cover

ఊరికే వీచే గాలులు

Download PDF EPUB MOBI

“అమీరింటికెళ్ళవూ?” కాఫీ గ్లాసందిస్తూ అడిగింది లత నన్ను.

తను నా ఫ్రెండ్.

నేను ఏమనీ చెప్పేలోపే మళ్ళీ తనే అంది, నా పక్కనే కూర్చుంటూ. “బాగుండదు. వెళ్ళు. కనిపించినప్పుడల్లా అడుగుతాడు. నీ గురించి. నువ్వొస్తే, తప్పకుండా కలవమని కూడా చెప్పాడు.” ‘పాపం’ అన్నట్టు అతని మీద ఓ సాఫ్ట్ కార్నర్ ని వొలికిస్తూ అంది.

చాలా చాలా యేళ్ళ తర్వాత అఫీషియల్ పని మీద ఇదిగో రాత్రే – మా వూరొచ్చాను.

నే పుట్టి పెరిగిన వూరు. జన్మనంటుకున్న మట్టి వేరు. నా జ్ఞాపకల మేరు. నిశ్శబ్ద అలల సెలయేరు.

వచ్చిన క్షణం నించీ ఒకటే కబుర్లు. రాత్రంతా కునుకుంటే ఒట్టు. ఎడతెరిపిలేని వర్షంలా కబుర్లాడుకున్నాం.

ఇక మూడో ఝాము దాటొస్తుంటే ఆవలిస్తూ అప్పుడు చెప్పింది. “మర్చిపోయానే, చెప్పడం! అమీరిక్కడే వున్నాడు తెలుసా?” అంది. చాలా, మావూలుగా.

ఆ పేరు వినంగానే ఉలిక్కిపడ్డాను. “అమీరా?” అన్నాను.

“అదే, మన ఇంగ్లీష్ లెక్చరర్ యాకూబ్ గారబ్బాయి. ఆమీర్ లేడూ? ఈ వూరొచ్చేశాడు. ఇప్పుడిక్కడే వుంటున్నాడు. ఎదురైనప్పుడల్లా, నిన్ను చాలా అడుగుతాడు తెలుసా?”

వొళ్ళంతా చెవులు చేసుకు వింటున్న నాకు – ఒక్కసారిగా గుండాగిన నిశ్శబ్దమైంది.

తిరిగి కొట్టుకునేటప్పుడు సముద్రపు కెరటాలకుమల్లే గలగలమంది.

మనసనే పుస్తకంలో నే పూర్తిగా చదవకుండానే గుర్తుండిపోయిన పేజి – అమీర్.

నాకు నేనుగా ఇదీ కారణం అని చెప్పుకోలేనంతగా – కాలంతో కలసి మాయం కాని ఒక రంగైన చిత్ర పటం అమీర్. ఎప్పుడైనా తలపుకొస్తే, దిగులైన చిరుగాలికి మల్లే.. కొండ కింద నీడ కి మల్లే అనిపిస్తుంది. అది ఆహ్లాదమా, లేక అలవికాని విషాదమా అనేదేం తెలీదు. అమీరంటే – ఆనందమైన దివులు అని పేరు పెట్టుకుని నవ్వుకునే దాన్ని. ఎందుకంటే. ఊరకే.

 జీవితంలో మనం ఎదురుచూడని సన్నివేశాలు మాత్రమే కాదు. ఎదురుచూపుల మనుషులూ వుంటారనడానికి ఒక ఋజువు అమీర్.

 ఎంతనీ! పట్టుమని అతని తాలూకు గుర్తులు పిడికెడన్నే. గుర్తొకొచ్చినప్పుడల్లా.. అటెటో పట్టుకుపోతాయి. అది కాదిప్పుడు నేనాశ్చర్యపొతోంది.. అతనికి నేనూ గుర్తే! ‘ఇంకానూ, ఇంత కాలానికీనూ..?’ అని అనుకుంటుంటేనే మనసు ఉలికులికి పడుతోంది. ఎప్పుడెప్పుడెళ్ళి చూద్దామా అని తుళ్ళిపడుతోంది. ఉరకలేత్తే నదిలా!

‘నా గురించింకేం అడిగాడు.. అమీర్’ అంటూ తహతహగా అడగబోయాను. అప్పటికే లత నిద్రలోకెళ్ళిపోడంతో వూర్కుండిపోయాను.

నాకు మాత్రం నిద్ర లేదు. ఒక్క కునుకైనా పోలేదు. రెప్పలార్చుకుని చూస్తూ.. ఆలోచిస్తూ వుండిపోయాను.

అమీరు.. ఆ కాలవూ.. అంతా గుర్తొచ్చి!

తెల్లారింది. నేనేమీ అనకుండానే లతే అంది, వెళ్లి రమ్మని.

ఇక ఆలస్యం చేయకుండా, ఓ అరగంటలో రెడీ అయిపోయి, చెప్పుల్లో కాళ్లు దూర్చేస్తూ “వెళ్లొస్తా లతా” అన్నాను.

“వెళ్ళు కానీ, లంచ్ టైంకొచ్చేయి. ఇంత తిని, పడుకుందువు కానీ. రాత్రి కూడా నిద్ర లేదు సరిగా. సరేనా” అంది ప్రేమగా.

“జీ, హుజూర్” అని హుషారుగా అంటున్న నావైపు చిత్రంగా చూసి, నవ్వింది లత.

నాకైతే చాలా ఉత్సాహంగా వుంది. ఇంకా చెప్పలంటే- ఉద్వేగం గా కూడా! నన్ను చూడాలని కోరుకుంటున్న ఆమీర్ ని మరి కొన్ని నిముషాల్లో చూడబోతున్నందుకు.. హుషారేయదూ మరి!

నేనింకా అతని జ్ఞాపకంలో తారడుతున్నా అనే నిజం నన్నీ భూమ్మీద నిలవనీడం లేదు.

ఎందుకనీ?

నిజానికి – మనకు వండర్ గా అనిపించేవి ఈ ప్లానెట్స్, స్పేస్, నక్షత్ర మండలాలూ కావు. మన మీద మనసున్న వాళ్ళే మనకు గొప్ప అద్భుతంలా.. అరచేతిలో చందమామలా అగుపిస్తారు కదూ?

* * *

ఆటో బెజవాడ రోడ్డు మీంచి పోతోంది.

అదిగో, వేణుగోపాల స్వామి గుడి! ఆ మూల మేం వుండే గొడుగుపేట నించి ఈ చివర రోడ్డుకి వస్తుండే వాళ్ళం మా చిన్నతనంలో. ఎంత దూరమైతే నాకూ, మా ఫ్రెండ్స్ కి అంత ఆనందం. ఎందుకంటే బోల్డెంత సమయం వుంటుంది మాట్లాడుకోడానికని. గుళ్ళో మెట్ల మీద, రావి చెట్టు నీడలో కొలను లోకి చూసుకుంటూ ఎంత సేపు గడిపేవాళ్ళం?!

అయినా, ‘నడచి నడచి నీకోసం కదూ?’ ఆ గోపురాన్ని చూస్తూ అడిగాను నవ్వి. అదీ నవ్వింది మెత్తగా… అంతెత్తుమీంచి!

ఈ మలుపులోనే లాయర్ గారిల్లు వుండేది. అప్పట్లోనే ఆయన చాలా పెద్దాయన. పిలిచి మరీ పిల్లలకి చదువుచెప్పడం ఆయనకదో హాబీ. నీతి కథలు చెబుతుండేవారు. ఇప్పుడున్నారో, లేదో! ఇల్లంతా పాతబడిపోయి కళావిహీనంగా వుంది! కొంతమంది మనుషులు వెళ్ళిపోవడంతో కొన్ని ఇళ్ళ రంగురూపులే మారిపోతుంటాయి కదూ? – నిట్టూర్చాను.

అదిగదిగో గంగానమ్మ గుడి. మనసారా అమ్మకి దణ్ణం పెట్టుకుంటూ.. డ్రైవర్ని అడిగాను, “ఇక్కడింకా జాతర్లు జరుగుతున్నాయా?” అని. “ఆ! జరుగుతాయండి. కిందట్నెలే అయ్యాయండి.” చెప్పాడతను.

అతని మాటల్ని వింటూన్నా, మరో పక్క వీధుల వెంట చూపులు – పరుగు పెడ్తూనే వున్నాయి. ‘అరె.. అరె… ఇదే పెద్ద విజయ ఇల్లూ?!.. అవును ఇదే ఇల్లు. చిన్న విజయ అటుండేది, నేతి వారి వీధి వైపు.’ నవ్వొచ్చింది. మా వూరి వీధి పేర్లు కూడా ఎంత బావుంటాయో. అసలు నా వూరే నాకో అబ్బురం. నా వాళ్ళూ అంతే – అద్భుతం.

‘ఇప్పుడు నువ్ చూడబోతున్న ఆమీర్ కూడానా?’ – ఎవరో నా వెనక చేరి, చెవిలో గుస గుస గా అడుగుతున్నట్టనిపించింది.

జవాబు లేదు. మౌనం తప్ప.

నా చూపులకు మళ్లీ కదలికలొచ్చాయి. అదిగో చూడు చూడు.. ఎత్తరగుల ఇల్లు. అదే కదూ.. క్రిష్ణవేణుండే ఇల్లు? అహా, ఆ మాలతి పందిరి అలానే వుంది. ఇల్లు కూడా మార్పేమీ లేకుండా వుంది. ఇప్పుడెక్కడుంటోందో వచ్చేటప్పుడు ఆగి తెల్సుకోవాలి. ఆట్టె మాట్లాడితే పిల్లదానికి కూడా పెళ్ళి చేసేసే వుంటుంది. ఎందుకంటె- దానికి నైంత్ క్లాస్ లోనే పెళ్ళి కుదిరిపోయింది. ఆ సంగతి మాతో ఏడుస్తూ చెప్పినప్పుడు మాకెంత జాలేసిందో దాని మీద. అసలు అది క్లాసులో బ్రైట్ స్టూడెంట్. హాండ్ రైటింగ్ ఎంత బావుండేదీ! గుండ్రంగా, అచ్చు ప్రింట్ చేసినట్టుండేది.

నేను ఇంటర్ లో వుండంగా, ఇంత పొట్టేసుకుని నవ్వుతూ కనిపించింది. హూ!..

అడుగడుగునా నా అడుగులద్దుకున్న నా వూరినీ, ఆ బ్లాక్ అండ్ వైట్ ఆల్బంని చూపిస్తూ ఆటో రయ్యిన పోతుంటే.. గడచిన కాలం నా కళ్లముందు కొచ్చి, కదిలే చిత్రమై నిలిచింది.

జీవితం – అనుభవాల సువర్ణ సాగరం కదూ?.. అవును. పడిలేచే బంగారు కెరటాల సమూహం.

ఆటో కాసాని గూడేం దాటి, సాహెబ్ పేటకొచ్చేసింది.

కుతూహలంగా చూసా బయటకి. అప్పట్లోలా అన్నిళ్ళూ, ముస్లింలవే లేవు. అక్కడక్కడ వాకిళ్ళముందు ముగ్గులూ కనిపించాయి. నాకెందుకో భలే ఆనందమేసింది. మల్లెల్లో మరువం చూసినంత అందంగా! రోడ్డుకిరువైపులా పెద్దపెద్ద వృక్షాలు వరసగా ఠీవిగా నిలబడున్నాయి. గాలికి బలమైన కొమ్మలు బరువుగా ఊగుతూ కనిపించాయి.

అతన్ని తలచుకుంటున్నా.

ఎలా వుంటాడు అమీరిప్పుడు? పెళ్ళైపోయి, పిల్లల తండ్రైపోయి, యాకుబ్ సార్ లా, పెద్ద గడ్డం తో? లేదంటే తల పైన తెల్లటి కాప్ తో, మెడలో లావాటి నల్లతాడు తో, కంఠం దగ్గర వెండి గొట్టమొకటి మెరుస్తూ.. లీలగా గుర్తొస్తున్న అప్పటి ఆకారానికి ఇప్పడు నా ఉజ్జాయింపు కాస్ట్యూంస్ లో- ఊహించుకుంటుంటే, నాలో నాకే నవ్వొచ్చింది.

“ఇదేనమ్మా, సారిల్లు” అంటూ, ఆటో ఆపాడు – ఆ ఇంటి ముందు.

ఒక్క సారిగా ఈ లోకంలోకొచ్చాను.

అమీరిల్లొచ్చేసిందా? గుండె తమషాగా కొట్టుకుంది. దడదడలాడుతూ.. కాసింత – ఎగ్జైట్మెంట్ తో.

డబ్బులిచ్చి, ఆటో పంపించేసాక, చూసాను. వీధిలో ఎవ్వరూ లేరు. ఏ సడీ లేదు. నున్నటి సిమెంట్ రోడ్డు దూరానకెళ్ళి సన్న గా మెలిక తిరిగి జారిపోయింది. అక్కణ్ణించి ఆటో మాయమైపోయింది.

గాలి వీస్తున్న చప్పుడు తప్ప మరే శబ్దమూ లేని ఒక నిశ్శబ్దం. ప్రశాంతమైన నిశ్శబ్దం.

ఆ ఇంటి వైపోసారి చూసాను. ఎత్తులేని కాంపౌండ్ వాల్. గోడ మీంచి – లోన మొక్కల పచ్చదనం, పూలదనం, సుమసొగసులు మనోహరాన్ని కలిగిస్తున్నాయి.

ఆకుపచ్చటి ఇనప గేటు తీసుకుని లోపలకడుగుపెట్టాను. అప్పడు తడికల గేటుండేది.

రెండరుగుల మధ్య ద్వారం గల వసరా ఇల్లు. ఇప్పుడూ అలానే వుంది. కాకుంటె కొత్తగా.

పై కప్పు, ఎర్రటి బెంగళూరు పెంకు కప్పుకునుండటంతో – ఆ ఇంటి అందం ద్విగుణీకృతమై వుంది.

నేనిక్కడకి చదువుకోడానికొచ్చేటప్పుడు, ఇది తాటాకుల వసారా. గుర్తుతెచ్చుకున్నా.

ఎడమ వైపున పావురాళ్ళుండే పెద్ద చెక్క అల్మారా వుండేది. దానికి ఇనప జాలీ తలుపులుండేవి. గొళ్ళాలకి చిన్న చెక్క పీలిక – గడియగా గుచ్చే వాళ్ళు. దాని పక్కనే నీళ్ళ తొట్టె. చిన్న చిన్న మట్టి మూకుళ్ళు. వాటిల్లో నీళ్ళూ వుండేవి. ఆ పక్కనే పరచిన గోనె సంచీల మీద జల్లిన సజ్జలు, నూకలు, గోధుమలు ఎర్రెర్ర గింజలేవో కంపించేవి. కానీ ఇప్పుడదే స్థానం లో ఫాషనబుల్ టేక్ వుడ్ ఫర్నిచర్ అమర్చుంది.

వెదురు బుక్ షెల్ఫ్ లో- ఓ క్రమ పద్ధతిలో సర్ది పెట్టిన పుస్తకాలు కనిపిస్తున్నాయి.

టీపాయ్ మీద మాత్రం ఇంత దుంగలాటి పుస్తకం బోర్లా పడుకునుంది. సగం చదివి, వదిలి వెళ్ళినట్టు.

వెంఠనే తొంగి చూసాను. ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం వనితల దీన గాథల పుస్తకమది.

వసారా కుడి వైపు అరుగు మీద ఒకప్పటి బ్లాక్ బోర్డ్ చూట్నే – ఇప్పుడు ఒక వాల్ బోర్డ్ వేలాడుతూంది. మేం పిల్లలం కుర్చునే బెంచీల స్థానంలో ఇండి విడ్యువల్ కుర్చీలు, దానికి అటాచ్డ్ డెస్కులు అమర్చి వున్నాయి.

యాకుబ్ సార్ లా, అమీర్ కూడా పిల్లలకి విద్యా దానాన్ని కొనసాగిస్తున్నాడా?

“ఆవో బేటీ ఆవో..” గోడమీద ఫోటో లోంచి యాకూబ్ సార్ నవ్వుతూ ఆహ్వానిస్తున్నట్టు తోచింది. ఒక్కసారిగా కళ్లు చెమ్మగిల్లాయి. ఎంత కరుణ గల మనిషి ఆయన! ఆంగ్లభాష లో ఆయనంత నిష్ణాతుడు ఈ వూళ్ళోనే లేరు. అయినా ఎంత నిరాడంబరంగా వుండే వారు. వర్డ్స్ వర్త్, కీట్స్, షెల్లీ, రవీంద్రుడు, సరోజినీ నాయుడు.. వీళ్లందర్నీ తనకు పరిచయం చేసిన మహానుభావుడు కదూ యాకూబ్ సార్!

“సార్, మీరు లేకున్నా, నాకు మీరు – వీళ్లందర్లోనూ కనిపిస్తునే వుంటారు.” – అంటూ మనసులోనే నివాళులర్పించాను. పాఠాన్ని మెదడులోకి కూరడం కాదు, హృదయంలోకి జొప్పించడం.. అసలైన బోధనం. అందుకు ప్రత్యక్ష సాక్షి మా యాకూబ్ సార్. అందుకే ఈ వూళ్ళో ఆయనకి అంత గౌరవం. ఆయన పట్ల పిల్లలకి భక్తి, ప్రేమ మెండుగా వుండేవంటే కారణం ఆయన నిజాయితీ, వృత్తి పట్ల ఆయనకున్న దైవ భావన వల్ల.

ఎప్పుడైనా, ట్యూషన్ నించి ఇంటికె వెళ్ళడం కాస్త ఆలస్యమై – చీకటైతేనో, లేదా మబ్బులేసి, వర్షం వచ్చేలా వుంటేనో, ఆయన తనని ఒంటరిగా వెళ్ళనిచ్చేవారు కాదు. కొడుకుని పిలిచేవారు. “అమీర్ బేటా, అమ్మాయిని ఇంటి దగ్గర దింపి రా.” అని ఆర్డరేసేవారు.

“హా! పాపా” అంటూ.. వెంఠనే కాళ్ళకి బూట్లేసుకుని వచ్చేసే వాడు అమీర్. చూడటానికి ఎలా వుండే వాడు. రాముడు బుద్ధిమంతుడన్నట్టు. కానీ.. కాదు. కదూ? తనకి తెలుసు. తనకి మాత్రమే తెలుసు.

“ఏడీ? ఎక్కడా? కనిపించడు?” – నా కళ్ళు ఆత్రంగా వెతికాయి అతని కోసం.

ఇంట్లో ఏ సవ్వడీ వినరావడం లేదు.

కానీ, సన్నగా నీళ్ళ చప్పుడు.. జలజలలమంటూ వినిపిస్తున్నాయి.

నేరుగా ఇంట్లోకెళ్ళకుండా.. ఇటువైపునించి – ఇంటి వెనక వైపు అడుగులేశా.

చూస్తూ చూస్తూనే అబ్బురమై పోయా. అబ్బ, ఎంత పెద్ద తోట! ఎంత విశాలమైన పెరటి తోట! ఈ ఇంటికి అప్పుడింత పెద్ద జాగా లేదే!?.. పక్క స్థలం కొని, కలుపుకునుండొచ్చు. ఎన్ని రకాల మొక్కలు! గుబురు పొదలు! ఎత్తైన వృక్షాలు. మరో పక్కన కొబ్బరి చెట్లు, వాటి మొదళ్లలో చిన్న చిన్న క్రోటన్లూ, పూల మొక్కలతో బాటు మొలకనవ్వుల తీవెలు.. ఎడమ దిక్కుగా గిలక బావి, దాని చుట్టూరా చప్టా, కాళ్లు కడిగిన నీళ్లు సైతం వృధా కానీకుండా.. అరటి తోపుల్లోకి, అట్నించి, కొబ్బరి చెట్లల్లోకి పారిపోయే లా ఏర్పాటు చేసినట్టుంది. ఎత్తు మీంచి దారి చేసి, పల్లం లోని మొక్కలకి నీళ్లు సరఫారా అవుతూ బుల్లి బుల్లి కాల్వలు.

తోటలోని మొక్కమొక్కకీ, రెమ్మరెమ్మకీ నీటి పైపుతో నిలువునా స్నానాలు చేయిస్తున్నాడు అతనటు తిరిగి.

అతనే అనుకుంటా అమీర్.

గొంతు సవరించుకుంటూ “ఎక్స్ క్యూజ్ మి” అన్నాను.

 నా గొంతు విని, హఠాత్తుగా వెనక్కి తల తిప్పి చూసాడు. మరుక్షణంలో పూర్తిగా నావైపు తిరిగి, సీరియస్ గా ఎవరూ? అన్నట్టు చూస్తూన్నాడు.

నేను గుర్తుపట్టేసాను. ఆ కళ్ళు చూసి ఇట్టే గుర్తుపట్టేసా. ఇతగాడే అతగాడు. అప్పట్లో సన్నగా వుండేవాడు. ఇప్పుడు మనిషి అందం తేలాడేం?

మరె! నలభై లో మగాళ్ళకీ, ముప్ఫైల్లో ముదితలకి అందం రెట్టింపౌతుందట. అంటారు.

ఆ హాండ్సమ్ని చూస్తుంటే నాకెందుకో, చెప్పలేనంత ఆనందమేసింది.

అతను మాత్రం కనుబొమలు ముడుచుకుని, “సారీ, మీరు..?” అంటూ ఆగాడు.

నన్ను గుర్తు పట్టలేకపోతున్నాడు.

“మీరు అమీరే కదూ?” వస్తున్న నవ్వుని పైకి కనిపించనీకుండా అడిగాను.

“అవును. నేనే. మీరు?” మరింత సూటిగా చూస్తూ అడిగాడు.

నన్ను మీరు గుర్తుపట్టలేదా? అన్నాను కావాలనే అల్లరిగా.

“మరో సారి నఖ శిఖ పర్యంతం చూస్తూ..” లేదన్నట్టు తలూపి, “సారీ” అన్నాడు.

అప్పుడు చెప్పాను. నా పేరుని. చెబుతూ అతని మొహం లోకి చూసా. పరీక్షగా. చాలా పరీక్షగా. అతని కళ్ళ వైపే దృష్టి నిలుపుతూ.. నాక్కావల్సిన రిజల్ట్ ని ఎక్కడ మిస్సౌతానో నన్నట్టు.. చూస్తున్నా.

నా పేరు వింటంవింటం తోనే అతని కళ్లల్లోకి వెలుగొచ్చేసింది. కొన్ని గుంపుల నక్షత్రాలు అన్నీ కలసి ఒక్కటై ఒక్కసారిగా మెరుస్తున్న మెరుపది. ఆ కళ్ళల్లో వెలుగుతో బాటు వెల్లువైన సంతోషాల కాంతినీ చూస్తున్నా.

తను ప్రాణాలు ఉగ్గపెట్టుకుని చూస్తోంది.. ఇందుకే! అసలొచ్చిందీ ఈ వెలుగుని చూడ్డానికే.

ఉఫ్. గుండెల్నిండా ఊపిరి తీసుకున్నా. గాలిలో తేలిపోతున్నంత హాయిగా వుంది.

ఆ మరు క్షణమే అతను – ఆటోమాటిక్ గా ఆనందాల పుట్టైపోయాడు.

“ఒహ్హో! వాటే వాటే సర్ప్రైజ్… శుభానల్లా.. శుభానల్లా…”అంటూ, చేతిలో పైప్ ని కిందకిసిరి, ఒక్క ఉదుటున నా కతి సమీపంగా వచ్చేసాడు. వచ్చి, చేతులు చాచబోయి.. ఏదో గుర్తుకొచ్చిన వాడిలా హఠాత్తుగా ఆగిపోయాడు. పొరబడిన వానిలా, తడబడతూ.. తమాషాగా భుజాలను ష్రగ్ చేసాడు.

చప్పున నా చూపుల్ని నేల మీదకి తప్పించా, ఒక సెకను పాటు. అతని అవస్థని నేనేమీ, చూడలేదని అతననుకోవడం కోసం.

 అమీర్- రెండు అరచేతుల్ని దగ్గర చేసుకుని, పెదాలకాన్చుకున్నాడు. నా వైపు సంబరంగా చూస్తూ….!

అమీర్ కి – నా రాక నిజం గానే పట్టలేని ఆశ్చర్యాన్ని, పండగనీ ఇస్తోందని ఇట్టే పసిగట్టేసాను.

అది చూసి లోలోనే చలించిపోయాను.

‘నేనునేను గా లేను’ అని అందుకే కామోసు ఇన్ని పాటలొచ్చాయి!

“నువ్వంటె, నేనింకా నమ్మలేకపోతున్నా సుమా!” అంటూ, చేయందించాడు. సున్నితం గా తాకి వదిలేసాను.

“కమాన్ కమాన్..లోపలికి రా..” అంటూ గబగబా ఇంట్లోకి దారి తీసాడు. మౌనంగా అతని వెనకే అడుగులేసాను.

వసారాలోంచి, డ్రాయింగ్ రూం.. దాటాక, లోపల హాల్ లోకి తీసుకొచ్చాడు. ఎంత నీట్ గా వుంది! సొగసుగా, విదేశీ ఫర్నిచర్ తో ఇన్నోవేటివ్ గా వుంది.

అది హాల్ కం – ఓపెన్ కిచెన్ కం – డైనింగ్…

ఓ పక్క నించి పైకెళ్లడం కోసం వొంపయిన వుడెన్ మెట్లున్నాయి. పైన గదులున్నట్టున్నాయి. బహుశా బెడ్రూంలు అయి వుండొచ్చు.

నేనూహించినట్టు, లోపల్నించి, ఎవరూ రాలేదు. స్త్రీ కంఠ స్వరాలు వినిపించడం లేదు. ఏమైనట్టు, అందరూ?

నన్ను కూర్చోబెట్టి, పది నిముషాల్లో వస్తానన్న అతను – ఐదు నిమిషాల్లోనే వచ్చేశాడు. వెలుగైన మోముతో! ఇందాక గళ్ళ లుంగీ తెల్ల బనీనుతో కనిపించిన అమీర్ కీ, తెల్లటి తెలుపైన లాల్చీ పైజమా లో మెరిసిపోతున్న ఆమీర్ కి తేడా స్పష్టం గా కనిపిస్తోంది. పెద్దరికం తో మరింత హుందాగా వున్నాడు.

వస్తూ వస్తూ చేతిలో ఫోటో ఆల్బంస్ తెచ్చి నా ముందుంచుతూ చెప్పాడు.

“ఇందులో నీ ఫోటో వుంది తెలుసా? అప్పటి కీ ఇప్పటికీ అస్సలు పోలికలే లేవు. ముఖ్యంగా, సన్నగా అయిపోడంతో..అందుకే గుర్తుపట్టలేకపోయాను..” అన్నాడు నవ్వుతూ.

అప్పట్లో బొద్దుగా లడ్డూలా వుండేదాన్ని. నిజమే. అతని నవ్వులో భావం అర్ధమై, నేనూ నవ్వేసా.

“నీ మాటేమో కానీ, నేనైతే, ఇట్టె గుర్తుపట్టేసాన్నిన్ను.” అన్నాను గర్వంగా.

“మా ఇంటికొచ్చి, నన్ను పట్టేస్కోడం ఈజీనేలే పెద్ద.” అంటూ తనూ నవ్వాడు.

ఆల్బంస్ అందుకుని ఆ ఫోటోలు చూడటంలో మునిగిపోయా. కొన్ని నిమిషాల్లో “చాయ్ చాయ్” అంటూ బంగారు రంగు కప్పుని నా చేతికందించాడు. గుప్ఫున ఇలాచి సువాసన్లతో.. మొదటి సిప్ కోసం తహతహ లాడాయి పెదాలు.

“ఇంత రుచిగా టీ పెట్టడం ఎప్పుడు నేర్చుకున్నావ్?” అడిగాను చనువుగా.

“డైలీ ప్రాక్టీస్ తో. ఇంగ్లాండ్ లో వున్నప్పుడు వంట కూడా నేర్చేసుకున్నాను.” నవ్వుతూ చెప్పాడు.

ఆ తర్వాత మాటల్లో పడ్డాం. అతని చదువు, ఇంగ్లిష్ ప్రొఫెసర్ గా ఆంధ్ర యూనివర్సిటీ లో కొన్నాళ్లు వుద్యోగం, ఆ తర్వాత ఆస్ట్రేలియాకి వెళ్లడం అక్కడ కొన్నాళ్లుండి ఇండియాకొచ్చేయడం, తండ్రి మరణం, చెల్లెలి వివాహం విషాదం గా మారడం, ఆమె కువైట్ లోనే తల్లితో కలసి వుండటం… ఎక్కడా ఆగకుండా తన కథంతా గడ గడా చెబ్తున్నాడు.

అతను చెప్పే ప్రతి మాటను నేను చాలా శ్రధ్ధ గా ఆలకిస్తున్నా.

మధ్యమధ్యలో అతను లోపలకీబయటకీ వెళ్ళొస్తొన్నాడు. పని వాళ్లతో అనుకుంటా మాట్లాడొస్తున్నాడు.

“చేపలొచ్చాయి. ఇవాళ వొద్దన్నా. నువ్వున్నావని” నవ్వాడు చిత్రంగా కళ్ళార్పుతూ.

“మంచి పని చేసావు” అన్నాను. నేనూ నవ్వుతూ.

ఆ తర్వాత ఇద్దరం కూర్చుని పాత ఆల్బంస్ తిరగేసాం. అప్పటి మా కాలేజ్ మేట్స్, సీనియర్స్, జూనియర్స్ గురించి కొన్ని సంగతులు చెప్పుకొచ్చాడు. ఎవరెవరు ఎక్కడున్నదీ, కొందరు అడ్రెస్సే లేకుండా ఎలా మాయమై పోయిందీ.. చెప్పుకున్నాం.

కొందరు – తొందరపడి జీవితం లో తీసుకున్న నిర్ణయాల గురించి, వేదనగా చెబుతుంటే నేనూ బాధగా వింటూండిపోయాను.

మళ్ళీ అంతలోనే మరి కొందరి గురించి.. వాళ్ల మానరిజంస్, అలవాట్లు, ఊతపదాలు, అన్నీ – మరి మరి తలపోసుకుని నవ్వుకున్నాం.

మాటల్లో టైమే తెలీలేదు.

మధ్యాహ్నం రెండు దాటుతోంది. “అరె, లంచ్ టైం అయింది.. ఏం తింటావ్ చెప్పు. పప్పు, ఆవకాయ, అప్పడాలు ఓకెనా? మడికట్టుకు చేస్తా.” అన్నాడు నవ్వుతూ.

“నువ్వేం మడి కట్టుకోనూ వొద్దు, పట్టు బట్టలు ఆరేయనూ వొద్దులే..” అన్నాను నవ్వేస్తూ.

వెంటనే లత కి ఫోన్ చేసి, నా కోసం ఎదురు చూడొద్దని చెప్పేసి, స్థిమిత పడ్డాను.

అమీర్ అప్పటికే కిచెన్ లోకెళ్ళిపోయి, స్టవ్ వెలిగించేస్తున్నాడు. నేనూ వెళ్లాను వెనకనే.

క్విక్ గా నూడుల్స్ చేసుకుందామని డిసైడైపోయాం. వెజెటబుల్స్ కట్ చేసిస్తున్నాను.

అతను ఎంతో అనుభవజ్ఞుని లా, చకచకా ప్రెపేర్ చేస్తున్నాడు. మరో స్టవ్ మీద రెండు కప్పుల సూప్ కాచేసాడు. నేతిలో బ్రెడ్ ముక్కలు, పన్నీర్ పీసెస్ వేయించి వుంచాడు.

ఆకుకూరలతో సలాడ్ సిద్ధం చేసాడు.

నేను టేబుల్ మీద వాట్ని సర్దె లోపు అతను గాజు పళ్లాలు, గ్లాసులు పరిచేసాడు.

వైన్ గ్లాసులుంచాడు. ఆఫర్ చేస్తే నవ్వి, తలూపాను – వొద్దన్నట్టు. ఫ్రూట్ జూస్ అందించాడు. అతను వైట్ వైన్ వొంపుకున్నాడు. ఒక్కో సిప్ చేస్తూ… మళ్ళా మాటలు.. ఆ రోజుల రోజా తోటల్లోకి తీసుకెళ్ళిపోయాదు.

అరగంటలో తిని లేవాల్సిన వాళ్ళం రెండు గంటలైనా కాలేదు మా లంచ్.

ఆ తర్వాత అమీర్ మరింత ఉత్సాహంగా కనిపించడం గమనించాను.

చేతులు తుడుచుకుని, సోఫాలో కూర్చున్నాక, నా చూపు అక్కడి ఫోటో మీద పడింది.

రబ్బరు బొమ్మలాటి పిల్లనెనెత్తుకున్న అమీర్.. దాని పక్కనే, మరో ఫోటో- అదే అమ్మాయి. ఐతే, పన్నెండేళ్ల ఆ అమ్మాయి భుజాలు చుట్టుకునీ అమీరు..

ఆమె తెల్లగా, పిల్లదొరసానిలా.. వుంది. నీలి నీలి కళ్లేసుకుని, అమీర్ పోలికలతో.

అంటే.. అమీర్ కూతురు. మరి..?

అమీర్ నా పక్కనే కూర్చుంటూ చెప్పాడు. “మై డాటర్. నటాష.”

“ఓ.ఔనా. బ్యూటిఫుల్..వెరీ బ్యూటిఫుల్. రాజకుమారిలా వుంది సుమా” అన్నాను ఆనందంగా.

అతను కింద పెదవి బిగించి, కంటి రెప్పలార్చి అవునన్నట్టు గర్వంగా చూసాడు.

కాసేపెందుకో.. మౌనమై పోయాడు. నేనేమీ అడగదలచుకోలేదు.

ఇంతకు ముందే చెప్పాడు. మాటల్లో. ఆస్ట్రేలియా లో దరిదాపు పదేళ్ళు టీచింగ్ ప్రొఫెషన్ లో వున్నట్టు. బహుశా.. అప్పుడేమైనా.. ఆ తర్వాత డైవోర్స్ అయివుండొచ్చు.

అడగబుద్ధి కాలేదు. అడిగి తెలుసుకునేంత పెద్ద విషయమేమీ కాదది నాకు.

“నటాషా ఏం చదువుతోందీ?” అడిగాను.

అతను ఉత్సాహం గా చెప్పాడు. కూతురి గురించి. “జూన్ జులై లో వస్తోంది. ఈ సారి రాజస్థాన్ కి తీసుకెళ్లాలి. బర్త్ డే కూడా ఇక్కడే ఇంట్లోనే సెలెబ్రేట్ చేసుకుంటోంది. కువైట్ నించి అమ్మా, చెల్లెలు వస్తున్నారు. నువ్వు కూడా రాకూడదూ? సరదాగా?” – మనసారా అడిగాడు.

“తప్పకుండా..” అన్నాను నవ్వుతూ.

ఇంతలో విరామం లేకుండా సెల్ ఫోన్ మోగుతూ ఉంది. అతను కాల్సన్నిటికీ జవాబులిస్తున్నాడు.

ఆ తర్వాత చెప్పాడు. వారంలో – నాలుగు రోజులు విజయవాడ కార్పొరేట్ కాలెజ్ లకెళ్తాడు.

గంటల కొలతలో వుంటుంది రెమ్యూనరేషన్. ఇంకా, పర్సనాలిటీ డెవలప్ మెంట్ క్లాసులకి వేరే కాంట్రాక్ట్ వుందిట. మిగిలిన రోజుల్లో ఇంట్లో నే వుండి ట్యూషన్స్ ఇస్తూ, ఆన్లైన్ కోచింగుల్లో బిజీ అయివున్నట్టు చెప్పాడు.

సొంతిల్లు. వున్న వూరు. జన్మ భూమి పై మమకారం. అన్నీ అతన్నీ దేశానికి లాక్కొచ్చాయట. అంతే కాదు కొన్ని జ్ఞాపకాలు..అతన్నిక్కడ సజీవుణ్ని చేస్తాయిట. వున్నదున్నట్టు చెప్పాడు.

నిజమే. నాకూ అంతే. కానీ.. అమీర్ లా సాహసం చేయలేకపోయానేమో.. ఇక్కడకొచ్చి సెటిల్ కావడానికి.

సంజె చీకట్లు కమ్ముకుంటున్నాయి.

తెలీని దిగులు.. తెలీదు.. గుండెనెందుకో చీకటి చేస్తుంటుంది.. కొన్ని సాయంత్రాలు అప్పుడప్పుడు.

“సరె..మరిక వెళ్తా..” సోఫాలోంచి లేస్తూ అన్నాను.

ఆపిల్ పండుని శ్రద్ధగా కట్ చేస్తున్న అమీరు నా మాటలకి ఉలిక్కిపడ్డాడు. “అదేమిటీ వెళ్ళిపోడం? ఈ రాత్రికుంటావనుకున్నా.. వుండిపోరాదూ.. ఇంకా చాలా చెప్పాలి నీకు” అన్నాడు వూరిస్తూ.

“వుంటే బావుంటుందిలే కాని వొద్దులే అమీర్. ఈ సారొచ్చినప్పుడుంటాలే” అంటూ యధాలాపనగా చూసానతని వైపు.

అటు తిరిగి వున్నాడు. కాని, వెనకనించి స్పష్టంగా కనిపిస్తోంది.. అతని భుజాలు ఎగిరెగిరిపడటం. నవ్వాపుకోలేని అవస్థ అది. నాకింతకు ముందు అనుభవమే. ఆ నవ్వు. వెక్కిరింత నవ్వు.

గుప్ఫున ఆ నాటి అమీరు గుర్తొచ్చాడు.

ఆ రోజు అంతే. ఇలానే. జరిగింది కదూ?

వర్షం వచ్చేలా వుంది. నన్ను ఇంటిదగ్గర జాగ్రత్త గా దింపి రమ్మన్నారు యాకూబ్ సార్. అమీర్ సైకిలేసుకుని వచ్చాడు నా వెనకే.

ఏమీ మాట్లాడుకోలేదు. కానీ, నన్ను కిటికీలోంచి చూసి ఎందుకు నవ్వుతుంటావ్? అడగాలనిపించింది. ఎలా అడగడం?

ఇంతలో చినుకు మొదలైంది. అమీర్ ఆకాశం వైపోసారి చూసి చెప్పాడు. “వెనక కూర్చుంటే త్వరగా వెళ్లిపోవచ్చు” అని.

నేనతను చెప్పినట్టె వెనక సీట్ మీద కూర్చున్నా. అతను సైకిల్ తొక్కుతున్నాడు. రోడ్డు ఎత్తైన చోట.. ఆయాసపడుతున్నప్పుడు కూడా తనకి తెలీలేదు. దిగాలని. పాపం.. అతనే రొప్పుతూ సైగ చేసాడు. దిగమన్నట్టు.. అప్పుడూ ఇలానే నవ్వాడు అటు తిరిగి.

అంటే తను బరువున్నానని చెప్పడం. కాదు. వెక్కిరించడం కదూ?

తనకు ఒళ్లు మండిపోయింది. ఆ తర్వాత కాలం లో ఎప్పుడితను గుర్తొచ్చినా ‘పాపం అమీర్’ అని జాలి వేసేది.

అద్సరే!

ఇప్పుడెందుకు నవ్వుతున్నట్టు? అసలేం అడిగాడు తనని. రాత్రికుండిపోమన్నా?

తనేమంది. వొద్దులే బావోదు అన్నదా!

ఓ! అర్ధమైంది.

నిజం గానే కోపమొచ్చింది.

“కాస్త ఇటు తిరిగి నవ్వుతావా ప్లీజ్” అన్నాను.

అనటం ఆలస్యం..అప్పటి దాకా బిగపెట్టుకున్న నవ్వు సుడులుకట్టుకుని మరీ బయటకొచ్చి పడింది.

“ప్రామిస్ బాబా.. ప్రామిస్.. నాకస్సలు వేరే ఉద్దేశమే లేదు. కానీ నువ్వే ఈ సారి బావోదన్నావ్.. అంటే మళ్ళీ వచ్చినప్పుడు బావుంటుందా? హహహా….” అన్నాడు. అలా అంటూనే.. నా అమయకపు మొహాన్ని చూసి మరి మరి పొగిలి పొగిలి నవ్వసాగాడు. అలా ఎంత సేపో నవ్వుతూనే వున్నాడు.

నాకో పట్టన డబల్ మీనింగ్స్ అర్థం కావు. చిన్నప్పట్నించీ అంతే. ఆ సబ్జెక్ట్ లో నేను పూర్తిగా డల్ కాండిడేట్ నే.

కానీ అమీర్ని అర్ధం చేసుకోవడంలో.. నేను పొరబడ్డానా? కాదంటుంది మనసు. ఊహు. ఏమాత్రం కాదు.

ఆనాటి ఓ చలి సాయంత్రం. మరచిపోదామన్నా మరపు రాని ఆ వేళ.. దీపాలు పెట్టిన వేళ. ఆరోజు – గుడి నించి వస్తుంటే.. వెనకనించి ఎవరో నన్ననుసరిస్తున్నట్టు, నా పేరుతో పిలిచినట్టు అనిపిస్తే.. వెనక్కి తిరిగి చూసా.

అమీరొస్తున్నాడు. సైకిల్ మీద స్లోగా. దిగులుగా అగుపించాడు. ఇప్పుడీవేళ? ఇతనేమిటీ, ఇక్కడ?

అప్పటి దాకా గబగబా నడుస్తున్న నేను అడుగుల్ని నెమ్మది చేసాను.

ఇంతలో మా నాన్న గారు ఎదురయ్యారు. ‘చీకటైంది. ఇంకా ఇంటికెళ్లలేదా’ అంటూ..

ఆయన ముందుకెళ్ళిపోయారు. నేను వెనక్కి తిరిగి చూసాను. అమీర్ లేడు. పక్క సందు లోకెళ్లిపోయాడని గుర్తించాను. అంత మెరుపులా ఎలా మాయమైపోయాడు! బహుశా నాన్నని చూసేమో? ఎందుకో.. ఆ రాత్రం తా తెలీని దివులు. కలత. ఇదీ అని చెప్పలేని బాధ.

రెండు రోజుల తర్వాత ట్యూషన్ కెళ్ళాను.

నాకు తెలీకుండానే, అమీర్ కోసం నా కళ్ళు వెదికాయి. పిల్లలందరూ సీరియస్ గా తలలొంచుకుని గ్రామర్ ఎకర్సైజులు చేస్తున్నప్పుడు.. యాకూబ్ సార్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ని బోర్డ్ మీద కెక్కించి ఎక్స్ ప్లైన్ చేయడంలో మునిగినప్పుడు.. మూడో కంటికి తెలీకుండా కిటికీ పరదాల మీద వినిపించే ఆ చేతి వేళ్ల నించి పలికే సప్త స్వరాల కోసం చూసా. లేడు. కబూతర్ జాలీ దగ్గరాగినప్పుడు కిటికీ లోంచి లోపలికి చూసా. అక్కడ – నాకోసం వెదికే రెండు కళ్ళ కోసం. నన్ను చూడగనే మెరిసే ఆ మెరుపుల కాంతి కోసం. ఊహు. లేడక్కడ. ఇంట్లోంచి బైటకీ వెళ్తూ, వస్తూ… నాకందే రహస్య భాష లోని సంభాషణ తాలూకు ఏ సమాచారమూ చేరడం లేదు.

అసలు అమీరే కనిపించడం లేదు.

ఆ తర్వాత రోజున ఇలానే మబ్బు పట్టేసినప్పుడు యాకూబ్ సార్ అన్నారు. నేను దూరం వెళ్లాలి కాబట్టి – నన్ను త్వరగా ఇంటికెళ్ళిపోమన్నారు. ఇంతకు ముందులా.. అమీర్ వూళ్లో లేడు తోడు రావడానికని చెప్పారు.

గుండె గుభేల్మంది.

“ఎక్కడికెళ్లాడు సార్, అమీర్?” అడిగాను గబుక్కున.

“వైజాగ్ యూనివర్సిటీ లో సీటొచ్చింది తల్లి. అక్కడే హాస్టల్ లో వుండి చదువు కుంటాడు. నౌ హి బికేం ఎ బిగ్ బాయ్” అంటూ నవ్వాడాయన.

తను నవ్వలేదు.

అంటే ఆ సాయంత్రం.. అమీర్ తనతో చెప్పి వెళ్ళాలనుకున్నాడా? ఏం చెప్పాలనుకున్నాడు? కేవలం వూరెళ్తున్నానని చెప్పడానికే ఐతె, అంత దిగాలుపడెందుకున్నాడు?

 కాదు. ఒక వేళ మాట్లాడే అవకాశం వొచ్చుంటే ఇంకేమైనా చెప్పే వాడా? ఏమో. తెలీదు. కాని అంత డల్ల్ గా తనెప్పుడూ చూసింది లేదు అల్లరి చూపుల అమీర్ ని.

కొన్నాళ్ళు అమీర్ ఆలోచన్లు బాధపెట్టాయి.

ఆ తర్వాత అనుకోకుండా ఇంటి పరిస్థితుల్లో మార్పులు, కష్టాలు.. అన్నీ కలసి నన్నీ నిజ ప్రపంచంలోకి లాక్కొచ్చి పడేసాయి. వున్న వూరు వొదిలేయాల్సొచ్చింది. నగరం నా నివాసమైపోయింది. చదువు, ఉద్యోగం, ఎంత అవసరమో అంచెలంచెలుగా మెట్లెక్కి పోడాలు, ఆఫీస్ రాజకీయాలలో- కింద పడిపోకుండా సీట్ దక్కించుకోడాలు… ఇదే లోకమైపోయింది.

మళ్ళీ ఇన్నాళ్ళకి.. ఇలా.. ఒక సజీవమైన జ్ఞాపకం.. నన్ను చైతన్యం చేసింది. చాలు. అమీర్ మనసులొ తను అలానే వుంది. చెదరిపోకుండా. ఈ ఒక్క వాస్తవం చాలు. మనసు మధుశాలై పోడానికి.

హాండ్ బాగ్ భుజానికి తగిలించాను.

అది చూసి అమీర్ గంభీరమై పోయాడు.

అతనిచ్చిన ఆఫ్రికన్ ట్రైబల్ – నల్ల చెక్క తో చేసిన బొమ్మని భద్రం గా చేతిలోకి తీసుకుని.. తలొంచుకుని బయటకొచ్చేసా.

నిశ్శబ్దాన్ని తుడిచేస్తూ అమీరే అడిగాడు.

“మళ్ళీ ఎప్పు..డొ..స్తావ్?” అతని గొంతు జీర బోయినట్టనిపించింది. కాదు బరువుగా వినిపించింది. ఆ వెనకే గొంతు సవరించుకుంటున్న గరగర శబ్దం కూడా.

అది – బాధా? నిరాశా? ఏదైనా అయివుండొచ్చు, కాకపోయుండొచ్చు.

నేను తలొంచుకునే జవాబిచ్చాను. ‘ఇలాగే. ఎప్పుడైనా” అంటూనే.. గబగబా అడుగులేసుకుంటూ బైటకి వచ్చేస్తున్నా.

నా నీడ మాత్రం రావడం లేదు. అదక్కడే వుంది. తెలుస్తోనే వుంది. అదే నా భయం కూడా.

ఇన్నాళ్ళు అదేగా నా భావాలన్నిటికీ ఋజువుగా వుందీ! కష్టంలోనూ, సుఖంలోనూ కూడా తోడై వచ్చింది. నా కన్నా దానికే ఎక్కువ తెలుసు. నేనేమిటన్నది. అందుకే నా నీడనొదిలి నేనుండలేను.

illustrationనేనే వచ్చేసాక, ఇంక అది అక్కడుండి చేసేదేమిటో కూడా అర్ధం కాలేదు.

తల తిప్పి చూడలేను.

నా వెనకే – గేట్ దాకా వచ్చిన అమీర్ నిరాశగా చూస్తూ అక్కడే నిలబడిపోయున్నాడా?

లేక… గేట్ మూసేసి లోపల కెళ్ళిపోయాడా?

ఏమో.

ఒక్క సారి ఈ మలుపు దగ్గర ఆగి, వెనక్కి తిరిగి చూడాలనే కోర్కెని అతి బలవంతం మీద ఆపేసుకున్నాను.

అతనక్కడే వుంటే – గెలిచినందుకు దుఃఖమౌతుంది.

లేకున్నా అంతే. ఓడిపోయినందుకు ఏడుపొస్తుంది.

అందుకే వెనక్కి తిరిగి చూడదలచుకోలేదు.

ముందుకెళ్లిపోతూన్నా…

 ఓ అడుగు ఆలస్యంగా నైనా, నా నీడ కూడా మెల్లమెల్లగా అడుగులేసుకుంటూ నా వెనకే వచ్చేస్తోంది. నాతో వచ్చేస్తోంది. క్రమక్రమంగా నాలో కలసిపోతోంది.

ఎలానో అలా ఆ వీధి దాటేసాను.

హమ్మయ్యా. ఉక్కపోత నించి బయటపడ్డట్టు గా వుంది ప్రాణం.

నుదుటి మీది చిరు స్వేద బిందువుల్ని పూల గాలి – రుమాలుతో అద్దుతోంది. మెత్తగా. మృదువుగా.

కొసరి కొసరి వీస్తున్న అలల గాలి – వొంటిని తాకి, శాంతపరుస్తోంది. మనసునీ, శరీరాన్ని కూడా.

అవునూ?

ఎందుకనీ అమీరంటే ఇంత ఇదీ?

ఎందుకంటే..

‘అమ్మాయంటే నువ్వు’ అని ప్రత్యేకించి ఒక అబ్బాయి – మాటలతో కాకుండా చూపులతో అర్ధమయ్యేలా, అందంగా చెప్పడం వల్ల కావొచ్చు.

బహుశా ఆడం కూడా తొలి సారిగా ఈవ్ వైపు ఇలానే చూసుంటాడేమో!!

అది కాంక్ష కాదు. మోహమూ కాదు. అసలేదీ కాదు. ఆ భావానికి పేరు లేదు. కానీ చాలా విలువైనది. చాలా అరుదైనది.

నవ్వొచ్చింది.

బహుశా అమీర్ కీ అంతే అయివుండొచ్చు.

లేకుంటే ఆ హాండ్సంకి అతి సాధారణమైన తనంటే అంత ఇష్టవూ, మరింత గుర్తూ వుండే చాన్సేదీ?

ఈ గాలేవిటీ ఇలా వీస్తోంది.. వుండుండి.. విస్సురుగా.. హాయిగానూ.

ఊరకే! నీ కోసమై వుంటుందిలే.

అవునవును. నా కోసమే.

ఆకాశంలోకి మొహమెత్తి చూసి, నవ్వాను.

ఆ గాలి లో కలసిపోతూ నా నవ్వు కూడా!

– ఆర్. దమయంతి

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. 

Posted in 2015, కథ, మే and tagged , , , , .

32 Comments

  1. ఎంత అందమైన పిలుపు గౌరీ!మరి మరి వినాలనిపించేలా..
    మనసుపూల ప్రశంసపు జల్లు..ఎంత ఆనందాన్నిచ్చిందని!
    బహు ధన్యవాదాలు.

  2. చామంతీ ! నీ కధ అందరి మనసుల్లో అల్లిబిల్లిగా అల్లుకున్న అర్ధం కాని భావాల కలనేత ! నాజూకు నయగారం ! సున్నితమైన స్పర్శ ! పూర్తిగా గుర్తు రాని కల ! CONGRATULATIONS !

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.