cover

ఒక మామూలు నాన్న కథ

Download PDF EPUB MOBI

డియర్‌ ఎ.వి (అవిజ వెంకటేశ్వరరెడ్డి)

మీ నాన్న కోసం నీవు తీసుకొచ్చిన పుస్తకం నాకు నచ్చింది. కాకపోతే పుస్తకం నా చేతికి ఇచ్చిన వెంటనే నా అభిప్రాయం రాయమని కోరావు. నీవు ప్రేమగా అడిగావు, అంతే చనువుగా నేను రాయనని కూడా చెప్పాను. కానీ ఇప్పుడు నా అంతట నేనే రాయాలనిపించి రాస్తున్నాను. నీవు కోరినా రాయననటానికి పెద్దగా కారణం లేదు. కానీ ఇప్పుడు రాయటానికి మాత్రం బలమైన కారణమే ఉంది. మరో ముఖ్యమైన విషయం. ఇది నీ కోసం రాస్తున్నది కూడా కాదు.. కొల‘వెర్రి’ తరంపై చిర్రెత్తుకొచ్చి రాస్తున్నది.

ఆఫీసులో ఉండగా నా చేతికి పుస్తకమిచ్చావు. నా డెస్కుపై కొత్త పుస్తకాన్ని చూసి కొంత మంది ఔత్సాహిక మిత్రులు ఆత్రంగా తీసుకుని ఆబగా పరిశీలించారు. ఎంత వేగంగా ఆకర్షితులయ్యారో.. అంతే వేగంగా వారి అభిప్రాయాన్ని కూడా చెప్పేశారు. కొన్ని పాత పాటలు, పద్యాలు, కొన్ని లేఖలు.. ఇంతేనా.. ఒకరు కాదు ఇద్దరు కాదు.. చూసిన ప్రతి వాడూ అదే కామెంట్.. ఇదేం పుస్తకమని. పుస్తకమంటే ఇలా ఉండాలని ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా చెప్పినట్టు నాకైతే తెలియదు. ఒక వేళ ఎవరైనా చెప్పి ఉంటే అది శుద్ధ తప్పు అని నా నిశ్చితాభిప్రాయం.

ఇది సమాచార విప్లవ యుగం. నిజమే కాలనుగుణంగా ఎవరైనా నడుచుకోవాల్సిందే. ఒప్పుకుంటాను. అంత మాత్రానా ఇక దేన్నీ పట్టించుకోమంటే ఎలా? తాతముత్తాతల నుంచి తండ్రుల తరం దాకా సాగిన పోరాట చరిత్రను విస్మరించడం.. వారి పోరాటల ఫలితంగా సాకారమైన ఎన్నో హక్కులను అనుభవిస్తూ వారిని విస్మరించడం ఏ వెలుగులకీ ప్రస్థానం?

ఫలానా సెలబ్రిటీకీ ఫలానా హీరోనో హీరోయినో అంటే ఇష్టమట, వారికి ఫలానా డ్రెస్సంటే ఇష్టమట, ఫలానా రచయిత అంటే చెవి కోసుకుంటారట, ఇష్టమైన హాలీడే స్పాట్‌ ఫలానా అట.. సాధారణంగా ఇలా సాగుతుంటాయి సెలబ్రిటీల ముచ్చట్లు. ఇప్పటి తరం బాగా ఇష్టపడే సమాచారమిదే. ఏ సినిమా ఎప్పుడు రిలీజవుతుంది, ఎన్ని సెంటర్లు, ఎంత కలెక్షన్లు, నైన్టీ పర్సెంట్‌ వాళ్ళ మస్తిష్కం సమస్తం ఈ ఇన్ఫర్మేషన్ తో నిండిపోతోంది? ఈ సమాచారంతో వాళ్ళేం సాధిస్తారో వాళ్ళకైనా తెలుసా అన్నది నా అనుమానం. జీవితంలో ఎన్నడూ తారసపడని, ఒక వేళ పడినా ఎవరికీ ఏమీ ఒరగని ఆ సెలబ్రిటీల గురించి ఇంత సమాచారాన్ని ఎందుకు సేకరిస్తున్నారు? ఇదే జ్ఞానమని ఎందుకు భ్రమపడుతున్నారు? ఎవరిని మభ్యపెడుతున్నారు?

అమ్మా, నాన్నల కంటే మించిన సెలబ్రిటీలుంటారా?

దేహం, జ్ఞానం, బ్రహ్మోపదేశమిచ్చిన నాన్నకంటే గొప్ప సెలబ్రిటీ ఎవరు? రక్తాన్ని మాంసం ముద్ద చేసి, తన ప్రాణం పోతుందని తెలిసినా బిడ్డకు ఊపిరిపోసి నేలపైకి తెచ్చి.. తాను తిన్నా, తినకపోయినా బిడ్డల ఎదుగుదలను కోరే తల్లికన్నా సెలబ్రిటీ ఎవరు?

తండ్రి పడక మీద తుమ్మముళ్ళు పరిచే వాళ్ళున్నారు. పెళ్ళాలే బెల్లమని భ్రమిసే మగానుభావులూ ఉన్నారు. పుట్టిచ్చిన పాపానికి ఏమిచ్చావని ఉసురు పోసుకునే పుత్ర పౌత్రికా రత్నాలూ ఉన్నాయి. ఆస్తిపాస్తులిచ్చినా అవసాన దశలో ఆత్మీయతలకు దూరంగా, అయినవారికి దూరంగా ఓల్డేజీ హోంలలో కన్నవారిని నెట్టేసి చేతులు దులుపుకునే సద్గుణ సంపన్నులూ ఉన్నారు. ఇలాంటి వారికి ఏం చెబితే.. ఎంత చెబితే తల్లిదండ్రుల గొప్పతనం తెలుస్తుంది?

అవిజ బాలీశ్వర్‌రెడ్డి.. ఎవరితను? ఓ మామూలు తండ్రి. సవాలక్ష తండ్రుల్లాగే అష్టకష్టాలు పడి సంసారాన్ని గుట్టుగా నడిపి నెట్టుకొచ్చిన అతి మామూలు నాన్న. ఇంతకన్నా గొప్పేముంది? అతనేమన్నా డాక్టరా? ఇంజనీరా? ఏదైనా వృత్తి నిపుణుడా? ఊరికి మొనగాడా? ఉద్యమకారుడా?

జనంలో పేరొస్తేనే ఆ మనిషి గురించి తెలుసుకోవాలనే తప్పుడు అభిప్రాయంలో బతికే అజ్ఞానుల చెంప ఛళ్ళుమనిపించింది ‘మీ నాన్న’ పుస్తకం.

స్వతహాగా కష్టాలు పడుతున్నా.. కుంగిపోకుండా.. సాటి మనుషుల కోసం, సాయంకాలాలో.. సాగు సమయంలోనో.. నోరార పద్యాలు పాడి అలసిన మనసులను రంజింప చేసిన వేళ అవిజ బాలీశ్వరరెడ్డి మానసిక వైద్యనిపుణుడంటే ఎవరైనా కాదనగలరా?

కక్షలు, కార్పణ్యాలతో తెగనరుక్కోవటమే సంస్కృతిగా, ఆధిపత్య పోరే పరమావధిగా నిత్యం రక్తమోడే సీమ పల్లెల్లో.. ఫ్యాక్షన్‌ రొంపిలో ఉన్న ఒకరిద్దరినైనా ఆ ఊబి నుంచి తన అనుభవమంతా రంగరించి నాలుగు మంచి మాటలు చెప్పి బయటకు లాగిన అవిజ బాలీశ్వరరెడ్డి గొప్ప సంఘసంస్కర్తంటే ఎవరైనా కాదనగలరా?

 35 ఏళ్ళ సర్వీసులో ఏటా చెప్పిన పాఠాలే చెప్పి విసిగిపోయిన తెలుగు పండితుల్లో ఎంత మందికి ఎన్ని పద్యాలు కంఠతా వచ్చు? రసరమ్యంగా వాటిని పాడటం వచ్చు? సాహిత్య సమరాంగణంలో చెలరేగిపోయే అరివీర భయంకర విమర్శకులు, రచయితలకెంత మందికి ఎన్ని కావ్యాలు గుర్తున్నాయి? కనీసం వారు రాసిన కవిత్వమో, కథనో, కాకరకాయనో అడిగిందే తడవు చకచకా చెప్పగలిగేది ఎంత మంది. వీరందరితో పోలిస్తే.. తాను సృజించకున్నా.. తనకిష్టమైన దాన్ని తరాల అంతరం లేకుండా అడిగిన వారందరికీ ఆజన్మాంతం పంచిపెట్టిన అవిజ బాలీశ్వరరెడ్డి ఎవరి కన్నా ఎందుకు తక్కువ?

అవిజ బాలీశ్వరరెడ్డి.. మీ నాన్న.. మీకొక్కరికే నాన్న.. అయితేనేం.. కేవలం ఒక నాన్నగానే గాక.. ఒక చిన్నాన్నగా, ఒక మేనమామగా.. మరొక బంధువుగా.. ఊరి తలలో నాలుకగా.. పరిచయమున్న ప్రతి ఒక్కరికి మంచి మనిషిగా.. ఊరికి దూరంగా వివిధ రంగాల్లో స్థిరపడిన చిన్ననాటి మిత్రులకు చిరకాల జ్ఞాపకంగా.. ఎవరికీ భిన్నాభిప్రాయం లేని వ్యక్తిగా ఇన్నేళ్ళపాటు జీవించడం మాత్రం గొప్పే.

ఇక్కడే ఓ విషయం చెప్పాలి. మీ నాన్నతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ ఉత్తరాలు రాసిన ఆయన సహాధ్యాయులు కావచ్చు. సమాన వయస్కులు కావచ్చు. కానీ వారందరి రాతల్లో ఒక వాక్యం కామన్‌గా కనిపించింది. బాలీశ్వర్‌రెడ్డి అప్పుడే పోయాడా అని బాధపడుతూ భారంగా రాసిన వాక్యం. ఈ రోజుల్లో 70 ఏళ్ళ పాటు ఓ మనిషి జీవించడం చిన్న విషయమేమీ కాదు.. అయినా అప్పుడే పోయాడా అని వారందిరికీ అనిపించిందంటే.. ఆయన సహృదయతకు ఇంతకన్నా రుజువేముంది?

చివరగా.. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. పుస్తకాన్ని ఏకబిగిన చదివేశాక నాకు కలిగిన ఫీలింగ్‌ను అక్షరాల్లో కూర్చాను.

- నీ మిత్రుడు

 ఆనందవర్ధన్‌

ప్రచురణ: డిసెంబరు 2011; వెల: అమూల్యం

IMG_20150509_181322_1431175467868ప్రతులకు: ఎ.వి. రెడ్డి

80-130-2సి, వీరభద్రనగర్

అబ్బాస్ నగర్ హౌసింగ్ బోర్డు వెనుక

కర్నూలు – 518002

సెల్: 94405 03071, 93964 54932; ఫోన్: 08518-231871

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి.
Posted in 2015, పుస్తక సమీక్ష, మే and tagged , , , , , , , .

2 Comments

  1. Pingback: వీక్షణం-138 | పుస్తకం