dance

హేలగా.. ఆనంద డోలగా…

Download PDF   ePub   MOBI

‘అల్లిబిల్లిగా పెనవేసుకున్న లతలూ తీగలతో అగమ్యంగా కనిపిస్తోంది ఆ ప్రదేశం. నేలంతా రాలిపడిన ఎండుటాకులు.. పగలో, రాత్రో తెలియని అస్పష్టమైన వెలుతురు. అయినా తనకి దారి సుస్పష్టంగా తెలిసినట్లే చక చకా నడిచి పోతూ వుంది తను.

ఒకవేళ దారిలో ఏ ప్రమాదమైనా వున్నా అది లయగా పడుతున్న తన అడుగులకి అడ్డం రాదనీ.. అదే లయతో ప్రక్కకి తప్పుకుంటుందనీ తెలిసినదానిలా సాగిపోతోంది.

అల్లంత దూరంలో ఏమిటది! చెట్ల మధ్య.. వరుసగా స్థంభాలతో ఓ మండపం. చిన్నదా! పెద్దదనాలా! కళ్ళు చూడగలిగినంత! మనసు పట్టగలిగినంత! ఒక అడుగు.. మరో అడుగు.. వెనుక లీలగా కనిపించిన తలుపులు.. వాటి వెనుక మరింత లీలగా తోచిన సీతారామ లక్ష్మణుల విగ్రహాలు.. వారి చిరునవ్వులు.. వరుసగా మూడు మెరుపులు.. మరుక్షణం కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతులు.. గణగణమంటూ గంటల మ్రోతలు…’

ఉలిక్కి పడి కళ్ళు తెరిచింది ధన్య. ఏదో బస్ స్టాప్ లో ఆగి వుంది బస్.

బస్ బయటా లోపలా కూడా లైట్లు వెలుగుతున్నాయి. రణగొణ ధ్వనులు.

షాల్ ఒకసారి సర్దుకుని, చలికి ముడుచుకుంటూ టైం చూసింది ధన్య. రెండయింది. ఇంకొక మూడుగంటల ప్రయాణం. తెల్లవారక ముందే తనని గమ్యం చేరుస్తుంది బస్.

మెలకువ వచ్చేసరికి కళ్ళముందు కదలాడిన దృశ్యం మళ్ళీ మనసులో మెదిలింది.

ఇపుడే కాదు, ఇదివరకు చాలాసార్లు వచ్చింది ఆ కల ధన్యకి.

‘ఆ రామాలయంతో తనకేమన్నా అనుబంధం వుందా! అలాంటిది ఎపుడయినా చూసిందా తను! ఇదివరకు చాలా తరచుగా వచ్చేది ఈ కల. ఈ మధ్య కొన్నాళ్ళుగా రావడం లేదు. కానీ ఇదివరకుకీ, ఇప్పటికీ ఏదో తేడా వుంది… ఏమిటది!’

ధన్య ఆలోచిస్తూండగానే బస్ లో లైట్లు ఆరిపోయాయి. బస్ మళ్ళీ బయల్దేరింది. కళ్ళు మూసుకునేందుకు ప్రయత్నిస్తుంటే హటాత్తుగా ధన్యకి స్పురించింది. ఈ సారి కలలో తను.. తను పూర్తిగా నృత్యాలంకరణలో వుంది!

***

ధన్య ఒకసారి టైం చూసుకుని లాప్ టాప్ మూసేసింది. సీట్లో నుంచి లేచి సంజయ్ కాబిన్ వైపు నడిచింది. అటు తిరిగి నిలుచుని వున్నాడు సంజయ్.. రెండు చేతులూ పాంట్ జేబ్లుల్లో పెట్టుకుని ఎదురుగా వున్న అద్దంలో నుంచి ఆకాశాన్ని చూస్తూ..

అతని భుజాలూ..నడుమూ.. గాలికి ఎగురుతూన్న జుట్టూ.. శ్రద్ధగా చెక్కిన శిల్పంలా వున్నాడు.

ఒక్క క్షణం కళ్ళు తిప్పుకోలేనట్లు చూసి చిన్నగా తలుపు మీద తట్టింది ధన్య. వెనుతిరిగి చూసి నవ్వాడు సంజయ్. “హాయ్” అన్నాడు.

“ఏంటలా శూన్యంలోకి చూస్తూ నిల్చున్నావ్!” అతని చిరునవ్వు తనలో కలిగించిన పులకింతని దాచుకుంటూ అల్లరిగా అడిగింది ధన్య.

“ఫైల్ కాపీ చేస్తున్నాను.” లాప్ టాప్ లోనుంచి పెన్ డ్రైవ్ వేరు చేసి “వెళ్దామా!” అన్నాడు.

ఇద్దరూ బయటికి వచ్చారు. కారు ఆఫీస్ గేట్ దాటేస్తూండాగా “ఎటు!” అన్నాడు సంజయ్.

“నిన్న వెళ్ళిన చోటికే. విషయం పూర్తిగా మాట్లాడుకోవాలిగా!” అంది ధన్య కొంచెం గంభీరంగా.

కారు వాళ్ళు తరచూ వెళ్ళే రెస్టారెంట్ లో ప్రవేశించింది. అందమైన ప్రదేశం అది…. చక్కటి పూల మొక్కల మధ్యలో ఆహ్లాదకరంగా వున్న వాతావరణం..

అన్ని టేబుల్స్ దగ్గరా రకరకాల జంటలు..

బాగా దూరంగా వున్న టేబిల్ దగ్గరకి వెళ్ళి కూర్చున్నారిద్దరూ. చిరు చీకట్లు ముసురుతున్నాయి.

“ఏం మాట్లాడాలి ధన్యా!” అనునయంగా అడిగాడు సంజయ్. “నిన్న నేనన్న మాటలకి నువ్వు నొచ్చుకున్నావు కదూ!”

“లేదు సంజయ్, నొచ్చుకోవడం కాదు.” తల అడ్డంగా ఊపుతూ చెప్పింది ధన్య. “నేనూ ఆలోచిస్తున్నాను.”

రెండు చేతులూ టేబిల్ మీద ఆనించి ఏదో వివరించబోతున్నట్లుగా ముందుకి వంగాడు సంజయ్.

అదే సమయంలో ఒక్కసారి చురుగ్గా తల ఎత్తి చాలా సేపట్నుంచీ ఎలా అడగాలో తెలీక యిబ్బంది పడుతున్న ప్రశ్నని తెగించి అడిగినట్లుగా అడిగింది ధన్య.

“నువు నన్ను డాన్స్ మానేయమనడానికి కారణం… నీ భార్య నలుగురి ముందూ నాట్యం చేయడం బాగుండదనీ .. అది అవమానకరమనీ అనుకోవడం వలన కాదు కదా!”

సంజయ్ ఒక్క క్షణం తదేకంగా ధన్య కళ్ళల్లోకి చూశాడు. ఆమె చేతిని తన రెండు చేతుల్లోకీ తీసుకుని “కాదు.. నిజంగా కాదు.” అన్నాడు నిజాయితీ అంతా గొంతులో ధ్వనించేలా.

ధన్య మొహం విప్పారింది. “నాకు తెలుసు.” అంది తను కూడా అతని చేయి పట్టుకుంటూ. “అయినా అడిగాను, క్షమించు.” అంది.

“లేదు, మంచి పని చేశావు. మనిద్దరం వేరు కాదు ధన్యా! క్షమించమని అడగకు. నువు నాలో ఒక భాగానివి అనుకుని, నాకు నేనే ఆ ప్రశ్న వేసుకున్నట్లుగా.. నాకు నిజంగా కలిగిన ఒక సందేహాన్ని నీ దగ్గర బయటపెట్టానంతే.

“నువు చిన్నప్పటినుంచీ చాలా శ్రద్ధగా డాన్స్ నేర్చుకున్నావు. నాకు తెలుసు.. నాట్యం చేయడమంటే నీకెంత యిష్టమో అది నీకెంతటి ఆనందాన్నిస్తుందో నువ్వు చెప్పావు. అయితే అంతే శ్రద్ధగా చదువుకున్నావు. ఇంజినీర్ వి అయ్యావు. ఇంత మంచి ఆర్గనైజేషన్ లో జాబ్ సంపాదించావు. ఇపుడు ఇక ఈ రెండింటిలోనూ ముందుకి వెళ్ళడం నీకు కష్టమవుతుందేమోననిపించింది నాకు. రేపు మనం పెళ్ళి చేసుకుంటే, బాధ్యతలు పెరిగితే మరింత స్ట్రెయిన్ కి గురవుతావేమోననిపించింది. అందుకే అన్నాను.. పోనీ ఇక డాన్స్ వదిలేయకూడదూ! అని. అంతే.”

ఆమె రెండు అరచేతులనీ తన చెంపలకి ఆనించుకుంటూ చెప్పాడు సంజయ్. “నువు దీని గురించి ఇంతగా వర్రీ అవాల్సిందేమీ లేదు ధన్యా! దీనికీ మన పెళ్ళికీ ఏ సంబంధమూ లేదు.

“ఏపనైనా చేసేటపుడు ఈ పని నేను ఎందుకు చేస్తున్నాను? అని ప్రతిసారీ ఆలోచించుకుంటాను నేను. నువ్వూ, నేనూ ఒకటే అనుకున్నాక నీ గురించీ అలాగే ఆలోచించాను. కానీ నాకు సమాధానం స్పష్టంగా తెలీలేదు. నాట్యం విషయంలో నువ్వు కాస్త ఆనందం కోసం ఎక్కువ శ్రమ పడుతున్నావా! అసలది నిజంగా ఆనందమేనా! ఆనందమని నువ్వు అనుకుంటున్నావా! – అది అర్థం కాక నిన్ను అడిగాను, అంతే.” వివరిస్తున్నట్లుగా చెప్పాడు సంజయ్.

“వర్రీ అవడం లేదు సంజయ్.” చిన్నగా నిట్టూరుస్తూ చెప్పింది ధన్య. “నువు అడిగే వరకూ దీని గురించి నేనెపుడూ ఆలోచించలేదు. కానీ నువు అడిగాక నాకూ అవే ప్రశ్నలు వచ్చాయి. ‘నాకు నాట్యమెందుకు? నాట్యం నాకేమిస్తుంది?’ అన్నప్రశ్నలకి నాకూ సమాధానాలు స్పష్టంగా తెలియలేదు.” చెంపకి చేయి చేర్చి సాలోచనగా సంజయ్ వైపు చూస్తూ చెప్పింది ధన్య.

‘నాలుగు రోజుల క్రితం పుట్టిన ప్రశ్నలూ.. ఆ ప్రశ్నలకి సమాధానాన్ని అన్వేషిస్తూ ఓ కొత్త ప్రదేశానికి తన ఈ ప్రయాణం! ఎంత చిత్రంగా వుంది!’ కదలిపోతున్న బస్‌లో నుంచి బయటి చీకటినీ, వెన్నెలనీ గమనిస్తూ చిన్నగా నవ్వుకుంది ధన్య.

***

Posted in 2013, కథ, డిసెంబరు and tagged , .

15 Comments

  1. రాధిక గారూ మీ కథలో జీవం ఉట్టిపడుతోంది.నేను చాలా కాలంగా ఆలోచిస్తున్నాను.కవిత్వం నాకేమిస్తోంధని.అలా అనే కొంతకాలం నా కలం పరుగులు ఆపేసాను.నాకు కూడా ఒక దీప,రుక్మిణి గార్లు దొరికి జవాబు ఇవ్వగలిగితే బాగుండు.నేనయితే మీ కథలో పాత్రధారి నయి జీవించేశాను.

  2. nenuu chalasarlu alichisthanu.kavithvam nkemisthundani.ala ane rendunnara dhasabdaluga ajnathamga vundipoyanu.malli start chesa na vanthuga nenu cheppalanukunnadhi cheppali samajanikani.aina na prasnaku samadhanam dhorakaledu.mee adbhuthamina hela lo laga nako deepa ,rukmini garlu dhoriki nalo jarige ee antharmadhananiki ans ardhamayyela chesthe bagundu.mee kathalo nenu prekshkuraliga jeevinchesa.

  3. adbhutamgaaraasaaru radhikagaaru!oka adbhutamaina prapamchamloki mammalni meebhaavaalato nichchenalu vesi maatalane metlameedugaa teesukuvellipoyaaru!prati kalaakaarudikee ituvamti prasna eppudo okappudu udayimchi teerutumdi!naatyamane kaadu!aaprasnaki javaabuni ela saakshaatkarimpajesukovaalo adbhutamgaa anubhootimpajesaaru!emduko,hrudayam amtaa vennelamayamaipoyinaattoo,naaku teliyakumdaane,naatyamnerchukokudaane naatyagatteni ayipoyinattoo anipistomdi!mukhyamgaa rukmini bhartagaaru cheppina maatalu chinni krishnunni saakshaatkarimpajestunnaay!aavida komguna kattuku tirugutunna lakshanaalannitikee roopam yiste ……eemaatalu manassunekkadiko aloukika aanamdaalavaipu teesukuvellipotomdi!DARBHA LAKSHMI ANNAPURNA

  4. అద్భుతమైన కధ వ్రాసారు రాధిక గారు. ఇలా వ్రాయటం మీకే సాధ్యం సుమా ..”నాకూ అర్ధమయింది నాట్యం నాకేమిస్తుందో..” అన్న సంజయ్ మాటలు ఎంత అర్దవంతం గా ఉన్నాయో..నిజంగా కదా చదువుతున్నంత సేపూ ఎదో తెలియని ఒక అలౌకికానందానికి గురయ్యాను.
    ఒక మంచి కదా చదివానన్న ఆనందం. ధన్యవాదములు రాధిక గారు.

  5. నేనెప్పటికీ ఆ ఆనందడోలికల్లో అలా తేలియాడుతూ ఉంటే బాగుండును అనిపించింది రాధిక గారు మీ కద చదువుతుంటే .అబ్బా ..! ఎం వ్రాశారండి ..ఎంతటి విషయ పరిజ్జానం ….ఎంతో హాయిగా ఉంది మీ కదా చదువుతున్నతసేపూ …”నాకూ అర్దమైంది నాట్యం నాకేమిస్తుందో” అన్న సంజయ్ మాటలు ఎంత అర్దవంతమైనవో….మీ కలానికివే నా నమస్సుమాంజలులు …

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.