ఱ - పాలపర్తి ఇంద్రాణి

చావు నెపంతో జీవితాన్ని తడిమే “ఱ”

Download PDF   ePub   MOBI

పాలపర్తి ఇంద్రాణి నవలిక “” విడుదల ఈ ఏడాది తెలుగు రచనా ప్రపంచంలో ఒక సైలెంట్ ఈవెంటు. ఈ మధ్య కొన్ని పుస్తకాలు చేస్తున్న చప్పుణ్ణి బట్టి చూస్తే దీని సైలెన్సే దీని మొదటి ప్రత్యేకత అనుకోవాలి. ఇప్పటిదాకా కవిత్వమే వినిపించిన ఇంద్రాణి ఈ పుస్తకంతో మొదటిసారి వచనం రాయడం దీని మరో ప్రత్యేకత. ఫిక్షన్‌కీ, నాన్-ఫిక్షన్‌కీ మధ్య దూరాన్ని చేరిపేసే ఒక కొత్త రూపం కోసం ఆమె ప్రయత్నం దీనికున్న ఇంకో ప్రత్యేకత. అన్నింటికన్నా ముఖ్యంగా, “కల్పనాత్మక స్మృతి రచన” (fictionalised memoir) అనదగ్గ ఈ రచనలో, ఆమె మన అందరి ఫామిలీ ఫొటోల్లోనూ కొసన నిలబడ్డ ఎన్నో మసకబారిన సెపియా ముఖాల్ని సజీవంగా మన ముందుకు తెస్తారు; మన చేతన చేజార్చుకున్న ఎన్నో జ్ఞాపకాలకు మళ్లీ జీవం పోస్తారు.

పుస్తకం సైజుని బట్టి దీన్ని నవలిక అన్నట్టున్నారు. నిజానికి ఇది ఏ పద్ధతికీ విధేయంగా సాగదు. రచన మొదట్లో కథకురాలు (నేరేటర్) రోజూలాగే నగరంలో తన ఉద్యోగానికి బస్సులో వెళ్తుంది. చుట్టూ నగరవాతావరణం ఆమెను ఉక్కిరిబిక్కిరిగా చుట్టుముడుతుంది. ఇంతలో ట్రాఫిక్‌లో చిక్కుకుని నెమ్మదిగా వెళ్తున్న బస్సు రోడ్డు పక్కనున్న శ్మశానాన్ని సమీపిస్తుంది.

“గోడ అవతల కాలగర్భంలో కలిసిపోయిన తండ్రులు, తల్లులు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, పెద్దనాన్నలు, బాబాయిలు, తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు… వాళ్ళ బంధువులు వాళ్ళకై రకరకాల ఆకృతుల్లో కట్టించిన సమాధుల్లో అస్థిపంజరాలై, భూమాత నిశ్శబ్ద సంగీతాన్ని వింటూ వెల్లకిలా పడుకుని ఉన్నారు.”

శ్మశానాన్ని చూడగానే నేరేటర్‌లో ఏదో ఆకస్మిక తిరుగుబాటు మొదలవుతుంది. ఆమె “ఇనపపెట్టె లోంచి కోడిపెట్టలా” బస్సులోంచి బయటికి దూకి రోడ్డు పక్కన ఉన్న శ్మశానంలోకి వెళుతుంది. దాని నిశ్శబ్దం ఆమెను సాదరంగా ఆహ్వానిస్తుంది. అక్కడి మర్రిచెట్టు కింద కూర్చుంటుంది. నాన్నని చిన్నప్పుడు తాతయ్య మర్రి ఊడలతో బాదటం ఆమెకు గుర్తుకు వస్తుంది. ఆమె గతంలో భాగస్థులైన చాలామంది ఇప్పుడు లేరు. ఆమె తండ్రి, తాతయ్య, కుతూహలం, మాధవ్ మామయ్య, మామ్మ, అమ్మమ్మ అందరూ ఇక్కడిలాగే ఎక్కడో మట్టి పొరల కింద బూడిదగా కలిసిపోయారు.

ఈ సన్నివేశం రచనలోని అన్ని భాగాలకూ సంధానకర్తగా పని చేస్తుంది. ఇక్కడితో మన ముందు జ్ఞాపకాల విన్యాసానికి తెర లేస్తుంది. ఆమె ఇలా శ్మశాన నిశ్శబ్దంలో కూర్చుని వర్తమానంలో తన చుట్టూ ఉన్న దృశ్యాలూ, ఘటనలూ కలిగించే ప్రేరేపణలతో గతంలోకి జారుకుంటుంది. తన కుటుంబాన్నీ, తన బాల్యాన్నీ, వాటి చుట్టూ ముసురుకునే స్మృతుల్నీ, అవి కేవలం స్మృతులు మాత్రమేనని నిక్కచ్చిగా తెలిపే కటువైన వర్తమానాన్నీ… అన్నింటినీ తలుచుకుంటుంది. ఈ నెమరువేత క్రమంలో మన జీవితంలోనో, జీవితపు పరిధుల్లోనో ఎప్పుడో తచ్చాడి ఇప్పుడు గతించిన వ్యక్తిత్వాలూ, సమసిపోయిన సన్నివేశాలూ తిరిగి రక్తప్రసారంతో, వర్తమాన సంచలనంతో వచ్చి మన ముందు నిలబడతాయి:

‘ “కందిపప్పు”, “ఆవాలు”, “ధనియాలు”, “మెంతులు”, “కారప్పొడి”, “పంచదార”, “ఎండుమిరపకాయలు”.. అని వంటింట్లో డబ్బాల మీద ఒక్కో దినుసు పేరు, పిండి పేరు, పొడి పేరు, పచ్చడి పేరు వంకర టింకర అక్షరాలతో రాసిపెట్టేది [అమ్మమ్మ]. మధ్యాహ్నం ఎండవేళ అమ్మవి, తనవి పాత చీరలన్నీ కలిపి అమ్మ, అమ్మమ్మ బొంతలు కుట్టేవారు. “అ”, “ఆ”, “ఇ”, “ఈ”.. లను జంతికలుగా చేసి తినడానికి పెట్టేది. అవెంత రుచిగా ఉండేవంటే సునీలు నేను కలిసి తెలుగక్షరాలన్నీ ఎగబడి తినేసేవాళ్ళం. అమ్మమ్మ, నేనూ కలిసి మంచాలకున్న నవారు తీసి ఉతికి మళ్ళీ మంచాలకు అల్లేవాళ్ళం. అమ్మమ్మ పొట్ట వినాయకుడి పొట్టలాగా ఉండేది. నేను, అమ్మమ్మ చల్లని వేసవి కాలం రాత్రి ఆరుబయట మంచం వేసుకు పడుకుని నక్షత్రాలను చూస్తున్నప్పుడు బోర్లించిన కుండలా ఉండేది. అమ్మమ్మ పొట్టను ఊపుతుంటే నీళ్ళు నింపిన గాలి బుడగను ఊపుతున్నట్టుగా అనిపించేది. అమ్మమ్మ అరవై యేళ్ళ వయసున్నప్పుడు చనిపోయింది. కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్న కళ్ళతో. ఆమె ఆపరేషను జరిగిన ఆసుపత్రి మా ఇంటికి దగ్గరలోనే ఉండేది. ఆ ఆసుపత్రి నిండా చెట్లే. అమ్మమ్మ ఒక్కతే రోగి. అది బ్రిటీషు వాళ్ళచే కట్టబడిన వంద ఏళ్ళ నాటి ఆసుపత్రి. ఒకప్పుడు అనేకమంది రోగులతోను, వైద్యులతోను కిటకిటలాడిన ఆసుపత్రి. ఇప్పుడు తేనె తీసేసిన తేనె తుట్టెలాగా ఉంటుంది. కానీ రికార్డుల్లో మాత్రం అనేకమంది రోగులకి వైద్య సేవలు అందిస్తున్నట్టు చూపి బ్రిటన్ నుండి బోలెడన్ని నిధులు సేకరిస్తున్న తేనెటీగలు ఆసుపత్రి చుట్టూ తిరుగుతుంటాయి. అప్పుడప్పుడు వాళ్ళు నేర్చుకుంది మర్చిపోకుండా కంటి తుడుపుచర్యగా కంటి వైద్య శిబిరాలు నిర్వహించేవారు. ఆసుపత్రి ఆవరణలో ఎర్రరాతితో కట్టబడ్డ ఓ అందమైన చర్చి ఉండేది. దాని మైకు సెట్టు, గోపురపు గంట ఎప్పుడూ బీద దొంగల చేతుల్లోకి వెళుతుండేవి. ఓ రోజు సాయంత్రం ఆ నిర్మానుష్యమైన ఆసుపత్రిలో, చర్చి తలుపులు మూసి ఉన్న వేళ అమ్మమ్మ కంటి ఆపరేషను జరిగింది. ఆపరేషను అయ్యి అమ్మమ్మ కన్ను బాగుపడ్డ కొన్ని రోజులకు తాతయ్య తద్దినం రోజున భోజనం చేస్తూ లడ్డూ నోట్లో ఉండగానే తెరిచిన నోరు తెరిచినట్టుగానే చనిపోయింది అమ్మమ్మ. శవాన్ని ఇంటి బయట చెట్టు కింద పెట్టారు. అమ్మమ్మ పొట్ట బండరాయిలా అనిపించింది. అది ఇంక ఊపినా ఊగదు. శవాన్ని తీసికెళ్ళిందాకా ఒక ఆకుపచ్చని పాము చెట్టు పైన్నే కూర్చుని ఉంది. అక్కడికి వచ్చిన వారంతా ఈ విషయాన్ని వింతగా చెప్పుకున్నారు.’

ఈ పుస్తకంలో ఇలా వివరంగా చిత్రించిన ప్రతీ పాత్రా చివరకు చనిపోయేదే. చనిపోవటమే వాళ్ళ ఎంపికకు అర్హత. ఈ పుస్తకం ముందు మాటలో రచయిత “ఇందులోని పాత్రలు వాటి స్వరూప స్వభావాలు అంతా కల్పితం. చావు ఒక్కటే నిజం” అంటారు. కానీ నాకు మాత్రం చావు ఒక నెపం మాత్రమే అనిపించింది. పుస్తకం చావు అనే నిప్పుల గుండం తొక్కుదామనే బయల్దేరినా మనకు సోకేవి మాత్రం కాష్టపు సెగలు కాదు, కాలపు కాళ్ళ కింద నలుగుతున్న స్మృతుల పూల పరిమళాలు. ఇందులో బాల్యం చూశాను, ఒక కుటుంబ చరిత్ర చూశాను, తెలుగువాడిగా నా ఐడెంటిటీని ఈ చాలా దగ్గరగా గుర్తుపట్టాను (తీర్థాలు, టైప్ ఇన్‌స్టిట్యూట్లూ, బడి పిల్లల కోసం వేసే సినిమాలు, ఆంటెన్నాలు, దూరదర్శన్‌లో ఇందిరాగాంధీ). తండ్రి మరణం తర్వాత ఈ పుస్తకం రాయాలన్న ఆలోచన కలిగిందని రచయిత ముందు మాటలో చెప్పుకున్నారు. కానీ ఇక్కడ మరణం ఇతివృత్తం కాదు, తనకు ఎడమైపోయిన గతాన్ని పునర్దర్శించుకోవటానికి మరణం ఒక సందర్భం మాత్రమే. నేరేటర్ వర్తమానంలోని తనకీ, బాల్యంలోని తనకీ మధ్య తండ్రి మరణం వల్ల ఏర్పడిన గోతిని దాటడానికి వేసుకున్న వంతెనే ఈ పుస్తకం. మరి పైన “పాత్రలు వాటి స్వరూప స్వభావాలు అంతా కల్పితం” అన్న మాట సంగతేమిటి? ఈ స్టేట్మెంటు ఒక పాఠకునిగా నా లోపలి తర్కంతో పొసగలేదు. అది రచయిత తన వ్యక్తిగత జీవితం చుట్టూ ఏర్పరుచుకోవాలనుకున్న కంచె మాత్రమే అనిపించింది.

ఈ నవలికలో కల్పితమని స్పష్టంగా తెలిసిపోయేది దీని నిర్మాణమే. అలాగే ఈ రచనకి ఎక్కడైనా దిష్టి చుక్క చూపించాల్సి వచ్చినా ఈ నిర్మాణం వైపే వేలెత్తి చూపించాలి. శ్మశానంలో కూర్చున్న నేరేటర్ అక్కడ ఏదో దృశ్యాన్ని పరికించడం, వాటి ఆధారంగా ఏదో గత జ్ఞాపకం రేగడం, మళ్ళీ వర్తమానంలోకి రావడం, మళ్ళీ అక్కడ ఏదో గమనించడం, మళ్ళీ గతం… ఇలా లంకెలు వేసుకుంటూ సాగుతుంది కథనం. కానీ ఈ లంకెలు అన్నిసార్లూ సహజంగా అమరలేదు. అంటే, శ్మశానంలో పెరిగిన పిచ్చి మొక్కల్ని చూస్తూ తన ఊళ్ళో బుద్ధిమాంద్యం గల కుర్రాణ్ణి గుర్తు తెచ్చుకోవడం, అక్కడ గాలికి ఎగురుతున్న తన నీలం రంగు చీరని చూసి తన పక్కింటి పాప శ్రావణి ఏడ్చినపుడు ఆమె ముఖం దాల్చే రంగుని గుర్తు తెచ్చుకోవడం, అక్కడ తలపోటు రాగానే బాల్యంలో తనకు మొదటిసారి తలపోటు వచ్చిన సందర్భాన్ని గుర్తు తెచ్చుకోవడం… మనిషి జ్ఞాపకం పని చేసే తీరు ఇలా ఉండదనిపించింది. మధ్యలో ఎంతో వాస్తవంగా కనిపించే నాన్-ఫిక్షన్‌‌కీ, దాన్ని మోయటానికి సృష్టింపబడిన ఈ ఫక్తు ఫిక్షనల్ నిర్మాణానికీ పొత్తు కుదరలేదు. ఫిక్షన్, నాన్-ఫిక్షన్లను గుర్తు దొరక్కుండా కలిపేయాలనే ప్రయత్నం బాగుంది, కానీ అది సమగ్రంగా ఇంకా పూర్తి కాలేదనిపించింది.

*

Posted in 2013, Uncategorized, డిసెంబరు, పుస్తక సమీక్ష and tagged , , .

6 Comments

  1. మన అందరి ఫామిలీ ఫొటోల్లోనూ కొసన నిలబడ్డ ఎన్నో మసకబారిన సెపియా ముఖాల్ని సజీవంగా మన ముందుకు తెస్తారు….ఈ పుస్తకంలో ఇలా వివరంగా చిత్రించిన ప్రతీ పాత్రా చివరకు చనిపోయేదే. చనిపోవటమే వాళ్ళ ఎంపికకు అర్హత.

  2. శ్మశాన నిశ్శబ్దంలో కూర్చుని, కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళ నిశ్శబ్ద సంగీతాన్ని వింటూ స్మృతుల పరిమళాల నెమరువేతకి, మన చేతన చేజార్చుకున్న ఎన్నో జ్ఞాపకాలకు మళ్లీ జీవం పోసిన “ఱ” నవలిక పాలపర్తి ఇంద్రాణి గారికి, పుస్తకాన్ని అద్భుతంగా పరిచయం చేసిన మెహర్ గారికి కృతజ్ఞతలు.

    నెమ్మదిగా వెళ్తున్న బస్సు లోంచి చూస్తున్నప్పుడు రోడ్డు పక్కనున్న శ్మశానం నన్నూ స్మృతుల నెమరువేతకి సాదరంగా ఆహ్వానిస్తుంది ( అది బెంగుళూరు లోని మత్తికెరె కావచ్చు, మేక్రీ సర్కిల్ కావచ్చు లేదా రాచకొండ బాబు దగ్గర నుంచి త్రిపుర తండ్రి వరకూ విశ్రాంతి తీసుకుంటున్న విశాఖ లోని చావులమదుం కావచ్చు )

    చాలా బావుంది. పుస్తకం తప్పుకుండా చదువుతాను.

  3. తద్దినాలకి లడ్లు వండుకోవడమనే సంప్రదాయాన్ని నేనాట్టే ఎరగను. కానీ ఎవరి అచారాలు వారివై ఉండొచ్చును. 60-70 దశకాల నిత్యానుభవాలని గుదిగుచ్చి ఒక Dairy వంటి శైలిలో బీనాదేవి గారి రచన ‘రచన’ లో చదివాను. “మా జీవితానుభవాలని కూడా ఇలా గుచ్చి వ్రాస్తే వేసుకుంటారా” అని రచన సంపాదక వర్గాన్ని విమర్శిస్తూ ఎవరో ఉత్తరం రాశారు.

    చాలా మంది మునపటి మధ్యతరగతి తెలుగు వారు ప్రవాసులు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఇంటి బెంగతో తమ చిన్నతనాలని అనునిత్యం నెమరు వేసుకుంటూనే వున్నారు. ఈ ఇంటి బెంగ నుంచీ మనమెన్నటికీ కోలుకోలేము. ఇల్లంటే ఇక్కడ కుటుంబానికి పరిమితమైన ఇల్లుగా కాకుండా, తెలుగు నేల వల్ల మనకి సంక్రమించిన కుటుంబ, సమాజిక వాతావరణంగా అర్ధం చేసుకోవాలి. అందుకనే తెలుగు కాస్తో కూస్తో చదవను, రాయనూ వచ్చిన వారందరికీ ఒకనాటి “బుడుగు” ఇప్పటికీ చాలామందికి పాఠ్యం. తెలుగు వారి ఇంటిబెంగని పూర్వానుభవాల నెమర్లతో ఓదార్చే రచనలన్నీ సాధారణంగా హిట్లేను.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.