cover2part

“వచనమూ కవిత్వమూ Siamese twins లాంటివి” ~ సిద్ధార్థ తో ఇంటర్వ్యూ (2)

Download PDF EPUB MOBI

దీని ముందుభాగం *
మీకు సినిమా అంటే చాలా ఇష్టం కదా. మీ కవిత్వంలో ఇమేజెస్‌పై సినిమా ప్రభావం ఎపుడన్నా గమనించారా?

కవిత్వాన్ని ప్రభావితం చేసే మిగతా కళలు చాలా ఉన్నాయి. వాటన్నింటిలోకీ సినిమా ముఖ్యమైంది. ఎందుకంటే సినిమా అన్ని కళల మేళవింపు. అందుకనే సినిమా ప్రభావం ఉన్న ఏ సాహిత్య ప్రక్రియ అయినా గొప్పగా ఉంటుందని నా నమ్మకం. దానికి నా జీవితమే ఉదాహరణ. నేను గొప్పగా రాశానూ అనను గాని, చాలా తృప్తిగా సంతోషంగా రాశాను. అలా రాసిన సందర్భాలన్నింటికీ సినిమా అనే ఫార్మ్ బాగా సాయం చేసింది. సినిమా దృశ్యాలతో మాట్లాడే కళ. కవిత్వం కూడా దృశ్యాత్మకంగానే చెప్పాలి. అందుకని రెంటినీ విడదీయలేం. తార్కోవిస్కీ, ఏంజిలోపోలస్, కిస్లోవ్‌స్కీ, ఇంగ్‌మర్ బెర్గ్‌మన్, టామ్ టికర్, తపన్ సిన్హా, క్రిస్టొఫర్ నోలాన్, అనురాగ్ కశ్యప్, విశాల్ భరద్వాజ్, ఇమ్తియాజ్ అలీ, శ్రీరామ్ రాఘవన్, సముద్రఖని, బాలా, మిస్కిన్… ఇలా ఎంతోమంది సినిమాలన్నీ కవిత్వ ప్రదర్శనలే.

సినిమా రంగం వైపు ఎలా వెళ్ళారు? సినిమాల్లోకి వెళ్ళి దెబ్బతిన్నారని అంటారు మీ గురించి?

2దెబ్బతినడం అంటే – నాకు బ్రేక్ రాలేదు, పేరింకా రాలేదు. అంతవరకూ దెబ్బతిన్నానేమో. కానీ నా క్రియేటివ్ ఇంపల్సెస్‌కి గానీ, కవిత్వానికి గానీ, సాహిత్యాన్ని  జీవించటానికి గానీ… సినిమా ఏ రకంగానూ అడ్డుపడలేదు. వాటిని బలోపేతం చేసిందనుకుంటున్నాను. సినిమా నన్ను చెడిపింది లేదు, బాగు చేసింది. నా కవిత్వాన్ని కొత్తగా చెప్పటానికి, జీవితాన్ని కొత్తగా చూపటానికి సాయం చేసింది.

ఇక సినిమాల వైపు వెళ్లటం ఎలా జరిగిందంటే – నా దీపశిల సంపుటికి బొమ్మలేసిన పెయింటరు ఏలే లక్షణ్. ఆయనకు పెయింటర్‌గానే గాక, కమర్షియల్ ఆర్టిస్టుగా డిజైనర్‌గా పేరుంది. వర్మ సినిమాలకి చేశాడు. అతని ద్వారా నాకు సినిమాల్లోకి దారి దొరికింది. నాకు అప్పటికే సినిమాలంటే చాలా ఇష్టం. హైదరాబాద్ ఫిలిం క్లబ్బు మెంబర్ని, సీరియస్ సినిమా చాలా చూసేవాడ్ని, అంతకన్నా రెట్టింపుగా కమర్షియల్ సినిమాని ఇష్టపడేవాడ్ని. ఏలె లక్షణ్ నా రైటింగ్ చూసి – అన్నా నువ్వు సినిమా రైటర్‌వి ఐతే చాలా బాగుంటుంది అని, తనే ఒక సినిమాకి పాట రాసే అవకాశం ఇచ్చాడు. చంద్ర సిద్ధార్థ డైరెక్ట్ చేసిన సినిమా “ఔనంటూ కాదంటూ” అది. ఆర్పీ పట్నాయక్ సంగీతంలో దాని టైటిల్ సాంగ్ నేనే రాశాను. ఆ సినిమా రిలీజవ్వ లేదు గానీ, ఆ పాటను చాలామంది ఇష్టపడ్డారు. తర్వాత దాన్ని ‘నీ కోసం’ సినిమాలోకి తీసుకున్నారు. తర్వాత చాలా సినిమాలకి పాటలు రాశాను. నెమ్మదిగా సినిమా డిస్కషన్స్‌కి కూడా వెళ్ళటం మొదలుపెట్టాను. ‘వీడు సామాన్యుడు కాదు’ అనే సినిమాకి డిస్కషన్స్‌లో కూర్చున్నప్పుడు ఉప్పలపాటి నారాయణరావు చెప్పారు – “మీ ఎబిలిటీస్ అన్నీ పాటకే పరిమితం చేసుకోవద్దూ, మీరు స్క్రిప్ట్‌ని బాగా నేరేట్ చేస్తారు, కాబట్టి డైరెక్టర్ కావాలీ, అటు వైపే ట్రై చేయండి” అని. అలాగే అప్పట్లో ఆంధ్రజ్యోతిలో పని చేసే నా స్నేహితుడు రాజగోపాల్ అని, తర్వాత కేన్సర్‌‌తో చనిపోయాడు, ఆయన కూడా ఒక సందర్భంలో ఇదే మాట అన్నాడు. అక్కడ్నించి దర్శకుడవ్వాలని ఒక ఆలోచన పెట్టుకున్నాను. కృష్ణవంశీతో ఇంటరాక్షనూ, చిన్న చిన్న సినిమాలకు పాటలు రాస్తూనే దర్శకుడు వీరశంకర్‌తో పరిచయమూ, అతని ద్వారా పవన్ కళ్యాణ్‌తో పరిచయమూ అయింది. అది మొదలుకుని, ఎనిమిది సంవత్సరాలు ఇక పవన్‌ కళ్యాణ్‌తోనే ఉండి పని చేశాను. ఆయన స్టోరీ డిపార్ట్మెంటుకు ఇన్చార్జిగా, సినిమాలకు స్క్రిప్ట్‌ రైటర్‌గానూ, స్టోరీ టెల్లర్‌గానూ, అసిస్టెంట్ డైరెక్టర్ గానూ పని చేస్తూ వచ్చాను. ‘గుడుంబా శంకర్’, ‘సత్యాగ్రహి’, ‘అన్నవరం’, ‘కొమరం పులి’ వీటికి పని చేశాను. చిరంజీవి గారి ‘ఠాగూర్‌’కి చివరి సన్నివేశాల్లో డైలాగ్స్ నేనూ ఆయన కూర్చుని రాసుకున్నాం. ఇప్పటికీ సినిమాల్లో ఉన్నాను. అయితే సినిమాల్లో పని చేసినపుడు టైటిల్ కార్డు పడటం ముఖ్యమని ఏనాడూ అనుకోలేదు. పని చేస్తూన్నా కదా అనుకున్నానే గానీ, దానికో పద్ధతుంటుందని గ్రహించలేదు. ఇన్నేళ్ళకు అర్థమైంది అదెంత ముఖ్యమో. కనీసం ‘రచనా సహకారం’ అనైనా వేసుకోవాలి కదా, రైటర్‍ కార్డు తీసుకోవాలి కదా – అవన్నీ చేసుకోలేకపోయాను. తెర మీద పేరు కనపడటం, దాన్ని మార్కెట్ చేసుకోగలగటం చాలా ముఖ్యం.

1

సినిమాల్లో మీదైనది ఏం చేయగలను అనుకుంటున్నారు? సాహిత్యంలో మీరు ఏ ప్లేన్‌లో మాట్లాడి మీ మనసు బరువు దింపుకోగలరో, అదే ప్లేన్లో తెర మీద సినిమా తీసి మీ మనసుని సంతృప్తి పరచుకోగలరా?

నేను అలాంటి సినిమాలే చేయాలనుకుంటున్నాను. కవిత్వంలో ఎలాంటి క్రియేటివ్ ఆర్గాజమ్ సిద్ధిస్తుందో అలాంటి సినిమానే తీయాలని నేను కలలు గంటాను. ఆ వీలైతే ఖచ్చితంగా ఉంది. అట్లాగని నేను కమర్షియల్ సినిమాలు తీయనూ అనను. నాదైన సినిమా తీస్తాను. ఆ అవకాశం కూడా రావాలి.

ఇదివరకూ ఎన్నో కథల్నీ నవలల్నీ తెర మీదకు అడాప్ట్ చేసుకున్నాం. ఇప్పుడు అది ఎందుకు జరగటం లేదు?

ఇక్కడ సినిమాకీ సాహిత్యానికీ లింక్ తెగిపోయింది. ఆ లింక్ కొనసాగిస్తున్న ఇతర భారతీయ, ప్రపంచ భాషల సినిమాల్లో వాళ్ళు అద్భుతమైన సినిమాలు తీస్తున్నారు. తెలుగు సినిమాలో కమర్షియాలిటీ ఎక్కువైపోయి అది అసహ్యమైన స్థాయికి చేరుకుంది. సినిమావాళ్లకి మన నవలా రచయితల గురించి గానీ, కథా రచయితల గురించి గానీ, ఇక్కడ జరిగిన మూమెంట్స్ గురించి గానీ ఏ మాత్రం తెలియదు. కృష్ణవంశీ, త్రివిక్రమ్ శ్రీనివాస్, శేఖర్ కమ్ముల సినిమాలని మినహాయించి చూడగలిగితే పరిస్థితి అర్థమవుతుంది. ఊరికే నేమ్ డ్రాపింగ్ కోసం రచయితల పేర్లు చెప్తూంటారు. కొంతమంది సినీ రచయితలు కేవలం గొప్ప కోసం నీషే, కాంట్, ఓషో అని ఊదరగొట్టేస్తూంటారు. వాళ్ళు రాసిందేంటో చెప్పరా అంటే చెప్పలేరు. ఈ పరిస్థితి వల్లే తాత్కాలికమైన ఉద్రేకాల మీద ఆడుకుని తాత్కాలికమైన సక్సెస్‌లు కొడుతున్నారు. ఒకప్పుడు పెద్ద హిట్టై కూచున్న సినిమాని మళ్ళీ కొన్నాళ్ళకి రిలీజ్ చేస్తే చూడలేం మనం.

రాజకీయాల్లోకి ఎలా వెళ్లారు?

నేను దళిత బహుజన పాలిటిక్స్‌లోంచీ ఉద్యమాల్లోంచీ వచ్చినవాడ్ని. బహుజన్ రిపబ్లిక్ పార్టీ అనుభవం ఉంది. ఆ సందర్భంగా రెండుమూడేళ్ళు శివసాగర్‌తో కలిసి పని చేసాను. ‘నల్ల నల్ల సూర్యుడు’ పాట కంపోజ్ చేసేటప్పుడు నేనూ, నామాడి శ్రీధర్, ఒమ్మి రమేష్ బాబు, పైడి తెరేష్ బాబు మేమంతా కలిసి పని చేసి ఆ పాటని పత్రికల్లో ఇవ్వడం, ఆ పాటే దళిత్ పాలిటిక్స్‌కి ఎజెండాగా మారడం… ఇవన్నీ జరిగినయ్. తర్వాత ‘గుడుంబా శంకర్’ సినిమాకి పని చేస్తున్నప్పుడు పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాల గురించి బాగా మాట్లాడేవాడు. ఆయనకు లెఫ్ట్ పాలిటిక్స్ పై ఆసక్తి ఉంది. అలాగే రైట్ వింగ్ పాలిటిక్స్ స్పృహలోంచి మాట్లాడేవాడు. దేశభక్తి, ఆరెస్సెస్సెస్ ఐడియాలజీ ఉండేది. నేను ఆయనతో విభేదించేవాడ్ని. ఇద్దరి మధ్యా రాజకీయాభిప్రాయాలు ఇచ్చిపుచ్చుకోవడం జరిగేది. ఇదంతా ప్రజారాజ్యం పుట్టడానికంటే ముందు జరిగిన ప్రిలిమినరీ సెటప్. చిరంజీవి గారు కూడా 3ఏమన్నా ఇష్యూస్ ఉంటే నన్ను పిలిచి చర్చించుకున్నాక సభల్లోకి వెళ్ళి మాట్లాడేవారు. ప్రపంచ తెలుగు మహాసభలూ, ఇంద్ర శతదినోత్సవం… ఇలాంటి సందర్భాల్లో ఆయన ప్రసంగాలు నేను రాశాను. మెగా బ్రదర్స్ ముగ్గురితోనూ ఇప్పటికీ మంచి స్నేహం ఉంది. అలా వాళ్లతో రాజకీయ సంబంధమైన సంభాషణలతో మొదలైన ఆ ప్రయాణం – పార్టీ పెట్టాలీ, ఆ నిర్ణయం కరెక్టేనా, పెడితే అసలు గెలుస్తామా, దీనికి ప్రాథమికంగా ఏం చేయాలీ అని ఒక టీంని ఎన్నుకున్నప్పుడు అందులో నన్ను కూడా తీసుకునేదాకా సాగింది. అందులో భాగంగా నేను చాలా సోషల్ ఆర్గనైజేషన్స్‌తో టచ్ లో ఉండటం, విలేకర్లూ, సీనియర్ జర్నలిస్టులూ, కవులూ, కళాకారులూ వీళ్ళందర్నీ రాండమ్‌గా కన్సల్ట్ చేయటం మొదలుపెట్టాను. ఇదంతా జరుగుతుండగానే పవన్ కళ్యాణ్ ‘కామన్ మాన్ ప్రొటెక్షన్ ఫోర్స్’ అని ఒకటి పెట్టారు. దానికి నేను వైస్ ప్రెసిడెంట్‌గా పని చేశాను. ఇలా రాజకీయాల్లోకి వెళ్తున్నానూ అని తెలియకుండానే వెళిపోయాను. అయినా నాకు సినిమాలంటేనే ఎక్కువ ఇష్టమని అందులోనే ఉంటాననీ పవన్ కళ్యాణ్‌కి చెప్పాను. “సినిమాలు మనం ఎప్పటికైనా చేసుకోవచ్చు, పాలిటిక్స్ ఇప్పుడు చాలా అవసరం” అన్నారు. ప్రజారాజ్యం పార్టీ వచ్చాకా నన్ను స్టేట్ కమిటీ మెంబర్ని చేశారు, కల్చరల్ కమిటీ చైర్మన్ చేశారు. ఇక ఆ మూణ్ణాలుగు సంవత్సరాలు నేను అదేపనిగా పాలిటిక్స్‌లోనే ఉండిపోయాను. నాకు తెలంగాణ ఎజెండా మొదట్నుంచీ ఉంది, దానికి సామాజిక న్యాయం తోడైతే బాగుండునన్న ఆశ ఉండేది. మాకెవ్వరికీ డౌట్ ఉండేది కాదు చిరంజీవి సి.ఎం అవుతాడన్న విషయంలో.  చివరికి ఎన్నికల స్ట్రాటజీలు అర్థం చేసుకోలేకపోవటం, పార్టీ నాయకుల వైఫల్యం, ఇతరేతర ప్రచారాలు.. ఇలా చాలా కారణాల వల్ల పార్టీ ఓడిపోయింది. నేను మళ్ళీ సినిమాల వైపు వెళ్లాను. కాని పార్టీ ఓడిపోయిన రోజు కల్యాణ్‌ని కలిసినపుడు, నా భుజం మీద చెయ్యి వేసి కొంత దూరం తీసుకుపోయి “సిద్ధూ PRP టికెట్స్ ఇచ్చిన అనర్హులు గెలిచి ఉంటే నేను ఆత్మహత్య చేసుకునేవాడ్ని” అని అన్నాడు. అందుకే ఇప్పటికీ కళ్యాణ్ మీద నా నమ్మకం వీగిపోలేదు.

సినిమా రాజకీయ జీవితాలకీ –  కవిత్వానికీ చాలా దూరం అన్నది సాధారణంగా ఉన్న నమ్మకం. ఇదెలా మీకు సాధ్యమైంది?

కవిత్వానికీ – సినిమాకీ, కవిత్వానికీ – రాజకీయాలకూ పడదూ అని ఈ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఫేక్ ఐడియాస్. కాస్త లెఫ్టిస్టు ఓరియంటేషన్, ప్రగతి శీల అభ్యుదయ భావాలూ ఉన్నవాళ్లందరిలోనీ ఈ తప్పుడు అభిప్రాయం ఉంది. శివారెడ్డి చాలాసార్లు అనేవాడు – “సినిమాల్లోకి వెళ్ళి చచ్చిపోయారయ్యా మీరంతా కవులుగా. మళ్ళీ రండయ్యా. కవిత్వంలో జీవించండయ్యా” అని. నేనూ, గోపిని కరుణాకర్ చాలా బాధపడేవాళ్లం. సినిమాల్లోకి వెళ్ళిన తర్వాతే గోపిని అద్భుతమైన కథలు రాశాడు. సినిమాల్లోకి వెళ్ళిన తర్వాతే నేను ఇందాక చెప్పిన ‘సంగెం’ లాంటి కవితలన్నీ రాశాను. మన తెలుగు దేశంలోనే ఇలాంటి అభిప్రాయాలున్నాయి. హిందీ సినిమా చూస్తే ఫైజ్ అహ్మద్ ఫైజ్, సాహిర్, గుల్జార్, జావెద్ అక్తర్‌లాంటి కవులు వాళ్ళకున్నారు.

కవికి కావాల్సిన ఏకాంతం ఈ రంగాల్లో దాడికి గురవుతుంది కదా?

లేదు. మనం రొమాంటిక్‌గా ఆలోచిస్తే ఇలాంటి అభిప్రాయాలు కలుగుతాయి. కవిత్వం కోర్‌లో, హ్యూమన్ ఎసెన్స్‌లో చాలా ఇంపల్సివ్‌గా జరిగే ప్రక్రియ. దాన్ని రాజకీయాలు గానీ, సినిమాలు గానీ ఏ రకంగానూ డిస్టర్బ్ చేయలేవు. వందలమంది జనం మధ్య కూడా కవితలు రాసుకున్న సందర్భాలున్నాయి. నిజమైన కవి ఏ సందర్భంలోనైనా, ఏ ఫేజ్‌లోనైనా, ఏ పదవిలోనైనా కవిత్వం రాస్తూనే ఉంటాడు. ఒకసారి కవిత్వం కాటుకు లోనైన వాడు జీవితాంతం దానికి లోబడే ఉంటాడు. కవి చచ్చిపోతే అది లోపలి కారణాల వల్ల జరుగుతుంది కానీ, బయటి కారణాల వల్ల కాదు. ప్రజలతో కలుస్తున్న కొద్దీ, ప్రజల మధ్యకు వెళ్తున్న కొద్ది నా కవిత్వం బలపడిందని నాకనిపించింది.

మార్క్సిస్టుల యుటిలిటేరియన్ అవుట్లుక్ (ప్రయోజన వాదం) మన సాహిత్యం మీద చూపిన ప్రభావం గురించి మీ అభిప్రాయం చెప్పండి?

అదంతా ప్రోపగాండా లిటరేచర్‌కి సంబంధించిన విషయం. పార్టీలకి మేనిఫెస్టోలుంటాయి. ఆ మేనిఫెస్టోలో భాగంగానే సాహిత్య సృజనను చూసినపుడు దానికి యుటిలిటీ అనే అంశం వచ్చి చేరుతుంది. అలాంటి సాహిత్యమంతా పార్టీ వేసిన కరపత్రంలాంటిదే. అది తాత్కాలికమే. సిసలైన సాహిత్యం ఎన్ని ఇజాలు, ఎన్ని రాజకీయాలు, ఎన్ని అంశాలు జీవితంలోకి వచ్చినా వాటన్నింటికంటే భిన్నంగా ఎత్తులో ఎగురుతూ మానవజీవితానికి సంబంధించిన సమస్తాంశాల్నీ తీసుకుని ఒక ఉన్నతమైన దృష్టినీ, లక్ష్యాలనీ, శాశ్వతమైన విషయాల్నీ ప్రస్తావిస్తుంది. ఒక ఎటర్నల్ వాల్యూ సిస్టమ్‌ని అందిస్తుంది. సాహిత్యమంటే ఇది గానీ, ప్రోపగాండా జాబితాలోకి వచ్చేది సాహిత్యం కాదు.

ఇక మీదట ఇంగ్లీషులో రాయాలనుంది అంటున్నారు. ఎందుకు తెలుగుని వదిలేయాలనుకుంటున్నారు? తెలుగు అవధుల్ని దాటి గుర్తింపు తెచ్చుకోవాలన్న ప్రయత్నమా?

మన భారతీయ భాషల్లో గత ముప్ఫై నలభై సంవత్సరాలుగా జరుగుతున్న అనువాద రాజకీయాల్లో భాగంగా తెలుగు వెనకబడిపోయిందని నా ఫీలింగ్. ఎక్కడ సెమినార్స్ జరిగినా తెలుగు ప్రాతినిధ్యం చాలా హీనంగా ఉంటుంది. మనం రాసిన ఏ రచనా ఇంగ్లీషులోకి పోకపోవడం వల్ల మనల్ని చాలా తక్కువగా చూడటం జరుగుతోంది. నిజానికి వాళ్లందరికంటే బలంగా ఇక్కడి సాహిత్యం ఉంది. దాన్ని బయటకు తీసికెళ్లగలిగే మాధ్యమం మన దగ్గర లేదు. ఈ బాధలోంచి ఇంగ్లీషులో రాయాలనే ఆలోచన వచ్చిందే తప్ప, దాంట్లో రాస్తే నా జీవితం మొత్తం పలకదన్న సంగతి తెలుసు. ఎప్పటికైనా మన భాష మన భాషే.

అనువాద రాజకీయాలేమిటి?

అనువాద రాజకీయాలు గత ముప్ఫై సంవత్సరాల తెలుగు కవిత్వాన్ని దివాలా తీయించాయి. మన భావజాలాలకు అనుగుణంగా, ముఠాలకు లోబడి వున్న కవులనే, ఎంతో పేలవమైన కవితలు రాసినప్పటికీ ఇంగ్లీష్‌లోకి అనువాదాలు చేశారు. తెలుగులో ఎంతో అద్భుతంగా రాసిన కవులు, యువకవులు ఇరవై మంది దాకా వున్నారు (వారి జాబితా ఇక్కడ ఇవ్వడం లేదు). వాళ్ళ గొంతుల్ని కత్తిరించారు. ఎరుపుకో, నలుపుకో, కాషాయానికో… వస్త్రధారణ చేసిన కవుల్నే ఎందుకుని అనువాదాలు చేశారు. వాళ్ళే వేరే ప్రాంతాలలోని లిటరరీ ఫెస్టివల్స్‌లో తెలుగుకు ప్రాతినిధ్యం వహించడం జరుగుతోంది. ఈ సాహిత్య హింస ఇంకా ఇలాగే అనువాద రాజకీయాల ద్వారా కొనసాగుతోంది.

వచనానికీ కవిత్వానికీ మధ్య సంబంధం ఎటువంటిది?

కవి బలపడాలంటే వచనం చదవాలి. నేను కవిత్వం రాయడం కంటే ముందు గొప్ప వచనం చదివాను. చలం, బుచ్చిబాబు, చండీదాస్, కామూ ‘అవుట్ సైడర్’, లోర్కా డైరీలు, బోదిలేర్ ఉత్తరాలు, ఖలీల్ జిబ్రాన్ ప్రేమలేఖలు, కాఫ్కా డైరీలు… ఇవన్నీ నా కవిత్వానికి ఉత్ప్రేరకంగా పని చేశాయి. ఇలాంటి గొప్ప వచనం చదివిన ఊపుతో కవిత్వం రాశాను. గొప్ప కవిత్వం చదివి నేను కవిత్వం రాసిన సందర్భం లేదు. ఎందుకంటే – వచనంలో ఒక అనుభవం తాలూకు విస్తృతి ఎక్కువ ఉంటుంది. ఆ విస్తృతంగా ఉండే అనుభవాన్ని ఒకేసారి తాకటానికి వీలుంటుంది. తర్వాత ఆ వంద వాక్యాల్లో ఒక్కోటీ పరిహరిస్తూ పోతూ ఒక్క వాక్యాన్ని ఉంచుకుంటారు మీ దగ్గర. అది కవిత్వమవుతుంది. దీనికి భిన్నంగా కవిత్వంలో అనుభవం కండెన్స్ అవుతుంది. ఆల్రెడీ కండెన్స్ అయిన వాక్యం నుంచి మీరేం తీసుకుంటారు? అందుకే వచనం కవులకి బాగా ఉపయోగపడుతుందని నేననుకుంటాను. వచనమూ కవిత్వమూ Siamese twins లాంటివి. కవిత్వం రాయాలంటే వచనంతో కలిసి జీవించాల్సిందే.

కవులు కథల్లోకి మళ్ళడం గురించి?

ఇది సహజమే. కానీ కవిత్వం బాగా రాస్తున్నవాళ్ళెవరూ కథల జోలికి వెళ్ళకపోవటమే మంచిది. ముఖ్యంగా మన తెలుగులో కథలకీ కెరీరిజానికీ దగ్గర సంబంధం ఉండటం వల్ల చాలామంది కవులు ఏ కెరీరూ ఇవ్వని కవిత్వాన్ని వదిలిపెట్టి కథలు రాసి కెరీర్‍లో స్థిరపడదామనుకుంటున్నారు. దీని వల్ల ఇటు కవిత్వానికీ అటు కథలకీ కూడా మేలు జరగడం లేదు. దామూ కథల్రాసి కవిగా చచ్చిపోయాడు.

తెలుగులో కవిత్వ విమర్శ మీద మీ అభిప్రాయం?

ఆధునికానంతర కవిత్వం మీద విమర్శ సరిగా లేదు. సాధ్యమయినంత వరకు అంబటి సురేంద్రరాజు, తిరుపతిరావు, అఫ్సర్, కల్లూరి భాస్కరం గారు ఆ పని చేశారు. సురేంద్ర రాజు, తిరుపతిరావు రాయటం మానేశారు. నరేష్ నున్నా కూడా మంచి విమర్శకుడు. కానీ సెన్సేషనలిజం అనే భూతానికి తన్ను తాను నైవేద్యంగా సమర్పించుకున్నాడు. (దాన్నుంచి బయటకు వస్తే మంచి విమర్శకుడయ్యేవాడు. అయినా విమర్శకుడిగా కంటే కవిగానే నరేష్ ఎక్కువిష్టం). ఇప్పుడు ఎలా చూసినా కవిత్వ విమర్శ దాదాపు లేదనే చెప్పాలి. అద్భుతమైన సందర్భంలో ఉన్న తెలంగాణ కవిత్వానికి సరిగ్గా విమర్శకులు లేకుండా పోయారు.

తొంభైల్లో చాలా ఆసక్తి రేపిన మీ ‘ప్రెజెంటెన్స్’ వ్యాసాలు మళ్ళీ రాయొచ్చు కదా?

రాయాలని ఉంది. కవిత్వాన్ని కవి చదవడం, పాఠకుడు చదవడం ఈ రెండింటి మధ్య స్థాయీ బేధాల గురించి మాట్లాడాలని ఆ వ్యాసాలు రాశాను. చాలామంది కవిత్వాన్ని అట్లా చదివి పారేస్తారు. అట్లా కాకుండా, కవి ఏ ఉద్దేశంతో పంక్చువేషన్ పెడతాడు, ఏ ఉద్దేశంతో అట్లాంటి వాక్యాలు ఎన్నుకుంటాడు, ఏ ఉద్దేశంతో ఆ ఫార్మ్ ఉంటుందీ అనేది చెప్పాలని ఒక్కో కవితని తీసుకుని మాట్లాడాను. దాని వల్ల కవి అర్థమవుతాడు, అదే సమయంలో పాఠకుడు రిఫైన్ అవుతాడు. పాఠకుడి తాలూకు గొప్పతనం చెప్పడమూ, అతని ప్లేస్ ఎంత ముఖ్యమో చెప్పడమూ ఆ వ్యాసాల ఉద్దేశం. దీన్ని ఇప్పటి తెలుగు కవిత్వానికి అన్వయిస్తూ మళ్ళీ రాయాలనుంది నాకు. పాత వ్యాసాలు కూడా పుస్తకంగా వేయాలి.

మీరు కవి అనే ఐడెంటిటీని ఏరి కోరి ఎంచుకుని, జీవితాన్ని ఆ దారిలో మళ్ళించుకున్నందుకు రిగ్రెట్ అయిన సందర్భాలేమన్నా ఉన్నాయా?

నేను కవి అవ్వాలీ అనే తపనతో కవిత్వంలోకి రాలేదు. అలా అయ్యానంతే. అయిన తర్వాత ఇక దాన్ని పట్టుక్కూర్చున్నాను. రిగ్రెట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు యాభైయ్యో పడిలోకి వచ్చేశాను. ఇప్పటికి మంచి కెరీరు, మంచి ఉద్యోగం, మంచి డబ్బు సంపాదన ఇవన్నీ ఉండాలి. కానీ అవన్నీ పక్కకు వెళ్ళిపోయాయి – మంచి కవిత రాస్తే ఓ నెల రోజుల పాటు గాలిలో ఎగురుతూంటాను. (నాకే తెలుస్తూ ఉంటుంది నేను రాసింది మంచి కవిత అని.) ఆ గాల్లో ఎగిరే అనుభూతి నాకు మెటీరియల్ బెనిఫిట్స్ కన్నా, అన్ని కెరీర్ల కన్నా చాలా భిన్నమైన ఆనందాన్నిచ్చింది. దాని కోసం నేను అన్నీ తాకట్టు పెట్టేశాను. ఇప్పుడు నా పిల్లలు చాలా పెద్దవాళ్లైపోయారు, వాళ్లు కూడా ఉద్యోగాలు చేసుకోవాలి. కానీ ఇప్పటికీ నేను కెరీర్‌లో స్థిరపడలేదు, ఏ ఉద్యోగమూ చేయలేదు, ఏ వ్యాపారమూ చేయలేదు. కవిత్వం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. కానీ అంతకంటే ఎక్కువ దుఃఖాన్ని కూడా ఇచ్చింది. ఆ తృటికాలపు ఆనందం కోసం, ఆ elation కోసం, నేను చాలా కష్టాలు పడ్డాను, పడుతున్నాను, రేపు పడతాను కూడా. చనిపోయేదాకా ఈ కష్టాలన్నీ పడాలన్నదీ, వాటితోనే చావాలన్నదీ ఒక అనివార్యమైన సత్యం నాకు.

మీ కవిత్వంలో స్త్రీ పాత్ర గురించి చెప్పండి. స్త్రీని మీరు ఎలా అర్థం చేసుకున్నారు?

నా మొదటి కవిత రాసింది నా మరదలికి తగిలినప్పుడు కలిగిన బాధతో అని చెప్పానుగా. అలా ఒక స్త్రీతోనే నా కవిత్వం మొదలైంది. తర్వాత ఇన్నేళ్ల ప్రయాణంలో నా జీవితంలో మేజర్ ఆక్యుపేషన్ స్త్రీనే. మా దిగువతరగతి కుటుంబాల్లోని అన్ని వయసుల స్త్రీలూ నా కవిత్వంలో పెద్ద స్థానాన్ని ఆక్రమించారు. నా మొదటి జ్ఞాపకం మా నాయనమ్మతో మొదలైంది. నా కవిత్వానికి గాడ్ మదర్ మా నాయనమ్మ. ఆమె చుట్టూ కోడళ్ళు, వాళ్లందరి మధ్యనా నా జీవితం, వాళ్ళకు ఇంటి పనుల్లో సాయం చేయటం, వాళ్ళ వెంట పొలాలకి వెళ్ళడం, వాళ్ళ కష్టాలను శ్రోతగా వినడం, వాళ్ల బాధలు పంచుకోవడం… మా చిన్నాన్న గొడ్డులా బాదేవాడు చిన్నమ్మని. వాడెళ్ళిపోయిన తర్వాత ఇద్దరం కూర్చుని మాట్లాడుకునేవాళ్లం, ఏడ్చేవాళ్ళం. ఆమె బాధను నేను తీసుకునేవాడ్ని. ఆమె అద్భుతమైన స్త్రీ. ఇక మా నాయనమ్మ తన జీవితంలో యాతనని తాను అనుభవిస్తూ, మా అమ్మను యాతన పెట్టేది. వీరందరి బాధనీ నేను పంచుకున్నాను. మా ఊళ్ళో కుమ్మర మైసమ్మ అని ఒకామె ఉండేది. ఆమె మధ్యాహ్నం పన్నెండున్నరకి చింత చెరువుకి వెళ్ళి తుమ్మల మోపు ఎత్తుకుని నాలుగంటలకి తిరిగి కుమ్మరి బస్తీలోకి వచ్చేది. వీళ్ళంతా చాలా పెద్ద బొట్లు పెట్టుకునేవారు. కాళ్ళకి కడియాలుండేవి. చీరని మోకాళ్ల వరకూ కట్టుకుని, తుమ్మ మోపు ఎత్తుకుని, చెమటలు కక్కుతూ, చెప్పుల్లేని కాళ్ళతో నాలుగు కిలోమీటర్లు నడిచి వచ్చి కుమ్మరి ఆమ్ (బట్టీ)లో తుమ్మ కంపలు వేసేవాళ్ళు. ‘రక్తమోడే కడియాలు’ అనే పదం నాకు వీళ్ళ నుంచే వచ్చింది. ఎంతో అందమైనవాళ్ళు. ఆ అందమంతా వాళ్ళు జీవితాన్ని ఎదుర్కునే తీరులోనే ఉంది. ఇలా ఎంతోమంది వివేకవంతులైన స్త్రీలు, అణగదొక్కబడిన స్త్రీలు, అద్భుతమైన ఆత్మసౌందర్యం గల స్త్రీలు… కవిత్వానికన్నా ముందే నా అనుభవంలో పాతుకుపోయారు. అందుకే నా కవిత్వంలో స్త్రీని రొమాంటిసైజ్ చేయటం కంటే, నేనే స్త్రీనై వాళ్ళ జీవితాన్ని చూడటానికి ప్రయత్నం చేశాననిపిస్తుంది.

స్త్రీ ఒక రొమాంటిక్ పార్ట్నర్‌గా…

నా కట్లా ఏం లేదు. నా జీవితంలో నాకు రొమాన్స్ ఏం లేదు. నేను ఇప్పటికీ ప్రేమ రాహిత్యంలోనే ఉన్నాను. నేనే అందర్నీ ప్రేమించాను. నన్నెవరూ ప్రేమించినవాళ్ళు లేరు. ఇప్పటికీ ప్రేమ దొరకలేదు.

తెలుగులో బాగా నచ్చిన మీ ముందు తరం కవులెవరు?

scan_0003శ్రీరంగం నారాయణబాబుతో మొదలై, తిలక్, కృష్ణశాస్త్రి, బసవరాజు అప్పారావు, నుంచి వజీర్ రహ్మాన్ దాకా ఎందరో ఉన్నారు. వజీర్ రహ్మాన్ కవితల్లో సారళ్యత, గాఢత రెండూ ఉంటాయి. తీవ్రమైన ప్రేమ ఉంటుంది, సౌందర్యం ఉంటుంది. సులభమైన నిర్మాణం ఉంటుంది. రేవతీ దేవి కవితలు నాకు ప్రాణం. ఆ కవితల్లో గాఢత ఇప్పటికీ నన్ను కదిలించి వేస్తుంది. అజంతా వాక్యం సంపూర్ణమైన మనిషిని సజీవంగా మన ముందు నిలబెడుతుంది. ఆయన పార్ధివ దేహం పక్కన… ఆయన రాసిన కవిత లోని వాక్యాలు “మృత్యు రహస్యం నీకు తెలిసిందా” అని చెవుల్లో ఊదాను. అజంతాకు మృత్యురహస్యం తెలిసింది. అతని కవిత్వంలో ఆ రహస్యాన్ని బట్టబయలు చేశాడు. అలాగే నా జీవితాన్ని పట్టి ఊపి ఇప్పటికీ నడిపిస్తున్న కవి శివసాగర్. కవిత్వమూ పాలిటిక్స్ ఈ రెంటి మధ్యా అద్భుతమైన ఈక్విలిబ్రియం మైంటైన్ చేసిన కవి ఆయన. ఇస్మాయిల్‌లో ఉండే గొప్ప క్వాలిటీ ఏమిటంటే ఆయన కవిత్వం స్వయంగా ప్రకృతే మాట్లాడుతున్నట్టు ఉంటుంది. చెట్టు పక్కన, ఒక నది పక్కన, ఒక మబ్బుతో, నీడతో, ఎండాకాలం నిశ్శబ్దంతో మనం కూర్చుని సంభాషిస్తున్నట్టే ఉంటుంది. ‘రాత్రి వచ్చిన రహస్యపు వాన’ అన్న ఒక్క వాక్యానికి ఇప్పటికీ దణ్ణం పెడతాను.  మోహన్ ప్రసాద్ కూడా చాలా ఇష్టం. కవిత్వ వస్తువునీ, సింటాక్స్‌నీ చిన్నాభిన్నం చేసి పడదొబ్బాడు. అభివ్యక్తిని నాశనం చేశాడు. కవి తన గమ్యాన్ని వెతుక్కుంటూ వెళ్ళే సందర్భంలో ముందున్న దారుల్ని నిర్మూలనం చేస్తే తప్ప కొత్త దారి కనుక్కోలేడని తన కవిత్వం ద్వారా చెప్పినవాడు మో. గుడిహాళం రఘునాథంలో తాత్వికత ఇష్టం. ఆయన కవిత్వంలో ఉండే చర్చ ఇష్టం. అలిశెట్టి ప్రభాకర్‌ కవిత్వంలోని ఆగ్రహం, వేగం ఇష్టం. అవి పాఠకుడ్ని వెంటనే దగ్గరకు తీసుకుంటాయి. సోషల్ ఇమేజరీ అద్భుతంగా తీసుకొస్తాడాయన. జూకంటి జగన్నాథంలో నిజాయితీ ఉంటుంది. శివారెడ్డి లిటరరీ పాలిటిక్స్, ఆయన ప్రోపగాండా నేచర్ పక్కనబెడితే ఆయన కవిత్వమూ నాకు ఇష్టమే.

వీళ్ళందరి తో బాటు చిందోల్లూ, మందెచ్చులోల్లూ, ఒగ్గు కథలోల్లూ… భక్తి కవులూ, సంచార కవులూ, దాస కవులూ… అంటే కర్నాటకలోనూ, తమిళనాడులోనూ ఆరేడు వందల సంవత్సరాల క్రితం భక్తి సంప్రదాయాల్లోని అక్క మహాదేవి, నమ్మాళ్వార్, కబీర్, జ్ఞాన్‌దేవ్, నాందేవ్, మొల్ల వీళ్ళందరూ బాగా ఇష్టం.

ప్రపంచ కవులు?

చాలా పెద్ద జాబితా ఉంటుంది. కొందర్ని చెబుతాను. T.S. Eliot అంటే చాలా ఇష్టం. అద్భుతమైన పెర్సొనిఫికేషన్ ఉంటుంది. విమర్శను కవిత్వ స్థాయికి తీసుకెళ్ళిన గొప్ప కవి. ఊహించని ఎత్తుగడలోనికి తీసుకువెళ్ళి గొప్ప అనుభవాన్ని ఇస్తాడు. Cesar Vallejo కూడా ఇష్టం. సంక్షిప్తత అతనికి దైవం. Mallarme, Borges, Osip Mandelstam లు నా దేవుళ్ళు. ప్రతి వాక్యమూ నిప్పులాగ తగిలే Mayakovsky ఇష్టం.  ఇమేజరీలో సంక్లిష్టత ఉండదు. ‘ఎ క్లౌడ్ ఇన్ పాంట్స్’ కవిత చాలా ఇష్టం. Dylan Thomas, Akhmatova, Sylvia Plath, Rilke, Lorca, Gibran, Anne Sexton… అలాగే Jessica Tarahata Hagedorn. ఈమె కవితలోని ఈ పంక్తులు చూడండి:

.

I am a thief who smiles

and invents words

to sing with animals.

I wear the hat of a thief

and my wings are invisible.

.

I am your guardian angel

your most secret lie.

.

I conjure up whistles and tears

for your children.

.

trust me.

.

I twist lyrics into melodies

as gifts for my friends.

.

remember my smell

in the streets

of your cities.

.

and listen.

.

always listen.

to the silent air.

– వీళ్ళందరూ ఒక ఎత్తయితే Baudelaire అంటే నాకు ప్రాణం. సంపూర్ణ మానవ అస్తిత్వాన్ని అద్దంలో పెట్టి చూపించగల్గితే అది బోదిలేర్ కవిత్వం.

 ఈ వందేళ్లలో ఆయన్ని మించిన కవి కనపడలేదు. నాకేమనిపిస్తుందంటే – ఇప్పుడు రాస్తున్న కవులంతా వీరెవర్నీ చదువుకోకుండా కవిత్వం రాయటం నేరం.

మీ సమకాలీన కవుల గురించి?

నాగప్పగారి సుందర్రాజు (వేదన, అస్పష్టత, అవమానాల అలికిడిలోని భాష), వర్రె రాణి (ప్రపంచ స్థాయి వ్యక్తీకరణ, ఆగ్రహం), మద్దూరి నగేష్ బాబు (దళిత స్వయంభువు), చిత్రకొండ గంగాధర్ (అద్భుతమైన వాండరర్. నేను చెప్పిన భక్తి కవుల లక్షణాలు ఉన్నాయి), ఎం. ఎస్. నాయుడు (డిస్‌ఫంక్షనల్ ఆటిట్యూడ్ ఆఫ్ నేచర్ ఉంటుంది. తెలుగు కవిత్వ వర్ణమాలను సవరిస్తున్న కవి), అమీనుద్దీన్ (కవిత్వ ప్రయాణంలో కాళ్ళు తెగిన ప్రయాణికుడు), తెరేష్ బాబు (రాజకీయ, దార్శనిక, తాత్త్విక కళాకారుడు, మాటల పాటగాడు), పసునూరి శ్రీధర్ బాబు (మంచి భాష, అణకువతో గౌరవంతో కూడిన సౌందర్యం ఉంటుంది. స్వచ్ఛమైన నీరు లాంటి కవిత్వం), ఇక్బాల్ చంద్ (సంస్కృతంలోని ఈస్థటిక్స్‌ని అత్యాధునికంగా చూపించిన కవి), గాలి నాసరరెడ్డి (హైకూ తత్వాన్ని మించిన రసాభినివేశం వున్న అన్‌పొల్యూటెడ్ కవి. ఇప్పుడేమీ రాయడం లేదు), నామాడి శ్రీధర్ (ఆధునిక తెలుగు కవిత్వానికి అలంకారం, సౌందర్య మాల), అయిల సైదాచారి (వ్యక్తి విముఖుడై వాంఛాగ్ని శిఖల్లో దగ్ధమవ్వాలనుకునే కవి. ఇతనికి స్త్రీ ఒక వామాచారపు క్రతువు, నిర్వాణానికి తొవ్వ), దెంచనాల శ్రీనివాస్ (ఇతనికి భాష ప్రథమ శత్రువు, అనుభవాన్ని విముక్తం చేయాలనుకునే సాహస కవి. భాషలోని అపజయ విహ్వలత తన కవిత్వం. Ever rebellion.), నరేష్ నున్నా (విశృంఖలత ఉంటుంది, తెగింపు ఉంటుంది) తల్లావజ్ఝల శశి, శశాంక మౌళి, సుంకర రమేశ్, ఒమ్మి రమేశ్ బాబు, జుగాష్ విలి (‘తూము’ అని అద్భుతమైన కవిత రాశాడు. పొలిటికల్ ట్రామాని terrify చేస్తాడు), అనంత్ (తాత్త్విక సౌందర్య హననముంటుంది), సత్య శ్రీనివాస్ (ప్రకృతి లాలన, క్లుప్తత ఇష్టం), అంబటి వెంకన్న (తెలంగాణా ఆత్మభాష అలికిడి ఇష్టం), మునాస వెంకట్ (భాష ఇతని ఆర్గాజమ్. తెలంగాణా కవిత్వ తంగేడు మొగ్గ మునాస వెంకట్), అఫ్సర్, కోడూరి విజయ కుమార్, ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్, కొల్లాపురం విమల (ఒంటిల్లు చాలా ఇష్టం), ఊర్మిళ (తన సర్వాంగాలతో సంభాషణ చేయించిన కవి), షాజహానా (మెలంకలీ ఉంటుంది, పొలిటికల్ స్టేట్మెంట్ ఉంటుంది).

మీ త్రిపుర ఇంటర్వ్యూ బాగుంటుంది. ఆయనతో మీ పరిచయం గురించి చెప్పండి?

scan_0007మో కవిత్వం, త్రిపుర కథలూ ఒకేసారి తగిలాయి నా జీవితానికి. అప్పటికి ఇద్దరూ అతలాకుతలం చేస్తున్నారు. తల గోడ కేసి కొట్టుకోవాలనిపించే ఉద్వేగం కలిగేది త్రిపుర కథలు చదివినపుడు. ఆ తర్వాత ఆయన కథలు రాయటం మానేశాడు. ఎప్పటికో ‘వలసపక్షుల గానం’ వచ్చింది. దాన్ని ఎప్పుడైనా సినిమా తీయాలని నా కోరిక. త్రిపురని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కలిశాను. అప్పటికే అరవైల్లో ఉంటాడు. కానీ చాలా యంగ్ లుకింగ్ ఫెలో. ప్రయాణాల గురించి మాటలొస్తే – లైఫ్ ఈజ్ ఎ ట్రావెల్, లిటరేచర్ ఈజ్ ఎ ట్రావెల్ అన్నాడు. తర్వాత ఒకసారి ఇంటర్వ్యూ చేశాను. త్రిపురకి ఇష్టమైన కాఫ్కా గురించి మాట్లాడినపుడు “మనకు ఇష్టమైన రచయితల్ని ఎక్కువ చదవలేం, పక్కన పెట్టేస్తాం” అన్నాడు. అది ఎంత వాస్తవమో నాకూ అనుభవమే. నాకు బాగా ఇష్టమైన రచయితల్ని నేను రెండు పేజీల కన్నా ఎక్కువ చదవలేను. ఆ నిస్సహాయితని చాలా నిజాయితీగా ఒప్పుకున్నాడు త్రిపుర. కాఫ్కాని పూర్తిగా చదవలేకపోయానని చెప్పాడు. నాక్కూడా – నన్ను బాగా కదిలించిన రైటర్స్ మిలన్ కుందెరా నో, బోర్హెస్‌ నో, కాల్వినో కథల్నో ఎక్కువ సేపు చదవలేను, నా వల్ల కాదు, శక్తి ఉడిగిపోతుంది శరీరమంతా.

మీ ‘దీపశిల’కి ముందుమాట రాసిన చండీదాస్‍ని కలిశారా?

scan_0005 - Copyఆయన్ని కలవటానికి ఎం.ఎస్. నాయుడు సాయం చేశాడు. అప్పటికే నేను హిమజ్వాల, అనుక్షణికం, డిసైర్ అండ్ లిబరేషన్ ఇవన్నీ చదువుకుని మత్తులో ఊగుతున్నాను. ఆయన కూడా నా కవిత్వాన్ని ఎంతో కొంత కరిచాడు. తర్వాత కలిశాను. నా ‘దీపశిల’ చేతికిస్తే కవిత్వం తనకు అర్థం కాదన్నాడు. నా గురించి చెప్పుకున్నాను. సంగీతంపై నా ఆసక్తి గురించి మాట్లాడటం మొదలుపెడితే ఆయన కూడా ఎంతో ఇష్టంగా మాట్లాడాడు. అప్పుడు చదువుతాను ఇవ్వమన్నాడు నా కవిత్వం. వారం రోజుల్లో ఉత్తరం రాశాడు: “రాసేంత అర్హత లేదు, అయినా నాలుగు వాక్యలు రాస్తాను” అని. అంత గొప్ప రచయిత, ఫిలాసఫర్ నా ‘దీపశిల’కి ముందు మాట రాయడం నా అదృష్టంగా ఫీలవుతాను.

ఇది మీ ఇమేజే: కవిత్వం మీలోంచి “చారల పిట్టలా లేచి ఎగిరివెళ్లిపోతుందేమో” అన్న భయం మీలో ఉందా?

ఆ భయమైతే లేదు గానీ, రోజు రోజుకీ భారం ఎక్కువైపోతోంది. I always resist writing a poem. ఇప్పటికీ నా బలమైన నమ్మకం ఏమిటంటే కవి మరీ విరివిగా రాయకూడదు. తనను తాను ఎంత నిభాయించుకుంటే కవిత్వం అంత బాగుంటుందని నా నమ్మకం.

జీవితం ఒక సుస్థిరమైన, భద్రమైన, ప్రశాంతమైన దశలో స్థిరపడటం కవిత్వం మీద ఏదైనా ప్రభావాన్ని చూపుతుందంటారా?

కవిత్వానికి సంతృప్తి అనేది ఉండకూడదు. కవిత్వానికి భూమిక అసంతృప్తి, అస్థిరత్వం, అసహనాలే. మొత్తం సృష్టినీ, మానవసమాజాన్నీ ధిక్కరించేంత అసహనం కవిత్వానికి ఇరుసుగా నేను భావిస్తాను. భద్ర జీవితంలో తీరిగ్గా ఉద్యోగం చేసుకువచ్చి రాత్రి కూర్చుని టైంపాస్ కావడానికి ఒక హాబీలా కవిత్వాన్ని రాయలేరు. కవిత్వానికి పూర్తిగా అర్పణ కావాలి, పూర్తిగా దాని ముందు సాగిలపడాలి. తల కోసుకుని అర్పణ చేయాలి. అప్పుడే కవిత్వం. కవిత్వం ఎప్పటికీ బలికోరుతుంది. మనం స్థిరంగా ఉండాలి… అంతే…

మీరు కవిత్వం కోసం అలాంటి భద్రమైన జీవితాన్ని కావాలని తిరస్కరించారా?

లేదు, నేను కవిత్వాన్ని కావలించుకుని కూర్చోవడంతో అది నా దగ్గరకు రాలేదంతే.

మీకు కవిత్వం పట్లే కాదు, ఆ వ్యాసంగంతో పాటు వచ్చే జీవితం, స్నేహాలూ, వాళ్ళతో రాత్రి నడకలూ, ఇరానీ హోటళ్ల కబుర్లూ… ఈ వాతావరణం పట్ల కూడా చాలా ఇష్టం ఉందనిపిస్తుంది?

హైదరాబాద్ ఒక మాయానగరం. ఇక్కడే నేను పుట్టడం వల్ల దీని ఎదుగుదలా, మార్పులూ, వాటికనుగుణంగా వచ్చిన అనేకరకాలైన అనుభవాలూ అన్నీ నేను చవి చూశాను. అసలు హైదరాబాద్ అస్తిత్వమే కవిత్వం అనిపిస్తుంది. కవిత్వంలో ఏవైతే లక్షణాలుంటాయో అవన్నీ ఈ నగరంలోనూ ఉన్నాయి. హైదరాబాద్ ఎప్పటికీ నిద్రపోదు. కవీ ఎప్పుడూ నిద్రపోడు. హైదరాబాద్ ఒక గాఢమైన ప్రేమనందించే నగరం. కవీ ఎప్పుడూ ప్రేమిస్తూంటాడు. కవికి ఇక్కడ గౌరవం ఉంటుంది. చక్కగా రెండు పదాలు ఉచ్ఛరించగలిగేవాడ్ని హైదరాబాదులో ప్రేమగా ఇష్టపడతారు. ఈ ప్రేమకు వేదికగా ఉండే స్థలాలు – ఇరానీ హోటళ్లు, ముషాయిరాలు, పార్కులు, సినిమాహాళ్లు, వీధులు. గజల్స్‌లో దృశ్యాత్మకంగా చెప్పే ప్రతీ సన్నివేశమూ హైదరాబాద్‌లో ఉంది. నాకు తెలిసి కవులకి హైదరాబాద్ ఒక హజ్ లాంటిది.

హైదరాబాద్ గురించి చెప్తున్నప్పుడు సి.వి. కృష్ణారావుగారి ‘నెల నెలా వెన్నెల’ గురించి కూడా చెప్పుకోవాలి. ఆయన్ని స్మరించుకోకుండా నా ఇంటర్వ్యూ ఉండకూడదు. ఆయన నాకు గురు తుల్యులు. ఒక మెట్రో నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాదులో ‘నెల నెలా వెన్నెల’ పేరిట కవులకు ఒక వేదిక ఏర్పాటు చేశారు. ఇప్పుడు ‘కవి సంగమం’ చేస్తున్నపనిని తొంభైల్లోనే వెయ్యిరెట్లు సమర్థవంతంగా ఆయన చేశారు. నెలకి ఒక మీటింగ్ ఏర్పాటు చేసేవారు. అక్కడ కవిత్వాన్ని ఎవరు ఏ ఉద్దేశాలతో రాసినా, వాళ్ళు లెఫ్టైనా, రైటైనా, భక్తి కవిత్వం రాసినా, సూఫీ కవిత్వం రాసినా… విపరీతమైన ఆదరణ లభించేది. సహృదయుడు సుమనశ్రీ గారు, వాడ్రేవు చినవీరభద్రుడు, నగ్నముని, హరిచంద్రశేఖర్, సౌభాగ్య గారు ఇలా చాలామంది మిత్రులు వచ్చేవారు. మా రాతల్లో కవిత్వాంశ ఉంటే మమ్మల్ని చాలా ప్రోత్సహించేవారు. ఒక డెమాక్రటిక్ వాతావరణం ఉండేది. ఒక మంచి కవిత నిజామాబాద్ నుంచో, ఆదిలాబాద్ నుంచో, విజయవాడ నుంచో కవి వచ్చి చదివితే వాడికి ఆ రోజంగా విపరీతమైన applause లభించేది. అప్పటికి సి.వి. కృష్ణారావుగారు ఆంధ్రప్రభలో “సాహితీ గవాక్షం” అనే పేజి నిర్వహించేవారు. ఈ కవుల కవిత్వం బాగుంటే అందులో ప్రచురించేవారు. ఉత్తరాల్లోనూ, మాటల్లోనూ – కవిత్వం అనే  మానవీయమైన లక్షణాన్ని మీరు కాపాడుకోండీ, అభివృద్ధి చేసుకోండీ అని ప్రోత్సహించేవారు. ఏ రాజకీయ ఉద్దేశాలు లేకుండా కవిత్వం మాత్రమే రాయగలిగే తరాన్ని పెంచాలన్నది ఆయన ఉద్దేశం. అందులో నేను భాగం కాగలిగినందుకు ఎప్పుడూ ఆనందంగా ఫీలవుతుంటాను. సహృదయత అనేది ఇప్పుడు ఎంత తిట్టులా ఉన్నా అది మాకు నేర్పించారు. ఇంకొకరు మంచి కవిత రాసినపుడు ఆనందించగలిగే సహృదయత నాలో పెరగటానికి కారణం ‘నెల నెలా వెన్నెల’.

scan_0003 - Copy

అప్పటి మీ కవి స్నేహాలు కాలంతో పాటు ఎలా మారాయి?

చాలా మారాయి. అప్పట్లో గంటలు గంటలు కూర్చుని కవిత్వ చర్చలు చేయటానికీ, పాటలూ, పుస్తకాలూ, కలలూ, ఉద్యమాల గురించి మాట్లాడుకోవటానికీ సంగమస్థలాలుగా ఇరానీ హోటల్స్ ఉండేవి. పుట్‌పాత్‌ల మీద కూర్చొని కవిత్వం చదువుకున్న రోజులు కోకొల్లలుగా ఉన్నాయి నాకు. అప్పటి స్నేహితులు చాలామంది వాళ్ల వాళ్ల వృత్తులతోనూ, ఉద్యోగాలతోనూ వెళ్ళిపోయారు. కానీ కొత్త తరం వచ్చినపుడూ, వాళ్లతో కవిత్వాన్ని పంచుకుంటూన్నప్పుడూ మళ్ళీ అదే వేడి నాకు తగుల్తూంటుంది.

ఆ తరం గాప్ అనిపించదా?

కవిత్వంలో యువతరం వృద్ధతరం అనేమీ ఉండవు. కవులైతే చాలు నాకు. వాళ్ల జీవితాల్లోకి వెళ్ళి సంభాషించగలను నేను. ఇరానీ హోటల్స్ ఐతే తగ్గిపోయినయ్. కానీ ఇంకేవో స్థలాలు ఉంటాయి కదా. వీధులు అలాగే ఉంటాయి, రాత్రులు అలాగే ఉంటాయి. భౌతికంగా చాలా మార్పులు జరిగినా హైదరబాద్ ఆత్మ అలాగే ఉంది. ఆ ఆత్మలో ఇప్పటికీ అందరం కలిసి స్నానాలు చేస్తూనే ఉన్నాం. నేనైతే చేస్తున్నాను.

చివరిగా – మీ దృష్టిలో కవి అంటే ఎవరు?

చాలా ప్రమాదకరమైన ప్రశ్న. కవిని ఎవరైనా డిఫైన్ చేయగలరా? ఆధునిక, అత్యాధునిక సందర్భంలో సంప్రదాయ, అతి సంప్రదాయ, క్లాసికల్ మోడ్‌లో ఇంతకు మునుపు వారు నిర్వచించినపుడైనా అది శాశ్వతమైన నిర్వచనమేనా… కాలం తన మాయా ముసుగును కవి ముఖం మీద కప్పి చాలా సంవత్సరాలుగా మోసం చేసింది. దేవుడో, దెయ్యమో, విప్లవమో, ప్రేయసో… అరాచకమో, ఆనందమో… ఏది వాంఛించినా కవికి చిరునామా.. శాశ్వతంగా ఏదీ లేదు. కవి.. తన స్వరూపాన్ని, తన దేహాన్ని, తన బాహ్య కదలికల్ని నిరంతరం మార్చుకున్నాడు. వందల సంవత్సరాల అనేక భాషల కవిత్వాలని చూసినపుడు… కవి తన ముఖాన్ని… పలు రకాలుగా ముసుగుల్తో మాట్లాడించాడు. Real poet really never reveals himself. కానీ దేవుడు కూడా కవే… వాడు లేకుంటే గనుక, నేచర్. కవి నేచర్ కూడా పూర్తిగా నిర్వచించిన సాహిత్య రూపాలు.. అసమగ్రం. కవి ఒక నిర్గుణోపాసకుడు, ఒక empty flower, ఒక గాలి, ఒక చీకటి కాంతి, ఒక వెలుతురులోని అంధకారం, సంత్ ఆరామ విరామ ఆదివాసీ దర్శ దార్శనికుడు, ఒక శాశ్వతమైన కాంట్రడిక్షన్, ఒక undefined element, like God.

(సమాప్తం)

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి.

Posted in 2015, ఇంటర్వ్యూ, ఏప్రిల్ and tagged , , , , , , , , , , , , , , , , , , .

2 Comments

  1. కొండ కొమ్ము మీద నిలబడిన అర్భకుణ్ణి వెర్రి గాలి కుదిపేస్తే ఎలాఉంటుందో అలాఉంది పరిస్థితి … కొన్ని వాక్యాలు చదివినప్పుడు ..

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.