. ఎందుకంటే నువ్వు నీ వర్గానికీ కులానికీ యెక్కువ ఉద్యోగాలు సంపాదించాలంటే, యితరుల్నీ, యితర వర్గాల్ని తరిమికొట్టాలి. అందుకే పెరియార్‌ బ్రాహ్మణులతో పాటు ముస్లింలని కూడా ద్వేషించాడు. యీ యిద్దరి వల్ల శూద్రులకి ఉద్యోగాల్లో తగిన స్థానం లభించడం లేదని వాదించాడు. మైనార్టీలకి ప్రత్యేక హక్కులనే భావనని మొదట్లోనే తుంచెయ్యాలని చూశాడు. అందుకే పెరియార్‌లో హిందూత్వాన్ని బట్టబయలు చేస్తున్నారు కొందరు ప్రగతిశీల మేధావులు. (పెరియార్స్‌ హిందుత్వ – రవికుమార్‌)

యీ పెరియార్‌ తర్కం నుంచే దళితులలో కొందరు మరికొందరి హక్కుల్ని కాలరాయాలని చూస్తున్నారు, ప్రతిభాహీనులని కూడా నిందిస్తున్నారు.

విశాల ఏకీకరణ అనేది కొందర్ని వేరుపరచడం, వెలివేయడం ద్వారా సాధ్యమౌతుంది. ఒకే జాతి, ఒకే మతం, ఒకే దేశం అనే భావనల్లోని ఏకత్వం సాధ్యం కావాలంటే కొందరు శత్రువులు అవసరం. మనిషి తీవ్ర ద్వేషం, భయం ద్వారానే గుంపు కడ్తాడు. భారతదేశం ఒకే జాతిగా ఎప్పుడూ లేదు. విద్యానాధుడు అనే కవి ‘ప్రతాపరుద్రీయం’లో ప్రతాపరుద్రుని గర్జనని ‘రేరే ఘూర్జర జర్జరోసి సమరే లంపాక కిం కంపసే’ ఇత్యాదిగా రాశాడు. అంటే ఘూర్జర, లంపాక యిత్యాది అనేక రాజ్యాలని గురించి ప్రస్తావించాడు. ఆ రాజులపై గర్జించాడు. అంటే వివిధ రాజ్యాలు ఉన్నాయి కాని ఒకే జాతి లేదు, ఆ జాతిని కలపగల ఒకే మతమూ, విశ్వాసమూ లేవు.

బ్రాహ్మణులందరూ ఒకటి కాదు. బ్రిటీష్‌ కాలంలో మధ్వులు స్మార్తులు నశించాలని పూజలు చేసేవారు. (బియింగ్‌ బ్రాహ్మిన్‌ – బియింగ్‌ మోడర్న్‌), మధ్వాచార్యులు శంకరుణ్ణి రాక్షసుడని నిందించాడు. అందుకే బ్రాహ్మణ మతం అంటూ ఏమీ లేదు. హిందూమతం అనేది ప్రచ్ఛన్న క్రైస్తవం తప్ప మరేమీ కాదు.

ఆల్‌బెరూనీ (11వ శతాబ్దం) భారతదేశంలో మాటల యుద్ధం తప్ప మత యుద్ధం అనదగ్గదేదీ లేదని రాశాడు. కాని తరువాతి కాలంలో శైవ వైష్ణవ విద్వేషాలు హింసాత్మకంగా మారడం కనబడ్తుంది. యివి మోనోథీయిస్టు మతాల అనుకరణ నుంచి వచ్చి వుండవచ్చు కాని, వీటి సమన్వయం కూడా సాధ్యమైంది. అదే శివ విష్ణువులు ఒకటేనన్న హరి హర అద్వైత సిద్ధాంతం. తిక్కన భారతంలోని ప్రతి ఆశ్వాసంలోనూ హరిహరమూర్తిని ప్రార్థిస్తూ పద్యాలు రాశాడు.

అంటే భారతదేశంలో పుట్టుకొచ్చే విశ్వాసాల మధ్య విద్వేషం కొంగ్రొత్త విశ్వాసాల ద్వారానే పరిష్కరించబడ్తుంది. తర్కం ద్వారా కాదు. ఎందుకంటె ఆలోచన అనేదే ఫాసిస్టు. నువ్వు ఎంత హేతుబద్ధంగా తర్కాన్ని నిర్మిస్తే అన్ని పగుళ్ళు దానిలో ఏర్పడ్తాయి. అందువల్ల ఆలోచన ద్వారా వచ్చే సమన్వయం సమన్వయం కానే కాదు.

బాబ్రీ మసీదుని హిందూవాదులు కూల్చేసినపుడు వి. ఎస్‌. నయీపాల్‌ అనే మేధావి ఆ చర్యని ‘యాక్ట్‌ ఆఫ్‌ హిస్టారికల్‌ బ్యాలెన్సింగ్‌’ గా సమర్ధించాడు. తర్కం ద్వారా ఏర్పడే బాలన్స్‌ యిలా వుంటుంది. ఆలోచన, తర్కం అనేవి ఒక వ్యక్తి, వర్గం యొక్క స్వార్థాన్ని ప్రతిబింబించక తప్పదు.

కనుక కార్యకారణ సంబంధానికి అతీతంగా స్థలకాలాల కతీతంగా స్పాంటేనియస్‌గా సహజంగా వచ్చే ప్రతిస్పందనల ద్వారా శాంతి, సమన్వయం సాధ్యపడ్తూ వుంటుంది. యిటువంటిది భారతదేశంలో ఎంతో సృజనాత్మకంగా వ్యక్తీకరించబడ్తూ వుంటుంది. నక్సలిజం ఆవిర్భావంలో కూడా యాదృచ్ఛికత పాత్ర యెక్కువ అని సబాల్టర్న్‌ స్టడీస్‌కి చెందిన మేధావులు అంటారు. కలకత్తా కాళికారాధన బెంగాల్‌ నక్సలైట్‌ ఉద్యమానికి అవ్యక్త ప్రేరణగా నిలిచిందని ఒక మేధావి తనతో చెప్పినట్లు నయపాల్‌ రాశాడు. (ఇండియా, ఎవూండెడ్‌ సివిలైజేషన్‌)

ప్రకృతిలో సమాజంలో సమన్వయాన్ని నిలిపే పని హేతువుకి అతీతంగా సహజంగా జరిగిపోతుంటుంది భారతదేశంలో. దీన్నే నేను సనాతనం అంటాను. సనాతనం అంటే స్థల కాలబద్ధం కానిది. అంటే స్పష్టమైన వివరణకి అందనిది అన్న మాట.

ఇటీవలి కాలానికి వస్తే హిందూత్వ అభివృద్ధి నినాదంతో ప్రకృతి విధ్వంసమూ విద్వేషమూ కలగలిసి విజృంభించాయి. దీనికి సమాధానంగా రెండు శక్తులు హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాయి. ఒకటి రాజకీయపరమైనది, రెండు విశ్వాస పరమైనది 1) ఢిల్లీలో ఆప్‌ విజయం 2) షిరిడీ సాయి బాబాపై చర్చ.

కంచ ఐలయ్యగారు షిరిడీసాయి బాబా వివాదం గురించి మౌనం వహించారు. ఆప్‌ని అంబేద్కర్‌వాద వ్యతిరేకిగా ముద్ర వేశారు. యీ వైఖరుల గురించి చర్చించాలి మనం.

యీ రెండు వివాదాలూ యించుమించు ఒకే సమయంలో సంభవించాయి. ఒకటి రాజకీయ వివాదం రెండోది ధార్మికమైన మతపరమైన వివాదం. యీ రెండూ హిందూత్వకి సమాధానాలుగా వచ్చినవే.

ఆమ్‌ ఆద్మీ పార్టీపై కంచ ఐలయ్య గారు విరుచుకు పడ్డారు. అది అంబేద్కరిజాన్ని మరుగుపరుస్తూ, లోహియా వాదాన్ని పైకెత్తుతూ దూసుకువచ్చిన బనియాల పార్టీ అన్నారు. ఈ సందర్భంగా ముగ్గురు బనియాలపై విరుచుకు పడ్డారు. వాళ్ళు గాంధీ, రామ్‌ మనోహర్‌ లోహియా, అరవింద్‌ కేజ్రీవాల్‌. వీళ్ళ వల్ల మండల్‌ కమీషన్‌ స్ఫూర్తి దెబ్బతింటోందని కూడా అన్నారు.

రామ్‌మనోహర్‌ లోహియాని నిందించిన కంచ ఐలయ్య, నెహ్రూ బ్రాహ్మణుడై నప్పటికీ అంబేద్కర్‌ని అర్థం చేసుకోవడానికి మార్గంగా ఉపయోగిస్తాడని వ్యాఖ్యానించాడు.

బ్రాహ్మణుడైనప్పటికీ నెహ్రూ అంబేద్కర్‌ వాదానికి మార్గదర్శకుడెలా అయ్యాడు? బనియాలపై కంచ ఐలయ్య ప్రత్యేక ద్వేషానికి కారణమేమిటి? దీన్ని గురించి మనం ఆలోచించవలసి వున్నది.

గాంధీ కాని రామ్‌మనోహర్‌ లోహియా కాని యంత్ర నాగరికతని, బడా పరిశ్రమల్ని వ్యతిరేకించారు. ఇవి ఆసియాలో పనికిరావని, ప్రత్యామ్నాయ నాగరికతని ఆలోచించవలసి వున్నదని భావించారు. రామ్‌మనోహర్‌ లోహియా కమ్యూనిస్టులూ, పెట్టుబడిదారులూ యిద్దరూ ఆకాశానికెత్తుతున్న నగరీకరణనీ భారీ సాంకేతికతనీ వ్యతిరేకించాడు. అంటే వలస వాద ఆధునికతపై విమర్శనాత్మక దృష్టి వీరిది. లోహియా నెహ్రూ ఆడంబర జీవిత విధానంపై పార్లమెంటులో కూడా విరుచుకు పడేవాడు.

ఆధునిక బ్రాహ్మణుడు నెహ్రూ ఏం చేశాడు? భారీ పరిశ్రమల్నీ, భారీ ప్రాజెక్టుల్నీ ఆధునిక దేవాలయాలుగా కీర్తించాడు. అందుకే కుటీర పరిశ్రమలకి చిహ్నమైన చరఖాని జాతీయ జెండాపై చేర్చాలన్న ప్రతిపాదనని తిరస్కరించాడు. పైగా వేగానికి చిహ్నమైన చక్రాన్ని జెండాపై చేర్చడం ద్వారా యంత్ర నాగరికతకి స్వాగతం పలికాడు. బౌద్ధ చక్రం బౌద్ధుల వ్యాపార దృక్పథాన్ని కూడా ప్రతిబింబిస్తుంది.

గాంధేయ గ్రామీణ స్వరాజ్య చిహ్నమైన చరఖాని జాతీయ జెండా నుంచి తొలగించడాన్ని హిందూ బ్రాహ్మణుడైన సావర్కార్‌ స్వాగతించాడు. ఈ విధంగా పరస్పర భిన్న దృక్పథాలు కలవారిగా కనబడే సావర్కార్‌, నెహ్రూలు ఒకే ఆధునిక దృక్పథం గలవారిగా నిరూపించుకున్నారు. (సావర్కార్‌ హిందూత్వ – ఎ.జి. నూరాని) వారి వారసుడే కంచ ఐలయ్య. అందుకే కేజ్రీవాల్‌ని బనియాగా మండల వ్యతిరేకిగా నిందించి ఫక్తు హిందూవాది నరేంద్రమోడీని మండలీకరణకు మార్గం ఏర్పరుస్తున్న వాడిగా కీర్తించాడు.

కంచ ఐలయ్యకి బనియాలంటే ద్వేషం. బ్రాహ్మణులంటే బ్రాహ్మణ వాదమంటే ప్రేమ. బ్రాహ్మణ వాదానికి వారసులైన శూద్రులపట్ల కూడా ప్రేమే. కారణం కంచ ఐలయ్య ఫక్తు బ్రాహ్మణ వాది.

బ్రాహ్మణులే వలసవాద ఆధునికతని మొదట అందిపుచ్చుకున్నవాళ్ళు, బ్రాహ్మణ సంస్కర్తలే మొదట బ్రిటీష్‌ వాళ్ళనీ, వాళ్ళ పరిపాలననీ, వాళ్ళ జ్ఞానాన్నీ కీర్తించారు. ప్రాచీన భారతీయ విలువల్ని మొత్తంగా మూఢ విశ్వాసాలుగా కొట్టివేశారు. ఉదాహరణ – వీరేశలింగం, గురజాడ మొదలైనవాళ్ళు. వీరినే దళిత, బహుజన వాదులు అనుకరిస్తున్నారు.

గాంధీ, లోహియాలాంటి బనియాలు ఇంగ్లీషు భాషనీ, పాశ్చాత్య విలువల్నీ ప్రశ్నకి గురి చేశారు. మొత్తంగా పాశ్చాత్య పారిశ్రామికీకరణనే ప్రశ్నించారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ మొత్తంగా పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకి కాకపోయినా, హిందూ కార్పొరేట్‌ విధానాలు దూసుకువస్తున్న సమయంలో ఒక అడ్డుకట్టగా నిలబడ్డాడు. ప్రజల మౌలిక అవసరాల గురించి మాట్లాడడం ద్వారా కార్పొరేట్‌ మాయాజాలంపై ప్రశ్నని సంధించాడు. ఈ బనియా సంస్కృతిని బ్రాహ్మణవాదం (హిందూవాదం) ద్వారా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు కంచ ఐలయ్య. ఐలయ్య లాగే హిందూవాదులు కూడా కేజ్రీవాల్‌ని కులం పేరుతో నిందించడం గమనార్హం.

బనియాలు బ్రాహ్మణులకంటె భిన్నంగా స్థానిక సంస్కృతి పునాదుల్ని కలిగి వుండడానికి కారణమేమిటి? బౌద్ధ మాయావాదం వీరిని సోకకపోవడమే కారణం కావచ్చు. జైనం, వైష్ణవం యీ రెండూ బనియా సంస్కృతిలో భాగాలు. యివి రెండూ జగత్తు సత్యమని సిద్ధాంతాన్ని బలంగా స్థాపించాయి. పైగా ప్రపంచం బహుళత్వంతో కూడి వున్నదనే సత్యాన్ని స్థాపించాయి. రామానుజ వైష్ణవంపై జైనం ప్రభావం వుందని మాధవాచార్యులు సర్వదర్శన సంగ్రహంలో రాశాడు. గాంధీలో యీ రెండు సిద్ధాంతాల ప్రభావం కనబడ్తుంది. అందుకే గాంధీ ఎప్పుడూ జగత్తు మిథ్య అని అనలేదు.

మహాయాన బౌద్ధమే మొదటి మాయావాదాన్ని స్థాపించింది. జగత్తు స్వప్నం వలె మిధ్య అని ఆ సిద్ధాంత సారాంశం. దానినే శంకరాచార్యులు అనుసరించాడు. ఈ మాయావాదాన్నే కొత్త రూపంలో అమెరికాకి మోసుకువెళ్ళి విశ్వవ్యాప్తం చేశాడు వివేకానంద.

యిప్పుడు నయాశంకరుడైన వివేకానందుడినే ఆధునిక బ్రాహ్మణులు ఆరాధిస్తారు. ఎందుకంటె అమెరికన్‌ జీవిత విధానంలో ప్రాక్టికల్‌ వేదాంతం వుందని ఆయన అన్నాడు. అంటే అర్థమేమిటి అమెరికన్‌ అత్యాధునిక కార్పొరేట్‌ జీవిత విధానమే అద్వైతం అన్నమాట.

దీనితో కంచ ఐలయ్యకి విభేదం ఏమీ లేదు. ఎందుకంటె కంచ ఐలయ్య కూడా మాయావాదే. సకల సమస్యలకీ పరిష్కారం భాషలో వుందని కంచ ఐలయ్య వాదన. అది ఇంగ్లీషు భాషలో వుంది. అంటే భౌతిక జగత్తు అనేది మిధ్య. అన్ని సమస్యలూ భాషా సమస్యలే. మన భాషని సంస్కరించుకుంటే చాలు అంటే ఇంగ్లీషు భాషని అభ్యసిస్తే చాలు. సకల సమస్యలూ పరిష్కారమవుతాయి.

భూమి సమస్య, గిరిజనుల ఆవాస సమస్య, నీటి సమస్య అన్నీ అన్నీ… ఇంగ్లీషు నేర్చేసుకుంటే పరిష్కారమైపోతాయి. మానవ సమాజపు సకల సమస్యల పరిష్కారానికీ ఒకే ఒక మార్గం భాష, ఇంగ్లీషు భాష. యిదే బౌద్ధం యొక్క అత్యాధునిక మాయా వాదం. ఎందుకంటె కంచ ఐలయ్య బౌద్ధుడే. (ఆంగ్లం ద్వారా అందు కోవాలనుకుంటున్న కార్పొరేటీకరణ కూడా మాయాజాలమే).

కంచ ఐలయ్య నేల గురించి, నీటి గురించి ఎప్పుడూ మాట్లాడకపోవడం యీ మాయావాదంలో భాగమే. ఒక బహుళజాతి సంస్థ పేరు వేదాంత. ఈ కంపెనీ వల్ల తాము నిర్వాసితులమౌతామని గిరిజనులు పోరాడుతున్నారు. యిటువంటి పోరాటాల్ని కంచ ఐలయ్య పట్టించుకోరు. కారణం యీ సమస్యలన్నీ మిథ్యాపూర్వకమైనవి. భాషలో మాత్రమే అడవులూ గిరిజనులూ వున్నారు. వాస్తవంగా వారి వునికి భాషాగతమైంది మాత్రమే. అందువల్ల చక్కని ఇంగ్లీషు భాష నేర్చుకుంటే ఆ సమస్యలు పరిష్కారమైపోతాయి. ఎందువల్లనంటే దానికి కంచ ఐలయ్య గారి సమాధానం అగ్రవర్ణాల వారందరూ తమ పిల్లల్ని ఇంగ్లీషు మీడియంలోనే చదివిస్తున్నారు. అందువల్లనే వారు సమస్యల నుంచి బయటపడ్డారు అని కంచ ఐలయ్య సమాధానం.

ఇంగ్లీషు చదువుల వల్ల కోటు వేసుకున్న కొందరు ఆధునిక బ్రాహ్మణులు తయారయ్యారు. ఈ బ్రాహ్మణులే యితర వర్ణాల వారందరికీ ఆదర్శంగా మారారు. ప్రజల నుంచి దూరం కావడానికి, అనాగరిక గ్రామీణుల నుంచి వేరుపరుచు కోవడానికి ఆధునిక బ్రాహ్మణులు వేసుకున్న కోటు యితర కులాల వారందరికీ ఆదర్శంగా మారింది. యిదే మార్గంలో అతిశూద్ర కులానికి చెందిన నరేంద్రమోడీ లక్షల విలువ చేసే కోటు వేసుకొని అమెరికా అధ్యక్షుడి కరచాలనం చేశారు. బ్రాహ్మణీయ కోటు కొంపముంచింది. బనియా నిరాడంబరత్వమే గెలిచింది. ఆప్‌ చరిత్రని సృష్టించింది. ఎందుకంటే దేశంలో ఎక్కువ గ్రామీణ జనాభా గాంధీలా నిరాడంబర వేషధారణ కలవారే. యీనాటికీ గ్రామాల్లో ఎవరూ కోటు వేసుకోరు. కోటు సీఈవోలకి సింబల్‌.

ఇంగ్లీషు భాష కూడా యీనాటికీ అతికొద్దిమంది బడా బాబుల్ని తయారు చేస్తుంది. ఇంగ్లీషు భాష నుంచి గోరటి వెంకన్న లాంటి సహజ స్వరాలు వికసించవు. పంచభూతాలనీ, అవి అందకపోవడం వల్ల కలుషితం కావడం వల్ల వచ్చే ముప్పునీ ఇంగ్లీషు మాయాజాలం, కార్పొరేట్‌ మాయాజాలం, ఆధునిక బ్రాహ్మణ వాదం కప్పిపుచ్చుతాయి. ఆ బ్రాహ్మణ వాదం నుంచి పుట్టిన మాయావాదే కంచ ఐలయ్య. (ఇంగ్లీషు భాషని గాంధీ, లోహియాలాంటి బనియాలు మాత్రమే విమర్శించారు, బ్రాహ్మణులు కాదు).

ఇంటింటికీ మంచినీళ్ళు యిస్తానని కాకుండా, వీధి వీధికీ యింగ్లీషు బడులు పెడ్తానని ప్రకటిస్తే కంచ ఐలయ్య ఆప్‌ని సమర్థించేవాడు. ఇంగ్లీషు భాష సకల సమస్యలనీ పరిష్కరిస్తుంది.

ప్రశ్నించే తత్వాన్ని ఇంగ్లీషు భాష పెంపొందిస్తుందని కంచ ఐలయ్య భావిస్తున్నాడా? నిజానికి ఇంగ్లీషు భాష విముక్తిని కాదు దాస్యాన్ని పెంచి పోషిస్తుందని గుగీ లాంటి ఆఫ్రికన్‌ రచయితలు భావిస్తున్నారు. తమ మాతృభాషలలో రచనలు చేస్తున్నారు. (డీకలొనైజింగ్‌ మైండ్‌ – గుగీ)

కంచ ఐలయ్య గారిలోని యీ భావదాస్యానికి కారణం ఆయన బ్రాహ్మణుల నుంచి అలవర్చుకున్న క్రైస్తవ దాస్య బుద్ధి. క్రైస్తవం వచ్చి యిస్లాం కాని ముస్లింలు కాని చేయలేని మంచి పని చేసిందని, ఆధిపత్యాల్ని ప్రశ్నించిందని ఐలయ్య వాదిస్తాడు. నిజానికి క్రైస్తవం ఆధిపత్యాల్ని ప్రశ్నించే స్వభావాన్ని చంపేసి బ్రాహ్మణవాదాన్ని బలపరిచింది. ఈనాటికీ బ్రాహ్మణవాదాన్ని వ్యతిరేకిస్తున్నది బనియా సంస్కృతి, ముస్లింల సూఫీయిజమూ (క్రైస్తవం కానే కాదు).

అరవింద కేజ్రీవాల్‌ అనే బనియా హిందూ కార్పొరేట్‌ మాయావాద ప్రభుత్వాన్ని గడగడ లాడించడానికి కొంతకాలం ముందే, షిరిడీసాయి బాబా గడగడ లాడించాడు. బనియాల్ని దుమ్మెత్తి పోసే కంచ ఐలయ్య, ఆధునిక బ్రాహ్మణుణ్ణి ఆదర్శంగా తీసుకునే ఐలయ్య, క్రైస్తవుల్ని విముక్తి ప్రదాతలుగా ఆకాశానికెత్తే ఐలయ్య మాత్రం మరణించిన వంద సంవత్సరాల తర్వాత నిద్రలేచి జనాల్ని నిద్ర లేపి హిందూవాదుల్ని నిలదీసిన షిరిడీ సాయి బాబా గురించి ఒక్క మాట కూడా మాట్లాడడు.

నిజానికి షిరిడీ సాయిబాబా కొంతకాలంగా సీసీ కెమెరాల ఫుటేజిల్లో ప్రత్యక్షమవుతూనే వున్నాడు. యిలా మరణించిన సుదీర్ఘకాలం తర్వాత కూడా భారతీయ ప్రజల హృదయాలని తన్మయం చేస్తున్న షిరిడీసాయి బాబా ఎవరు? అతని తల్లిదండ్రులెవరు? ఎవరికీ తెలియదు. ఆయనొక మసీదులో ప్రవేశించి దీపాలు వెలిగించి ద్వారకామాయి అని పేరు పెట్టాడు. ఆయన హిందువులకి హిందువులా, ముస్లింలకి ముస్లింలా తోస్తాడు. అందుకే యిద్దరూ పూజిస్తారు. ఇటీవల హిందూవాదులూ చట్టసభల్లోనూ బయట కూడా ముస్లింలని నిందిస్తూ మాట్లాడ్తూ వచ్చారు. షిరిడీ సాయిబాబాని కూడా నిషేధించాలనుకొన్నారు సాధుసంతులు ఆయన హిందూ దేవుడు కాడని, షిరిడీ భక్తులు గంగాస్నానం చేసే అర్హతని కోల్పోతారని ప్రకటించారు. దాంతో సాయిభక్తులంతా గంగలో మునిగి నిరసన తెలియజేశారు. హిందూవాది నరేంద్ర మోడీ ఎన్నికల్లో గెలిచి గంగకి హారతులిచ్చిన కొంతకాలానికే షిరిడీ సాయిబాబా వివాదం ముదిరింది. షిరిడీ సాయిబాబా భక్తులు గంగపై తమ హక్కుని స్థాపించడం ద్వారా, యిక్కడి ప్రకృతిపై అందరికీ హక్కు వుందని చాటారు.

హిందూ సాధుసంతులు షిరిడీ సాయిబాబా హిందూ దేవుడు కాదని వాదిస్తుంటే, గుజరాత్‌లో కొన్ని దేవాలయాల్లో సాయి విగ్రహాల్ని తొలగిస్తుంటే, దేశంలోని భక్తులంతా నిరసన తెలియజేశారు. అమర పురాణ పురుషుడిగా వర్ధిల్లుతున్న షిరిడీసాయి బాబా సృష్టించిన సంచలనం యిది. చారిత్రక పురుషుల కన్న పురాణ పురుషులే ఎక్కువ ప్రభావాన్ని కలిగిస్తారంటాడు మహాబనియా లోహియా.

మతం మత్తు మందు అని మాటిమాటికీ కొటేషన్‌ యిస్తూ మెలకువలో కంటె మత్తులోను మైమరపులోను సత్యం దాగి వుందన్న విషయాన్ని మరిచిన కమ్యూనిస్టులకీ, బౌద్ధాన్ని గురించి మాట్లాడ్తూ క్రైస్తవాన్ని ఆరాధిస్తూ బ్రాహ్మణ వాదంలో మునిగి తేలుతున్న కంచ ఐలయ్యకీ షిరిడీ సాయి వివాదం అర్థమే కాదు.

కంచ ఐలయ్య కన్నా సినిమా నిర్మాత, నటుడు మోహన్‌బాబు గొప్ప మేధావి. షిరిడీ సాయిబాబాపై హిందూవాదులూ, కొందరు సన్యాసులూ, పీఠాధిపతులూ రేపుతున్న వివాదాన్ని తీవ్రంగా ఖండించారు. అంతేకాదు ముస్లిం యువకునికీ, ‘హిందూ’ స్త్రీకి మధ్య జరిగిన ప్రేమకథని సినిమాగా తీసి, చివరికి ఆ వివాదంలో పద్మశ్రీ బిరుదుని కూడా కోల్పోయిన విప్లవకారుడు మోహన్‌బాబు.

సినిమా వాళ్ళంతా మూఢ విశ్వాసాల్లో కూరుకుపోయారని నిందిస్తాడు కంచ ఐలయ్య (జైపూర్‌ లిటరరీ ఫెస్టివల్‌లో హిందీ సినిమా కవి జావేద్‌ అక్తర్‌తో ఐలయ్య వివాదం). భారత ప్రజలు కాని, సినిమా వాళ్ళు కాని కంచ ఐలయ్యంత మూఢవిశ్వాస పరులు కాదు. కంచ ఐలయ్యకి బ్రాహ్మణ వాదం, క్రైస్తవం, అమెరికనిజం, ఇంగ్లీషు, బౌద్ధం వీటన్నింటిపైన మూఢ విశ్వాసం. అందుకే యివన్నీ కలిసి ఆధునిక కాలంలో సృష్టిస్తున్న విధ్వంసాన్ని ప్రశ్నించరు కంచ ఐలయ్య.

ఇంతటి విప్లవాన్ని సృష్టించిన షిరిడీ సాయిబాబా గురించి ఎందుకు మాట్లాడరు? గాడ్‌ యాజ్‌ ఎ పొలిటికల్‌ ఫిలాసఫర్‌ అంటూ బుద్ధున్ని బౌద్ధాన్నీ ఆకాశానికెత్తే కంచ ఐలయ్య బ్రాహ్మణ వాదంపై షిరిడీ సాయిబాబా నిశ్శబ్ద విప్లవాన్ని ఎందుకు ఆహ్వానించరు? ఎందుకంటే కంచ ఐలయ్య కూడా బ్రాహ్మణవాదే. అందుకే బౌద్ధ టెర్రరిస్టులు ముస్లింలపై దాడులు చేస్తుంటే మన పక్కనే వున్న బుద్ధిస్టు శ్రీలంక తమిళులని ఊచకోత కోస్తుంటే కంచ ఐలయ్య బుద్ధిస్టులని ఆకాశానికెత్తుతాడు. మేధావులందరి కంటె, బౌద్ధులే ఎక్కువ జ్ఞానం కలిగి వున్నారంటాడు.

యింతకీ ఎక్కువ జ్ఞానం కలిగిన బౌద్ధులు ఎవరు? ఒకసారి మానవ హక్కుల మేధావి కన్నబిరాన్‌ శ్రీలంక బౌద్ధ సన్యాసితో తమిళులపై రాజ్యహింస గురించి ప్రస్తావించాడు. ఆ బౌద్ధ సన్యాసి సమాధానం ఏమిటంటే – బౌద్ధ అహింసా వాదం బౌద్ధుల వరకే పరిమితమైనది, అది యితరుల పట్ల వర్తించదు అని. యిదీ బౌద్ధ సన్యాసుల వైఖరి.

కంచ ఐలయ్య ముస్లింలలో మేధావులు తక్కువగా వున్నారంటాడు. ఈ కంచ ఐలయ్యని నిలదీసిన హిందీ సినీ కవి జావేద్‌ అక్తర్‌ మేధావిగా కనబడలేదా? జైపూర్‌ లిటరరీ ఫెస్టివల్‌లో బౌద్ధంపై కంచ ఐలయ్య గ్రంథం గురించి వ్యాఖ్యానిస్తూ, జావేద్‌ అక్తర్‌ ‘‘ఏ మతమైనా ఒకటే. ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే ఏ పద్ధతి అనుసరిస్తే నేమిటి అంటూ మతాలన్నీ అసమానతలకి నిలయాలే”నని విమర్శించారు. అలాగే అన్ని మతాలు సమానత్వం పునాదులపై నిర్మించబడాలని సూచించారు కూడా. యిది కంచ ఐలయ్య లాంటి నయా బౌద్ధులకి ఒక ముస్లిం మేధావి చేసిన హెచ్చరిక.

ఎందుకంటె ఇస్లాంని సంస్కరించదగిన అనాగరిక మతంగా, ముస్లింలని క్రైస్తవుల దగ్గర పాఠాలు నేర్చుకోదగినవారుగా అభివర్ణిస్తారు కంచ ఐలయ్య. ఐలయ్య దృష్టిలో బౌద్ధం కూడా కాదు, క్రైస్తవమే గొప్ప మతం. అదే భారతీయ అనాగరికుల్ని నాగరికతలోకి నడిపి కాపాడింది. ఇస్లాం తెచ్చిన మార్పు కూడా యేమీ లేదు. ఇస్లాం క్రైస్తవం దగ్గర పాఠాలు నేర్చుకోవలసిన మతం, సంస్కరణ చెందవలసిన మతం.

బౌద్ధం పేరుతో ఇస్లాంకి ఒక ప్రత్యర్థిని నిలపడమే కంచ ఐలయ్య లక్ష్యం. వివేకానంద స్వామి వారు కూడా బౌద్ధాన్ని కీర్తించి, ఇస్లాంని క్రూరమైన అనాగరికమైన మతంగా విమర్శించాడు. కంచ ఐలయ్య సున్నితంగా అవే భావాలు వెళ్ళబుచ్చాడు.

కంచ ఐలయ్య ముస్లింలలో మేధావులు తక్కువ అని విమర్శించడమే కాదు, ఇర్ఫాన్‌ హబీబ్‌ లాంటి చరిత్రకారులు కులవ్యవస్థని గురించి రాయలేదన్నారు. అది నిజం కాదు. కంచ ఐలయ్యలా బ్రాహ్మణులు కులవ్యవస్థకి మూలమని భావించడు. బౌద్ధంలోనే కుల వివక్షకు మూలాలు ఉన్నాయంటాడు ఇర్ఫాన్‌ హబీబ్‌. (రెలిజియన్‌ ఇన్‌ ఇండియన్‌ హిస్టరీకి ముందుమాట).

బౌద్ధాన్ని హేతుబద్ధ మతంగా వర్ణిస్తూ, ఇస్లాంని అనాగరిక మతంగా సంస్కరించబడవలసిన మతంగా అభివర్ణించే కంచ ఐలయ్య గారిలాంటి బ్రాహ్మణ మేధావులకి ఇర్ఫాన్‌ హబీబ్‌, జావేద్‌ అక్తర్‌ మొదలైన ముస్లిం మేధావులు విరుగుడుగా కనబడ్తారు.

ఐజాక్‌ మహమ్మద్‌ చాలాకాలం క్రితమే హిందూ సంస్థల కొంగ్రొత్త వైఖరి గురించి కుండబద్దలు కొట్టారు. బాబ్రీ మసీదుని కూలగొట్టడంలో పాత్ర వహించిన వారు ఉమాభారతి, కళ్యాణ్‌ సింగ్‌, వినయ్‌కతియార్‌ వంటి శూద్రులు ఉన్నారు. దళిత రాజకీయ నాయకురాలు మాయావతి బిజెపితో చేతులు కలిపింది. నిమ్న కులాలు కూడా హిందూత్వంలో భాగం కావడాన్ని గురించి మాట్లాడ్తూ ఐజాక్‌ అహ్మద్‌, హిందూవాదం సంప్రదాయేతర సాంస్కృతిక దుందుడుకుతనాన్ని ప్రదర్శిస్తోందన్నారు. హిందూవాదం సొంత పునాది లేని బూర్జువా వర్గం. దానికి స్వంత సంస్కృతి అంటూ ఏమీ లేదు అని హిందూ వాదం నిజరూపాన్ని బట్టబయలు చేశారు.

కంచ ఐలయ్య గారికి కూడా సొంత పునాది లేదు. ఒకవేళ వున్నా దాన్ని క్రైస్తవం కోసం తాకట్టు పెట్టారు. తాను హిందువుని కానని, తన దేవతలు, బ్రాహ్మణ దేవతలూ వేరు వేరని ప్రకటించుకున్నారు నిజమే కాని చివరికా దేవతలని పాతర వేసి ప్రొటెస్టెంటు క్రైస్తవాన్ని ఆశ్రయించారు. ప్రొటెస్టెంటు క్రైస్తవంతో కింది నుంచి పైవరకూ నిండిపోయిన అమెరికాని ఆదర్శంగా భావించారు. ఆ అమెరికా ఖండాన్ని ఏకం చేసి అమెరికన్‌ జాతీయతకు పునాదులు వేసిన అబ్రహాం లింకన్‌ని ఫక్తు హిందూవాది నరేంద్ర మోడీలో చూసుకుంటున్నారు.

కంచ ఐలయ్యలో పెరియార్‌ హిందుత్వ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. పెరియార్‌ బ్రాహ్మణుల్ని ముస్లింలనీ కూడా శూద్రులకి ముప్పుగా భావించారు. బ్రాహ్మణ్ణి కాదని ముస్లింలని అంగీకరించడం పేడలో కాలు తీసి మలంలో కాలు పెట్టడం లాంటిదన్నాడు పెరియార్‌. (పెరియార్స్‌ హిందుత్వ – రవికుమార్‌)

అందుకే పెదవులపై బౌద్ధాన్ని స్మరిస్తూ సర్వాత్మనా క్రైస్తవాన్ని ఆరాధిస్తున్నారు కంచ ఐలయ్య. చివరికి ప్రచ్ఛన్న క్రైస్తవమైన హిందూవాదాన్ని వరిస్తున్నారు. యిదే ఆధునిక బ్రాహ్మణవాదం.

నిజానికి బ్రాహ్మణ వాదం కింద పడి నుగ్గై మరణించినవాడు బ్రాహ్మణుడే. మురళీమనోహర్‌ జోషీ పక్కకి నెట్టివేయబడితే, మాయావతి ఆవేదన వ్యక్తం చేసింది. హిందూవాదానికి అందమైన మేలిముసుగుగా భాసించిన వాజపేయి రాజకీయంగా కూడా వృద్ధుడై అంపశయ్య జేరాడు. బ్రాహ్మణుని సాత్విక గుణమనే ముసుగు హిందూ వాదానికి యింక అవసరం లేదు. ఆ అవసరం తీరిపోయింది. శూద్రులు, అతిశూద్రులు ఆ స్థానాన్ని ఆక్రమించుకున్నారు. భవిష్యత్తు శూద్రులదేనన్న వివేకానంద హిందూవాణి నిజమైంది.

కంచ ఐలయ్య పరిభాషలో మోడీత్వ విజయం హిందూ సంస్థల మండలీకరణని సూచిస్తోంది. మోడీ మరో అబ్రహాం లింకన్‌గా అవతరించవచ్చునని కలగంటున్నారు ఐలయ్య.

ఈ ఆలోచనలు ప్రాతినిధ్యాన్నే సారంగా భావిస్తాయి. ఒబామా అనే నల్లజాతివాడు అధ్యక్షుడయ్యాడు కనుక నల్లజాతి ప్రజల విముక్తి జరిగినట్లేనని భావించడం ఎటువంటిదో, అతిశూద్రుడు ప్రధాని అయ్యాడు కనుక ఆ జాతి ప్రజలు విముక్తి చెందారని భావించడం కూడా అంతే. కంచ ఐలయ్య బౌద్ధ మాయావాది అనే సంగతిని మరోసారి గుర్తుకు తెచ్చుకోవాలి. అందుకే ఆయన సమస్యల మూలాల్లోకి వెళ్ళడు. మోడీ కార్పొరేట్‌ అనుకూల విధానాలు పేద ప్రజలకి తెచ్చే ముప్పు గురించి ఆయన ఆలోచించకపోవడం ఆయన బౌద్ధ దృక్పథంలో భాగమే.

హిందూ సంస్థల్లో హిందూ వాదుల్లో అబ్రహాం లింకన్‌ని చూసిన వాళ్ళల్లో మొదటివాడు ఒకప్పటి ఆరెస్సెస్‌ అధ్యక్షుడు దేవరస్‌. ఆయన అన్నదేమిటంటే అబ్రహాం లింకన్‌ దక్షిణ ఉత్తర అమెరికాల్ని ఏకతాటి మీదికి తెచ్చి ఐక్య అమెరికాని తయారు చేశాడు. బలమైన దృఢమైన అమెరికాని సృష్టించాడు. బానిస వ్యవస్థ రద్దుకంటె అమెరికా ఏకీకరణే తన ప్రధాన లక్ష్యమని లింకన్‌ వాక్యాల్ని ఉటంకిస్తాడు దేవరస్‌ (‘అబ్రహాం లింకన్‌ అండ్‌ ఆర్‌ ఎస్‌ ఎస్‌ – వాటీజ్‌ కామన్‌’).

ఒక కార్పొరేట్‌ అఖండ భారత్‌ని సృష్టించడమే మోడీ లక్ష్యం కూడా, కాశ్మీర్‌ స్వయం ప్రతిపత్తి రద్దు గురించి వివాదం రగుల్తూనే వుంది. కాశ్మీర్‌ హక్కుల గురించి మాట్లాడి, టెర్రరిజం ముస్లింలకే ప్రత్యేకం కాదని మాట్లాడి తీవ్రవివాదానికి కారణమయ్యాడు ప్రశాంత్‌ భూషణ్‌ అనే ఆప్‌ రాజకీయ నాయకుడు.

యింతకీ కంచ ఐలయ్య కోరుకుంటున్నదేమిటి? మోడీ లక్ష్యమే ఆయన లక్ష్యమా?

హిందూవాదుల లక్ష్యమే ఆయన లక్ష్యమా? అందరినోళ్ళూ మూయించి, కార్మిక హక్కులు రద్దు చేసి, మైనార్టీలని అణచివేసి, వ్యాపారమూ లాభమే గీతాసారంగా భావించే అఖండ భారత నిర్మాణమే ఐలయ్య లక్ష్యమా? యీ లక్ష్యం కోసం తమ జాతివాళ్ళే శూద్రులే కృషి చేయాలని, వారే రాజకీయ అగ్రస్థానాల్లో వుండి పనులు చక్కబెట్టాలని ఐలయ్య ఉద్దేశ్యమా?

ఇటీవల వీరమణి అనే పెరియార్‌ అనుయాయి అన్నదేమిటంటే బిజెపిలో అతిశూద్ర కులాలకి స్థానం లభించడం తమ ద్రవిడ ఉద్యమాల విస్తరణ వల్లనేనని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. (‘The Periyar Legates’ Chandra Bhanu Prasad)

అంటే బ్రాహ్మణులు వలసవాదుల ప్రాపకంతో పైకి ఎగబాకడానికి చేసిన ప్రయత్నాన్నే నేటి శూద్ర అతిశూద్ర కులాలు అనుసరిస్తున్నాయి. అందుకోసం బ్రాహ్మణుడిలాగే తమ సంస్కృతినీ ఉనికినీ తాకట్టు పెడ్తున్నాయి, కంచ ఐలయ్య తన కుల అస్తిత్వాన్ని తాకట్టు పెట్టినట్లు.

కంచ ఐలయ్య తనకీ తన అస్తిత్వానికీ బ్రాహ్మణులతో సంబంధం లేదని, తన దేవతలు ఆచార వ్యవహారాలూ పూర్తిగా భిన్నమైనవి గుర్తించడంలో తన సనాతన అస్తిత్వాన్ని బలపరిచారు. వివిధ శ్రామిక కులాల వారు జ్ఞానాన్ని వృద్ధి చేసిన తీరుని ప్రస్తావించారు. అదీ బాగుంది కాని కంచ ఐలయ్య దృష్టిలో యీ ప్రాచీన అస్తిత్వం అతిక్రమించదగినది, ఇంగ్లీషు భాష క్రైస్తవాల ద్వారా యీ సనాతన అస్తిత్వం అధిగమించదగింది (బౌద్ధం విమర్శనాత్మక వైఖరిగా మాత్రమే గుర్తించబడింది).

క్రైస్తవులు అంతర్జాతీయ అభిప్రాయాన్ని ప్రభావితం చేయగలిగి వుంటారు. అంటే పాశ్చాత్య సమాజాన్ని అడ్రస్సు చేయగలుగుతారు యిది కంచ ఐలయ్యకి క్రైస్తవం పట్ల గల ఆసక్తికి ప్రధాన కారణం. పాశ్చాత్యంతో సంభాషణ మాత్రమే హేతుబద్ధమైనది.

యిటువంటి సంభాషణ ఇస్లాం ద్వారా సాధ్యం కాదని కంచ ఐలయ్య గుర్తించారు. గుజరాత్‌లో ముస్లింలు తమపై దాడి జరిగినపుడు అంతర్జాతీయ సంస్థల్ని ప్రభావితం చేయలేకపోయారు. ముస్లింలకి కలుపుగోలుతనం లేదు. ఎస్సీ బీసీలే వారి మీద దాడిచేశారంటే కారణం క్రైస్తవానికి వుండే విశాల దృక్పథం, సేవాభావం లేకపోవడమే కారణం. బ్రాహ్మణ్యానికీ ఇస్లాంకీ ఒకటే తేడా. నువ్వు బ్రాహ్మణుడిగా మారలేవు. కాని ఇస్లాంలోకి కన్వర్షన్‌ సాధ్యం. ఇంతే తేడా తప్ప దొందూ దొందే. యిద్దరిదీ వొంటెత్తు పోకడేనని భావం. యిదీ కంచ ఐలయ్య ధోరణి.

బ్రాహ్మణ సంప్రదాయాన్నీ ఇస్లాంనీ పోల్చడం క్రైస్తవుల నుంచి వచ్చిందే. రవి జెకర్యా అనే క్రైస్తవ ప్రచారకుడు తన ఉపన్యాసంలో ఒకమాట అంటాడు. క్రైస్తవంలా జనసామాన్యంలోకి అందరిలోకీ వెళ్ళగలిగిన విశాల దృష్టి ముస్లింలకీ బ్రాహ్మణులకీ కూడా లేదు. బైబిలు జనసామాన్యంలోకి వాళ్ళ వాళ్ళ భాషల ద్వారానే చొచ్చుకుపోయింది అంటాడు రవి జెకర్యా.

ఇది నిజమే పైకి చూస్తే క్రైస్తవం క్రైస్తవ సమాజం ఉదార స్వభావం కలవిగానే కనబడ్తాయి. కాని వేమన ఏమన్నాడు పైకి కనబడేదే సత్యం కాదన్నాడు. మేడిపండుని ఉదాహరణ చూపాడు. దృష్టి గోచరమైనదే సత్యం కాదని తెలుసుకోవడానికి తాత్విక గాఢత్వమూ నిజాయితీ కావాలి. అవి ఐలయ్యకి లేవు.

ఎందుకంటే ప్రస్తుత చరిత్రని గమనిస్తే ఇస్లాం టెర్రరిజంగా భాసిస్తుంది. ఇస్లాంని ఎదిరించి ఆధునిక విద్యని అభ్యసించి బుల్లెట్‌ దెబ్బకి గురైన మలాలా గుర్తుకొస్తుంది. ఆమెకి నోబుల్‌ బహుమతీ అంతర్జాతీయ గుర్తింపు రావడం గుర్తుకొస్తాయి. యిటువంటి గుర్తింపు నివ్వడం ద్వారా పాశ్చాత్య క్రైస్తవ సమాజపు విశాల దృక్పథం కనబడ్తుంది. కాని ఆ టెర్రరిజానికి మూలం అమెరికా యూరప్‌ల అంతర్జాతీయ రాజకీయాలేనని, ఆ రాజకీయాలే, ఆ యుద్ధనీతే అసలు సిసలు టెర్రరిజమని కంచ ఐలయ్యకీ చంద్రభాను ప్రసాదులకీ ఎవరు చెప్తారు? ఆఫ్ఘనిస్తాన్‌పై అమెరికా దాడిని విముక్తి యుద్ధంగా, స్త్రీల విముక్తికి మార్గంగా వ్యాఖ్యానించాడు చంద్ర భాను ప్రసాద్‌ దళితుడి డైరీలో. కవి స్మైల్‌ గారు ముక్కుమీద వేలు వేసుకున్నారు.

కంచ ఐలయ్య పౌరహక్కుల సంఘంలో పనిచేసిన మిత్రులు సుబ్రహ్మణ్యం గారి దగ్గర పాఠాలు నేర్చుకోవలసి ఉంది. సుబ్రహ్మణ్యంగారు అంటారు క్రైస్తవుల మీద దాడి జరిగినపుడు శిక్షలు పడ్తాయి. కాని ముస్లింల మీద దాడి జరిగినపుడు యెటువంటి శిక్షలూ వుండవు అంటారు. గ్రాహంస్టెయిన్‌ని అనే మిషనరీని ఒక ఒరిస్సా గిరిజనుడు హత్య చేస్తే ఉరిశిక్ష పడింది. క్రైస్తవుల మీద దాడి జరిగినపుడే ప్రభుత్వం స్పందిస్తుంది. ముస్లింల గురించి స్పందన ఉండదు అంటారు సుబ్రహ్మణ్యం గారు.

అంతెందుకు మొన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చర్చిలపై దాడులు జరిగాయి. ఒబామా భారతదేశాన్ని పర్యటించినపుడు మత సామరస్యాన్ని గురించి మాట్లాడడం ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. వెంటనే మన ప్రధాని మోడీ ఎప్పుడూ లేనట్లు మతాంతరీకరణల్ని కూడా సమర్ధిస్తూ మాట్లాడారు. క్రైస్తవ సమావేశానికి వెళ్ళి సంఘీభావం తెలిపారు. గుజరాత్‌లో ముస్లింలపై దాడి జరిగినపుడు మోదీని అమెరికా గడ్డపై అడుగు పెట్టకుండా హుకుం జారీ చేసిన అమెరికా, ప్రధాని కాగానే ఆహ్వానం పలికింది. ఐతే ముస్లింల ఉనికి కంటె క్రైస్తవుల ఉనికి క్రైస్తవ మతపు ఉనికి పవిత్రమైనవని మోదీకి ‘గీత’ గీసింది, గీతాసారం బోధించింది అమెరికా. ఒబామా నల్లనయ్యగానూ, మోదీ అర్జునుడిగానూ కనబడ్తారు యీ సన్నివేశంలో.

యీ క్రైస్తవ గీతాసారం కంచ ఐలయ్యకి కూడా తెలుసు. చాలామంది కంటె బాగా తెలుసు.

ఒకరోజు ఒక తెలుగు సైన్సు ఫిక్షన్‌ రచయిత ఫోను చేసి నాకు హితబోధ చేశాడు. ‘‘చూడు నువ్వు మాట్లాడితే కులం మతం అంటావు. అమెరికన్‌ సమాజం చూడు ఎంత సెక్యులరో. మనం ఎదగాలన్నా అటువంటి లౌకిక దృక్పథం అవసరం’’ అన్నాడు.

అమెరికన్‌ సమాజమంత మత దృష్టి కలిగిన సమాజం మరొకటి లేదు అని కుండబద్దలు కొడ్తాడు ఐలయ్య. అమెరికాలో రాజకీయంగా పైకి ఎదగాలంటే ప్రొటెస్టెంట్‌ క్రైస్తవుడు కావడం తప్పనిసరి. ఒక కేథలిక్కు రాజకీయంగా ఉన్నతస్థితికి ఎదగడం అసాధ్యం. అధ్యక్షుడు కావడం అసంభవం. (అందుకే ఒబామా క్రైస్తవుడా కాదా అనే విషయంపై పెద్ద చర్చ జరిగింది) భారతదేశానికి ఒబామా రాక సందర్భంగా వచ్చిన రాయబారి రిచర్డ్‌ రాహుల్‌వర్మ హిందువైనప్పటికీ క్రైస్తవమతంలోకి మారినవాడే. యిటువంటి రహస్యాలన్నీ బట్టబయలు చేస్తాడు కంచ ఐలయ్య.

ఐతే యింతగా ప్రొటెస్టెంట్‌ క్రైస్తవంతో నిండినప్పటికీ అమెరికా సమాజం విశాలదృక్పథం, సహనం కలిగి వుందని అంటాడు ఐలయ్య. ఇస్లాంలోని టెర్రరిస్టు పోకడలు, హిందూ ఛాందసం వంటివి అమెరికన్లలో కానరావని కితాబిస్తాడు.

ఐతే కొందరు అమెరికన్‌ నల్లజాతి నాయకులు క్రైస్తవాన్ని విడిచిపెట్టి ఇస్లాంలోకి మారమని ఎందుకు పిలుపునిచ్చారు? అక్కడి జాతి వివక్ష మాటేమిటి? జాతి వివక్షని స్వయంగా నల్లజాతివాడైనా ఒబామా ఎందుకు ఎదుర్కోలేకపోతున్నాడు? ఇటువంటి ప్రశ్నలేవీ కంచ ఐలయ్య వెయ్యడు సరికదా ఆ ప్రశ్నల్ని మరుగుపరిచి అమెరికన్‌ సమాజాన్ని లిబరల్‌ అంటాడు. హిట్లర్‌ కాన్సెంట్రేషన్‌ క్యాంపుల్ని తలదన్నే అబూగరీబులూ, అమెరికన్‌ ద్వంద్వనీతి, ఆయుధ వ్యాపారమూ, స్వార్థ యుద్ధనీతీ, వీటన్నిటిని మరుగుపరిచే పారదర్శకత లేని అబద్ధపు మీడియా… యివన్నీ అమెరికన్‌ లిబరలిజాన్ని నేతి బీరకాయ అని నిరూపిస్తున్నాయి.

నిజానికి కంచ ఐలయ్యే ప్రొటెస్టెంట్‌ క్రైస్తవ దృక్పధంతో వ్యాధిగ్రస్తుడయ్యాడు. జర్మనీ నాజీయిజం నుంచి అమెరికన్‌ లిబరలిజం వరకు ప్రొటెస్టెంట్‌ క్రైస్తవం అవతారాలు మారుస్తూ వస్తోంది.

కంచ ఐలయ్యని అర్థం చేసుకోవాలంటే ప్రొటెస్టెంట్‌ క్రైస్తవాన్ని అర్థం చేసుకోవాలి. భారత దేశ ఆధునికత వలస ఆధునికత. అలాగే భారతీయ సంస్కరణ భావాలన్నీ క్రైస్తవం నుంచి వచ్చినవే. బ్రాహ్మణుడు, శూద్రుడు కూడా వలసవాదం నుంచి ఆవిర్భవించినవారే. అందువల్ల పాశ్చాత్య మత సంస్కరణభావాలూ, వాటి పరిణామాల్ని అర్థం చేసుకోవాలి.

అందులో భాగంగా ప్రొటెస్టెంట్‌ క్రైస్తవాన్ని అర్థం చేసుకోవాలి. జర్మనీ నాజీయిజానికి విజయాన్ని అందించింది ప్రొటెస్టెంట్‌ క్రైస్తవమే.

ఒకే మతం, ఒకే రాజ్యం, ఒకే చర్చి అంటూ తీర్మానం చేస్తూ, పాస్టర్లంతా హిట్లర్‌కి బద్ధులై ఉండాలని ప్రతినలు తీసుకున్నారు. ఆర్యులను గురించి పేరాలను పవిత్ర గ్రంథాల్లో జేర్చాలన్నారు. నేషనల్‌ సోషలిజంకు అనుగుణంగా బైబిల్‌ని సంస్కరించాలన్నారు. దేశమంతటికీ ఒకే చర్చి ఉండాలని 1933లో ప్రొటెస్టెంట్‌ ప్రతినిధుల ముసాయిదా పార్లమెంటులో ఆమోదం పొందింది. హిట్లర్‌ ఎన్నికలో విజయం చెందడం వెనక ప్రొటెస్టంటులు వున్నారు. శిలువ స్థానంలో స్వస్తిక్‌ని చిహ్నంగా స్వీకరించాలని వారు భావించారు.

ఎందుకంటె ప్రొటెస్టెంట్‌ క్రైస్తవ పితామహుడు మార్టిన్‌ లూథర్‌ జాతి విద్వేషి. ఆధునిక పెట్టుబడిదారీ సమాజం ఆవిర్భావాన్ని కలగంటూ, జాతి విద్వేషంతోనూ ప్రజా ఉద్యమాల పట్ల విద్వేషంలోనూ చెలరేగిపోయాడు. జర్మనీ చరిత్రలో చెప్పుకోదగిన ప్రజా ఉద్యమం 1525 నాటి రైతుల ఉద్యమం. ఆ సందర్భంగా లూథర్‌ యువరాజుకి యిచ్చిన సలహాయేమిటంటే ఆ పిచ్చికుక్కల్ని కఠినాతి కఠినమైన చర్యలు గైకొంటూ నిర్దాక్షిణ్యంగా అణచి వెయ్యి. అదీ నిస్సహాయులైన పేదరైతుల గురించి అతడు వాడిన పదజాలం. యూదుల గురించీ అంతే. యూదులని దేశం నుంచి తరిమెయ్యాలని, వారి సంపదనంతా వశం చేసుకోవాలని, వాళ్ళ జీవితాన్ని దుర్భరం చేసి జర్మనీ క్రైస్తవులని మొరపెట్టుకొనేలా చెయ్యాలని అన్నాడు. దీనిని పోలిన విద్వేషం సావర్కార్‌ హిందుత్వంలో ముస్లింల పట్ల కనబడ్తుంది. లూథర్‌ కూడా ముస్లింలని అనాగరికులని నిందించాడు. హిట్లర్‌ యీ ప్రొటెస్టెంట్‌ క్రైస్తవ పరిభాషతోనే జర్మన్లని రెచ్చగొట్టాడు. (రైజ్‌ అండ్‌ ఫాల్‌ ఆఫ్‌ థర్డ్‌ రీక్‌ – విలియమ్‌. ఎల్‌. షీరర్‌)

నాజీ కాన్సంట్రేషన్‌ క్యాంపుల్లో హింసని అనుభవించిన ప్రీమొలివి అంటాడు. నిజమైన ప్రవక్తలూ అబద్ధపు ప్రవక్తల్ని వేరు చేసి గుర్తించడం కష్టం. అందువల్ల ప్రవక్తల్నే సందేహించాలి. (ఖైదీ నెం. 174517 – ప్రీమొలివి, హెచ్‌.బి.టి.ప్రచురణ)

క్రైస్తవమతాన్ని సంస్కరించి ప్రజలకందరికీ చేరుస్తానంటూ బయలుదేరింది ప్రొటెస్టంటిజం. కాని అంతిమంగా ప్రజలందరిలో జాతి విద్వేషాన్ని నింపింది. ఉదారవాద సామ్యవాద భావాలకి శత్రువుగా పరిణమించింది. వైమర్‌ రిపబ్లిక్కుని వ్యతిరేకించింది. కేథలిక్కులనీ సోషలిస్టులనీ ఒకే గాట కట్టి ద్వేషించింది. అంటే ప్రొటెస్టింటిజపు సంస్కరణ తత్వం ఆధునిక నియంతృత్వ పోకడలకి, వైవిధ్యాన్ని నశింపజేసే ఏకశిలా సదృశస్థితికి సమాజాన్ని నెట్టింది.

దానికి కొనసాగింపే అమెరికా. అమెరికా తన నియంతృత్వానికి, బహుళత్వాన్ని హతమార్చే ఏకశిలా సదృశ సంస్కృతికి అందమైన ముసుగు వేసింది. ఆ ముసుగే ఉదారవాద ప్రజాస్వామ్యం. అది వాక్స్వాతంత్య్రం పేరుతో మీడియా నియంతృత్వాన్ని కొనసాగిస్తుంది. సరుకుల మాయతో ఆలోచించే శక్తిని హరిస్తోంది.

నిజమే అబ్రహాంలింకన్‌ గొప్పవాడే కావచ్చు బానిసత్వాన్ని రద్దు పరచి వుండవచ్చు. అమెరికా ఏకీకరణ అనేది అతని ప్రధాన లక్ష్యం. అంతిమంగా అమెరికా ఒక అఖండశక్తిగా అవతరించి, సామ్రాజ్యవాదాన్ని విస్తరించింది. దీని వెనక ప్రొటెస్టెంట్‌ స్వభావం సహకరించింది. ఐతే అమెరికాలో ప్రొటెస్టెంటిజం లిబరల్‌ రూపాన్ని ప్రజాస్వామ్య ముసుగునీ ధరించింది. ఆధునిక సంస్కరణలన్నీ తీవ్ర హింసాత్మకమైనవని చరిత్ర తెలియజేస్తోంది.

యీ ప్రొటెస్టెంట్‌ చరిత్ర నుంచే కంచ ఐలయ్య ఆవిర్భవించాడు. అందుకే ఆయన ప్రజా ఉద్యమాలని వ్యతిరేకిస్తాడు. నక్సలైట్లు ఉన్నచోట హిందూవాదులు బలపడ్తున్నారంటాడు. కాని ద్రవిడ కులవ్యతిరేక ఉద్యమాలు పుట్టిన తమిళనాట, హిందూవాదులని తలదన్నుతూ ద్రవిడ పార్టీలు మతాంతరీకరణ వ్యతిరేక చట్టాలూ, మైనార్టీలని హింసించే ‘పోటా’లాంటి క్రూర చట్టాల్ని అమలుపరిచిన సంగతిని ప్రస్తావించరు. దానికి కారణాల్ని విశ్లేషించరు. మోడీ అబ్రహాంలింకన్‌ అవుతాడో కాదో కాని ఐలయ్య మాత్రం మరో మార్టిన్‌ లూథర్‌.

అందుకే పాశ్చాత్య సమాజంలోని క్రైస్తవీకరణని ప్రస్తావిస్తూనే, అక్కడి వారిని ముస్లింలు ప్రభావితం చేయలేకపోయారంటాడు. దానికి కారణం ముస్లింల లోని ఇస్లాంలోని సహజ సిద్ధ లోపంగా వ్యాఖ్యానించడం ద్వారా రేసిస్టుగా బయటపడ్తాడు ఐలయ్య. చివరికి ముస్లింలపై అణచివేతకి అంతర్జాతీయ గుర్తింపు రాకపోవడానికి ముస్లింలలోనే లోపం వుందంటాడు. నిజానికి ముస్లింలపై అణచివేతకి దారి ఏర్పరచింది ఆ పాశ్చాత్య అమెరికన్‌ సమాజమే, వారి స్వార్ధపూరిత చమురు రాజకీయమేనన్న సంగతి ఐలయ్యకీ తెలుసు. కాని ఆయన అటువంటి విశ్లేషణలకు దిగడు. ఎందుకంటే ఆయన బ్రాహ్మణవాది. బ్రాహ్మణవాది అనే పదానికి అర్థం ఇప్పటికే తెలిసి వుంటుంది: ప్రొటెస్టంటీకరించబడిన బ్రాహ్మణులనుంచి స్ఫూర్తి పొందినవాడు.

భారతదేశానికి సిక్కు మతస్తుడు ప్రధానమంత్రి కాగలిగాడు. ముస్లిం రాష్ట్రపతి కాగలిగాడు. యిది అమెరికాలో అసాధ్యం. ప్రొటెస్టెంట్‌ క్రైస్తవుడు మాత్రమే ఉన్నత రాజకీయ పదవులు అలంకరించగలడు. ఎంతో కొంత సనాతన ఛాయలు యింకా మిగిలివుండడం వల్లే యీమాత్రం ప్రజాస్వామ్య లక్షణాలు భారతఖండంలో ప్రత్యక్షమవుతున్నాయి.

కాని భావవ్యక్తీకరణకి భారతదేశంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పుస్తకాలపై ఆంక్షలూ కళాకారులు దేశం నుంచి పారిపోవలసిన స్థితీ చూస్తుంటే, జర్మన్‌ ప్రొటెస్టంట్‌ ఫాసిజం గుర్తొస్తోంది. దీని నుంచి భారతదేశం అమెరికనిజం (అమెరికన్‌ లిబరల్‌ ఫాసిజం) లోకి ప్రయాణించడానికి సమయం పట్టవచ్చు. ఎందుకంటె భారతదేశపు చరిత్ర అంతా వలసవాద చరిత్రే. భారత జాతీయత అనేదే వలసవాదం అనుకరణ నుంచి పుట్టింది. దానికి స్వంత పునాదులు లేవు.

హిందూవాదులకీ కంచ ఐలయ్యకీ మధ్యగల తేడా యేమిటంటే – జర్మన్‌ ఫాసిజానికీ అమెరికన్‌ ఫాసిజానికీ గల తేడా. ఐలయ్యది అమెరికన్‌ ఫాసిజం.

అమెరికనీకరణ చెందడం వల్లే ఐలయ్య గారి అభిప్రాయాలు ఉదార స్వభావం కలవిగా కనబడ్తాయి. కాని అంతర్గతంగా ఫాసిజం ఉంటుంది. ఏది మంచి ఆహారమో తేల్చెయ్యడానికి కంచ ఐలయ్య ఎవరు, హిందూవాదులెవరు? శాకాహారం మంచిదా, బీఫ్‌ మంచిదా అని తేల్చేవారెవ్వరు?

వివేకానందస్వామి భారతీయులు బలవంతులుగా మారాలంటే, డైనమిక్‌ (రాజస) ప్రవృత్తి కలవారు కావాలంటే బీఫ్‌ తినాలన్నాడు. Beef, Biceps, Bhagavadgeetha ఈ మూడూ భారతీయుల ఉన్నతికి అవసరమన్నాడు. అది బ్రిటీష్‌ వాళ్ళు పరిపాలిస్తున్న కాలం. బ్రిటీష్‌ వాళ్ళు బీఫ్‌ తినడం వల్ల రైతులకి పశువుల కొరత ఏర్పడ్తోందన్నాడు జ్యోతి బాఫులే ‘గులాంగిరి’లో. మాంసాహారులు కావడంవల్లే ముఖ్యంగా బీఫ్‌ తినడం వల్లే బ్రిటీష్‌ వాళ్ళు ప్రపంచాన్ని జయించారనే నమ్మకం చాలామందికి వుండేది. యిదే అభిప్రాయంతో ఫక్తు శాకాహార కులానికి చెందిన గాంధీ మాంసాహారం తినడం అలవాటు చేసుకోవాలనుకున్నాడు. తర్వాత తన అభిప్రాయం మార్చుకొని వలసవాదానికి వ్యతిరేకంగా శాకాహార వాదాన్ని ఎక్కుపెట్టాడు. బ్రిటీష్‌వాళ్ళు వెళ్ళిపోయాక బీఫ్‌ అనేది ముస్లిం ఆహారంగా ముద్రపడి జాతి వ్యతిరేక వ్యక్తీకరణలో భాగమైంది.

నిజానికి గోవధ నిషేధాన్ని ముస్లిం స్వతంత్ర రాజ్యమైన తెలంగాణాలో అమలైంది. ఆ నిషేధం కోసం పోరాడినవాడు దళితుడు భాగ్యరెడ్డి వర్మ. నిషేధించిన వాడు నిజాం నవాబు (వర్మ గారి కుమారుడు జె. బి. గౌతమ్‌ ఇంటర్వ్యూ. ఆంధ్రజ్యోతి 10-11-2002)

కంచి పరమాచార్యులు శాకాహార వాదాన్ని వ్యతిరేకించారు. ఆయనకి గాంధీ పట్ల గౌరవం వుంది కాని శాకాహారాన్ని అందరూ ఆశ్రయించడం సరికాదని, దానివల్ల ఆహార సంక్షోభం వస్తుందని అన్నారు.

కంచ ఐలయ్య బీఫ్‌లో విటమిన్స్‌ ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు. మరికొందరు పరిశోధకులు మాంసాహారం కేన్సర్‌కి కారణంగా భావించడం చూస్తున్నాం. నిజానికి ఏది మంచి ఆహారం?

నిజానికి సైంటిస్టులకంటె, ప్రజలకే ఏది మంచి ఆహారమో బాగా తెలుసు. వారి అనుభవమే వారికి తెలియజేసింది. నిజానికి ఆహారం అనేది తరతరాల వృత్తుల్ని బట్టి ప్రవృత్తుల్ని బట్టి వేరువేరుగా వుంటుంది. అందరికీ ఒకే ఆహారం అనేదే ఫాసిజం.

యిప్పుడు యీ ఆహార చర్చల వెనుక ఉపయోగితా విలువ కంటె, రాజకీయమే ప్రధాన కారణం. మనం ఆహారం తింటంలేదు, ఆలోచనల్ని తింటున్నాం (యూజీ). గోవుని పూజించడం, గోమాంసం తినడం రెండూ పక్కపక్కనే వర్థిల్లడమే సనాతనం. గోపంచకాన్ని పవిత్రమైనదిగా బ్రాహ్మణులు భావిస్తారు. గోపంచకాన్ని వ్యవసాయ వర్థకంగా రైతులు భావిస్తారు. గోమాంసాన్ని అమృతంగా దళితులు భావిస్తారు. (డక్కలి జాంబ పురాణం) వైరుధ్యాల సమన్వయమే సనాతనం.

గోరక్షణ కోసం ప్రాణాలివ్వబోయిన దిలీపమహారాజు కథని కాళిదాసు రచించిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత, భవభూతి ఉత్తర రామ చరిత నాటకంలో ఒక బ్రాహ్మణ రుషి గోమాంసాన్ని అతిథికి వడ్డించిన కథని వ్రాశాడు. భారతదేశ వైవిధ్యం అంతుబట్టనిది, సరళ హేతువుకి అందనిది. అలా హేతుబద్ధతకి అందక పోవడంలోనే దాని శక్తి వుంది.

కాని మొత్తం ఆహార చర్చని రెండు శిబిరాల మధ్య బాహాబాహీగా మార్చేసి, యేదో ఒక ఆహార విధానాన్ని ఏకైక బలవర్ధకంగా నిర్థారించాలని చూడడమే ప్రొటెస్టెంట్‌ ఫాసిజం. యిదంతా బ్రాహ్మణ వాదం యొక్క అత్యాధునిక రూపం.

ప్రజాస్వామ్యం-ఫాసిజం, లిబరలిజం-నియంతృత్వం యిటువంటి ద్వంద్వాలకి అర్థం లేకుండా చేసింది అమెరికనిజం. అందువల్ల యిటువంటి చర్చలో భాగంగా కాకుండా, చర్చకి బయటవుండి గమనించడం ద్వారా మాత్రమే సత్యాన్ని తెలుసుగోగలం.

నిజానికి ఇంగ్లీషు చదువులు చదివినవాళ్ళ నుంచి కాకుండా సామాన్య జనం నుంచి మనం సమాధానాలు వెతకాలి. షిరిడీ సాయిబాబాని పూజించకూడదనడానికి కారణం ఆయన ముస్లిమని, గొడ్డు మాంసం తినడాన్ని సమర్థించాడని టీవీల్లో హిందూవాదులు గొంతుచించుకున్నారు. వాళ్ళకి ప్రజలు సమాధానం ఇస్తూనే వున్నారు. సాయిబాబాని కొలవడం ద్వారా ఆ సమాధానం యిస్తున్నారు. అనుకూలంగా వ్యతిరేకంగా గొంతుచించుకోవడంలో కాదు సనాతన పద్ధతుల్లో దేశ కాలాలకతీతంగా సమాధానం దొరుకుతూనే వుంటుంది.

నిజానికి బీఫ్‌కి ప్రతిష్ఠని తీసుకురాదలిస్తే కంచ ఐలయ్య లాంటి వాళ్ళు క్రైస్తవాన్ని వ్యతిరేకించవలసి వుంది. గ్రామ దేవతలకి రకరకాల జంతువుల్ని బలి యివ్వడం ప్రాచీన ఆచారం. వలస క్రైస్తవుల వల్ల ప్రభావితులైన సంస్కర్తలు యీ విధానాన్ని వ్యతిరేకించారు. గురజాడ కూడా కొండుభట్టీయం నాటకంలో యిటువంటి సంస్కరణని కోరాడు.

‘‘తదన్నాః తస్య దేవతాః’’ అంటుంది రామాయణం. మనం ఎటువంటి ఆహారాన్ని స్వీకరిస్తామో దానినే తమ దేవతకి ప్రసాదంగా పెట్టాలి. మాంసాహారి మాంసాన్నే దైవానికి సమర్పించాలి.

క్రైస్తవం యిటువంటి బలుల్ని మూఢ విశ్వాసంగా కొట్టివేసింది. క్రైస్తవం మూఢవిశ్వాసంగా కొట్టివేసిన విషయాలే నిజమైన సైన్సు అని వాదించినపుడు చర్చ మలుపు తిరుగుతుంది. కాని ఐలయ్యకి కాని హిందూవాదులకి కాని అటువంటి మౌలిక చర్చ అవసరం లేదు. ఎందుకంటె యిద్దరూ క్రైస్తవ ఆధునికతలో భాగంగా వున్నవాళ్ళే. కనీసం చర్చిలో దేవుడికి మాంసాహారాన్ని నైవేద్యం పెట్టాలని, ఆవిధంగా దేవుణ్ణి మానవ జగత్తులోకి తీసుకురావాలని ఐలయ్య కోరవచ్చు.

బీఫ్‌ని మొత్తంగా అగ్రవర్ణ బ్రాహ్మణ వ్యతిరేకంగా చూపడంలో చారిత్రకత లేదు సరికదా విజ్ఞత కూడా లేదు. యిటువంటి చర్చలు ప్రజల బుర్రల్ని మొద్దు బారుస్తాయి. వీళ్ళకి కావలసింది అదే.

ప్రొటెస్టెంట్‌ క్రైస్తవం నుంచి వచ్చిన ఒకే గ్రంథం, ఒకే మతం, ఒకే జీవన విధానానికి విరుగుడు సనాతనంలో లభిస్తూంటుంది. హఠాత్తుగా వినాయకుడు పాలు తాగి, రాముణ్ణి రామాలయాన్ని మరిపిస్తాడు. యింకొంత సేపటికి షిరిడీసాయి పటాల నుంచి విభూతి రాల్తుంది. భగవద్గీతని బైబిలుగా నిలపాలన్న ప్రయత్నం విఫలమౌతుంది. యిదంతా ఒక పౌరాణిక పరిష్కారంగా కనబడ్తుంది.

యివన్నీ మూఢవిశ్వాసాలనీ, సైన్సు వ్యతిరేకమైనవనీ ఆంగ్ల విద్యావంతులు అనవచ్చు కాని సైన్సు వ్యాపింపజేసే మూఢ విశ్వాసాలు మరింత బలీయమైనవి. ప్రముఖ డాక్టర్‌ హెగ్డే స్వయంగా యిటీవల చెప్పినమాట యేమిటంటే బహుళజాతి మందుల కంపెనీలు తమ లాభం కోసం స్వైన్‌ఫ్లూ భయాల్ని వ్యాపింపజేస్తున్నాయి. బిగ్‌బ్యాంగ్‌ థియరీ వెనుక క్రైస్తవ దృక్పథం దాగివుందని యూరోపియన్‌ కమ్యూనిస్టులే వాదిస్తున్నారు. (Reason In Revolt – Alan Woods and Ted Grant)

వాస్తవం ఏమిటి, సత్యం ఏమిటి అనే ప్రశ్నలకి సమాధానాల్ని కంచ ఐలయ్య గారి లాంటి ఆంగ్ల విద్యావంతుల నుంచి, ప్రొఫెసర్ల నుంచి తెలుసుకోవడం మానెయ్యాలి. ఎందుకంటె వారి ఇంద్రియాలు యింగ్లీషు భాషవల్ల సహజ స్పందనని కోల్పోయాయి.

అంతకంటె గ్రామీణ విశ్వాసాల్లోనే సత్యాన్ని అన్వేషించడం మంచిది. కనీసం వారి విశ్వాసాల వల్ల ఆధునిక తర్కం వ్యాపింపజేస్తున్న ఫాసిజానికి సహజమైన అడ్డుకట్టలు బడ్తాయి. సహజంగా ఏర్పడిన మడ అడవులు వరద ప్రవాహాన్ని నిలువరించినట్లు ఆధునికత తీసుకువచ్చే ముప్పునుంచి గ్రామీణ స్వభావమే కాపాడ్తుంది. ఆంగ్ల జ్ఞానం మాత్రం కాదు.

ఒకప్పుడు బ్రాహ్మణులు చేసిన పాపాన్నే యిప్పుడు కంచ ఐలయ్య చేస్తున్నాడు. గ్రామీణుల పట్ల, సనాతనం పట్ల చిన్న చూపు.

నిజానికి హిందూవాదం మరింత సంస్కరణకి గురవ్వడమే అసలు ప్రమాదం. కేథలిక్‌ క్రైస్తవంలో వున్న బహుళత్వాన్ని చంపి, ప్రొటెస్టెంట్‌ సంస్కరణ వాదం ఫాసిజానికి ద్వారాలు తెరిచింది. సామ్రాజ్యవాదానికి ద్వారాలు తెరిచింది. హిందూయిజం మరింత ప్రొటెస్టెంటీకరణ చెందడం (దళితీకరణ, మండలీకరణ) వల్ల కూడా యిదే ప్రమాదం పొంచి వుంది.

ఒకప్పుడు ప్రజామోదం కోసం స్వదేశీ నినాదాన్ని ఉచ్చరించే హిందూవాదం ఫక్తు బహుళజాతి కంపెనీల యేజెంటుగా మారిపోవడం దీని పరిణామమే. మేక్‌ ఇన్‌ ఇండియా నినాదం దీని పర్యవసానమే.

ఆధునిక బ్రాహ్మణులకే పరిమితమైన హిందూవాదం నాజీ ఫాసిజంలా ప్రజా సమూహాల్లోకి సామాన్య జనంలోకి చొచ్చుకుపోవడం దళిత బహుజన రాజకీయాల వల్ల సులభమైపోయింది. బ్రాహ్మణ వాద విస్తరణ కోసం యీ రాజకీయాల కృషి తీవ్రమైనది.

మనం గుడి రాజకీయాల్ని అర్థం చేసుకోవడానికి చర్చి రాజకీయాల్ని అర్థం చేసుకోవాలి. హిందూవాదాన్ని అర్థం చేసుకోవడానికి క్రైస్తవాన్ని అర్థం చేసుకోవాలి.

వై ఐయామ్‌ నాట్‌ ఎ హిందూ’ గ్రంథంలో కంచ ఐలయ్య కట్ట మైసమ్మ లాంటి గ్రామీణ దేవతల్ని ప్రస్తావిస్తారు. ఆ దేవతల్నీ ఆ ఆచారాల్నీ పూనకాల్నీ మూఢ విశ్వాసాలుగా కొట్టివేస్తూనే క్రైస్తవ చర్చి విస్తరించింది.

బ్రాహ్మణ ఆచారాలకంటె, శూద్ర, అతిశూద్ర ఆచారాలపైనే యెక్కువ దాడి చేసింది చర్చి. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదట క్రైస్తవ మిషనరీలని వ్యతిరేకించింది మాలదాసరులు. (ఆంధ్రుల చరిత్ర – బి ఎస్‌ ఎల్‌ హనుమంతరావు) అలాగే బిర్సా ముండా అనే గిరిజనుడు క్రైస్తవానికి వ్యతిరకేకంగా సూర్య ఆరాధనని బోధించి పోరాడి అమరుడయ్యాడు.

బ్రాహ్మణుల్ని క్రైస్తవం వ్యతిరేకించలేదు. క్రైస్తవాన్ని బ్రాహ్మణులు వ్యతిరేకించలేదు. బ్రాహ్మణులు తెలివిగా క్రైస్తవాన్ని బ్రాహ్మణీకరించడానికి ప్రయత్నిస్తూ వచ్చారు. క్రైస్తవులు బ్రాహ్మణ్యాన్ని క్రైస్తవీకరించడానికి ప్రయత్నిస్తూ వచ్చారు.

బైబిల్ని వేదంతో పోల్చడం ద్వారా బ్రాహ్మణుల్ని ఒప్పించడం కోసం వేదాల్ని అధ్యయనం చేశారు క్రైస్తవులు. ఒక పాశ్చాత్య క్రైస్తవుడు జగద్గురు తత్వ బోధక స్వామి అని పేరు మార్చుకొని, బైబిలే నిజమైన వేదమని బోధించాడు. అతడు రహస్యంగా వేదాన్ని అభ్యసించాడు. అతడి పేరు రాబర్టోడీ నోబిలీ (17వ శ.) (కథలు గాథలు – దిగవల్లి శివరావు)

మాక్స్‌ ముల్లర్‌ వేదాధ్యయనం వెనక క్రైస్తవ వ్యాప్తే అసలు ఉద్దేశ్యం. బ్రాహ్మణుణ్ణి సంస్కరించాలనే క్రైస్తవుల లక్ష్యం నుంచే బ్రాహ్మణ వాదం పుట్టింది.

బ్రాహ్మణ సంస్కృతితో పోలిస్తే, శూద్ర కులాల సంస్కృతి అనాగరికమైందని వ్యాఖ్యానించారు. వారి బలులనీ పూనకాలనీ మూఢవిశ్వాసాలుగా కొట్టి వేశారు. అంతరింప జేయాలన్నారు. యీ పని చేసింది బ్రాహ్మణులు కాదు క్రైస్తవులే. (దక్షిణ భారత గ్రామ దేవతలు – హెన్రీ వైట్‌ హెడ్‌)

యిలా క్రైస్తవుల ప్రయత్నం వల్ల శూద్ర సంస్కృతి క్షీణించింది. దాని స్థానాల్లో వలస బ్రాహ్మణ సంస్కృతి (బ్రాహ్మణ వాదం) విస్తరించింది. అదే దళిత వాదంగా పేరు మార్చుకుంది.

దళిత పాంథర్స్‌ కొందరు హిందూవాద పార్టీల్లో సభ్యులు కావడాన్ని అరుంధతీ రాయ్‌ ప్రస్తావించింది, (అన్‌హిలేషన్‌ ఆఫ్‌ క్యాస్ట్‌ ముందు మాటలో), యిది యాదృచ్ఛికం కాదు. కంచ ఐలయ్య కూడా క్రైస్తవ మతాంతరీకరణలోని గొప్పతనాన్ని గురించి పదే పదే మాట్లాడడం ద్వారా తన శూద్ర సంస్కృతిని తానే రద్దు చేసుకుంటున్నాడు. మోడీలో బహుజన విముక్తిని కలగనడంతో తన సంస్కృతి నుంచి తాను పూర్తిగా విముక్తి చెందాడు ఐలయ్య.

స్థానిక సంస్కృతులన్నిటితో బాటు ఇస్లాంని కూడా టార్గెట్‌ చేసింది క్రైస్తవమే. చర్చిలలో పంచే ప్రొటెస్టెంట్‌ క్రైస్తవ సాహిత్యంలో అరబ్బులపైన ముస్లింల పైన తీవ్రమైన దాడి కనబడ్తుంది. క్రైస్తవ దేశాలు నిలబెట్టిన యిజ్రాయిలుని యూదులకి దైవం ప్రసాదించిన దేశంగా వర్ణించడం, పాలస్తీనా వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కనబడ్తాయి. యివే భావాలు హిందూవాదులు అరువు తెచ్చుకుంటున్నారు. దీన్ని గురించి ఐలయ్య ప్రస్తావించడు. పైగా క్రైస్తవులని ముస్లింలు గురువులుగా స్వీకరించి సంస్కరించబడాలని అంటాడు.

దీని భావమేమి తిరుమలేశ! కంచ ఐలయ్య హిందూవాదులకీ క్రైస్తవ దేశాలకీ మధ్య దుబాసీ కాదు కదా. కొంపముంచి యీయన నుండి మరో ‘దళారీ పశ్తాత్తాపం’ వెలువడదు కదా!

సూచన : ఈ వ్యాసంలో నేను ప్రస్తావించిన విషయాలకు సంబంధించిన ఐలయ్య ఇంగ్లీషు వ్యాసాలు, ఇంటర్వ్యూలూ ఇంటర్నెట్‌లోనూ, యూట్యూబ్‌ లోనూ లభిస్తున్నాయి.

– రాణి శివశంకర శర్మ

(రాణి శివశంకర శర్మ ‘ది లాస్ట్‌ బ్రాహ్మిణ్‌’ గ్రంథ రచయిత. పురాణ వేదం, అమెరికనిజం, గ్రహాంతర వాసి యితర ప్రధాన రచనలు).

కంచ ఐలయ్య వ్యాసాలు కొన్నింటికి లింక్స్:—

 1. Cultural Globalisation (Outlook)
 2. Ghar wapsi in the American embassy? (The Asian Age)
 3. The Muslim stagnation
 4. Untouchables & Muslims (Islami City.com)
 5. The Rise Of Modi (Outlook)
 6. Modi: Lincoln or Bush? (Deccan Chronicle)

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి.
Posted in 2015, ఏప్రిల్, వ్యాసం and tagged , , , , , , , .

50 Comments

 1. ఇస్లాం క్రైస్తవాల గురించిన వివేకానందుని అభిప్రాయం గురించిన నా మాటతో సంవదిచే వ్యాఖ్యలు చేసినవారు మరికొందరు కూడా ఉన్నారు. అందరినీ ఉద్దేశించి శర్మగారు అంత బలమైన లంకెలను ఇచ్చిఉంటారు. ఇస్లాం మనదేశానికి మొత్తం ప్రపంచానికి ఏ సందేశం ఇస్తున్నదో ఏ లంకె ల అంకెల సహాయం లేకుండానే తెలుస్తున్నది.

 2. రాణి శివశంకర శర్మ గారు నా పొస్ట్ కు ‘బదులు చెప్పనవసరంలేదు, వివేకానందుని మాటలే వినండి’ ,అన్నట్టు, ఒక ‘స్వామి సునామిని’,లంకంత లంకెలను వదిలారు. నిజమే. మన వాదనకు బలమిచ్చే మాటలనే ఏరుకొంటాము ఎక్కడనుండైనా. ఉంటాయి కూడా. శర్మగారు నేనుదాహరించిన స్వామి మాటలు ఆయనవి కావు అనలేదు. నేను ఎక్కువ పేజీలు ఉదాహరించలేదు అని మాత్రమే అన్నట్టున్నారు. శర్మగారికి ఇంత శ్రమ కలిగిస్తానని అనుకోలేదు. శర్మగారికి పుటసంఖ్యాబలం ఉందని ఒప్పుకొంటున్నాను.

 3. A clarification on my comment dt.11-06-16,(which probably holds the record for a comment that has been awaiting moderation for 4 days): Im sorry ive not given the references of my two quotes in english in that comment.Both the quotes are from the Complete Works of Swami Vivekananda(Mayavati Edition),Vol. 3.The second quote is from the article ‘Modern India’.Sorry for omitting the p.no’s.My purpose was to show that the statement made by Sri Rani Sivasankara sarma that Vivekananda preferred protestant capitalist Christianity over Islam,branding the latter as violent and cruel, was not correct. In fact,the Swami made it unambiguously clear that of the two the latter was to be absorbed and made part of the Indian psyche,whereas the Christian invasion was the more pernicious and likely longer lasting for its merchant-mission and commercialisation of the Indian spirit.

 4. ‘For our own motherland a junction of the two great systems, Hinduism and Islam — Vedanta brain and Islam body — is the only hope. I see in my mind’s eye the future perfect India rising out of this chaos and strife, glorious and invincible , with Vedanta brain and Islam body….
  I am firmly persuaded that without the help of practical Islam, theories of Vedantism, however fine and wonderful they may be, are entirely valueless to the vast mass of mankind.’ వివెకానందులవారు బౌద్ధాన్ని కీర్తించి ఇస్లాం ను క్రూరమైన మతం అన్నారు ,అని వ్యాసకర్త అంటారు. పైగా ప్రోటెస్టంట్ బ్రిటిష్- అమెరికన్ కేపిటలిజంను వివెకానందుడు ప్రచారం చేశాడు అంటారు ఆయన. ‘..the conquest of India by England is not a conquest by Jesus or the Bible as we are often asked to believe. Neither is it like the conquest of India by the Moguls and the Pathans. But behind the name of the Lord Jesus, the Bible, the magnificent palaces, the heavy tramp of the feet of armies consisting of elephants, chariots, cavalry, and infantry, shaking the earth, the sounds of war trumpets, bugles, and drums, and the splendid display of the royal throne, behind all these, there is always the virtual presence of England — that England whose war flag is the factory chimney, whose troops are the merchantmen, whose battlefields are the market-places of the world, and whose Empress is the shining Goddess of Fortune herself! It is on this account I have said before that it is indeed an unseen novelty, this conquest of India by England. What new revolution will be effected in India by her clash with the new giant power, and as the result of that revolution what new transformation is in store for future India, cannot be inferred from her past history.'(Modern India:vol.3)
  రాణి శివశంకరశర్మ గారి వ్యాసం అర్థం అయింది అని చెప్పడం సాహసమే అవుతుంది. అది మేధావులకు మాత్రమే ఉద్దేశించినది. కాని నాకు ఒకటి తెలిసింది. చరిత్ర, గతచరిత్ర వర్తమాన చరిత్ర, మూగజీవి. డూడూ బసవన్నా.ఎవరిని దేనినిగురించి అయినా ఏమి చెప్పినా తల ఆడిస్తుంది.’గాంధి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల తొత్తు.’ డూడూ.వివేకానందుడు అమెరికాను చూసి మతి మనసు పారేసుకున్నాడు.’ డూడూ. ‘నెహ్రూ జిన్నాలు కుమ్మక్కై ఇండియాను పంచుకున్నారు.’డూడూ.’.’శంకరుడు , వివేకానందుడు,కంచె ఐలయ్య – ఇదీ ఇక ముందు మనం చెప్పుకోవలసిన ఋషి పరంపర.

 5. కంచ ఐలయ్య పై హిందూ వాదుల వ్యతిరేకత అంతా డ్రామా.పెద్దడ్రామా.ఐలయ్య ఫక్తు హిందూ వాది.హిందూవాదులందరూ ప్రచ్చన్న[ముసుగులోని]క్రైస్తవులు.ఇద్దరు ఇస్లాంకీ ముస్లింలకి బద్ధవ్యతిరేకులు సారాంశంలో ఇద్దరూ క్రైస్తవులే.అమెరికన్ క్రైస్తవ సామ్రాజ్య వాదంలో అహింసనీ శాంతినీ చూస్తున్న ముసుగు దొరలు.దొందూ దొందే.
  http://epaper.andhrajyothy.com/detailednews?box=aHR0cDovL2VjZG4uYW5kaHJhanlvdGh5LmNvbS9GaWxlcy8yMDE1MDUyNjA1MjYwMjQwMDM5NDAuanBn&day=20150526

 6. So Muqtar Abbas Naqvi strongly advises beef-eaters to go to Pakistan!

  Maybe he could advise all of the NORTH-EAST OF INDIA to make a country of their own? They will certainly be singing Modiji’s song… Acche din aa gaye!!

  The media should be careful and so should the press secretaries of various ministers and the President of India. Each time something happens… and it is virtually everyday… the Security of someone or the other is BEEFED UP. There are BEEFY musclemen as security guards to several VIPs. There looms a time, when the very word BEEF will become anathema to politicians and ideologues.

  At all events, why go to Pakistan? Beef-eaters can go to England, America… the GoI could give them a one way ticket FREE and request Cameroon and Obama to let them immigrate so that they can have their fill of quality beef… our skinny, vagrant cows do not yield such quality beef I think…

  All will be happy going to UK, USA etc. (and Pakistan, if they are so inclined)

  Beef eaters on jet, by Naqvi banished !!

  (Refer to Sarma’s handling of the beef-issue from Vivekananda to Uttara Rama Charitra; especially యిప్పుడు యీ ఆహార చర్చల వెనుక ఉపయోగితా విలువ కంటె, రాజకీయమే ప్రధాన కారణం. మనం ఆహారం తింటంలేదు, ఆలోచనల్ని తింటున్నాం (యూజీ). గోవుని పూజించడం, గోమాంసం తినడం రెండూ పక్కపక్కనే వర్థిల్లడమే సనాతనం. గోపంచకాన్ని పవిత్రమైనదిగా బ్రాహ్మణులు భావిస్తారు. గోపంచకాన్ని వ్యవసాయ వర్థకంగా రైతులు భావిస్తారు. గోమాంసాన్ని అమృతంగా దళితులు భావిస్తారు. (డక్కలి జాంబ పురాణం) వైరుధ్యాల సమన్వయమే సనాతనం.)

 7. పాత చరిత్రలు కాదు.ఆత్మ విమర్శ ముఖ్యం.ఉదిత్ రాజు బి.జె.పి లో చేరటం పై పై విషయం.
  భీం డ్రం నుంచి హిందూ రాం డ్రం మోగించే వాళ్ళు ఉదయించకుండా జాగ్రత్త పడాలి.
  http://teluguglobal.com/ambedkar-the-father-of-down-trodden/

 8. శర్మ గారూ ,
  మీరు రాసిన వ్యాసమూ , వివిధ పాఠకులు రాసిన కామెంట్లు వాటికి మీ సమాధానాలూ అన్నీ చూసాను .
  ఎప్పటి లాగానే మీరు ఏ విషయాల గురించైతే రాస్తారో వాటి పైన ఇంచుమించు మీతో ఏకీభవిస్తున్నాను . అయితే ఈ వ్యాసం శైలి కొంచెం complex గా అనిపించింది నాకు . చాలా విషయాలు ఒకే వ్యాసంలో చెప్పటానికి ప్రయత్నించినట్టు అనిపించింది .
  ఐలయ్య రాసిన “హిందూ మతానంతర భారత దేశం” అన్న పుస్తకం చదివారా? అందులో కూడా మైక్రో కల్చర్స్ గురించీ కుల వృత్తుల గోప్పతనం గురించీ ఓ పక్కన మాటలాడుతూనే ఆంగ్ల విద్య గురించీ ఇండస్ట్రియల్ అభివృద్ధి గురించీ క్రైస్తవం గురించీ ప్రస్తావిస్తారు . ఆయన వాదంలో ఉండే భావదాస్యం కొలినియల్ చరిత్ర చదివీ లేదా బాలగోపాల్ లాగా కోశాంబి రాసిన చరిత్ర చదివీ భారతీయ సంస్కృతి గురించి తెలుసుకున్న వారికి అర్థం కాదు . ఎందుకంటే ఐలయ్యలో ఉన్న భావదాస్యమే వారిలో కూడా ఉంది కాబట్టి. దాన్నే మీరు బ్రాహ్మణ వాదం అన్నారు అనిపిస్తోంది . ఒకాయన ఎవరో కామెంటు రాస్తూ ఐలయ్య “నేను హిందువునెట్లైత” అన్నాడని మీరు “నేను హిందువునే కాదు” అని అన్నారని అన్నారు . ఐలయ్య ఊహించుకునే సమాజమూ హిందూ అతివాదులు ఊహించుకునే సమజమూ అంతా ఇంచు మించు క్రైస్తవ క్యాపిటలిస్టు సమాజమే అన్న విషయం మరో సారి వెలుగులోకి తేవటానికి ప్రయత్నించారు మీరు .
  మీరు రాసినట్టు మోడీ కూడా ఇందుకు మినహాయింపు కాదు .అయితే ఈ వ్యాసంలో షిర్డీ సాయిబాబా గురించి రాసినవి నాకు పూర్తిగా అర్థం అవ్వలేదు . లోహియా ప్రస్తావన తేవటం నచ్చింది నాకు . యంత్ర నాగరికత గురించి లోహియా రాసిన వాక్యాలని ఆయన శిష్యులమని చెప్పుకొనే బీహార్ యూపీ నాయకులు ఎంత మంది అర్థం చేసుకున్నారో అసలు . యంత్ర నాగరికత , క్రైస్తవం రెండూ కలిసి ప్రపంచ వ్యాప్తంగా సృష్టించిన సాంస్కృతిక విద్వంసం అంతా ఇంతా కాదు . ఈ విషయం ఐలయ్యలకి అర్థం అవ్వాలంటే మీవంటి వారు తెలుగులో ఇంకా రాయాలి . మీ శైలి కొంచెం demystify చేస్తే ఇంకొంతమంది పాఠకులకి చేరువ అవుతుందని నా అభిప్రాయం . ఈ విషయంలో (రచనలు చదివే పాఠకుల సంఖ్య) కూడా “మైక్రో” గా ఉండిపోదామని అంటారా ఏమిటి ?

 9. శ్రీ రాం గారూ,
  రైటిస్టులూ,లెఫ్టిస్టులూ అన్నదమ్ములే.కానీ రామరాజ్యాన్ని సోషలిజం గా నిర్వచించిన సంత్ లాల్ దాస్ గుర్తున్నారా?లాల్ దాసు 1983 నుండి 1992 వరకు రామజన్మభూమి ప్రధాన పూజారి.అద్వాని రథయాత్ర ని వ్యతిరేకించాడు.మత సామరస్యాన్ని కోరుకున్నాడు.హిందూ రైటిస్టులని వ్యతిరేకించాడు.వర్ష ఋతువు లో గడ్డి పెరిగి మార్గం కానరానట్టే,సత్యం మరుగున పడిపోయింది.ఐతే వర్షా కాలం శాశ్వతం కాదు అన్నాడు.ఇది రామాయణ వాక్యం.1992లో హిందూ అతి శూద్ర ముఖ్య మంత్రి కళ్యాణ్ సింఘ్ అతన్న్ పూజారి గా తొలగించారు.ఆయన్ని హిందూ వాదులు చంపేశారు.బాబ్రీ మసీదు కూల్చేశారు.

  ఆ సమయం లో బుద్ధిస్టు అంబేద్కరైట్లు ఏమి చేశారు?బాబ్రీ మసీదు స్థలం తమకే కావాలంటూ ఎగబడ్డారు.మనువాద బ్రాహ్మణులు,ముస్లిం దురాక్రమణదారులు ఇద్దరూ మాకు శత్రువులే అని ప్రకటించారు ఉదిత్ రాజు(ఇదే ఐలయ్య ఫిలాసఫి).ఉదిత్ రాజు ఆల్ ఇండియా బుద్ధిస్టు కన్ ఫెడరేషన్ ఆఫ్ ఎస్సి ఎస్టి ఆర్గనైజేషన్స్ చైర్మన్.బౌద్ధ విహారాన్ని కూల్చి ముస్లింలు మసీదు కట్టారని ఆయన వాదం.అంబేద్కర్ భార్య సవితా అంబేద్కర్ కూడ దీనికి వంత పాడారు.ఆ స్థలం కోసం వాళ్ళూ హిందూ వాదులలాగే కోర్టుకెక్కారు.

  అంటే అందరిదీ కంటికి కన్ను సిద్ధాంతమే.మోనో థీయిస్ట్ ఫాసిజమే.కసాయిబు పదప్రయోగం హిందూ ప్రతీకలు వాడటం గురించి శ్రీ శ్రీ నే బ్రాహ్మణ వాది గా విమర్శించిన ఖాదర్ మొహ ఇద్దీన్,గంభీర సామాజిక విశ్లేషణలు చేసే బాల గోపాల్,హర గోపాల్,వర వర రావు,విరసం,అంబేద్కరిస్టులు కళ్ళకి కనబడే చరిత్ర నీ,అందులోని వైరుధ్యాలనీ ఎందుకు విశ్లేషించలేదు?అదంతా ప్రగతి శీల లౌక్యం ఫాసిజానికి ముసుగు .

  http://www.youthkiawaaz.com/2014/07/story-mahant-laldas-hindu-priest-opposed-demolition-babri-masjid/
  http://patwardhan.com/?page_id=427
  http://www.milligazette.com/news/563-now-buddhists-claim-ayodhya-babri-masjid-site
  http://kafila.org/2011/01/08/ayodhya-for-buddhistsall-india-confederation-of-scst-organizations/
  http://www.milligazette.com/news/5439-foreign-funds-worth-billions-fuel-hindu-terror
  (హిందూ వాదులకి క్రైస్తవ దేశాల నుండే ఫండ్స్ అందుతున్నాయి).

  • ఉదిత్ రాజ్ గతం గురించి మీ ద్వారా కొత్త వివరాలు తెలిశాయి. బాలగోపాల్ రాసిన కొన్ని వ్యాసాలు చదవటం తప్పించి మిగతావారి గురించి ఐడియాలేదు. మీరు వారిని విమర్శించటం కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే తెలుగు సాహిత్యం,మేధావులలొ లెఫ్ట్ వారి ప్రభావం చాలా ఉంది.

 10. @శ్రీనివాసుడు గారు,
  ఐలయ్య గారు ఎదో రాసేస్తూంటారు. అది అర్థం చేసుకోవటం చాలా కష్టం. శర్మ గారు శ్రమించి ఆయన సిద్దాంతాన్ని క్రోడికరించారు. అదే చాలా ఎక్కువ. నా చిన్నపట్టి నుంచి ఇటువంటి విశ్లేషణ లు చేసేవారిని చూస్తూనే ఉన్నాను. వాళ్లు కొత్త కొత్త ప్రతిపాదనలు చేస్తారు. అవేమి కార్య రూపం దాల్చవు. హిందువులపై ఆరోపణలు చేయటం తప్పించి వారు సాధించేదేమి ఉండదు. వారు ప్రతిపాదించే దళిత, మైనారిటి, మహిళలు సమైక్యంగా ఫ్రంట్ గా ఏర్పడి రాజకీయ అధికారం సాదించే దిశగా ఇప్పటివరకు సఫలం కాలేదు. జోగేందర్ నాథ్ మండల్ వంటి ప్రజాదరణ కలిగిన నాయకుడే, ఆ ప్రయోగం చేసి విఫలమయ్యాడు.

  పేపర్లలో వ్యాసాలు రాసుకొనే మేధావులు మహాఐతే చేయగలిగింది, ఒక గూటికిందవచ్చి సభలు జరిపి, మా జనసంఖ్య ఇంత శాతం ఉంది గనుక, వచ్చే ఎన్నికలలో ఇన్ని సీట్లు ఇవ్వాలని ప్రెస్ స్టేట్మెంట్ లు ఇవ్వటం. ఆ రోజుకి ఇంటికి పోవటం. కొంతకాలానికి దానిని మరచిపోతారు. ఎన్నికల సమయంలో, అధికారపార్టిలు ఎలాగు డబ్బు ఉండేవారికి సీట్లు ఇస్తాయి. దానిని విమర్శిస్తూ వీరు చిన్న సైజు రాజకీయ పార్టిని పెట్టి, ఎన్నికలముందు ప్రజల వద్దకు పోతారు. అధికార రాజకీయపార్టిలకు ఓటెయొద్దని పిలుపు ఇస్తారు. కాని ప్రజలు ఆ పార్టిలనే గెలిపిస్తారు. వీరి పార్టిలను తిరస్కరిస్తారు.

  ఇలా ఒక దశాబ్దం గడిచాక వీరు వివిధ పేపర్లకు రాసిన ఆర్టికల్స్ పుస్తకం గా అచ్చేయించి, పుస్తకావిష్కరణ సభ జరుపుతారు. ఆ సభకి మేధావుల మిత్రులందరు హాజరయి హిందుత్వ అంటే ఫాసిజం. హిందుత్వాదుల వలన దేశానికి ప్రమాదం పొంచి ఉంది అని హెచ్చరికలు చేసి, దానిపై వాళ్లు చేసిన పోరాటం స్మరించుకొంటారు ( అంటే వారిలో వారు ఒకరినొకరు పొగుడుకొని, దశాబ్దం కిందనే ఇలా జరుగుతుందని హెచ్చరించాము, అలానే జరుగుతున్నాది అని, వాళ్ళు గతంలో రాసిన ఆర్టికల్స్ గురించి గుర్తు చేసుకొంటారు). ఇదే నడుస్తున్న చరిత్ర. కాదంటారా?

  ఈ మధ్య కొత్తగా పి.విక్టర్ విజయకుమార్ అనే అతను హిందుత్వ వాదులన వలన దళితులకు, మైనారిటిలకు, మహిళలకు ప్రమాదం పొంచి ఉందని అని సారంగలొ రాస్తున్నారు. ఆయన పోటొ చూస్తే యువకుడిలా ఉన్నాడు. రానున్న రోజులలో ఈయన పాత మేధావుల స్థానం భర్తి చేస్తాడు కాబోలు.

  ఇంకొంతమంది ఉంటారు. మొదట్లో విమర్శించినా తరువాత ఎన్నికల టికెట్ దక్కితే హిందుత్వ పార్టి తరపున పోటిచేస్తారు. ఉదాహరణకు డిల్లి యం.పి. ఉదిత్ రాజ్ ఒకడు. వాస్తవానికి ఈ మేధావుల వలన బిజెపి కి లాభమే గాని నష్టంలేదు. వీరి వ్యాసల వలన,టి వి షో లలో వీరుచేసే వాదనల వలన, మధ్య తరగతి వారు హిందుత్వ వైపుకు మొగ్గుచూపుతారు. ఇక ఉదిత్ రాజ్ వంటివారు పార్టిలో చేరితే పోలరైజ్ అయిన వెనుకబడిన వర్గాల వారి ఓట్లు బిజెపి కి బోనస్ గా లభిస్థాయి.

 11. శ్రీనివాస్ గారు,
  పెద్ద దేశాలు,పెద్ద మతాలు,పెద్ద దేవుళ్ళు,మెగా ప్రాజెక్టులు ఇవి మాత్రమే ఐలయ్య దృష్టిలో ప్రజస్వామికమైనవి,పట్టించుకోవల్సినవి.కానీ చిన్ననీటి చలమలు,గ్రామాలు,గ్రామ దేవతలు,గిరిజన సంస్కృతి సంప్రదాయాలు అంటే మైక్రో కల్చర్స్ అప్రజాస్వామికమైనవి,అంతరించవలసినవి.అందుకే ఆయన దృష్టిలో మెగా స్టార్స్ లాంటి మూదే మతాలు ఉన్నాయి.
  1-క్రైస్తవం దీనికి తోక బౌద్ధం
  2-హిందూ
  3-ఇస్లాం
  వీటిలో సూపర్ స్టార్ క్రైస్తవం.ఆధునిక కాలం లో అన్ని ఆర్ధిక వ్యవస్థలని,రాజకీయాలనీ శాసిస్తున్నవి క్రైస్తవ దేశాలే.అవి ప్రజాస్వామిక దేశాలే కాదు.నయానా భయానా ప్రజాస్వామ్యాన్ని వ్యాపింపజేయగలవు.వారి ప్రయోజనాలు నెరవేర్చని ప్రజాస్వామ్యాన్ని ఉరి తీయగలవు ఇరాక్ లోలా.ఇతర దేశాల లోకి కుద చొరబడి చంపగలవు.ఐతే ఇదంతా ప్రజాస్వామ్యం పేరుతోనే,బైబిల్ పట్టుకొనే.ఒక చేత్తో బైబిలూ,మరో చేత్తో తుపాకీ పట్టుకుని వలస క్రైస్తవులు ప్రపంచాన్ని జయించారు.తుపాకీ ఆయుధం కాదు లెండి.ఐలయ్య దృష్టిలో ఆధునిక మెగా ఆయుధాలు ఆయుధాలే కావు.అణ్వస్త్రం అసలు అస్త్రమే కాదు.అవన్ని అభివృద్ధికి సూచికలు.అస్త్రాలంటే హిందూ దేవతలు ధరించిన మొరటు ప్రాచీన పరికరాలు మాత్రమే.
  క్రైస్తవం ఒకే దేవుడు ఒకే గ్రంధం పేరుతో బహుళ దేవతలని,సంస్క్రుతులని విశ్వ వ్యాప్తంగా నిర్మూలించడం,మంత్ర గత్తెల పేరుతో ఆదవాళ్ళని చంపడం,క్రూసేడ్లు,నాజీ ఫాసిజాలు,దురాక్రమణ యుద్ధాలు ఇవేవీ అప్రజాస్వామికమైనవి కాదు.బానిస వ్యవస్థని బైబిల్ సమర్థించినా అది పవిత్రమే.ఎందుకంటే అదంతా ప్రజాస్వామ్య విస్తరణ కోసం,మెగా అభివృద్ధి కోసం చేపట్టిన దైవ కార్యక్రమం.ప్రకృతి అంతా మనిషి కోసమే – క్రైస్తవ సామ్రాజ్య వాది కోసమేననే డివైన్ ప్రాజెక్టులో ఇదంతా భాగం.
  కె.బాల గోపాల్ హిందూ మతం పుట్టుకతోనే అప్రజాస్వామ్మికమైనది అంటారు.అసలు హిందూ మతం అంటే ఏమిటి?హిందూ-ముస్లిం అనే మూస విభజన లోని తప్పుని గ్రహించి కూడా ఇలా నోరు జారుతారాయన.దానికి కారణం ఆయన అనుసరించిన కమ్యూనిస్టు చరిత్రకారుడు కోశాంబి.భారత దేశం గ్రీసు లా లేనందుకు,గ్రీకు తత్వ వేత్తలవంటి వారు ఇక్కడ పుట్టనందుకు తెగ బాధపడిపొతాడు కోశాంబి.హెగెల్ మార్క్సులు భారత దేశాన్ని చరిత్ర హీనమైనదిగా భావించారు.ఆ పాశ్చాత్య గూటిలో చిలకే బాల గోపాల్.
  ఇటువంటి క్రైస్తవ వలస వాద దాస్యానికి గ్లోబలైజ్డ్ వ్యక్తీకరణే ఐలయ్య.ఆయ్న మరుగుపరిచిన సత్యాలు వాటికి కారణాలు.1-నేపాల్,భారత దేసాలు క్రైస్తవ వలస వాదం వలన ప్రజా స్వామ్య లక్షణాల్ని సంతరించుకున్నాయని అంటాడు. శ్రీలంకలో రాజ్యమే తనని బుద్ధిస్టు స్టేటు గా ప్రకటించుకొంది.ఈ బౌద్ధ రాజ్యం తమిళుల సర్వ హక్కులని శాంతియుతంగ హతమార్చింది అనే సంగతిని మరుగుపరచడానికే బౌద్ధ మతం ప్రసక్తి అసలే తీసుకురాడు ఇక్కడ.2-తమిళ పోరాట వీరుడు ప్రభాకరన్ కృష్ణుదు బోధించిన భగవద్గీతనే స్ఫూర్తిగా ప్రకటించుకున్నడు.బౌద్ధానికి దాన్ని పోటీగ నిలిపాడు.భారతీయ స్వాతంత్ర్య పోరాటానికి స్ఫూర్తి కూడా గీతే.
  ఇటువంటి సంగతులు ఎందువల్ల మరుగుపరిచాడు?చారిత్రక పురుషులకన్నా పురాణ పురుషులే ప్రభావం కలిగిస్తారు.క్రీస్తు చుట్టూ మహిమల కథలు,పునరుత్థానాలు,బుద్ధుని పునర్జన్మల జాతక కథలు వారిని పురాణ పురుషులు గానె నిలుపుతున్నాయి.ఇస్లాం ఒందుకు మినహాయింపు.జాతక కథల ప్రభావం తోనే పురాణాలు పుట్టాయంటారు.
  బుద్ధుడు క్రీస్తులతో పోలిస్తే రాముడు సాధారణ మానవుడిగా కనిపిస్తాడు.మహిమలు చేయడు.అతని జీవితం పూర్తిగా లౌకికమైనది.తన సమస్యలని కూద ఇతరుల సాయంతోనే పరిష్కరించుకుంటాడు.నీటిపై వంతెన నిర్మించదం,ఆకాశ యానం ఇవి మానవ జాతి యొక్క పురాతన ఊహలు.పెద్ద ఏపు(హనుమంతుడు)తో స్నేహం మనిషి జంతువు సహొదరులేనన్న డార్విన్ డిసెంట్ ఆఫ్ మేన్ ని గుర్తుకు తెస్తుంది.అందుకే అడవుల్నీ,కొండల్నీ నిర్మూలిస్తుంటే కోతుల్ని రక్షించడానికి హనుమంతుని భక్తులు పడుతున్న పాట్లని వర్ణిస్తారు జయధీర్ తిరుమలరావు ‘తొవ్వ ముచ్చట్లు ‘ లో.బుద్ధునికి పోటీగా రాముడిని సృష్టించారని కొందరు పాశ్చాత్య పండితులు అంటారు కానీ బౌద్ధ జైన రామాయణాలు కూడా ఉన్నాయన్న సంగతి మరిచిపోకూడదు.బహుళ రామాయణాలని ప్రస్తావించిన ఎ.కె.రామానుజన్ వ్యాసాన్ని హిందూ వాదులు వ్యతిరేకించారు.ఒకే పవిత్ర గ్రంథంగా ఘనీభవించకపోవడం వల్ల బహుళ వ్యాఖ్యానాలు,బహుళ కథనాలూ సాధ్యమవుతాయి.అదే నిజమైన ప్రజాస్వామ్యం.అంతే కానీ ఒకే గ్రంథం,ఒకే దేవుడూ కాదు.
  బౌద్ధ గ్రంథాలు కుల వ్యవస్థని సమర్థించడమే కాదు దానికి తాత్విక రూపమైన కర్మ సిద్ధాంతాన్ని అభివృద్ధి పరిచాయి.బౌద్ధ అహింసా వాదం వేట మీద జీవించే గిరిజనులని,వ్యవసాయదారులని కూడా నీచ కులాలుగా చూసే పరిస్థితిని
  సృష్టించింది.దీని నుంచే మను స్మృతి పుట్టింది.మను స్మృతిని వ్యతిరేకించడమంటే బౌద్ధాన్ని వ్యతిరేకించడమే.(ఇర్ఫాన్ హబీబ్).
  కనుక అహింస,ప్రజాస్వామ్యం వంటి పదాలు సందర్భానికి అతీతంగా వాటికవే పవిత్రమైనవి కావు.ప్రజాస్వామ్యం పేరుతోనే బహుళ జాతి కంపెనీలు గిరిజనుల జీవితాన్ని,సంస్కృతిని చిన్నాభిన్నం చేస్తున్నాయి.నదులనీ,వాతావరణాన్నీ కలుషితం చేస్తున్నాయి.
  ఐలయ్య గిరిజనుడు బిర్సా ముండా మతం,కబీరు పంథి,శైవ వైష్ణవాలూ,సూఫీయిజం,కుల ఉపకుల పురాణాలూ వీటి గురించి ఎందుకు మాట్లాడడు?ఏ రూపం లో పిలిచినా పలుకుతానన్న భగవద్గీత ప్రజాస్వామ్య సందేశాన్ని బహుళ సంస్కృతిని ఎందుకు పట్టించుకోడు?మైక్రో సంస్కృతులని ఎందుకు చూడడు?అవి క్రైస్తవం వల్ల దాని ఏక శిలా సదృశ సంస్కృతి వల్ల ధ్వంసమవుథున్నా క్రైస్తవం వెంటే ఎందుకు పరిగెడతాడు?ప్రచ్చన్న క్రైస్తవమైన హిందూ మతం లో బహుజన విముక్తిని ఎందుకు కల గంటాడు?
  పంతుళ్ళు కాదు అతి సూద్ర మేధావి జయధీర్ తిరుమల రావు గారి రచనలు చదివితే ఇటువంటి ప్రశ్నలే అంకురిస్తాయి.
  http://www.andhrabhoomi.net/news/Editorial%20-%20Thovva%20muchatllu%20-%20jayadhir?page=1
  http://www.andhrabhoomi.net/news/Editorial%20-%20Thovva%20muchatllu%20-%20jayadhir?page=1

  https://www.google.co.in/search?q=prabhakaran+on+bhagavad+gita&start=10&sa=N&espv=2&biw=1440&bih=785&tbm=isch&imgil=G1XDx619zwa76M%253A%253BBMmUcy_zIDKeeM%253Bhttp%25253A%25252F%25252Ftamilweek.com%25252Fthiruvedkai%25252Fpage%25252F2&source=iu&pf=m&fir=G1XDx619zwa76M%253A%252CBMmUcy_zIDKeeM%252C_&usg=__e8_Qnw93WAJZK-wUP2hGETPGkUc%3D&ved=0CEwQyjc4Cg&ei=yl1QVZmCGsS5uATt1IGQCw#imgrc=G1XDx619zwa76M%253A%3BBMmUcy_zIDKeeM%3Bhttp%253A%252F%252Ftamilweek.com%252Fthiruvedkai%252Fwp-content%252Fuploads%252F2014%252F11%252FVP_GITA.jpg%3Bhttp%253A%252F%252Ftamilweek.com%252Fthiruvedkai%252Fpage%252F2%3B960%3B720

  http://www.christianitytoday.com/ch/1992/issue33/3324.html

  http://www.sacw.net/article2344.html

  • మహాశయా,
   ఈ కవిత చూడండి,
   ‘నక్షత్రాల్ని సృష్టించడానికి నేను శ్రమించిన రోజులు పోయాయి
   నాకో పేరు పెట్టడానికి నా మెదడును నేనే కుదుపుతున్నాను
   నమ్మకాలన్నీ రెచ్చగొట్టబడ్డ స్వరాలు/ దేవుళ్ళంతా నా స్వంతనీడలు!
   పట్టిపీడించే పిశాచం మరేదోకాదు/జంతు సదృశమైన నా అంతరాత్మే’

   ఆధునిక సాహితీ కాశ్మీరం, జ్ఞానపీఠ పురస్కార గ్రహీద రెహమాన్ రాహి . ‘నీడలు’-శీర్షికన రెహమాన్‌ రాహి రాసిన కవితా చరణాలు ఇవి. విశాలాంధ్ర సాహిత్య పేజీ 11 5 2014 లో దేవరాజు మహారాజు గారి వ్యాసం పూర్తి పాఠం కొఱకై ఈ లంకెను నొక్కండి.
   శ్రీనివాసుడు.
   http://54.243.62.7/literature/article-152814

  • శర్మగారు, మీ వివరణ చాలా బాగుంది. ఈ క్రింది ఆర్టికల్ చదవండి.

   The Dangers of Monotheism in the Age of Globalization
   Can India’s polytheism provide a moral and spiritual example to the world that the West and Islam cannot? By Jean-Pierre Lehmann, March 30, 2006

   http://www.theglobalist.com/dangers-monotheism-age-globalization

   __________________
   క్రైస్తవ మతం ఒక పెద్ద వ్యాపార సంస్థ. వాటికన్ చర్చ్ ఆధీనంలో ఉన్న వాటికన్ బాంక్ లో, వివిధ యురోప్ దేశాల వారు డబ్బులు దాచుకొన్నారు. యురోప్ ఆర్ధిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతిన్న ప్రస్తుత తరుణంలో, వాటికన్ బాంక్ చేసే ఆర్ధిక లావాదేవిలను వెలడించాలని యురోప్ లో అన్ని దేశాలు కోరాయి. అందులో జరిగే అవకవతవకలపై సుమారు 10 సంవత్సరాలు పరిశోధన చేసి ఈ మధ్యనే గెరాల్డ్ పోస్నర్ అనే జర్నలిస్ట్ పుస్తకం రాశాడు. దానిని ప్రస్తుత పోప్ కి అందజేశాడు. వాటికన్ బాంక్ ను ప్రక్షాళన చేయటంలో పోప్ గారికి ఆ పుస్తకం ఉపయోగపడుతున్నది ఆశాభావం వ్యక్తం చేశాడు.
   Gerald Posner on the Vatican Bank
   https://www.youtube.com/watch?v=N6SjNq9JUCs

   God’s Bankers: A History of Money and Power at the Vatican
   http://www.amazon.in/Gods-Bankers-History-Money-Vatican-ebook/dp/B00LD1S4FI/ref=dp_kinw_strp_1/278-0642305-3116864
   ___________________________________
   బ్రిటిష్ కాలం నుంచి ప్రతి దేశంలో ను చర్చ్ ఆధీనంలో ఎంతో భూమి ఉంట్టూ వస్తున్నాది. ఉదాహరణకు మనదేశంలోనే చర్చ్ కి సుమారు లక్ష కోట్ల పైన ఆస్థులు ఉన్నాయి. వాటిని కాపాడుకోవటానికి తెల్లోడు పాలించిన దేశాలలో మతమార్పిడులు జరిపారనిపిస్తుంది. వెనుకబడిన కులాలవారిని వారే ఉద్దరించినట్లు, కథలు కట్టి ప్రచారంచేసే క్రైస్తవ ప్రాపగండా ఎలాగు ఉండనే ఉంది. మతం మారినవారు దానిని నమ్ముతూంటారు, చర్చ్ ఆస్థులకు రక్షణగా నిలుస్తారు. ఈ ఆస్థులను పరిరక్షిస్తూంటారు. ఎప్పుడైనా స్థానికీ ప్రభుత్వాలు చర్చ్ భూములను తీసుకోబోతే/ మేనేజ్మెంట్ చేయబోతే సెక్యులరిజానికి భంగం కలుగుతోందని గోలచేస్తారని భయం. మనదేశంలో లెఫ్ట్ వింగ్ వారి సంగతి చెప్పకరలేదు. ఇటువంటి అంశాలపై హిందుత్వ వాదులు ఘోరం చేస్తున్నట్లు ప్రచారంచేస్తారు. వీరి గోలను అంతర్జాతీయంగా క్రైస్తవ దేశాల వారు ఎక్కువగా చేసి చూపుతూ, ఇండియాలో మత స్వేచ్చలేదని ప్రచారం చేయవచ్చు/ చేస్తాయి కూడాను. అందువలన మన ప్రభుత్వాలు వారి ఆస్థులపై చేయి వేయవు.

   ఈ అంశాన్ని ఇంకొకకోణంలో చూస్తే, ఈ చర్చ్ ఆధినంలో ఉండే ఆస్థులు వెస్ట్ వారికి టాక్స్ హెవెన్స్ వంటివి. వారికి డబ్బులు అవసరం వచ్చినపుడు భూములను అమ్ముకొని డబ్బులను వారిదేశానికి తీసుకుపోవచ్చు. అయితే అప్పుడప్పుడు కొన్ని ఊర్లల్లో స్థానిక క్రైస్తవులు/ రాజకీయ నాయకులు చర్చ్ ఆధీనంలో ఉన్న స్కూల్, హాస్పిటల్, చర్చ్ భూములలోఇళ్లు కట్టుకోవటమో లేక స్థలాన్నిఆక్రమించుకొని సంపన్నులై లాభపడుతూంటారు. వీటి గురించి స్థానిక పేపర్లలో వార్తలు వస్తూంటాయి. కాని తీగలాగితే డొంక ఎక్కడ కదుల్తుందో అని ఎవరు వీరి పై చర్యలు తీసుకొన్నట్లు కనపడరు.

   http://www.deccanherald.com/content/16533/church-funds-equal-indian-navys.html

 12. శ్రీరాం గారు
  రైట్ వింగ్ గ్రూప్స్ దౌర్జన్యం గురించి అరుణ్ సౌరి చెప్పిన మాటలు వర్తమాన భారతాన్ని కళ్ళకు కడుతున్నాయి.మనం గత చరిత్రలో జీవించలేము.ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకి శాపంగ పరిణమించిందని అరుణ్ సౌరి,మురళి మనొహర్ జొషి వంటి హిందు నాయకులె విమర్శిస్తున్నారు. హిందూ బ్రాహ్మణులు మళ్ళీ వేదాలు వల్లిస్తున్నారు.మోదీత్వ-అభివృద్ధిలో దళిత బహుజన విముక్తిని కలగనే ఐలయ్య బృందానికి బుల్లెట్ ట్రైన్స్ కాదు,సాధారణ రవాణ వ్యవస్థ నేటి అవసరం అని మురళీ మనోహర్ జొషి చెప్పే వేద వాక్యం వినబడుతుందా?ఖరీదైన కోటు ధరించడం తగదని అరుణ్ సౌరి బోధించే గాంధేయ నిరాడంబరత్వం తలకెక్కుతుందా?రైట్ వింగ్ గ్రూప్స్ కి కాని,ఐలయ్య బృందానికి కాని మీరు చెప్పే భారతీయ బహుళత్వం రుచిస్తుందా?
  http://economictimes.indiatimes.com/news/politics-and-nation/modi-governments-economic-policy-directionless-minorities-anxious-arun-shourie/articleshow/47124704.cms
  http://www.dnaindia.com/india/report-murli-manohar-joshi-pokes-holes-into-modi-government-s-plans-to-develop-varanasi-2083315

  • శర్మగారూ,
   బహుశా, మీ వ్యాసానికి సమాధానంగానేమో, ఆంధ్రజ్యోతి దినప్రతిక శనివారం 09-05-2015 లో ఐలయ్యగారు దేవుడు ప్రజాస్వామ్యవాదా? అన్న వ్యాసం వ్రాసేరు. దానిలో కొన్ని ఉటంకింపులు
   1. నిత్యజీవితంలో అప్రజాస్వామ్యంగా బతికే వ్యక్తికి ప్రజాస్వామ్య ప్రక్రియను దేవునితో ముడేసే సరికి భయమేస్తుంది. అటువంటి పేరున్న పుస్తకాన్ని ముట్టుకోవాలంటే కూడా భయమేస్తుంది.
   2. యన జీవిత చరిత్ర, టీచింగ్స్‌ నాలుగు గాస్పెల్స్‌ రూపంలో బైబిల్‌లో చేర్చాక ఆయన విగ్రహాంలోగాని, ఆయన్ని ఏ శిలువపై చంపారో ఆ శిలువ విగ్రహంలో గాని చర్చి వెలిసాక ప్రపంచ రూపురేఖలే మారిపోయాయి. బుద్ధుడు, జీసెస్‌ హింసావాద వ్యతిరేకులు. వారి టీచంగ్స్‌ సర్వమానవ సమానత్వాన్ని కోరుకున్నాయి. ఇద్దరి జీవిత ప్రక్రియలో, సంఘ నిర్మాణ, స్ర్తీ పురుష సంబంధాల్లో మార్పు, అంతిమంగా వాళ్ళు కోరుకున్న రాజ్య వ్యవస్థ ప్రజాస్వామ్య విలువల గురించి సుదీర్ఘ చర్చ, ఆచరణకు అనువైన చాలా సూచనలు ఉన్నాయి. వాటి ప్రభావం ప్రపంచ సామాజిక, రాజకీయ వ్యవస్థల మీద చాలా బలంగా ఉంది.
   3.ప్రపంచ అబ్‌స్ర్టాక్ట్‌ గాడ్‌ గాని, బుద్ధుడు, జీసెస్‌లు గాని మానవ సమాజంలో ప్రజాస్వామ్య విలువలు, ఆచరణ, అభివృద్ధికి చాలా తోడ్పడ్డారు. ఇప్పటికే మనుష్యుల్ని రాజ్యం, చట్టాలు, పోలీసు, మిలిటరీ వ్యవస్థల కంటే ఎక్కువగా నియంత్రించే శక్తి దేవుడు. దేవుడు అనే భావం, దాని చుట్టూ భక్తి, ప్రేమ, భయం వ్యవస్థల మీద ప్రభావం పడేసాయి. మానవ గవర్నెన్స్‌లో ఇప్పటికీ దేవుని పాత్ర రాజ్యం పాత్ర కంటే ఎక్కువ.ఈ వెలుగులో చూసినప్పుడు హిందూ వ్యవస్థ నిర్మించి, నమ్మే ఆచరించే వైష్ణవ స్కూల్‌ దేవతలకు గాని, శైవ స్కూల్‌ దేవతలకు గాని ప్రజాస్వామ్య విలువలు, లక్ష్యాలు, ఆచరణ ఉన్నాయా?
   4.విష్ణువు, ఆయన అవతార దేవతలు రాముడు, కృష్ణుడు ఊహాజనిత దేవతలు. వారికి బుద్ధుడికి, జీసెస్‌కు ఉన్నట్టు మానవ జీవన చరిత్ర లేదు. కృష్ణుడు రాసినట్టు చెప్పబడుతున్న ఒక్క ‘భగవత్‌ గీత’ తప్ప వాళ్ళ బోధనలు అంటూ ఏమీలేవు. వాళ్ళ చుట్టూ అల్లిన కథలు, వారి బొమ్మలు ఇప్పుడు మన ముందున్నాయి. మొదట వీరి గురించి ఉన్న కథలల్లో మనకు కనిపించేది వారి హింసాయుత హీరోయిజం. దేవుడే హింసను అనుసరించదగ్గ విలువను ఆచరణలో పెడతాడు. అతని గురించిన వర్ణనలో గాని, అతని విగ్రహ రూపంలో గాని ఆయుధాలు (చక్రం, బాణం, త్రిశూ లం) కొట్టొచ్చేవిగా కనిపిస్తున్నప్పుడు మానవ సంబంధాలపై వారి ప్రభావం ఎలా ఉంటుంది అనేది చాలా ముఖ్యం. వీరిలో ప్రజాస్వామిక ప్రక్రియకు వ్యతిరేక అంశం వారికి అంటగట్టబడ్డ కులపునాదిలో వుంది.
   5.ఒక వ్యక్తి నమ్మే దేవునికి ప్రజాస్వామిక విలువలు లేకపోతే అతనికి/ఆమెకు ఆ విలువలు ఎక్కడి నుండి వస్తాయి? అసలు తమ దేవతలను కూడా ఇంత హింసాయుతంగా, ఇంత అప్రజాస్వామికంగా, ఇంత స్ర్తీ వ్యతిరేకులుగా ఎందుకు రూపొందించుకున్నారో చెప్పాలి గదా! ఇంత విగ్రహారాధన (పుస్తకారాధన కాదు) మతంలో ఉంటే విగ్రహాల నుంచి ప్రజలు ప్రజాస్వామిక విలువల్ని ఎట్లా నేర్చుకుంటారో చెప్పాలి గదా! మార్పు లేని మతం మంచిదెట్టయితదో చెప్పాలి గదా!
   వ్యాసం లంకె – http://www.andhrajyothy.com/Artical.aspx?SID=107621&SupID=26

 13. శివశంకర్ శర్మగారు,
  మీ ఈ వ్యాసం లో జతపరచిన లింక్ ల తో సహా చదవటం జరిగింది. ఐలయ్యగారి తాత్వికతలో నాకేమి కొత్తదనం కనపడలేదు. వారి ఇంటర్వ్యులు చదువుతుంటే జోగేందర్ నాథ్ మండల్ గారు చేసిన ప్రయత్నం గుర్తొచ్చింది.పాకిస్థాన్ ఫౌండింగ్ ఫాథర్స్ లో జోగేందర్ నాథ్ మండల్ గారు ఒకరు. దళితుడు. పాకిస్థాన్ మొదటి న్యాయ శాఖ మంత్రి. జిన్నా మరణాంతరం మంత్రి పదవికి రాజీనామ చేసి భారతదేశం వచ్చి స్థిరపడ్డారు. రాజీనామ కారణాలను వివరిస్తూ లియాకత్ ఆలి ఖాన్ కి ఆయన రాసిన సుదీర్ఘ రాజీనామాలేఖను వీలున్నపుడు చదవండి.

  http://en.wikisource.org/wiki/Resignation_letter_of_Jogendra_Nath_Mandal

  మీ లోతైన వ్యాసం ,మీరిచ్చిన రెఫెరెన్స్ లు తెలుగు రచయితలలో చాలా అరుదు. ఈ వ్యాసం చదువుతూంటే ముకుంద్ రావు రాసిన ది అదర్ సైడ్ ఆఫ్ బిలిఫ్ ఇంటర్ప్రెటింగ్ యు.జి.కృష్ణమూర్తి పుస్తకం, అరుణ్ షౌరి, మొదలై వారు రాసే పుస్తకాల స్థాయికి, ఈ వ్యాసం ఏ మాత్రం తీసిపోదు. ఎవరి ఫిలాసఫి వారిది కావచ్చు కాని, అది కొందరికి నచ్చవచ్చు, నచ్చక పోవచ్చు, కాని తీసుకొన్న అంశంపై క్లారిటి ఆఫ్ థాట్ ఆ రచయితలలో ఉంట్టుంది. మీలో అది ఉంది. వీలైతే ఇంగ్లిష్ లో అనువదించండి. ఎంతో మందికి చేరుతుంది.

 14. 1. కంచ ఐలయ్య ముస్లింలలో మేధావులు తక్కువగా వున్నారంటాడు. ఈ కంచ ఐలయ్యని నిలదీసిన హిందీ సినీ కవి జావేద్‌ అక్తర్‌ మేధావిగా కనబడలేదా?

  ఇండియన్ ముస్లిం లలో మేధావులకు కొదవులేదు. జావేద్ అక్తర్ ఒక్కడే కాదు ఎంతో మంది మేధావులు ఉన్నారు. పాకిస్థాన్ లో హసన్ నిసార్, నజం సేథి (పాత్రికేయుడు, పంజాబ్ మాజి ముఖ్యమంత్రి) ఇంకా ఎంతో మంది యన్.ఆర్.ఐ. ముస్లిం మేధావులు ఉన్నారు. టివిలో వచ్చే వీరి ప్రోగ్రాం లు లక్షల మంది దేశ విదేశాలలో ఉండే భారతీయులు చూస్తూంటారు. ఆయనను ప్రశ్నిస్తూంటారు. హసన్ నిసార్ ఇండియన్ ముస్లిం ల లో మార్పు రావాలని గా కృషి చేస్తూంటారు.. ఆయన నిజాయితి, ధైర్యం, ఉన్నది ఉన్నట్లు గా మాట్లాడే తత్వం ఎవ్వరినైనా ఇట్టే ఆకర్షిస్తాయి.

  Hasan Nisar says Indians and Pakistanis have same DNA
  https://www.youtube.com/watch?v=tlW13Y2C9us

  Hassan Nisar On Partition
  https://www.youtube.com/watch?v=J9ZQrnSsoiM

  https://www.youtube.com/watch?v=iY4vMwfmnN8

  https://www.youtube.com/watch?v=CbBmQNC_Rys

  2. ఇస్లాంని సంస్కరించదగిన అనాగరిక మతంగా, ముస్లింలని క్రైస్తవుల దగ్గర పాఠాలు నేర్చుకోదగినవారుగా అభివర్ణిస్తారు కంచ ఐలయ్య.

  పాకిస్తాన్,అరబ్ దేశాల ముస్లిం మేధావులు అలా అనుకోవటంలేదు.వాళ్లు భారత దేశం నుంచి నేర్చుకోవాలని చూస్తున్నారు. ఎందుకంటే విభిన్న జాతులు,మతాలు తెగలు కలసి మెలసి ఉండటం వారికి అద్భుతం గా అనిపిస్తున్నాది.దేశవిభజన కు ముందు హిందువులతో కలసిమెలసి ఉన్నపుడు ముస్లింల్ లలో ఉన్న వివిధ వర్గాల వారు, వారిలో వారు కలహించుకోకుండా హిందుస్తాన్ లో ప్రశాంతంగా జీవించే వారమని, అదే బాగుండేదని ఎంతో మంది చర్చలలో చెప్తూంటారు.

  A country that rides elephants

  http://www.saudigazette.com.sa/index.cfm?method=home.regcon&contentid=20150415240425

  https://www.youtube.com/watch?v=kHOBsfhkn54

 15. నేను హిందువు నెట్లయిత? అని ప్రశ్నించిన కంచ ఐలయ్య గారు, నేను హిందువును కాదు అని కుండ బద్దలు కొట్టిన రాణి శివశంకర శర్మ గారు హిందూ వ్యతిరేకులుగా కన్పిస్తారు. ఈ విషయంలో వీరిద్దరికీ ఏకీభావం ఉన్నట్టు కన్పిస్తుంది. కానీ ఈ ప్రతిపాదనల వెనుక వారికున్న తాత్విక దృక్పధం పూర్తిగా పరస్పర వ్యతిరేకం. ఐలయ్య గారి తాత్విక దృక్పధం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చెప్పాలనే ప్రయత్నం శర్మ గారు ఈ వ్యాసంలో చేసినట్టు కనిపిస్తుంది. ఆయన వాదనను నిశితంగా పరిశీలించడానికి ప్రయత్నం చెయ్యాల్సి ఉంది. ఆయన చూపిన ఉపపత్తులు ఆయన వాదాన్ని ఎంతవరకు బలపరుస్తున్నాయనే విషయం కూడా శ్రద్ధగా పరిశీలించాలి. ఇలాంటి సందర్భంలో మాటల దౌర్జన్యంతో వారిద్దరిలో ఏ ఒక్కరి వాదాన్ని ఖండించినా అది మంచి విమర్శ కాబోదు. ఐలయ్య గారు కానీ, రాణీ శర్మ గారు కానీ సత్యాన్వేషకులే తప్ప అన్యం కాదనే విషయంలో ఎవరికీ భిన్నాభిప్రాయం ఉండాల్సిన పని లేదు. ఐలయ్య గారినీ శర్మ గారినీ పూర్తిగా అవగాహన చేసుకోకుండా వారిని పూర్తిగా చదవకుండా ఏ ఒక్క వ్యాసం పైనో అందులోని కొన్ని ప్రతిపాదనలపైనో విమర్శ చేయడం కూడా సరికాదనుకుంటాను. రెండు పరస్పర విరుద్ధమైన తాత్వికతలను నిష్పాక్షికంగా పరిశీలించడానికి ఈ వేదిక ఉపయోగిస్తుందని ఆశిస్తాను.

 16. *గౌండర్లు నడిపే స్కూళ్ళని బ్రాయిలర్ స్కూళ్ళు అని విమర్శించి, వారి వ్యాపార తత్త్వాన్ని బహిర్గతం చేయడం అంతర్గత కారణం. *
  శర్మగారు, నా బ్లాగ్ ఇతరులకు ఓపెన్ కాదు అన్న విషయం నాకు ఇప్పటి వరకు తెలియదు. పైన మీరు రాసింది చదివితె ఇటువంటి వ్యూహం తమిళనాడులో ఎప్పటినుంచో ఉన్నట్లుంది. భారత జలాల లో మత్ససంపదను ఖాళీ చేసి, శ్రీలంక జలాల లో వేటాడటం. అక్కడ పట్టుకొంటే తమిళ సెంటిమెంట్ రెచ్చ గొట్టటం, సుబ్రమణ్య స్వామి జాలర్లను విడిపించి, మరపడవలను విడిపించటానికి ప్రయత్నించలేదని, ఆయనపై రెండు ద్రవిడపార్టి నాయకులు కలసి అర్ణబ్ గోస్వామి షో లో దాడికి దిగారు. తమిళనాడులో ద్రవిడవాదులు నాస్తిక వాదం మోస్తున్నట్లు పైకి కనిపిస్తూ దేవాలయలాను పూర్తిగా వారి ఆధినంలో ఉంచుకొని ఆలయ సొమ్ములను స్వాహా చేయటం. ఉచిత పథకాల కోసం, మద్యం అమ్మకాలను విపరీతంగా ప్రోత్సహించటం. ఇవ్వన్ని ఆ రాష్ట్ర ప్రజల భవిషత్ ను వారికి తెలియకుండానే దెబ్బతీస్తున్నాయి. ఆధునిక బ్రాహ్మణవాదం పెరిగిపెద్దదై పోయి, తమిళనాడులో ఇప్పుడు కులానికొక రాజకీయ పార్టి పెట్టుకొన్నారు.

  1. ఎమ్బీయస్‌ : శ్రీలంకలో మత్స్యపరిశ్రమ
  http://telugu.greatandhra.com/articles/mbs/mbs-srilanka-lo-matyaparisrama-57124.html

  2. The Newshour Debate Swamy vs Jayalalita
  https://www.youtube.com/watch?v=xrDa1MV66Yc

  3. Tamilnadu Hindu Temple Loot
  https://storify.com/ranganaathan/tamilnadu-hindu-temple-loot

  4. Freeing temples from state control
  http://thehindu.com/opinion/lead/freeing-temples-from-state-control/article5594132.ece/

  5. South Indian households account for 60 per cent of total alcohol expenditure in 2013-14
  http://www.consumer-pyramids.com/kommon/bin/sr.php?kall=wclrdhtm&nvdt=20150112170458073&nvpc=095000000000&nvtype=INSIGHTS

  6. ఎమ్బీయస్‌: తమిళనాడు కొంప ముంచిన ఉచితాలు
  http://telugu.greatandhra.com/articles/special-articles/tamilnadu-kompamunchina-welfare-60872.html

  7.The Gangs of Egmore – criminals, lawyers and lawyer-క్రిమినల్స్
  http://www.thenewsminute.com/news_sections/2989
  http://www.thenewsminute.com/news_sections/3009

 17. శ్రీరామ్ గారూ,
  మీ బ్లాగు ఓపెన్ కావడం లేదు. This blog is open to invited readers only అని వస్తోంది. అయితే, మళ్ళీ మీరు తమిళతుట్టెను కదిపేరు. తమిళనాడులో యిటీవల పెరియార్ అనుయాయి వీరమణి తాళిని తెంచే కార్యక్రమాన్ని చేపట్టేరు. తాళిని తెంచడం, మనుస్మృతిని తగలబెట్టడం లాంటి ఉద్యమాలు ఆధునిక బ్రాహ్మణవాదాన్ని ఎదుర్కోలేవు, పైగా అసలు విషయాన్ని మఱుగుపఱుస్తాయి. గౌండర్ల కులం వారు (బి.సి,) ఇటీవల పెరుమాళ్ మురుగన్ అనే రచయితని తన రచనలు తానే మార్కెట్ లోంచి వెనక్కు తీసుకునేంతగా హింసించారు. దానికి కారణాలను చూస్తే, గౌండర్ కుల స్త్రీల ఆచారాన్ని గుఱించి బట్టబయలు చేయడం పైకి చెప్పే కారణయితే, గౌండర్లు నడిపే స్కూళ్ళని బ్రాయిలర్ స్కూళ్ళు అని విమర్శించి, వారి వ్యాపార తత్త్వాన్ని బహిర్గతం చేయడం అంతర్గత కారణం. ద్రవిడ భారతి గానీ, మఱే యితర ప్రగతిశీల హేతువాద, నాస్తికవాద సంస్థలు గానీ పెరుమాళ్ పై జరిగిన దాడిని గట్టిగా ఖండించలేకపోవడం వొక వాస్తవం. పైన ప్రస్తావించిన సింబాలిక్ యాక్షన్లను జరిపి సంచలనాలు సృష్టించడం, తద్వారా వార్తా ప్రసార సాధనాల్లో మాఱుమ్రోగడం సులభమే గానీ, ఆ విధంగా ఆధునిక బ్రాహ్మణవాద దౌర్జన్యాన్ని ఎదుర్కోవడం కష్టసాధ్యం.
  —— రాణిశివశంకర శర్మ

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.