cover

“వేగం నా చేతిలో కాదు, మనసులో ఉంది” ~ గోపి తో ఇంటర్వ్యూ

 Download PDF  EPUB MOBI

gopiwithpaintingఈ నలభై ఏళ్ళూ హైదరాబాదులో లెక్కలేనన్ని అద్దె ఇళ్ళు మారిన తర్వాత – గోపీ ఈ నెలే సొంత ఇంటికి చేరారు. కానీ ఈ నాలుగు అంతస్తుల ఇల్లు ఇంకా పూర్తి కాలేదు. డబ్బు ఇబ్బందులూ, తీరని లోన్లూ. అయినా గోపీ ఉత్సాహంగా ఉన్నారు. ఆ ఉత్సాహానికంతా ఆ ఇంటి పెంట్‌హౌసే కేంద్రం అనిపించింది. దాన్ని పెయింటింగ్ స్టూడియోగా వాడుకోవటం కోసం కట్టుకున్నారు. అక్కడ్నించి చూస్తే కొండ గుట్టల మీద ఎగుడుదిగుడుగా పాకిన అపార్టుమెంట్ గుంపుల మీదుగా కాస్త ఊపిరి పీల్చుకునేపాటి ఆకాశం కనిపిస్తుంది. మబ్బు పట్టిన సాయంత్రం ఇద్దరం ఈ వ్యూ ముందు కూర్చొని మాట్లాడుకున్నాం. కాసేపటికి చినుకులు పడటంతో స్టూడియోగా మారబోయే ఇంటి లోపలికి వెళిపోయాం. “మారబోయే” అని ఎందుకన్నానంటే – ప్రస్తుతానికి ఇంకా అటు తాపీ పనిముట్లూ ఇటు పూర్తికాని కాన్వాసులూ కలగాపులగంగా ఉన్నాయి. కరెంటు పని ఇంకా కాలేదు. వెలుగులో మొదలుపెట్టిన ఇంటర్వ్యూ చీకట్లో పూర్తయింది. గోపీ మాట వెనుక తెలంగాణ తేటదనం ఉంటుంది. పెద్ద లెక్కలు చూసుకుని మాట్లాడినట్టు అనిపించదు. మేధావి హెచ్చులంటే ఇబ్బంది పడతారు. ఇవన్నీ ఈ ఇంటర్వ్యూ పాఠ్యంలోనూ కనిపిస్తాయి.

తొంభైల్లో నా టీనేజీలో ఇంటికి వచ్చే ‘ఆంధ్రజ్యోతి’, ‘ఆంధ్రప్రభ’ ల్లో గోపీ బొమ్మలు మొదటిసారి చూశాను. (అంతకుముందే డెబ్భైలు ఎనభైల్లో గోపీ బొమ్మల స్వర్ణయుగం నడిచిందని నాకు తెలియదు.) అలవోకగా, ఆడుకుంటున్నాడ్రా అనిపించే గీతలూ, రాంగోపాల్ వర్మలా అనూహ్యమైన కెమెరా పొజిషన్ల లోంచి కనిపించే సన్నివేశాలూ బాగా గుర్తు. ఒక పక్క గోపీ demure darlings తోనూ, మరో పక్క కరుణాకర్ పిటపిటలాడే ఆరోగ్యలక్ష్ములతోనూ ఆ వారపత్రికల పేజీలు కళకళ్లాడేవి. తర్వాత గోపీ బొమ్మ పదేళ్ళ పైనే కనపడకుండా పోయి, రెండుమూడేళ్ల క్రితం ‘స్వాతి’లో పునర్దర్శనమైంది. స్టయిల్ మారింది. కొన్ని బొమ్మలు పెయింటింగ్ ఫోజు కొడుతున్నాయి. ఆర్టిస్ట్ చారీని ఆయన గురించి అడిగితే తనకు తెలుసన్నారు. ఆ తర్వాత తల్లావజ్ఝల శివాజీ, రమణజీవిల దగ్గరకు ఇంటర్వ్యూలకని వెళ్ళినపుడు ఆ పని ఐపోయాకా అడిగాను – ఆర్టిస్టుల్లో ఇంకా ఎవర్ని ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుందని. ఇద్దరూ ఉమ్మడిగా చెప్పిన పేరు గోపీనే. రమణజీవి తన ఇంటర్వ్యూలోనే “నా వరకూ గోపీ లైన్ డ్రాయింగ్స్ అల్టిమేట్, బాపు కన్నా కూడా. ఆయన బొమ్మల్ని అలా దించేసేవాణ్ణి” అంటూ తన ఇష్టాన్ని చెప్పుకున్నారు. శివాజీ కూడా గోపీ ప్రత్యేకతల్ని క్లుప్తంగా ఇలా చెప్పుకొచ్చారు: “మంచి కాంపోజిషన్, కలర్ స్కీమ్, అచ్చ తెలుగు బొమ్మలు, షార్ప్ లైన్స్, ఎక్స్‌ట్రీమ్ ఇమేజినేషన్”. ఈ ఇద్దరూ ఇంటర్వ్యూ ప్రశ్నల విషయంలోనూ కూడా చాలా సాయం చేశారు. వాళ్ళిద్దరికీ థాంక్స్. ఇక్కడి ఇల్లస్ట్రేషన్లలో కొన్నింటిని ఇచ్చిన గొరుసుకు కూడా. (ఇల్లు మారాకా ఇంకా పాకింగ్స్ విప్పకపోవటంతో గోపీ తన దగ్గరున్న బొమ్మలు ఇవ్వలేకపోయారు.)

– మెహెర్

మొదటిసారి బొమ్మల వైపు ఎలా మళ్ళారో మీకు గుర్తుందా?

చాలా స్పష్టంగా గుర్తుంది. అప్పటికి ఐదారేళ్ళ వయసు, ప్రైమరీ స్కూల్లో ఉండేవాడ్ని. మా టీచరు ఒకాయనకి ఎదురుగుండా ఉన్న టేబిల్ మీద చాక్‌పీస్ తో పిట్ట బొమ్మ గీయటం ఒక హాబీ. ఆయన పిలిచినపుడు దగ్గరికి వెళ్ళి నిల్చొని దాన్ని చూస్తూండేవాడ్ని. అంత చిన్న వయసులో కూడా అది నన్ను ఏదో కదిలించేది. ఆయనే ఒకరోజు బయటి నుండి ఉమ్మెత్తపువ్వు తెప్పించి దాన్ని టేబిల్ మీద స్టిల్ లైఫ్ లాగా పెట్టి అందర్నీ గీయమన్నాడు. నేను గీసింది అందరిలోకీ బావుందని పొగిడాడు. అది నన్ను చాలా ఉత్సాహపరిచింది. అప్పట్నించీ పుస్తకాల నిండా బొమ్మలు గీస్తుండేవాడ్ని.

ఆ తర్వాత ఐదో క్లాసు చదివేటప్పుడు ఇంకో సంఘటన జరిగింది. అప్పటికే బాగా బొమ్మలు గీస్తాడని నాగురించి ఊళ్ళో ప్రచారమైపోయింది. ఒకసారి జనరల్ ఎలక్షన్స్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థికి కాడెద్దుల గుర్తు వచ్చింది. నేను పశువుల బొమ్మలు బాగా గీస్తాను. (మా ఇంట్లో పశువులుండేవి. ఇంటి దగ్గర అమ్మ కోళ్ళు పెంచేది. ఆ కోళ్ళ ఈకల రంగులూ, వాటి కదలికలూ ఇవన్నీ బాగా గీసేవాడ్ని.) దాంతో ఆ అభ్యర్థి ఏం అడగకపోయినా నేనూ, మా స్నేహితులు ఓ అరడజను మందీ బయల్దేరి వాళ్లు నిచ్చెన పట్టుకుంటే నేను గోడల మీద కాడెద్దుల బొమ్మలు గీసేశాను. ఆ ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచిన తర్వాత వచ్చి నన్ను మెచ్చుకుని వెళ్ళాడు. స్కూల్లో టీచర్లు కూడా నన్ను బాగా ప్రోత్సహించేవారు. ప్రతి సంవత్సరం జరిగే క్లాస్ రూమ్ డెకరేషన్‌లో నేను ఉన్న క్లాసుకే బహుమతి వస్తుండేది. వాళ్ళంతా నన్ను స్టార్ ని చేసేసారు. ఆ మెచ్చుకోలు బాగా పని చేసింది.

cock2

ఏం చేద్దామనుకున్నారు మున్ముందు? బొమ్మలే లైఫ్ అని అప్పుడే అనుకున్నారా?

అంత నాలెడ్జ్ లేదు. కానీ పెద్దయ్యాకా ఇదే చేయాలని ఉండేది. ఒకసారి టీచర్లు అందర్నీ కూర్చోబెట్టి పెద్దయ్యాక ఎవరేం అవ్వాలనుకుంటున్నారో అడుగుతుంటే, నేను ఆర్టిస్ట్ ని అవుతా అన్నాను. బొమ్మలేయాలని, ఆ ప్రొఫెషన్‌లో ఉండాలని ఆ మాత్రం క్లారిటీ ఉంది. తర్వాత హైదరాబాద్ వచ్చి ఫైనార్ట్స్‌ కాలేజీలో చేరాను.

మీ ఇంట్లో పెద్దవాళ్ళు దీనికి అభ్యంతరపెట్టలేదా?

ఆ ఇంట్లోవాళ్లు చాలా ఎంకరేజ్ చేశారు. నాకు చాలా స్వేచ్ఛ ఇంట్లో. మా నాన్న చిన్నపాటి రైతు. ఒక కంపెనీలో గుమాస్తాగా లెక్కలు రాసేవాడు. ఆయన దస్తూరీ చాలా బాగుండేది. అది చూసే పెట్టుకున్నారు. అమ్మకి కూడా నా బొమ్మలంటే చాలా ఇష్టం. ‘మీవాడు బొమ్మలు బాగా వేస్తాడు’ అంటే ఇద్దరూ చాలా సంతోషించేవారు. ముఖ్యంగా మా అమ్మ కుటుంబంలో వాళ్లంతా సినిమాలు బాగా చూస్తారు. నా ఇమేజినేషన్ అట్ల సినిమాల ద్వారా పెరిగింది. సినిమాలు చూడటమే కాదు, ఆ పాటల పుస్తకాలు తెచ్చుకోవటం, ఆ నటుల్ని ఆరాధించటం ఇలాంటివన్నీ ఉండేవి. నన్ను కళ వైపు తిప్పింది సినిమాలే. (ఒకానొక దశలో సినిమా ఫీల్డుకి వెళ్ళాలని కూడా కలలు గన్నాను. కానీ అది మన లాంటి సెన్సిటివ్ మనుషులకి అంతగా పొసగదు. పైగా వయసులో ఉన్నప్పుడైతే చావో రేవో తేల్చుకోవచ్చు. ఇప్పుడు ఈ పోరాటంలోనే వయసైపోయింది. అందుకే విరమించుకున్నాను.)

ఫైనార్ట్స్ కాలేజిలో చదువెలా సాగింది?

Gopi1మహబూబ్ నగర్ కొల్లాపూర్ తాలూకా ఎనమెట్ల అనే చిన్న పల్లెటూరి నుంచి 1969లో హైదరాబాద్ వచ్చి ఫైనార్ట్స్ కాలేజీలో చేరాను. బయట నుంచి వచ్చిన వాళ్లం అక్కడేదో అద్భుతంగా నేర్పుతారూ అనుకుంటాం. అక్కడ చేరాక – ఆ ఆర్ట్ వాతావరణం అదీ బానే వుంది గానీ – కూర్చోబెట్టి నేర్పించే పద్ధతేమీ కనిపించలేదు. ‘నేను ఉద్యోగం చేసుకుంటున్నాను. నువ్వు స్టూడెంటువు. నీకు ఇష్టం ఉంటే చూసి నేర్చుకో’ అన్నట్టుగా ఉంది వాళ్ళ పద్ధతి. ఎవరికివాళ్లు సొంతంగా గ్రహించి నేర్చుకోవల్సిందే గానీ, వాళ్లు పెద్ద ఇంట్రస్ట్ చూపించి నేర్పించడం అనేది ఉండదు. నిజానికి ఆ పద్ధతే సరైనదని ఇప్పుడనిపిస్తుంది. చిన్నప్పుడు స్కూళ్ళల్లో కూర్చోపెట్టి చెప్పినట్టు ఆర్ట్ నేర్పలేరు. స్వతహాగా నేర్చుకోవాల్సిందే. కాలేజీలో వాళ్ళు అకడెమిక్‌గా ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసి ఇస్తారంతే. ఇది అప్పట్లో గ్రహించలేకపోయాను. కాలేజీ మీద చాలా త్వరగా ఆసక్తిపోయింది.

అప్పట్లో సినిమా థియేటర్స్ దగ్గర నటుల కటౌట్స్ పెయింటింగ్ వేసి అలంకరించేవారు. నాకు చాలా మిస్టరీగా ఉండేది – అబ్బ వీళ్ళు ఇంత బాగా ఎట్ల పెయింట్ చేస్తారని. మిషన్‌లో పెట్టి ఎన్‍లార్జ్ చేస్తారని అప్పటికి తెలియదు. సొంతంగా స్కెచ్ వేయలేరనీ, పెయింట్ మాత్రమే చేస్తారని తర్వాత తెలిసింది. ఈ బొమ్మలు ఎవరు తయారు చేస్తారని ఎంక్వయిరీ చేస్తే చిక్కడపల్లి చుట్టుపక్కల కంపెనీలు ఉన్నాయని తెలిసింది. కాలేజీకి డుమ్మా కొట్టి కోటీ నుండి చిక్కడపల్లి దాకా రోజూ నడుచుకుంటూ వచ్చేవాడ్ని. థియేటర్ల దగ్గర బొమ్మలు చూడటం, లైబ్రరీలో పుస్తకాలు ఫాలో కావటం… ఇవే చేసేవాడ్ని. నా చేతిలో ఎప్పుడూ స్కెచ్చు బుక్కు ఉండేది. అది లేకపోతే చాలా వెలితిగా ఉండేది. ఇరానీ హోటళ్లలో టీ తాగుతూ, పార్కుల్లో కూర్చునీ, ఎక్కడపడితే అక్కడ స్కెచింగ్ బాగా చేసేవాడ్ని. నా అసలైన పునాది అదే.

చిక్కడపల్లిలో ఇలా థియేటర్ల దగ్గర బొమ్మలు వేసే ప్రసాద్ కంపెనీ అని ఒకటి ఉండేది. అక్కడకు వెళ్ళాను. వాళ్లు నా బొమ్మలు చూసి చాలా థ్రిల్లయ్యారు. ఫ్రీ హాండ్ డ్రాయింగ్ చేసేవాడ్ని అప్పటిదాకా చూడలేదు వాళ్ళు. అక్కడ అంబాజీ అని ఒకతను ఉండేవాడు. ఇప్పటికీ వర్క్ చేస్తున్నాడు. మంచి పోర్ట్రయిట్ ఆర్టిస్ట్. బాపు స్టయిల్లో లెటరింగ్ రాసేవాడు. “ఈ లెటరింగ్ ప్రాక్టీస్ చేయి గోపీ” అంటూ – నాకు బాగా గుర్తుంది – ‘ముళ్ళపూడి వెంకటరమణ’ ‘విశ్వనాథ సత్యనారాయణ’ అని రెండు పేర్లు రాశాడు. అప్పటి వరకూ నేను పత్రికలు తిరగేసేవాడ్నే గానీ, బాపూ స్టయిలంటూ ఒకటుందని, ఆయన పెద్ద ఆర్టిస్టని ఇవేం తెలియదు. అంబాజీ ద్వారానే నాకు బాపు పరిచయం అయ్యాడు. దేని మీదైనా దృష్టిపెడితే అంతు చూస్తాను నేను. నా స్టడీ అలాంటిది, ప్రేమ అలాంటిది. అలా బాపు బొమ్మలు కలెక్ట్ చేయటం, వాటిని ప్రాక్టీస్ చేయటం చేసేవాడ్ని. చివరికి బాపు చేతే “నా ఫేవరెట్ ఆర్టిస్ట్ అంటే మీరేనండి” అనిపించుకున్నాను.

పత్రికల వైపు ఎలా వచ్చారు? బాపు గారిని కలవటం ఎలా జరిగింది?

అప్పట్లో ‘అపరాధ పరిశోధన’ అనే పత్రిక వచ్చేది. వాటికి అంబాజీ కవర్ పేజీలు వేస్తుండేవాడు. లోపలి లైన్ డ్రాయింగుల మీద ఆయనకు పెద్దగా ఆసక్తి లేకపోవటంతో ఆ పని నాకు ఇప్పించాడు. అందులో క్రైమ్ స్టోరీలకి బొమ్మలు వేయటంలో చిన్నప్పట్నుంచీ చూసిన సినిమాలు నాకు బాగా సాయం చేశాయి. చిన్నప్పుడు సినిమా చూసొచ్చి ఎన్టీయార్ కత్తి యుద్ధం ఎలా చేస్తాడనేది బొమ్మలు గీసేవాడ్ని. అది హైలీ ఇమేజినేటివ్. ఎవరికీ అంత సులువుగా వీలవదు. నా బొమ్మల పిచ్చికి కాగితాలూ, రఫ్‌నోట్ బుక్సూ, చివరికి గోడలు కూడా అయిపోయి గీయటానికి చోటుండేది కాదు. పలక మీద గీయటం చెరపటం చేసేవాడ్ని. నా ప్రాక్టీసు ఆ లెవెల్లో ఉండేది.

ఇలా ‘అపరాధ పరిశోధన’కు గీస్తూనే, విజయవాడ నుంచి వచ్చే ‘ఆంధ్రపత్రిక’కు కూడా బొమ్మలు గీసి పోస్టులో పంపేవాడ్ని. అవి బాపు దృష్టికి వచ్చాయి. ఆయన్ని కలవటానికి ఇక్కడ్నించి కొందరు చిత్రకారులు వెళ్తే “ఈ గోపీ ఎవరండీ బాగా వేస్తున్నాడు” అన్నారట. ఆయన నోటి నుండి ఆ మాట రావడం అంటే గొప్ప విశేషమే. ఎందుకంటే ఆయన ముఖస్తుతి కోసం మాట్లాడే మనిషి కాదు. వాళ్ళు నాతో ఈ సంగతి చెప్పి “మీరూ ఒకసారి కలవండి” అన్నారు. ఆయనుండేది మద్రాసు, మనవుండేది హైదరాబాదు ఎట్లాగా అని ఆలోచిస్తుంటే, లక్కీగా తర్వాత కొద్ది రోజుల్లోనే ఇక్కడ సుదర్శన్ ధియేటర్‌లో ‘ముత్యాల ముగ్గు’ వందరోజుల ఫంక్షన్ వచ్చింది. ఆయన అక్కడికి వస్తున్నారని తెలిసి నా స్కెచ్చుబుక్కు తీసుకుని కలవడానికి వెళ్ళాను. కానీ అప్పట్లో సినిమా వాళ్ళంటే వేలంవెర్రిగా ఉండేవాళ్లు జనాలు. అందర్నీ పోలీసులు తరిమేశారు. తర్వాత ఆయన నాంపల్లి అన్నపూర్ణా హోటల్లో దిగారని తెలుసుకుని అక్కడికి వచ్చాను. ఆ ఫంక్షన్ నుంచి ఆయన వచ్చేంతవరకూ అక్కడే వెయిట్ చేశాను. ఆయన వచ్చారు. నేను ఫలానా అని చెప్పి, నా స్కెచ్చు బుక్కు చూపించి పరిచయం చేసుకోగానే చాలా ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారు. తన హోటల్ గదికి తీసికెళ్లారు. అక్కడే వున్న నవోదయా రామ్మోహనరావు గారికి “చాలా మంచి ఆర్టిస్టండీ” అని పరిచయం చేశారు. తర్వాత “మీరేం చేస్తున్నారిక్కడ, పబ్లిషర్స్ అంతా విజయవాడలో ఉంటే? అక్కడికి వెళ్ళొచ్చు కదా” అన్నారు.

అప్పట్లో బాపు అనే సందర్భం మా జీవితానికి మంచి చేసిందో చెడు చేసిందో తెలియదు గానీ, ఒక విషయం మాత్రం చెప్తాను. ఫైన్ ఆర్ట్స్ తర్వాత పోస్టు గ్రాడ్యుయేషన్ కోసం నాకు చికాగో ఇల్లినాయిస్ లో సీటొచ్చింది. కానీ బాపు అనే మత్తులో ఉండి వెళ్లలేదు. ఆ బొమ్మల మీద ఉండే ప్రేమ, వ్యామోహం, ఈ పత్రికలూ (అప్పట్లో పత్రికలంటే చాలా గొప్పగా ఫీలయ్యేవాళ్ళం)… వీటన్నింటి వల్లా నేను ఆ అవకాశం వదులుకుని 1975లో విజయవాడ షిప్ట్ అయిపోయాను. అక్కడే ఫ్రీలాన్స్ ఆర్టిస్టుగా ఐదారు సంవత్సరాలున్నాను.

ChandraBapuGopi

చంద్ర, బాపు, గోపి

సినిమా పబ్లిసిటీ కోసం మద్రాసులో కూడా కొన్నాళ్లున్నట్టున్నారు?

మోహన్ కుమార్ అని ఒక సినిమా జర్నలిస్టు ఉండేవాడు. ఆయన అప్పుడప్పుడు విజయవాడలో జరిగే సినిమా ఫంక్షన్లకి వస్తుండేవాడు. పత్రికల్లో నా స్ట్రోకూ అదీ చూసి – “సినిమాల్లో పబ్లిసిటీ ఆర్టిస్టుగా మీకు అవకాశం ఇప్పిస్తాను, మద్రాసు వచ్చేయవచ్చు కదా” అన్నాడు. ‘సిరిసిరిమువ్వ’ సినిమాకి టైటిల్ తయారు చేయమన్నాడు. చేశాను కూడా. కాకపోతే కొద్దిగా ఆలస్యం కావటంతో అవకాశం వేరే ఎవరికో MaaBhoomi Posterవెళిపోయింది. ఆయన రమ్మన్నప్పుడే వెళ్తే బావుండేది. కానీ ఇక్కడి పనులన్నీ పూర్తి చేసి వెళ్ళేనాటికి కొంత ఆలస్యమైంది. తర్వాత పూర్తిగా మద్రాసు షిఫ్ట్ అయిపోయాను. కొన్ని సినిమాలు చేశాను. కాని అక్కడేం జరిగిందంటే – నాది స్వతహాగా అంత దూసుకుపోయే నేచర్ కాదు. వాళ్ళూ వీళ్ళ దగ్గరికి వెళ్ళి ‘అయ్యా బాబూ’ అని పరిచయం చేసుకోవడం, మనకేదో ఉపయోగపడతారని ఒకరి చుట్టూ తిరగటం ఇట్లాంటివి నాకు అలవాటు లేదు. పైగా అక్కడ భాష రాదు. నెల వస్తే అద్దె కట్టడం సమస్య. దాంతో కొంత ఒంటరిగా ఫీలయ్యేవాడ్ని. దీనికి తోడు – ఈ సినిమావాళ్లు పని చేయించుకుని సరిగా డబ్బులిచ్చేవాళ్లు కాదు. ఆడుకుంటారు మనతో. ‘మీరు అక్కడికి రండీ ఇక్కడికి రండీ’ అంటారు, వర్కు గురించి అసలేం తెలియని వాళ్ళు కూడా డబ్బులివ్వాలని చెప్పి పనిలో వంకలు పెడతారు… ఇవన్నీ వాళ్ళ టాక్టిక్స్. ఇలాంటివాళ్ళ దగ్గర ముక్కుసూటిగా ఉంటానంటే ఎలా కుదురుతుంది. కానీ మరి నేను నా పనినే నమ్ముకున్నవాడ్ని. అది ఆర్థికంగా నన్ను ఏ స్టేజికి తీసుకెళ్తుంది అన్నది కాదు. బొమ్మ పర్‌ఫెక్ట్‌గా గీయగలగాలి. అంతే.

బాపు గారు అక్కడే ఉండేవారు కదా, కలవలేదా?

బాపు లాంటి మంచి వ్యక్తి దగ్గరకు కూడా తక్కువ వెళ్ళేవాడ్ని. మొహమాటం అన్నమాట. ఇప్పుడు ఇంత వయసొచ్చాకా కొంత మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి నేను చేసిన పొరపాట్లు నాకు తెలుస్తున్నాయి. బాపు దగ్గరకెళ్ళి నా పరిస్థితి చెప్పివుంటే ఖచ్చితంగా ఆయన్నుంచి ఎంతో కొంత మేలు జరిగేది. ఎందుకంటే ఆయన నన్ను అల్టిమేట్‌గా ఇష్టపడిన వ్యక్తి. కానీ అదే కారణం చేత ఒక భయం కూడా. మనల్ని ప్రేమించేవాళ్ళూ, ఇష్టపడేవాళ్ల దగ్గరే ఆ భయం ఉంటుంది – ఎక్కడ వాళ్లతో మనకు తేడా వస్తుందో అని. దీనివల్లే ఎప్పుడో గాని ఆయన్ని కలిసేవాడ్ని కాదు.

మరి మళ్ళీ వెనక్కు వచ్చేశారా?

మద్రాసులో రెండేళ్ళు వున్నాకా ఇక పరిస్థితి బాలేక మళ్ళీ విజయవాడ వచ్చేశాను. తర్వాత పెళ్ళయింది. నా మేనమామ కూతుర్నే చేసుకున్నాను. విజయవాడలో ఉండగానే ఒకసారి కె. సదాశివ గారు ఇంటికి వచ్చి కలిసి వెళ్ళారు. తర్వాత ఉన్నట్టుండి హైదరాబాద్ నుంచి నాకు ఒక అపాయింట్మెంట్ లెటర్ పంపారు. అప్పట్లో ఆయన డైరీ డెవలప్మెంటు లో ఎం.డీ గా ఉండేవాడు. అందులో నా కోసం ఒక పోస్టు క్రియేట్ చేశాడు. ఇంతకాలం ఫ్రీగా బతికిన వాళ్ళం ఇప్పుడు ఉద్యోగం ఏంటని నేను మొదట చేరలేదు. మా అన్నయ్య వచ్చి “అడక్కుండా గవర్నమెంటు ఉద్యోగం వచ్చింది కదరా.. నువ్విన్ని ఇబ్బందులు పడుతుంటావ్… ఉంగరాలు తాకట్టు పెట్టి అద్దె కడుతుంటావ్.. ఎందుకు చేరిపో” అని బలవంతంగా నన్ను తీసుకువెళ్ళి చేర్పించాడు. కానీ అంత హార్డ్ వర్కు చేసినవాళ్ళం ఒక చోట ఉద్యోగం ఉంది కదాని ఊరకనే కూచోమ్మంటే కూచోలేం కదా. అతికష్టం మీద ఏడాదిన్నర చేశాను. ఒక రోజు లేటుగా వచ్చానని మెమో ఇచ్చారు. వయసులో ఉన్నప్పుడు మరీ కోపంగా ఉండేవాడ్ని. “మీరు కావాలంటే నేను వచ్చాను గానీ, నా అంతట నేను రాలేదు, ఈ ఎక్స్‌ప్లనేషన్స్ అవీ నాకు అలవాటు లేదు” అని రిజైన్ చేసేశాను.

అవి 1981 – 82 ప్రాంతాలు. చిక్కడపల్లిలో బ్రిడ్జి పక్కన సొంతంగా ఒక స్టూడియో పెట్టుకుని రెండు మూడేళ్ళు అన్ని పత్రికలకీ – ముఖ్యంగా ఆంధ్రప్రభ, జ్యోతి మంత్లీలకి – బొమ్మలు వేశాను. 1986లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా, ‘ఆంధ్రప్రదేశ్’ అనే గవర్నమెంటు పత్రిక ఒకటుండేది, దాని ఎడిటర్ నా చేత కొన్ని బొమ్మలు గీయించారు. ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కమిషనర్ కి ఆ బొమ్మలు బాగా నచ్చాయి. అప్పుడే ఎన్టీఆర్ ‘తెలుగు సమాచారం’ అని ప్రభుత్వం తరపున ఒక యాడ్ ఏజెన్సీ పెట్టారు. ఎన్టీఆర్ స్పీడుని తట్టుకోగలిగే ఒక ఆర్టిస్టు కావాలని నన్ను పిలిపించారు పనికి. నా పనితో వాళ్ళు చాలా హేపీ. అది ఓ ఆరేడేళ్ళు నడిచింది.

అప్పుడే పత్రికల్లో పని చేయటం మానేశారా?

Gopi2పత్రికల్లో ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతండీ…! దరిద్రమైన రెమ్యునరేషన్. మనమేదో ఈ బాపు మీద వ్యామోహంతో పత్రికల్లో వచ్చాం గానీ… ఆ ఎడిటర్స్‌కి బొమ్మల గురించి ఏం తెలీదు. ఒక దద్దమ్మని కూర్చోబెడతారు. వాడేదో జీతం కోసం కూర్చుంటాడు. వాడికేం తెలుసు బొమ్మ గురించి నా బొంద. సారీ ఈ లాంగ్వేజి మాట్లాడుతున్నందుకు. చాలామంది ఎడిటర్స్ కులగజ్జితో ఉన్నవాళ్ళు. ఎంత ముదిరిపోయి ఉండేవాళ్లంటే జంధ్యం ఉందో లేదో చూసిన సందర్భాలున్నాయి. పత్రికలకి బొమ్మలు వేసే టైములో నేను ఎంత దౌర్భాగ్య జీవితం అనుభవించానో నాకు తెలుసు. మా పిల్లలు స్కూలు నుంచి వస్తే రిక్షాకి ఇవ్వడానికి డబ్బులుండేవి కాదు. నేనూ, నా భార్య ఎంతో టెన్షను పడేవాళ్ళం. ఎన్ని న్యూస్‌పేపర్లు అమ్మితే వస్తాయి డబ్బులు? అందుకే తెలుగులో ఇల్లస్ట్రేషను అనేది బతకటానికి ఒక మార్గం కానే కాదంటాను. అటువైపు వెళ్ళే వాళ్ళకి కూడా వద్దని చెప్తాను. చేరితే పత్రికలో ఉద్యోగిగా చేరండి, అన్ని బెనిఫిట్సూ పొందండి. అంతేకానీ, ఫ్రీలాన్సరు గా మాత్రం వేస్టు.

నాకు పత్రికల్లో పని కంటే ఈ గవర్నెమెంటు పని చాలా బెటరుగా అనిపించింది. పత్రికలవాడు బొమ్మకి ఇచ్చే డబ్బు కన్నా పదిరెట్లు ఎక్కువ ఇచ్చేవారు. ఓ ఆరేడేళ్ళు రాత్రింబవళ్ళూ కష్టపడి పని చేశాను. ఒక డిపార్టుమెంటు చేయాల్సిన పని ఒంటిచేత్తో చేశాను. ఫోన్లుండేవి కాదు, డిటిపి ఉండేది కాదు, ఒక్కో అక్షరం కత్తిరించి పేస్ట్ చేసి మేటర్ తయారు చేసేవాళ్లం. ఒక పోస్టర్ తయారు కావడానికి వారం పట్టేది. టైముకి తిండుండేది కాదు. టీలూ సిగరెట్లూ. ఆ టెన్షనుకి ఆరోగ్యం చాలా పాడయ్యింది. కానీ నాలుగు డబ్బులు సంపాదించి ఈ ఇల్లు కట్టుకున్నానంటే పునాది ఆ కష్టమే. ఎన్టీఆర్ పదవి దిగిపోయాకా కూడా వాళ్ళు నాకు అలవాటుపడ్డారు కాబట్టి నా చేత కొన్నాళ్ళు పని చేయించుకున్నారు. అలా దాదాపు 1986 నుంచి 92 దాకా అక్కడే చేశాను.

బయటకి ఎందుకు వచ్చారు?

విపరీతంగా సిగరెట్ తాగడం వల్ల చాలా సిక్ అయ్యాను కొన్నాళ్లు. ఎవరో స్మోక్ చేస్తున్నారని చెప్పి చాలామంది ఆర్టిస్టులు ఈ వ్యసనానికి అలవాటుపడతారు. అదో సరదా. కానీ నా శరీరం దాన్ని రిసీవ్ చేసుకోలేకపోయింది. 1992 నుంచి 95 దాకా అనారోగ్యంతోనే ఉన్నాను. సిగరెట్ మానేశాకా కొంత రికవర్ అయ్యాను.

అయితే ఆ గవర్నమెంటు పని చేయడమైతే చేశాను గానీ, ఆ బిల్స్ అన్నీ ఏళ్ల తరబడి పెండింగులో ఉండి డబ్బు ఎప్పటికో నా చేతికందింది. దాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాను. భగవంతుడు ఆర్ట్ ఇచ్చినవాళ్ళకి కొంత అమాయకత్వం కూడా ఇస్తాడేమో. ఆ వచ్చిన డబ్బులు ఫ్రెండ్సూ, చుట్టాలకి వెళ్ళి వెనక్కి తిరిగిరాక… ఛఛ అసహ్యం! నేను చాలా తప్పులు చేశాను. వచ్చిన డబ్బంతా సద్వినియోగం చేసుంటే ఇలాంటి ఇల్లు ఇంకోటి ఉంటుంది నాకు.

రియలెస్టేట్ వేపు వెళ్ళి దెబ్బతిన్నారంటారు. ఇప్పుడేనా?

(నవ్వుతూ) ఇది ఆర్టిస్ట్ మోహన్ ప్రచారం. ఆయన్తో సరదాగా కూచోవడానికి వెళ్ళినపుడు ఈ విషయం చెప్తే ఆయన అతిగా ఊహించుకుని “గోపీ రియలెస్టేటుకి వెళిపోయాడూ, మురళీమోహన్ స్థాయిలో ఉన్నాడూ” అని ప్రచారం చేశాడు.

మా బ్రదర్‌కి దిల్‌సుఖ్‌నగర్‌లో ఒక ప్లాటు ఉండేది. నేను కొంత డబ్బులకి ఇబ్బంది పడుతుంటే – ఒక స్నేహితుడు “మీ బ్రదరేదో డెవల్మెంటుకి ఇస్తాడట కదా ప్లాటు, మీరెందుకు తీసుకోకూడదు” అన్నాడు. “నాకు వర్కు తెలీదు కదా” అంటే, “కూడా నేను ఉంటాను” అన్నాడు. ఆయన ప్రోత్సాహంతో ఆ రియలెస్టేటు లోకి దిగాను. చివరికి ఆయన వల్ల చెడే జరిగింది. రెండేళ్ళు అతికష్టం మీద పోరాటం చేసి దాన్ని కంప్లీట్ చేశాను. కానీ మార్కెటింగ్ దగ్గర ఫెయిలయ్యాను. అప్పటికి ఇప్పుడున్నంత రేట్స్ లేవు. అతికష్టం మీద 2003లో దాన్నుంచి బయటపడ్డాను. నష్టమైతే రాలేదు, రెండుమూడేళ్ళు అన్నం పెట్టింది. కానీ అదృష్టం కలిసొచ్చుంటే ఇంకా మంచి పొజిషన్‌లో ఉండేవాడ్ని.

మరి అప్పట్నించి ఈ పదేళ్ళూ ఏం చేశారు?

తర్వాత ఇక ఏం చేయలేదు. పత్రికల్లో మానేశాను. ఇక చేస్తే పెయింటింగ్ తప్పితే ఏదీ చేయకూడదని అనుకున్నాను. నిరంతరం ఏది చూసినా పెయింటింగ్ దృష్టితోనే చూడటం మొదలుపెట్టాను. ఈ పదేళ్ళలో కొంచెం నేర్చుకున్నాను.

ఒకసారి ఆలోచిస్తే అనిపిస్తుంది – చిన్నప్పట్నించీ ఈ పెయింటింగ్‌నే ఎంచుకుని ఉంటే ఎంత బాగుండేది అని. నాకు తెలియక ఫైన్ ఆర్ట్సులో కమర్షియల్ ఆర్ట్ ఎంచుకున్నాను. పెయింటింగ్ తీసుకునివుంటే జీవితం వేరేగా ఉండేది. ఊళ్ళో హైస్కూలు చదువు పూర్తి చేసి సిటీకి వచ్చిన నాకు అసలు ఫైన్ ఆర్ట్స్ కాలేజీ అనేది ఒకటి ఉంటుందనే సరిగా తెలియదు. వయా వయా తెలుసుని వచ్చాను. అందులో మళ్ళా అప్లయిడ్ ఆర్ట్స్ తీసుకుంటే ఏమవుతామో, పెయింటింగ్ తీసుకుంటే ఏమవుతామో తెలియదు. అప్లయిడ్ ఆర్ట్స్ అయితే ఉద్యోగం వస్తుందని ఓ రీజన్. అందుకని ఎక్కువమంది అదే తీసుకునేవాళ్ళు. కానీ నాలా ఫ్రీ హాండ్ స్కెచెస్ గీయగలిగేవాళ్ళు పెయింటింగ్ తీసుకోవాలి. ఆటగాళ్ళకు ఎలాగైతే కోచ్ ఉంటారో, అలా ఆర్టిస్టులకి కూడా కోచ్ ఉండాలి. మంచి చెడూ చెప్పటానికి కనీసం ఒక మనిషి కావాలి. అజ్ఞానం వల్ల చాలా నష్టపోతాం.

మీ గీతల్లో ఉండే వేగం మీ చేతుల్లో కూడా ఉంటుందా? నిదానంగా గీసి ఆ వేగాన్ని తెస్తారా, లేక అంతే వేగంగా గీస్తారా?

20150421_183639ఆ వేగం నా మనసులో ఉంటుంది (మనోవేగం అంటారు కదా). చేతిలో ఏం లేదు. ఒక అనుభవం చెప్తాను. నదీ తీరప్రాంతాల్లో ఇసుక మేటలుంటాయి కదా. చిన్నప్పుడు ఒక కర్రముక్క తీసుకుని ఆ ఇసుకలో పరిగెత్తుతూ పెద్ద బొమ్మ గీసేవాడ్ని. శరీరం పరిగెత్తుతూనే ఉండేది. గీత మీద కంట్రోల్ అలాగే ఉండేది. కాగితం మీద కూడా అంతే.. ఆ వేగం అనేది నేచురల్‌గా నాలో ఉన్నది. నేను ప్యూర్ ఇమేజినేషన్‌తో గీస్తాను కాబట్టి కూడా ఆ వేగం వస్తుంది. ఒకటి చూసి గీసేవాళ్లలో ఆ వేగం రాదు. నేను చేసిన వర్క్ అంతా ఇమేజినేషన్ మీదే చేశాను. ఎక్కడా దేన్నీ రిఫరెన్స్ తీసుకుని చేయలేదు. గీసిన బొమ్మ రెండో సారి గీయలేదు. గొప్ప చెప్పుకోవటం కాదు గానీ, బాపు కూడా రిఫరెన్సూ అది బాగా మెయింటైన్ చేస్తారు. పెద్ద లైబ్రరీ ఉంటుంది. నేను అట్లా కాదు. కళ్ళు మూసుకుంటే నాకు బొమ్మ కనిపిస్తుంది.

బాపు అనే ఆర్టిస్ట్ లేకపోతే మీ స్టయిల్ ఎలా ఉండేది?

బాపు ఎవరో తెలియక ముందే నేను ఆర్టిస్టుని. బార్న్ ఆర్టిస్టుల కోవకే చెందుతాను నేను. ఆయన ప్రభావం ఒకానొక టైములో చాలా ఉంది. కానీ నేను కొంచెం భిన్నంగానే ఉన్నాను. పూర్తిగా ఆయన శైలిని ఫాలో అయిపోలేదు.

రచనలకి బొమ్మలు గీసేటప్పుడు సన్నివేశాన్ని బొమ్మగా మలచడానికి ఇష్టపడేవారా? ఇంటర్‌ప్రిటెటివ్‌గా వేయడానికి ఇష్టపడేవారా?

రెండు రకాలగానూ చేయచ్చు. కానీ నా ఉద్దేశంలో – నేను బాగా నమ్మేది ఏమిటంటే – ఒక కథకి వేసిన బొమ్మ ఇంకో కథకి నప్పకూడదు. ఈ విలువ కాపాడుతూ వేయాలి. అయినా ఇప్పుడు ఇల్లస్ట్రేటర్లు ఎవరున్నారండి. అది ఓ శూన్య ప్రపంచం. ఓ ముగ్గురు నలుగురి మధ్య జరుగుతున్న పోరాటం. అది తెలుసుకునే సరికే మా జీవితాలు అయిపోయాయి. నేనింకా మధ్య మధ్యలో బ్రేక్ ఇచ్చేవాడ్ని. పత్రికల మీద కోపం వచ్చి వేసేవాడ్ని కాదు.

బాపు గారంటే.. ఆయన ఎంతో అల్పసంతోషి. అదీ ఆయనలో సుగుణమే. ఈ సాహిత్యం మీద, పుస్తకం మీద, పత్రికల మీద, మనుషుల మీదా ప్రేమతో డబ్బులిచ్చినా ఇవ్వకపోయినా గీసేవారు. పైగా ఆయన పూర్తిగా దీని మీద డిపెండ్ అయి లేరు. మేం అలా ఎలా చేయగలం.

ఈ ప్రొఫెషన్‌లో భాగంగా (బొమ్మలు గీయటానికి) మీరు ఎంతో సాహిత్యం చదివి ఉంటారు. మీ సాహిత్యాభిరుచుల గురించి చెప్పండి?

మంచి కథ కొత్తదైనా పాతదైనా చదివితే ఇష్టపడతాను గానీ, విశ్లేషించేంత శక్తి లేదు.

ravisastri vennela

ఆర్ట్ గురించి చదువుతారా?

తక్కువే. నా జీవితం ఎప్పుడూ పోరాటమే. బొమ్మలు గీయటానికే ఎక్కువ టైం కేటాయించాను, ఆ తర్వాత బతుకుతెరువు కోసం పోరాటం. అలాగని పూర్తిగా చదవకుండానూ లేను. విజయవాడలో ఉన్నప్పుడు నవోదయా పబ్లిషర్స్ దగ్గర ఆర్ట్ బుక్స్ దొరికేవి. వాటిని బాగా ఫాలో అయ్యాను, ప్రాక్టీస్ చేశాను. అర్ధరాత్రి నిద్రపోకుండా ఆ బుక్స్ చూస్తుండేవాడ్ని.

చాలామంది రచయితలు తమను తాము జ్ఞానులగానూ, ఆర్టిస్టులను కేవలం క్రాఫ్ట్‌మన్ గానూ వర్గీకరిస్తుంటారు. మీరేమంటారు?

అది వాళ్ళ భ్రమ. ఆర్టిస్టులు ఎక్కువ చదవరూ అని ఒక చులకన భావం ఉంది. కానీ అందరి జీవితాలూ ఒకలా ఉండవు. పైగా ఈ బొమ్మలు గీయటం కూడా చదువే. ఒక బొమ్మలో ఫెర్ఫెక్షన్ రావాలంటే జీవితం మీద కూడా అంతటి అవగాహన ఉండాలి. డెసిషన్ పవర్ ఎక్కడికక్కడ పని చేస్తూంటుంది. తీసుకునే సబ్జెక్టు, దాని కాంపోజిషనూ, ఏంగిలూ, ఎక్స్‌ప్రెషన్, బాలెన్స్ చేయటం… ఇవన్నీ కూడా జీవితంతో ముడిపడివున్నవే. ఒక బొమ్మ బాగుందీ అంటే – వాడు కేవలం మంచి ఆర్టిస్టు కాబట్టే గీయలేడు, జీవితం గురించి ఎంతో తెలుసు కాబట్టే అలా గీయగలిగివుంటాడు. అది కూడా చదువే.

మీ బొమ్మలకు మీరనుకున్న గుర్తింపు రాక బాధపడిన సందర్భాలు?

swathiworkఎందరో బొమ్మలు గీసేవారు. కొంతమంది బాపుగారిని ఇమిటేట్ చేశారు, కొంతమంది ట్రేస్ చేశారు, కొంతమంది పిచ్చిగా కాపీ చేశారు. నేను సొంతంగా బొమ్మ గీస్తున్నాను అని ఎలా చెప్పాలిరా ఈ ఎడిటర్‌కి అని తాపత్రయపడేవాడ్ని. అందుకనే ఓ టాప్ ఏంగిల్ తీసుకునేవాడ్ని. సినిమాలో సీన్ చూపించినట్టు చూపించేవాడ్ని. ఇదంతా నా కెపాసిటీ చెప్పుకోవడానికి. మళ్ళీ అది గుర్తించింది బాపు గారు ఒక్కరే. ఆయన ఎంత మౌత్ పబ్లిసిటీ చేశారో నా గురించి! అసలు సంబంధం లేని వాళ్ళు ఆయన దగ్గరకు వెళ్ళినా నా గురించి మాట్లాడిన సందర్భాలున్నాయి. అందుకు ఎంతో రుణపడివుంటాను. మంచి హ్యూమన్ బీయింగ్ ఆయన. అస్సలు కుళ్ళు లేదు. కానీ ఈ ఎడిటర్స్ వీళ్ళెవ్వరూ నన్ను గుర్తించలేకపోయారు. వాళ్ళకు ఏదో వేరే కారణం వల్ల నా మీద కోపం వుంటుంది. ఒక ఎడిటర్ అన్న మాట చెప్తాను. “ఎంతైనా బాపు గారు బాపు గారేనండీ, ఆయన్ని ఎవరూ అందుకోలేరండీ!” అన్నాడు నా బొమ్మ తీసుకుంటూ. ఆయన్ని పొగిడితే నేనేం విబేధించను, నేనూ పొగుడుతాను, నేనూ ప్రేమిస్తాను. కానీ వీళ్ళకున్న అనేక రుగ్మతల మధ్యా, కుళ్ళు మధ్యా మా ఆర్టిస్టులు నలిగిపోయారు. మా జీవితాలూ, ఎనర్జీ అంతా అయిపోయాయి. ఆ చాకిరీ అంతా పత్రికలకి చేశాం. ఏం బావుకున్నాం. ఏమీ లేదు. బూడిదలో పోసిన పన్నీరైపోయింది.

ఎందుకు ఆర్టిస్టునయ్యానురా భగవంతుడా అనిపించేదా?

అలా అని మాత్రం ఎప్పుడూ అనిపించలేదు. వచ్చే జన్మ అంటూ వుంటే నేను ఆర్టిస్టుగానే పుట్టాలని కోరుకుంటాను. ఎందుకంటే ఈ ఆర్టులో ఉన్నంత ఫ్లెక్సిబిలిటీ ఏ ఆర్టులోనూ లేదు. వాడు నాలుగు గోడల మధ్య ఉండే ప్రపంచాన్ని జయించలగడు.

ఆ రోజులకీ ఈ రోజులకీ ఆర్టిస్టుల పారితోషకాలు ఎలా ఉన్నాయి?

(నవ్వుతూ) ఈ రోజుల్లో పారితోషకాల గురించి చెప్పాల్సి వస్తే – అసలు ముందు పత్రికలే లేవు – ఇలాంటి పరిస్థితుల్లో కూడా బాగా నడుస్తూ ఆర్థికంగా ఉచ్ఛస్థాయిలో ఉన్న పత్రికని నాకిచ్చే రెమ్యునరేషన్ పెంచమని అడిగితే వాళ్ళు నొచ్చుకున్నారు. ఉన్నవాళ్ళ కథ ఇలా ఉంటే, ఏమీ లేని వాళ్ళని అడిగితే మేం ఇంతకంటే ఇచ్చుకోలేం అని చెప్తారు. బ్రాహ్మడి చేత సత్యనారాయణ కథ చెప్పిస్తే ఒక ఫిక్స్‌డ్ రేట్ తీసుకుంటారు. మాకు రేట్స్ లేవు. తెలుగు పత్రికల్లో ఫ్రీలాన్స్ ఆర్టిస్టులుగా నెట్టుకువచ్చినవాళ్లు చాలా తక్కువమంది. చంద్ర కొంతకాలం చేశాడు గానీ, తర్వాత ఉద్యోగంలో జాయినయ్యాడు. బాలి కూడా ఆంధ్రజ్యోతిలో ఎంప్లాయిగా ఉన్నాడు. ఎక్కడా ఉద్యోగం చేయకుండా నెట్టుకొచ్చింది నేను, కరుణాకర్ మాత్రమే అనుకుంటాను. ఎందుకు చేయలేదూ అంటే – నాకు విపరీతమైన స్వేచ్ఛ పిచ్చి. చాలా ఓవర్ సెన్సిటివ్ కూడా. ఎవరికైనా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకోవాలంటే నా వల్ల కాదు. అందుకే విజయవాడలో ఉండగా నవోదయ రామ్మోహనరావు ‘ఆంధ్రజ్యోతి’లో చేరమంటే వద్దని చెప్పాను. అంతకుముందు ఫైనార్ట్స్ చేస్తుండగానే ‘ఈనాడు’లో అవకాశం వచ్చింది. రామోజీరావు గారు హైదరాబాదులో ఈనాడు ఎడిషన్ మొదలుపెడుతూ ఒక ఆర్టిస్ట్ కావాలంటే చలసాని ప్రసాద్ గారు నన్ను తీసికెళ్ళారు. జాయినయ్యేవాడ్నే. కానీ ఆయన “మా దాంట్లో చేరితే మీరు బయటెక్కడా బొమ్మ గీయటానికి వీల్లేదు” అన్నారు. ఆ షరతు నచ్చక వచ్చేశాను.

Gopi5

పత్రికా ప్రపంచంలో మీ బెస్ట్ వరస్ట్ ఎక్స్‌పీరియన్సులు చెప్పండి?

వరస్ట్ ఏమిటంటే – మనం లక్ష బొమ్మలు గీసినా ఒక్క బొమ్మ ఆలస్యం చేస్తే చాలా అన్‌పాపులర్ చేస్తారు. విజయవాడలో ఉన్నప్పుడు ‘అనామిక’ అనే పత్రికవాళ్లు కొన్ని కథలిచ్చి బొమ్మలు అడిగారు. కొన్ని అనారోగ్యకారణాల వల్లనూ, అలాగే ఏదో పెళ్ళికి ఊరు వెళ్లాల్సి రావటం చేత నేను వెంటనే ఇవ్వలేకపోయాను. అప్పటి నా కేరాఫ్ అడ్రస్ నవోదయ. అక్కడికి ఆ పత్రిక ఎడిటర్ వచ్చి చాలా గొడవ చేసింది. అది నా వరస్ట్ ఎక్స్‌పీరియన్స్.

బెస్ట్ అంటే – బాపు గారు నన్ను మెచ్చుకోవడం, ఆయన నోటి మాటగానో, ఇంటర్వ్యూల్లోనో, రాతల్లోనో నా పేరు ప్రస్తావించడం. “మీరు ఏది గీస్తే అది బొమ్మండీ, వెనక్కి తిరిగి చూసుకోవద్దు” అని ఎప్పుడో 77లోనే అన్నారు. అది నా లైఫ్ లో పెద్ద ఎఛీవ్మెంట్. ఏ యూనివర్శిటీలూ ఇవ్వని డిగ్రీ. రెండేళ్ళ క్రితం స్వాతిలో బొమ్మలు వేస్తున్నప్పుడు కూడా ఫోన్ చేసి “మీరు తెలుగు ఇల్లస్ట్రేషన్‍ని నెక్స్ట్ స్టేజికి తీసుకువెళ్లారు” అని మెచ్చుకున్నారు.

మీ సమకాలీనుల్లో మీరు కాంపిటిటివ్‌గా ఫీలైన ఆర్టిస్టులు ఎవరు?

కాంపిటిటివ్ కాదు, సరదాగా ఉండేది. ఒక పత్రికలో ఇద్దరు ముగ్గురు ఆర్టిస్టుల చేత వేయించేవారు. తెలియకుండానే ఒకరకమైన పోటీ ఉండేది. నేను విభిన్నంగా గీయటానికి ప్రయత్నించేవాడ్ని. ఊరికే స్పేస్ పూరించటానికి వేసేవాడ్ని కాదు. ఆర్టిస్టు కొంత అంతరాత్మ సాక్షిగా కూడా పని చేయాలి. కొంతమంది ఆర్టిస్టులు పేరొచ్చిన తర్వాత ఇక తమ బొమ్మ ఏ స్థాయిలో ఉన్నదీ చూసుకునేవారు కాదు.

ఇప్పుడు ఉన్న ఆర్టిస్టుల్లో మీకు నచ్చినవాళ్ళు?

అన్వర్ మంచి ఆర్టిస్టు.

వెస్ట్రన్ క్లాసికల్ ఆర్ట్, మోడ్రన్ ఆర్ట్ వీటిల్లో మీకేది నచ్చుతుంది?

యూరోపియన్ ఆర్టిస్టులు చాలామంది నచ్చుతారు. ముఖ్యంగా మైకెలాంజిలోని చాలా స్టడీ చేశాను. హ్యూమన్ ఫిగర్ డ్రాయింగ్‌ని ఆయన స్టడీ చేసినంత ఎవరూ చేయలేదనిపిస్తుంది. ఆ విషయంలో పెయింటింగయినా, శిల్పమైనా ఆయన మాస్టరు.

అలాగే చైనా ఆర్టిస్టుల వాటర్ కలర్ వర్క్స్, రేఖా చిత్రాలు చాలా నచ్చుతాయి. వాళ్ళు అద్భుతమైన ఆర్టిస్టులు. ఒకరూ ఇద్దరూ కాదు, వందలమంది ఉన్నారు. యూరోపియన్ ఆర్టిస్టుల కన్నా మంచి ఆర్టిస్టులు ఉన్నారు. కానీ ఎందుకో అంత పేరు రాలేదు. ‘చైనీస్ లిటరేచర్’ అని ఓ పత్రిక వచ్చేది. అది చూసి నేను చాలా నేర్చుకున్నాను.

ఇల్లస్ట్రేషన్ నుంచి ఇప్పుడు పెయింటింగ్‌ వైపు వెళ్తున్నా అన్నారు కదా. ఈ ట్రాన్సిషన్‌లో మీరు పడ్డ స్ట్రగుల్ చెప్తారా?

ఇల్లస్ట్రేషన్ వేరు, పెయింటింగ్ వేరు. నేను మొదట్లో అనుకునేవాడ్ని – ఏముంది ఇలా కూర్చుని అలా వేసేస్తామని. కానీ, పెయింటింగ్ అనేది మళ్ళీ మొదట్నుంచీ నేర్చుకోవాల్సిందే. సంగీతంలో అపశృతి ఎలాగైతే పలకకూడదో పెయింటింగ్‌లో కూడా అలాగే. చేస్తూ చేస్తూ ఉంటే ఒక ఏడాదిలోనే నేను ఏం తప్పులు చేస్తున్నానో తెలుసుకున్నాను. భరించలేక వాటన్నింటి డిస్ట్రాయ్ చేసేశాను. ఎంతో ఖర్చుపెట్టాను, మా కుటుంబం అంతా ఎంతో ఆసక్తితో ఎదురు చూశారు. ఒక్కసారిగా అలా పాడు చేసేసరికి వాళ్లూ అప్‍సెట్ అయిపోయారు. కానీ ఇలా చేస్తే పేరొస్తుందనో, ఆపదలో ఉన్నప్పుడు అమ్మేసుకోవచ్చనో, పేపర్లో మన ఫోటోలు పదే పదే చూసుకోవచ్చనో… అలా నాకిష్టం లేదు.

Untitled

రేఖ మీ బలం కదా, ఇప్పుడు పెయింటింగ్‌లోకి వెళ్తే దాన్ని వదిలేయాల్సి వస్తుందేమో?

పెయింటింగ్ లోనూ రేఖ ఉంది. ప్యూర్లీ లైన్ డ్రాయింగ్‌తో పెయింటింగ్‌లో మనం ఒక స్టయిల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాగే ఉండాలని రూల్స్ ఏవీ లేవు.

తెలంగాణా ఆర్టిస్టులు చాలామంది స్థానికతని థీమ్ గా తీసుకుంటున్నారు కదా. మీ థీమ్స్ ఏమిటి?

చాలా ఉన్నాయి. నా ఇమేజినేషన్ ఎలాంటిదంటే నేను ఒక రాత్రిలో ఒక సినిమా కథ తయారు చేయగలను. స్కోప్ ఎక్కువ నాకు. నా దగ్గర శాంతి మీద ఒక స్కీమ్ ఉంది, నెమలి మీద ఒక స్కీముంది, తెలంగాణ మీద ఒక స్కీముంది. నేను బతికినంత కాలం రోజుకో పెయింటింగ్ చేయటానికి సరిపడా సబ్జెక్టు నా దగ్గర రెడీగా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ప్రపంచమంతా బాధపడుతోంది శాంతి లేకే కదా. అందుకని దాని మీద చాలా వర్క్ చేద్దామని ఉంది. “గో-పీస్” అని పేరు కూడా పెట్టుకున్నాను, నా పేరు కూడా ధ్వనించేలా. అలాగే తెలంగాణలో పుట్టి పెరిగాను కాబట్టి దాని మీద కూడా చేయాల్సింది ఉంది. ఇప్పుడు సోకాల్డ్ తెలంగాణా ఆర్టిస్టులు చేస్తోంది నేను చూసిన తెలంగాణ కాదు. లక్ష్మాగౌడ్ మంచి ఆర్టిస్టు. ఆయనేదో ఆయన స్టైల్లో క్రియేట్ చేశాడు. కొంతవరకూ ఆయన్ని ఫాలో అవుతూ వైకుంఠం మంచి వర్క్ చేశాడు. మిగతా వచ్చే ఆర్టిస్టులందరూ వాళ్ళ మిక్చరే. ఇమిటేషనే గాని, ఒరిజినాలిటీ లేదు. వాళ్లు చేతి వేళ్ళు ఎట్లా వేస్తే వీళ్ళూ అట్లాగే వేయడం, వాళ్ళేదో చూపు వేస్తే వీళ్ళూ అదే వేయడం. వీళ్ళ వర్క్స్ లో ఎప్పుడూ ఒకటే కన్నూ ఒకటే దృష్టి. అలాంటివి నేను ఇష్టపడను.

తెలంగాణ ఏర్పాటుతో పాటు సంస్కృతి కూడా విభజన జరుగుతోంది. దానికి మీరేమంటారు?

ఈ మధ్య ఇలా తెలంగాణ ఆర్టిస్టులూ, ఆంధ్రా ఆర్టిస్టులూ అంటూ విడిగా మాట్లాడుతున్నారు. అంత చైల్డిష్ గా ఉండకూడదు. కళలో రాజకీయాలు తీసుకురాకూడదు. ప్రపంచమే చిన్నదైపోయినపుడు ఇంకా తెలంగాణ ఆర్టిస్టు, ఆంధ్రా ఆర్టిస్టూ ఏమిటి?

ఈ మధ్య నిర్వహించిన ‘ఆర్ట్ తెలంగాణ’ కార్యక్రమంలో స్థానం లభించకపోవటం పట్ల నిరసన తెలియజేసినవారిలో మీరూ ఉన్నారు. దాని గురించి చెప్తారా?

కొంతమంది ఈర్ష్యా ద్వేషాలకి అదొక ఉదాహరణ. నలభై ఏళ్ళ నుంచి పత్రికల్లో బొమ్మలు గీస్తుంటే నన్ను పక్కనపెట్టారు. ఇల్లస్ట్రేషన్ ఆర్ట్ కాదా? వాళ్ళు ఇంకో రీజన్ కూడా చెప్పారు – నేను ఒక్క షో కూడ చేయలేదని. అంటే షో చేస్తేనే ఆర్టిస్టా? పత్రికల్లో బొమ్మలు షో చేయటం కాదా? మీరు గాలరీలో నిర్వహించే షో ఎంతమంది చూస్తారు, మేం పత్రికల్లో వేసేది ఎంతమంది చూస్తారు? వీళ్ళందరికీ ఇల్లస్ట్రేటర్స్ అంటే భయం. వాళ్ళకి వచ్చేది ఒకే బొమ్మ. మేం రచయిత ఏ ఎక్స్‌ప్రెషన్‌తో రాస్తే ఆ ఎక్స్‌ప్రెషన్‌తో రోజుకి ఎన్నో బొమ్మలు గీయాలి.

‘ఆర్ట్ ఎట్ తెలంగాణ’ కార్యక్రమ నిర్వాహకుల్లో బి. నర్సింగరావు గారు ఒకరు. ఆయనకు నా పేరు గుర్తు రాలేదట! ఆయన తీసిన మూడో నాలుగో సినిమాలున్నాయి. వాటికి నా చేత పని చేయించుకున్నారు. అయినా నేను గుర్తుకు రాలేదంటే అదంత విలువలేని పనా?

పెయింటింగ్స్‌కు పలుకుతున్న ధరల్ని ఎలా చూడాలి? అది ఇంపోజ్డ్ వాల్యూనా, లేక నిజంగా అంత విలువుంటుందా?

నేను ఆశించేది ఒకటే – ఆర్టిస్ట్ పేరును చూసి విలువ ఉండకూడదు. వర్కును చూసి విలువ ఉండాలి. రియలెస్టేట్ కాదు పెయింటింగ్ అంటే. కానీ ఇదొక మాయాప్రపంచంలాగా తయారైంది. ఇప్పుడు చాలామందికి జెన్యూన్‌గా వచ్చిన పేరు కాదు. పైరవీలు చేసి పేరును బూస్టప్ చేసుకుంటున్నారు.

gopiatstudioడబ్బు కన్నా ఆర్ట్ జీవితాన్ని వెలిగిస్తుంది లాంటి మాటలకు మీరేమంటారు?

ప్రస్తుత ప్రపంచంలో డబ్బుకి చాలా శక్తి ఉంది. దోపిడీలు చేసి సంపాయించాల్సిన పని లేదు గానీ, జీవితంలో ఏ అడుగు వేయాలన్న కనీస సంపాదన ఉండాలి కదా.

మీలా ఆర్టిస్ట్ అవుదామని నగరానికి వచ్చేవాళ్ళకి ఏం చెప్తారు?

నేనేం చెప్తాను… ఆ రోజులు వేరు, ఆ కతలు వేరు. మేం అంతా భ్రమలో, శూన్యంలో, ఆకల్లో బతికాం. మా అంత మూర్ఖంగా తెలివితక్కువగా ఇప్పుడెవరూ లేరు. పరిస్థితి వెంటనే గ్రహించి వెనక్కో, లేక వేరే మార్గంలోకో వెళ్ళిపోతారు.

ముందు ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు?

ఇప్పటికీ ఎప్పటికీ నాకున్న కాన్ఫిడెన్స్ ఏమిటంటే – నా వర్కే నన్ను కాపాడుతుంది. నేను చేయాల్సినంత వర్క్ చేయలేదు. అది నా లోపమే. ఆ ఓటమిని ఒప్పుకుంటాను. కానీ దానికి వేరే వ్యక్తిగత కారణాలున్నాయి. వాటిని బయటి ప్రపంచానికి ఎప్పుడూ చెప్పుకోలేదు. ఇంతకాలానికి భగవంతుడు నాకో ప్రశాంతత కల్పించాడు. ఇప్పుడు నాది 63 ఏళ్ళ వయసు. సమయం చాలా తక్కువ వుంది. అందుకే పెయింటింగ్ తప్ప వేరే దేనికీ సమయం కేటాయించలేను. పోయే లోపు కొన్ని మంచి పెయింటింగ్స్ గీయాలని ఉంది. వీలైనన్ని షోలు చేయాలని ఉంది. ఆరోగ్యం ఎంత సహకరిస్తుందో కూడా చూడాలి.

*

Download PDF  EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి.
Title background texture :  www.flickr.com/photos/neighya/8219277333
Posted in 2015, ఇంటర్వ్యూ, ఏప్రిల్ and tagged , , , , , , , , , , , .

2 Comments

  1. Pingback: వీక్షణం-133 | పుస్తకం

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.