cover2

“స్పష్టత అనేది కవిత్వానికి ఒక తిట్టు” ~ సిద్ధార్థ తో ఇంటర్వ్యూ (1)

Download PDF EPUB MOBI

అల శాంతిశిఖర అపార్ట్‌మెంట్స్‌లో ఆ మూల ఇరుకుగదిలో పుస్తకాలు ఆక్రమించగా మిగిలిన ఖాళీలో కొవ్వొత్తి వెలుగులో మూడు సిట్టింగుల్లో ఈ ఇంటర్వ్యూ జరిగింది. సిద్ధార్థ కరుకు ముఖానికీ ఆయన మెతక వ్యవహారానికీ అస్సలు పొంతన ఉండదు. కనీసం ఆ ముఖమైనా ఉంది కాబట్టి సినిమాలూ రాజకీయాల జోలికి వెళ్ళగలిగారేమో. కానీ ముఖం వెనుక మార్దవం కవిత్వంలో కనపడుతుంది. స్నేహం వెంటనే సాధ్యమయ్యే మనిషనిపిస్తాడు. మనమింకా గుమ్మం దగ్గరికి రాకముందే తలుపులు బార్లా తెరిచి ఉంటాయి. ఇక ఎంత లోపలి దాకా వెళ్ళవచ్చూ అనేది మనం ఎంత నిర్మొహమాటంగా చనువు తీసుకోగలమనే దాన్ని బట్టి ఉంటుంది. అటువైపు నుంచి బేరీజులు లేని ఒక ఆహ్వానం మాత్రం ఉంటుంది.

మంచి అభిరుచి వున్నవాళ్ళుగా నేను భావించే కొందరి దగ్గర సిద్ధార్థ ప్రస్తావన అడపాదడపా వస్తూండేది. నాకు ఇష్టమైన త్రిపురతో ఆయన చేసిన ఇంటర్వ్యూ చదివాను. ఆయనవి కొత్త కవితల పుస్తకాలు రెండు త్వరలో పబ్లిష్ కాబోతున్నాయని తెలిశాక, ఈ ఇంటర్వ్యూ ఐడియా వచ్చింది. ఒక మిత్రుడి దగ్గర తీసుకుని చదవకుండా పక్కకు పెట్టిన ‘దీపశిల’ అప్పుడు చదవటం మొదలుపెట్టాను.

DeepaSila“దీపశిల” సిద్ధార్థ మొదటి కవితా సంపుటి. 1994లో వచ్చింది. “నేర భావనలో చెప్పుకోవాలంటే, జీవితమంటే అపరిమితమైన ప్రేమా దాన్ని పగిలిపోకుండా కాపాడుకోవాలనే anxiety లోనే ఈ అతాత్త్విక సుడులకీ మానసిక అలజడులకీ, Ideological Hunt కీ లోనయి రాశాను” అంటాడు ముందుమాటలో సిద్ధార్థ. నగరమూ, అక్కడి రాత్రులూ (ఇంసోమ్నియా రాత్రులు, అధ్బుతమైన చిత్తరువులాంటి రాత్రులు, గుడ్ల నీరు దిగమింగుకునే రాత్రులు), స్నేహాలూ వెన్నుపోట్లూ, ఒంటరితనమూ, ఉనికితో సహజాతమైన తాత్త్విక దుఃఖమూ… వీటన్నింటి గూండా ప్రయాణించే అంతర్ముఖుని డైరీ ఈ “దీపశిల”. ఇందులో వేర్వేరు శీర్షికలు ఉన్నాయి కాబట్టి వేర్వేరు కవితలు అనుకోవాలే తప్ప, పుస్తకం అంతా కలిసి ఒకే దుఃఖ సౌందర్యాన్ని పాడుతుంది. ఈ సంపుటిలో భాష పరంగా, ఇమేజెస్‌ పరంగా violent juxtapositions ఉంటాయి. అయినా అది అభివ్యక్తి వైచిత్రి కోసం పనిగట్టుకు పేర్చిన పేర్పులా అనిపించకపోవటానికి కారణం కవి ఎలాగో అనునిత్యం తన అనుభవంతో సంలీనుడై ఉండి ఇదంతా కురిపిస్తున్నాడు అనిపించడమే. కవి తన అనుభవాన్ని డైరెక్టుగా ఢీ కొంటాడు. ఈ ప్రక్రియలో అతనికి భాష మాధ్యమం కాదు, పర్యవసానం. కవి కల్పిస్తున్న ఇమేజెస్ కూడా మనకు భౌతికంగా, palpable గా తెలిసిన ప్రపంచాన్ని నిర్మించే ప్రయత్నం చేయవు, కవిత్వానికే సొంతమైన మార్మిక మాంత్రిక లాఘవంతో ఒక ఎమోషనల్ ప్రపంచాన్ని మన అంతశ్చేతనలో నింపుతాయి. ఈ కవితల్ని చదవటంలో నాకు నప్పిన పద్ధతి ఒకటుంది. ముందు ఒకసారి చదవాలి. రెండోసారి చదువుతూ ప్రతి పదమూ ఇస్తున్న ఇమేజీలని మనసు కాన్వాసుపై డాలీ కుంచెతో చిత్రించుకోవాలి. ఆ ఇమేజీల్ని మనతో పాటు తిప్పుకోవాలి. ఎపుడో ఈ ఇమేజీల పరంపర ఒక క్రమానికి చేరి క్లిక్ మంటాయి. కవిత సాక్షాత్కరిస్తుంది. అప్పుడు కూడా, అది కవి కన్నా ఎక్కువ మనకే చెందినదేమో అనిపిస్తుంది. అర్థపు నియంతృత్వాన్ని లెక్క చేయని సిద్ధార్థ కవితల్లో అర్థం వైపుగా హేతుబద్ధమైన ప్రయాణం ఉండదు. కవి తన అంతరంగ పదార్థాన్ని ఉన్నది ఉన్నట్టు ప్రెజెంట్ చేస్తాడు. దాన్నుంచి తన కోసం తాను కూడా అర్థాలు పిండుకోడు. పంక్తుల్లోని ఏ ఫాల్స్ ఊరడింపుల్నీ జొరబడనివ్వడు. కవితల నిర్మాణంలో సిమ్మెట్రీ కోసం ప్రయాస, ఒక పంక్తిని బాలెన్స్ చేయాలన్న ఆబ్లిగేషన్‌తో మాత్రమే పుట్టే పంక్తులు, పునరుక్తుల పట్ల పెడాంటిక్ స్పృహ, అల్యూషన్ల బరువు ఇవేం ఉండవు. “దీపశిల” చదువరికి ఒక మెలంకలిక్ మానసం కనీస అర్హత.

దీపశిల తర్వాత సిద్ధార్థ మరో కవితా సంపుటి తేలేదు. కవిత్వం మాత్రం రాస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఆ కవిత్వం అంతా కలిపి “బొమ్మలబాయి”, “మల్లెల తీర్థం” అనే రెండు సంపుటులుగా పాఠకుల ముందుకు రాబోతున్నాయి. ఈ కవితల్ని చూస్తే ముఖ్యంగా ఇతివృత్తాల్లో మార్పు కనిపిస్తుంది. “దీపశిల”లోనిది ఒక అంతర్ముఖీనుడైన నగరవాసి దుఃఖమైతే, ఈ తర్వాతి కవితలు ఒక సామాజికుని వలస దుఃఖాన్నీ, కల్చరల్ డిస్‌ప్లేస్మెంటునీ వెళ్ళబోసుకుంటాయి. నగరం నుంచి వెనక్కి మళ్ళి తెలంగాణ ఊళ్ళల్లోకి వెళ్ళిపోయి స్థానిక చైతన్యాన్ని ఆవహించుకుని పరవశిస్తాయి. అక్కడి భాషతో, ఆ దృశ్యాల్లో మాట్లాడతాయి. ఈ మార్పుకి ప్రతీకగా ఈ కవితల్లో కవికీ, అతని దేవుడికీ మధ్యనున్న సంబంధంలో వచ్చిన మార్పుని చూపించవచ్చు. తొలి కవితల్లో ఒక కాస్మోపాలిటన్ ఆధునిక మానవునిగా అస్తిత్వ వేదనను దేవుడు చనిపోయిన శూన్యానికి నివేదించుకున్న కవి, మలి కవితలకు వచ్చేసరికి ఒక స్థానిక ఆదిమత్వంతో కొమరెల్లి మల్లన్నలకూ, కర్రెసాములకూ గోడు చెప్పుకుంటాడు. ఈ కవితల్లో అభివ్యక్తి ఇదివరకంతటి దట్టంగా గాక కాస్త తేలికపడినట్టనిపిస్తుంది. సర్రియలిస్ట్ ఎలిమెంట్ తగ్గుతుంది. నోస్టాల్జిక్ లాంగింగ్ ఎక్కువవుతుంది. సొంత ఊరూ, అక్కడి చెట్టూపుట్టా, పిన్నమ్మలూ పెద్దమ్మలూ, ఊరి దేవుళ్ళూ ఇవన్నీ కవితల్లోకి వచ్చి చేరతాయి. అలాగే కవితలు కూడా అంతర్ముఖత్వాన్ని విప్పుకుని, బయటికి చూస్తాయి. శ్రోతని ఆత్మీయాలింగనంలోకి తీసుకుని ‘నాయనా’, ‘తండ్రీ’ అని సంబోధించి మాట్లాడతాయి.

నాకు వచనంతో ఉన్నంత సాన్నిహిత్యం కవిత్వంతో లేదు కాబట్టి, సిద్ధార్థ తొంభైల చివర్లో ఆంధ్రప్రభలో సాహిత్యపేజీలో “ప్రెజెంటెన్స్” అనే కాలమ్ రాసేవారని తెలియగానే, ముందు వాటి తాలూకు పేపర్ క్లిప్పింగుల్ని తెప్పించుకుని చదివాను. ఈ వ్యాసాలు విమర్శకుని పరికింతలా గాక, ఒక పాఠకుని పలవరింతల్లా ఉంటాయి. సిద్ధార్థ వచనం కూడా బాగుంటుంది. ఇవి కూడా పుస్తకంగా వస్తే బాగుంటుందనిపించింది.

ఈ ఇంటర్వ్యూ జరిగేటప్పుడు ప్రశ్నల విషయంలో బి. అజయ్ ప్రసాద్, ఎం. ఎస్. నాయుడు సాయం చేశారు. సిద్ధార్థ ఎలాక్వెంట్ అని చెప్పలేం గానీ, మాట్లాడటాన్ని ఇష్టపడతారని అనిపిస్తుంది. వాక్యాన్ని సవరిస్తూ మళ్ళీ మాట్లాడతారు గానీ, మొదటి వాక్యమూ రెండో వాక్యమూ కూడా ఎన్నదగినవిగానే ఉంటాయి. ఈ ఇంటర్వ్యూలో ఆయన వాక్యాలేవీ మార్చలేదు, వాటిని వ్యాకరణ బద్ధం మాత్రమే చేశాను.

– మెహెర్

 

“బాల్యమంతా కవిత్వానికి అననుకూల వాతావరణాల్లోనే నడిచింది” అన్నారు ‘దీపశిల’లో. ఏ రకంగా అననుకూలం?

గౌడ కుల వృత్తులవాళ్ళం మేం. బీబీనగర్ దగ్గర చినరావులపల్లి మా ఊరు. నాయన తరపు వాళ్ళదంతా అదే వూరు. అమ్మవాళ్లది హైదరాబాద్. నేను హైదరాబాద్‌లోనే పుట్టాను. కానీ బాల్యం ఎక్కువ ఊళ్ళోనే గడిచింది.

అననుకూల వాతావరణమూ అంటే – నాన్న కుల వృత్తి నుంచి పక్కకు వచ్చి, బ్రూక్‍బాండ్ ఇండియా ఫాక్టరీలో ఉద్యోగం చేసేవాడు. తనంతట తాను బి.ఎ దాకా చదువుకుని, రాత్రుళ్ళు ఊళ్ళో పెద్దవాళ్ళందరికీ చదువు చెప్పేవాడు. తాత వృత్తి మనిషి. ముస్తాదర్‌. ఉర్దూ పేపరు చదివేవాడు, లెక్కలన్నీ ఉర్దూలోనే రాసుకునేవాడు. నాయనమ్మ ఫక్కా గ్రామీణ స్త్రీ. దుకాణం నడిపేది. చిన్నానలు కల్లు గీత పని. ఇలా నా చుట్టూ సాహిత్య వాతావరణం అంటూ ఏం లేదు. కానీ ఇప్పుడు వెనక్కి చూసుకుంటే అప్పటి మాటని సవరిస్తానేమో. ఆ అననుకూలతే నా అనుకూలత అనుకుంటాను. ఇప్పుడు ఆ వాతావరణాన్ని నా కవిత్వానికి చాలా పాజిటివ్ ప్రేరణగా చూస్తాను.

మీ బాల్యం ఆనందంగానే గడిచిందా?

Early memory నా జీవితానికి దుఃఖహేతువు అనుకుంటాను నేను. రెండవ ఏట నుంచే నాకు అన్నీ గుర్తున్నాయి. దాంతో చిన్నతనం నుంచే నేను ఒంటరివాడ్ని. ఎవరితోనూ కలిసేవాడ్ని కాదు. అందరూ కలిసి ఆడుతున్నా సరే పనిగట్టుకు ఒక్కడ్నే ప్రకృతి వైపుకు వెళ్ళిపోయేవాడ్ని. ఒక్కడ్నే కూర్చుని చుట్టూ చూసుకోవడం, నాతో నేను మాట్లాడుకోవడం, నా ఊహల్లో నేనుండటం… అలా ఎందుకు చేసేవాడ్నో తెలీదు, కానీ అలా చేయటం వల్ల కష్టం కలిగేది, అయినా అలాగే చేసేవాడ్ని.

అలాగే – చిన్నప్పట్నించీ విపరీతమైన ప్రేమ నాకు. నా చుట్టూ వున్న స్నేహితుల మీద, బంధువుల మీద, జీవజాలం మీద విపరీతమైన ప్రేమ. నేను ఇంతగా ప్రేమిస్తాను, కానీ నన్నెవ్వరూ ప్రేమించరే అని దిగులుగా ఉండేది. అందుకే బాల్యం అంతా చాలా సంక్లిష్టంగా బాధాకరంగా అనిపించేది. నాకున్నదల్లా మా అమ్మా, నాయనమ్మా వీళ్ళే. నన్ను ఒంటరితనం నుంచి దగ్గరకు తీసుకున్నది స్త్రీలే. నాయనమ్మ దగ్గరే నేను ఎక్కువ పెరిగాను. ఆమె చాలా ఒంటరి స్త్రీ అని అప్పుడే నాకు అనిపించేది. జైగాంటిక్ నేచర్ ఆమెది. కుటుంబం అంతా ఆమె చేతుల మీదనే నడిచేది. ఒక గాడ్ మదర్ లాంటిదామె. నేను తెలంగాణ కవిత్వంలోకి మళ్ళటానికి ప్రధాన వాహిక ఆమే. ఇప్పటికీ తన అస్తిత్వమే నా కవిత్వానికి ఊపిరి.

అమ్మ గురించి?

mother 2అమ్మ సుశీల. నేను సాహిత్యం వైపు మళ్లానంటే అది అమ్మ వల్లనే. ఆమె హైదరాబాద్‌ పాతబస్తీలో గౌలిపురా ప్రాంతంలో పుట్టింది. సంస్కృత పాఠశాలలో ఏడో తరగతి దాకా చదువుకుంది. మా ఇళ్ళల్లో అందరూ నల్లగా ఉంటే, ఆమె మాత్రం తెల్లగా ఉండేది. దాంతో చిన్నప్పుడు స్కూల్లో బ్రాహ్మణ పండితులు ఆమెను వాళ్ల బిడ్డగా చూసుకునేవారు. ఆ రోజుల్లో పాలగుమ్మి పద్మరాజుగారు ఆలిండియా రేడియోలో ఉద్యోగం కోసం కుటుంబంతో సహా హైదరాబాదు వచ్చారు. మా అమ్మోళ్ళ ఇంటి పక్కనే అద్దెకు దిగారు. పద్మరాజుగారి తల్లి మా అమ్మను ‘మా బాపనాల్ల పిల్లలా ఎంత ముద్దుగా ఉన్నావే’ అని ఎంతో ముచ్చటపడి చేరదీసింది. అమ్మ గొంతు బాగుందని సంగీతం నేర్పడం మొదలుపెట్టింది. వాళ్ల సాంగత్యంలో అమ్మ సంగీత సాహిత్యాల వైపు మళ్ళింది. అలా ఒక అర్బన్ సెన్సిబిలిటీని అలవర్చుకుంది. గౌడ్స్‌లో మా మధ్యతరగతి కుటుంబాల్లో ఇది అసాధ్యం. అప్పటికే అమ్మ దృష్టిలో శరత్, విశ్వనాథ, కృష్ణశాస్త్రి వీళ్ళ సాహిత్యం, బాలాంత్రపు రజనీకాంతరావు, పాలగుమ్మి విశ్వనాథం వీళ్ళ రేడియో సంగీతం… ఇవన్నీ పడ్డాయి. ఈ అభిరుచిని ఆమె పెళ్ళయిన తర్వాత మా కుటుంబంలోనికి తీసుకువచ్చింది.

బాల్యంలో కవిత్వం దిశగా మీ ప్రభావాల గురించీ చెప్పండి?

నా ఫస్ట్ ఇమేజరీ అమ్మ చదివి చెప్పే చందమామ కథల్నించీ మొదలయింది. అప్పట్లో చిత్ర, శంకర్, వ.పాలు చందమామ కథలకి అద్భుతమైన బొమ్మలేసేవారు. ఆ అరణ్యాలు, మబ్బులు, ఊళ్ళు, వీధులు, వీధుల్లో ముచ్చట్లు పెట్టుకునే మనుషులు, ఆ దేవతలు, రాక్షసులు… అవేవీ నాకు అబద్ధం కాదు, ఖచ్చితంగా నిజమే! అమ్మ ఈ కథలు చదివి చెప్తే గానీ నేను ముద్ద తినేటోడ్ని కాదు. మా తాత అప్పటికే వైష్ణవం తీసుకుని  ఆ పద్యాలూ పాటలూ పాడేవాడు. అలాగే మేముండే కుమ్మరి బస్తీలో రాత్రి పూట కొంతమంది పడుకోకుండా పద్యాలు పాడేవాళ్ళు. ఒక్కోసారి లైట్లు లేకపోతే బస్తీ అంతా వెన్నెల పడేది. అన్నీ పెంకుటిళ్ళే. ఉన్నట్టుండి ఆ మూల కుమ్మరి మైసి ఒక పద్యం ఎత్తుకునేవాడు. అది అయిపోగానే అవతలపక్క ఐదారు ఇళ్లల్లో ఇంకొకడెవడో ఇంకో పద్యమో పాటో అందుకునేవాడు. చీకట్లలో మనుషులు కనపడరు కాదుగానీ, ఈ గొంతులు మాత్రం వినపడేవి. ఒక థియేటర్ లా ఉండేది మొత్తం వాతావరణం. నేను అరుగు మీద మా నాయనమ్మ ఒళ్ళో పడుకునేవాడ్ని. ఆమె తొడ మీద నా తల పెట్టి ఊపుతూ జోకొట్టేది. అర్ధరాత్రి దాకా ముచ్చట్లు సాగేవి, నవ్వులుండేవి, గొడవలుండేవి, తిట్లుండేవి, ఆడవాళ్లతో ఎకసెక్కాలుండేవి, మొగుడూపెళ్లాల తగువులుండేవి, వాటిని తీర్చడాలుండేవి. ఆడాళ్ళు బోరుకొట్టినప్పుడల్లా ఆ రాత్రికి రాత్రే బతకమ్మలు ఆడేసేవాళ్ళు. అదొక అద్భుతమైన తెలంగానం. ఇవన్నీ నాలో కాల్పనిక శక్తిని పెంచాయనుకుంటాను.

కవిత్వం వైపు ఎలా మళ్లారు?

కవిత్వం సహజంగా ప్రవేశించింది జీవితంలోకి. అమ్మ పాడే పాటలు వినేవాడ్ని కాబట్టి కవిత్వమంటే పాటే అనుకునేవాడ్ని. ఎనిమిదేళ్ళప్పుడు మా మేనత్త బిడ్డకి ఏదో దెబ్బతగిలితే ఆ బాధతో ఒక పాట రాశాను. రాశాక చాలా ఉపశమనం కలిగింది. చాలా ఆనందం కూడా కలిగింది. ఇదేదో బావుంది కదా అనిపించింది. అలా కొన్ని వందల పాటలు రాశాను. అమ్మ ఆ నోటు బుక్కు ఇప్పటికీ దాచి ఉంచింది. అవన్నీ నేనే రాశానా అనిపిస్తుంది ఇప్పుడు చదివితే. అలా నేను పాట ద్వారా కవిత్వంలోకి ప్రవేశించాను.

హైదరాబాద్ నగరం మీ కవిత్వంలో ఒక ముఖ్యమైన ఎలిమెంట్. ఈ నగరానికీ మీకూ ఉన్న అనుబంధం గురించి చెప్పండి.

హైదరాబాద్‌ నగరం నా వ్యక్తిత్వంలో అంతర్భాగం. దీన్ని ఇప్పుడు మనం మెట్రోగా చూస్తున్నాం. కానీ హైదరాబాదు కొన్ని ఊర్ల సముదాయం. ఒక్కో ఏరియా ఒక్కో ఊరు. ఐదు కిలోమీటర్లు అటు జరిగితే ఒక ఊరు, ఇటు జరిగితే ఒక ఊరు. అలాగే హైదరాబాదుకి ఒక ఇరవై కిలోమీట్ల దూరంలో పచ్చి పల్లెటూళ్ళు ఉండేవి. కాబట్టి అటు గ్రామీణత ఇటు నగరీకత రెంటి మధ్యా పెరిగాను. చదువు కోసం నాయన హైదరాబాదు తీసుకొచ్చాడు. మదర్సా ఆలియా అనే గవర్నమెంటు స్కూల్లో తీసుకొచ్చి చేర్పించాడు. ఆ స్కూల్లో టీచరూ, స్టూడెంట్సూ చాలా వరకు ముస్లింలు. మేనమామ ఇంట్లో ఉండేవాడ్ని.

ఇక్కడి సాహిత్య వాతావరణం ఎలా పరిచయమైంది?

ఇంటర్మీడియట్‌కి వచ్చేసరికి అబిడ్స్‌లోని ఆలియా కాలేజీలో చేరాను. అక్కడ ఒక ఇరానీ హోటల్‌కి సాయంత్రాల్లో కవులు వచ్చి కూర్చునేవాళ్ళు. నేను ఓ మూల కూర్చుని దాశరథి, దిగంబర కవులూ, శేషేంద్ర శర్మ వీళ్ళందర్నీ చూసేవాడ్ని. వాళ్ళెవరో ఏంటో నాకు తెలియదు అప్పటికి. వాళ్లు మాట్లాడుతుంటే బాగుందనిపించి పక్కకు వెళ్ళి నిలబడేవాడ్ని. వాళ్ళ చుట్టూ జనాలుండేవారు. వాళ్ళకొక స్టార్ స్టేటస్ ఉండేది.

అక్కడ్నించి నడుచుకుంటూ కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయానికి వెళ్ళేవాడ్ని. ఏవేవో సాహిత్య సభలు జరుగుతోంటే కూర్చుని వినేవాడ్ని. ఆ రోజుల్లోనే ఉర్దూ కవుల్ని కూడా చూశాను. శేషేంద్ర శర్మ ఎక్కడ ఉంటే అక్కడ ఉర్దూ కవులుండేవారు. నాంపల్లి ముషాయిరాల్లో ఉర్దూ కవిత్వం తెల్లవారేదాకా చదివేవారు. నేను సైకిల్ మీద వెళ్ళేవాడ్ని. నాతో వచ్చిన ఫ్రెండ్ పడుకునేవాడు, నేను మేల్కొని వింటూ ఉండిపోయేవాడ్ని. ఈ వాతావరణాల్లో కవిత్వానికి విపరీతమైన ఆదరణ ఉండేది. కవిత్వం చదివేవాడికి హీరో వర్షిప్ ఉండేది. కవి అనేవాడు నాకొక పెద్ద హీరోలా కనపడేవాడు! కవిత్వంలోకి ఎంటరయిత తర్వాత తెల్సింది – కవిత్వం కత్తి మొనల మీద నడక అని.

అలాగే కాలేజీలో రచనల పోటీ ఏదున్నా రాసేవాడ్ని. టీచర్లు బహుమతిగా పుస్తకాలు ఇచ్చేవారు. నరసింహాచార్యులు అనే తెలుగు టీచరు నాకు పద్యం చక్కగ చదవటం నేర్పించారు. నా ఫ్రెండ్స్ అందరూ కూడా వీడి కవిత్వం పిచ్చోడు, పుస్తకాల పిచ్చోడు అని నన్ను విడిగా చూసేవారు, కానీ నన్ను చాలా ప్రేమించేవారు. ఏదన్నా పుస్తకం కనపడితే నాకోసం కొని తెచ్చేవాళ్లు.

హైదరాబాద్‌లో లైబ్రరీలు, సాహిత్య సభలూ ఇవన్నీ అందుబాటులో ఉండటం వల్ల కవిగా రూపాంతరం చెందే ముందు దశ నాకు సహజంగా ఏర్పడింది.

rajani

బాగా చదివేవారా?

బాగా చదవడం అనే మాట పెద్ద మాటేమో. చదవడం ఇష్టం… అంతే. ఇంటర్లో ఉన్నప్పుడే సిటీ సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళి కూచునేవాడ్ని. ఏది చదవాలో ఎవరూ నాకు చెప్పలేదు. ‘మ్యూజింగ్స్’ చదివి చలాన్ని నా అంతట నేను పరిచయం చేసుకున్నాను. చదవటంలో విపరీతమైన ఆనందం దొరికేది. ఇప్పటికీ మంచి పుస్తకం చదివిన రోజు శరీరానికి రెక్కలు మొలుస్తాయి. మొదట్లో లైబ్రరీ నుంచి పుస్తకాలు ఇంటికి తెచ్చుకునే వీలుందని తెలియక, అక్కడే కూర్చుని నచ్చిన కవిత్వాన్ని నోటు పుస్తకంలో రాసుకునేవాడ్ని. నిశికవుల సంకలనం మొత్తాన్ని అలాగే రాసుకున్నాను, కేశవరావు పేరుతో నగ్నముని రాసిన ‘ఉదయించని ఉదయాలు’ మొత్తం రాసుకున్నాను, శేషేంద్ర ‘నా డైరీ – రక్తరేఖ’ మొత్తం రాసుకున్నాను, చలం ‘కానుక’, ‘గీతాంజలి’ రాసుకున్నాను. దిగంబర కవుల సంకలనాలు, నారాయణరెడ్డి గేయసాహిత్యం (‘నాగార్జున సాగరం’ కావ్యం నాకు చాలా ఇష్టం), నిశికవుల సంకలనం (చాలా గందరగోళంగా, మార్మికంగా నేను ఏ బాధతో అట్టుడికిపోతున్నానో అలాంటి బాధతో ఉన్న కవిత్వం ఇది),  శేషేంద్ర కవిత్వం (శేషేంద్ర నన్ను పట్టి పడదోసి తన ప్రభావంలో ముంచెత్తాడు. ఇప్పుడు అందరూ ఆయన్ని పక్కనపెట్టారు. ‘నువ్వు ఆకలి కవిత్వం రాయి, ఆవకాయ కవిత్వం రాయి, కానీ కవిత్వం రాయి అన్న గొప్ప కవి), సంజీవదేవ్ రచనలు (అతను నాలాగే ఒంటరివాడనిపించింది, అంత ఒంటరితనంలో కూడా ఒకరకమైన స్వతంత్రంతో స్వేచ్ఛతో రాశాడు), గాలిబ్ గీతాలు, శ్రీశ్రీ మహాప్రస్థానం, కథలూ, నాటికలూ ఇవన్నీ అక్కడే చదువుకున్నాను. రేడియో ద్వారా పుట్టపర్తి నారాయణాచార్యులు, కృష్ణశాస్త్రి, దాశరథి పరిచయమయ్యారు. కృష్ణశాస్త్రి మొదట పుస్తకం ద్వారా గాక, పాట ద్వారా నా జీవితంలోకి వచ్చాడు. రేడియోలో ఆయన పాట వస్తే నోటుబుక్‌లో రాసుకునేవాడ్ని, రాసుకున్నది పదే పదే చదివేవాడ్ని.

చదువు ఇంగ్లీషు మీడియంలో సాగింది కాబట్టి నేను తెలుగు సాహిత్యంతో సమాంతరంగానే ప్రపంచ సాహిత్యాన్ని ఇంగ్లీషులో కూడా చదువుకున్నాను. అది కూడా లైబ్రరీలోనే. ఇంగ్లీషు సెక్షన్‌లోకి వెళ్ళి చేతికందిన పుస్తకం తీసుకుని చదివేవాడ్ని. కీట్స్‌నీ, షెల్లీనీ, షేక్స్‌పియర్‌ నాటకాలనీ అక్కడే చదువుకున్నాను. ఇవన్నీ నాకు అర్థం కాకపోయినా అదేపనిగా చదివేవాడ్ని. ప్రితిష్ నంది భారతీయ కవిత్వంతో ఒక సంకలనం చేశాడు. కమలాదాస్, అమృతా ప్రీతమ్, సునీల్ గంగోపాధ్యాయ దాని ద్వారానే పరిచయం అయ్యారు. దాన్ని కూడా లైబ్రరీలో కూర్చుని రాసుకున్నాను. డిలాన్ థామస్, బాదిలేర్‌ల కవిత్వం అప్పుడే చదువుకున్నాను.

మీరు కవిత్వంలోకి వచ్చీ రావటంతో ఇలా మీదైన వ్యక్తీకరణతో వచ్చారనిపిస్తుంది. ఈ వ్యక్తీకరణ వెనుక ప్రభావాల గురించి చెప్పండి?

కవులు ఎవరంతట వారు పుట్టుకురారు. వాళ్ల వెనక ఎన్నో వందల సంవత్సరాల సృజనాత్మక నిర్మాణం ఉంటుంది. అలా నన్ను సిద్ధం చేసిన కవులు చాలామంది ఉన్నారు. నేను ‘దీపశిల’ రాయటానికన్నా ముందు చదివిన కవితాసంకలనాలూ, కవులూ నన్ను చాలా ఇంప్రెస్ చేశారు. ఈ ప్రభావం భాషపరంగానో, వ్యక్తీకరణ శైలి పరంగానో కాదు. నన్ను వీళ్ళంతా ఆంతరిక స్థాయిలో ప్రభావితం చేశారు. నా అంతరంగంలోకి వీళ్ళని తెచ్చుకుని నింపుకున్న తర్వాత నా రక్తంలోంచి, నా భాషలోంచి, నా వ్యవహారంలోంచి బయటకొచ్చింది నా కవిత్వం. ఇందాక ప్రస్తావించిన వారితో పాటు – మో, అజంతా, శివసాగర్, శ్రీశ్రీ, ఇస్మాయిల్, చలం, రంధి సోమరాజు ఇలా ఎందరో ఉన్నారు. కొన్ని విరసం కవితా సంకలనాలు, సృజన సంచికలూ కూడా ఉన్నాయి.

మీ కవితల కంపోజిషన్ గురించి చెప్పండి. The physical process of writing them?

నాకు కవిత్వం రాయటానికి స్థలకాలాలతో సంబంధం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు రాస్తాను. నడుస్తున్నప్పుడో, బస్సులో వెళ్తున్నప్పుడో, బండి నడుపుతున్నపుడో ఇలా కదలికలో ఉన్నప్పుడు నాకు ఎక్కువ ఆలోచనలు వస్తాయి. నేను స్పాంటేనియస్ పొయెట్‍ని. రివిజన్ ఉండదు, ఎడిటింగ్ ఉంటుంది.

కవిత రాస్తున్నంత సేపూ నేను ఉండను. భాష అని గానీ, వాక్యమని గానీ, ఎలా రాస్తున్నామని గానీ అదేం తెలియదు. రాయకముందు ఏదో అనీజీనెస్ ఉంటుంది. అది మాత్రమే గుర్తుంటుంది. కవిత పూర్తయి స్పృహలోకి వచ్చిన తర్వాత ఎడిటింగ్ ప్రాసెస్‌లో అర్థమవుతుంది ‘ఒహో ఇది వచ్చిందీ, ఇలా వచ్చిందీ’ అని. అంతేతప్ప ముందే ఇది ఇలా ఉండాలీ అని ఫ్రేమ్ విధించుకుని రాయను. ముందే వాక్యాలు మనసులో నిర్మించుకోవడం ఉందదు. తల్లికి కనేటప్పుడు వాడు బిడ్డా, నేను తల్లా, వాడు నా యోని లోంచి వస్తున్నాడా.. ఈ స్పృహేమీ ఉండదు. అలాగే ఇది కూడా. శిగమూగుతారు కదా… ఆ శిగమూగేవాడికి ఏమీ తెలియదు. వాడు ఒక మీడియంలా పనిచేస్తాడు అంతే. ఆ మీడియంలా పని చేసేవాడికి నేచర్ ఏదో ఇచ్చేసి వెళిపోతుంది. కవిత్వం అనేది నేచర్. నేను మీడియం మాత్రమే. మన చుట్టూతా ఉండే అనేకానేక శక్తులు మన మీద దాడి చేసి, మనల్ని ఎంచుకుని, ఒక మీడియంలా వాడుకుని వదిలేస్తాయి. అప్పుడు కవిత్వం పుడుతుంది.

మీ కవిత్వంలో దిగులు, దుఃఖం, గాయాల స్వభావం గురించి ఏమయినా చెప్పగలరా?

బాల్యం నుంచీ ప్రేమరాహిత్యం నన్ను పట్టిపీడించింది. అలాగని నన్ను ప్రేమించే అమ్మానాన్నలు లేరా, మిత్రులు లేరా, బాల్యం లేదా.. అంటే అవన్నీ ఉన్నాయి. నాది అద్భుతమైన బాల్యం. అయినా అందులోనూ ఒంటరితనం ఉంది. ఒక్కోసారి వర్షం పడే మధ్యాహ్నాలు మా కుమ్మరిబస్తీలోంచి నడుచుకుంటూ ఊరవతల ఉన్న రైల్వే స్టేషన్‌కి వెళ్ళి కూర్చునేవాడ్ని. మొత్తం రైల్వేస్టేషనంతా వర్షంలో తడుస్తూ ఖాళీగా ఉండేది. ఆ స్టేషన్‌ను ఆనుకుని ఒక వాగు పారేది. ఆ వాగు పక్కన బ్రూక్‌బాండ్ ఫాక్టరీ ఉండేది. దాని నుంచి కొంత డెబ్రిస్ వచ్చి వాగులో కలిసేది. వర్షం వెలిసి ఎండ వచ్చినపుడు ఆ డబ్బాలూ రేకులూ అవన్నీ కూడా ఎండకి తళతళా మెరిసేవి. కొన్ని డబ్బాలు ఏరి తెచ్చుకుని స్టేషన్లో పేర్చి ఆడుకునేవాడ్ని. మళ్ళీ వర్షం మొదలయ్యేది. ఎన్నో సాయంత్రాలు ఇలా రైల్వే స్టేషన్లలో ఒంటరిగా కూర్చుని గడిపేవాడ్ని. రైలు రావటం అనేది నాకు మిస్టికల్ ఎట్రాక్షన్. ఎక్కడో దూరం నుంచి రైలు నా లోపల్నుంచే వస్తుందా అన్నట్టు వచ్చి వెళ్ళిపోయేది… ప్రయాణీకులు వెళిపోయి ఫ్లాట్‌ఫామ్ ఖాళీ అయిపోయినా నేను వర్షంలో అలాగే కూర్చుని ఉండేవాడ్ని, ఎప్పుడో సాయంత్రానికి ఇంటికి వెళ్ళేవాడ్ని. ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్లావంటే ఆడుకోవడానికి వెళ్ళానని చెప్పేవాడ్ని. అలా చెప్తే ఊరుకుంటారు కానీ, ఒంటరిగా రైల్వే స్టేషన్లో గడపటానికి వెళ్ళానంటే ఏదోలా చూస్తారని చెప్పేవాడ్ని కాదు. అలా ఒంటరితనం నాకు నేను విధించుకునేవాడ్ని. బహుశా అది జెనెటిక్ ప్రాబ్లమేమో. ప్రకృతిలో భాగం అవ్వాలనుకునే మనిషి ఈ ఒంటరితనాన్ని ఈదుకుంటూ.. దాటుకుంటూ వెళ్ళక తప్పదు.

నా రక్తంలోని ఈ ఒంటరితనాన్ని నాకు తారసపడిన రచయితలంతా ద్విగుణీకృతం చేశారు. వాళ్ళే నన్ను ఎంపిక చేసుకున్నారు. అసలు నా దుఃఖం ఏమిటీ అని అడిగితే నేను చెప్పలేను. అది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అది స్పిరిచ్యువల్ దుఃఖం అని మాత్రం చెప్పగలను. కవిత్వం ద్వారా ఆ దుఃఖం నాకు దగ్గరగా వచ్చి తన గురించి తాను విప్పి చెప్పే ప్రయత్నం చేసింది. అయినా నాకు అర్థం కాలేదు. కానీ కవిత్వం ఉండటం వల్లే దుఃఖాన్ని నిభాయించుకునే శక్తి వచ్చింది. దుఃఖం కవిత్వానికి బలాన్నిచ్చింది. కవిత్వం తిరిగి ఒంటరితనానికి బలాన్నిచ్చింది.

కవిత వెనుక అనుభవ నేపథ్యం మీ పాఠకునికి స్పష్టంగా అందుతుందన్న నమ్మకం మీకుందా? అసలు అందాలన్న కోరిక ఉందా?

నా అనుభవం పాఠకునికి అందాలనీ, నేను పాఠకునికి అర్థం కావాలనీ రాయను. నా కవిత్వం చదివి పాఠకుడు తనదైన అనుభవంలోకి వెళ్ళగలిగితే చాలనుకుంటాను. నా కవిత్వం ఒక సైన్‌బోర్డులాగా అతడ్ని తన అనుభవంలోకి తీసికెళ్తే చాలు. రాసేటప్పుడు నా అనుభవమే నాకు ముఖ్యం. కానీ ఎడిట్ చేసేటప్పుడు జాగ్రత్త తీసుకుంటాను. నా అనుభవమే అతనికి అందాలని ఆశించను.

స్పష్టత బరువు ఇంకా కవిత్వం మీద ఉన్నదంటారా తెలుగులో?

నా దృష్టిలో స్పష్టత అనేది కవిత్వానికి ఒక తిట్టు. రాజకీయపరమైన, సాహిత్యపరమైన కుట్ర. రకరకాల ఆర్గనైజేషన్సు, పొలిటికల్ ఇన్‌స్టిట్యూషన్సూ పాఠకుల మీద రుద్దుతాయి స్పష్టతని. వీళ్ళు చెప్పే స్పష్టత వెనుక ఒక ఎజెండా ఉంటుంది. ఆ ఎజెండా ఎప్పుడూ పాఠకుడ్ని వాడిదైన స్పష్టతలోకి తీసికెళ్లదు. లెఫ్ట్ పాలిటిక్స్ వల్లా, ఆ తర్వాత ఐడెంటిటీ పాలిటిక్స్ వల్లా తెలుగు సమాజం ఈ స్పష్టత బరువుని మోసింది. ఈ స్పష్టత అనేది దాని ప్రయోజనం తీరే వరకూ ఫర్లేదు. ఆ తర్వాత కూడా కొనసాగిస్తే ఆ జాతికి అది బరువుగా మారుతుంది.

ఎందుకుండాలి స్పష్టత కవిత్వంలో? అదేమన్నా కరపత్రమా, రాజకీయ ప్రకటనా? అసలు కరపత్రాల వెనుకా, రాజకీయ ప్రకటనల వెనుకా రహస్య ఎజెండాలు ఎంతమందికి అర్థమవుతాయి? మరి కవిత్వానికి మాత్రం స్పష్టత కావాలా? ప్రతి text అస్పష్టంగా ఉంటేనే text అవుతుంది. కవిత్వానికి సబంధించిన నిర్వచనాలూ నిర్ణయాలూ పాఠకుడు తీసుకుంటాడు. నువ్వెవడివి స్పష్టత ఇవ్వడానికి? స్పష్టత అనేది పాఠకుడ్ని ఎదగనీయకుండా చేసే కుట్ర మాత్రమే.

అయితే – స్పష్టత ఉన్నదేదీ కవిత్వం కాదా అంటే, నేనా మాట అనను. దీనికి గొప్ప మినహాయింపుగా ఇస్మాయిల్ వంటి మహాకవులున్నారు. మరి ఆయనలో ఎంతో స్పష్టత ఉంటుంది. అద్భుతమైన ఇమేజెస్ ఉంటాయి. ఒక చోట అంటాడు “పాతదైపోయిందని ఇల్లు కూల్చి కొత్తది కట్టారు. ఎవరైనా నన్నూ అలా కూల్చి కొత్తగా కడితే బాగుండునూ” అని. ఇంత స్పష్టంగా ఉంది కాబట్టి ఇది కవిత్వం కాదూ అనలేంగా. ఇది వేరు.

మనం రాజకీయ ప్రయోజనాల కోసం, ఎజెండా కోసం, యుటిలిటీ కోసం స్పష్టత అంటున్నాం. అది కాదు. అసలైన స్పష్టత ఒక గొప్ప ఈస్థటిక్ ప్రాసెస్. కాంప్లెక్సిటీల్ని దాటుకుని తన్ను తాను సింప్లిఫై చేసుకునే ఒక ప్రక్రియ. దాన్ని సాధించిన మహాకవులున్నారు మనకు. ప్రపంచ సాహిత్యంలో హైకూ కవిత్వం అట్లా ఉంది, మన సంప్రదాయ కవులున్నారు, వేమన ఉన్నాడు… అంతెందుకు శివసాగర్‌లో ఉండే స్పష్టత ఎవరిలో ఉంది, వజీర్ రెహ్మాన్ ఎంతో సింపిల్‌గా కనిపించే కవితలో అసాధారణమైన ఎమోషన్‌ తీసుకొచ్చి పెడ్తాడు… వీళ్ళందరూ సంక్లిష్టతని ఎంతో మధించీ మధించీ ఒక అనుభవంతో ఉట్టిపడే భావాన్ని సులభంగా చెప్పారు. కృష్ణశాస్త్రి మాటల్లో చెప్పాలంటే – అలతి పొలతి పదాలలో చెప్పగలిగారు. అది గొప్ప సాధన! అది ఎప్పుడూ అభిలషణీయమే. ఆ స్పష్టతకీ, ఇప్పుడు వీళ్ళంతా మాట్లాడుతున్న స్పష్టతకీ సంబంధం లేదు. 

కవికి భాషకీ ఉండాల్సిన శత్రుత్వం గురించి ప్రస్తావించారు. దాని గురించి చెప్పండి?

భాష అనేది అనుభవానికి అడ్డుగా నిలబడుతుంది. విపరీతంగా పదాలు వచ్చేస్తుంటాయి. ఏది ఎన్నుకోవాలో తెలీదు. ఎన్నుకోవటం కూడా నా చేతిలో ఉండదు. కవిత రాసిన తర్వాత మళ్ళీ ఇంకో పదాలు తెచ్చి ఇరికించను. కొన్ని తీసేస్తాను, కొన్ని లింకులు కలుపుతాను. అంతకుమించి దాన్ని అబ్యూస్ చేయను. నీషే అంటాడు: “మనిషి అనుభవాన్ని సంపూర్ణంగా చెప్పే శక్తి భాషకు లేదూ” అని. ఇదిగో ఇక్కడే కవి అనేవాడు ప్రధానమైన పాత్రని నిర్వహిస్తాడు. అలాంటి భాష వాడి దగ్గర ఉంటుంది గనుక దాన్ని ఎంత వీలైతే అంత వాడుకుని మానవ స్థితిని వ్యక్తం చేసే అవకాశాన్ని తీసుకుంటాడు. తద్వారా పాఠకునికి తన అనుభవాన్ని అంది పుచ్చుకునే వంతెన ఏర్పడుతుంది.

ఈ ప్రయత్నంలో కవికి భాష ఎప్పటికీ శత్రువే. ఎందుకంటే భాష వాడ్ని రొటీన్నెస్‌లోకి నెడుతుంది. అందులోకి వెళిపోయిన తర్వాత వాడు శక్తిహీనుడవుతాడు, భాష గెలుస్తుంది. అప్పుడిక కవి తన అనుభవాన్ని పూర్తిగా చెప్పలేడు. ఎప్పుడైతే కవి భాషతో యుద్ధం ప్రకటిస్తాడో, ఇద్దరూ ఎదురుబొదురు నిలిచి పోరాటం చేస్తారో, అప్పుడు మాత్రమే భాష వాడితో సరిగ్గా వ్యవహరిస్తుంది. వాడ్ని సమాదరించి అనుభవంలోకి తీసుకువెళ్తుంది. చిన్నప్పుడు అల్లావుద్దీన్ కథ ఉంది కదా. దీపం నుంచి పుట్టిన భూతానికి భయపడకపోతేనే అది వాడికి పనులు చేసిపెడుతుంది, భయపడితే వాడ్ని అణచివేసి వెళిపోతుంది. అందుకని కవి భాష ముందు కర్ర పట్టుకుని నిలబడాలి.

scan

‘దీపశిల’ కవితల్లో మీకు బాగా నచ్చిన కొన్ని కవితలు, వాటి నేపథ్యమూ చెప్పండి?

‘దీపశిల’లో ప్రతి కవితా నా ప్రాణం. కానీ ప్రశ్న ఇలా అడిగారు కాబట్టి… వెంటనే గుర్తొచ్చేవి చెప్తున్నాను. ‘చినుకై’ అనే కవిత ఒకటి. అందులో మా నాయనమ్మ ప్రవేశించింది. ఆమె మబ్బుల గురించి, రైతు గురించీ కథలు చెప్పేది. ఆ ఇమేజరీ అంతా అందులోకి వచ్చింది. ‘అతనొక హిప్నాటిక్ నీడ’ అని మా నాయన మీద రాసిన కవిత ఒకటి. కష్టపడటం కోసమే, పని చేయడం కోసమే పుట్టిన వ్యక్తి మా నాయన. శ్రమ మాత్రమే లిబరేషన్ అని నమ్ముకున్న వ్యక్తి. అలాగే ‘తాదాత్మ్యపు అంచున’ అనే కవిత ఒకటి. ఎందుకంటే నేను పాటగాడ్ని. సంగీతమంటే ఇష్టం. ఎన్నో సంగీత కచేరీలకు వెళ్ళేవాడ్ని. ఆ వాతావరణం ఈ కవితలో ఉంటుంది. అలాగే ‘రాత్రి రెండు గంటలు’ అనే కవిత. అది చదివి కె. శ్రీనివాస్, కల్లూరి భాస్కరం ఎంతో దగ్గరకు తీసుకున్నారు. అలాగే ‘వర్షము – వెన్నెల – ఊరు’ అనే కవిత ఒక పెయింటింగ్. దాన్ని ఎప్పటికైనా సినిమాగా తీస్తాను.

మీ సితార్ సంగీత సాధన కవిత్వాన్ని ఏ అంశాల్లోనైనా ప్రభావితం చేసిందని అనుకుంటారా?

నా కవిత్వమే కాదు, ప్రపంచంలో గొప్ప కవిత్వం ఏదైనా కూడా సంగీతంతో లింకై ఉందనే అనుకుంటాను. శ్రీశ్రీ కవిత్వంలో శబ్దం ఉంది, అంతకన్నా గొప్పగా శివసాగర్ కవిత్వంలో నాదం ఉంటుంది. కృష్ణశాస్త్రి కవిత్వంలో గాత్రం ఉంటుంది. బైరాగి కవిత్వంలో పదం లేని ఆలాపన ఉంటుంది. అజంతా కవిత్వంలో లయకీ నాదానికీ మధ్య ఉండే నిశ్శబ్దం వుంటుంది.

నేను హిందుస్తానీ సంగీతంలో డిప్లొమా చేశాను. ఆర్ట్ ఫార్మ్స్‌లో సంగీతం హయ్యస్ట్ ఫార్మ్ అనుకుంటాను (తర్వాత పెయింటింగ్, తర్వాత పొయెట్రీ). సితార్ ప్లే చేస్తున్నప్పుడు ఆ సంగీతం మన ఒంటినీ, మన అంతరంగాన్నీ తగిలినప్పుడు వచ్చే అనుభవ, దృశ్య, శబ్ద పరంపరలు నా కవిత్వంలోకి కూడా ప్రవేశించాయని నేను అనుకుంటున్నాను.

‘దీపశిల’ తర్వాత రాసిన కవిత్వంలో మీరు తెలంగాణ ఐడెంటిటీకి దగ్గరగా వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఈ మార్పు ఎలా వచ్చింది?

నాకొక ఆరాటం ఉంటుంది. ఒక కవిత రాసానంటే ఆ కవితలా ఇంకోటి ఉండకూడదు. కవి అన్న వాడు తన గొంతును కొనసాగిస్తూనే తన దారిని మార్చుకుంటూ ఉండాలి. అలా నాకు నేను భిన్నంగా ఉండాలని, నా భాషను నేను వెతుక్కోవాలనీ పడ్డ ప్రయాసలో ఇనెవిటబుల్‌గా నేను నా ఊరిలోకి, నా తెలంగాణ ఐడెంటిటీలోకి ప్రయాణం చేశాను. తర్వాత్తర్వాత అది ఐడెంటిటీ పాలిటిక్సుతో ముడిపడి ఉండొచ్చు. అది వేరే విషయం.

ఇప్పుడు పాఠకుల ముందు రాబోతున్న కవితా సంపుటాలు ‘బొమ్మలబాయి’, ‘మల్లెల తీర్థం’ గురించి క్లుప్తంగా చెప్పండి?

ఈ రెండు సంకలనాల్లోని కవితలూ రాస్తున్నప్పుడు చాలా చర్యలు జరిగాయి. అవి రాజకీయమూ, సామాజికమూ, ఆంతరికమూ. నేను వెనక్కిపోయి జీవితాన్నంతా పునర్మూల్యాంకనం చేసుకుని దాన్ని రీవైటలైజ్ చేసే ప్రయత్నం ‘బొమ్మలబాయి’. దీని తర్వాత అంతకన్నా పెద్ద అడుగు వేసే ప్రయత్నం ‘మల్లెల తీర్థం’; అంటే ఈ అస్తిత్వ ఉద్యమాలు తమ లక్ష్యాలు నెరవేర్చుకున్న తర్వాత, వాటికి కాలం చెల్లిన తర్వాత ఏమిటీ అనే ఆలోచన నుంచి పుట్టినవి ఇందులోని కవితలు.

‘దీపశిల’ తర్వాతి కవితల్లో నోస్టాల్జిక్ లాంగింగ్ కూడా ఎక్కువ వుంటుంది. మీ ఊరూ, మీ పిన్నమ్మలూ పెద్దమ్మలు, మీ దేవుళ్ళూ వీరంతా కవితల్లోకి చేరతారు. ఈ మార్పు ఎలా వచ్చింది? 

4దీని మూలాలు ‘దీపశిల’లోనే మొదలయ్యాయి. (ఇందాక చెప్పిన ‘చినుకై’, ‘అతనొక హిప్నాటిక్ నీడ’ లాంటి వాటిలో.) నేను ఒక ట్రాన్స్‌ఫార్మేషన్ కావాలనుకున్నాను. ‘దీపశిల’ తర్వాత అందులో చూపించిన నగర జీవితం అక్కడితో ఆగిపోయింది, డెడ్ ఎండ్‌కు చేరుకుంది అనిపించింది. ఇక ముందుకు వెళ్ళటానికేం లేదు, వెనక్కి వెళ్లాల్సిందే అనిపించింది.  నా పూర్వీకుల్నీ, నా కులపెద్దల్నీ, నా ప్రాంతీయతనీ గనుక అడ్రెస్ చేయలేకపోతే కవిత్వం గట్టిగా పలకదు అనిపించింది. అందుకే వాళ్ల మధ్యకు వెళ్ళాను. అప్పుడు వాళ్ళ భాషే మాట్లాడాలి. అదే చేశాను. అందుకే సాహిత్యమంతా పల్లె ఇంటి పెరళ్ళలో ఉంటుందన్న యు.ఆర్. అనంతమూర్తి మాటల ప్రేరణతో మొసాంబ్రమ్ కవితలో “ఇంటెనకాలకి పోంర్రి బిడ్డా/ పిలగాండ్ల దగ్గరికి పొంర్రి/ పొద్దుగూకినంక పారాడే ఆడోల్ల/ ముచ్చట్ల దగ్గరికి పోంర్రి” అన్నాను. తెలంగాణ భాష కూడా లయాత్మకమైనది. యాసల్లో అది ఉంటుంది. ప్రామాణిక భాషలో అది ఉండదు. తెలంగాణ భాషలోని లిరిసిజాన్ని కవిత్వంలోకి తెస్తేబాగుంటుంది అనిపించి కూడా రాశాను. ‘భాష ఒక గునుగుపువ్వు’ అన్న కవితలో దీనికి కీ ఉంటుంది. అప్పటికే ‘గోల్కొండ కవుల సంకలనం’ చదవడం, సురవరం ప్రతాపరెడ్డి గారి వ్యాసాలు చదవడం, తెలంగాణ చరిత్ర మీద పుస్తకాలు చదవడం, దాశరథి కృష్ణమాచార్య రచనలు, కాళోజీ గొడవలూ, అల్లమన్న కథలూ… ఇలా చాలా ప్రేరణలున్నాయి. ఇప్పుడిలా చెప్తున్నాను గానీ, ఇదంతా కూడా చాలా అన్‌కాన్షస్‌గా జరిగింది.

ఒక కవిత తెలంగాణా యాసలో ఎందుకు మాట్లాడుతోంది, ఒకటి ఎందుకు మాట్లాడటం లేదు. మీ ఈ ఎంపికను నిర్ధారించేది ఏది?

ఏ కవిత రాసినా దాని వెనకున్న అనుభవమే ఆ భాషను నిర్ధారిస్తుంది. ఒక షాక్‌కి గురైనపుడు వెంటనే నువ్వు నేటివిటీకి పోతావు. అటువంటి అనుభవం ఉన్నప్పుడు నేను నేటివిటీకి పోయాను. అలాగే ఒక్కోసారి పొలిటికల్‌గా ఇది తెలంగాణాలో మాట్లాడాలీ అనుకుని అలా రాసిన కవితలు కొన్ని ఉన్నాయి. పాఠకుడికి తెలంగాణ భాషను దగ్గర చేయాలన్న ప్రయత్నమూ ఉంది. అలాగే ‘అమ్ముగుడా’ లాంటి కొన్ని కవితల్లో తెలంగాణ యాసా, మామూలు తెలుగూ రెండూ కలిసి వచ్చిన సందర్భాలున్నాయి. అభివ్యక్తిలో కూడా ఫ్యూజన్ నాకు చాలా ఇష్టం.

తెలంగాణ ఉద్యమానికీ – సాహిత్యానికీ గల రిలేషన్‌షిప్ గురించి చెప్పండి?

తొంభైలు మొదలుకొని ఈనాటి వరకూ తెలంగాణ ఉద్యమానికి సారంగా, ఉత్ర్పేరకంగా, భూమికగా పని చేసింది కవిత్వమే. తెలంగాణ కవిత్వం లేకపోతే తెలంగాణ ఉద్యమం లేదు. తెలంగాణ పాట అంతకుముందే మొదలయ్యింది గానీ అది రాన్రానూ వామపక్ష ఉద్యమాలకే పరిమితమై తెలంగాణ ఉద్యమానికి ఏమీ పనికి రాకుండా పోయింది. ఎప్పుడైతే తెలంగాణ భాష కవిత్వంలోకి వచ్చిందో అప్పుడు అది తీవ్రాతి తీవ్రంగా సబ్‌కాన్షస్ లెవెల్లో తెలంగాణ ఉద్యమశ్రేణుల జీవితాల్లోకి ఇంకింది. ఇది తొంభైల్లోనే జరిగింది.

తెలంగాణ కవిత్వానికి మీ కంట్రిబ్యూషన్ ఏమిటనుకుంటున్నారు?

1994లో నేను ‘నాయన’ అనే కవిత రాశాను. దాని నిర్మాణాన్ని ఇష్టపడి ఆ రీతిలో రాసినవాళ్లు ఉన్నారు. అప్పటి నుంచి 2000 వరకూ నేను అదే పనిగా తెలంగాణ కవితలు రాశాను. ‘సుట్ట కుదురు మీద మొగులు’, ‘సింగాడ’, ‘రాగి వెన్నెల’, ‘బుశ్శెడ’ ఇలా వీటన్నింటిలో నేను నా వ్యక్తీకరణను నిలుపుకుంటూనే, సమాంతరంగా తెలంగాణా అస్తిత్వాన్ని నాదైన పద్ధతిలో సారవంతం చేస్తూ వచ్చాను. నాతో అంతకుముందూ ఆ తర్వాత రాసిన కవులూ ఎందరో ఉన్నారు. దెంచనాల శ్రీనివాస్ నా ‘దీపశిల’తో సమాంతరంగా ‘గురి తప్పిన పద్యం’ పుస్తకం తీసుకువచ్చాడు. అందులో ‘గంగావతి ద్వాలి’ అనే అద్భుతమైన పదాన్నిచ్చాడు. ఆ తర్వాత వచ్చిన కొన్ని అద్భుతమైన కవితా సంకలనాలు ‘మత్తడి’ (అంబటి సురేంద్ర రాజు, సుంకిరెడ్డి నారాయణరెడ్డి సంపాదకులు), ‘పొక్కిలి’ (జూలూరి గౌరీశంకర్ సంపాదకుడు), ‘వేంటాడే కలాలు’, ‘మునుం’, ‘జులూస్’ (జగన్ రెడ్డి సంపాకత్వం), సుంకర రమేష్ పదేళ్ళ పాటు తెచ్చిన ‘తెలంగాణ కవిత’ సంచికలు, గోరటి వెంకన్న ‘అలచంద్రవంక’ పాటల కవితలు, ‘జాగో జగావో’, ‘సిర్ఫ్ హైదరాబాద్’, ముల్కీ సాహిత్య సంచికలు, చింత సాహిత్య సంచికలు, చెమ్మ (పులిపాటి గురుస్వామి)… వీటికంటే ముందు గోసంగి కవుల కవిత్వం ఉప్పెనలా వచ్చి పడింది. ‘ఎన’, ‘వర్జి’, ‘బహువచనం’, ‘ఆమె నా బొమ్మ’ (అయిల సైదాచారి), ‘ఒక్కడ్నే’ (జగన్ రెడ్డి), ‘ఎర్కోషి జర్కోషి’ (యాదయ్య) వంటి కవితా సంకలనాలు, వేముల ఎల్లడు రాసిన ‘కక్క’, ‘సిద్ధి’ లాంటి నవలలు, ‘ప్రెజెంటెన్స్’ వ్యాసాలు (సిద్ధార్థ), తెలంగాణా సాహిత్యానికి సంబంధించిన అనేకానేక విమర్శలు, చర్చలు, సమావేశాలు నిర్వహించిన అంబటి సురేంద్ర రాజు, కాసుల ప్రతాపరెడ్డి వంటి విమర్శకుల ప్రయత్నాలు, స్కైబాబా సంపాదకత్వం వహించిన ‘జల్‌జల’ కవితా సంకలనం, గుడిపాటి మొదట్లో రాసిన వ్యాసాలు, కె. శ్రీనివాస్, అల్లం నారాయణ వంటి విమర్శక దిగ్గజాలు చేసినటువంటి సాహిత్య యుద్ధాలు… ఇవన్నీ కలిపి ఒక ప్రస్ఫుటమైన తెలంగాణ అస్తిత్వ నిర్మాణానికి ఊపిరి పోశాయి. లాటిన్ అమెరికన్ దేశాల తర్వాత ప్రపంచ సాహిత్య చరిత్రలోనే ఇంత అద్భుతంగా సాహిత్యం రాజకీయోద్యమాన్ని భుజం మీద వేసుకుని నడిపిన సందర్భం లేదు. గెలిచిన సందర్భం కూడా లేదు. కవులు అందించిన బలమైన కంటెంట్ ను తీసుకుని మాత్రమే పాట వేదికనెక్కింది. ప్రేక్షకుల వరసలో కవులు కూర్చుండిపోయారు. ఇది జరిగిన వాస్తవం.

రాష్ట్ర విభజన తెలుగు కవిత్వం మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది అనుకుంటున్నారు?

విభజన ఇంకా లోతుల్లోకి దిగలేదు. నేను ఊహిస్తున్నదేమిటంటే, తెలంగాణ కవులకు ధీటుగా రాయాలనే బలమైన అంతశ్చేతనకు లోనై సీమాంధ్ర కవుల నుంచి కూడా కొత్త గొంతులు బయటకు రావొచ్చు. తెలంగాణ నుంచి కవిత్వం ఎంత ఉధృతిగా వచ్చిందో అలాగే ఉత్తరాంధ్ర నుంచో, రాయలసీమ నుంచో, పల్నాడు ఏరియాల్లోంచో గొప్ప కవిత్వం వస్తుందని నాకనిపిస్తుంది. దీని వల్ల తెలుగు కవిత్వం మొత్తం సుసంపన్నం అవుతుంది.

కవిత్వం కలిసే కొనసాగుతుందా?

teresh siddharthaకవుల మధ్య విభజనలేం ఉండవు. పైడి తెరేష్ బాబు ‘విభజన గీత’ రాసి ఒక గొప్ప ఉదాహరణగా నిలబడ్డాడు. దళిత కవి కాబట్టి ఆ పని చేయగలిగాడు. అక్కడైనా ఇక్కడైనా మనం వెనకబడ్డవాళ్ళమే అనీ, విభజిస్తే మనకు మేలు జరుగుతుంది, లేదంటే ఈ కుట్ర అలాగే కొనసాగుతుందనీ భగవద్గీతను రిడిక్యూల్ చేస్తూనే విభజన అవసరాన్ని హైప్ చేస్తూ రాసిన గొప్ప కవిత. మున్ముందు కూడా ఇలాంటి మంచి కవిత్వం వస్తుంది. ఈ ద్వేషాలు ఉండవు. ఇప్పటి వరకూ ద్వేషాలుగా కనిపించినవి ఒక స్ట్రాటజీ మాత్రమే. అదంతా ధర్మాగ్రహమే తప్ప వ్యక్తిగత స్థాయిలో అవేం లేవు.

మీ రాబోయే కవితా సంకలనాల్లో ఏవైనా కవితల గురించి చెప్పండి?

‘బొమ్మలబాయి’, ‘మల్లెల తీర్థం’ సంపుటుల్లో ప్రతి కవితా నాకిష్టమైనదే. మీ తృప్తి కోసం రిఫరెన్సుగా ఇవ్వమంటే కొన్ని ఇస్తాను. ‘కుంతలమ్మ/ చిత్తమ్మ/ ఎంకటమ్మ/ ఇంకా…’ అని ఒక కవిత ఉంది. లక్ష్మాగౌడ్, వైకుంఠం, ఏలె లక్షణ్ వీళ్ల పెయింటింగ్స్‌కి మాతృకల్లాంటి ఈ స్త్రీలంతా నా జీవితంలో ఉన్నారు. మా అమ్మమ్మలూ ముత్తవ్వలూ అంతా వీళ్ళే. అసలు కుంతలమ్మ, చిత్తమ్మ ఈ పేర్లే ఎంత కొత్తవి! ఒక్కొక్కరూ ఆరడుగులు, నల్లగా ఆఫ్రికన్ స్త్రీల్లా ఉంటారు. వాళ్ళ మాటా, వాళ్ల నడకా అంతా అద్భుతం. వీళ్ళు మమ్మల్ని చూడటానికి పదిహేను ఇరవై కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చేవారు. వచ్చేటప్పుడు వాళ్ళు చేసిన పచ్చళ్ళూ, మురుకులూ, గారెలూ అవన్నీ మూట పట్టుకుని సంచిలో పెట్టుకుని వచ్చేవారు. అసలు అటువంటి వ్యక్తుల్ని ఊహించగలమా? ఇలాంటి పాత్రలు నా అనుభవంలో నన్నెలా సారవంతం చేశాయీ, శుభ్రం చేశాయీ అనేది ఈ కవిత. అలాగే ‘గొంగడి’ అనే కవిత. మా నాయనమ్మకు కట్టుకోవడానికి ఒకే ఒక చీర ఉండేది పేదరికం వల్ల. గుడిశెలో గొంగడి కప్పుకుని నిద్రించేది. అది చెప్పిన ‘గొంగడి’ కవిత నాకు చాలా ఇష్టం.

నాకు చాలా ఇష్టమైన ఇంకో కవిత ‘సంగెం’. మొదలు కావటమే ఒక స్టేట్మెంటుతో మొదలవుతుంది:

“లోపలా బయటా వుంటది బిడ్డా
మడుగు
మెరుస్తుంటది వాక్యం కాపిశ్కలాగ.
ఎరిగిపట్టుకోవాలె దాన్ని
కలకూ చింతకూ మధ్య
వేలాడుతుంటది
తాటాకు జుమ్కలాగ
చెడ నీల్గుతది వారి
.
కల్లుకంపౌండ్లల్ల గుడంబ బట్టీలల్ల మెహందీ చెమట సుక్కలల్ల
పనిముట్ల పుండ్లల్ల రక్త పంకాలల్ల వొంటరి కాష్ఠాలల్ల
పతాలేని ప్రేమలల్ల దిక్కులేని సావుల కడుపు కోతలల్ల
కుత్కెలో కూడులాగ వుంటది బిడ్డా
వాక్యం
పేగులోపల కన్నీటి పువ్వులాగ
జహన్నుమ్ జన్నత్‌ల మధ్య
చెడనీల్గుతుంటది వారి
దానికి రెండు వైపులా శబ్దముంటుంది
మధ్యలో
పెను నిశ్శబ్దపు ధార కూడా…
.
ఏడూపాయల నడుమ బుక్కా గులాలతో శిగమెత్తిన
శివసత్తిలో
కాటమరాజు కేకలో గొల్ల సుద్దుల్లో గుండే కొలకుల్ని
వొత్తి
అమర్చే అజంతాక్షుడి నిర్జన గ్రామం ముచ్చట్లలో
వుంది వాయీ…
కవిత్వం…

– ‘అజంతాక్షుడి నిర్జన గ్రామం ముచ్చట్లు’ అని ఎందుకన్నానంటే – అజంతా నేనూ కూర్చున్న చివరి సాహిత్య అకాడెమీ పఠనంలో ఆయన ఒక కవిత చదివితే నాకు దుఃఖం వచ్చింది, శరీరం బరువైపోయింది, కూర్చుండిపోయాను. ఆ కవితలో ఒక మాటంటాడాయన “ఇంకో జన్మంటూ వుంటే తెలంగాణలోని ఒక నిర్జన గ్రామంలో పుట్టాలనుంది” అని. అంతకంటే గొప్ప స్టేట్మెంట్ ఏముంటుంది కవికి. ఆ మాటకి ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాను ఈ కవితలో.

ఈ కవిత తొంభైల్లో రాసాను. అప్పటికే తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడి పాలన, హైటెక్ సిటి, గ్లోబలైజేషన్ ఇవన్నీ విపరీతంగా ఆడుకుంటున్నాయి జీవితాలతో, సెజ్జులూ గిజ్జులూ అన్నీ ఎంట్రీ ఇచ్చేసినయ్ అప్పటికే, వ్యవసాయం లేదు, ఉద్యోగాల్లేవు, హ్యూమన్ సైన్సెస్ లేవు, చరిత్ర పాఠాల్లేవు, కేవలం సాఫ్ట్‌వేర్ తప్ప ఇంకే రంగమూ లేదు, అప్పుడు ఆ ఆందోళనలో, నిరసనలో, వేదనలో రాసిన కవిత ఈ సంగెం.

థియేటర్లు అన్నీ కూలిపోతుంటే పాత థియేటర్‌ని పట్టుకు ఏడిచిన వైనం ‘దిల్షాద్’, జబర్దస్త్ ఫామ్‌తో రాసిన కవిత ‘జాజు కిటికీ’ ఇవన్నీ కూడా చాలా ఇష్టం. కండెన్స్ చేస్తూ పోయే కొద్దీ కవిత శక్తి పెరుగుతూ ఉంటుంది. కవిత్వాన్ని ఎంత సాంద్ర పరిచి, ఎంత తక్కువ చేసి మాట్లాడితే దాని విస్ఫోటన స్థాయి అంత పెరుగుతుంది.

భాష విషయంలో ఇప్పటి కవిత్వం ఎలా ఉందనుకుంటున్నారు?

ఇప్పుడు భాష కొనదేలింది. ఇంకా లోతు పెరిగింది. సరిహద్దులు ఇంకా ఎక్స్‌టెండ్ అయినాయి. భాష వెనక్కి ఇంటిపెరళ్ళలోకి వెళ్ళిందీ అని ఇందాక అనుకున్నాం కదా. ఇప్పుడు ఆ ఇంటి పెరళ్ళే మన ముంగిళ్ళు. గ్రామీణ తత్త్వం పోని స్త్రీలందరూ ఇప్పటికీ మన భాషని సుసంపన్నంగా కాపాడుతున్నారు. కవిత్వము వారి భాషను బోనంలా తలకెత్తుకుంది.

ఫేస్బుక్ తరం కవిత్వం చదువుతున్నారా?

నాకు ఫేస్బుక్ వాడటం రాదు. అసలు ఇంటర్నెట్ బ్రౌజింగ్ కూడా రాదు. కవిత్వం కూడా ప్రింట్ తీసిస్తేనే చదువుతాను. ‘కవి సంగమం’ మీటింగ్స్‌లో కొత్త కవులు వచ్చి కవిత్వం చదవటం చాలా స్వాగతం పలకాల్సిన విషయం. ఎందుకంటే కవిత్వాన్ని భుజాన్నెత్తుకు పోవటానికి కొత్త తరం కావాలి. ఆ పని ‘కవి సంగమం’ కొత్తగా చేపట్టింది. అందుకు దాన్ని అభినందించాలి. అలాగే  ఈ అంతర్జాల కవిత్వం వల్ల ప్రపంచంలో ఏ మూలనున్న వాడైనా రాయాలనుకునే సరికి మిగతావాళ్ళతో కనెక్ట్ కాగలుగుతున్నాడు. అది గొప్ప విషయం. ఈ కవుల్లో నాకు పరిచయమైన కవులు ఒక నలుగురైదుగురున్నారు. వంశీధర్ రెడ్డి, నంద కిషోర్, పాలపర్తి ఇంద్రాణి, మోహన్ రుషి, కాశి రాజు… వీళ్ళ కవిత్వం చదివాను, బాగుంది.

కానీ ఈ ‘కవి సంగమం’, ఫేస్బుక్ కవిత్వం, అంతర్జాల కవిత్వం వీటి మీద నాకు గౌరవం ఐతే ఉంది, కానీ నమ్మకం లేదు. గౌరవం ఎందుకంటే – కొత్త గొంతులు, కొత్త రక్తం కాబట్టి. మరి నమ్మకం ఎందుకు లేదూ అంటే – నాకు తెలిసి కవిత్వం సరిగ్గా ఒదగాలంటే జీవితాన్ని మించిన ఆధారం ఇంకేం లేదు. జీవితం అనివార్యం. అది మిస్సయితే కవిత్వమూ మిస్సవుతుంది. నా అవగాహనలో ఈ కవుల్లో చాలామందికి జీవితంతో సంబంధం లేదు, ఉద్యమాలతో సంబంధం లేదు, సొసైటీతో సంబంధం లేదు, సమావేశాలతో సంబంధం లేదు, సంబంధాలతో సంబంధం లేదు. కేవలం నాలుగు గోడల మధ్యనా కూర్చుని లాప్‌టాప్‌లో ట్వీట్ చేయటానికి కవిత్వం పనికి రాదు. You cannot tweet poetry. మనం బతకాలి, అనివార్యంగా. అది వీళ్ళలో చాలామందిలో లేదని ఖచ్చితంగా అనుకుంటున్నాను. వీళ్ళు తమ చుట్టూ గోడల్నీ, క్యూబికల్స్‌ బద్దలుగొట్టుకుని వచ్చి జీవితాల్లోకి దూకితే ఇంకా బలమైన కవులు కాగలరు. బహుశా కవి సంగమం ఫెయిల్యూరు ఇక్కడే ఉంది.

మీరనే ఉద్యమాలూ, సమావేశాలూ అంత అవసరం అంటారా కవిత్వానికి?

వ్యక్తుల్ని కలవకపోతే ఎట్లా? ఫ్రెండ్షిప్ లేకపోతే ఎట్ల? నీ అనుభవాన్ని కాంప్రెహెన్సివ్‌గా అద్దం పట్టి తీసుకోవడానికో నీకొక కంపారిటివ్ అనుభవం కావాలిగా? నువ్వు తిట్టాలి, లేదా ద్వేషించాలి, లేదా కోప్పడాలి, లేదా ఆనందపడాలిగా. వీటికి నీకు జీవితం కావాలిగా.

వైయక్తిక అనుభవాలు, అనుభూతులూ, కలలూ… వీటిలోకి తొంగి చూసి కవిత్వం రాయలేరా?

అది వైయక్తికత కాదు. నీలోకి నువ్వు తొంగి చూడటం అనేది నీకు జీవితానుభవం ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. అనుభవం అనేది ఇన్ఫర్మేషన్ గాదరింగ్‌గా కూడా ఉండకూడదు. నీ వైయక్తికం కూడా నీకు జీవితంతో ఉన్న కాంటాక్టు‍తోనే అర్థమవుతుంది. నేనూ, నా ఒంటరితనమూ, నా ప్రేమ, నా కెరీరూ అనుకుంటావు. కానీ ఇవన్నీ కూడా చుట్టూ సొసైటీతో లింక్ పెట్టకుండా అర్థం చేసుకోలేవు. సామాజికం కాని వ్యక్తిగతం ఏదీ లేదు. వ్యక్తిగతం లేని సమాజం ఉండదు. సమాజ వ్యక్తిగతమే కవిత్వం.

రాజకీయ, సామాజిక ఉద్యమాలు ఇవన్నీ కూడా మనం వద్దనుకుంటే దగ్గరికేం రావు, వెళ్దామనుకుంటే దగ్గరగా ఏం తీసుకోవు. అంతా మన ఇష్టం పైనే ఆధారపడి ఉంది. కానీ కవి అన్నవాడు అన్నింటికీ తలుపులు తెరుచుకోవాలి. నేను ఉద్యమం ఉంటేనే రాస్తానూ అనడం ఎంత తప్పో, ఉద్యమం లేనప్పుడే రాస్తానూ అనడమూ అంతే తప్పు కదా. వీటన్నింటికీ కూడా మూల సూత్రం జీవితంతో కాంటాక్టే. నీ కవిత్వంతో నన్ను కదిలించకపోతే నీ జీవితంతో నువ్వు కాంటాక్టులో లేనట్టే లెక్క. కుప్పలుతెప్పలుగా రాస్తున్నారే గానీ, కదిలించే వాక్యం ఒక్కటి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు. జీవితంతో సంబంధం లేకపొవడమే. సంబంధం ఉంటే వ్వక్తిగతానికీ సామాజికానికీ మధ్య ఉన్న లింకు అర్థమవుతుంది. అపుడే కవి ఇంకా బలంగా రాస్తాడు.

(తరువాయి భాగం)

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి.
Posted in 2015, ఇంటర్వ్యూ, ఏప్రిల్ and tagged , , , , , , , , , , , , , .

One Comment

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.