cover2

అర్బన్ ఫెమినిజం – ధోరణులు – దారుణాలు

Download PDF EPUB MOBI

మార్గరిటా విత్ స్ట్రా’ అని షొనాలి బోస్ దర్శకత్వం వహించిన హిందీ సినిమా ఈ మధ్యే రిలీజ్ అయ్యింది. ఇందులో ఇతివృత్తమంతా ‘సెరిబ్రల్ పాల్సి’ ఉన్న స్త్రీ కేరక్టర్ చుట్టూ. ఈ వ్యాధి ఉన్న వాళ్ళు immobility, నత్తి లాంటి లోపాలతో బాధ పడుతుంటారు. మన దేశం లెస్బియన్ నడవడిక, స్త్రీలు పోర్న్ చూడ్డం, స్త్రీ స్వయంతృప్తి లాంటి విషయాలనే జీర్ణించుకోలేదు. అటువంటి సమయం లో – ఈ సినిమా ‘హేండీ కేప్డ్’ గా ఉన్న ఒక స్త్రీ పాత్రతో ఇవన్నీ చేయిస్తుంది. ఆనవాయితీకి భిన్నంగా ఉన్న ఈ నడవడిక కలిగిన స్త్రీకి అదే నడవడిక కలిగిన మరో అంధ స్త్రీ జతగా ఉన్నట్టు కథ చూపిస్తూ చివరిగా, ఆ స్త్రీ యొక్క అస్తిత్వాన్ని అంగీకరించలేని పరిస్థితులను చూపించి, ఆ ప్రధాన పాత్రకు వ్యక్తిత్వం నిలుపుకోడానికి ‘ఒంటరితనం’ మించిన ఊరడింపు ‘జత’ ఎక్కడా లేదు అన్నట్టు ముగిస్తుంది. ‘హేండికేప్డ్’ అంటే మనలో జాలి, దయ మాత్రమే కలిగేలా దీనంగా ఉండాలని కోరుకునే ఫ్యూడల్ మనస్తత్వం ఉన్న ఈ దేశం లో, ఇది ఖచ్చితంగా అసాధారణ సినిమా. స్త్రీలు, అందునా అవయవ లోపాలున్న రెండు స్త్రీ ప్రధాన పాత్రలతో ఇలాంటి నడవడికను చూపిస్తే, జీర్ణించుకోలేక, హాలు నుండి నిష్క్రమించిన ప్రేక్షకులు ఉన్నారు.

ఈ సినిమా చూసాక – స్త్రీకి, అందునా అంగ వైకల్యం ఉన్న స్త్రీకి ఇవేనా ప్రధాన సమస్యలు? వ్యక్తిత్వం మరియు అస్తిత్వం అన్న సమస్యలు సెక్సువాలిటీ రిలేటేడ్ విషయాల్లోనే వస్తుందా? కథా ఇతివృత్తం – వ్యక్తిత్వం కోసం స్త్రీ పడే ప్రయాసను ప్రతిబింబిస్తుందని గొప్పగా ఉంది అనాలా, లేపోతే స్త్రీల ప్రధాన సమస్యలనూ దైనందిన వేదననూ చూపించకుండా విఫలమయ్యింది, కేవలం సెక్సువాలిటీనే ప్రధాన సమస్యగా చూపించిందని అనాలా? అన్న ప్రశ్నలు సాధారణ ప్రేక్షకుల్లో మెదలడం తప్పనిసరి. సినిమా విషయమే కాదు, ఈ రోజుల్లో ఉన్న ఫెమినిస్టు ధోరణులే ఈ ప్రశ్నలు తెప్పిస్తున్నాయి. పట్టణ ప్రాంతానికి పరిమితమైన ఫెమినిజం, మధ్య తరగతి స్త్రీలు కేంద్ర బిందువుగా మలుచుకుంటున్న ఈ ‘అర్బన్ ఫెమినిజం’ ను ఇంకొంచెం అర్థం చేసుకోవాలి.

ఫెమినిస్ట్ ఉద్యమాలు పారిశ్రామిక విప్లవం తర్వాత గమనార్హకంగా పురుడు పోసుకున్నాయి. మొదటగా 1800 మొదలులో వచ్చిన ఫెమినిస్ట్ ఉద్యమాలు పని హక్కుల గురించి, ఓటు హక్కుల గురించి లాంటి జఠిలమైన ముఖ్యమైన సమస్యలకు సమాధానాన్ని సాధించే క్రమంలో ముందుకు వచ్చింది. అదే సమయం లో మన దేశంలో సతీ సహగమనం, బాల్య వివాహాలకు పరిమతమైన లిబరల్ బ్రాహ్మణీయ ఫెమినిజం ముందుకు వచ్చింది. ఐతే ఆ తర్వాత కాలం లో ముందుకొచ్చిన ఫెమినిజం క్రమేణా కేపిటలిస్ట్ పురోగతిని బట్టి మరియు అభివృద్ధి చెందిన పట్టణ మధ్యతరగతి మరియు ఉన్నత వర్గాలు (Elite) అభివృద్ధి చెందే కొద్దీ గృహహింస, వేశ్యావృత్తి తదితర సామాజిక సమస్యలతో పాటు వైవాహిక, కుటుంబ సమస్యలను కూడా ప్రశ్నిస్తూ వచ్చింది. 1900 మధ్య శకం నుండి కొత్త ఒరవళ్ళు తొక్కుతూ ‘స్త్రీ అస్తిత్వం’ ‘స్త్రీ వ్యక్తిత్వం’ అనే ప్రశ్నలను ప్రధానంగా చేపడుతూ వచ్చాయి.

అప్పటికే ఆర్థిక వ్యవస్థలో టెక్నాలజీ ఎంతో ప్రగతిని సాధించి ఉండడం, వలస వాద సామ్రాజ్య వాదం, ఫాసిస్ట్ ప్రభుత్వాలు కూలిపోయి ఉండడం, సోషలిస్ట్ రాజకీయాలు తిరుగు ముఖం పట్టడం వలన ఈ స్త్రీ అస్తిత్వ వాదం వింత ధోరణులను, కొన్ని అసాధారణ ఆచరణలను పుణికి పుచ్చుకుని తన గొంతును వినిపిచడం మొదలు పెట్టింది. ఇందులో ప్రధానంగా ‘న్యూడిటీ’, ‘సెక్సువాలిటీ’ ని ఎక్కువగా హైలైట్ చేస్తూ రావడం కనిపిస్తుంది. 1900 మధ్య కాలం లో పోస్ట్ మోడ్రనిస్ట్ ధోరణులను అరువు తీసుకుని ఫెమినిజం కొనసాగింది. ఐతే ఇదంతా ‘స్త్రీ అస్తిత్వం’ కోసం కొంత సహాయ పడినా, కేపిటలిస్ట్ సమాజం దీనిని బాగా ఉపయోగించుకుంది. అదే కాలం లో – ‘నాన్సీ ఫ్రైడే’ లాంటి కథకులు, స్త్రీల sexual individuality అని చెప్పుకుంటూ, ప్రత్యేకంగా ‘స్త్రీల సెక్సువల్ ఫేంటసీ’ ల మీద పుస్తకాలు విడుదల చేయడం , ఈ పురుషాధిక్య సమాజానికి అది కొంత ధిక్కారంగా ఉన్నా, దాని మీద పెద్ద ఎత్తున వ్యాపారం జరిగింది. ‘My Secret Garden’ అనే బెస్ట్ సెల్లింగ్ పుస్తకం దీనికి బలమైన ఉదాహరణ. న్యూడిటీ అన్నది ప్రధానంగా ఫ్యూడల్ సంస్కృతికి విరుద్ధమైన భావజాలమైనా, కంజ్యూమరిజం పెంపొందడం తో ఈ తత్వాన్ని పురుషాధిక్య సమాజం కొంత ఆనందంగానే రిసీవ్ చేసుకోవడం జరిగింది. న్యూడీటీని, సెక్సువాలిటీని స్త్రీ అస్తిత్వం గురించి వాడుతున్నప్పుడు స్త్రీని “commodify” చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని కన్స్యూమరిస్ట్ అర్బన్ ఫెమినిస్టులు పట్టించుకోకుండా ముందుకు సాగడం కేపిటలిస్ట్ సమాజ భావజాలానికి కూడా అనుకూలంగా ఉపయోగపడుతుంది. అదే విధంగా దీపికా పదుకొనె ‘మై చాయిస్’ చూస్తే ‘Liberal body attitude’ ను ప్రధాన చర్చనీయాంశంగా చేయడం ‘Vogue’ కు అవసరం. కంజ్యూమరిజం తర్వాతి స్థాయికి వెళ్ళాలంటే, ‘matured market conditions’ ను అడ్రస్ చేయాలంటే ఇటువంటి స్త్రీ అస్తిత్వ ధోరణులను స్వాగతించడం తప్పనిసరి. సాధారణంగా అర్బన్ ఫెమినిస్టులు కెరీరిస్టులుగా ఉండడం ఈ కారణం వల్లనే అన్నది గమనార్హం.

ఈ అర్బన్ ఫెమినిజం తో ఉన్న కొన్ని ప్రధాన సమస్యలు గమనిస్తే – ఈ ధోరణి స్త్రీ యొక్క ప్రధాన సాంఘిక సమస్యల మూలాన్ని వదిలి, కేవలం సాంస్కృతికతను ప్రధాన కేంద్రంగా స్త్రీ సమస్యలను అడ్రస్ చేయడం. ఈ మధ్య కాలం లో ‘స్లట్ వాక్’ గా పెల్లుబికిన ఉద్యమం, పాశ్చాత్య దేశల నుండి వచ్చి మన దాక పాకింది. ఢిల్లీ లో ఎంతో విజయవంతంగా ముగిసింది కుడా. పురుష దురహంకారి, స్త్రీ వస్త్ర ధారణ చుసి slut అనే ఉద్దేశ్యం తో ట్రీట్ చేస్తున్నాడని, తమకు నచ్చిన వస్త్ర ధారణతో ‘Yes ! We are sluts’ అనే విషయాన్ని స్వయంగా హైలైట్ చేస్తున్నప్పుడు ధిక్కారత కనిపించినా, ‘Slut’ వెనుక ఉన్న భావజాలం ఏంటి అన్న విషయాన్ని విస్మరిస్తుంది. ఈ దేశం లో బ్రాహ్మణీక మనువాదపు అలవాట్లు, నడవడిక పురుషుల్లో ఇమిడి ఇంకి పోయాయి. ‘ఘర్ వాప్సీ’ పేరుతో జరిగేది, స్త్రీ యొక్క వ్యక్తిత్వాన్ని తమ గుప్పిట్లో నుంచి జార విడుచుకోకూడాదనే తపనే. ఐతే అర్బన్ ఫెమినిజం ఇలాంటి ప్రధాన విషయాలను మరిచి ‘Slut’ ను ధిక్కార స్వరంగా మార్చుకుని, ఇంకో వేపు స్త్రీని ‘Objectify’ చేయడానికి వెనుకాడదు. వీళ్ళకుండే ప్రధాన భావజాల ధోరణి ఏంటంటే – ‘స్త్రీకి పురుషుడు విరోధి. పురుషుడు స్త్రీని సెకండరీ మనిషిగా చూస్తాడు. ఇక మధ్యలో, అటూ, ఇటూ variables అంటూ ఎవీ లేవు’ అనే. ఈ దేశం లో లింగ సమస్యను, కుల సమస్యను, బ్రాహ్మణీక మత ఛాందస వాదాన్ని విడి విడిగా చూస్తే – స్త్రీ సమస్యకు మొదలెక్కడో తుది ఎక్కడో కనిపించదు. అర్బన్ ఫెమినిస్టులు చేస్తున్నది సరిగ్గా అదే.

pic1నగ్నత్వం అనే పనిముట్టు లేదా సెక్సువాలిటీ అనే పనిముట్టు conventional approach ను ఎదిరించి, Stereotype thinking ను సవాలు చేస్తుంది. ఇక్కడ స్త్రీ సమస్య ‘తన శరీరం తన ఇష్టం’ అనే ధిక్కారత ను వినిపించడం, కేవలం నగ్నత్వానికి సంబంధించిన వ్యవహారమే కాదు, నియంత్రణను ధిక్కరించడం కూడా. తర్వాత తమ స్వాధికారతను ప్రకటించడం జరుగుతుంది. బెడ్ రూం కు పరిమతమైన సెక్స్ ను పబ్లిక్ లోకి తీసుకు రావడం, దాన్ని సమస్యతో align చేసి ఉద్యమించడం ఒక ఎత్తుగడ కూడా అవ్వచ్చు. తమ దేహాన్ని, తమ ఆలోచనలను, తమ వస్త్ర ధారణను, తమ నడవడికను social conditioning చేయదల్చుకున్న పురుషాధిక్య సమాజానికి ఘాటుగా, గట్టిగా, గొంతెత్తి “మీ నియంత్రణ మా పై అవసరం లేదు. మేము బాగు పడినా చెడినా మా ఇష్టం. ఏదెలా ఉన్నా అది మా కోసమే” అని forecful గా వినిపించే ప్రయత్నంగా కూడా అగుపిస్తుంది. ఐతే Social conditioning స్త్రీ సాధికారతకు, స్త్రీ ఆర్థిక సాంఘిక పురోగమనానికి అడ్డుగా ఉన్నా, దీన్ని వ్యతిరేకించే అర్బన్ ఫెమినిజాన్ని కేపిటలిస్ట్ సమాజం ఎందుకు embrace చేసుకుంటుంది అన్న విషయం అర్బన్ ఫెమినిస్టులు గమనించలేరు.

‘నిర్భయ డాక్యుమెంటరీ’ – మన దేశం ఎంత ఆర్థికంగా, సాంకేతికంగా అభివృద్ధి చెందినా, ఈ దేశం లో పురుష భావజాలం ఎంతో తిరోగమన ధోరణి కలిగి ఉన్నదని బయటపెట్టింది. ఇటువంటి సమాజాల్లో నిజానికి అర్బన్ ఫెమినిజం, తమ ధిక్కార స్వరంతో కొంత వరకు మేలు కలగజేస్తుంది అనడంలో కొంత నిజం ఉంది. అర్బన్ ఫెమినిజం పోస్ట్ మోడ్రనిస్ట్ ధోరణులను పుణికి పుచ్చుకున్నాక, పురుషాధిక్యాన్ని తనకు తోచిన పద్ధతుల్లో సంచలనాత్మకత ఎత్తుగడగా సవాలు చేయడం కూడా జరిగింది. బట్టలే లేకుండా స్త్రీలు బయటకొచ్చి ఉద్యమాలు చేపట్టడం చూస్తున్నాము ఈ మధ్య కాలంలో.

ఇదిలా ఉండగా అర్బన్ ఫెమినిజం స్త్రీ విముక్తికి సంబంధించిన ప్రధాన కారణాలను, మూలాలను వెతకకపోగా.. కేవలం ధిక్కారత ప్రధాన ధోరణిగా కలిగి ఉండి, పరిమిత స్థాయిలో సమస్యను ఎదుర్కొని, ప్రాచుర్యతను నెలకొల్పడం ద్వారా సమస్యను అడ్రస్ చేయజూస్తుంది. ఈ అర్బన్ ఫెమినిజాన్ని గమనిస్తే – స్త్రీ సమస్య పరిష్కారానికై  – ఇది ఎక్కువ శాతం సాంస్కృతిక దృక్కోణంతో మాత్రమే పని చేస్తుంది. సమాజం లో రావాల్సిన సాంస్కృతిక మార్పును isolated గా టార్గెట్ చేసినట్టు మనకు కనిపిస్తుంది. దీనివలన ఆ మేరకు మేలు జరుగుతుంది కాని, తిరిగీ సమాజం లోని ‘సమావకాశాలు’, ‘సమ ఆర్థిక న్యాయం’, ‘సమ సాంఘిక న్యాయం’ వంటి macro level issues ను ప్రధానంగా ముందుకు తీసుకెళ్ళలేకపోతాయి. పైన చూసినట్టుగా ఈ తీరుకు కొంత మేరకు కేపిటలిస్ట్ మార్కెట్ ధోరణులతో align కావడం కూడా ఒక కారణం.

వ్యక్తిగతంగా కూడా అర్బన్ ఫెమినిస్టులు కెరీరిస్టు ధోరణులు కలిగి ఉండడం, ప్రాచుర్యత ప్రధాన అజెండాగా కలిగి ఉండడం, కేవలం అర్బన్ మధ్యతరగతి స్త్రీలతో మాత్రమే సంఘటితం కావడం లక్షణాలుగా కనిపిస్తాయి. అర్బన్ ఫెమినిస్టులు సాధారణ మహిళల హక్కుల కోసం ప్రత్యేకంగా పోరాడ్డం కాని, ప్రత్యేకంగా కార్యక్రమాలను చేపట్టడం కాని కనీసంగానే ఉంటుంది. కొందరు పెద్దలు దీనిని ‘లిప్ స్టిక్ ఫెమినిజం’ అని శ్లేషాత్మకంగా ముద్ర వేయడం లో అతిశయోక్తి ఏమీ లేదు.

స్త్రీ సమస్య జఠిలమైంది. మన లాంటి దేశాల్లో ఇది మరీ సంక్లిష్టతను చేకూర్చుకుంటుంది. స్త్రీని దుర్గ మాత అని పూజించే ఈ దేశం ‘ఆదర్శ మహిళ’ ను సృష్టించే ప్రయత్నం చేస్తుంది. ఇక ‘ఆదర్శాలు’ సాంప్రదాయ బ్రాహ్మణిక చట్రం లోనే దిద్దుకుంటాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన దేశంలో కుల వ్యతిరేక పోరాటం చేసిన ఫూలే మరియు అంబేద్కర్ లు స్త్రీ సమస్యల కోసం పోరాడిన మహా వ్యక్తుల్లో ముందు వరుసలో ఉండడం కాకతాళీయం కాదు. ఎందుకంటే ఈ దేశం లో లింగ సమస్య, బ్రాహ్మణీక ఛాందసవాదంతో ముడి పడి ఉందనే విషయం వాస్తవం కాబట్టి. ఇది గమనించడం లో ‘అర్బన్ ఫెమినిజం’ వెనుకబడింది అన్నది వాస్తవం. స్త్రీ ఉద్యమాలను సరి అయిన బాటలో తీసుకెళ్ళడానికి ప్రయత్నించే మార్కిస్టు, బ్రాహ్మణీయ మనువాద వ్యతిరేక శక్తులు బలహీనంగా ఉన్నాయి. ఈ సందర్భంలో, అంచెలంచలుగా అభివృద్ధి రుచి చూసే ఈ సమాజంలో, ప్రజాస్వామిక వాదులకు అర్బన్ ఫెమినిజంతో ఎంత పేచీ ఉన్నా అది వినిపించే ధిక్కార స్వరాన్ని ఆహ్వానించడం తప్పనిసరి అవుతోంది. మన లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, ఫ్యూడల్ పురుష స్వామ్యం, ఈ మార్కెట్ ధోరణులతో వైరుధ్యాన్ని ఎదుర్కుంటున్నప్పుడల్లా, ప్రజాస్వామిక వాదులకు ఈ తీరును సమర్థించడం తప్ప వేరే ఛాయిస్ లేదు – మరీ మొద్దుపోయిన వైపరీత్య విధానాలు ఎదురు తలిగినప్పుడు తప్ప.

స్త్రీ వ్యతిరేక ఫ్యూడల్ ఆలోచనల్లో మునిగి ఉన్న ఈ పురుష వ్యవస్థకు, అర్బన్ ఫెమినిజం ఇవ్వగలిగే ‘జర్క్’ తాత్కాలికం అన్న విషయాన్ని కూడా ప్రజాస్వామిక వాదులు విస్మరించలేరు, అది ప్రజలు విస్మరించరాదని, వారి గమనంలో ఈ విషయం తొట్రిల్ల రాదని కూడా వారు కోరుకోకుండా ఉండలేరు.

– పి. విక్టర్ విజయ్ కుమార్

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి.
Posted in 2015, మే, వ్యాసం and tagged , , , , , , .

One Comment

  1. 100% meeranna matalu correct madam..urban areas mahilalaku maatrame paalgone avakasam unna udyamam valla kevalam sensualities patla dhikkaram vyakthamavutundi..samajaam daanini sahajamgaane negative ka thisukoni sthreela abhyunnathiki aatamkaalu kalpinche avakasam undi..aithe sexuality pai swecha kosam dhikkaraniki kaaranalu anekam..pillalu..lanti patha samasyale kaakund..naa student oka ammayiki recent ga surgery jarigindi..husband anal sex kosam balavantha pettadam valla..blue films..porn videos yokka asahaja laingika alavatlu yuvatholo( vbayataku soumyanga..chadukoni software jobs chesevallu kooda..) sadism ni bharyani sex toy ga chudadam ekkuvayyayi..aithe urban feminists kooda multiple sexual relations..lesbians …ilantive kaakunda..peda madhyatharagathi sthreelanu bhagaswamyam cheyagalige balamaina bhavajalamtho mundukuravali…tq

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.