cover

ఇద్దరు మావయ్యల కథ

Download PDF EPUB MOBI

నాకిద్దరు మేనమావలున్నారని ఈ పాటికి గ్రహించి ఉంటారు. చాలా ఏళ్ల తరవాత వాళ్లిద్దర్నీ అర్జెంటుగా కలవాల్సిన పని పడింది. అందుకే ఈ హైదరాబాదు మజిలీ. ఒక కాన్ఫరెన్సు కోసం సింగపూరు వచ్చి అక్కడ రెండు రోజులు ఉన్నప్పటికీ అమెరికా నుండి మోసుకొచ్చిన జెట్ లాగ్ పూర్తిగా వదల్లేదు. నోటివెంట తెలుగు ధారాళంగా ప్రవహించడం లేదు. కాలమానం లోని తేడా శరీరానికింకా అలవాటు కాలేదు. ఇప్పుడు ఇండియా టైం ఎంతయిందీ? ఉదయం ఆరు దాటింది… అంటే అక్కడ సాయింత్రం.. ఏడు పైన. ఈ పాటికి అబ్బాయి జిమ్ నించీ, అమ్మాయి పియానో క్లాసు నించీ వచ్చేసి ఉంటారు. వాళ్ళు పెద్దవాళ్ళవుతున్నారు. వాళ్ళ మానాన వాళ్ళున్నారు. అందుచేత కూడా మా అమ్మ మావద్ద ఉండాల్సిన అవసరం మునపటంత లేదు. ఈ సంగతి నా భార్య ముందుగానే పసిగట్టింది.

అమ్మకి కూడా అమెరికా అన్నా, ముఖ్యంగా మా కుటుంబం అన్నా మొహంమొత్తి పోయింది. మా పిల్లలు తెలుగు మాట్లాడడం మానేశారు. వాళ్ళు మాట్లాడే ఇంగ్లీషు మాకే ఒకోసారి బోధపడదు, ఇంక అమ్మకేం అర్థం అవుతుంది? ఈ కొత్త తరం సమస్యలేవీ మా నాన్నకి తెలీదు. అదృష్టవంతుడు; నేను స్కూల్లో ఉన్నప్పుడే పోయాడు. ఇప్పుడు అమ్మని తిరిగి ఇండియా పంపించేస్తే ఆమె ఎక్కడ ఉంటుందనేదే ప్రశ్న. కొన్నాళ్ళ పాటైనా మావయ్యల వద్ద ఉంటుందేమో అని ఒక ఆలోచన. ఈ పరిష్కారం ఆమెకు సూచించే ముందు వీళ్ళ సుముఖత తెలుసుకోవాలి కదా? అందుకే హైదరాబాదు మీదుగా ఈ తిరుగు ప్రయాణం.

హోటల్ నుండి టాక్సీ బయలుదేరింది. ఏవేవో ఆలోచనలు, జ్ఞాపకాలు – మధ్య మధ్యలో కునికిపాట్లు.

ఇద్దరు మావయ్యలకీ పెళ్ళీ పెటాకులు లేవు. అందువల్ల కూడా నేను వచ్చిన పని కొంత సరళంగా నెరవేరుతుందని ఓ ఆశ. పెద్దమావయ్య హిందూ సమాజోద్ధారణ కోసం, చిన్నమావయ్య విప్లవం కోసం బ్రహ్మచారులుగా మిగిలిపోయారు. చిన్నమావయ్య ఒకానొకప్పుడు ఒకామెతో సహజీవనం చేసేవాడనీ, పెళ్ళికూడా చేసుకుందామని అనుకున్నాడనీ వినికిడి. అయితే ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఎన్కౌంటర్ లో మరణించిందనీ అంటారు. పెద్దమావయ్య గురించి ఇలాటి కథలుకూడా ఏవీలేవు. గంభీరంగా ఉండే పెద్దమావయ్యతో ఇలాంటి విషయాలు చర్చించే అవకాశమే లేదు.

చిన్నమావయ్య దగ్గర బాగా చనువున్నా ఈ ప్రస్తావన ఎప్పుడూ రాలేదు; కాలం గడిచిన కొద్దీ అప్రస్తుతం అయ్యింది. ఇద్దర్నీ చూసి చాలా కాలం అయిపోయింది. ఇప్పుడెలా ఉన్నారో?

క్రిందటిసారి పెద్ద మావయ్యని కలిసినప్పుడు – అంటే అమెరికా వెళ్ళిన కొత్తలో – నేను జంధ్యం వేసుకోలేదని గమనించి – ఓ గంట సేపు క్లాసు పీకాడు. ప్రపంచంలో ఎక్కడున్నా మన సంస్కృతిని ఎలా కాపాడుకోవాలో, ఎందుకు కాపాడుకోవాలో, ఈ విషయం మీద పెద్దలు, ప్రముఖులు ఏమన్నారో – ఇలా. అప్పట్లో ఈ సంగతి చిన్న మావయ్యకి చెబితే – ఆయన చాలా సీరియస్ గా – “పెద్దమావయ్య అన్నదాంట్లో కొంత నిజం ఉందిరా” అన్నాడు. ఎప్పుడూ లేనిది ఏమిటీ ఏకాభిప్రాయం అని నేను ఆశ్చర్య పోయాను.

“కన్యాశుల్కంలో బొంకులదిబ్బ మీద గిరీశం జంధ్యపు పోగు పట్టుకొని పొటిగరాపుపంతుల్ని ఎలా వదిలించు కున్నాడో మర్చిపోయావా?” అని ముగించాడు. ఇద్దరం నవ్వుకున్నాం.

కన్యాశుల్కం సంభాషణలు, మహాప్రస్థానం గేయాలు, రావిశాస్త్రి పాత్రలు, ఘంటసాల పాటలు, త్యాగరాయ కీర్తనలూ, భానుమతి గాత్రం, సావిత్రి సినీమాలూ – ఇవన్నీ – ఇంకా అనేక విషయాలూ – మా మధ్య సజీవంగా నడయాడేవి. నేను మహాప్రస్థానంతో ఆగిపోయాను. చిన్నమావయ్య చాలా ముందుకి పోయాడు. ఇంకా ప్రయాణిస్తూనే ఉన్నాడు.

ఇంగ్లీషు లెక్చరరుగా రిటైరైన చిన్నమావయ్య నాకు ఆధునిక తెలుగు సాహిత్యాన్నే కాక ప్రపంచ సాహిత్యాన్ని కూడా పరిచయం చేసాడు. తెలుగు పండితుడిగా పదవీ విరమణ చేసిన పెద్దమావయ్య ప్రాచీన, సాంప్రదాయ సాహిత్యాల్లో నాకు ప్రవేశం కల్పించాలని పాపం చాలా ప్రయత్నించాడు గాని, కొంతమేరకే సఫలీకృతుడయ్యాడు. అయితే నాకీమాత్రం తెలుగు పట్టుబడిందంటే అది పెద్దమావయ్య చలవే అంటాను.

సాంప్రదాయ సాహిత్యంలో మునిగి తేలిన పెద్ద మావయ్యకి కూడా కొన్ని శ్రీశ్రీ గేయాలు చాలా ఇష్టం. ముఖ్యంగా – “కవితా, ఓ కవితా”, “సుప్తాస్తికలు” – వీటిని ఎంతో భావయుక్తంగా చదివే వాడు.

“సాంప్రదాయ సాహిత్యంలో పునాది లేక పొతే ఎవరూ ఇంత గొప్పగా రాయలేరు రా – శాస్త్రీయ సంగీతం తెలిసినవాడే గొప్ప సినీమా పాటలు పాడినట్టుగా. అసలు మీ శ్రీశ్రీ కి భాష మీద, ధ్వని మీద అంత మంచి పట్టుఎలా ఏర్పడింది? ఎప్పుడైనా ఆలోచించావా?” అనే వాడు.

శ్రీశ్రీ, కొకు, రావిశాస్త్రి, ఇలాంటి వాళ్ళ గురించి నాతోనో చిన్నమావయ్య తోనో సంభాషించేటప్పుడు “మీ” అనే మాటను ముందుగా జోడించేవాడు. చలం దగ్గరకొచ్చేసరికి మాత్రం – మొదటంతా “మీ చలం”, రమణాశ్రమం దినాల నుండి “మా చలం” అని పెద్ద మావయ్య వ్యవహరించాలని ఒకానొక సంవాదం తరవాత ఇద్దరు మావయ్యలకీ ఒప్పందం కుదిరింది.

ఎప్పుడో జరిగిన ఈ విషయాలన్నీ నేను మరచిన లోతుల నుండి ఇప్పుడు ఉబికి వస్తున్నాయి. పెద్దమావయ్య అప్పట్లో అన్నవాటిల్లో కొన్ని గొప్ప నిజాలు ఉన్నాయనిపిస్తోంది. ముఖ్యంగా అతని భావాలకి పూర్తిగా విరుద్ధంగా ఉండే రచనల గురించి, రచయితల గురించి కూడా ఆయనకు అన్ని విషయాలు ఎలా తెలుసా అని ఇప్పుడనిపిస్తోంది. తెలుగుతో బాటు ఆయన నేర్పిన వేదగణితం, చిన్నమావయ్య నేర్పిన ఇంగ్లీషూ నా పెద్ద చదువులకీ, అమెరికా విజయాలకీ పునాదులు వేశాయని తెలుస్తోంది.

మా నాన్న లేని లోటుని పూరించడానికి ఇద్దరు మావయ్యలూ తమ వంతు కృషి చేసారని ఇప్పుడిప్పుడే బోధపడుతున్నది. నేను స్వయంగా సాధించినది పెద్ద ఎక్కువేం కాదని ఈ మధ్య మరీ అనిపిస్తోంది. సందర్భం ఏదైనా మావయ్యల్నిద్దర్నీ మళ్ళీ కలుసుకుంటున్నానంటే – ఊహించని ఉత్సాహం కలుగుతున్నది. నా బాల్యం, ఎదుగుదల పరస్పర విరుద్దాలైన ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య విరిసిన అయిస్కాంత క్షేత్రం లో సంభవించాయి.

వెనక్కి తిరిగి చూసుకుంటే మరో విషయం స్ఫురిస్తోంది. ఉత్తరాంధ్రలో చదువులే ఆస్తులుగా కలిగిన మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన మావయ్యల్నిద్దర్నీ అనేక సందర్భాల్లో జీవితం ఒకే దారిన నడిపించింది. ఇద్దరూ జై ఆంధ్ర, విశాఖ ఉక్కు ఉద్యమాల్లో పాల్గొని లాఠీదెబ్బలు తిన్నారు. ఎమర్జెన్సీలో ఇద్దరూ ఇల్లు వదిలి పారిపోయారు. మా అమ్మ ఆందోళనకీ, అనారోగ్యానికీ కారకులయ్యారు. కొన్నాళ్ళుఅజ్ఞాతంలో ఉండి పట్టుబడ్డారు. చిన్నమావయ్య ఎంకౌంటర్ కాకుండా జైలుకి వెళ్ళినందుకు కృతజ్ఞతగా మా అమ్మ – ఎప్పుడూ లేనిది తిరుపతి వెళ్ళింది. ఇద్దరూ విశాఖపట్నం సెంట్రల్ జైల్లో కలిసికట్టుగా ఉన్నారు. అక్కడే వాళ్లకి అన్ని పార్టీల ప్రముఖులతోనూ పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ తరవాత జయప్రకాష్ నారాయణ్ గారి మీటింగులకి కలిసివెళ్ళారు. నిలిపివేసిన చదువుల్ని కొనసాగించి ఇద్దరూ కూడా ఉపాధ్యాయవృత్తిని స్వీకరించారు. వాదించుకున్నారు, కలహించుకున్నారు. కాని ఒకరినొకరు గౌరవించుకున్నారు. రిటైరయ్యాక హైదరాబాదు చేరారు. అయితే ఇప్పుడుండేది ఊరి శివార్లలో – ఒకరు ఆశ్రమంలో, ఒకరు కమ్యూన్ లో.

* * *

టాక్సీ ఆశ్రమం ముందు ఆగింది. ముగుస్తూన్న చలికాలపు ఉదయపుటెండలో పచ్చగడ్డి తళతళ మెరుస్తోంది. తిరిగే జలయంత్రాలు సన్నటి ధారలను విరజిమ్ముతూ అప్పుడప్పుడు చిన్నపాటి స్థానిక ఇంద్రధనుస్సులను సృష్టిస్తున్నాయి. గేటు దాటిలోపలి కాసేపు నడవగానే కాషాయి లాల్చీ, తెల్లపంచె లో ఉన్న ఒక పెద్దమనిషి ఎదురయ్యాడు. సుబ్రమణ్యంగారి గది ఎక్కడని అడిగాను. తన చూపుడు వేలితో లాల్చీకున్న బాడ్జిని చూపించాడు. “మౌన వ్రతం” అని అక్కడ రాసి ఉంది. తనతో రమ్మని సౌంజ్ఞచేసి ముందుకి నడిచాడు. అటూ ఇటూ చెట్లు బాగా పెరిగి ఉన్నాయి. పక్షుల అరుపుల కోలాహలం. ఎక్కడినుండో ఖంగుమని కంచు గంట మోగింది. డైనింగు హాలు నుండి కాబోలు, ఒక గుంపు బయటపడింది. ఆడా, మగా – ఎక్కువమంది నడివయస్కులు. కొందరు వృద్ధులు, కొద్ది మంది యువతీ యువకులు. కొందరు తెల్లనిదుస్తుల్లో – మరికొందరు కాషాయ వస్త్రాలలో. వినీ వినిపించనట్లు మాట్లాడుకుంటూ ‘ధ్యాన మందిరం’ అని రాసి ఉన్న మార్గాన నడుస్తూ. మరో నాలుగడుగులు నడిచాక నన్ను తోడ్కొని వచ్చినాయన నా అరచేతిని తన చేతుల్లోకి తీసుకొని తన చూపుడు వేలితో ‘129’ అని రాసి హాస్టల్ లాంటి భవనం వైపు చూపించి నమస్కారం పెట్టి గుంపులో కలిసిపోయాడు.

గదిలో నాకోసం ఎదురుచూస్తున్న పెద్ద మావయ్య చదువుతూన్న పుస్తకాన్ని మూసేసి,  “ఏరా అల్లుడూ, ఎలా ఉన్నావు? ఎన్నేళ్ళయిందిరా నిన్ను చూసి! మీ అమ్మ ఎలా ఉంది? మీ ఆవిడని పెళ్ళిలో చూడడమే. అందర్నీ తీసుకురాలేక పోయావా? మీ పిల్లల్ని చూడనే లేదు” అని ఎంతో ఆప్యాయంగా పలకరించాడు. నన్ను చూసిన ఆనందం ఆయన ముఖంలో తాండవించింది. పెద్దమావయ్య ప్రమాణాలకి ఇది చాలా ఉద్వేగభరితమైన పలకరింపు కింద లెఖ్ఖ. నిజానికి ఆయన్ని ఇంత ఎమోషనల్ గా చూసినట్టు గుర్తులేదు.

గుండ్రని మొహం, తెల్లగా మెరిసిపోతూ – పెద్ద నుదురూ, చిన్న బొట్టూ. గాంభీర్యానికి తోడైన ప్రశాంతత. లాల్చీ, పంచె. మనిషి ఇంకా వొంగిపోలేదు. నిటారుగా ఖడేరావుగా ఉన్నాడు. తెలుగు పండితుడి వాక్సుద్ధి, ఖంగుమనే క్లాస్ రూం గళం. పొట్ట మాత్రం బాగా తగ్గింది – ఆశ్రమ క్రమశిక్షణ, ఆహారపుటలవాట్ల మూలంగా కాబోలు. ఒకప్పుడు – అంటే పొడుం మానేసిన కొత్తలో – బాగా లావయ్యాడు.

“పొద్దున్నే బయిల్దెరావు. ఏమైనా తిన్నావా? లేదంటే రూం కి తెప్పిస్తాను”

“అవసరం లేదు మావయ్యా, తినే బయిల్దేరాను”

“సరే. మరో గంటాగితే టీ వస్తుంది. ఆశ్రమం చూపిస్తాను పద”

చెట్ల చీకట్ల నడుమ వాలు కిరణాలు పొగమంచుని చీలుస్తూ గడ్డి పరుపుల్నీ పూల మొక్కల్నీ అందినంత మేరకు ప్రకాశవంతం చేస్తున్నాయి. స్వచ్ఛమైన చల్లని గాలి ఒత్తుగా తాకుతోంది. నగరజీవనానికి దూరమైనకాలం తన గమనవేగాన్ని నియంత్రించుకొని హుందాగా సాగుతున్నది; పరిసరాల్ని ఆస్వాదించగల వెసులుబాటుని కల్పిస్తున్నది. ఎంతో కాలం తరవాత ఉరుకులు పరుగులు లేనట్టి ఇలాంటి ప్రశాంత వాతావరణం నన్ను తనలో లీనం చేసుకుంది. చిన్నతనంలో చీకూ చింతా లేకుండా గట్ల వెంటా పుట్ల వెంటా పరుగులుతీసిన దినాలు జ్ఞప్తికి వచ్చాయి.

ఆశ్రమంలో ఎక్కడా విగ్రహాలు లేవు. స్థాపించిన గురువుగారి ఫోటో ఒకటి – బాగా పాతది – డైనింగ్ హాల్లో కనిపించింది. అక్కడే టీ తాగాం. మావయ్య ఆశ్రమ జీవనం గురించి చెప్పుకుంటూ పోయాడు.

ఈ ఆశ్రమం ప్రధానంగా జ్ఞానమార్గాన్ని ప్రోత్సహిస్తుందనీ అందుకే ఇక్కడ బోధన కన్నా మౌనానికి, శ్లోక తాత్పర్యాల కన్నా ఓంకారానికి, భజన కన్నా యోగాభ్యాసానికి, చర్చల కన్నా ధ్యానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనీ చెప్పాడు. వారానికి రెండు సార్లు మాత్రమే ప్రసంగాలు, చర్చలూ ఉంటాయన్నాడు.

“మాటలు పూర్తిగా అనవసరం అని అనను గానీ మాటల్లో చెప్పగలిగేది కొంత వరకే ఆ తరవాత అభిప్రాయాలు ముందుకొస్తాయి. కోపతాపాలూ, కక్షలూ కావేషాలూ బయటపడతాయి. అర్థంచేసుకోగలిగే వాళ్లకుచెప్పడం అనవసరం. అర్థంకాని వాళ్లకు చెప్పి ప్రయోజనం లేదు” అన్నాడు.

సుమారు ముప్ఫై ఏళ్ళు ఉపాధ్యాయ వృత్తి లో ఉండిన పెద్దమావయ్య ఇలా అనడం నాకు ఆశ్చర్యం కలిగించింది.

“అర్థం చేసుకోగలిగే వాళ్ళు, చేసుకోలేనివాళ్ళు – వీళ్ళ మధ్య అగాథం – అదలా ఉండిపోవాల్సిందేనా? అలా అయితే మరి ఈ గురువులూ, ఆశ్రమాలూ ఎందుకు?” అన్నాను.

మావయ్య కాసేపు మౌనం వహించి, “గురువులూ ఆశ్రమాలూ, పుస్తకాలూ, పురాణాలూ, ప్రసంగాలూ, చర్చలూ, పూజలూ, పుణ్యక్షేత్రాలూ – వీటి స్థానం వీటికి ఎప్పుడూ ఉంటుంది. మన ఆలోచనలూ, ప్రవర్తనామారనంత కాలం – ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే.”

“మరి దీనికి పరిష్కారం?”

“ధ్యానం ద్వారా మనల్ని మనం శోధించుకుంటూ అప్రమత్తంగా ఉంటూ వస్తే పుస్తకాలూ ప్రార్థనలూ వాటి స్థానంలో అవి నిలిచిపోతాయి. అందుకే ఆధ్యాత్మిక సాధనలో ధ్యానం, మౌనం – ఇవి ముఖ్యం.”

“నువ్వు చాలా మారిపోయావు, మావయ్యా.”

“కావచ్చు. ఈమధ్య కాలంలో నాకు బోధపడినదేమంటే మతం సామూహికం, ఆధ్యాత్మికత ఒంటరి ప్రయాణం. ఈ ఒంటరి ప్రయాణీకులే ఆధ్యాత్మికత వైపు, జ్ఞానం వైపు నడుస్తారు, కొంత వరకూ మిగతా వాళ్ళనునడిపిస్తారు. వాళ్ళే ఉత్తములైన సాధువులు, యోగులు, బిక్షువులు, ఫకీర్లు, సూఫీలు”.

“అంటే మనుషులకీ, సమాజానికీ దూరంగా ఎవరి ఆధ్యాత్మిక ప్రయాణం వాళ్ళు చేసుకోవాలా?”

“అలా అనుకుంటే మళ్ళీ అదొక రకమైన స్వార్థం అవుతుంది. జ్ఞానాన్ని పంచిపెట్టడం, సమాజంతో సజీవమైన సంబంధాల్ని కొనసాగించడం యోగులకు ఒక ముఖ్యమైన బాధ్యత. నానక్ ఇదే అన్నాడు; బుద్దుడూ ఇదేఅన్నాడు.బౌద్ధం లోని కొన్ని విషయాలు నాకు చాలా నచ్చుతున్నాయి. ఇంకా సరిగ్గా చెప్పాలంటే నాకు బోధపడుతున్నాయి”.

మావయ్య నోటివెంట వెలువడిన బుద్ధుడి ప్రశంస విని విస్తుపోయాను.

“అదేమిటి మావయ్యా, బుద్ధుడిది ఒట్ఠి నాస్తికవాదం అని కొట్టిపారేసేవాడివి కదా?”

“అది ఒకప్పటి మాట. విశ్వాసంతో మొదలుపెట్టి అక్కడే ఆగిపోతే అది ఆధ్యాత్మికత కాజాలదు. మూఢ నమ్మకాలకి పునాది అవుతుంది. వారం రోజులకు సరిపడా మాట్లాడాను. ఇక నువ్వు చెప్పు. ఏదో చెప్పాల్సింది ఉందన్నావు?”.

నేను వచ్చిన పని గురించి చెప్పాను.

“మీ అమ్మ ఆశ్రమం లో ఉంటానంటే నాకు సంతోషమే. మీ నాన్న నాస్తికత్వం మీ అమ్మకి కాస్తంత అంటుకుంది. అయినా ఆమె ఇక్కడ ఏ ఇబ్బందీ లేకుండా ఉండగలుతుంది అనే నేను అనుకుంటున్నాను. నాకు ఓ నెల్లాళ్ళు ముందుగా చెబితే ఇక్కడ చెయ్యవలసిన ఏర్పాట్లు చేస్తాను”.

మరో సారి గంట మోగింది.

“పద, భోజనానికి వెళ్దాం”.

భోజనాలయ్యాక మళ్ళీ మావయ్య గదికి వెళ్లాం. మావయ్యకోసం తెచ్చిన పళ్ళూ అమ్మ ఇచ్చిన ఉత్తరం ఆయన చేతికిచ్చాను. పళ్ళని ఓ వెదురు బుట్టలో వేసుకొని ప్లాస్టిక్ సంచిని తిరిగిచ్చేసాడు. ప్లాస్టిక్ వినియోగంపై ఆశ్రమంలో ఆంక్షలున్నాయి. అమెరికాలో నా పని గురించీ, అక్కడి జీవనం గురించీ చాలా ప్రశ్నలడిగాడు. నాకు తోచింది చెప్పాను. నా ఈ-మెయిల్ ఎడ్రసు తీసుకున్నాడు. త్వరలోనే ఆశ్రమ గ్రంధాలయంలో ఇంటర్నెట్ సదుపాయం రాబోతున్నదని చెప్పాడు. ఆశ్రమానికై ఇటీవల సృష్టింపబడిన వెబ్ సైట్ వివరాలు చెప్పాడు.

“మావయ్యా, ఇక్కడ నీకు బాగున్నట్లుంది కదా? ఇక్కడే ఉండిపోతావా?” అని అడిగాను.

“చాలా బాగుంది. ఎన్నో మంచిపనులు చేస్తున్నారు. కొన్నింటిలో నేనూ ఓ చెయ్యి వేస్తున్నాను. అయితే ఇక్కడ కూడా చిత్తశుద్ది లేని వాళ్ళు, మూర్ఖులు, పది రూపాయిలు ఖర్చు పెట్టి ఇరవై రూపాయిల బిల్లు పెట్టే వాళ్ళు, గొప్పలు చెప్పుకొనేవాళ్ళు, పెత్తనం చెలాయించాలని చూసేవాళ్ళు – ఇలా అన్ని రకాల వాళ్ళూ ఉన్నార్రా. అయితే వాళ్ళ తాకిడి ప్రస్తుతానికి ఏమంత ప్రమాదకరంగా లేదు”.

“అవున్లే, ఎంత ఆశ్రమం అయినా సమాజంలో భాగమే కదా”

“ఒక ఉదాహరణ చెబుతాను. సుమారు రెండేళ్ళ కిందట ఈ ఆశ్రమాన్ని స్థాపించిన గురువుగారు కాలధర్మం చెందారు. పోయే ముందు తనకు ఎలాంటి విగ్రహాలు, సమాధులు ఉండకూడదని చెప్పి పోయారు. అయినా కొంతమంది వీరాభిమానులు విగ్రహం పెట్టడానికి పూనుకొని చందాలు పోగుచేశారు. వాళ్ళని అడ్డుకొనే సరికి మా తాతలు దిగివచ్చారు. కాళ్ళమీద పడడానికి ఎవరూ లేక వాళ్ళంతా వటించిపోతున్నారు. రేప్పొద్దున్న ఇంకే పితూరీ తీసుకొస్తారో తెలీదు”.

స్టీలు కంచంలో రెండు మట్టి పిడతలతో టీ పట్టుకొని ఒక గెడ్డం మాసిన కుర్తా యువకుడు లోనికి వచ్చాడు. టీ తాగాక నేనింక బయలుదేరాలన్నాను. లేవబోతూంటే అలమార లోంచి ఆశ్రమం పేరు రాసి ఉన్న కాషాయి రంగు ఖద్దరు సంచి ఒకటి తీసి నాకిచ్చాడు. అందులో వేమన శతకం, సుమతీ శతకం, పెద్దబాల శిక్షా సీడీల రూపంలో ఉన్నాయి.

“ఇవి మీ పిల్లలికి” అన్నాడు.

మావయ్య అమాయకత్వానికి నాలో నేనే నవ్వుకున్నాను.

“ఇక్కడ మన వాళ్ళందరూ కలిసి తెలుగు భాషని పూర్తిగా భ్రష్టు పట్టిం చేసార్రా. తమ భాష తాము మాట్లాడుకోవడానికి సిగ్గుపడే వాళ్ళకి ఆత్మగౌరవం ఎక్కడినించి వస్తుందిరా? అరవ వాళ్ళనీ, బెంగాలీ వాళ్ళనీ చూడు. అనవసరమైన ఇంగ్లీషు ముక్కల్లేకుండా ఎంత బాగా మాట్లాడతారో. ఇక మీ ఎన్నారై లూ, ప్రవాసాంధ్రులే తెలుగుని రక్షించాలి”. అన్నాడు.

“మీ” అనకుండా ఉండి ఉంటే బాగుణ్ణు అనుకున్నాను మనసులో. “ఎందుకలా అనుకుంటున్నావు?” అని అడిగాను.

“పోగొట్టుకున్నదేమిటనేది అందరికన్నా ముందుగా వాళ్ళకే బాగా అర్థం అవుతుంది గనక” అన్నాడు.

గది నుండి బయటకు నడిచాం. అక్కడ గదులకి తాళాలువేసే అలవాటులేదు.

“చిన్న మావయ్యకి ఈ పుస్తకాలు ఇచ్చెయ్యి. ఆ మధ్య ఎవరో వస్తూంటే పంపించాడు చదివానని చెప్పు. ఆదివారం నాడు ఫోన్ చేస్తానని చెప్పు”.

ఆశ్రమంలో మొబైల్ ఫోన్ లకు అనుమతి లేదు. పబ్లిక్ ఫోన్ లున్నాయి. ఆ పుస్తకాలు ఏమిటా అని చూసాను. కంచ ఐలయ్య, రాహుల్ సాంకృత్యాయన్, డి డి కోశాంబి, అంబేద్కర్.

“ ‘నేను హిందువునెట్లవుత?’ మీద నీ అభిప్రాయం ఏమిటి?” అని అడుగుదామని నోటి దాకా వచ్చింది. ఇప్పుడు కాదులే, మొదట నేను చదవాలి కదా అని నోర్మూసుకున్నాను.

ఆశ్రమం గేటు వరకూ నిశ్శబ్దంగా నడిచేం. మళ్ళీ పెద్ద మావయ్యని ఎప్పుడు చూస్తానో. సూర్యాస్తమయం కావస్తున్నది.

టాక్సీలో కూర్చున్నాను. గేటుకావల మావయ్య నిలబడి ఉన్నాడు శీతాకాల సాయింత్రపుటెండలో నిటారుగా కంచు విగ్రహంలా మెరుస్తూ. ఆ క్షణంలో నాకు అతను ప్రాచీన సమాజపు విశిష్టతలను ఆధునిక సమాజంతో సంధించగల కొద్దిమంది అరుదైన వ్యక్తుల్లో ఒకరిగా కనిపించాడు. నిజానికి అతను తన సుదీర్ఘ ప్రయాణంలో శోధిస్తూన్న ప్రాచీనతలో ఆధునికతా బీజాలు దాగి ఉన్నాయనిపించింది.

టాక్సీ మలుపు తిరిగింది. దృశ్యం మారిపోయింది.

* * *

మర్నాడు ఉదయాన్నే టాక్సీ కమ్యూన్ చేరింది. ఊరికి మరో వైపు. ఇటుపక్క పచ్చదనం పలచబడింది. ఎటు చూసినా రాళ్ళూ, గుట్టలూ. కమ్యూన్ చుట్టుపక్కలంతా మహాకాయులైన రాక్షసబాలకులు ఆటలాడుకుంటూ పేర్చి పోయారేమో అనిపించే బండ రాళ్ళు – ముట్టుకుంటే దొర్లి మీదపడతాయన్నట్టు. అవి లక్షల సంవత్సరాల నుండీ అలాగే నిలిచి ఉన్నాయనీ, ఇటీవలి ‘అభివృద్ధి’ ధర్మమా అని కనుమరుగావుతున్నయనీ నిపుణులు చెప్పగా విన్నాను. దగ్గరగా చూడడం ఇదే ప్రథమం. అన్ని సహజ శిల్పరాసులు ఒకే సారి దర్శనం ఇవ్వడం మహదానందం కలిగించింది.

ఇంకా పూర్తిగా విడిపోని మంచు తెరల మధ్య పదునెక్కుతూన్న ఉదయపు వాలుటెండ ఆ రాళ్ళ ప్రాచీన సుస్థిరతను వెలుగునీడలుగా చీల్చి ప్రస్ఫుటం చేస్తున్నది. గేటు దగ్గరే ఆగిపోయి వాటికి ఎడా పెడా ఫొటోలుతీస్తుంటే చిన్న మావయ్య చిరునవ్వుతో వచ్చి నన్ను గట్టిగా వాటేసుకున్నాడు. నన్ను చూసిన ఆనందం పట్టలేకపోతున్నాడని తెలుస్తూనే ఉంది.

“ఇలాంటివి, ఇంతకన్నా విచిత్రమైనవి ఈ చుట్టుపక్కల చాలా ఉన్నాయిరా. సాయింత్రం వెళ్దాం. ఇప్పుడింక లోపలి పద. టిఫిన్ తిందాం” అన్నాడు.

ఎర్ర రంగు అర్థవృత్తాకార బోర్డు మీద తెల్లని తెలుగు అక్షరాలు. గేటుని ఆనుకునే అమరవీరుల స్థూపం – పైన సుత్తీ, కొడవలి. పక్కనే ఎగురుతున్న ఎర్ర జెండా – ఊరికింత దూరంలో ఇక్కడుండేది ఎవరు చెప్మా అనే సందేహానికి ఏమాత్రం అవకాశం లేకుండా. లోపలికి నడిచాం.

ఆశ్రమం లో కనిపించినంత విస్తీర్ణంగానీ, పచ్చదనం గానీ కమ్యూన్ లో కనబడలేదు. కానీ ఆ రాళ్ళ గుట్టల్లోనే చెట్లు బాగా పెంచారు. పాకల్నే కాటేజీలుగా కళాత్మకంగా తీర్చి దిద్దారు. వాటిని చేరేందుకు మట్టి తోవలు – తోవకి అటూ ఇటూ పాతి సున్నం వేసిన ఇటికలు, ఒత్తుగా పెంచి కత్తిరించిన ఫెన్సింగు. ఉన్నంతలో పచ్చదనం, అంతటా పరిశుభ్రత – అక్కడివారి క్రమశిక్షణనీ, నిరాడంబరతనీ సూచిస్తున్నాయి. కూరగాయల తోట, డెయిరీ, లైబ్రేరీ, రీడింగ్ రూం, సెమినార్ హాలు – ఇవన్నీ కూడా కమ్యూన్ లో ఉన్నట్లు మార్గ సూచికల ద్వారా తెలుస్తున్నది.

“ఇక్కడ జీతానికి పనిచేసేవాళ్ళు ఎవరూ లేరు. ప్రతీ పనీ కమ్యూన్ సభ్యులే చేసుకుంటారు. మాకు సాయపడడానికి కొద్దిమంది వాలంటీర్లు వస్తూ పోతూ ఉంటారు”.

ముందుగా కేఫెటేరియా లోకి వెళ్లాం. గుమ్మం దగ్గరే ఒక టేబిల్ మీద తెలుగు, ఇంగ్లీషు పేపర్లు, మేగజీన్లు చాలానే ఉన్నాయి. కొంత మంది వాటిని తీసుకొని లోపలి నడుస్తున్నారు.

“పన్నెండయితే గాని మాకు పేపర్లు రావు. పేపర్ చూస్తేగాని మా వాళ్లకు పాపం ఏమీ తోచదు”

లోపల టేబిళ్ళ వద్ద కూర్చొని నవ్వుకుంటూ, జోకులు వేసుకుంటూ, ఇడ్లీసాంబార్ తింటున్నవాళ్ళు కనిపించారు. కొందరు మాత్రం ఏదో విషయం మీద తీవ్రమైన చర్చలో ఉన్నారు. వంటింటినించి ఉత్సాహంగా ఇడ్లీలు మోసుకొస్తున్న ఇద్దరిలో ఒకతన్ని గుర్తు పట్టాను. మాజీ రాష్ట్ర కార్యదర్శి; తరచూ టీవీలో కనబడేవాడు. ఒక టేబిల్ చుట్టూ కూర్చున్న వాళ్ళల్లో ఇద్దరు ప్రముఖ రచయితలు, ఒక రచయిత్రి కూడా ఉన్నారు. చేతికర్రల వృద్దులూ ఉన్నారు. వాళ్ళల్లో ఒక పెద్దాయన్ని ఎక్కడో చూశాను, గుర్తు రాలేదు. చురుకుగా కదులుతూ ఎర్ర చొక్కాల వాలంటీర్లు – అక్కడక్కడ.

లైన్లో నిలబడి మా టిఫిన్ ప్లేట్లు తెచ్చుకున్నాం. చిన్నమావయ్య చాలామందిని పలకరించాడు. అతను కళ్ళజోడు లోంచి చూసే చురుకు చూపు, స్నేహం చిందించే చిరునవ్వూ ఎప్పటిలానే ఉన్నాయి గాని, జుత్తు బాగాపలచబడింది, పిల్లిగెడ్డం పూర్తిగా నెరిసి పోయింది. పొట్ట కాస్తంత పెరిగింది.

టిఫిన్ తింటూ గమనించాను; గోడలకి తగిలించి చాలా పటాలే ఉన్నాయి. మార్క్సు, ఎంగెల్సు, లెనిన్, స్టాలిన్ లు ఒకవైపు వరసలో ఉన్నారు. మరో వైపు ప్రముఖ జాతీయ నాయకులు, రాష్ట్రస్థాయి నాయకులు, రచయతలు, కళాకారులు; ఇంచుమించు అందర్నీ గుర్తుపట్టాను.

ఒక బ్లాక్ బోర్డు మీద సుద్దముక్కతో ఇలా రాసి ఉంది: “2014 ఎన్నికలు: వామపక్షాల వైఖరి. ఈరోజు 11.30 గం. కు సెమినార్ హాల్లో”

కాఫీ తాగి బయటకు నడిచాం. “ఈరోజు నాకు కూరలు తరిగేపని ఉన్నది గాని వేరే అతనికి అప్పజెప్పాను” అన్నాడు మావయ్య.

మావయ్య గదికి వెళ్లాం. పెద్ద మావయ్య తిరిగిచ్చెయ్యమని పంపిన పుస్తకాలు ఖద్దరు సంచి లోంచి తీసి టేబిల్ మీద పెట్టాను.

“పెద్ద మావయ్య ఎలా ఉన్నాడు? చూసి రెండునెలలవుతోంది. వచ్చే వారం వెళ్దాం అనుకుంటున్నాను”

“చాలా మారిపోయాడు మావయ్యా. పూర్వంలాగా మెరుపు దాడులు, తీర్పులు, వెటకారాలు లేవు. మొదటి లానే గంభీరంగా ఉన్నాడు గాని ఇప్పుడు ఇంకా తక్కువ మాట్లాడుతున్నాడు; ప్రశాంతంగా కూడా ఉన్నాడు”.

“నీకు చెప్పలేదా?”

“ఏ విషయం?”

“మొదట మరో ఆశ్రమం లో ఉండేవాడు; పూణేకి దగ్గరలో. గుజరాత్ అల్లర్ల తర్వాత తెలుగు దినపత్రికలలో రెండు వ్యాసాలు రాశాడు. అవి ఆశ్రమం పెద్దలకు బొత్తిగా నచ్చలేదు. హెచ్చరించారు. ఊరుకోకుండా మరోవ్యాసం రాశాడు. దాంతో ఆశ్రమం నుండి వెళ్ళగొట్టారు. చాలా డిప్రెస్ అయ్యాడు. అక్కడా ఇక్కడా తిరిగాడు. ఆరోగ్యం చెడింది నాకు ఫోన్లు చేశేవాడు. ఇక్కడకి రమ్మన్నాను. లక్కీ గా మావాళ్ళు మూడు నెలలకైతే ఫరవాలేదన్నారు. చివరికది ఆరు నెలలైందనుకో. తనిక్కడ అడ్జస్ట్ కాగలదో లేదో అని భయపడ్డాను. ఒక దశలో ఇద్దరం ఊళ్ళో ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకొని ఉందామా అనుకున్నాను”.

“ఏమిటీ? పెద్ద మావయ్య మీ కమ్యూన్ లో, ఎర్ర జెండా నీడలో ఉన్నాడా !?”

“అదే గమ్మత్తు. మొదట వారం రోజులు నాతో తప్ప ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. మార్నింగ్ వాక్ లకు కలిసి వెళ్ళేవాళ్ళం. గంటల కొద్దీ లైబ్రెరీలో గడిపేవాడు. తర్వాత లైబ్రెరీ డ్యూటీ తీసుకున్నాడు. అలా కొన్నాళ్ళయ్యాక వచ్చి మా చర్చల్లో పాల్గొనేవాడు. అంటే వచ్చి వెనకాతల వరసలో కూర్చొనే వాడు, ఏదైనా అడగాలనిపిస్తే ఒక్కడ్నీ ఉన్నప్పుడు నన్ను అడిగేవాడు. తరవాత నెమ్మదిగా డిప్రెషన్ నుండి బయటపడ్డాడు. రెండు నెలలయ్యాక ఇద్దరు ముగ్గురితో మంచి స్నేహం ఏర్పడింది. వాళ్ళల్లో ఒకతను మావయ్యకి క్లాస్మేటు – కాలేజీలో. తెలుగు సాహిత్యం లో అన్నయ్య పరిజ్ఞానానికి మావాళ్ళు కొందరు ఆశ్చర్యపడి ‘కన్యాశుల్కం’ గురించి మాట్లాడమన్నారు. ఎంతో చదివి, నాతో చర్చించి – చివరికి చాలా బాగా మాట్లాడాడు. అన్నయ్య చెప్పిన విషయాలన్నింటి తోనూ మా వాళ్ళు ఏకీభవించారని కాదుగాని మంచి చర్చజరిగింది”.

“అలాగా? నేనుకూడా విని ఉంటే బాగుండేది కదా!”

 “అన్నయ్య తయారుచేసుకున్న నోట్సు కాపీ తీసి ఇస్తాను, జ్ఞాపకం చెయ్యి. ఆ తరవాత అన్నయ్యలో ఉత్సాహం పెరిగింది. చెస్, వాలీ బాల్ ఆడడం మొదలు పెట్టాడు. ఒక రోజు నాతొ ‘ఎమర్జెన్సీ లో విశాఖపట్నం సెంట్రల్ జైల్లో మనం కలిసి ఉండడం, పుస్తకాలు చదువుకోవడం, అన్ని రాజకీయ పార్టీల వాళ్ళతో స్నేహాలు చెయ్యడం గుర్తొస్తోంది రా’ అన్నాడు. ఇక్కడున్న ఆరు నెలల్లో అన్నయ్యకి మా ఆలోచనలు, రాజకీయాల పట్ల ఉండిన విముఖత చాలా వరకూ తగ్గింది. ఒక లెవెల్ లో రాజకీయాలంటే వ్యక్తిగత సంబంధాల కొనసాగింపే కదా. మావాళ్ళకి యోగాసనాలు, వేదగణితం నేర్పాడు. కాళిదాసురచనల్ని పరిచయం చేసాడు. అప్పుడో అనుకోని సంఘటన జరిగింది”.

“ఏమిటది?”

 “శ్రీలంక నుండి అరవింద మైత్రేయ థేరో అనే ఒక బౌద్ధ మతాచార్యుడు కమ్యూన్ కి వచ్చి వారం రోజులు ఉన్నాడు. థేరవాద బౌద్ధం, గతితార్కిక భౌతికవాదం – వీటి మీద ప్రసంగాలు చేశాడు. చాల ఇంటరెస్టింగ్ పర్సన్. జీవితం తెలిసినవాడు. ఒకప్పుడు రోహణ విజేవీరతో పనిచేసిన విప్లవకారుడు. పదేళ్ళు జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండగానే బౌద్ధ భిక్షువుగా మారాడు. అన్నయ్యకీ అతనికీ బాగా కుదిరింది. అసలు ఆయనవచ్చింది ఆంధ్ర కోస్తా నుండి సింహళ కు బౌద్ధ బిక్షువులు చేసిన నౌకాయాన వివరాలను గురించి పరిశోధనకు. తెలుగు మాట్లాడే వ్యక్తి అతనికి తోడు కావాలన్నాడు. అన్నయ్య అరవిందతో కలిసి నెల్లాళ్ళ పాటుమొదట నాగార్జున కొండకీ ఆ తరువాత కోస్తాంధ్ర లోని చాలా ప్రదేశాలకూ వెళ్ళాడు. వాళ్ళిద్దరూ కలిసి మ్యూజియంలు, లైబ్రేరీలు తెగ గాలించారు. చరిత్రకారులతో, పరిశోధకులతో సంభాషించారు. ఇంటర్వ్యూలు చేశారు, ఫోటోలు, వీడియోలు తీశారు. బండెడు పుస్తకాలు, ఫోటో కాపీలతో అన్నయ్య చాలా హుషారుగా తిరిగి వచ్చాడు. ‘తెలుగునాట బౌద్ధ వికాసం’ అని ఓ పుస్తకమే రాసేశాడు”.

“అదేమిటి? నాకు చూపించనేలేదే?”

“మే నెలలో బుద్ధ పూర్ణిమ నాడు రిలీజ్ చేద్దామనుకుంటున్నాను. అన్నయ్య కి సర్ప్రయిస్ అన్నమాట. నేను ఇంగ్లీషులోకి అనువదిస్తున్నాను. కొన్ని భాగాలు సింహళ భాష లోకి అరవింద అనువదిస్తున్నాడు”.

“పుస్తకం కాపీలు నాకు తప్పక పంపాలి”.

“ఓ యస్. తప్పకుండా. అన్నయ్య ఈ మధ్యంతా కులవ్యవస్థ గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాడు, చదువుతున్నాడు. కులాన్ని పూర్తిగా నిర్మూలిస్తేగాని హిందూ సమాజం ఎప్పటికీ ఐక్యం కాజాలదు అంటున్నాడు”.

“అది ఇప్పట్లో అయ్యే పని కాదులే” అన్నాను.

 “నేనూ అదే అన్నాను. ‘అలాగని ఊరుకుంటామా?’ అంటాడు. మొత్తానికి ఇప్పుడుంటున్న ఆశ్రమం అన్నయ్యకి బాగా నచ్చింది. ఇలాంటి విషయాలు చర్చించడానికి కూడా అక్కడి వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు”.

“ఇక్కడ నీకెలా ఉంది మావయ్యా?”

“ఇంతవరకూ బాగానే గడిచింది. ఇంకా ఎన్నాళ్ళు ఉండగలనో చూడాలి”

నేను ఆశ్చర్య పోయాను. “అదేమిటి? అలా అంటున్నావు? ఇక్కడున్న వాళ్ళంతా మీ కామ్రేడ్సే కదా?”

“నిజమే. ఎవరో ఒకరిద్దరు తప్పించి కమ్యూన్ లో ఉన్నవాళ్ళంతా నిజాయితీ పరులు, గొప్ప త్యాగాలు చేసినవాళ్ళు, భయం ఎరగని వాళ్ళు, మనుషుల కోసం, నమ్మినదానికోసం ప్రాణంపెట్టే వాళ్ళూను. వీళ్ళల్లో నాకు ఎంతోమంచి స్నేహితులున్నారు. సమస్య అదికాదు”.

“మరి?”

“నాకు కమ్యూనిజం మీద నమ్మకం పోయింది”

నిర్ఘాంతపోయాను.

“సోవియట్ యూనియన్ పతనం నుండి గాని, చైనా పెడతోవనుండి గాని, కంబోడియా విషాదం నుండి గానీ, ఉత్తరకొరియా ప్రహసనం నుండి గానీ ఏమీ నేర్చుకోలేదు. అవేవీ జరగనట్టే ప్రవర్తిస్తారు. అసలు విషయం ఏమిటంటే ఆచరణలో కమ్యూనిజం పూర్తిగా విఫలమైంది”.

ఒక నిమిషం సేపు మాట్లాడలేక పోయాను. నెమ్మదిగా “నీలా ఆలోచిస్తున్న వాళ్ళు ఇక్కడ ఇంకా ఎవరైనా ఉన్నారా?” అన్నాను.

“కొద్దిమంది ఉన్నారు గాని, ఇవన్నీ దగ్గర స్నేహితులు ప్రైవేటుగా అనుకునే మాటలు.బహిరంగ చర్చలు కావు”.

“ఎందుకని?”

“ఒక సిద్ధాంతం కోసం జీవితం అంతా ధారబోసాక, ఇదంతా వట్టి భ్రమ అని ఒప్పుకోవడం అందరికీ సాధ్యం కాదు. మరి కొందరికి చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోతామేమో అనే సందేహం అడ్డువస్తుంది. విమర్శ చెయ్యాల్సిన చోట ఆత్మవిమర్శ చేసుకొని ఆగిపోతారు. తప్పీజారీ ఎవరైనా తీవ్రమైన విమర్శ పెడితే అలాంటి వాళ్ళని ఏదో ఒక ముద్ర వేసి బయటకు నెట్టడం చాలాసులభం. అలాంటిదేదైనా జరిగితే గనక అన్నీ వదులుకొని వచ్చినవాళ్ళు తట్టుకోలేరు. డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు, తాగుబోతులవుతారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇది నా ఊహ కాదు. అలాంటి వాళ్ళుకొంతమంది నాకు తెలుసు. అంత దాకా ఎందుకు? పెద్దమావయ్య సంగతే చూడు. గట్టివాడు కాబట్టి తొందరగా డిప్రెషన్ లోంచి బయటపడ్డాడు. ‘నువ్వున్నావు గనక తట్టుకోగాలిగాను’ అన్నాడు నాతో. ఇలాంటి ఎదురుదెబ్బలు తగిలినప్పుడు అనిపిస్తుంది. చుట్టూ తిరిగి చివరికి కుటుంబమే శరణ్యం అని.”

“ఈ కమ్యూన్ లోనూ, పార్టీల్లోనూ ఉన్నవాళ్ళంతా బయటకు పోయే ధైర్యంలేక ఉండిపోయారంటావా?”

“అందరూ అలాంటివాళ్ళని అనను. నిజానికి వీళ్ళెవరూ దేనికీ భయపడే రకాలు కాదు. మహా మొండిఘటాలు. సాధారణ జీవనం తోనూ, కుటుంబం తోనూ తెగతెంపులు చేసుకొని ప్రత్యామ్నాయాలు వెతుక్కునేవాళ్లకు ఇలాంటిచోట ఉండడం ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది. శేష జీవితాన్ని గడిపెయ్యడానికి బాగానే ఉంటుంది. అంత వరకే. ‘మనం ఎటు పోతున్నాం?’ అని ప్రశ్నించే వాళ్లకు మాత్రం అసంతృప్తి తప్పదు. నిజానికి ఇక్కడున్న వాళ్ళల్లోఎక్కువమంది విప్లవం వస్తుందనీ, ఆ తర్వాత అందరికీ మంచి రోజులు వస్తాయనీ సంపూర్ణంగా విశ్వసిస్తారు. ఇదొక రకమైన మతవిశ్వాసం. అటువంటి సమిష్టి ఆశాభావం, విశ్వాసం ఉండకపోతే వాళ్ళు బతకలేరు. అందుకే తమ నమ్మకాల్నిబలపరిచే వాస్తవాల్ని సేకరించి పోగు చేస్తారు, పంచి పెడతారు. విరుద్ధంగా ఉండే విషయాలు జరగనట్టే నటిస్తారు, లేదా ఇదంతా ప్రజావ్యతిరేక శక్తులప్రచారం అంటారు. ఇలా వాళ్ళజీవితాలు గడిచిపోతాయి”.

iddaru mavayyala illustration“మరి కొత్తవాళ్ళు ఎలా వస్తున్నారు?”

“ప్రధానంగా రెండు మార్గాల్లో. మొట్ట మొదటిది సామ్యవాద స్వప్నం లోని మహత్తర ఆకర్షణ. అన్యాయం, దోపిడీ నశించాలనీ, మనుషలందరూ సమానులే అనీ, అందరూ బతికి బాగుపడాలనీ మనిషన్నవాడెవడైనా కోరుకుంటాడు. చదువుకున్న మధ్య తరగతి వాళ్ళు, కొంతమంది అగ్రవర్ణస్తులు – అంటే మన బోటి వాళ్ళన్న మాట – ఈ దారిలో వస్తారు. మొదటితరం వాళ్ళల్లో మెజారిటీ వీళ్ళే. ఎక్కువగా కోస్తాంధ్ర వాళ్ళు. ఈ కమ్యూన్ లో ఉన్నది కూడా ఎక్కువగా వీళ్ళే. ఈ మధ్య కాలంలో ఈ ప్రవాహం బాగా ఎండి పోయి క్షీణించింది. ఇక రెండో మార్గంలోంచి వచ్చే వాళ్ళు మరో గత్యంతరం లేక ఉనికి కోసం పోరాటాలకు దిగినవాళ్ళు. అంటే గిరిజనులు, అట్టడుగు వర్గాలు, కొంతమంది దళితులూనూ. ఇప్పుడున్న సంక్షోభం మూలంగా ఈ ప్రవాహం ఉధృతంగా ఉంది. వాళ్ళు మధ్య తరగతిలోకి రాలేకపోతే ఇంకా ఉధృతం అవుతుంది. మన బోంట్లకు ఈ రెండో ప్రవాహంలో స్పేస్ లేదు. ఓ ఇరవై క్రిందట కాస్తంతఉండేది, ఇప్పుడు ఇంకేం మిగల్లేదు. అయితే నా సమస్య అది కాదు “.

“మరి?”

“ఎలా చెప్పాలి? ఇంకో చివరకి వెళ్లి ప్రయత్నిస్తాను… ఈ మధ్యే ఎక్కడో చదివాను – ‘సోషలిస్టులు అరచేతిలో స్వర్గం చూపిస్తారు. మార్క్సిస్టులు ఆ స్వర్గానికి సైద్ధాంతిక నిచ్చెనలు వేస్తారు, ప్రజలు నానాపాట్లూపడి అక్కడికిచేరుకోగానే కమ్యూనిస్టు నియంతలు అందర్నీశాశ్వతంగా నరకంలోకి నెట్టి తాళం వేస్తారు. వాళ్ళు మాత్రం తాళం జేబులో వేసుకొని స్వర్గంలో ఉంటారు’ ”.

“అంటే నువ్వనేది – అధికారంలోకి వచ్చాక మారిపోతారనా?”

“ఏ పార్టీ అయినా అధికారం చేతిలోకి వచ్చాక అత్యంత హేయమైన వ్యక్తులు, అవకాశవాదులు ముందుకి వస్తారు. ముందు తరాల త్యాగాలని వాడుకుంటారు. ఇది అందరికీ వర్తిస్తుంది. ఆడా, మొగా, వర్గం, కులం – అన్న తేడా ఉండదు. కావలసినన్ని ఉదాహరణలు ఇవ్వగలను. ఈ మాత్రం దానికి సిద్ధాంతం ఏదయితేనేం? బహుశా ఇందుకే గాంధీ గారు స్వతంత్రం వచ్చాక కాంగ్రెస్ పార్టీని రద్దు చెయ్యమన్నది”.

“అన్యాయాలూ, దోపిడీలూ లేవంటావా?”

“ఎందుకు లేవు? లెఖ్ఖలేనన్ని ఉన్నాయి. ముఖ్యంగా మన దేశం లాంటి దేశాల్లో. నేను మాత్రం మహాసంగ్రామాలకు దూరంగా చిన్నచిన్నస్థానిక పోరాటాల్లోకి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. అది కూడా మనజీవితకాలంలోనే ఫలితాలు కనిపించేంత చిన్న పోరాటాలు – మహా అయితే ఒకటో రెండో. మొత్తం వ్యవస్థని సమూలంగా మార్చాలనే దురాశని వదులుకున్నాను. అలాంటప్పుడు నేనింకా ఇక్కడ కొనసాగడం భావ్యం కాదు”.

“ఎక్కడికి వెళదామనుకుంటున్నావు?”

“బెంగుళూరు దగ్గర హేపీ వ్యాలీ స్కూల్లో చేరి పిల్లలకి ఇంగ్లీషు పాఠాలు చెబుదామనుకుంటున్నాను. అక్కడ ఎప్పట్నించో పనిచేస్తున్న స్నేహితుడొకడు రమ్మంటున్నాడు. ఆ మధ్య వెళ్లి ఊరికే ఓ మూడు రోజులుఉండి వచ్చాను. వాళ్ళ పద్ధతులు నాకు నచ్చాయి. ముఖ్యంగా పోటీలేని చదువు, పిల్లలలోని సహజ కుతూహలాన్ని పెంచి పోషించడం, ప్రకృతి అన్నా పర్యావరణం అన్నా గౌరవపూర్వకమైన జాగరూకత – ఇవన్నీ. అక్కడ ఉన్నప్పుడు నా స్నేహితుడు ఒక మాట అన్నాడు – ‘మన భూమండలం జీవరాశిని నిలబెట్టగలదు గానీ నాగరికతని తట్టుకోలేదు. ఇప్పటికే సమయం మించిపోయింది’ అని”

చిన్నమావయ్య స్నేహితుడు అన్న మాట నన్ను ఆలోచనలో పడేసింది. కాసేపు నిశ్శబ్దం.

నేను వచ్చిన పని గుర్తు చేసాను.

“ఇంకో ఆర్నెల్లైనా ఇక్కడ ఉంటాను. మీ అమ్మ ఇక్కడ మావాళ్ళతో బాగా అడ్జస్ట్ అయిపోగలదని నాకనిపిస్తోంది. బెంగుళూరు వెళ్ళే మాటయితే ఇద్దరం కలిసే వెళ్తాం. మీ అమ్మ చెయ్యగలిగే పని ఏదో ఒకటి అక్కడ దొరుకుతుంది. వాళ్ళకీ పనిచేసే మనుషులు కావాలి”.

డైనింగు హాలుకి వెళ్లి భోజనం చేసి తిరిగి రూంకి వచ్చాం. నా మనసంతా చికాగ్గా ఉంది. మరో వైపు నిద్ర ఊపేస్తోంది.

మావయ్య గ్రహించినట్టున్నాడు. “నువ్వు కాసేపు పడుకో. నేను కిచెన్ లో నా పని ముగించి టీ టైం కి వస్తాను. అప్పుడింక సావకాశం గా మాట్లాడుకోవచ్చు” అన్నాడు.

వొళ్ళు తెలీని నిద్రపట్టేసింది. తెలివి వచ్చేసరికి చీకటి అవుతోంది. ఏదో కల – చిన్న మావయ్య అడవి లో పరిగెడుతున్నాట్ట – నేను ఆగ మంటున్నా వినిపించుకోకుండా. కుక్కలు వెంట తరుముతున్నాయి అతన్ని – భయంకరమైన వేట కుక్కలు – వాటికి దొరికిపోతే చీల్చి చెండాడతాయి. మావయ్య వాటికి దొరికిపోతాడేమో అని నాకు ఒకటే భయం. చివరకి ఏమయిందో – గుర్తు రావడం లేదు. మావయ్య టేబిల్ లైట్ వేసుకొని లాప్ టాప్ మీద పని చేసుకుంటున్నాడు.

“మంచి నిద్రలో ఉన్నావని లేపలేదురా. టీ తాగుతావా?”.

“ఇప్పుడు తాగవలసింది టీ కాదు మావయ్యా” అని రక్సాక్ లోంచి దుబాయ్ డ్యూటీ ఫ్రీ లో కొన్న జానీ వాకర్ బ్లూ లేబిల్ స్కాచ్ విస్కీ బాటిల్ ని బయటకు తీసి టేబిల్ మీద పెట్టాను. మావయ్య తో కూర్చొని ఎన్ని సంవత్సరాలయిందో -.

మావయ్య నవ్వుతూ, “ఒరేయ్, వెంటనే దాన్ని లోపలపెట్టు. ఇక్కడ ఇలాంటి వేషాలేవీ కుదరవు. నేను మానేసి అయిదారు సంవత్సరాలైంది. కావాలంటే నీ హోటల్ కి పోయి తాగు”.

చేసేదిలేక బాటిల్ ని మళ్ళీ లోపలపెట్టాను. మావయ్యకి ఏదో చెప్పాలని నాకు చాలా ఉందిగాని – మాటలు తోచడం లేదు. తనే వెళ్లి రెండు పింగాణీ మగ్గుల్తో టీ తీసుకొచ్చాడు.

“ఇంక నేను బయిల్దేరాలి మావయ్యా” అన్నాను.

దగ్గరకి వచ్చి కాగలించుకున్నాడు. “పద” అన్నాడు నిర్వికారంగా. గది నుండి బయటకు నడిచాం. కమ్యూన్ లో కూడా గదులకు తాళాలు వేసే పని లేదు.

“పెద్దమావయ్య ఇక్కడి నుండి వెళిపోతున్నప్పుడు మావాళ్ళు అతనికి ఓ టీ పార్టీ ఇచ్చారు. అప్పుడాయన ఒక చిన్న ఉపన్యాసం ఇచ్చి ఆర్నెల్లపాటు ఆతిధ్యం ఇచ్చినందుకు కృతఙ్ఞతలు తెలియజేసాడు. కమ్యూన్ లో ఉండి చాలా నేర్చుకున్నానన్నాడు. ‘మీరంతా ఇన్నాళ్ళూ వర్గ శత్రువులతో పోరాడారు, ఇక మీదట మనందరి లోపలా ఉండే అసలు శత్రువులతో పోరాడండి’ అని ముగించాడు”.

గేటు దగ్గరకు వచ్చాం. అక్కడున్న ఒంటరి దీపస్తంభం చిగురున దీపపు పురుగులు నిర్విరామంగా ప్రదిక్షణలు చేస్తున్నాయి. అమర వీరుల స్తూపం పైసగం చీకట్లో కలిసిపోయింది. పొద్దున్న చూసిన బండరాళ్ళన్నీ చీకటి ముద్దలుగా మారిపోయి భయం గొలుపుతున్నాయి. పడమటి వైపున మాత్రం ఇంకా జీరాడుతూ కాస్తంత ఊదా రంగు వెలుగు. ఆకాశం అంతటా చుక్కలు. కీచురాళ్ళ రొద, అక్కడక్కడ మిణుగురు పురుగులు. దూరంగా డైనింగ్ హాలు లైట్లు. “ఈ వెర్రి మావయ్య పాపం ఇక్కడెలా ఉంటాడో” అని దిగులనిపించింది.

“వచ్చే నెలనుండీ మాకు హై-స్పీడ్ ఇంటర్ నెట్ ఏక్సెస్ వస్తుంది. నీ ఈ-మెయిల్స్ కి వెంటనే జవాబులివ్వగలను. స్కైప్ కూడా వాడుకోవచ్చు. ఈ సారి మాత్రం వెళ్ళగానే ఫోన్ చెయ్యి. మీ అమ్మని అడిగానని చెప్పు. మీ అమ్మ వస్తే నాకూ కంపెనీ ఉంటుంది”

టాక్సీ బయిల్దేరింది. నా నిద్ర మత్తు పూర్తిగా ఎగిరిపోయింది.

ఏదో తెలియని అసంతృప్తి, అనిశ్చితి. వీళ్ళిద్దరూ ఏం సాధించారు? జీవితాల్ని వృధా చేసుకున్నట్లేనా?

ఒక వైపు అవును అనిపిస్తోంది; మరో వైపు కాదు, అది నిజంకాదు అనిపిస్తోంది. వాళ్ళ జీవితాలకు వాళ్ళే నిర్దేశకులుగా వ్యవహరిస్తున్నారు. చెయ్యాలనుకున్న ప్రయోగాలు చేశారు; ఇంకా చేస్తున్నారు. న్యాయంగా, నిజాయితీగా ఉన్నారు. తప్పోఒప్పో, వాళ్ళ నిర్ణయాలకు వాళ్ళే బాధ్యులుగా ఉన్నారు. ఎవరైనా ఇంతకన్నా చెయ్యగలిగేది ఏముంది ఒక జీవితకాలంలో? కానీ పెళ్ళిళ్ళు చేసుకోవడం మానేసి పెద్ద పొరబాటు చేసారా? చివరికి కుటుంబమే శరణ్యం అన్నాడు చిన్నమావయ్య. పెద్దమావయ్య కూడా కుటుంబాన్ని మిస్ అవుతున్నాడా? అందుకేనా నన్ను చూడగానే అంత ఎమోషనల్ అయింది? చిన్న మావయ్యలో మాత్రం మునపటి హుషారు, హాస్యం కనబడలేదు. మనుషులకి తోడు కావాలి. పిల్లలూ కావాలి. అది సహజం. బ్రహ్మచారులైన మావయ్యలిద్దరూ నన్ను తమ సొంత కొడుకు లాగా, వారసుడి లాగా భావిస్తున్నారా?

దూరంగా హైదరాబాదు మహానగరపు దీపకాంతులు రాత్రి ఆకాశానికి అద్దిన నారింజరంగు వెలుగు. ఒక విమానం శంషాబాద్ వైపుగా కిందకి దిగుతున్నది. రేపు మధ్యాహ్నమే నా తిరుగు ప్రయాణం, దుబాయ్ మీదుగా. ఈ రెండు రోజుల్లోనే ఎంత విస్తృతమైన జీవితానుభవాల కలయక నాకెదురయ్యింది? ఈ అనుభవాన్ని ఎక్కడో రాసి పెట్టుకోవాలి – వీలయితే తెలుగులో – పోనీ నా బ్లాగులో -?.

* * *

హోటల్ కి చేరగానే స్నానం చేసి, ఓ పెగ్గు గ్లాసులో పోసుకొని ఇంటికి ఫోన్ చేశాను. అమ్మ ఎత్తింది. మావయ్యలు ఎలా ఉన్నారని అడిగింది. ఇద్దరి గురించీ టూకీగా చెప్పాను. ఆశ్రమం గురించీ, కమ్యూన్ గురించీ వివరాలు అడిగింది. పెద్దమావయ్య మతంనుండి ఆధ్యాత్మికత వైపు, చిన్నమావయ్య మహాసంగ్రామాలనుండి చిన్నచిన్న పోరాటాల వైపు ప్రయాణిస్తున్నారని తెలియజేశాను. శ్రద్ధగా వింది. ఇదే మంచి అదను అని ఇద్దరు మావయ్యలూ తమవద్ద ఉంచుకోవడానికి సుముఖంగా ఉన్నారనే శుభవార్త అందజేసాను. ఎగిరి గంతేస్తుందేమో అనుకున్నాను.

“నేను ఇండియా వెళ్తానన్నాను గాని మావయ్యల దగ్గర ఉంటాననలేదే. నాకింకా ఒంట్లో ఓపికుంది. ఉద్యోగాలు చేసే ఆడపిల్లల కోసం, వీధినపడ్డ ఆడవాళ్ళ కోసం, చవకలో మంచి హాస్టల్ నడిపే ఆలోచన ఉంది; బహుశా హైదరాబాదులో, లేదా విశాఖపట్నం లో. ఇవన్నీ నువ్విక్కడికి వచ్చాక మాట్లాడదాం”.

“అయితే మావయ్యలకేం చెప్పమంటావ్?”

“కొన్నాళ్ళబాటు పెద్దమావయ్యని కమ్యూన్ లోనూ, చిన్నమావయ్యని ఆశ్రమంలోనూ ఉండమని చెప్పు. ఇద్దరికీ మొత్తం తెలిసొస్తుంది. చివరికి అన్నీ ఒకటేరా. కూర మాడుతోంది, తరవాత చెయ్యి” అని ఫోన్ పెట్టేసింది.

– ఉణుదుర్తి సుధాకర్
22 నవంబరు 2013

Download PDF EPUB MOBI

Posted in 2015, కథ, మే and tagged , , , , .

13 Comments

 1. కథ బాగా చెప్పారు. బాగా చెప్పబడినదంతా సరైనది కాదు. కథలో చివరి మాటలు.. ఏమీ చెయ్యలేం, ఇదింతే అనే నిర్వేదం. ఇంకా చెప్పాలంటే ‘ముసిలాళ్ళ’ ఆలోచన. ఏమైనా చెయ్యగలం. ఉన్నది నీకు బాగుందా అయితే ఓకే. యూ స్టే హియర్. బాలేదా, ఇది మారడానికి నువ్వేం చేస్తావో అది చెయ్యి. మనకు తెలిసిన పదుల ఏండ్ల లోనే లోకం చాల మారింది. ఇంకా మారుతాననే ప్రామిస్ వుంది లోక గతిలో… ఆ ఆలోచన ఇవ్వకపోగా, అలాంటి ఆలోచనను ఈ కథ ఆలోచన హేళన చేస్తోందనిపించింది.

 2. ఒక సినిమా చూసిన తరువాత … ఒక పుస్తకం చదివిన తరువాత …. గాఢంగా నిద్రపోయి లేచినంత ఆనందం నాకు కలిగితే అవి అవి చాలా గొప్పవని నా నమ్మకం. అటువంటి నమ్మకం కలిగించింది ఈ కథ. ఇద్దరు మేనమామలు, ఒక అమ్మ పాత్రలను కేంద్రం చేసుకుని వ్యక్తుల హృదయాల్లోకి, సమాజపు లోతుల్లోకి మనల్ని నడిపించి, ఆలోచింప జేసిన మంచి కథ. పాత్రల సృష్టి సక్రమంగా ఉంటె … వాటికీ పేర్లెందుకు…. పెద్ద మామయ్య, చిన్న మామయ్య , అమ్మ అంటే చాలు. వారే సజీవంగా మన హృదయాల్లో నిలుస్తారు.

 3. కథ చాలా బాగుంది సుధాకర్ గారు. Infact, మీ రెండు central characters ( though I think I can safely assume the’re based on real people ) ఎంత బాగున్నాయంటే, మీరు ఈ కథని నవలగా expand చేస్తే చదవడానికి మీ మొదటి పాఠకుడు సిద్దంగా ఉన్నాడు.

  మీ ముగింపు కూడా చాలా నచ్చింది సర్ నాకు. జగత్తంతా జ్ఞానాణ్వేషన చేసినా దొరకనిది, అమ్మ మూడుముక్కల్లో చెప్పి అవతల పారేసింది. అమ్మ జిందాబాద్!

 4. త్రిపుర గారి (పెద్దమ్మాయి ప్రొ. వింధ్య గారి భర్త ) ఉణుదుర్తి సుధాకర్ గారు ( sudhakarudu@gmail.com )మంచి రచయిత అని తెలిసినా, ప్రస్థుతం వారు రాసిన “ఇద్దరు మావయ్యల కథ” నో మాస్టర్ పీస్ గా భావిస్తున్నాను. Practising Leftist అని త్రిపుర గారే మెచ్చుకునే సుధాకర్ గారు రాసిన కింది వాక్యాలు మెలాంఖలీ ఫీలింగ్స్ ను కలిగించాయి

  “నాకు కమ్యూనిజం మీద నమ్మకం పోయింది. ఆచరణలో కమ్యూనిజం పూర్తిగా విఫలమైంది. ఇదొక రకమైన మతవిశ్వాసం. అటువంటి సమిష్టి ఆశాభావం, విశ్వాసం ఉండకపోతే వాళ్ళు బతకలేరు”. “సోషలిస్టులు అరచేతిలో స్వర్గం చూపిస్తారు. మార్క్సిస్టులు ఆ స్వర్గానికి సైద్ధాంతిక నిచ్చెనలు వేస్తారు, ప్రజలు నానాపాట్లూపడి అక్కడికిచేరుకోగానే కమ్యూనిస్టు నియంతలు అందర్నీశాశ్వతంగా నరకంలోకి నెట్టి తాళం వేస్తారు. వాళ్ళు మాత్రం తాళం జేబులో వేసుకొని స్వర్గంలో ఉంటారు ”.

  ఊరి శివార్లలో ఆధ్యాత్మిక ఆశ్రమంలో (మతంనుండి ఆధ్యాత్మికత వైపు ప్రయాణిస్తున్న) పెద్ద మావయ్య చెంత చేరాలా లేక కమ్యూన్ లో (మహాసంగ్రామాలనుండి చిన్నచిన్న పోరాటాల వైపు వెళ్లాలనుకుంటున్న) చిన్న మావయ్య చెంత చేరాలా లాంటి ప్రతిపాదననలకు విరుద్ధంగా ఉద్యోగాలు చేసే ఆడపిల్లల కోసం, వీధినపడ్డ ఆడవాళ్ళ కోసం, చవకలో మంచి హాస్టల్ నడపాలనే అమ్మ అలోచన (కుటుంబమే శరణ్యం నుండి సంఘమే శరణ్యం) తోటి ముగింపు చాలా చాలా నచ్చింది.

  కఠోరమైన జీవిత సత్యాలను, గంభీరమైన విషయాలను చెపుతున్నా అంతర్వాహినిలా సున్నితమైన హాస్యం మేళవించటం, ఏకబిగిన చదివేలా చేసిన రచనా ప్రవాహం ~ హాట్సాఫ్ సుధాకర్ గారూ అనేలా చేసాయి.

  “కొంతమంది వీరాభిమానులు విగ్రహం పెట్టడానికి పూనుకొని చందాలు పోగుచేశారు. వాళ్ళని అడ్డుకొనే సరికి మా తాతలు దిగివచ్చారు. కాళ్ళమీద పడడానికి ఎవరూ లేక వాళ్ళంతా వటించిపోతున్నారు.“ వాక్యాలను త్రిపుర వీరాభిమాని నని గప్పాలు కొట్టుకోవాలునుకే నాకు అన్వయించుకుని నిస్సిగ్గుగా నవ్వుకున్నాను.