cover

గాలి పొరలు

Download PDF

నిద్రలో ఉలిక్కిపడి కళ్ళు తెరిచిందామె.

ఆమె పక్కన – అతడు నిద్రలో వెల్లకిలా పడుకునే నోరుతెరిచి అరుస్తూ ఉన్నాడు. పడుకున్నవాడు పడుకున్నట్లుగానే ఉన్నాడు. కాళ్ళు చేతులు కదపటంలేదు. అ గొంతు అతడి గొంతులా లేదు. పీలమైన కేక. వికృతంగా ఉంది.

కల కావచ్చుననుకుని పక్కకు ఒరిగి అతడిని చేతులతో పట్టికుదిపి నిద్రలేపిందామె.

అతడు ఉలిక్కిపడ్డట్లు నిద్రలేచాడు. అతనలా నిద్రలోంచి మెలకువలోకి వస్తున్నప్పుడు తను అరుస్తున్నాడని అతడికి లీలగా అర్థమవుతూ ఉంది. పూర్తిగా మెలకువ వచ్చాక రెండునిమిషాలు మరింకేదో లోకంలో ఉన్నట్లుగా మౌనంగా ఉండిపోయాడు.

ఆమె లేచి చీకట్లో ముణుక్కున్న దీపం ఒత్తిని కొంచెం పెద్దదిగా చేయడంతో చీకట్లో నేలమీద గొంతుక్కూర్చున్న నల్లటి మనిషెవరో ఉన్నట్లుండి తటాలునలేచి నుంచున్నట్లు గోడమీద దీపపు నీడ పైకి లేచింది. వంటగది పొగలేమితో మాసిన గోడ గడియారం రాత్రి రెండుగంటలు చూపుతూ ఉంది.

అతడి చేతికి మంచినీళ్ళగ్లాసు అందిస్తూ అందామె ‘‘ఏమైంది, కలొచ్చిందా?’’

ఆమె కుంకుమ రంగు చీర చీకటిలో నల్లటి రంగుని సంతరించుకుని ఉంది.

అతడు గొంతులో నీళ్ళు మింగుతూ అవునన్నట్లు తలూపాడు. చెమట బిందువులు అతడి నుదుటిమీద మెరుస్తూ ఉన్నాయి.

‘‘పీడకలా’’?

అతడు మాట్లాడకుండా గ్లాసు నేలమీద పెట్టి వెనక్కు జరిగి చేరగిలి పడుకున్నాడు.

ఆమె కూడా ఒక గ్లాసు నీళ్ళు తాగి దీపపు వత్తి తగ్గించింది. ఒక్కసారిగా ఒత్తి తగ్గడంతో గోడమీద నిలువుగా పరుచుకున్న నీడ తటాలున ముణుక్కుని కూర్చుండిపోయింది. మంచం మీదకు వచ్చి దుప్పటి మీదకు లాక్కుని పడుకుందామె.

అతడు గుండెల మీద చేతులు మడిచిపెట్టుకుని చీకట్లోకి చూస్తూ ఉన్నాడు. ఆమె దుప్పటి తల వరకూ లాక్కుని అతడివైపు తిరిగి అతడి ఛాతీమీద చేయివేసింది. ఇద్దరికీ నిద్రపట్టలేదు. మసకచీకట్లో ఆమె మొహం కనపడటంలేదు. అతడు కళ్ళు తెరిచే ఉన్నాడుకానీ గతంలో ఉన్నట్లుగా ఉన్నాడు. కళ్ళు దేనినో చూస్తున్నాయి.

దేనిగురించి కల? దుప్పటిలోంచి తలెత్తకుండానే అడిగిందామె.

చాలాసేపు మౌనంగా ఉండి చెప్పాడతడు. ‘‘ఒకామె గురించి’’

ఆమె నిదానంగా దుప్పటి తొలగించి అలానే పడుకుని వెదురు మీద తాటాకులు, వరిగడ్డి కప్పిన ఇంటికప్పు వంక చూసింది. దుప్పటిమడతల మధ్య సన్నటి తెల్లటి ఆమె ముక్కుపుడుక లోయలోకి జారిన నక్షత్రంలా ఉంది.

కొంతసేపు మౌనం తరువాత ‘‘ఎవరామె?” అని ఆమె అతడికి ఇంకాస్త దగ్గరగా జరిగింది హత్తుకున్నట్లుగా..

“తెలిసిన మనిషే. ఇప్పుడెక్కడుందో తెలియదు. తెల్లటి చీర కట్టుకుని ఉంది కలలో. చాలా సంవత్సరాల క్రితం సంగతి. అప్పుడు పదిహేనేళ్ళ ప్రాయం ఆమెది. దాదాపుగా మరచిపోయాను. అప్పుడు నాకు పదిహేడేళ్ళు. ఇప్పుడెక్కడుందో తెలియదు. చాలా మారిపోయి ఉండవచ్చు. ఇప్పుడు చూస్తే గుర్తుపట్టలేనేమో. అచ్చం కలలో వచ్చిన మనిషిలా లేకపోవచ్చు. కాని ఆమె… ఆమే. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఎప్పుడో చిన్నప్పుడు చూసినవాళ్ళు, కలల్లో పెరిగి పెద్దయినవాళ్ళుగా కనిపించటం’’

‘‘ఇంతకీ ఆమె పేరు?’’

‘‘రాజి – రాజేశ్వరి’’ చెప్పాడతను.

‘‘ఆరోజుల్లో జీవితం ఆమెతోనే మొదలు, ఆమెతోనే అంతం అనిపించేది. అంతకుముందు, ఆమె తరువాత ఇంకెవరూ లేరనీ, నా జీవితంలో ఒక్క స్త్రీ, ఒకే ఒక స్త్రీ – ఆమెకు తప్ప ఇంకెవరీకీ ఈ హృదయంలో చోటులేదు అనుకునే వాడిని. అవి యవ్వనపు తొలి రోజులు’’

‘‘మరి ఆమె?’’

‘‘ఆమె – ఒక కొంటెకోణంగి. ఎప్పుడు చూసినా కుంకుమరంగు జాకెట్టు వేసుకుని పొడవాటి జడని కొప్పులా చుట్టి, మల్లెపూలు గుండ్రంగా చుట్టేది. ఆమె పెదవులమీద నవ్వంతా కళ్ళలో కనపడేది.’’

‘‘ఉదయాన్నే నేను కాలేజీకి వాళ్ళింటి ముందునుంచే నడుచుకుంటూ వెళ్ళేవాడిని. ఇంటిముందు ముగ్గువేస్తూ కనిపించేది. ఒకరోజు ఆమె చూడకుండా ఆ ముగ్గులో పూలు చల్లాను’’

‘‘ఆమె చూడలేదా?’’

‘‘చూడలేదు. అయినా ఆమె చూడటం కాదు నాక్కావలసింది అనుకునేవాడిని.’’

‘‘మరింకేమిటి? అయినా చూస్తే ఏమవుతుంది?’’ మసకచీకట్లో మెరుస్తున్న ఆమె కళ్ళు అతడివంక కొంటెగా చూస్తూ నవ్వుతూ ఉన్నాయి.

ఆమె అలా అడగ్గానే అతడిలో ఏదో తెలియని మార్పు వచ్చింది. అంతకుముందు కల తాలూకు భయంనీడ అతడినుంచి క్రమంగా తొలగిపోతూ అంతలోనే తెలియని ఇంకేదో భయం అతడిని ఆవరించింది. అతడి మొహంలో నీడలు మారాయి.

‘‘చూస్తే ఏమౌతుంది?’’ అందామె మళ్ళీ.

కాసేపటి తరువాత ఆమె నిద్రలోకి వెళ్ళిపోతున్నట్లుగా కళ్ళు మూసుకుంది. తృప్తిగా.

అతను సుదీర్ఘంగా చీకట్లోకి చూస్తూ చివరకు ‘‘తెలియదు’’ అన్నాడు. నిశ్శబ్దంలో.

ఆమె వింటున్నదో లేదో తెలియదు. అతను చెప్తూనే ఉన్నాడు. ఇంకా.

‘‘ఇష్టానికి కారణం చెప్పడమంటే నగ్నంగా చేయడమేమో. అయినా నాకు తెలీదు. ఇష్టమంటే ఇష్టమే. ఆమే నేను. నేనే ఆమె. ఆమెలోనే నేను ఉన్నాను అనుకోవాలి. నన్ను నేను చేరుకోవడం’’

అతడు చెప్తున్నది అమె చెవులకు లీలగా వినిపిస్తూ ఉంది. పగలల్లా బిగువుగా దువ్విన ఆమె జెడ నిద్రలో వదులైంది.

ఉన్నట్టుండి అతడు ఈ లోకంలోకి వచ్చాడు. అతడిని గతకాలపు ఛాయలు విడిచిపెట్టాయి.

‘‘అప్పటి నా ఆలోచనలు తలుచుకుంటే నవ్వు వస్తొంది. అదొక యవ్వనపు అతిశయం. ఆ అమ్మాయి, కాదు ఆమె మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత ఇలా కలలోకి వచ్చింది. మిగిలిందల్లా ఆనాటి జ్ఞాపకమే. ఇప్పుడు ఎవరిదారి వారిది. ఒకరకంగా ఆమెని పూర్తిగా మరచిపోయాను. అదొక అమాయకత్వం.’’

ఆమె ఇంకా చలనంలేకుండా కళ్ళుమూసుకునే ఉంది. పాదాల దగ్గర జరిగిన దుప్పటి. కుంకుమ రంగు చీర దాచలేకపోతున్న గజ్జెల మెరుపు. కొండచిలువ చుట్టుకున్నట్టు తెల్లటి పాదాలు.

అతడు చాలాసేపటివరకూ చీకట్లోకి చూస్తుండిపోయాడు.

బయట పొలాల మీంచి వీస్తున్న ఈదురుగాలి చప్పుడు.

* * *

సగం తెరిచిన తలుపుల మధ్య నుంచి అవతలి గదిలో కాసేపు అక్కడ ఎవరో నుంచుని మరికాసేపు ఆగి ఇటువైపు వస్తున్నట్లుగా… రెండు చేతుల మధ్య వెలిగే ప్రమిద. ఆమె జుట్టు విరబోసుకుని కుంకుమరంగు చీర అంచు పసుపురంగు చీకట్లో మెరుస్తూ ఉంది. నల్లటి కాటుక కళ్ళు. వంకీల జుట్టు వేలాడుతూ ఉంది. ఆమెని ఎక్కడో చూసినట్లే ఉంది. చెమికీలలో ఒదిగిన ఎర్రటి ముక్కుపుడక. దిగంతాన్ని దాటిపోతున్న నక్షత్రం.. ఎవరది? ఎవరు?

తన శరీరం పెనుగులాడుతున్నట్టు అతడు భావించుకున్నాడు. కాని కాళ్ళూ చేతులు ఉన్నచోటునుంచి ఒక్క అంగుళంకూడా జరగలేదని అతడికి అర్థమవుతూ ఉంది.

ఆమె మసక వెలుతురులో నడుచుకుంటూ వచ్చి మంచం పక్కనే ఉన్న స్టూలుమీద ప్రమిదని ఉంచి నిదానంగా అతడివైపు తిరిగి అతడి మొహంలోకి చూడబోయింది. ఆమె అతడి మీదికి ఒరగగానే ఒదులుగా ఉన్న పొడవాటి వెట్రుకలు వెనుక నుంచి అతడి మొహం మీద పడ్డాయి.

‘‘ఎవరది? ఎవరు?.. ’’

తెల్లటి శూన్యం.

ఆమె అలా అతడి మొహంలోకి చూసిన మరుక్షణమే అతడు భయంతో గట్టిగా అరిచాడు. కాళ్ళూచేతులు ఆడని పెనుగులాట. మూగవాడి కేక. తనలో తాను.

సుప్తావస్తనుండి చేతనావస్థకు చేరుతున్నప్పుడు, నిద్రనుంచి మెలకువలోకి అడుగుపెడుతూ అతడు కళ్ళు తెరిచాడు. తన గొంతు తనకే గుర్తుపట్టని విధంగా పీలగా ఉంది.

అతడి పక్కనే తెల్లటి దుప్పటిలో పడుకున్న ఆమె ఉలిక్కపడిలేచి అతడివంక చూసింది. అతడింకా పడుకున్నవాడు పడుకున్నట్లుగానే ఉండి కొద్దిగా నోరు తెరిచి అరుస్తూ ఉన్నాడు. కళ్ళు నిద్రలో మూతబడే ఉన్నాయి.

ఆమె కంగారుగా లేచి అతడిని పట్టి కుదిపి నిద్రలేపింది.

ఉలిక్కిపడి సగం మెలకువలోంచి మేలుకున్న అతను వెంటనే తేరుకోలేక పోయాడు.

‘అవును. ఏంజరిగింది?’

‘‘కల – ఇది కలే !’’

‘‘మరి ఆ గొంతు ఎవరిది అది నేను కాదు’ గొణిగాడతడు.

ఏమయింది? భుజంమ్మీద చేయివేసి అతడి కళ్ళలోకి చూస్తూ అనునయంగా అడిగిందామె. ఆమె చేతులపై నీలపు రంగు జాకెట్టు పైకి జరిగి మడతలుపడి ఉంది. ఆమె కట్టుకున్న తాలూకు తెల్లటి చీర దుప్పటి మడతల్లో చిక్కుకుని ఉంది.

ఒక్క క్షణం అతడు ఆమెని భయంతో చూసాడు. నిద్రమత్తులో మొదటగా గుర్తుపట్టలేకపోయాడు.

ఆమె అతడికి ఇంకాస్త దగ్గరగా జరిగింది.

అతడు గుండెల మీద చేతులు పెట్టుకుని చెప్పనారంభించాడు. ఆమె కళ్ళు మూసుకుని వింటూ ఉంది.

‘‘కలలోకి వచ్చింది’’ అని ఒక్క క్షణం ఆగి ‘‘ఒక యువతి’’ అన్నాడు.

ఆమె కళ్ళు నవ్వాయి.

అవి కౌమారాన్ని దాటిన యవ్వనపు తొలిరోజులు. నా హృదయం ఒక్కరికే అంకితమని ఒకప్పుడు అనుకునే వాడిని. ఆ రోజుల్లో ఒక యుక్తవయసు పల్లెటూరి అమ్మాయి ఆలోచనలు నన్ను వేధించేవి. కాని కాలం గడిచేకొద్దీ ఏమయిందో నాకూ తెలియదు. ఆ తరువాత అలా ఎన్నోసార్లు జరిగింది. ఆమెని ఎలా మరిచిపోయానో తెలియదు.

అలా ఎంతోమంది. కొందరు పరిచయస్థులు. కొందరు అపరిచితులు. అరక్షణంపాటు చూసినంతలోనే ఆమే కావాలి, ఆమె నా జీవితం అనుకుని మధనపడిన రోజులున్నాయి. మొత్తం సమస్తజీవితాన్ని విడిచిపెట్టి ఆ అరక్షణం ఆమె ముందు మోకరిల్లాలని అనిపిస్తుంది. ఎందుకనో తెలియదు.

‘‘ఇంతకీ కలలో వచ్చిందెవరు?’’

‘‘అవి నా చదువు పూర్తయిన రోజులు. ఉదయం తూర్పుదిక్కుకేసి సాయంత్రం దక్షిణంవైపు మైళ్ళకొద్దీ నడిచి వెళ్ళేవాణ్ణి. రోడ్డుకిరువైపులా పచ్చటి పొలాలు, రైతులు. నా ప్రయాణం మనుషులు తమ చేతులతో సాగుచేసిన భూములను దాటి మానవహస్తం చొరబడని నిర్జనప్రాంతాల్లోకి సైతం సాగేది. ఆరోజుల్లో ఒక సంధ్యాసమయాన తిరుగుప్రయాణంలో చూసానామెని.

“వాళ్ళది ఊరిచివర రెల్లుగడ్డి ఇల్లు. దానిని అనుకుని ఎత్తైన వేపచెట్టు. ఇంటిని ఆనుకునిపోతూ ఉండే కాలిబాట. కొంతదూరంలో బాటపక్కన మట్టితో అలికి ముగ్గులు పెట్టిన చిన్నగుడి.

“ఆ సాయంత్రం నేనలా నడుస్తూ చెట్టుకింద నుంచుని దూరంగా ఎగిరే పక్షులని చూస్తూ ఆగిపోయాను. అదిగో అప్పుడు కనపడిందామె. ఒక చేతిలో దీపం వెలుగుతూ ఉంది. మరొకచెయ్యి దీపం గాలికి అరిపోకుండా అపుతూ ఉంది. మొత్తంగా సూర్యాస్తమయపు బంగారువర్ణంలో ఉంది. ఎన్నో సంవత్సరాలుగా నేను వెతికే నా పురాతన దేవత ఆమేనని అనిపించింది. ఆ రంగు, ఆ కాంతి ఒక్కసారిగా ఎన్నో సంవత్సరాల నా గతాన్ని తుడిచిపెట్టేసింది. విచిత్రం అంతకుముందున్న యువతి నాలో కనుమరుగైపోయింది. ఆమె స్థానంలో ఈ కొత్తమనిషి నా హృదయాన్ని పూర్తిగా ఆక్రమించుకుంది. ఆ మరునాడు కూడా ఆమెను చూద్దామని అక్కడకు వెళ్ళాను. ఆమె అలాగే చేతిలో ప్రమిద తీసుకుని గుళ్ళోకి వెళ్తూ కనిపించింది’’

‘‘ఆమెతో మాట్లాడావా..’’

‘‘లేదు’’

‘‘ఆమెంటే ఎందుకిష్టం’’

‘‘ఎందుకో తెలియదు. ఇష్టాలకు కారణాలుంటాయా? నీకు కావలసిన, నీవు చేరవలసిన మనిషి ఎవరో ఉంటుంది. నేను చేరవలసిన మనిషి ఎవరు? ఒక మనిషి ఒక నదిలో దిగి స్నానం చేయగలడా? ఒకరెవరు? ఏ ఒకరు? నదిలోకి దిగక ముందు, దిగాక నీలో ఎందరున్నారు?

‘‘ప్రతిరోజూ సాయంత్రం మసక వెలుతురులో ధగధగలాడే సూర్యాస్తమయపు పసుపురంగు చీరతో అరచేతిలో ప్రమిదను పట్టుకుని గుడిలోకి వెళ్ళడం చూస్తుండే వాడిని. ఏమిటో తెలిసేది కాదు. చీకట్లో మెరిసే రంగు. సాయంత్రపు దిగులు. అప్పుడదేమిటో అర్ధమయ్యేదికాదు.’’

‘‘ఇప్పుడు తెలిసిందా మరి? అదేమిటో.”

‘‘తెలీదు.’’

మధ్యాహ్నం నిశ్శబ్దం. అలసటలోంచి మేలుకున్న పగటి నిద్ర.

* * *

అతడు రెండుచేతులు మెడ వెనక ఆనించి గోడకు చేరగిలబడి మాట్లాడుతున్నాడు.

‘‘అన్నీ పోయాయి. యవ్వనం తాలూకు ఉద్వేగాలు, బిడియాలు, భయాలు అన్నీ కరిగిపోయాయి. స్నేహాలు, ద్రోహాలూ.. నది ఉధృతమైన ప్రవాహానికి కొట్టుకుపోయినట్లు జీవితపు ఉధృతికి అన్ని స్పందనలూ కొట్టుకుపోయాయి’’

‘‘మరింకేం. ఇంకేం కావాలి నీకు? నది మైదానంలోకి విస్తరించుకున్నట్టు నువ్వు విశాలమయ్యావుగా’’ ఆమె విప్పుకున్న నల్లటి కురులలో ఒకటి రెండు తెల్లవెంట్రుకలు మెరుస్తున్నాయి.

అతడు కొనసాగించాడు.

‘‘ఆమె నాకంటే నాలుగేళ్ళు పెద్ద. ముఖ్యంగా ఆమె చూపు. విప్పార్చుకున్న కళ్ళతో దేన్నైనా స్పష్టంగా చూసేది. పరిపూర్ణమైన నవ్వు. నా జీవితానికి పరిపూర్ణతనివ్వగల స్త్రీ ఆమేనని అనిపించేది. ఇదంతా ఇలా ఎందుకు జరుగుతుందో తెలీదు. నా కది కావాలి. కాదు.కాదు. నేనది కావాలి. అది స్వేఛ్చ! అది సౌందర్యం…!’’ ఇంకేదో అతీతమైన శక్తి అతడిని పూనినట్లు మెరుస్తున్న కళ్ళతో గాలిలోకి చూస్తూ చెప్పసాగాడు. గతకాలపు యవ్వన శక్తి అతడిలో తొంగిచూసింది.

ఆమె అతడివంక ఆశ్చర్యంగా చూసింది.

ఎందుకో తెలీదు.. నాకు కావలసిన మనిషిని వెతకడం మానలేదు. నాకు కావలసిన మనిషి అనేక ముఖాలతో ఉంది. నేను ఏరూపంలోకి, ఏదేహంలోకి ప్రవహించాలి? ఏ నదిలో విశ్రమించాలి?

గాలిలోకి తెరుచుకున్న కళ్ళపై నీడలు కమ్ముకున్నాయి. అతడి వదనం విచారమైంది.

ప్రతి సౌందర్యానికీ నేనింకా పుడుతూనే ఉన్నాను. కొత్త వాంఛలతో తెరుచుకుంటూనే ఉన్నాను.

‘‘నేను శాపగ్రస్తుడిని’’.

ఆమె వెనక్కువాలి పైకప్పుకేసి చూస్తూ ఉండిపోయింది.. వెనక్కి విరబోసుకున్న ఆమె వెంట్రుకలు ఈదురుగాలికి పైకిలేస్తున్న మంటలవలె పైకి ఎగసిపడుతున్నాయి.

అతడు కిటికీలోంచి.. అవతల గాలిలోకి చూస్తూ అన్నాడు.

‘‘ఇంకా ఏదో దహించే దాహం… అది నాదేనా..?’’

* * *

galiporalu ilusఅవతల అనంతంగా పరుచుకున్న సముద్రం. ఇవతల నిలువెల్లా ఆకాశం. ఆంచుల చివరికి వెళ్ళి చూసాడు. సముద్రం తెల్లగా ఉంది. ప్రవహించే మంచులా. కనుచూపుమేరా విస్తరించిన లిల్లీపూలు. పూలవాసన లోతు తెలియని అగాథంలా ఉంది. ఆకాశం.. వెనుతిరిగి చూసేంతలో ఎవరో అవతలికి, అగాథంలా ఉన్న ఖాళీ ప్రదేశంలోకి దూకేశారు.

దూకింది ఎవరు? తనే..! కాదు ఇంకెవరో.. తనను మీదికి లోయలోకి లాక్కున్నారు. అగాధంలోకి జారిపోతోన్నట్లనిపించింది. ఒక్కసారిగా ఆకాశం నుంచి ఎవరో తనని జారవిడిచినట్లు.. ఏ ఆధారంలేక తలక్రిందులుగా వేలాడుతూ… జారిపోతూ చివరికి చేతికి ఏదో చిక్కినట్లై తడుముకుని చూస్తే నల్లటి వెంట్రుకలు.. భయంతో ఒక్కసారిగా కేకవేశాడతడు. సుదీర్ఘమైన కేక. గీతలా పైనుంచి కిందికి. తనలో.

సముద్రంలో కొట్టుకుపోతున్న తెప్ప అలలను తట్టుకుని బయటికి తేలినట్లు అతడు నిద్ర మధ్య కలవరిస్తూ మెలకువలోంచి కళ్ళు తెరిచాడు. తనది కాని తనగొంతు తనకే కొత్తగా వింతగా ఉంది. అవతల ఉన్నది ఎవరు?

చీకట్లోనే లేచి లైటు ఆన్‌ చేసాడు.

చల్లటి గాలికి కిటికీ కర్టెన్లు ఊగుతున్యాయి. కిటికీ పైకి పాకుతున్న మనీప్లాంట్‌ కొత్తశక్తినేదో నింపుకుని ఆకులతో తలెత్తుకుని ఉంది. అవతలి గదిలోంచి ఎవరో ఇవతలకు రాబోతున్నట్లుగా తలుపు నిశ్శబ్దంగా గాలికి ముందుకీ వెనక్కీ జరుగుతూ ఉంది.

గోడమీద గడియారం మూడుగంటలు చూపిస్తూ ఉంది. వేలాడదీసిన పెయింటింగ్‌లో మనుషులు, బొమ్మలు అలా కదులుతూ ఉన్నట్లుండి అక్కడే చలనంలేనట్లుగా ఉన్నాయి. వాటినలా చూస్తూ ఆమెవంక చూసి ఉలిక్కిపడ్డాడు.

ఆమె తల అటుపక్కకు తిరిగి, జుట్టుముడి విడివడి ఒదులుగా వేలాడుతున్న పొడవాటి వెంట్రుకలు మంచం కిందికి వేలాడుతూ నేలను తాకుతూ ఉన్నాయి. పొడవాటి వెంట్రుకల మధ్య సిగలో ఒక లిల్లీపువ్వు చిక్కుకుని ఉంది.

*

Download PDF

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి.
Posted in 2015, కథ, మే and tagged , , , , .

4 Comments

  1. ఇలాంటి కథ ను రాయడానికి ఒక conscious thought stream సరిపోదు. న్జంగానే బోల్డన్ని పొరలు చేధించుకుని వెళ్లి రాయాలి. కథలు రాయలనుకునేవారికి ఒక మంచి రెఫరల్ పాయింట్ ఇది. బుచ్చిబాబు ను గుర్తుచేశారు. ఇటువంటి కథను చదివి ఎంతోకాలమయ్యింది. ఇంకొంతకాలం ఈ కధ నా చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. దీని ప్రభావం నుండి బయటపడడానికి కాస్త సమయం పడుతుంది. రాసినవారు ధన్యులు! :) ఇటువంటి కథలింకా వస్తే బావుణ్ణు.

  2. వెలుతురు చూస్తే వెరపు, అనేకానేక నీడలుగా నన్ను దొంగిలిస్తుందని హడలు. అద్దాన్ని చూస్తే అదురు, అనుబింబాన్ని చేసి నన్ను కొల్లగొడుతుందని బెదురు. ఆటువంటి వెరపించే వెలుతురు… అదలించే అద్దంలాంటి ‘గాలిపొరలు’ కథ మీద కామెంట్ స్వకీయ సొద కాబట్టి ఈ Kinige spaceని దుర్వినియోగం చేయలేను, నా domains లోకి రమ్మంటూ విజ్ఞప్తి చేస్తానే తప్ప-
    http://on.fb.me/1FikuoT

  3. జీవితంలోని ఒక భావానికి గల ఇతర సమాంతరస్వరాల అభివ్యక్తిలో రచయిత ఒక సృజనాత్మకమైన అవకాశాన్ని స్వీకరించాడు. కథ వ్యక్తీకరణలోని గుప్తత కాల్పనిక సృజనలో విస్తృతిని పొందింది. సౌందర్యం, అనుభవం యొక్క దోబూచులాటలు, దాని ప్రత్యేకతలు – సామాన్యతల్ని అర్ధం చేసుకోవటానికి ఈ కథ ఉపకరిస్తుంది. కథ చదివాక నా నది యెక్కడుందోనని బెంగ కలిగింది.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.