cover

మిగిలిపోయిన పావురం

Download PDF EPUB MOBI

పూర్తిగా తెలవారేందుకు ఇంకా సమయమున్నట్లే ఉంది. చుట్టూ ప్రకృతి చిరుచీకటి ముసుగులో నిశ్శబ్దంగా ఉంది. ఆనందరావు తన యాత్ర మొదలు పెట్టేడు. నడుస్తున్నాడు. ఎదురుగా కొన్ని వందల మెట్లు. ఉత్సాహంగా అడుగులు వేస్తున్నాడు. ఇంతేనా, ఈ కాసిని మెట్లేనా అనిపిస్తూంటే నడుస్తూనే ఉన్నాడు. తానింత సులభంగా, సునాయసంగా ఇన్నేసి మెట్లు ఎక్కగలడని తనకే తెలియదు అనుకున్నాడాయన.

ఏకాగ్రతతో నడుస్తున్నవాడు ఉన్నట్టుండి చంటిపిల్లల కేరింతలతో చుట్టుపక్కల సందడి ఆరంభమైందన్న విషయం గమనించేడు. చిన్నా, పెద్దా అన్ని వయసుల వాళ్లు గబగబా, ఆత్రంగా ఆనందంగా ఒక మైమరపుతో నడుస్తూనే ఉన్నారు. మరీ పసివాళ్లని భుజాలమీద, చేతుల్లోనూ తీసుకెళ్తూ ఆయాసం తెలియకుండా కబుర్లతో, పాటలతో కదిలిపోతున్నారు.

ఆయన దృష్టిని ఎరుపంచుచీర ఆకర్షించింది. తీరా చూస్తే ఆమె! ఇదేమిటి?! తానొంటరిగానే యాత్ర ఆరంభించేననుకున్నాడు. ఆమె దాదాపు రెండు పదుల మెట్లు ముందు ఉంది. అలసటగా ఆగింది అరక్షణం. వెనక్కి తిరిగి నవ్వింది.

ఆ నవ్వు ఆయనలో శక్తిని వెయ్యింతలు చేసిందా అనిపించింది. నడక వేగం పెంచాడు. అంతలోనే అనుకున్నాడు, ఆమెతో పోలిస్తే తనకే సత్తువ ఎక్కువ కదా, మరి తనని దాటి ఆమె ముందుకెలా వెళ్లింది? ముఖం ఎర్రబడింది. ఆమెని ఓడించాలి. మళ్లీ అంతర్ముఖుడైపోయేడు. చుట్టూ నిశ్శబ్దం పరుచుకున్నట్లుంది అంతలోనే.

ఇంతకీ తాను ఎక్కడికి వెళ్తున్నాడు? ఎందుకు? వెళ్లేక అక్కడ ఏముంటుంది? తానేం చెయ్యాలని వెళ్తున్నాడు? చిత్రంగా ఉంది. గమ్యం అంటూ ఏమీ లేదా? ఉంటే ఏమిటి? మళ్ళీ చుట్టూ ప్రపంచం స్పృహలోకి వచ్చింది. తాను మాత్రమే ఒంటరిగా బయలుదేరలేదన్న వాస్తవం స్పష్టమైంది.

చుట్టూ చెట్లమీద నుండి రకరకాల పక్షుల అలజడి. ఒక్క క్షణం ఆగి పరికించేడు. ఆహ్లాదకరంగా ఉందనిపించింది. ఆ కొండలు, చెట్లు, వాటినావరించి ఉన్న ఒక ప్రశాంతత! మనిషి మాత్రం సృష్టించలేడనిపించే అపురూప సౌందర్యం!

 నడక, నడక… ఆగుతున్నాడు. పరిసరాల్లోంచి తనలోకి తాను సంభ్రమంగా మాయమవుతున్నాడు… గమ్యం వరకూ వచ్చేసినట్లే తోస్తోంది…

ఎవరో చిన్న గొంతులతో మాట్లాడుతున్నారు. అతి సమీపంగా ఏదో అలికిడి! వాస్తవమా, కలా? ముఖం మీద ఓ వెలుగేదో జిగేల్మనిపించినట్లనిపించింది. ఆయన కదలబోయాడు. ఎక్కడున్నాడు తాను? సర్వశక్తులూ కూడదీసుకుని కళ్లు తెరిచే ప్రయత్నం చేస్తున్నాడు. “నాన్నా!….” ఎవరో పిలుస్తున్నారు!

తననేనా? ఎవరది? తాను మరింత అయోమయంలోకి జారిపోతున్నాడనిపించింది.

“నాన్నా! కళ్లు తెరవండి. ఒక్కసారి లేచి కూర్చోండి నాన్నా,” అది భాస్కరం గొంతే. ఎందుకు లేచి కూర్చోమంటున్నాడు? వాడెక్కడో ఢిల్లీలో కదూ ఉండేది. ఎప్పుడొచ్చేడు? మళ్లీ నిద్ర తెర కమ్ముతోంది. బలవంతంగా కళ్లు తెరిచే ప్రయత్నం చేసేడు.

లేచి కూర్చునే ప్రయత్నంలో ఆయనకి చుట్టూ ఉన్న వాళ్లు సహకరించేరు. మంచం దగ్గరగా అయిదారు ముఖాలు కనిపించేయి. అర్థం కానట్లు చూసేడు.

“మీరంతా ఎప్పుడొచ్చేర్రా? అమ్మేది? మీకు నచ్చేవన్నీ చేసిపెట్టాలని వంటింట్లో చేరిందా? నాకూ ఆకలిగా ఉంది, వడ్డించమని చెప్పండి” మంచం మీంచి లేచే ప్రయత్నంలో కదిలేరాయన.

అక్కడున్న అందరూ ముఖాలు చూసుకున్నారు. ఎవరూ పెదవి విప్పలేదు. కదలనూ లేదు అక్కణ్ణుంచి. అందరి ముఖాలు వాడిపోయి అలసటగా ఉన్నాయి. ఇంకేదో దుఃఖం కూడా ఉంది ఆ ముఖాల నిండా. “నాన్నా!………” శారద పెదవి విప్పింది కాని ఆపైన మాట్లాడలేక ఏడ్చేసింది. ఏమైంది? ఏమైంది ?

మెదడులో కదలిక… ఏదో జ్ఞాపకం తోసుకొస్తోంది. అవును! నిన్న… ఆమె కబుర్లు చెబుతూ చెబుతూ అలా మౌనిలా ఉండిపోయింది. లిప్తపాటులో చైతన్యాన్ని వదిలి ఎటో వెళ్లిపోయింది కదూ…..

మరిందాకా తన ముందు మెట్లెక్కుతున్న ఆమెను చూసేడు!… అవును… స్పష్టంగా చూసేడు. ఆ ముఖంలో నవ్వు ఎంత జీవంతో తొణికిసలాడుతోంది! చుట్టూ నిలబడి తనవైపే చూస్తున్న పిల్లల ముఖాల్లోకి చూసేడు. వాళ్ల ముఖాల్లో అలసటని మించిన ఒక దైన్యం, ఒక దుఃఖం!

పెద్ద కొడుకు భాస్కరం తండ్రి ప్రక్కన కూర్చుని అనునయంగా ఆయన భుజం మీద చెయ్యి వేసేడు.

వాస్తవం పూర్తిగా ఆయనలోకి ఇంకింది. తర్వాత కొన్ని రోజుల పాటు జరిగేది అలా చూస్తూ ఉండిపోయేడు. ఇక పిల్లలంతా ఎక్కడివాళ్లు అక్కడికి సర్దుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడు నోరువిప్పి ఒక్క మాట అన్నాడు వాళ్లతో.

“వారణాశి వెళ్లాలి” అని.

 * * *

MigilipOyinaPavuramచుట్టూ ఉన్న దృశ్యం మారుతోంది. మాఘమాసపు చలి సూర్యాస్తమయం అవుతూనే వాతావరణాన్ని మరింత వణికించేందుకు చూస్తోంది. గంగా ఆరతి కోసం చేరుతున్న జనంతో దశాశ్వమేధ ఘాట్ సందడిని పోగుచేసుకుంటోంది. గంగమ్మ మంద్రంగా కదులుతోంది. ఏ అలజడులూ లేని నిశ్చలత్వం! శుద్ధి చెయ్యబడినట్లున్న గంగ నీరు తళతళ లాడుతోంది. వారణాశి పవిత్రతనంతా తనలోనే కాకుండా తన చుట్టూ పరిమళింపచేస్తున్న నదీమ తల్లి! మనసులో పదే పదే ఒక ఉద్వేగం! ప్రక్కనే ఆమె కూర్చున్నట్లే ఉంది, ఎన్నాళ్లదో జ్ఞాపకం!………………

ఆనందరావు ఉద్యోగ విరమణ చేసిన తరువాత మరి ఆగలేదామె, అన్నేళ్ల నుండి గుండెలో దాచుకున్న కోరికని తీర్చుకుందుకు, “వారణాశి వెళ్ళాలి, గంగమ్మ సన్నిధిలో కొన్నాళ్లు గడిపి రావాలి” అంటూ బయలుదేర దీసింది. రోజూ సాయంత్రాలు దశాశ్వమేధ్ ఘాట్ వరకు నడిచొచ్చి గంగ ఒడ్డున అలా గంటలు గంటలు నిశ్శబ్దంలో మునిగితేలిన ఆ రోజులు నిన్న మొన్న జరిగినట్లు లేవూ? ప్రాపంచికమైన ఏ ఆలోచనా లేని నిశ్చలమైన మనసు. అదే ఎన్నాళ్లుగానో ఆమె కోరుకుంది!

ఆలోచన చెదిరింది అంతలో…

ఒక పడుచు జంట నదిలో విహారానికి పడవ ఎక్క బోయి, తూలి నదిలో పడ్డారు. అంతలో చేతిలో చెయ్యేసుకుని పైకి వచ్చేరు నవ్వు ముఖాలతో…

దూరంగా కూర్చున్న భాస్కరం తండ్రిని గమనిస్తున్నాడు. ఆయన మనసులో మెదిలే జ్ఞాపకాలు అతని ఊహకి అందేవి కావు, కానీ ఆయన గతస్మృతుల మధ్య పొందుతున్న ఒక ఓదార్పుని అవగాహనచేసుకోగలుగుతున్నాడు.

ఆనందరావు మనసులో పాత సంఘటనలు దృశ్యాలు దృశ్యాలుగా… ముఖంపై అప్రయత్నంగా చిరునవ్వు పరుచుకుంది.

నాలుగైదు దశాబ్దాల క్రితం విశాఖతీరంలో సముద్ర అలలు చేస్తున్న అల్లరికి పోటీపడి పరుగులు పెడుతున్నారు ఒక యువ జంట. ఆమె అడుగుతోంది….

“ఇంతకుమించిన అనుభవం ఏంకావాలి? ఇలా ఇద్దరం చెట్టాపట్టాలేసుకుని సముద్రంలోకి నడిచి వెళ్లిపోదామా?” అతను ఉలిక్కిపడ్డాడు.

“అప్పుడే! ఊహు… ఇంతకుమించిన అనుభవాలెన్నోచూడాలి మనం, అప్పుడు” ఆమె చేతిని భద్రంగా పట్టుకుని ఆ చిక్కని కళ్లల్లోకి చూస్తూ గంభీరంగా అన్నాడు. ఆమె నవ్వింది.

అదే ప్రశ్నని ఆమెతో క్రితంసారి వచ్చినప్పుడు అడగాలనుకున్నాడు… అడిగేసేడు కూడా. ఆమె ఏ ఉలికిపాటు లేకుండానే వింది. కానీ తల అడ్డంగా ఊపింది. “ఉహు…” అంది.

“ఎందుకో?! ఇంకా ఏ అనుభవాలు చూడాల్సి ఉందో” ఆయన మాటల్లో అల్లరి గమనించింది. ఆయనవంక చూస్తూండిపోయింది అలా. ఆమె కళ్ల నిండా ఓ దిగులు వర్షాకాలపు మబ్బులా కదిలింది.

హాయైన ప్రవాహంలా నడిచిపోతున్న సహజీవనం అకస్మాత్తుగా వచ్చిన ఒడిదుడుకులతో ఆమెని ఉక్కిరిబిక్కిరి చేసింది. అయినా ధైర్యం కోల్పోలేదు. ప్రవాహంలోంచి విడివడి ఒక్కసారిగా తనదైన దారికి తొలగిపోబోయిన భర్తని తిరిగి తన కూడా వచ్చేలా మళ్లించింది.

గత ఆరునెలలుగా ఆయన పడిన శారీరక అవస్థ, ఆమె పడిన మానసిక ఆందోళన ఇప్పుడిప్పుడే దూరంగా తొలగిపోతున్నాయి. ప్రాణంలా కాపాడుకున్న ఆయన్ని మరింత కాలం కళ్లముందు చూసుకోవాలనుకుంది ఆమె. ఆ మాట ఆయనతో చెప్పలేకపోయింది.

అన్నింటినీ అశాశ్వతమనే దృష్టితో చూసే మనోబలం మెల్లిగా కూర్చుకోవాలి. అయినా అది అంత సులువుగా పట్టుబడుతుందా? ఆమె ఆలోచన అందని ఆనందరావు నవ్వాడు.

“అవునులే, నువ్వు నాకంటే భూమ్మీదకి దాదాపు ఒక దశాబ్దం ఆలస్యంగా వచ్చావు. నాతో పాటే వచ్చెయ్యమనటం అన్యాయమే”. ఆయన మాటల్ని గబుక్కున ఖండించింది.

ఆయన ఆలోచనలో పడ్డాడు. లౌకిక ప్రపంచంలో అలిసి వచ్చిన ఆయనకు బోలెడు సాంత్వన దొరికేది ఆమె దగ్గర. మరి ఆమె కూడా అలాటి సాంత్వనను పొందుతోందా? ఆ ప్రశ్నకి సమాధానమా అన్నట్లు ఆమె ప్రశాంతమైన ముఖం ఏళ్లతరబడి కంటి ముందు కనిపిస్తూనే ఉంది. కలిసి చేసిన ప్రయాణం తృప్తికరంగానే ఉంది. ఆమె ఏమార్పూ లేకుండా అలాగే ఉంది.

వెనక్కి తిరిగి చూస్తే ఇంత జీవితం ఎప్పుడు జీవించేమా అనిపించింది. బాధ్యతలు తీరి వృద్ధాప్య ఛాయలు ఆవరిస్తూంటే ఒక కొత్త దిగులు ఆరంభమవుతోందిప్పుడు.

ఈ ప్రయాణంలో ఇద్దరూ కలిసి జతగా ఇంకెన్నాళ్లు? ఇంకా ఎంతదూరం? ముగింపు ఎప్పుడో, ఎక్కడో! కానీ… ఎవరు ముందు? ఎవరు వెనుక? బంధాల్ని తెంచుకుని తన దారి తను చూసుకుంటే ఆమె ఏమైపోతుంది? ఎలా బ్రతుకుతుంది? పిల్లలున్నారు. కాని వాళ్ల జీవితాలు వాళ్లవి. వాళ్ల బాధ్యతలు వాళ్లవి. వాళ్లు ఎంతవరకు ఆలంబన కాగలుగుతారు? అసలు వాళ్లకి అర్థమవుతుందా ఒంటరిగా మిగిలిపోయిన వారి దుఃఖం? అంత తీరిక, ఓర్పు ఉంటుందా? తాము ఆ దశకి చేరేటప్పటికి కాని వాళ్లకి అర్థం కాదేమో.

తన చేతుల మీదుగా దాటిపోయిన తల్లితండ్రుల అవస్థ తాను ప్రత్యక్షంగా చూసేడు. ఒక రోజు ఆఫీసు నుండి వచ్చి, స్నానం చేసి తీరిగ్గా తల్లిదండ్రులను పలకరించేందుకు వాళ్ల గదిలోకి అడుగు పెట్టబోయే లోగా తల్లి మాటలు వినిపించేయి.

“ఇంత కాలం ధైర్యంగా జీవితాన్ని గడుపుకున్నాం. ఏ బాధ్యతలూ, బరువులూ లేవు. ప్రశాంతంగానే జరిగిపోతుంది ముందు జీవితం కూడా. దేనికిప్పుడు మీరు అధైర్య పడుతున్నారు?”

తండ్రి ఏమీ మాట్లాడలేదు. శారీరక బలహీనత ఆయన ధైర్యాన్ని సడలిస్తున్నట్లు తోచింది వాళ్లను గమనించిన ఆనంద రావుకి. తల్లి కళ్లు వత్తుకుంటుంటే, తండ్రి మాత్రం నిర్వికారంగా చూస్తూ ఉండిపోయేడారోజు.

అలిసిపోయిన శరీరం ఇక నువ్వెవరు, నేనెవరు అన్న వైరాగ్యాన్ని పులుముతోంది అనుబంధాల చుట్టూ. తల్లీ, తండ్రీ కూడా రెండు నెలల వ్యవధిలో జీవితాల్ని ముగించేరు. వాళ్ల అనుబంధం అంత గాఢమైనది!

అలా, అంత ఆదర్శంగానూ తామూ వెళ్లిపోవాలనుకున్నారు ఆనాడు. ఇంతలో అర్థాంతరంగా వెళ్లిపోయింది. కనీసం వెళ్తున్నానంటూ ముందుగా ఎలాటి సంకేతాన్ని కూడా ఇవ్వలేదు తనకు. జీవితం పొడవునా కలిసి నడుద్దామని చెప్పింది. ఆ సంగతి ఆమెకు జ్ఞాపకం లేదా?

పిల్లలంతా కలిసివచ్చిన ఒక సందర్భంలో ఆమె తన మనసులో కోరిక బయటపెట్టింది. “మా దగ్గర ఎవరో ఒకరు ఉంటే బావుంటుందిరా. ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకు వస్తే ఒకళ్లకొకళ్లం తోడుగా ఉంటాం.”

“అదెలా కుదురుతుందమ్మా? మా ఉద్యోగాలు, పిల్లల చదువులు, వాళ్ల భవిష్యత్తు ఇంకెక్కడో ఉంటేను”

పెద్దవాడి మాటలకి అందరూ సపోర్టే.

అత్తమామలు లేని కూతురు చెబుతోంది – “నేను ఎలాగూ మీ లెక్కలోకి రానుకదా. కొడుకుల దగ్గరేగా ఉండాలనుకుంటారు మీరు” నిష్టూరం గొంతు నిండా. ఆస్తులు కొడుకులతో పాటు సమానంగా పంచుకున్నాక కూడా కూతురు ఇంతవరకే ఆలోచించింది. ఆయన నిట్టూర్చాడు. భార్య వైపు దిగులుగా చూసేడు.

ఆమె ఎవర్నీ నొప్పించలేనట్లు, ఏం చెప్పలేనట్లు మౌనంగా ఉండిపోయింది. ఆయన అసంకల్పితంగా అనుకున్నాడు ఆ క్షణం, తామిద్దరూ కలిసి ఒకే క్షణం ఈ జీవయాత్రని ముగించలేకపోవటం జరిగితే మాత్రం ‘ఈమె నాకంటే ముందుగా వెళ్లిపోవాలి’ అని. తానైతే ఎలాగైనా బ్రతికేస్తాడు. ఆమె… అమాయక.

పిల్లలందరూ తండ్రిగా తన పట్ల భయభక్తులుతోనే ఉంటారు. తన మాట ఇప్పటికీ శాసనంలాగే అమలు చేస్తుంటారు. కానీ వాళ్ల అసహనాన్ని మాత్రం తల్లి మీద స్పష్టంగా ప్రదర్శిస్తూ ఉంటారు. ఆయన ఎన్నోసార్లు గమనించేడు. కానీ తనంత ఎదిగిన పిల్లల్ని మందలించలేకపోయేడు. తల్లి పట్ల వాళ్ల బాధ్యత ఎన్నో సందర్భాల్లో చెబుతూనే ఉన్నాడు. తానున్నంత కాలం ఆమెను వెయ్యి కళ్లతో కాచుకోగలడు. కానీ తన అనంతరం ఏమిటి?ఈ ప్రశ్న ఆయన్ని కలవరపరుస్తూనే ఉంది. తను అనారోగ్యం బారిన పడిన సమయంలో ఆమె భవిష్యత్తు ఏమిటి అన్న చింత గుండెలో మెలిపెడుతూనే ఉంది. ఆమెను ఆఖరి క్షణం వరకూ తను మాత్రమే చూసుకోగలడు, అది సాధ్యమేనా అన్న ఆలోచన మరో వైపు. వయో ధర్మ రీత్యా తను ఇప్పటికే చాల జీవించేడు, ఆమె కంటే. ఈ ఆలోచనలు పిరికివాణ్ణి చేస్తూనే ఉన్నాయి ఇన్నాళ్లూ.

ఎనభై ఏళ్ల వయసులోనూ స్వతంత్రంగా జీవించిన ఒంటరి మేనత్త ఆయన కంటి ముందు ఎన్నోసార్లు ప్రత్యక్షమవుతూనే ఉండేది. తన దారిన తాను వెళ్లిపోతే రేపు ఈమె కూడా అంతే కదూ. ఒంటరితనపు అసహాయత. శారీరకపు అసహాయత. ఏ హోం లోనైనా చేరినా వాటికి సమాధానం దొరుకుతుందేమో కాని మానసికంగా ఎలాటి సహాయం దొరుకుతుంది?

చివరికి – ఆమె ఒంటరిదైతే ఎలాగన్న తన దిగులును తీర్చేందుకే అన్నట్లు ఆమె వెళ్లిపోయింది ముందుగా. లోలోపల తాను కోరుకున్నదీ అదే అనుకుంటే, ఆ అనుకోవటానికి అంత బలమైన శక్తి ఉందంటే ఆశ్చర్యం! ఇప్పటి స్థితికి తానే సూత్రధారి అన్నమాట.

ప్రతి ఉదయం తెలతెల వారుతోందన్న ప్రకృతి సంకేతాలు నెమ్మదిగా తట్టిలేపినట్లయి, ఒక కొత్త ఉత్సాహంతో నిద్ర లేచేసరికి మెత్తని అడుగులు ఇంట్లో సందడి చేస్తుండేవి. కాఫీ గ్లాసులు తయారయ్యేసరికి వంటింటి గుమ్మంలోకి చేరేవాడు తను! ఆరోజూ అలాగే లేచేడు… కానీ క్షణాల్లో జరగవలసింది జరిగిపోయింది.

ఇప్పుడు అలికిడి లేదు…. దాదాపు అర్ధశతాబ్దిపాటు ఆమె సహచర్యం! ఆమె వెళ్లిపోయిన రోజు మనసు వశం తప్పి నిద్రో, మెలకువో తెలియని స్థితిలో కల…….

అవును. ఆ మెట్ల మీదుగా ఆమె తనకు దిశా నిర్దేశం చేసేందుకే ముందుగా వెళ్లిపోయింది. ఆయన ఆలోచిస్తున్నాడు… ముందుగా తానెళ్లిపోతే అగమ్యగోచరంగా ఉండిపోతాడని ఆమె వెళ్లింది, తన రాక కోసం నిరీక్షించేందుకే. అప్పటికి ఆయన మనసు కుదుటపడింది.

శ్రావ్యమైన ప్రార్ధనతో కలిసి, వెలుగులు చిమ్ముతున్న హారతులు గంగమ్మనే కాదు ఆయన మనసునూ వెలిగించేయి, ఒక వెచ్చని ఓదార్పునీ అందించేయి.

– అనురాధ నాదెళ్ళ

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి.
Posted in 2015, ఏప్రిల్, కథ and tagged , , , , , .

2 Comments

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.