cover1

పావురమైన వాన

అటుదిక్కు ఆ వంక మూసుకొచ్చింది

ఏ పక్కకో మరి ముసురేసి పోయింది

తాటిమానులమీద తారంగమాడింది

తేనీటి మాపులో తెర్లిపోయింది

 

మడుగుల్లో దూకింది

అడుగుల్ల గెంతింది

దడిచుట్టు కొట్టింది

తడిముద్ద చేసింది

తీగల్లొ వాగుల్లొ

పిలిమొగ్గలేసింది

 

నీమీద నామీద కన్నేసి ఉంచింది

మన మాటలినగానే మాటేసి ముంచింది

నవ్వుల్లొ పారింది

పాటల్లొ పొంగింది

నీకు నాకూ నడుమ నావలా సాగింది

 

ఇంకెంతసేపంటె ఇకపకలు పోయింది

కాసేపు కూసేపు కబురులై కురిసింది

 

ఆగిపోవా అంటు అలిగలిగి లాగింది

ఉండిపోవా అంటు ఉబికుబికి ఏడ్చింది

 

నీకళ్లలో చేరి నీలాలు కారింది

నేనెళ్లిపోతుంటె నాతోటె నడిచింది

– స్వాతి కుమారి బండ్లమూడి

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి.
Posted in 2015, ఏప్రిల్, కవిత and tagged , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.