cover

మా కాలనీ పనమ్మాయి

Download PDF EPUB MOBI

మా వాడి స్కూల్లోని ఆయమ్మ వాడి టీచర్లకంటే స్టైలుగా ఉంటుంది. అలాగని నేను ఈమె గురించి ఏమీ రాయబోవడం లేదు. మరి ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే, ‘పనమ్మాయి’ అనగానే వినబడే సౌందర్య ప్రతికూలత ఆమెలో ఉన్న ఆకర్షణను మసకబార్చకుండా ఉండటానికి! ఇక్కడ రాస్తున్న నాయిక వేరే. రాంగోపాల్‌వర్మ హీరోయిన్లా చిట్టిగా, పొట్టిగా ఉంటుంది. రెగ్యులర్‌గా ఎందుకు ఇదే సమయంలో కనబడుతోంది? కొన్ని రోజుల తర్వాత, ‘ఓహో, అయితే ఈమె ఈ ఇంట్లో పని చేస్తోందా!’ అనుకున్నాను.

నేను ఆఫీసు కోసమని మెయిన్‌రోడ్డు వైపుకు మూలమలుపు తిరుగుతుంటాను; ఆమె ఆ ఎత్తయిన ఇంట్లోకి వెళ్తూవుంటుంది. నేను ఆలస్యంగా బయల్దేరిన రోజున ఆమె ఆ ఇంట్లోంచి వస్తూవుంటుంది. లేదంటే, బట్టలు దులిపి దండెం మీద ఆరేస్తూవుంటుంది. ఎప్పుడైనా ఇంటావిడ ఏమైనా తెమ్మంటుందేమో, శ్రీధర్ షాపు ముందర కనబడుతుంది. మేము మా పరస్పర ఉనికుల్ని గుర్తిస్తున్నామని ఇద్దరికీ అర్థమయ్యేదేదో ఆ తారసపాటులో దొర్లిపోతుంది. కాని ఎటు దారితీయాలిదంతా!

మామూలుగా స్త్రీ పురుష సంబంధాలన్నీ… మనం చూస్తాం; వాళ్లు చూడరు; అయిపోతుంది. మనం చూస్తాం; వాళ్లు చూస్తారు; అంకురం పడుతుంది. అయితే, ఆ చూడ్డంలో అసహ్యమో, కోపమో కాకుండా ఒక కుతూహలమో, ఇష్టమో కనబడితే అది ఒక సూచన! కానీ ఇద్దరూ వారానికో నాల్రోజులకో తారసపడగలిగే ఇంటెర్వల్ ఉండాలి. ఆ ఎదురుపడినప్పుడల్లా ఆ చూపుల్లో ఒక పలకరింపు ఏదో వినబడాలి. అప్పుడు… అప్పటికిగానీ ఆ మొదటి అంకం రక్తి కట్టదు. ఒకవేళ ఈ పలకరింపు వినబడినా (భవిష్యత్తులో ఎదురుపడే అవకాశం లేనప్పుడు చూపుల్లో కనబడే ధైర్యం; ఉదాహరణకు రైల్వేస్టేషన్ చూపులు దీనికి మినహాయింపు) తారసపడే ఇంటెర్వల్ లేకపోతే అది ముందుకు వెళ్లలేదు. అందుకే కోటానుకోట్ల మోహాలన్నీ మొదలవుతూనే అంతమైపోతాయి. ఎన్నో నునుపైన వీపుల్ని నేను అలాగే కోల్పోయాను.

ఒకడు యాభైమందిని పెళ్లాడతాడు; ఇంకొకడు మరొకని భార్యను ‘ఎత్తుకొస్తాడు’; అయినా కూడా ఒక ఆడ – ఒక మగ అనే ఆరోగ్యకరమైన స్టేజీకి సమాజం పరిణమించింది. ఇది ఐడియల్! దీన్లోకి ఒదగలేనివాళ్లు, సరిపడనివాళ్లు తమ పాత్రల్ని ఎలాగోలా నింపుకుంటారు. అంతమాత్రాన దీన్ని సిద్ధాంతం చేయడానికి నాలోని ఛాందసుడు ఒప్పుకోవడం లేదు. సరే ఇదిలా వుంచితే –

ఇక్కడ, ఈమె, మా సంబంధాన్ని రెండో అంకంలోకి తీసుకెళ్ళడానికి అనువైన క్లూస్ ఏవో ఇచ్చిందిగానీ (అలా నాకు అనిపించింది; ఇంతకుముందు చెప్పిన థియరీ ఉట్టి థియరీయే! థియరీగా ఎన్నయినా చెప్పొచ్చు, ప్రాక్టికల్స్‌లో అవి ఏ మేరకు సఫలమవుతాయో ఎవరికి తెలుసు?) ఎలా మాటలు కలపడం? ఏం చేస్తుంటావని అడగటం అనవసరం. నీ పేరేంటని అడుగుదామా? మొదటి ప్రశ్నే నీ పేరేంటని అడగడమా? ఆమెను కదపడానికి మంచి సాకు ఏం వుండగలదు! పోనీ మా ఇంట్లో ఏ పనైనా చేస్తుందేమో కనుక్కుంటే! అలాంటి పని ఏమీలేదని నాకు తెలుసు. మా ఆవిడే ఇంటిపనంతా చేసేసుకుంటుంది (బహు భర్తృత్వపు అవశేషంగా కనబడే ఈ ‘మా’ ఆవిడ అనే మాట నాకు అస్సలు నచ్చదు).

అలా పలకరింపు కోసం సరైన కారణాలు అన్వేషిస్తున్న దశలో మా వాళ్లు ఓ వారం రోజులు ఊరెళ్లారు. ఇక రేపు వచ్చేస్తారు. వాళ్లు వచ్చాక ఇల్లంతా దుమ్ముగా వుండకూడదు కాబట్టి, ముఖ్యంగా నా పిల్లలు ఆ దుమ్ములో ఉండకూడదని నేనే ఇల్లు ఊడ్చాను; బట్టవేసి తుడిచాను; నా తుడుపుల్ని నా భార్య మెచ్చకపోయినా! తెల్లారి మళ్లీ నా మానాన నేను ఆఫీసుకి వెళ్తున్నానా! ఆమె కనబడింది. అప్పుడు గుర్తొచ్చింది; అరే, ఈమెను నిన్న పనికి పిలిస్తే బాగుండునే! కనబడినప్పుడు మాత్రమే నాలోపల జ్వలించే ఆవిడేగానీ, ఆమెను గుర్తుచేసుకుని దహించుకుపోయేంత మోహమేమీ లేదా నాలో! ఒకవేళ అనుకున్నట్టుగా పిలిచుంటే మాత్రం ఆమెతో ఎలా అప్రోచ్ అవ్వాలో నాలుగైదు రకాలుగా ఆలోచించిపెట్టాను. వాటన్నింటి అంతిమ గమ్యం ఒకటే!

అయితే ఇక్కడా నాకు కొన్ని సందేహాలున్నాయి. అంటే, ముందుగానే నేను కండోమ్స్ (లేదా, కండోమ్… ఒక్కటి చాలదా?) కొనిపెట్టుకోవాలా? షాపువాడు సింగిల్‌గా ఇస్తాడా? నా దాంపత్య జీవితంలో ఏ కృత్రిమత్వానికి తావులేదనుకున్నాను కాబట్టి, నాకా అవసరమే కలగలేదు. అసలు ముందే కొనడం మంచిదేనా? అంటే అలా ఎటూ జరిగిపోతుందనుకోవడంలో ఆమె అంగీకారతను నేను ఖాతరు చేయనట్టు అవదా? లేదా, ఆమెను రంగానికి సమాయత్తం చేసింతర్వాత, అంటే నా ఉద్దేశం ప్రి క్లైమాక్స్ స్టేజ్ అని కాదు, మానసికంగా ఆమె అంగీకరించే సూచన కనబడింతర్వాత వెళ్లి తేవాలా? అప్పుడు షాపులు లేకపోతే? అసలు కండోమ్ వాడటం కచ్చితంగా అవసరమేనా? మరి ఆమె ప్రి సెక్సువల్ డేటా నాకు ఏం తెలుసు? అసలు, చివరి అంకం – దాని తదుపరి ఉండే అసహ్యాన్ని భరించగలనా?

చూస్తుంటే ఆమెకు పెళ్లయినట్టేవుంది. ఆమె భర్తను ఎదుర్కోవాల్సిన పరిస్థితే వస్తే! ఆమె పిల్లలు, వాళ్ల కుటుంబం ఎక్కడుంటుందో! అసలు ఇల్లంటూ తుడిపించాలంటే ఈమెనే ఎలా పిలవాలి? మా ఓనర్ వాళ్లకు పనిచేసే వజ్రమ్మ ఉంది; మా పక్కింటివాళ్లకు పనిచేసే యాదయ్య భార్యుంది; రోజూ కనబడే వీళ్లిద్దరినీ వదిలేసి, అందునా మా ఆవిడకూ పరిచయమైన వీళ్లిద్దరినీ వదిలేసి, ఎక్కడో పక్క రోడ్డు మీద పదిళ్ల అవతలవున్న ఇంట్లో పనిచేసే ఆమెను ఎలా పిలుచుకురావడం? పోనీ, నేను కావాలనుకున్నప్పుడు ఆమె వాళ్లింట్లో ఉండకపోతే! నిన్నట్నుంచీ మానేసిందని చెబితే! ఆ ఇంట్లో పనిచేస్తుందన్న ఒకే ఒక్క హింట్ తప్ప మరేదీ ఆమె గురించి తెలీదే! నిజంగానే ఇదంతా జరిగితే నా భార్య నన్ను క్షమిస్తుందా? నిజం దాచగలనేమోగానీ చెప్పాల్సిన పరిస్థితే వస్తే అబద్ధం ఆడగలనా? పైగా, ఏ బంధం అయినా ముందు ఆనందంగా మొదలై తర్వాత పెయిన్‌గా పరిణమిస్తుందన్న ఆందోళనా ఉంది.

‘ఒరే రాజిగా, ఇది అయ్యేపనేనా! ఇన్ని ఆలోచనలు, ఇన్ని భయాలు, ఇన్ని సందేహాలు ఉన్నవాడు ఒక పరాయి దేహాన్ని తాకగలడా? నీ జననం అదనపు శరీర భాగ్యం కోసం సంభవించింది కాదు. మూస్కొని ఐటెమ్ కట్టిపెట్టు,’ అని నన్ను బాగా ఎరిగిన నా అంతరంగుడు తిట్టిపోస్తున్నాడు. పాత్రలు నింపుకోగలిగేవాళ్లు వేరేవుంటారు. అలా నింపుకోలేనివాళ్లే ఇలాంటి పిచ్చిరాతలు రాస్తూ కూర్చుంటారు. నా అనుమానం ఏమిటంటే, సాహిత్యచరిత్ర పొడవునా శృంగారాన్ని రికార్డు చేసినవాళ్లంతా నాలాంటి పిచ్చివాళ్లే!

– పూడూరి రాజిరెడ్డి

Download PDF EPUB MOBI

Posted in 2015, మే, మ్యూజింగ్స్ and tagged , , , , , .

10 Comments

 1. చాలా బాగుంది. చక్కని వచనం. మీ ప్రతీ వాక్యం ఒక చిన్న కథ లాగే ఉంటుంది.
  ఒకవేళ ఆ పనమ్మాయికి తెలుగు కథలు చదివే అలవాటుండి.. ఇది చదివితే ఎలా ఫీల్ అవుతుందో :-)

 2. కథ రాసిన తీరు బాగుంది. మీ క్లుప్తత, భాష నాకు బాగ నచ్చుతాయి. ముఖ్యంగా ఇలాంటి వాక్య నిర్మాణం, “మేము మా పరస్పర ఉనికుల్ని గుర్తిస్తున్నామని ఇద్దరికీ అర్థమయ్యేదేదో ఆ తారసపాటులో దొర్లిపోతుంది.” ఈ వాక్యాన్ని నేనెక్కడా చదవలేదు!

  “నా అనుమానం ఏమిటంటే, సాహిత్యచరిత్ర పొడవునా శృంగారాన్ని రికార్డు చేసినవాళ్లంతా నాలాంటి పిచ్చివాళ్లే!” ఇది కేవలం మీ అనుమానమేనని నా అనుమానం :-)

 3. Sudha garu,
  please read the last line again.And scroll up to the condoms para.I know still you don’t get agree or get convinced.Thatz up to you.
  But I object your paradigm over describing romantic fantasy in a fiction and or non fiction as well; it doesn’t disqualify the goodness of the write up or whatever. Here the protagonist had a crush over a woman which he would like to share on an inhibited front as a married man.
  I am not asking for a full length narration but what i felt was, if a man is suffering a crush, automatically there would be gush of gut feel.I know that women readers reprimand my opinions and demand for a puritanistic sagas where most readers( telugu literature readers do policing and impose regulations over the writers which makes them a monotonic formula scribers for survival sake) took the shelter and resist to move up front.
  I fully appreciate Raji for his true reflections as they were.Please write part-2 of this restlessness.
  I await
  – Suresh babu

 4. సురేశ్‌బాబుగారూ,
  “కనబడినప్పుడు మాత్రమే జ్వలించే ఆవిడేగానీ, ఆమెను గుర్తుచేసుకుని దహించుకుపోయేంత మోహమేమీ లేదా నాలో!” అని ఆయనే రాశారు. మీరనుకునే ఆ ఫాంటసీ ఏదో లేకపోబట్టే ఆయనలా రాయలేదని తెలుస్తోంది. అలాంటిదేదైనా ఉండి, అది కూడా ఇక్కడ వర్ణించి ఉంటే ఈ రచన ఒక చెత్త రచన అయివుండేది.

 5. మనిషి అదుపు తప్పకుండా అరికట్టే బలమైన శక్తులు రెండు.
  ఒకటి సమాజం. రెండు – అంతరంగం.
  ఎవరైనా తప్పు చేయకుండా వుంటానికి – అతను తనవారికైనా వెరవాలి. లేదా తనకైనా భయపడాలి..అని చెప్పకనే చెబుతోంది ఈ మీ రచన.
  స్త్రీ కానీ, పురుషుడు కానీ – గీత దాటడం అనేది, అనుకున్నంత సులువైన విష్యం కాదు. ఐతే ఈ సూత్రం మనుషులకు మాత్రమే వర్తిస్తుంది.
  బావుంది రచన. అభినందనలండి.
  – ఆర్.దమయంతి.

 6. Raji Reddy garu ela meku reply rasy avakasam vachinanduku chala chala santhoshamga undhi..edi meru chaduvutharo lydo kuda naku thyliyadu kani rasthunnanu na manasuloni abhimananni thyliyachyataniki….me kalam’s anni na daggira collection undhi sakshi lo rasinavi…enno books chadivanu kani naku vasthavam kanipinchindi,vasthavanni feel i yela chysindhi me kalam’s matramy. me kalam’s anni oka bookla enduku meru thisuku rakudadu?! nalaga mimmulanu abhimaninchy vallu chalamandhi untaru meku thyliyakunda.
  thappulu rasthy kshminchandi,thappuga rashty manninchandi….thank you sir. P.Nirmala,Khammam.8008782668

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.