coverwtht

వీరో వోండా

Download PDF EPUB MOBI

మిట్టూళ్లో ఆడోళ్లు దేశమ్మ యింటికి రావాటంగా, పోవాటంగా వుండారు. యీ రామందాడిని చూస్తా వుంటే మొగుడి మొకాన కేకరించి ఎంగిలూంచాలనిపిస్తా వుండాది దేశమ్మకు. వొస్తాపోతా వుండే ఆడోళ్లు మాత్రం అనాల్సిందేదో అనేసి, దేశమ్మ మొకాన్నే కారిమూంచేసి పోతుండారు. వాటికేమి? బాగ బతకతా వుంటే చూళ్లేక రెండు కండ్లూ మూసుకుంటాయిగానీ, ఎవ్వారం చెడిపోతా వుంటే టీవీ సీరీళ్లు చూసేది గూడా మానుకునేసి యింటి చుట్టూ కటవలు కట్టేసి నిలబడిపోరా! అట్టగాక పోతే, వొంటి మింద ఆరు మూర కోక కట్టే వొక ఆడది, ‘‘దేశమ్మా, నీకు కడంతగాలంలో మంచి కాలం రాదు. వుడిగి పొయ్‌న ఆ మొగోణ్ణి పట్టుకోని గుంటకు గుక్కడు నీళ్లు తాపించేదేమిటికి? తెల్ల నాయుడంటే వాళ్లూళ్లో ఎట్ట బతికినోడు! యిట్టుండే పుల్ల అట్టెయ్యకుండా సేద్యగాళ్లను పెట్టుకోని సేద్యం చెయ్యించినోడు! ఏడేండ్ల కరువులో గూడా వాళ్లమ్మ పులిపొంగరాలు తినిపించి సాకిందంట అబ్బనాకారంగా. నీ మొగుడికి ‘పులిపొంగరాలాయన’ అని యీ పాయకట్టులోనే పేరు. కాలంగాక యీ పొద్దు నీ అమ్మగారింటికి, నీ పంచకి వొచ్చి చేరుకున్నాడని అంత కేవిలంగా చూడబాక. బతుకు మింద రోశిపొయ్‌ యీ పొద్దు గుళికల మొందు తాగేసి చద్దామనుకున్నాడంటే నువ్వెంత పోరు బెట్టినట్టు? ఆయన కోరింది కోరినట్టు చేసిపెట్టు.’’ అని యీ వాటంతో దేశమ్మను పట్టుకోని కానీగాని మాటలు మాట్లాడునా! ఆ ఆడదాని వొంటి మింద ఆరుమూర కోక వుండేది నిజమే అయితే, అదే ఆడది, ఆ పులిపొంగరాల మొగుణ్ణి బట్టుకోని, ‘‘ఏం పులిపొంగరాలాయనా! ఆవజీవాలన్నీ అణిగి పొయ్‌నాక కుదురుగా వుండలేవా, యింగన్నా! యిట్టుండే పుల్ల అట్టెయ్యకుండా, నాలుగు నైనాపైసాలు యెనకేస్కోకుండానే ఎల్లకాలం బతికినావు. యింకన్నా మంచి దోవలోకి రాయేమి? ఆ ఆడది ఆవు గొడ్లను మేపి గదా నిన్ను సాకతా వుండేది! ఆవుగొడ్లల్లో వొకావు గొడ్డుగా నీకు అరువులరువులుగా చేసి పెట్టి మేపతా వుండాదే! దాని మానాన్ని మూడు మూణ్ణాళ్లకూ యీ మాదిర్తో మాకులకు కట్టేస్తా వుంటావా? అది కష్టిపడి కష్టిపడి కండకీ ఎనిక్కీ సమందం లేకుండా బీకిబీకిగా అయిపొయ్యిందే! దాని కండ్ల నీళ్లు దేనికని దప్పిక తాగతుండావు?’’ అని అడగలేదా! దేనికడగతాది! కత పక్కం తప్పిపోతే అందరికీ యినోదం, దాని వాటాన అది జరగతా వుంటే, అగ్గో యీ యినోదం అంతా యాడ నుంచొస్తాది! యీ రామందాడి కొంచిం అణిగింది. అడ్డాపింటి ముందరుండే తిన్ని మింద నుంచి లేచి యింట్లేకల్లా తొంగి చూసింది – పులిపొంగరాలాయన యెల్లాలకల పొనుకోని, ముసిముసి నవ్వులు నవ్వుకుంటా వుండాడు, ‘చూసినావా, నిన్ను ఏ వాటంతో ముడ్డి కింద యేసుకున్నానో! నోరు లేవనీబాక’ అన్నట్టుగా.

పులిపొంగరాలాయన యిందాకా చేసిన పని సన్నదేమీ గాదు. పెద్ద గన కార్నిమే చేసినాడు. పెళ్లాం ఆవుల్ని తోలుకోని మడికాడికి అట్ట పోంగానే, యీ మనిసి మొన్నా మద్దె తిరప్తికి పొయ్‌నప్పుడు తెచ్చుకున్నాడో ఏమో గానీ, పిడికిడంటే పిడికిడు గుళికల్ని కాతికంలో చుట్టజుట్టి, పై జేబీలో పెట్టుకోని, యింట్లో యెతుకులాడి వొక డబ్బీలో నూర్రూపాయల కాతికం పడుంటే, దాన్నెత్తుకోని నేరుగా రామచంద్రాపరం పొయ్‌ వొక కోట్రు చీపు తీస్కోని వొళ్లో దోపుకున్నాడంట. బ్రాందీ షాపాయన గూడా యిచిత్రపొయ్‌, ‘‘ఏంది పులిపొంగరాలాయనా! నువ్వు చీపుకొచ్చినావేంది? చుట్టమే మన్నా యింటికొచ్చినాడా? ఏంది కత? మనూళ్లో తాగంది నువ్వొక్కడే అనుకుంటా వుంటే’’ అనేసి గూడా అంటే, ‘‘బూమ్మిందనే అన్నీ అనుబోగించెయ్యాల వాయ్‌. పైకి పోతాపోతా ఎత్తుకోని పొయ్యేదేమీ లేదు వాయ్‌. గుంతలో యేసి పూడ్చేప్పుడు వొంటి మింద నడుంకుండే మొల్తాడును గూడా కోసేసే పూడ్చేస్తారు వాయ్‌. కోటీస్పరుణ్ణీ తినేది ఆ మట్టే. బికారోణ్ణీ తినేది ఆ మట్టే! అట్టాంటి మట్టి మిందా, ఆ మట్టుండే కయ్యాగాలవ మిందా పిలుపు రాంగానే బ్రమత వొదిలెయ్యాల వాయ్‌. తిన్నామా, తాగినామా, తలకు పోసుకున్నామా, పైకి పోతా వున్నామా!’’ అని చెళ్లమాటలు గూడా మాట్లాడేసి వొచ్చినాడంట. చావుమింద గుష్టి పెట్టుకున్నోడు అట్టాంటి తులవ మాటలా మాట్లాడతాడు! ఆ మాదిరిగా మాట్లాడేసి, రెండు మిక్సిరి పొట్లాలు కొనుక్కోని నేరుగా వూళ్లోకొచ్చి రచ్చమింద చేరినాడంట. చేరి, బొడ్లో వుండే చీపును పైకి తీసి పక్కన పెట్టుకున్నాడంట. జేబులో వుండే గుళికల్ని అరిచేతిలో పోస్కోని, వొక ప్లాస్టీకు గలాసులో బ్రాందీ కొంచిం పోసి, వాటర్‌ పేకెటు చించి బ్రాందీలో కలుపుకున్నాడంట. యింత రంగం వూళ్లో నడీదిలో రచ్చ మింద! ఇక్కనా పక్కనా చూసినోళ్లు ‘ఏందబ్బా పులిపొంగరాలాయన యింత పబ్బిలిగ్గా ఎప్పుడూ లేంది మొందు తాగతుండాడు. ఏందీకతా’ అని రచ్చకల్లా వొచ్చిచూస్తే చేతిలో గుళికలు! అంతే, పులిపొంగరాలాయన చేతిలో వుండే గుళికల్ని ఎగరజల్లేసి, ‘‘యింటికి పదపద’’ అని, ఎట్టా తాగడు గదాని ఆ బ్రాందీ సీసా పెరుక్కోని యింటికి పంపించబోతే, తీసిన మానం చాలు అని అప్పుడన్నా తల గీరుకుంటా యింటికొచ్చేసుంటే పోనీలే వగలేనోడు అని సరిపెట్టుకో నుండొచ్చు. అప్పుటికప్పుడు రచ్చకాడికి వుడ్డజనం చేరిపోతే ఆ జెనంతో మీటంగి బెట్నాడు. ‘‘నన్ను చూసే వోళ్లు ఎవురూ లేరు ఎక్కడా లేరు. యీ మానం చెడ్డ బతుకు నేను బతకలేను. మంచి మద్యానం బతికినా గవరంగా బతికినోళ్లం మేము. నా కొకరకిద్దురు కూతుళ్లుంటే వాళ్లూ నీ మంచేమి సెడ్డేమి అనడగతా లేరు. పెళ్లాం – నేను నోటి మాటెత్తితే చాలు నా మూతి పొడిచే దానికి మళ్లుకొనింది. ఈ వోరింపులు నేను పళ్లేను. వూదు బుర్రెత్తుకోని మొన్నొక రోజు పసిబిడ్డిని కొట్టినట్టు కొట్టింది గూడా. నేనేమీ మణులూ మాణిక్యాలు అడగలా. వొక నూర్రూపాయిలిస్తే వొక్క ముక్కాలు కేజీ బాయిలేరు కోడి కూర తెస్తాను. చేసి నా గిన్నెలో అంత కొట్టు అని అడిగిందానికే మానం తప్పిన మాటలన్నీ మాట్లాడింది. అయన్నీ చెప్పుకుంటే నా మానమే పొయ్యేది! ‘అదోరం ఆదోరం అరకేజీ తెచ్చి నోట్లో అంతేసుకోకుండా నీ గుంతమిందనే కొడతుండాను గదా, మంచి బేస్తవారం పూట నేనింట్లో నీసు చెయ్యాప’ ననేసింది. నాకు సుగరు గదా. చీటికి మాటికి నోరు పురపురా అంటా వుంటే ఏమి తిందామా అనిపిస్తుంటాది. అన్ని శెనిగ్గింజలు నోట్లో యేస్కోని, అంత చక్కిరి నోట్లో పోసుకుందారంటే వాటిని గూడా బీరవాలో పెట్టేసి బీగమేసేసింది. యింకొన్ని రోజులుంటే నా నోటికి గూడా బీగమేసేటట్టుండాద’’ని యినరాని మాటలన్నీ మాట్లాడినాడంట. ‘‘యీ పొద్దు చస్తే రేపుటికి రెండు. దేనికీ జల్మం? రచ్చమింద, పబ్బిలిగ్గా గుళికల మొందు తాగి చస్తే పేపర్లో పడిపోవాల. వూరూనాడూ దాని మొకాన, దాని కూతుండ్ల మొకాన వూంచాల. నేనీ పొద్దు గాకుంటే రేపైనా చచ్చేది నిజ్జం, బతికేది అపద్దం. అప్పుడు గూడా రామచంద్రాపరం విలేకరి ‘పంటలు పండక రైతు ఆత్మహత్య’ అని గాని రాసినాడంటే మెట్టుతీసి కొట్టండి మీరందురూ గూడా. పెళ్లామూ బిడ్డలూ చూడక ఆత్మహత్య అని రాయమనండి ఆ నా కొడుకుని’’ – నేరుగా యింటికి రాకుండా యింత నాణ్యాన్ని రచ్చమింద నడిపించేసి ఎరగనోచ్‌ అంటా ముసిముసి నవ్వులు నవ్వుకుంటా యిల్లు జేరుకోని యెల్లాలకల పొనుకోని, అంత గతకదామని పైకి లెయ్యకుండా నిగుడు చూపిస్తా వుండాడిప్పుడు.

జరిగినాటివన్నీ తల్చుకుంటా వుంటే యిప్పుటికిప్పుడు పొయ్‌ నీళ్లు లేని బాయిలో దూకేసి చద్దామన్నంత రోత పుడతా వుండాది దేశమ్మకు. ముడ్డి కిందేసుకుందామని యీ బుడ్డ బెదిలింపులు! నోరెత్తనీకుండా చెయ్యాలని యీ మాదిరిగా అగుమానం చేస్తుండాడు. అసలు బతికినంత కాలం యిట్టనే మూడు మొకాలు తెలవకుండా, వూళ్లోవోళ్లను నవ్విపిస్తానే బతికినాడు. ఆ ముండ మొకం వాడి ఎదాన పడినాకనే రుజువైంది దేశమ్మ. అసలు దేశమ్మకి అయినోడూ పొయ్‌నోడూ గూడా గాదు పులిపొంగరాలాయన. దేశమ్మ అమ్మగారూరు యీ మిట్టూరే. పులిపొంగరాలాయనది సొరకాయల పాళెం. మిట్టూళ్లో వోళ్ల మేనత్తను యిచ్చినారు గానీ దేశమ్మకైతే బందుగుడు కాదు. యాడ బడినోడో! నారాయణుడు మెచ్చే నలుపు దేశమ్మది. యెన్నెల మాదిరిగా తెల్లంగా వుండడంతో ‘తెల్ల నాయుడు’ అని వాళ్లమ్మే పేరు పెట్టిందంట పులిపొంగరా లాయనకి. పుట్టిన నచ్చిత్రం పకారమైతే రాజమాణిక్యం నాయుడు. ఆ మాట ఆ వూళ్లో గూడా అనరు. పాండురోగం పట్టినట్టుంటే, వాళ్లమ్మ ‘నా కొడుకు తెల్ల నాయుడు గదా. అది పాండు రోగం గాదు, నాణ్యం’ అనేసి అనిందంట. అయితే ఆ పేరూ నిలబళ్లేదు. యెంగటాపరం అయిస్కూల్లో ఎనిమిద్దాకా చిదిగినాడంట గూడా. యిస్కూలు రిజిస్టర్లో గూడా తెల్ల నాయుడనే రాయించిందంట వాళ్ళమ్మ. అయితే పులిపొంగరాలు పెట్టి సాకడంతో ఆ పేరే వొచ్చేసింది. అల్లుడి నాణ్ణెం జూసి సమందం వొచ్చీరాంగానే వొప్పుకునేసింది వొక్కగానొక్క కూతురు గల్ల దేశమ్మోళ్ల అమ్మ. వొట్టి నాణ్ణేన్నే గాదు ఆస్తిని గూడా చూసింది. ఆ యిలాకాలో ఎనిమిదెకరాలు వున్నోళ్లు గూడా యేళ్ల మిందనే. అంత సేద్యంలో, కాపరంలో మన కూతురు పడిపోతే అదే పది వరాలనుకు నేసింది అమ్మ. రుజువు గాకనే దేశమ్మతో, ‘‘అమ్మే, సొరకాయల పాళెంలో తెల్ల నాయుణ్ణి చూసినా. మంచి ఆస్తి, యింటికి పెద్ద కొడుకు. నిన్ను గూడా వాళ్ల నాయిన చూసినాడు. ‘సద్దీ సంగటి ఆ బిడ్డి చేత్తో పెడితే నేను తినాల’ అని మీ మామ గూడా ఆశి పడతుండాడు’’ అనేసి అనింది వాళ్లమ్మ. వాళ్లమ్మను యెగటాయించి పొయ్యేదేమీ లేదు గదా. ఏమీ తెలవని ఎర్రికాలం. తెల్ల నాయుడంటే తెల్లా. కడాకు ‘పులిపొంగరా లోడు’ అనంటే కతక్కన అనేసింది దేశమ్మ గూడా, ‘‘పులిపొంగరాలాయన్నైతే నేనెందుకు చేసుకోనా!’’ అనేసి. దేనికంటే మిట్టూళ్లో రొండుమూడు యావతులూ పులిపొంగరాలోడు పోయినంత దూరమూ నిలబడుకోని చూసింది. పెండ్లి పత్రికలో ఎడం పక్క దేశమ్మ అనీ, కుడిపక్క వాళ్ల నాయిన పెట్టిన పేరు రాజమాణిక్యం నాయుడు అనీ ముద్ర కొట్టించినారు. రాజమాణిక్యం నాయుడెవురని వాళ్లూళ్లో గూడా అడగతారన్జెప్పి బ్రాకెట్లో ‘పులిపొంగరాలు’ అని గూడా ముద్ర కొట్టించినాడు పట్టుబట్టి పులిపొంగరాల మనిసి. ఆ మనిసికి నవ్వుకుంటారని గూడా తెలవదేమో! అప్పుడు బ్రాకెట్లో ‘పులిపొంగరాల’ పేరును జూసి ‘మ్మరి, అది వెయ్యకపోతే ఎట్ట’ అని దేశమ్మగూడా అనుకొనిందే గాని సిగ్గుదోచలా. యిప్పుడు యిన్నేండ్లకు, పెండ్లయిన యాపై య్యేండ్లకు ‘ఎర్రికాలం గాబట్టి సరిపాయ’ అనిపిస్తా వుండాది గానీ, పత్రికలో ‘పులిపొంగరాలు’ చూసి మతింపు పెరిగిపొయ్‌నట్టుగా గూడా అప్పుడనిపించింది. ‘మంచి సమందం, మంచి సమందం’ అనే మునాశలో పడి అమ్మగూడా మంచీ చెడ్డా మరిచిపొయ్యింది. ‘‘మీ రెండెకరాల కయ్య మాకేల? మాకే యీడ దొబ్బుమాలిన ఆస్తి వుండాది. పిలగోడు బాగుండడంతో పోలీసుజ్జోగమొచ్చినా మేము అంపించలా. ఎనిమిదెకరాల సేద్దిం. మా కిందనే ముగ్గురు సేద్దిగాళ్లు. మా కొడుకు వుజ్జోగంలో జేరి గవుర్మెట్టుకు సేద్యం జెయ్యాల్నా? పెండ్లి గూడా మేమే చేసుకుంటాము. ఆ బూమి అమ్మేసి ఆ దుడ్డు మాకిచ్చేసి నువ్వు గూడా మా యింటికే వొచ్చి కూతుర్నీ, అల్లుణ్ణీ కాపెట్టుకోని వుండు. నా కొడుకు ‘రాజ్‌దూతు’ కావాలంటూ వుండాడు. పెండ్లికి అదే కట్నం. ఉగాది సాంగిం గూడా మాకొద్దు.’’ అని పులిపొంగరాల వాళ్ల నాయన దేశమ్మ వాళ్లమ్మతో యిలావరిగా చెప్పేసినాడు. ఎకరా నేలను పదివేలకు అమ్మేసి వాళ్ల చేతల్లో పెట్టేసింది ఆ పదివేలు గూడా. పెండ్లికంతా యింటి ముందర రాజ్‌దూత్‌ బండి నిలపెట్టేసి వుంటే వూళ్లో పిలకాయలంతా దాని ముందర యీగిలు మాదిర్తో గిజగిజ అంటా వున్నారు! ‘ఆ బండి యీయనెక్కతాడా, ఆయనెనకాన మనమెక్కి తిరప్తికి పొయ్‌ సిన్మా చూస్తామా’ అని యిచిత్రపొయ్యింది దేశమ్మ గూడా. యీ వరిపైర్ల నడమనా, యీ శెనిగిచెట్ల నడమనా, యీ చెరుకుదోటల నడమనా యీయన ఎప్పుడు నేర్చుకొనుండును రాజ్‌దూత్‌ తోలేది! ఎద్దలబండి తోలినట్టుగాదే! రాజ్‌దూత్తంటే మాటలా – అని బలే కుశాలైపొయ్యింది దేశమ్మకు గూడా. పెండ్లయిన కొత్తల్లో వొకటీ అరగా తిరిగే ఎ.పి.ఎమ్‌. ఎస్పీమ్‌ ప్రైవేటు బస్సుల మద్దెలో సొరకాయిలపాళెం నుంచి గుల్లరోడ్డు మింద బండికి పంచిరీ గాకుండా మొగుడు నడపతా వుంటే, మొగుడెనకాన రాజ్‌దూతెక్కి టెంకాయిలోడి కొటాయిలో సిన్మా చూసేసొస్తా వుంటే – బండి మింద ఆ మొగుడూ పెళ్లాన్నీ చూసినోళ్లంతా కుళ్లి చస్తావుంటే దేశమ్మ కులికి చస్తా వుండేది. మొగుడు నిద్దర్లేచి వొక పనైతే చేసేవోడు. యింట్లో గొడ్లకొట్టంలో ఏడెనిమిది ఎనుములు వుండేటివి. వాటిని విప్పి చద్దిగింజేళకంతా వాటిని రెడ్డిగుంట దాకా తోలుకోని పొయ్‌ తోలుకోనొచ్చేవోడు. అదీ వొట్టి చేతల్తో కానగ సులగనొకదాన్ని చేతిలో పెట్టుకోని గాదు! చెవలకాడ వొక ట్రాన్సిస్టరును పెట్టుకోని ఆ పాటలూ యీ పాటలూ యింటా. పులిపొంగరాలాయనంత సుకుమారంగా ఏమీ పెరగలేదు దేశమ్మ మాత్రం. ఆ లేత రెక్కల్తోనే ఎంతో కష్టపడింది. ముప్పై నలపై మంది మొగోళ్లు మడికాడ వరికోతలు కోస్తా వుంటే డెబ్బై ఎనపై ముద్దల సంగటి కెలికి, సంగటి పలక మింద ముద్దలు చేసి కండ్లల్లోకి నెత్తురు దిగతా వుంటే ఆ సంగటి గంపను నెత్తిన బెట్టుకోని పొయ్యేది గెనాల మింద పడతా లేస్తా. మడికాడికి సంగటీ సద్దీ మోస్తా దేశమ్మా, గొడ్ల కొట్టం నుంచి చెరువుకాడికి గొడ్లను తోలకపోతా పులిపొంగరాలాయనా – యిట్ట వుండంగానే ఎప్పుడు దేశమ్మ పెద్ద మనిసైందో, ఎప్పుడు యిద్దురు బిడ్ల తల్లయ్యిందో అయి పొయ్యింది. ఎద్దు కొమ్ములు మాదిర్తో యిద్దురాడపిలకాయలు. యీ పిలకాయలు యెంగటాపరం అయిస్కూల్లో పదికొచ్చే లోపల్నే ఆ నలుగురందమ్ముళ్లూ పెండ్లిండ్లు చేసుకోవాటం, బిడ్డా పాపా ఏర్పడాటం, యేర్లు పోవాటం, పారీకత్తులు రాసుకోవాటం అన్నీ జరిగిపొయ్‌నాయి. ఎనిమిదెకరాల దేశమ్మా, పులిపొంగరాలాయనా పంచుకునే కొందికి రెండెకరాల వాళ్లయి పొయ్‌నారు. సేద్దిగాళ్లతో పాటు, రిపేర్లకు వోర్చుకోలేక రాజ్‌దూత్‌ను గూడా వొగటి సగంగా అమ్మెయ్యంగా అదీ పొయ్యింది. అప్పుడు కొంచెం కొంచంగా సేద్యానికి వొంగడం మొదులు బెట్టినాడు పులిపొంగరాలాయన. అదీ ఏం వొంగాటం లే. అగుమూడు సేద్యం, రాతి మింద సేద్యం. అయినా ఎనుముల పాలమ్మీ, కూలీనాలీ పెట్టకుండా దేశమ్మే గూడా సేద్యం చెయ్యబట్టీ పదివేల దాకా సంపారిచ్చుకునే కాడికి శోసొచ్చేసింది. పెండ్లయినప్పుడు పది సవరాల బంగారు పెట్టింది దేశమ్మ వాళ్లమ్మ. ఆ పది సవరాలూ చేతిలో వుండిన ఆ పది వేలనూ పెట్టి పెద్దపాపకు పెండ్లి జరిపించి పంపించినారు. మళ్ల రొండేండ్లకే చిన్న పాపకేమో పెండ్లి పెట్టుకున్నారు గానీ చేతిలో దమ్మిడీ లేదు. మనకేం మగబిడ్లు లేదు గదా. ఆడపిలకాయల్ని తరిమేస్తాం గదా. ఇంక మనకేమి? అన్నట్టుగా బతికినాడు పులిపొంగరాలాయన. రెండెకరాల్నీ ముప్పై వేలకు అమ్మేసి రెండో పాపకు గూడా పెండ్లి చేసి పంపించేసినాడు. ‘బూమిని కాళీ చెయ్యద్దు రా పాపిష్టోడా’ అంటే దేశమ్మ మాటల్ని చెవల్లో యేసుకున్నాడా? కూతుళ్లకిద్దురికీ పెండ్లయిన నాటికి దేశమ్మకు గూడా ముప్పై అయిదేండ్లకు మించుండవు. అప్పుట్లో మొగుడితో వొగిటి మాట్లాడితే తక్కవగా, రెండు మాట్లాడితే ఎక్కవగా వుండేది. ఆయనకెతిరేకంగా ఏదన్నా మాట్లాడితే చేతిలో ఏది వుంటే అది మొకాన యిసిరేసేవోడు. బైసాట్లకు వోర్చుకోని పులిపొంగరా లాయన దోవలోకే వచ్చేసింది దేశమ్మ గూడా. కాపరంగా, సేద్యంగా వుండిన దేశమ్మకు సొరకాయల పాళెంలో రెండావు గొడ్లను తిప్పులాడదామన్నా చిన్న పాది గూడా లేక పొయ్యేసరికి ఆ వూళ్లో వనవాసరం చెయ్యాలనిపించలా. అమ్మను చూపెట్టుకోని ఆ ఎకరా కయ్యలో కసువు మొక్కలో పాడో నాటుకొని కాపరాన్ని ఎలనీదుకోవచ్చనిపించి వొక ఎద్దల బండిలో చట్టీకుండా యేస్కోని మిట్టూరు చేరి యిరై అయిదేండ్లుగా ఆ సుగరొచ్చిన మొగోణ్ణి సాకతా – యీ మిట్టూళ్లోనే పడుండాది దేశమ్మ.

అత్త గారూరులో ఎంత గవరంగా బతకాల. మనం బతికే చడి వొకరికి తెలవచ్చునా! అగో, యిదీ పులిపొంగరాలాయన బతికే యిదాయికం. రాజదూత్‌ పొయ్‌నాక సైకిలొక దాన్ని పట్టుకున్నాడు. మడి కాణ్ణుంచి సైకిల్లో జొన్న చొప్పనూ, కసువు మొక్కల్నీ కట్టగా పెట్టుకోని సైకిలు మింద తెచ్చే పని మాత్రం చేసేవోడు. వొంగి కసువు మొక్కను గూడా కొడమల్తో కోసే వోడు గాదు. అంత వొళ్లు బొలువు. యింగ సుగరెక్కి పోతిందంటే ఎక్కి పోదా! అస్సలు నోరు కట్టుకోడు. ఎప్పుడూ బొక్కలాడే పనే. రెండావు గొడ్లనే గాక హెరిటేజ్‌ పాలఫ్యాక్టరీ వోళ్లకు పాలు గూడా పడతాది దేశమ్మ. ఆ రకంగా గూడా నెలకు రెండు వేలు సంపారిస్తాది. ముసిలోళ్లకిద్దరికీ గూడా పించినీ వస్తాది. గవుర్మెంటు నుంచి ఒక వెయ్యా పులిపొంగరాలాయనకీ, రాయలసీమ సేవా సమితి నుంచి వొక వెయ్యా దేశమ్మకీ వస్తాది. యీ పాల రూకా, యీ పించినీ డబ్బు గూడా ఆ మనిసి యెదాన్నే యేసేస్తాది దేశమ్మ. అయినా ఆమె మానాన్ని తీసి అగో యీ వాటంతో మాకలకు కట్టేస్తానే వుంటాడు. యీ రోజు తెల్లారనంగా యింట్లో పెళ్లాంతో మద్దిస్తం పెట్టుకున్నాడు. ఏమైనా గూడా యిప్పుడు రశి లేకుండా పొయ్యేకాడికి పులిపొంగరాలాయనకు కొంచిం కొంచింగా నోరణిగి పొయ్యింది పెళ్లాం తావన. యిప్పుడు చేతిలో ఏమి వుంటే అది యిసిరేసే కాడికి దేశమ్మ వొచ్చింది! దేనికి రాదు! తెల్లారి జరిగిందే చూడండేమి! తెల్లారి వుప్పుడు బియ్యం చద్ది కూటిని గతకతా గతకతా, గమ్మనుండకుండా పెళ్లాన్ని నసకు గీరీ, గిల్లి పెట్టీ, ‘‘బిడ్లు బిడ్లు అంటా రూపాయికి రూపాయి ముడేస్తా కుచ్చున్నావు. ఏమి బిడ్లు! పెద్ద పాప కూతురూ, కొడుకూ యిద్దురూ గూడా అమెరికాలో వుండారు. మనవడన్నా చదూకుంటుండాడు, నీ మనవరాలు నెలబెట్టీకొందికి మన డబ్బు లెక్కన నాలుగు లచ్చిలు తీస్తిందంటనే! ఏ పొద్దయినా నీ సెల్లుకు గానీ, నా సెల్లుకు గానీ ఫోను జేసి ‘ఏమి అవ్వా, ఏమి తాతా! మీ మంచేమి సెడ్డేమి, తింటా వుండారా, తాగతా వుండారా? ఆ ఆవుగొడ్ల ముడ్లెనకాన యింగా దేనికి తిరగతా వుంటారు? అగో యీ పది వేలు పంపిస్తుండా, మీ చేతలల్లో పెట్టుకోని కోరింది తినండి’ అని అనిందా నీ మనవరాలు?’’ అని ఏది బడితే అది మాట్లాడే దానికి పెట్టుకున్నాడు. అంతే, చేతిలో కొడమలుంటే మొకాన యిసిరేసింది. సిగ్గా, మానమా? పైన బడిన కొడమలిని తీసి కడగా పెట్టి, చద్ది తాగింది తాగినట్టే వుండాడు. పులిపొంగరాలాయన మాటలకి దేశమ్మకు వొళ్లు పొగలు బొయ్‌ వుచ్చిన యెంటిక చివక్కన పైకి లేచింది. ‘‘వొరె కర్ముడా, నోరు తెరిచి మాట్లాడతా గూడా వుండావే! నువ్వు తాగేది చద్దా! తూతూ, మానం చెడ్డ మొగోడా! నువ్వు నా పెద్ద కూతురికి ఏమి చేసి అలిసిపొయ్‌నావు? పది వేలకూ, పది సవరాలకూ నా కూతురి నాణ్ణేన్ని జూసి ఎవుడన్నా బొట్టుకడతాడా, వుజ్జోగస్తుడుగా వుండీ. నా అల్లుడు కట్టినాడు. పియ్యిదినో పిడకలేరో నా కూతురూ నా యల్లుడూ నన్నే పొద్దే గానీ దేహీ అని చెయ్యి జాపకుండా పిలకాయల్ని చదివిచ్చుకున్నారు. నా మనవరాలు మద్రాసుకు బొయ్‌ అమెరికాకు యిమానం ఎక్కతా వుంటే దొంగాల యింటికి పొయ్‌ వొచ్చినానే గానీ నా మనవరాలి చేతల్లో పదివేలు పెట్టగలిగినానా నేను? ఆ మరసనాడే నువ్వు సెడిదీ బడిదీ తినేసి సుగరు పెరిగిపొయ్యిందంటే పదివేలు కర్జుపెట్టి నిన్ను నిలపెట్టినా. అమెరికాలో మంచి సంబళం తీసే కాడికి నీకు మనవరాలయ్యిందే! ఆ బిడ్డి చదూకునేటప్పుడు ఏ పొద్దే గాని వొక గుడ్డపేలిక తీసిచ్చినామా? ఏనుక్కెగేసినట్టు ఎగేస్తా వుండినా నీసు మాటలు మాట్లాడతా వుండావే! యింకే ఆడదన్నా అయ్యుంటే నీ గుంత మింద గెరిక ఎప్పుడో మొలిచిపొయ్యుండును.’’ అని యింగా ఎట్టబడితే అట్ట మాట్లాడెయ్యాలనిపించింది దేశమ్మకు. అమెరికాలో వుండే మనవణ్ణీ, మనవరాలినీ తలుచుకునే కాడికే యాడలేని నిమ్మళమూ వొచ్చేసి ‘అట్టపోనీలే’ అని గమ్మనుండినా పులిపొంగరాలాయన గమ్మనుండలా. ‘‘వాళ్ల సంపాదనే వాళ్లకి ఎక్కీ తక్కీ. నువ్వు మిగలబెట్టి వాళ్లకేమీ యియ్యాల్సిన పన్లా. నీ మనవరాలికి పెండ్లి సమందాలు గూడా చూస్తుండారంట గదా. నా మాటిని ఎకరా కయ్యనీ అమ్మీ. డెబ్బయి లచ్చిలు చేతల్లో పడతాయి. కూతుండ్లకిద్దురికీ చెరి ముప్పై యిచ్చీ. మనకు పది లచ్చిలు చాలు. నాకొక అరై యేలు బెట్టి వొక వీరోవోండా కొనియ్‌. ఆ షేరాటోలెక్కి మాటిమాటికీ సుగర్‌ టెస్టులకు తిరప్తికి పోతావుంటే వూళ్లో అంతా నవ్వతుండారు – ‘ఒకరికిద్దురు అమెరికాలో వుంటే నీకిదేమి కరమ్మ’ అనేసి. మిగతా దుడ్లు వొడ్డీకిచ్చీ, సుకంగా బతికిపోదారి. ఆ ఆవులెనకాన నువ్వు తిరుగులాడతా అగచాట్లు పడతా వుంటే నాకు చూడగుండ్లా. మంచి మాటలు మాట్లాడతా వుంటే గూడా నీకు కోపమొచ్చేస్తా వుంటే!’’ – పులిపొంగరాలాయన నోటి మాటలు నోట్లో వుండంగానే జుట్టు వొంగదీసుకొనింది దేశమ్మ. ఆ చెంపా చెంపా అదరగొట్టేసి, ‘‘నీ అబ్బ సొత్తును వూడ్చుకోని మింగేసినావు. యిప్పుడు నా అబ్బ సొత్తుకాడికొచ్చినావా నాయినా? నిన్నూ పట్టలూడ దీసేసినా కర్మాలు తీరవు. నీ అబ్బ సొత్తేమన్నా వుంటే అమ్ముకోని తిరుగుబో వీరోవోండా మింద! ఆ దరిద్రపు పెండ్లప్పుడు రెండెకరాలూ అమ్మేసి మాకిచ్చీమన్నారు. నాయమ్మ ఎకరా అమ్మబట్టి సరిపాయ. రెండూ అమ్మేసుంటే? ఆ ఎకరా అన్నా వుండట్టి యింతకాలం బతికితిమి. తూ యెయ్యూళ్లకు యెదవా! ఎకరా కోటి పలికినాక నా కయ్యన్నేను అమ్ముకోని నా కూతుళ్లకిచ్చుకుంటా. ఈ లోగా నీ చావు చదరం చేసేసి నా మనవడి దగ్గిరికీ, నా మనవరాలి దగ్గిరికీ మిట్టూరికీ అమెరికాకీ తిరుక్కుంటా వుంటా!’’ అనేసి దేశమ్మ గస పోసుకుంటా మడికాడికి పూడిసింది ఆవుగొడ్లను తోలుకోని. వీరోవోండా మాటింటేనే అగ్గెగిరి పోతింది దేశమ్మకు. మొన్ననే ఇంజనీరు కోర్సు చదివే వొక పిలగోడు వీరోవోండా తీసీలేదని అలిగి చచ్చిపొయ్‌నాడు పాపం. అప్పుడా తల్లీదండ్రీ ఏడస్తా ‘బండి తీసిస్తే అదేడన్నా గుద్దుకోని నువ్వు చచ్చిపోతావని తీసియ్యలా కొడుకా. యిప్పుడు బండి తీసీలేదనే అలిగి చచ్చిపొయ్‌నావా నా కొండా’ అని ఏడస్తా అన్న మాటలు పేపర్లో గూడా పడితే చదివుండాది దేశమ్మ.

అగ్గో, మడికాణ్ణుంచి ఆవుగొడ్లను తోలుకోని యింటికొచ్చే కాడికి యీ వాటంతో నడీదిలో కుచ్చోని అందురికీ తెలిసేటట్టు ‘నేను చస్తాను పడతాను’ అంటా మానం తీసి పెట్టేసినాడు పులిపొంగరాలాయన. సందల గూక ఏడయ్యింది. అంత వుప్పుడు బియ్యం కూడొండింది. నాటార్‌ అంగిడికి పొయ్‌ నాలుగు కోడిగుడ్లన్నా తెచ్చి పొరటదాం, ఆ మానం చెడ్డ మొగోడి మొకాన అంత కొడదాం అనేసి యీదిన బడి అంగిడికి పోతా వుంటే యీదిలో యిండ్ల ముందర వొకటికి నాలుగు వీరో వోండాలు కనిపించినాయి. మొగుడి మొకాన వూయలేక ఆ నాలుగుటి మొకానా తుపుక్కు తుపుక్కుమని వూసి అక్కుసునంతా అణుచుకొంటా యింటికి కోడిగుడ్లు తెచ్చుకొనింది సంసారాడది దేశమ్మ.

– నామిని

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి.
Posted in 2015, కథ, మే and tagged , , , , , , , , , .

2 Comments

 1. పల్లె జనాల లోతైన బతుకు బావుల్లో దాగి ఉండే నిధుల్ని ఏ పాతాల భైరవితో బయటకు తోడతారో తెలియదు కానీ నామిని గారి కథల్లో జీవకళ వుట్టి పడుతుంటుంది.
  వీరో వొండా పేరు బాగుంది!
  కథ అంతకు మించి ఉంది!!

  ఈ కథలోని దంపతులు ఆకాశం లోంచి ఊడి పడినోళ్లు కారు, ప్రతి ఊరిలోనూ ఉండే వాళ్ళే.
  వీళ్ళ సాంసారిక జీవితంలోని సరిగమలకు భాషా భేషజాలు లేవు.
  వీళ్ళ మాటలు మన చెవులకు వినిపిస్తాయి, వాటిని అంటిపెట్టుకుని శారీరిక విన్యాసాలు కళ్ళ ముందు కనపడతాయి.
  ఈసడింపులు, దెప్పిపొడుపులు, పొటుకు-మాటలు భుజాల్ని తడుముకొనేలా చేస్తాయి.

  మాండలిక భాష పదిలంగా వుండాలంటే ఇలాంటి కథలు ఇంకా ఇంకా రావాలి…

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.