cover

ఏక వస్తు పద్ధతి

Download PDF EPUB MOBI

సమయం సాయంత్రం పావు తక్కువ ఆరు. రమణి పోరు పడలేక చేతిలో గుడ్డ సంచితో బజారున పడ్డాడు రాంబాబు. “వస్తూ వస్తూ కూరగాయలో, పండ్లో పట్టుకు రావచ్చు గదా! వచ్చిన తరువాత మాత్రం బయటికి పోనని నీలుగుతావ్!” అంటూ సాగుతున్న వాగ్ధార తను లేవక పోతే ఆగదు.

నిజమే, ఆఫీసు నుండి వస్తూ కూరగాయలు, పండ్లు వంటివి తీసుకుని రావచ్చు, కానీ తనకు ఆఫీసులో బయలుదేరితే ఇంటికి వచ్చేంతవరకు ఎక్కడా ఆగబుద్ధి కాదు. ఉదయమే లేచి వాకింగ్ నుండి తిరిగి వచ్చేటపుడు కూరగాయలు తేవడం అతని అలవాటు. కాకపోతే ఆ సమయంలో పండ్లు దొరకవు, సాయంత్రం ఇంటికి వెళ్లేటపుడో, లేదా రమణి బయటికి వచ్చినపుడో తేవాలి. వీలైతే సెలవు రోజు పండ్లు కొనుక్కొస్తాడు.

మధ్యాహ్నం రమణి పక్కింటామెతో కలిసి బయటికి వెళ్లినపుడు బండ్ల మీద అమ్ముతున్న సపోటాలు చూసింది. కొందామంటే పర్సు తీసుకురాలేదు. పక్కింటామె దగ్గర ఆప్పు తీసుకోవడం ఇష్టం లేక ‘ఆయనతో తెప్పించొచ్చులే’ అని చక్కా ఇంటికి వచ్చింది. ఇప్పుడందుకే రాంబాబు బయట పడ్డాడు. మామూలుగా రాంబాబు పండ్లు కొనుక్కు రాడు, ఎందుకంటే వాటి రుచిలోనో, నాణ్యతలోనో తేడా వచ్చిందంటే అవి తినడం అయిపొయిందాక అక్షింతలు పడుతూ ఉంటాయి, అదే కూరగాయలయితే పాడైనవి తీసి పడేసి కూర చేస్తుంది రమణి. కానీ పండ్ల విషయానికి వస్తే బాగుంటే అన్నీ బాగుంటాయి, రుచిలో తేడా వస్తే దాదాపు అన్నింటిలో వచ్చినట్టే. పైగా పక్కింటివాళ్లతో రేటు కంపారిజన్ ఒకటి. అయినా తను తెచ్చిన రేటుకంటే కొద్దిగా తక్కువరేటుకు కొనుక్కువచ్చినట్టు భార్యామణితో చెపుతాడు. ఇన్నేళ్ల రాంబాబు పరిశోధనలో తేలినదేమిటంటే కూరగాయలు తను తేవచ్చుగానీ, పండ్లు లాంటివి రమణి తెస్తేనే ప్రమాదం తనకు తక్కువని. కానీ ఇవాళ సపోటాలు కొనుక్కు రాక తప్పేటట్లు లేదు.

రాంబాబుకి సపోటాలకు సంబంధించి ఒక చేదు జ్ఞాపకం కూడా ఉంది. బహూశా తను ఇంటర్ చదివేటపుడు కావచ్చు, ఏదో పేపర్‍లో చదివిన ‘పండిన సపోటాలు ఎలా గుర్తించాలనే’ చిట్కాను తల్లికి చెప్పాడు. అది ఏమని ఉందంటే ‘పండిన సపోటాలు గుర్తించాలంటే పైన తొక్క తీసి చూడాలి’ అని.

అది వింటూనే “అరేయ్ పిచ్చి సన్నాసి, తొక్క తీస్తే, అది పండకున్నా పండి, పాడయినట్టేరా” అని నవ్వి నవ్వి పొట్ట పట్టుకొంది వాళ్ల అమ్మ. అంతే కాదు ఆ విషయాన్ని ఎడ్మండ్ హిల్లరీ ఎవరెస్ట్ ఎక్కిన సంగతి వాళ్ల మమ్మీ చెప్పుకున్నంత గొప్పగా ఆ బజారంతా డప్పు వేసింది. ఇప్పటికీ ఆ ఊళ్లో రాంబాబుని అప్పుడప్పుడు సపొటా రాంబాబు అనడం కూడా కద్దు.

ఏది ఏమయినా ఈ రోజు జాగ్రత్తగా చూసుకొని, బాగా బేరం చేసి మరీ కొనాలనుకున్నాడు రాంబాబు. పర్యావరణ కాలుష్యం, పెట్రోలు ఖర్చు అనుకుంటూ నడుచుకుంటూ బయలుదేరాడు. నెమ్మదిగా తమ ఇంటి సందులోనుండి నడుచుకుంటూ మెయిన్ రోడ్ ఎక్కాడు. ఎక్కువగా బస్టాండ్ దగ్గరలోనే బండ్ల మీద పండ్లు అమ్ముతుంటారు.

ఇంతలో ఎవరో బైక్ మీద పోతూ హలో అన్నారు, ఎవరో గుర్తు రాకపోయినా హల్లో హల్లో అని బాగా తెలిసినట్టు కలరిచ్చాడు గానీ ఎవరయి ఉంటారబ్బా.. అని ఎంత ఆలోచించినా తట్టలేదు. “పోనీలే, ఎవరో తెలిసిన వారయి ఉంటారు, ఈ మాత్రం దానికి తెగ ఆలోచించడం అనవసరం” అనుకుంటూ నడవసాగాడు.

బస్టాండ్ దగ్గరకి వచ్చాడు. ‘లోపలికి’ అని రాసున్న బోర్డు దగ్గరలో ఓ చోట, కాస్త దూరంలో ‘బయటికి’ అని రాసున్న బోర్డు దగ్గరలో మరోచోట, రెండు బండ్లమీద సపోటాలు అమ్ముతున్నారు. అమ్మేవాళ్లను పరికించి చూసాడు. ఇద్దరూ కాస్త నడిగారు మనుషులే. “అబ్బా. చూసి మంచోడని, ఎలా ఊహించి కొనడం, అయినా తనేమన్నా వేలకొద్దీ రూపాయలు పోసి కొంటున్నాడా?” అనుకుంటూ మొదట చూసినతని దగ్గరకి వెళ్లి –

“ఎట్లా?” చేతితో ఒక సపోటాను పట్టుకొని వత్తుతూ అడిగాడు.

“అర్థ కిలో అయితే 20, కిలో అయితే 35” బదులిచ్చాడతను.

“ఇచ్చే రేటు జెప్పు”

“ఎన్ని కావాలి?”

“ఎన్ని ఎందుకు, ఒక కిలో చాలు” బదులిచ్చాడు రాంబాబు.

“పాల సపోటా సార్, రెండుకిలోలు తీసుకోండి, 65 కిస్తా”

“వద్దొద్దులే, ఒక కిలో చాలు, పాతిక రూపాయలికివ్వు”

“ముప్పై జేసుకోండి, ఇగ పట్టండి” అంటూనే తూకం వేయసాగాడు.

“లేదు లేదు, పాతికే..” అంటూనే కాస్త దూరంలో ఉన్న మరో బండి వైపు ఆడుగులేశాడు.

పదడుగులేశాడో లేదో, “సరే సార్….. రండి” కేకేశాడు బండతను.

వాడు మరీ పెద్దగా బేరం ఆడకుండానే ఇస్తా అనేసరికి రాంబాబు కాస్త అసంతృప్తికి లోనయి ‘ఆ బండి దగ్గర కూడా అడిగి చూద్దాం’ అనుకుంటూ వెనక్కి తిరగకుండా వినపడనట్టుగానే అడుగులేశాడు.

రెండో బండి దగ్గర ఆగాడు, రేటు అడిగాడు. సంభాషణ మళ్లీ మొదలయింది.

“ముప్పై జేసుకోండి, ఇగ పట్టండి” దగ్గరకొచ్చి ఆగింది.

‘వీడు కూడా పాతికకే ఇచ్చేట్టున్నాడు, కాస్త గట్టిగా బేరం చేద్దాం’ అనుకొని – “ఇరవైకిస్తావా?” కాస్త సందేహంగానే ఆడిగాడు.

“లేదు సార్, మంచి పాల సపోటా.. నోట్లో వేసుకుంటే కరిగి పోతుంది” అంటూ ఒక సపోటా తుంచి చేతిలో పెట్టాడు.

వద్దంటూనే నోట్లో పెట్టుకొని రుచి బాగుందనిపించి “సరేలే, ఇంకో మూడు రూపాయలు తీసుకో” అన్నాడు.

“అబ్బో, గిట్టదు సార్, పాతికక్కూడా యియ్యను” తూకం వేయబోతున్న పండ్లను బండిమీద పోసుకుంటూ అన్నాడు.

“అరే, ఇందాకటి బండివాడు పాతికకే ఇస్తా రమ్మన్నాడు, వీడేమో పాతికక్కూడా ఇవ్వనంటున్నాడే” అనుకొని –

“సరేలే, అదే పాతిక రూపాయలకివ్వు” అన్నాడు.

“లేదు సార్, ముప్ఫయి రూపాయలకు తక్కువకివ్వను” ఎంతసేపూ గీసులాడినా ముప్ఫైకి తక్కువ ఇయ్యననేశాడు.

‘లాభం లేదు, మొదటి బండి దగ్గరకే పోదాం’ అనుకొని మొదటోడి దగ్గరకి వెళ్లి “సరే, ఒక కేజీ ఇవ్వబ్బా” అని సంచి పట్టాడు. బండి మీదనుండి పాలిథిన్ కవర్ ఇవ్వబోతున్నవాడల్లా ఆగి పండ్లు సంచిలో పోశాడు. ఈ మధ్య రాంబాబు కొడుకు నానీగాడు, ఇంటికి పాలిథిన్ కవర్లు తెస్తే ఊరుకోవడం లేదు, వాళ్ల టీచరు వాటివల్ల ‘భూమికే నష్టం’ అని చెప్పింది మరి. “అవునూ, అతను ముప్ఫైకి తక్కువకివ్వనన్నాడు, మరి నీకెలా గిట్టుబాటయింది” డబ్బులు ఇస్తూ అడిగాడు రాంబాబు.

పండ్లు అమ్మే అతను నవ్వుతూ “నాకు మరీ ఆశ లేదు సార్, వచ్చినంతే చాలు, అయినా మీ మొఖం చూస్తే ఎక్కువ తీసుకోబుద్ది గూడా గాలే” అంటూ డబ్బులు తీసుకొని మిగిలిన చిల్లర ఇచ్చాడు.

రాంబాబుకి మనసులోనే సంతోషం అయింది. ‘అయిదురూపాయలు మిగిల్చాను’ అనుకుంటూ వెనక్కి మళ్లాడు.

ఇల్లు దగ్గరికి వచ్చినాక గుర్తొచ్చింది ఉదయం బాత్‍రూంలో రూపాయిబిళ్లంత సబ్బుతో స్నానం చేసిన సంగతి.

eka vasthu paddathiవెనక్కి తిరిగి దగ్గరలో ఉన్న, తను ఎప్పుడూ సరుకులు తెచ్చే కిరాణా షాప్‍లోకి వెళ్లి వంటి సబ్బులు ఇమ్మని అడిగాడు. తాము రెగ్యులర్‍గా తీసుకెళ్లేవి అతనికి గుర్తే…. శేటు ఇచ్చాడు. డబ్బులు ఇవ్వడానికి చేతిలో వున్న సంచిని పెడదామని ఎక్కడా వీలు కాక అక్కడున్న ఎలక్ట్రానిక్ కాంటా పై పెట్టాడు. డబ్బులిచ్చి సంచి తీసుకోబోతూ కాంటాపై ఎర్రని లైట్‍తో వెలుగుతున్న బరువు చూశాడు. “850 గ్రాములు”

గతుక్కుమని మళ్లీ చూశాడు, “శేటూ, తూకం కరెక్టే పనిచేస్తున్నదా?” అనుమానంగా అడిగాడు రాంబాబు

“అలా అన్నరేంది సార్, కొత్త మిషన్, కరెక్ట్ తూకం” బదులిచ్చి పనిలో మునిగిపోయాడు షాపు యజమాని.

“అమ్మా! రేటు తక్కువిచ్చినట్టే ఇచ్చి తూకం తక్కువిచ్చిండు, సంచి బరువుని లెక్కేస్తే ఇంకా తరుగు”

మనసులో లాభ నష్టాల లెక్క వేసుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. లెక్క తేలలేదు.

వెళ్లే సరికి ఐదో తరగతి చదివే పుత్రరత్నం మేథ్స్ హోంవర్క్ చేస్తున్నాడు. చూసాడు… అంకగణితం, ఏకవస్తు పద్దతి.

“నానీ! కేజీ పంచదార 30 రూపాయలయితే, 25 రూపాయలకి ఎంత వస్తుంది?” టెస్ట్ చేస్తున్నట్లు యధాలాపంగా అడిగాడు. ఒక నిమిషం పెన్సిల్‍తో కుస్తీ పట్టి సమధానమిచ్చాడు.

 “ఎనిమిదొందల ముప్పైమూడు పాయింట్ మూడు మూడు మూడు, సుమారు ఎనిమిదొందల యాభై గ్రాములు… కరెక్టేనా డాడీ”

రమణి అనుమానంగా చూస్తూ “ఈ రోజుల్లో కిలో పంచదార ముప్ఫై రూపాయలకి ఎక్కడొస్తుందీ” అన్నది.

బిత్తర పడ్డాడు, ఎందుకో ఏమిటో ఉన్నట్టుండి ఇందాక హలో అన్న వ్యక్తి ఎవరో గుర్తొచ్చింది, అతను చదువు మధ్యలో ఆపి వ్యాపారంలో స్థిరపడ్డ తన క్లాస్మేట్ సీతారాం.

— బాడిశ హన్మంతరావు

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి.
Posted in 2015, ఏప్రిల్, కథ and tagged , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.