cover

ముఖాముఖం

Download PDF EPUB MOBI

చలికాలం మంచు ఇంకా గాలిని విడిచిపెట్టలేదు.

ఉదయంపూట నల్లటి తార్రోడ్డుమీద నడుస్తూ ఉన్నాను. దారికి ఇరుపక్కలా ఏపుగా పెరిగిన చెట్లు. నడుము వరకు ఎడాపెడా పెరిగిన పచ్చిగడ్డి, పిచ్చి మొక్కలు. కొమ్మలకు వేలాడే పేరు తెలియని పూలు. రోజూ ఇదే దారిలో పాతికేళ్ళ యువకుడు స్పోర్ట్స్‌ షూస్‌ వేసుకుని జాగింగ్‌ చేసుకుంటూ నా పక్కనుంచే వెళ్తాడు. తెల్లటి టీషర్ట్‌ వేసుకున్న ముసలాయన నాకు ఎదురౌతాడు. ఇంకా ఒకరిద్దరు. వీళ్ళంతా ఎదురైనా ఎవరితోనూ నాకు పరిచయంలేదు. ఎదురెదురుగా వచ్చినప్పుడు పలకరింపుగా నవ్వడం అంతే. ఇదంతా రోజూ జరిగేదే.

అయితే రోజూ కనిపించేవాళ్ళు ఈరోజు కనిపించలేదెందుకో. తెలిసిన మొహాలేమైనా కనిపిస్తాయోమోనని నడుస్తూ ఉన్నాను. రోడ్డుమీద నా అడుగుల శబ్దం నాకే వినిసిస్తూ ఉంది.

ఉన్నట్లుండి దారిపక్కన చెట్ల మధ్య ఒక తెల్లటి ఆకారం కనిపించింది. మంచులో నుంచుని ఉన్న మనిషి. ఒక నిమిషం ఆగి నిలుచున్నాను. అతడలా రోడ్డుపక్కన చెట్లమధ్య ఎందుకు నిలుచున్నాడో అర్థం కాలేదు. ఒంటిపై తెల్లటి పైజమా. సగం వెంట్రుకల బట్టతల… అతడు సుందరం! నేను గుర్తుపట్టి పిలిచే లోపే అతడే నన్ను పలకరిచాడు.

“హెలో నిరంజన్‌!”

“సుందరం..! మీరా! ఇన్నాళ్ళూ ఎక్కడున్నారుర? ఏమైపోయారు?”

అతడు సమాధానం చెప్పకుండానే “మీరు అదే ఇంట్లో ఉంటున్నారుగా.. వీలయితే సాయంత్రం కలుస్తాను. ఉంటారుగా?” అన్నాడు.

“ఉండేది అక్కడే. సాయంత్రం ఏడు తరువాత ఆఫీసు నుంచి ఇంటికి వస్తాను.

అతడి చేతిలో సన్నటి గడ్డిపరక ఉంది. అప్పటి వరకూ దానిని తదేకంగా పరికించి చూస్తున్నట్లున్నాడు. దగ్గర నుంచి చూస్తే మనిషిలో చాలా మార్పు కనిపించింది. మీద, ముఖం మీద గీతలు మారాయి. అతడిని మళ్ళీ చూస్తానని అనుకోలేదు. ఆరోజుల్లో అతడి ఒత్తైన జుట్టు నిర్లక్ష్యంగా ఉండేది. చెంపలు లోపలికి ఉండేవి. ఇప్పుడు చెంపలు ఉబ్బి, ఒళ్ళు చేసినట్లు అనిపించాడు. జుట్టు కాస్త వెనక్కి జరిగి పలచటి వెంట్రుకలతో బట్టతల కనిపిస్తూ ఉంది. ఇప్పుడు దాదాపు కొత్తమనిషి.

నేను వెనక్కి తిరిగి చూసాను. ఎత్తైన మట్టి గట్టు దిగి అతను వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అతడిని మాలతి గురించి అడుగుదామనుకున్నాను.

ఇంటికి వెళ్ళిన తరువాత తలుచుకుంటే అంతా కలగా అనిపించింది. సుందరం అక్కడ, చెట్ల మధ్య కనిపించడమేమిటి? నేనక్కడే నిలబడి అతడితో మాట్లాడటమేమిటి?

సుందరాన్ని నేను చివరిసారి చూసింది ఏడేళ్ళ క్రితం. ఉన్నట్లుండి ఒక్కసారిగా అతడు ఎవరికీ కనపడకుండా అందరికీ దూరంగా ఉన్నాడు. ఇన్నేళ్ళు ఎక్కడ ఉన్నాడో తెలియదు. అందరూ దాదాపు అతడిని మరచిపోయారు. అసలు నేను చూసింది ఆనాటి సుందరాన్నేనా? లేక భ్రమా?

నన్ను బాగా ఆకర్షించింది ఈ ఏడేళ్ళలో అతడిలో వచ్చిన మార్పు. అతడిలో కొత్తగా వచ్చిన మార్పును గుర్తించలేక పోతున్నాను. పాత మనిషిని కూడా పూర్తిగా గుర్తుకు తెచ్చుకోలేకపోతున్నాను. జ్ఞాపకం లేకపోవడం కాదు. కనుమరుగవడం కాదు. మసకబారడం.

సుందరం కవిగా నాకు పరిచయం. ఉద్యమాలలో తిరిగేవాడు. అతడి కవిత్వమంతా రక్తం మరిగే ఉద్యమమే. ఆవేశమే. అతడి సహచరి మాలతి సామాజిక కార్యకర్త. తనుకూడా ఉద్యమ కవయిత్రి. సుందరం ఎందుకో ఉన్నట్లుండి రాయడం ఆపేశాడు. అందరికీ దూరంగా వెళ్ళిపోయాడు. క్రమేణా కనుమరుగయ్యాడు. ఇక అ తరువాత అతడిని అందరూ మరచిపోయారు. మాలతి మాత్రం ఎప్పుడన్నా దినపత్రికలో వార్తరూపంలోనో లేక కవితరూపంలోనో కనిపిస్తుండేది. ఎక్కడుందోమాత్రం ఎవరికీ తెలియదు.

ఆఫీసుకు వెళ్ళే హడావుడిలో ఇక అతని సంగతే మరచిపోయాను. పగలంతా బల్లలు, చుట్టూ కాగితాలు. ఇనుప చేతుల మనుషులు. వీటన్నిటి మధ్య అతడు నాకు గుర్తుకు రాలేదు. సాయంత్రం బస్సుదిగి నడుచుకుంటూ ఇంటికి వెళుతుంటే ఫోను మోగింది. కొత్త నెంబరు. తీస్తే “నేనే సుందరాన్ని. ఇంటికే వస్తున్నావా? మీ ఇంటికి వెళ్ళే దారిలోనే ఉన్నాను” అని తను ఎక్కడున్నాడో చెప్పాడు.

నాకు జనాన్ని చూస్తూ నింపాదిగా నడవటం అలవాటు. సుందరం కోసం అతడు చెప్పినచోట ఎదురు చూస్తూ నిలబడ్డాను. రోడ్డుమీద ఒకటే జనం. ఈగల్లా, దోమల్లా. చెదపురుగుల్లా. రోడ్డుకవతల కనిపిస్తున్న వైన్‌ షాపులో ఒకటే రద్దీ. చేతిలో పారలు, పనిముట్లతో కౌంటరు ముందు తోసుకుంటున్న కూలీలు. మరో పక్క రోడ్డుమీద చెవులు హోరెత్తిస్తున్న వాహనాల రద్దీ. వాటిమధ్యలో సందు చూసుకుని గబగబా రోడ్డుదాటుతున్న మనుషులు. గుంపులు గుంపులుగా మనుషులు.

కొంతసేపటికి జనాన్ని తోసుకుంటూ వైన్‌షాపు ముందునుంచి చేతిలో నల్లటి సంచితో బయటపడ్డాడు సుందరం. అతడి తెల్లటి బట్టలు నలిగిపోయి ఉన్నాయి. రోడ్డు దాటి “లేటయందా.. చూస్తూనే ఉన్నావుగా.. షాపులో ఒకటే జనం..”

“సుందరం.. ఇప్పుడిదెందుకు?” అన్నాను అతడి చేతిలో నల్లటి సంచిచూస్తూ.

“తప్పేముంది బ్రదర్‌. కాసేపన్నా అలా వాస్తవంలో పయనిద్దాం” అన్నాడు నవ్వి నా భుజం తడుతూ. ఇద్దరం నడవటం మొదలెట్టాక “అయితే నువ్వు మానేశావన్న మాట” అన్నాడు. “లేదు అప్పుడప్పుడూ” అన్నాను. దారిలో పాన్‌షాపులో సిగరెట్లు కొనుక్కుని ఇంటికి నడిచాము. దారిలో సుందరం ఏమీ మాట్లాడలేదు. మారిన అతడి ముఖకవళికలనీ శరీర కదలికలనీ గతంతో పోల్చుకుంటూ నడుస్తున్నాను.

ఇంటికి చేరగానే సుందరం కొంత మందు గ్లాసులో పోసుకుని నా పుస్తకాలు చూడటంలో మునిగిపోయాడు. నేను మంచం మీద వెనక్కివాలి పేపరు చూస్తూ ఉంటే కాలింగ్‌ బెల్‌ మోగింది.

తలుపు తెరిచి చూస్తే చీకట్లో నుంచున్న నల్లటి ఆకారం. చెమట వాసన. మాసిపోయిన బట్టలతో బయట మోహన నిలబడి ఉన్నాడు.

మోహన నాకు ఎప్పుడూ అనుకోని అతిథే. పగలంతా పనిచేసి వచ్చినట్లుగా బట్టలు మాసి అలసటతో ఉన్నాడు. చేతిలో నల్లటి క్యారీబ్యాగ్‌. అందులో ఏముంటుందో నాకు తెలుసు. మోహన రమ్మని చెప్పినప్పుడు రాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. వచ్చేముందు చెప్పడు. అతడి దినచర్యకు ఒక ప్రణాళిక అంటూ లేదు. అతడొక సంచారజీవి అనుకోవాలి. పగలంతా ఎక్కడో అక్కడ కూలిపని చేసుకుంటూ రాత్రుళ్ళు ఎక్కడో నిద్రపోతాడు. పనికి వెళ్లబుద్ది కానప్పుడు పగలంతా అఫ్జల్‌గంజ్‌ లైబ్రరీలో కూర్చుని పుస్తకాలన్నీ తిరగేస్తుంటాడు. సుందరం లానే మోహన కూడా కవి.

సుందరం కవిత్వం నిండా ఉద్యమం, ఆవేశం, హింస, రక్తపాతం నినాదం ఉంటే మోహన కవిత్వం ఇంకోలా ఉంటుంది. అదెలా ఉంటుందో చెప్పలేను. దృష్టికి అందదు. సగం తెలుస్తూ ఉంటుంది. సగం తెలియదు. పులి ఒకటి మైకంలో దొర్లుతూ ఉన్నట్టు ఉంటుంది. బహుశా అతడి కవిత్వంలో నాకు తెలియని మిగతాదేదో సుందరానికన్నా తెలుసుండాలి. ఏమో నాకు కవిత్వం గురించి తెలియదు. కాని విచిత్రంగా ఇద్దరూ పరస్పర విరుద్దమైన మనుషుల్లా కనిపించినా సుందరానికున్న ఆదర్శాలే మోహనకి ఉన్నాయి.

మోహన లోపలికి వస్తూనే చెప్పులు విడుస్తూ సుందరాన్ని చూసి “ఓహో నువ్వూ ఉన్నావా?” అన్నాడు. అతడి గొంతులో వెటకారం కనిపించింది. అతడలా అనకుండా ఉంటే బాగుండును అనిపించింది. నాకిద్దరూ ఇష్టమే. వాళ్ళిద్దరికి ఇంతకుముందే పరిచయం ఉన్నట్లు నాకు తెలియదు. నా మనసు ఏదో కీడు శంకిస్తూ ఉంది. ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరైనా ఒకరే ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇతరులను గాయపెట్టడం ఇష్టముండదు నాకు.

సుందరం సిగరెట్‌ పొగ గాలిలోకి వదులుతూ “ఎన్నాళ్ళయింది నిన్ను చూసి,?” అన్నాడు.

మోహన బదులు చెప్పకుండా వంటగదిలోకి నడుస్తూ ఉల్లిపాయలు ఉన్నాయా? అనడిగాడు. వచ్చినప్పుడల్లా అతడు మందుతో పాటు చికెన్‌ కూడా తెచ్చుకుంటాడు.

మోహన చికెన్‌ కడుగుతూ ఉంటే నేనూ, సుందరం ఉల్లిపాయలు తరగటం మొదలుపెట్టాం.

కాసేపటి తరువాత వంటగదిలో పొయ్యిమీద పొగలు రావడం మొదలయ్యాయి. ముగ్గురం వంటచేస్తూనే హాలులో అటూ ఇటూ తిరుగుతూ గ్లాసులు ఖాళీ చేస్తున్నాం.

వంట పూర్తయాక వాళ్ళిద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు. మాముందు టీపాయ్‌ మీద గాజుగ్లాసులు, చికెన్‌ ముక్కలు.

“అది సరే… మనిషి ఉన్నట్లుండి ఎలా మారతాడో చెప్పు” అన్నాడు మోహన సగం కళ్ళు మూసుకుని. అతడి ధోరణి సుందరాన్ని బెదిరిస్తున్నట్లు ఉంది. ఇద్దరూ గొడవపడతారేమో అని భయపడుతూ ఉన్నాను. వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవేంటో నాకు తెలియదు.

“అంటే మారడం గురించా?”

“పోనీ నీ భాషలో – పరిస్థితులు ఎలా మారుతుంటాయో.. కనీసం అదన్నా చెప్పు. నాకు జ్ఞానోదయం చేయి”

సుందరం ముఖం వివర్ణమయింది. “నాకు తెలియదు. దాన్ని గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు” అన్నాడతడు. అతడిలో తప్పించుకోచూసే ధోరణి నాకేం కనిపించలేదు.

వాళ్ళిద్దరికీ కొద్ది కొద్దిగా మందు ఎక్కుతూ ఉంది. నేనెక్కువ తాగలేను. మోహన కాస్త ఎక్కువగానే పుచ్చుకుంటాడు. పక్కవాళ్ళని భయపెట్టేంతగా. ఇప్పుడతడి ధోరణి సుందరాన్ని లెక్కచేస్తున్నట్టుగా లేదు. అతడు సుందరం కంటే పాతికేళ్ళు చిన్నవాడు.

“తెలీదని చెప్పడం చాలా తేలిక. చాలాకాలంగా నువ్వు ఈ లోకం నుంచి పారిపోయావు. చాలారోజుల్నుంచి మనుషులకు దూరంగా జీవిస్తున్నావు. ఇదంతా ఎందుకనో నాకు తెలియాలి?”

గత ఏడు సంవత్సరాలుగా సుందరం ఏమయ్యాడో నాకూ తెలుసుకోవాలని ఉంది. వాళ్ళు మాట్లాడుకునేది జాగ్రత్తగా వినసాగాను.

సుందరం ఒక నిట్టూర్పు విడిచి “ఒకరోజు.. అనుకోకుండా జరిగిందది.. ఆరోజు సాయంత్రం…” అని చెప్పనారంభించాడు.

మోహన సిగరెట్‌ వెలిగించాడు.

“ఏడేళ్ళ క్రితం.. బహుశా వేసవి కావచ్చు, నాకు తారీఖు గుర్తులేదు… విజయవాడ, కృష్ణానది.. ప్రకాశం బ్యారేజ్‌.. మీకు తెలుసుగా ఇప్పుడు ఆ వంతెన మీద కేవలం ఆటోలు, పాదచారులకే అనుమతి.. అసలప్పుడు అటువైపెందుకు వెళ్లానో తెలియదు. ఆరోజు నాకు తెలీకుండానే నా అడుగులు అప్రయత్నంగా ఆ పాతకాలపు వంతెనవైపు వెళ్ళాయి. ఎండ తగ్గుతుండటంతో పాదచారులు, దుర్గగుడికి వచ్చే భక్తులు వంతెన రైలింగ్‌ పట్టుకుని వంతెన కింద నీళ్ళను చూస్తూ ఉన్నారు. ఫుట్‌పాత్‌ మీద విశ్రాంతి తీసుకునే భిక్షకులు, మాసిన కాషాయబట్టలతో బైరాగులూ, విటులతో నవ్వుతూ మాట్లాడే వేశ్యలు, జేబుదొంగలు అరోజంతా అక్కడే ఉన్నారు. కొందరు వంతెన పక్కనే ఫుట్‌పాత్‌మీద కూర్చుని పులిజూదం ఆడుతున్నారు. ప్లాస్టిక్‌ డబ్బాలతోకూడిన ముష్టివాడి ముతక వాసన. అప్పటికింకా తెల్లగా నీలంగా ఉన్న సాయంకాలపు ఆకాశపు రంగు నిదానంగా మసకబారుతూ నలుపురంగును చేరుకుంటూ ఉంది. నడుస్తున్నవాడినల్లా ఒకచోట ఆగి రైలింగ్‌ పట్టుకుని కిందకు చూసాను. ఉధృతంగా ముందుకు దూకే నీటి ప్రవాహం. రాళ్ళను ఢీకొట్టి మెలికలు తిరుగుతూ నురగలు కక్కుతున్న నీళ్ళు. వంతెనకింద నుంచి విసురుగా పైకి వీస్తున్న చల్లటి గాలి. సుడులు తిరుగుతూ ముడులు విప్పుకుంటూ దూరంగా వెళ్ళిపోతున్న అలలు.

“అడుగులు ముందుకేసి మరింత ముందుకు సాగాను. ముందుకు నడిచేకొద్దీ చూడటానికి వచ్చిన యాత్రికులు, భక్తులు, భిక్షకులు కనుమరుగవుతూ వంతెన మీద నివాసమేర్పరచుకున్నవారు కనిపించసాగారు. మనుషుల ఆహార్యం గమనించడం మొదటినుంచీ నాకు అలవాటు. ఈ గమనింపు ఒక పనిగా కాక దానంతట అదే జరిగిపోతూ ఉంటుంది.

“తలనిండా పూలు పెట్టుకున్న ఒక వేశ్య విటుడితో మాట్లాడుతూ నదిలోకి చూస్తూ ఉంది. ఫుట్‌పాత్‌ మీద పడుకున్న బైరాగి ఒడు కాలుమీద కాలేసుకుని తలమీద కళ్ళకడ్డంగా చేయి పెట్టుకుని దీర్ఘాలోచనలో ఉన్నాడు. కొంతమంది యువకులు రకరకాల రంగుల బట్టలతో ఉన్నారుగాని వాళ్ళంతా మురికిగా ఉన్నారు. వాళ్ళంతా మురికిగా ఉన్నారుగాని వాళ్ళంతా ఆ సాయంత్రం సంతోషంగా ఉన్నారు. నల్లటి ఒక యువకుడు ఫుట్‌పాత్‌ గట్టుమీద కూర్చుని మొబైల్‌ ఫోనులో ఎఫ్‌.ఎమ్‌. రేడియో వింటూ ఉన్నాడు. అతడి చేతికి రంగులు గొలిపే వాచీ. మెడలో మెరిసే పూసల గొలుసు ఉన్నాయి.

“వాళ్ళను అలా చూస్తూ ఉంటే ఒక ఆలోచన తట్టింది.

“అక్కడ ఉన్నవారంతా సంతోషంగానే ఉన్నారు. విటుడితో స్నేహం చేస్తూ సంతోషంగా సమయం గడుపుతున్న వేశ్య. నవ్వుతూ, తుళ్ళిపడే యువకులు. వాళ్ళు ధరించిన బట్టలు. వాటి డిజైన్‌. ప్రపంచంలోని ఏ ఆధునాతన ధోరణికీ తీసిపోని శైలి. అవే బట్టలు. రంగురంగుల బట్టలతో. ఆధునాతనమైన దుస్తులతో. అవి నాణ్యతలో నాసిరకం కావచ్చు. అయితేనేం చూపులకి ఆధునికమైనవి. ఆక్షణాన ‘ఎవరైనా సరే కొంతకాలం తర్వాత దేన్నైనా తీసిపడేస్తారు’ అనే భావం కలిగింది నాలో.

“ఆ క్షణాలు, దృశ్యాలు, ఆ మనుషులు, వాళ్ళ వేషధారణలు మనుషుల మధ్య సరిహద్దులను చెరిపేసాయి నాలో. అంతకు ముందున్న నా ఆలోచనలు ఆదర్శాలు అర్థరహితమనిపించాయి.

“నేను వంతెన ఇవతల చివరి వరకూ నడిచాను. అప్పటికి వంతెనకు అవతల సూర్యుడు దిగంతంలోకి జారిపోయాడు.

“అప్పుడే వెలిగిన వీథి దీపాల వెలుతురు వేశ్య కొట్టుకున్న పౌడరులా మసకమసకగా ఉంది. వంతెన చివరిదాకా వెళ్ళాక నేను తిరిగి వెనక్కు నడవటం మొదలెట్టాను. అప్పుడే ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. నా జీవితాన్ని మార్చిన మరచిపోలేని సంఘటన. నేను అవతలి నుంచి ఇవతలికి వచ్చేటప్పుఉడు ఎవరిపనుల్లో ఉన్నవాళ్ళు నేను తిరిగి వెళ్ళేటప్పుడు నా వంక చూడసాగారు. భిక్షకులు, బైరాగులు, స్త్రీలు, పురుషులు, విటులు, వేశ్యలు అందర్నీ దాటుకుంటూ నేను ముందుకు నడిచివెళ్ళేకొద్దీ నన్ను చూడగానే లేచి నుంచుంటున్నారు. నేను వెనక్కి తిరిగి చూడకుండా నడక వేగం పెంచాను. ఉన్నట్టుండి నాకొక విషయం అర్థమయింది. నన్ను చూసి లేచి నుంచున్నవారు నా వెనకే నడిచి వస్తున్నారనే భావం కలిగింది. అలా అనిపించగానే ఇంకాస్త నడక వేగం పెంచాను. నా శరీరంలో వొణుకు మొదలైంది. వెనకనుంచి ఎవరిదో నవ్వు వినిపించింది. ఇంకెవరివో మాటలు. ఎదురుగా వచ్చే గాలికి నా బట్టలు, తలవెంట్రుకలు పైకి లేస్తున్నాయి. ఇంకెవరో నాతో సమానంగా, సమీపంగా నడుస్తున్నారని నా క్రీగంటి చూపుకు తెలిసింది. గాలిలో పెద్దపెద్ద అంగలు ఎగురుతున్నాయి. ఎవరో నా వెనక ఆనుకున్నంత దగ్గరగా వచ్చి భుజం పట్టుకోబోయినట్లు ఇంకాస్త ముందుకు ఉరికి భయంతో గట్టిగా అరిచాను. ఒకే ఒక అంగ, ఒకే ఒక అడుగుతో ఒంతెనను దాటిని అనుభవమది. ఇది ఎలా జరిగిందో నాకు తెలీదు. ఆ చివరినుంచి ఈ చివరికి. ఆరోజు ఇంటికి ఎలా వెళ్ళానో తెలీదు.”

scream final copyసుందరం ఒక్క క్షణం ఆగి తిరిగి చెప్పడం మొదలుపెట్టాడు. ట్యూబులైటు వెలుతురులో అతడి మొహం చెమటకు మెరుస్తూ ఉంది.

“ఆరోజు ఏం జరిగిందో తెలుసుకోడానికి మరుసటిరోజు అక్కడికి వెళ్ళాను కొత్తగా ఏమీ అనిపించలేదు. అంతా మామూలుగానే ఉంది. ఎవరి పనులలో వాళ్ళు.

“ఇది జరిగాక చాలా రోజులపాటు నేను జబ్బున పడ్డాను. తిరిగి కోలుకోడానికి చాలా కాలం పట్టింది. పగిలిన ఒక శిలావిగ్రహాన్ని తిరిగి అసలురూపానికి తేవడం ఎంత కష్టమవుతుందో ముక్కలైన నా మనోప్రపంచాన్ని తిరిగి తెచ్చుకోడానికి అంత కష్టమయింది. అసలు సాధ్యపడలేదు. నన్ను నేను తిరిగి తెచ్చుకోడానికి ఏదీ లేదు. ఏదీ ఆసరా లేదు. ఏదీలేని పునర్జన్మ. నన్ను నేను గుర్తుపట్టలేని పునరుద్ధానం. మళ్ళీ నేను ఈ ప్రపంచంలో కొత్తగా నివసించడం మొదలుపెట్టాను. సరికొత్తగా.”

“మరి మమ్మల్ని కనీసం మీవాళ్ళని, కనీసం మాలతినైనా కలవడానికి ప్రయత్నించలేదా?” అన్నాను నేను మధ్యలో కల్పించుకుని.

“లేదు” వెంటనే అన్నాడు సుందరం. “నిజానికి అప్పటినించే నన్ను గుర్తుపట్టేవాళ్లకు, నేను గుర్తుపట్టేవాళ్ళకు దూరంగా తిరగడం మొదలుపెట్టాను. గతానికి వర్తమానానికీ చాలా తేడా కనిపిస్తూ ఉంది. మనం అనుకునే ప్రాపంచిక దృక్పధానికి అవతల ఎప్పుడూ ఇంకేదో ఉంటూనే ఉంటుందని మనం నమ్మినదంతా అపనమ్మకమేనని, నమ్మకస్తులెవరూ లేరని, అసలు మనమే లేమని…”

“సూసైడ్‌..” అన్నాడు మోహన ఉన్నట్లుండి నిర్లిప్తంగా నవ్వి.

“పునర్జన్మ కూడా..” అన్నాడు సుందరం మోహన చెప్పింది పట్టించుకోకుండా.

“జరిగేవన్నీ మన అనుమతి తీసుకుని జరగవు. అరోజు ఆ సంఘటన తరువాత నా ప్రాపంచిక దృక్పథమే మారిపోయింది. ఇదంతా జరగడానికి నాలో సంఘర్షణో, అంతర్యుధ్ధమో జరగలేదు. జరిగింది కలో నిజమో తెలియదు. కాని ఆరోజు నేను అక్కడే ఉన్నానని మాత్రం తెలుసు. నాలో వచ్చిన మార్పు నా ప్రమేయంలేకుండానే జరిగింది. క్షణిక కాలంలో జరిగిందే కావచ్చు. మోహన అన్నట్టుగా అది ఆత్మహత్య కూడా కావచ్చు. అందుకు నేను బాధపడేదేమీ లేదు. నా హృదయం ఇంకా బండబారిపోనందుకు ఆనందపడాలి. జీవన్మృతులైన ఆత్మలు కోకొల్లలుగా నాకు తెలుసు.

“సరే.. అదలా జరిగిపోయింది. నేను మాలతి ఎప్పుడు తిరిగి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను.”

సుందరం చెప్పడం పూర్తిచేసినట్లుగా వెనక్కు వాలాడు. అతడి గ్లాసు ఖాళీ అయింది. చెమటవల్ల అతడి బట్టతల ట్యూబ్‌లైటు వెలుతురులో మెరుస్తూ ఉంది.

నేను మోహన వంక చూసాను.

నాకు కొత్తగా మోహన కళ్ళ కింద నల్లటి చారలు కనిపించాయి. అతడు తన గ్లాసులో చివరగా ఉన్నది గొంతులో పోసుకుంటూ “అయితే వాళ్ళంతా నీకు దొంగల్లా కనిపించారన్నమాట” అన్నాడు.

“దొంగలో కాదో తెలియదుకానీ ఆ క్షణంలో మనుషులంతా ఒకేలా.. కాదు మానవస్పందనలన్నీ ఒకేలా అనిపించాయి”

సుందరం చెప్తుండగానే నేను అక్కడనుంచి లేచి వచ్చేసాను. వాళ్ళిద్దరూ ఒకే విషయం గురించి చెప్పుకుంటున్నారుకానీ ఇద్దరూ చెప్పేది ఒకటి కాదు. మోహన చెప్పేది ఏమిటో నాకు తెలిసినట్లే అనిపించింది. సుందరం చెప్పేదేమిటో ఇంకా తెలియాలి. కాని జ్ఞాపకం ధూళిగా ఎలా మారిపోతుందో అతడిని ఇంకెప్పుడైనా అడగాలి.

మోహన టేబుల్‌ మీద వాలిపోయాడు. అతడి కుడిచేయి ఒక్కొక్కవేలు ముడుచుకుంటూ పిడికిలి బిగుసుకుంటూ ఉంది.

“సరే.. ఇక చివరిసారిగా అడుగుతున్నాను. నీకు తెలుసా.. తెలియదా.. లేక తెలిసీ తెలియనట్లుగా నటిస్తున్నావా లేక అసలేమీ తెలియక తెలిసినట్లు నటిస్తున్నావా..?” మోహన మాటలు ముద్దముద్దగా వస్తున్నాయి. కళ్ళు మూసుకుపోతున్నాయి.

“ఇంకేం చెప్పమంటావు చెప్పు. నువ్వు నటన అనుకుంటే నేనేం చేయలేను. నాకంత వరకే తెలుసు. తెలిసీ చెప్పకుండేదేమీ లేదు. ఇంక మార్పు సంగతంటావా -

“- ఆ తరువాతేం జరిగిందంటే నిన్న ఒకరకంగా అనిపించింది ఇవాళ మరొక రకంగా అనిపించసాగింది. నన్నావరించిన ఎన్నో గాఢమైన విషయాలు హృదయం నుంచి తేలికగా వెళ్లిపోయాయి. ప్రతిదీ కొత్తగా కనిపించడం మొదలైంది. చివరికి మనుషులు కూడా. అప్పటి వరకు నేను రాసిన కవిత్వాన్ని చూసుకున్నాను. భయం కలిగింది. వాటిని తగలపెట్టేశాను. నిన్నటి గాఢానుభవాన్ని ఈరోజు లోంచి చూస్తే అదేదో మరో లోకం అనిపిస్తుంది. ఆత్మహత్య చేసుకోవాలని చాలాసార్లు అనుకున్నా. దాన్నుంచి బయటపడటానికి చాలా కాలం పట్టింది”

సుందరం చాలాసేపు మాట్లాడకుండా మౌనంగా కూర్చుండిపోయాడు. అతడిముందు మోహన టేబుల్‌ ముందు వాలిపోయి ఉన్నాడు. వాళ్ళిద్దర్లో ఎవరో ఒకరు మాట్లాడతారేమోనని ఎదురుచూస్తూ ఉన్నాను.

“నువ్వు ద్రోహివి” అన్నాడు చివరికి మోహన. అదే అతడి ఆఖరిమాట.

సుందరం లేచి కిచెన్‌లోకి వెళ్ళి మోహనకోసం పళ్ళెంలో అన్నం, కూర కలుపుకుని వచ్చాడు. వాళ్ళ సంభాషణ ఇక ముగిసినట్లే అనిపించింది.

సుందరం పళ్ళెం టేబుల్‌ మీద ఉంచి మోహనని రెండుచేతులతో పట్టుకోబోయాడు. మోహన విసురుగా అతడి చేతిని విదిలించుకున్నాడుగాని అతడి శరీరం అతడి అధీనంలో లేదు. అతడిని సుందరం రెండుచేతులతో సోఫాలోంచి లేపి భుజాలమీదకు ఎత్తుకున్నాడు. అతడిని ఇద్దరం బెడ్‌ మీదకు తెచ్చి పడుకోపెట్టి దుప్పటి కప్పాం.

“నీవంటే మోహనకి ఎందుకంత కోపం?” అన్నాను మంచం మీద కూర్చుని.

“నేనేదో ఆత్మద్రోహమో, పరద్రోహమో చేస్తున్నాననుకుంటాడు. అనుభవంలోకి వస్తే తప్ప కొన్ని విషయాలు ఎంత విడమర్చి చెప్పినా అర్థం కావు. దానికి భాషలేదు” అన్నాడు సుందరం.

నేను అతడి వంకే చూస్తూ పడుకున్నాను.

మోహన ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. దుప్పటి మడతల మధ్య అతడి శరీరం కలిసిపోయి దేహంలేని తల దిండు మీద నిద్రిస్తున్నట్లుగా ఉంది. మెలకువలో ఉన్న సుందరం కూడా ప్రశాంతంగా ఉన్నాడు.

నాకు రాత్రంతా కలత నిద్ర. ఎప్పుడు నిద్రపట్టిందో తెలీదు. మెలకువ వచ్చేసరికి వాళ్ళిద్దరూ లేరు. ఇల్లంతా శుభ్రం చేసి ఎప్పటిలానే ఉంది. టీపాయ్‌ మీద మూడు గాజు గ్లాసులు ఖాళీగా ఉన్నాయి. బయట ఇంకా పూర్తిగా తెల్లవారలేదు.

లేచి బట్టలేసుకుని బయటకు వచ్చాను. నల్లటి రోడ్డు. తెలిసిన కొత్త మొహాలేమైనా కనిపిస్తాయేమోనని నడుస్తూ ఉన్నాను.

– బి. అజయ్ ప్రసాద్

(డా.వి.చంద్రశేఖరరావు గారు తన కథలకు Edvard Munch గీసిన “The Scream” అనే పెయింటింగ్‌ కూడా ఒక ప్రేరణ అని చెప్పాక, ఆ పెయింటింగ్‌ని చూసాక – రచయిత)

The_Scream

Download PDF EPUB MOBI

Posted in 2015, కథ, మే and tagged , , , , .

3 Comments

  1. Meeru rachinchina Mukhamukham sarigga THE SCREAM ane Painting ki saripoyindi. Rooju kanapade nijaalanu varninche aa shaili
    aakattukunnadi.. Patakula manasulo aalochanala dumaram leputunnadi. Aalochinchadaniki oopika lekapote adigo paina cheppina
    Mani Vadlamanigari gari comment laage vuntundi (sorry Mani) Nenu matram baagane enjoy chesanu. Thank U Prasad!

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.