cover

నిన్నటిపువ్వు

Download PDF EPUB MOBI

పరమ మామూలు పాత టెక్నిక్‌తో 8 ఎం.ఎం అద్దంలో 16 ఎం.ఎం స్థాయిలో నా ముఖానికి కాస్తంత పౌడరు అద్ది చూశాను. దువ్వెన్న తీసేను. దానికి చుట్టుకున్న నా చిన్న కూతురు తాలూకు చిక్కువుండని చికాగ్గా తీసి పడేసేను. తల దువ్వుకున్న చిన్నదానికి బుద్ధి లేకపోతే పెద్దవాళ్లకి బుద్ధి వుండొచ్చు కదా అని నా భార్యకేసి చూశాను. కానీ ఆవిడ కనబళ్లేదు. సరేలెమ్మనుకుని నా ధ్యాసలో నే వున్నాను. పాపిడి తీసేనండి, తెల్ల వెంట్రుకలో చెవిపక్కకు లాగి లాగి భద్రం చేసేను. పాత సినిమా టెక్నిక్‌లో వలె అద్దంలో రెండవ మూర్తి అనగా నా ముఖవే నన్ను పలకరించింది. కాలెండర్‌లో ప్రతి ఆదివారం తేదీలన్ని ఎర్ర రంగులో ఓ మూల పోగేసి వుంటాయి. అలాగే నువ్వు ఆదివారాలు వెలిగిపోయినట్టు శనివారం రాత్రి భావించుకుంటావు. అంతటితో సరి. ప్రతి ఆదివారం సోమవారం వలే నీకు మొదలవుతుంది. కాదా? చెప్పు పోనీ! ఇహ నీ తొందర దేనికట? ఇప్పుడు తొమ్మిది ముప్పావయింది. నువ్వు గేటు దాకా వెడతావు. పక్క ఇళ్ల వాళ్లకు కాస్త దృశ్య సౌకర్యం కల్పించే స్థాయిలో నీ భార్య నీ దగ్గరకొస్తుంది.

‘పెందలాళే ఇంటికొస్తారుగా? ఆ రాక్షసి మందుచీటీ చింపేసింది. నే బతికుండగా దానికి జలుబు తగ్గదు. ఆఫీసు నుంచి వస్తూ తమరు ఆ జగన్నాధరావు మొహానికో పది తగలేసి జలుబు మందులేవో తెండి.’ అంటుంది.

ఓ వేళ అలా కాదనుకుందాం – నువ్వు తొమ్మిదిన్నర సమయంలో ఆఫీసుకి రెడీ అయిపోయి వో అరగంట అవకాశం ఉంది కనుక ఓ.విజయన్ రాసిన ‘సాగా ఆఫ్ ధర్మపురి’ లో యాభయి రెండో పేజీ ఎలాగయినా కాస్సేపు చదువుదామని తీస్తావు. నీ భార్య అప్పుడు నీ దగ్గరకొస్తుంది. ‘ఎప్పుడూ పుస్తకం చదవడవే. ఓసారయినా పిల్ల గురించి పట్టించుకొంటారా? అది మహారాణిలాగ మందుచీటీ చింపేసింది – మొద్దు రాచ్చిప్ప. వెళ్లి మీరు పది రూపాయలు ఆ డాక్టరు గారి యదాన పడేసి మందులు రాయించుకురారూ? ఆ మోహనూ, ఆ పతంజలీ ఎప్పుడూ వుండేవాళ్ళేగా – డాక్టరు దగ్గరకు వెళ్లిరండి.’ అని అక్షింతలు వేస్తుంది. అప్పుడా పుస్తకం గిరవాటు వేసిన ఫక్కీలో దాచేసి బయలుదేరుతావు.

ఇక ఆఫీసు… అక్కడ పనివేళలో సమస్త పత్రికలూ చదువుతావు. భిక్షమయ్య టీ తేచ్చి పెడతాడు. అప్పుడు పేపర్లో మేక్స్‌ముల్లర్ భవన్ వారి ఎక్స్‌ప్రెషనిస్టు సినిమా సారధీ స్టూడియోలో దాదాపు ఉచితంగా ప్రదర్శిస్తున్న వార్తా వివరం గుర్తొస్తుంది. మూడు నిముషాలు బెంగపడతావు. నీ దరిద్రపు జేబులో వక్కపొడి పొట్లం, తళతళలాడని రూపాయి నాణం, అంచులు నలిగిన టెలిఫోను నంబర్ల బుల్లిపుస్తకం, నలిగిన సిగరెట్టూ వుంటుంది. బొత్తిగా పదమూడో తేదీనే ఆఫీసులో అప్పు చెయ్యబుద్ధి కాదు నీకు. అప్పు చేయందే సారధీ స్టూడియోకి ఆటోలో కనీసం వెళ్లడానికి, రెండు టీలకు, మూడు సిగరెట్లకు డబ్బు ఎలా పుడుతుంది? అక్కడికెళ్లకపోతే మనసు గిలగిలలాడుతుంది. ఎండవేళ నోటి దాకా వచ్చిన చల్లని బీరు నేలపాలయిన ఇది, ఒకటి అనుభవిస్తావు. అప్పుడు హుటాహుటిన లేచి ఆంజనేయులు దగ్గరికెడతావు.

‘అతను ఇప్పుడే అలా వెళ్లేడు గురూ’ అని శివరామ్ చెబుతాడు. టైమవుతోంది. ఆఫీసు కేంటిన్ దగ్గరకొస్తావు. అక్కడ భానుమూర్తి కనిపిస్తాడు.

‘ఏం లేదు భాయ్, నేను దేన్నీ పట్టించుకోవడం లేద్ భయ్… దీనమ్మ ఈల్లని నమ్ముకుంటె అంతె. పైసలివ్వరు. షిప్టు హాండిల్ జెయ్యాల. మనం ఇతరులని బాధ పెట్టెడి తత్వం గాదు గద మల్ల. ఇంక ఏమన్నట్టు భయ్… పని జేసుడు పైస లేకుండా బోవుడు’ అంటాడు. – ఇంక భానుముర్తి దగ్గర డబ్బేముంటుంది. లాభం లేదని టీ తాగి, అతను రాసిన వ్యాసాన్ని మెచ్చుకుని, ఆఫీసు వెనుక లాన్స్ దగ్గరకొస్తావు. అక్కడ ఇంకో వేణు గోపాల్‌గారు పెరిస్త్రోయికా నుంచీ ధన్‌బాధ్ మాఫియాల వరకు మర్యాదగా చేతులు తిప్పుతూ అన్నీ సూక్ష్మంగా వివరిస్తూంటారు. నువ్వు మరీ మర్యాదగా వింటూ అతని ట్రాన్స్‌పరెంటు జేబు కేసి చూసి, మామూలుగా తాత్కాలిక గుడ్‍బాయ్ చెప్పేసి ఆఫీసు గదిలోకొస్తావు. అక్కడ మన ప్రధాని శ్రీ రాజీవ్‌ గాంధీ గారి గురించి, ముఖ్యమంత్రి శ్రీ ఎన్. టి. రామారావు గారి గురించి పూర్తి విజ్ఞానాన్ని సంపాదించుకుంటావు. అదనపు లాభంగా మలయాళీ మీనన్‌ గారు ఎమర్జెన్సీ పాలన గురించి నీకు గుర్తు చేసి సిగరెట్ అడుగుతారు నిన్ను.

అప్పుడేవుంది. అదృష్టవశాత్తు పతంజలి కనిపిస్తాడు. ఆయన దగ్గర పదిహేను రూపాయలు, మోహన్ దగ్గర సిగరెట్లు, కిళ్లీ, మరో ఐదూ సంపాదిస్తావు. సాయంత్రం అవుతుంది. గేటు దగ్గర ఆటో కోసం చూస్తావు. అప్పుడు హరి వస్తాడు. “సార్ మీరేమయిన జెప్పండ్రి. మాయాడోళ్లకు బాగుండలేదు. పైసల్ లెవ్వు. మిత్తి గట్టెడిది వుంది. జెర పైసలుంటె జూడండ్రి సారు. పొద్దుగాల నుంచి మనసు బాగుండలె” అంటాడు. నువ్వు ఓ ఐదు ఇవ్వబోయి నీ జేబులో మొత్తం ఇరవైనీ ప్రదర్శిస్తావు. అతను సిగ్గుపడుతూ ఆ ఇరవై తీసేసుకుంటాడు. “హు! లలిత కళల కన్న జీవితమే ముఖ్యం” అనే సంతృప్తి మార్కు డైలాగు అనుకొని ఇంటికేసి నడవబోతావు. అప్పుడు నీకో గొప్ప ఆలోచన వస్తుంది. సుందరం, భరణి వాళ్ల ‘గోగ్రహణం’ నాటకం రిహార్సిల్స్ దగ్గరకు వెళ్లి ఫ్రీగా నాటక కళావిజ్ఞానాన్ని సంపాదించాలని చూస్తావు. శత వైభవపు రూపాయికాసుతో చేరుకుంటావు. అక్కడ ఎపిక్ థియేటర్ నుంచి పరిషత్తు ప్రదర్శన వరకు సాగిపోతుంది. రెండు టీల మీద కాసేపు రిహార్సల్. రిహార్సల్ మధ్యలో షాక్ తగులుతుంది నీకు. డాక్టరు దగ్గరికి వెళ్లవలసిన బాధ్యత! మరియు పది రూపాయలు, రవాణా ఖర్చులూ! ఎలా? మొత్తం నాటక జ్ఞానం మరి! చలపతి స్కూటర్ దయవలన – అనగా ఉదయభాను స్కూటర్‌ని తాత్కాలికంగా చలపతికి ఇప్పించి, తద్వారా చలపతి దగ్గర వున్న ఏకైక పన్నెండు రూపాయలకు రక్షణ కల్పిస్తావు. (లేకపోతే చలపతి ఆటోలో ఇంటికెళ్లే ప్రమాదం వుంది గదా?)

ఇక ఆ పన్నెండు రూపాయలను ‘ప్రేమ’తో లాగేసుకుని అతని ‘లిఫ్ట్’కి కృతజ్ఞత నటిస్తావు. కానీ – డాక్టరు దుకాణం కట్టేసి వుంటుంది. బాధ్యత నెరవేర్చని తండ్రిలా అదివరకటి సినిమాలో నాగయ్య గారిలా ఇదైపోతావు. సరే లెమ్మని రోడ్డు మీదకొస్తావు. సిగరెట్ వెలిగిస్తావు. పేవ్‌మెంట్ మీద పుస్తకాలు ఆకర్షిస్తాయి. ‘జరుక్ శాస్త్రి పేరడీలు’, స్టెయిన్‌బెక్ ‘వింటర్ ఆఫ్ అవర్ డిస్‌కంటెంట్’ కనిపిస్తాయి. నీ ఉత్సాహం నీలోని సాహితీ చైతన్యాన్ని గిల్లి గొడవ చేస్తుంది. అటు తండ్రి బాధ్యత, ఇటు సాహితీ గొడవ, చివరికి సాహిత్యానికే విజయం. పది రూపాయలు ఢాం. రెండు మినుట్లు! నీకు ఇల్లు గుర్తొస్తుంది. పోనీలే రేపు డాక్టర్ కోసం డబ్బు సంపాదించవచ్చులే అని ఎల్లైసీ వారి హామీ లాంటి హామీ తెచ్చుకొంటావు.

ఇంటికొస్తాకనుకుంటావు. కానీ… కానీ… లక్ష్మణరావు నీకు దర్శనమిస్తాడు. కాస్సేపట్లో బారుకి వెళ్లబోయి కుదరక ఆంజనేయులు గదిలో స్థిరపడతావు. టైము తొమ్మిదవుతుంది కనీసం.

‘క్రియాన్ నాటకం నా బొందలావుంది… నాన్‌సెన్స్ మందుకొట్టి… అంతే గాని అలగా కమర్షియల్ చత్త రాయకురే. హిపోక్రటిక్ దొంగరకం ఇంటర్వ్యూలకు దిక్కు బాబూ… నో.. డోంట్ యాడ్ వాటర్… తెలివిగా వాడి బూట్లు నాకేద్దావనా… నథింగ్ డూయింగ్… దయ చేసి కమ్యూనిస్టులందరూ ఈ గదిలోంచి గెటవుట్… శివాజీ షటప్.. నువ్ మరోలా.. హలోస్.. ఓన్లీ వన్ పెగ్…’ వంటి అనర్థాన్ని మాట్టాడతావు. వింటావు. అహంకారాన్ని, అజ్ఞానాన్ని రెండున్నర పెగ్గులతో తాగుతావు. సి.సి. దయవల్ల రిక్షాలో ఇంటికొస్తావు.

భార్యతో ఇంప్రెషనిజం గురించి, పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి కథ గురించీ మాట్లాడతావు. డాక్టర్ గారు సెలవు అని నీ భార్యకు తెలిసిన అబద్ధాలే చెప్తావు. మజ్జిగ అన్నం తినేవరకూ బానే వుంటావ్. అప్పుడు హఠాత్తుగా బాత్ రూంలోకి పరిగెడతావు. నీ భార్యకు నీ వాంతి ప్రహసనం కళ్లు తిరిగేలా చేస్తుంది. అప్పుడు నిద్రపోతావు. తెల్లారగానే పరమ పచ్చి జీవితంలోకి మెలుకువగా అడుగు వేస్తావు. అప్పున స్నానాదికాలు ముగిస్తావు. నీకు మరో అరగంట వ్యవధి వుంది. మళ్లీ విజయన్ ‘సాగా ఆఫ్ ధర్మపురి’ తీస్తావు.

‘ఇవాళైనా డాక్టర్ గాది దగ్గరికి పెందరాళే వెళ్లండి. రాత్రి రామ రామ… పచ్చి అబద్ధం చెప్పేరు. సర్లెండి మీ సంగతి ఎవడికి తెలీదు’ అని నీ భార్య నిన్ను మందలిస్తుండగా నువ్వు అద్దం ముందు నిలబడతావు. పాపిడి తీస్తావు. హఠాత్తుగా నీ కళ్ల చుట్టూ నల్లని చారలు కనిపిస్తాయి. వాటిలో ఏవుంది? ‘…మంచి సమయం అంతా చేజారిపోవడం, ఉద్యోగం, జీతం వున్నా అంతుచిక్కని నిశ్శబ్ద దరిద్రం, చిరుకోరికల్లో రసాభాస, అభిరుచి చేదవడం, దొంగ వేదాంతం, ఫిఫ్టీన్‌రుపీస్ అప్పు.. తండ్రి బాధ్యత. అటు కళలో ఓటమి, ఇటు క్లర్కు సాదా జీవితంలో ఓటమి. దేని గురించో, దేని లోనుంచో ఆమడ దూరం గెంతుతావు. కొన్ని దెబ్బలు.. కొంత దొంగతనం, కొంత సమర్ధింపూ… అయ్యే పోతోంది నీ కాలం. నువ్వు ఏవిటనీ, అసలు నువ్వు ఏవిటంట? ఆ? …ఫో… ఆఫీసుకి తగలడు’.

అన్నది అద్దంలో నా మొహం ముండ.

sivaji

– శివాజి
(ఏప్రిల్ 1989 జ్యోతి ‘ఉగాది’ ప్రత్యేక సంచిక లో ప్రచురితం)

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి.
Posted in 2015, ఏప్రిల్, పాత రచన and tagged , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.