cover

భూచక్రం అను ఒక Eternal Drama

Download PDF EPUB MOBI

ఇది ఒక భూమి కథ. అంతేనా? విభిన్న మానవ చిత్త ప్రవృత్తుల మధ్య ఎప్పుడూ నలుగుతూ అంతంలేకుండా తిరిగే కథ.. సర్వకాలాల్లోనూ జరిగే ఈ కథకి రచయిత తీసుకున్న నిర్దిష్టకాలం ఒక వంద సంవత్సరాలు. ఈ కాలంలో రచయిత చూపించే తరాలు మొత్తం నాలుగు. ఈ నేల ఒక తరం నుంచి మరొక తరానికి ఎలా చేతులు మారుతూ, తరుగుతూ వచ్చింది? ఇందుకు స్పష్టమైన ఆర్థికసూత్రాలు ఏమైనా పనిచేసాయా?

వందేళ్ళ క్రితం ఒక వేపమొక్క మొలిచినప్పుడు ఈ కథ మొదలవుతుంది. వందేళ్ళ తరువాత అది నిలువెల్లా నరకబడటంతో ఈ కథ పూర్తవుతుంది. 7 జులై 2007 సంవత్సరం మొదలైన ఈ కథ 13 ఏప్రిల్‌ 1906 శుక్రవారం లోకి వెళ్ళి ఆ వంద సంవత్సరాలలో భూమి చక్రం ఏ పరిణామాల మధ్య తిరిగిందో అలా తిరగడానికి గల కారాణాలేమిటో చెబుతుంది. వందేళ్ళ క్రితం నాలుగు వీథులు, కోనేర్లతో మాత్రమే ఉండిన తిరుపతిలో, డబ్బుతో ముడిపడని ఒక జీవిత విధానం కొనసాగిన తిరుపతిలో ఈ రోజున కనిపిస్తున్న జనసమూహపు ఒకానొక భౌగోళిక ఆర్థిక దృశ్యం ఎలా అవిష్కారమైందో ఈ నవల చెబుతుంది. ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు, మారిన తరాలు, లావాదేవీలు, మానవ సహజాతాలు ఎన్నేళ్ళకయినా ఒకటే.

ఇదొక చారిత్రక నవల కాదని నరేంద్ర అన్నారు కానీ కాస్త పరికించి చూస్తే ఇందులో చరిత్ర కనిపిస్తుంది. ఇంకాస్త సూక్ష్మంగా చూస్తే మానవ నాగరికత కూడా కనిపిస్తుంది. ఇలా చూడటం అనేది ఈ పుస్తకంలో ఎక్కడ నుంచైనా చేయవచ్చు. ఎక్కడ నుంచి చూసినా అనేక కొలమానాలు కనిపిస్తాయి. ఇంకా ఎంతో దూరం ప్రయాణించగల కొత్త కోణాలు కనిపిస్తాయి. మరి దీనికంతా సాక్ష్యం ఎవరు? ఒక వంద సంవత్సరాల కాలంలో భూమి నాలుగు తరాల చేతులు మారడాన్ని, కొండలు గుట్టలు వ్యవసాయ భూములుగా మారడం, వ్యవసాయభూములు రెసిడెన్షియల్‌ ఏరియాలుగా మారడం, అవి షాపింగ్‌ కాంప్లెక్స్‌లు గా మారడం – ఇటువంటి అసంఖ్యాకమైన పరిణామాలకు ఎవరు కారణం? ఎవరు సాక్ష్యం?

ఒక వేపచెట్టుతోపాటు పాటు ఈ మొత్తం తతంగానికి మరొక సాక్ష్యం శేషాద్రికొండలు. నూరేళ్ళ కాలంలో భూమి స్వరూపం మారుతూ ఉంటుంది. మనుషులు మారతారు. ఋతువులూ మారుతుంటాయి. వేసవిలో శేషాద్రి కొండలు ఎలా ఉండాలో అలాగే ఉంటాయి. చలికాలంలో ఎలా ఉండాలో అలాగే ఉంటాయి. నరేంద్ర కలం చేతిలో ప్రకృతి ఎప్పడూ పొల్లు తప్పదు. మానవ ప్రవృత్తుల చిత్రణలోనూ అంతే.

“అకులు రాలిపోయి, చెట్లుయెండిపోయి, శేషాద్రి కొండలు మట్టిగుట్టల్లా కనపడుతున్నాయి. కొండపైన అంచులా నిలబడిన బండ్ల వరస, మట్టికొట్టుపోయిన జంతువుల సమూహంలా కనబడుతోంది. కొండపైకి వెళ్ళే మెట్లదారి స్పష్టంగా యేదో వింతజంతువు అస్థిపంజరంలా తయారయింది.”

“వుత్తరాన శేషాద్రికొండ ఆకుపచ్చటి దుప్పటి కప్పుకుని వెచ్చగా నిలబడివుంది. బూడిదరంగు ఆకాశాన్ని నీలిమేఘాలు కొలుస్తున్నాయి. రెండువైపులా పెరుగుతున్న చెట్లు కప్పేయడంతో తిరుమలకెళ్ళే మెట్లదారి ఆకుపచ్చటి చారికలా స్పష్టంగా కనపడుతోంది.”

“వానలు లేక చెట్లన్నీ యెండిపోవడంతో శేషాద్రికొండలు కూడా ఆకుపచ్చ తొడుగుల్ని పొగొట్టుకుని చర్మం తీసిన పశువుల గుట్టల్లా యెర్రగా కనిపిస్తున్నాయి. మధ్యలో తిరుమలకు వెళ్ళే నడకదారి పెద్దవాతలా కనపడుతోంది”

కేవలం సాక్ష్యంగా ఉండటమే కాకుండా ఇందులో పరిస్థితులకు మనుషుల చర్యలకు పకృతికూడా స్పందిస్తూనే ఉంటుంది.

“ఆకులూ, కొమ్మలూ కొట్టేసిన చెట్లన్నీ చేతులు పైకెత్తుకుని నిర్ఘాంతపడిపోయిన వ్యక్తుల్లా నిలబడిపోయి ఉన్నాయి. కొమ్మలు మాత్రమే మిగిలిన చెట్లపైన, యెండ మరింత యెక్కువగా ప్రతాపం చూపెడుతుంది.”

అలానే ఇందులో మరొక ఆసక్తి కరమైన వర్ణన “సూర్యుడు వేపచెట్టు వెనక దాక్కుంటున్నాడు.” సాధారణంగా కనిపించినా ఇదొక ప్రకృతి ప్రతిస్పందన. దీనికి ముందు జరిగిన సందర్భాన్నీ, తల్లీ కొడుకుల సంభాషణనీ చదివి మనం నిర్ఘాంతపోతాము.

మనుషుల అనాటమీ, కదలికలు వాళ్ళ భాష, హావభావాలు, టక్కరితనం, మోసకారితనం, వ్యంగ్యం మొదలైనవన్నిటినీ రచయిత ఎలా పట్టుకున్నాడా అని ఆశ్చర్యం వేస్తుంది. నేలా, నీరు, ఆకాశం శేషాచల కొండలు ఇలా ప్రకృతి అంతా చూస్తూనే ఉంది. నరేంద్ర కూడా ప్రకృతిలోకి వెళ్ళాడు. వంద సంవత్సరాల వెనక్కు వెళ్ళి జీవించాడు. ఒక జీవి మరొక జీవిలోకి పరకాయ ప్రవేశం చేసినట్లు ఆయన ఈ కాలం నుంచి వందేళ్ళు వెనక్కి ‘పరకాల ప్రవేశం’ చేసాడు. ఇదంతా ఎలా సాధ్య పడింది? ఎలాగంటే అతనికి మనుషుల ప్రకృతి అర్థమయింది. ఇదంతా రచయిత కథనశక్తి అనుకుంటే మనుషుల ప్రవర్తన, పరిసరాలు ఈ నైరూప్య ప్రపంచంలోని సూక్ష్మాతిసూక్ష్మమైన అంశాలను దాటుకుని కంటికి కనపడని మానవ సహజాత సూత్రాలని, అందుమూలంగా భూమి చేతులు మారి రూపం మార్చుకున్న వైనాన్ని సమర్థవంతంగా నిర్వహించడం మరొక విషయం.

ఒక క్రాంతదర్శి భవిష్యత్తును ఊహించగలడు. భవిష్యత్తు ఎలాగైనా జరగొచ్చు. ఊహించడం తేలిక. కాని గతం అలా కాదు. అది జరిగిపోయిన దానిని ఊహించడం అంత తేలిక కాదు. గతానికి కొన్ని కొలతలు ఉంటాయి. ఈ పుస్తకానికి ముందుమాట రాసిన సింగమనేని నారాయణగారు ‘నవల మొత్తమంతా రచయిత కంఠస్వరం పాఠకుడు వినగలిగేలా మ్రోగుతూనే ఉంటుంది’ అని పాజిటివ్‌గానే అన్నా ఈ నవలలోనిది రచయిత కంఠస్వరం లేని అనేక కంఠస్వరాలున్న polyphonic text. నరేంద్ర కథనంలో నాకు కనిపించేది ముఖ్యంగా చిత్రీకరణ. అదే ఆయన బలం కూడా. కథ చెప్పడం ఎంత ముఖ్యమో కథను చూపించడం కూడా అంతే ముఖ్యమైనది. రచనకు ప్రాధమిక లక్షణమైన వర్ణనలను అవలీలగా పుణికిపుచ్చుకున్న నరేంద్ర “రెండేళ్ళ పధ్నాలుగు” కథల సంకలనంలోని కథలనుంచి తన దృష్టినీ, దృక్పథాన్నీ విస్తరించుకున్నాడు. జీవితంలోని భిన్న పార్శ్వాలను, విలువలకున్న భిన్నకోణాలను చూపించడంలో ఆయన దృష్టి ఎంత విశాలమయిందో అంత లోతులకూ వెళ్ళింది.

ఈ నవల సారాంశం కోసం కోసం ఆసక్తిగా అనిపించే కొన్ని సంభాషణలు ఇక్కడ ప్రస్తావించడం అవసరం.. ఈ నవలలో భూమి తాలుకు మొదటి యజమాని మఠం. మఠం తరపు నుంచి వచ్చిన కొత్త సన్యాసి ఒకరు, కౌలుదారైన స్త్రీ ‘ఇలవరిసి’ తో ఇలా అంటాడు.

“మఠమోళ్ళు వొకవేళ నీకీ నేల యిచ్చేశారే అనుకో.. తర్వాతేం చేస్తావు?..”

“యవసాయం చేసుకుంటాము..”

“అదేగదా యిప్పుడు చేస్తున్నది గూడా!…”

“సొంత నేలలో యవసాయం జేసేదానికీ, కౌలుకు జేసేదానికీ తేడా లేదా? కష్టపడిందంతా యెవురికో కిస్తీ గట్టాల్సిందేనా?…”

“మనిషి ఆశకు హద్దులుండాలమ్మా! కిస్తీ గట్టలేదనుకో.. స్వంతనేలే అనుకో.. అప్పుడేం జేస్తావు? సంపాదించి మిగలబెట్టుకుంటావు.. మిగలబెట్టుకునిందాంతో యింకొంచెం నేల కొనుక్కుంటావు. దాన్నీ దున్నాల.. పని పెరిగేదే గానీ తగ్గేది లేదు. .. మనిషికి కావలసినదెంత? పిడికెడు అన్నం. జానెడు గుడ్డ. మూరెడు నీడ.”

మనిషికి కావలసినది పిడికెడు అన్నం. జానెడు గుడ్డ. మూరెడు నీడ. ఇది ఒక లోకోక్తి. ఉబుసుపోక కోసం, సాంత్వన కోసం, ఆత్మతృప్తికోసం మనుషులు తమతోనూ, ఇతరులతోనూ చెప్పుకునే మాట. మనందరికీ తెలిసిన నీతి. దీనిని నిరూపిండం ఎలా?

నూరేళ్ళక్రితం మఠాధిపత్యంలో ఉన్న అడవిలా భూమిని రెక్కలు ముక్కలు చేసుకుని వ్యవసాయ భూమిగా మార్చింది కౌలుదారుడు వడివేలురెడ్డి. ఎక్కడ నుండో పారిపోయి యెక్కణ్ణో వుండే అతడిని బతిమాలి పిలుచుకుని వచ్చి మఠాధిపతుల కాళ్ళు పట్టుకోని కౌలుకు నేల సంపాదించి, బిడ్డల్నిగని కుటుంబాన్ని మొదలు పెట్టిన ఆడమనిషి ఇలవరిసి. ఇది మొదటి తరం. ఆమెతో సంబంధం పెట్టుకున్న మఠాధిపతి యోగదాసు ఆమెకు పుట్టిన ఆఖరి కొడుకు రాజమన్నార్‌ రెడ్డే తన సంతానం అనుకుని అతడు మఠం పేర ఉన్న భూమినంతా రాజమన్నార్‌ రెడ్డికే ధారాదత్తం చేస్తాడు. ఈ రాజమన్నార్‌ రెడ్డి భార్య పొడ గిట్టక ఆస్తిని ఇంకాస్త తగ్గిస్తూ తను ఉంచుకున్న మణికి కూడా యాధృచ్ఛికంగా కొన్ని హక్కులు కల్పించి అర్థంతరంగా మరణిస్తాడు. ఇది రెండవ తరం. అతడి గురించి అతడి బావమరిది తిరిపాలరెడ్డి మాటలు ఇలా ఉంటాయి.

“మాబావ రాజమన్నార్‌ రెడ్డున్నాడే ఆయిన చండశాసనుడు. ఆయన కేంది నచ్చితిందో అదే రూలు. మాచెల్లిని వొగదినమైనా మనిషిగా జూసినోడు గాదు. ఆస్థినిజూసి ఆమెను నరకంలోకి దోసేసినామని మా నాయిన యేడవని దినంలేదు. అసలు తప్పు ఆ మొగోనిదిగాదు. ఆడదైనంత మాత్రాన మా చెల్లి అంతగా అణిగిమణిగి పడుండాల్సిన పనిలేదు. అయితే దానికి నోట్లోనాలిక లేదు. భూదేవి మాదిరిగా అన్నీ భరాయించింది. కన్నబిడ్డల పెండ్లవతానే కాలమైపోయింది. యీ ఆడబిడ్డలు సరిగ్గా మా చెల్లినొట్లోంచీ వూడిపడినారు. వీళ్ళిద్దుర్లో వొకరికి గూడా వాళ్ళనాయిన గుణం రాలేదు. అదేంపాడో ఆ అల్లుళ్ళు మాత్రం మామకు మించిపోయినారు. చూడబోతే మనుషులకు గుణం వాళ్ళ నాయినలనించీ వచ్చేట్టులేదు. అదేందో యీ నేలలోనించే వస్తావుండాది. ఈ నేల చేతిలో కొచ్చినప్పుట్నించీ ప్రతి మొగోడూ యిదే మాదిరి రవాటించినాడు. వాళ్ళమ్మయితే సదువుకోలేదు. యీ యిద్దురాడ బిడ్డలు కొంచెమోనెంచమో చదివినారుగదా? వీళ్ళయినా కొంచెం తెంపుగా మొగుళ్ళను అదుపులో బెట్టలేదు. అసలు తప్పు ఆ మొగోళ్ళదిగాదేమో! ఆస్థి వుండేది వీళ్ళ పేరుతోనే గదా! కాదు పొమ్మంటే ఆ మొగోళ్ళు చిప్పెత్తుకోని అడుక్కోని దినాల్సిదేగదా!”

ఇక మూడవతరం రాజమన్నార్‌ రెడ్డి అల్లుడు అతనికంటే ఘనుడు జనార్థనరెడ్డి.

“నేను దీన్నొదిపెట్టేది లేదు. నేనొకవేళ చస్తే దీన్నికూడా నాతో యెత్తుకోనిపోతానంతే” అని ఒక తరం రాజమన్నార్‌ రెడ్డి అంటే ఆ భూమినే ఇద్దరు ముగ్గురుకి అమ్మేసిన తరువాతి తరం వాడు జనార్థనరెడ్డి. ఇతడి తరానికి పరిస్థితులు మారాయి. భూమి రియల్‌ ఎస్టేటు ప్లాట్లుగా మారి విలువ మారింది. ఆయాచితంగా సంపదను అనుభవిచే మనుషులకు సుఖభోగాలు మరింత అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు రాజమన్నార్‌ రెడ్డి తన ఉంపుడుగత్తె ‘మణి’ ని ఊరికి దూరంగా కలిస్తే జనార్థనరెడ్డి నేరుగా ఇంటికే రప్పించుకునేవాడు.

ఇందులో ఉన్న మొగవాళ్ళ సంగతి ఇలా ఉండి ఇదంతా వీళ్ళ వల్లే జరిగింది అని అనుకుంటే ఈ నవల చివర్లో రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ శేషారెడ్డి, జనార్థనరెడ్డి అల్లుడికి చెప్పే మాటలు ఇలా ఉంటాయి.

“మీమామ యెట్లాంటోడైనా ఆయన తెలివి మాత్రం అమోఘం. ఆవులించకుండానే పేగులు లెక్కబెట్టేసేరకం. బతికినన్ని దినాలూ పెండ్లాన్ని యేడ అణిచిపెట్టాల్నో ఆడ అనిచిపెట్టినాడు. ఆయినట్ల పోతానే మీ అత్త చేతికి బీగా లొచ్చినాయి. కూతుర్లిద్దూరూ పెండిండ్లు జేసుకోని దూరంభారం పొయినారు. యింట్లో వుండే దొకితేౖ బాంకీలో కొంచెం దుడ్డు మిగిలే వుండాది. పనిచేసేదానికి మనుషులుండారు. వుపూ పులుపూ తినే మనిషి గదా! యిట్ల మాట్లాడతా వుండానని యేమీ అనుకోవద్దు నాయినా! పెద్దోణ్ణి! యేం జెప్తావుండానో సరిగ్గా తెలుసుకో! పెద్ధోళ్ళు జెప్పినట్టుగా రామాయణ మంటే రంకు పురాణం. భారతమంతా బొంకుపురాణం. యీ వూర్లో అయినా యేవూర్లో అయినా ఆస్థుల కతంటే మాత్రం రంకూ బొంకుల పురాణమే!

ఈ నవలలో జరిగిన సకల సంఘటనలకు సాక్ష్యంగా నిలిచిన పాత్ర వేపచెట్టు. ఈ వేపచెట్టు పుట్టుక, విధ్వంసం తోనే ఇందులోని కథ మొదలై ముగుస్తుంది. ఈ వేపచెట్టు ఆది అంతం లేని కాలానికి గాని నేలా, నింగీ, నీరూ, ఆకాశం, అగ్ని అనే పంచభౌతికాలకు గానీ ప్రతినిధి కావచ్చు. ఒకప్పుడు విస్తరణకూ, ఇప్పుడు క్షీణతకు గురవుతున్న భారతీయ విశ్వాసాలు కావచ్చు. ముఖ్యంగా నేలతల్లికీ, మనిషికి చెందిన ఒకానొక అనాది ‘మాతా సుత’ సంబంధానికి ప్రతీక కావచ్చు.

ఈ నవల మొత్తం పరిణామంలో ఆర్థికసూత్రాల కంటే మానవ సహజాతాలే (human instincts) ఎక్కువ పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది కానీ ఆ మానవసహజాతాలు కూడా ఆయాచితంగా వచ్చిన సంపద (easy money) వలన ఏర్పడ్డాయేమో అనే ఆర్థికసూత్రం కూడా పనిచేసిందేమో ఆలోచించాలి. ఏ సూత్రం ఎలా ఉన్నా ఇదంతా నిరంతరం జరిగే నాటకం. జరిగే విషాదం మాత్రం నీడనిచ్చే ఒక పురాతనమైన వేపచెట్టు కూలిపోవడం. సంవత్సరాలు గడిచిపోతున్నా, మనుషులు ఒకరితో ఒకరు ఎడతెగని పోరాటం చేస్తున్నా ఒకరినొకరు ఎంత మోసం చేసుకుంటున్నా ఎవరికీ జరిగే నష్టం ఏమో లేదుగాని చెట్టు నరకబడటం అనేదే అసలు విధ్వంసం. అదే విషాదం. ఎప్పటికీ.

 – కాకుమాని శ్రీనివాసరావు

భూచక్రం ప్రింటు పుస్తకం కినిగెలో లభ్యం.

కినిగెలో మధురాంతకం నరేంద్ర ఇతర పుస్తకాలు.

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి.
Posted in 2015, ఏప్రిల్, వ్యాసం and tagged , , , , .

3 Comments

  1. సీనూ … చదివాను. నరేంద్ర వందేళ్ళ కాలంలోకి పరకాయ ప్రవేశం చేస్తే , నీవు నరేంద్ర భూచక్రం లోకి పరకాయ ప్రవేశం చేసావు. కొండను అద్దంలో చూపించావు అనడం కంటే విశ్వాన్ని అద్దం లో చూపించావు అంటే సరిపోతుంది. నీవు ఏమి రాసినా కెవ్వు …….. కేక సీనూ!