cover

బుక్‌మైడెత్.కామ్

Download PDF EPUB MOBI

రిసప్షన్ హాల్ మసకమసకగా ఉంది. గోడలకి నల్లరంగు పెయింట్ ఉన్నట్టుంది. దానికి తోడు లైట్లు డిమ్‌గా వెలుగుతున్నాయి. అదో రకం ముతక వాసన వస్తోంది. ఉక్కపోస్తుంది.

వాళ్ళిద్దరూ సోఫాలో అసౌకర్యంగా ఉన్నా కూర్చునే ఉన్నారు. వాళ్ళని అక్కడ కూర్చోమని చెప్పి వెళ్ళిపోయిన అమ్మాయి పది నిమిషాలైనా అత్తాపత్తా లేదు. ఇంతలో ఎవరో వచ్చి గ్లాసుడు నీళ్ళిచ్చారు గానీ, ఉడుకునీళ్ళవి.

“bookmydeath.com – your death, assured. insured.” అన్న అక్షరాలు గోడమీద ఎర్రరంగులో మెరుస్తున్నాయి.

ప్రతి రెండు నిమిషాలకొకసారి ఒక ఎ.వి రిపీట్ అవుతుంది: “మీకు చనిపోవాలని బలంగా ఉన్నా, ఎలా చనిపోవాలో తెలీటం లేదా? అయితే మమ్మల్ని సంప్రదించండి. మీ జీవనజ్యోతిని సరసమైన ధరల్లో ఆర్పేసే బాధ్యత మాది!” అన్న వాయిస్ ఓవర్‌కు లోగోలో నుండి దీపాన్ని కాపాడుతున్న రెండు చేతులనూ మరింత దగ్గరకు తోస్తూనే, దీపాన్ని “ఉఫ్”మని ఆర్పేసే ఆనిమేషన్.

“ఏం దరిద్రంరా ఇది?! పద పోదాం.” అని అంటూ లేచి నుంచున్నాడు ఒకడు.

“ఎక్కడికి పోతావ్? ఇంటికా? ఆఫీసుకా? మాల్‌కా?” అని అడిగాడు ఇంకొకడు.

ఇంతలో దూరంనుండి ఎవరో ఏదో పాడుతున్నట్టు లీలగా వినిపించింది:

మీరు బాధలో ఉన్నారని మీకు తెలుస్తుంటే

మీ ముక్కు చీదండి

మీ మీద మీకే చిరాకు కలుగుతుంటే

మీ తలబాదుకోండి

ట్యూన్ ఎక్కడో విన్నట్టుందని ఒక రెండు నిముషాలు ఆలోచిస్తే, “if you’re happy and you know..” పాట గుర్తుకొచ్చింది.

వెనుక జేబులో ఫోను నసగటం మొదలెట్టింది. తీసి చూస్తే, పదుల కొద్దీ ఇన్‌స్టాగ్రామ్ నోటిఫికేషన్లు. వివిధ రంగుల్లో, వింతవింత చీరల్లో, లెహంగాల్లో, పరికిణీలలో – సారీ, హాఫ్ సారీస్‌లో – కాబోయే పెళ్ళికూతురు దిగిన ఫోటోలు.

నుంచున్నవాడు కూలబడిపోయాడు సోఫాపైన.

“నాకు జీవితం మీద విరక్తి వస్తోంద్రా! ఏం చేయాలో తోచటం లేదు.” అని అన్నాడు కూలబడినవాడు.

కూలబడనివాడు ఏదో అనేలోపే ఇంకో అమ్మాయి వచ్చింది, “మిస్టర్…” అని పేరు పలికి, తనకి కావాల్సిన మనిషి అనగానే అందంగా నవ్వి, రమ్మన్నట్టు పిలిచింది.

“చూడు..వెళ్ళిపోదామన్నావ్. నీమాట వినుంటే…” అన్నాడు ఆ అమ్మాయి వెనుకభాగానికేసి కన్నార్పకుండా చూస్తూ, చూపిస్తూ.

“నాకేం తెల్సుబే! మొదట వచ్చిన ఆకారంలానే ఉంటారనుకున్నా…”

“టీ, కాఫీ, కూల్ డ్రింక్ – ఏం తీసుకుంటారు?” అని అడిగింది అందమైన గొంతులో, ఒక కాబిన్‌లో కూర్చోబెడుతూ.

“ఏదైనా.. విషమైనా..” అని తూలబోయాడు, ఆమెనుండి చూపుతిప్పుకోలేనివాడు. వాడికొకటిచ్చి, “మంచినీళ్ళు.. చల్లటివి..” అన్నాడు.

“ష్యూర్.. తప్పకుండా. మా బాస్ ఇప్పుడే వచ్చేస్తారు. అందాక, మేక్ యుర్‌సెల్ఫ్ కంఫర్టబుల్. బై.” అంది తీయగా. ఆ “బై” ఆ గదిలో కొద్దిసేపు గుడిగంటలా మోగింది.

“అమ్మాయిరా బావా.. అమ్మాయి.. ” అంటుండగా, ఇంకో అప్సరస లాంటి అమ్మాయి పెద్ద ట్రేలో టీ, కాఫీ, జ్యూస్, కోక్, రెడ్‌బుల్ వగైరాలన్నీ పట్టుకొచ్చి, వయ్యారంగా అందించింది. కొంచెం నీరసంగా ఉందనిపించినవాడు జ్యూస్ అందుకున్నాడు. ఇంకొంకడిది ఏం అందుకుంటున్నాడో పట్టించుకునే పరిస్థితి కాదు.

“ఇది మన ఆఫీసుకి రివర్స్ గా ఉంది కదరా? మన రిసప్షన్ ఎంత హాయిగా ఉంటుందో, మన కాబిన్ అంత నరకం.” అని అన్నాడు ఇంకా అమ్మాయిల ఊహల్లో ఉన్నవాడు.

“ఇప్పుడు ఆ దెయ్యాన్ని గుర్తుచేయకు.” ఆ మాట అంటూనే, వింటూనే ఇద్దరికీ ఆ దెయ్యం మొహం సాక్షాత్కరించింది. ఇద్దరూ తలకాయలు బలంగా విదిలించారు, ఆ భయానకమైన బొమ్మ చెదిరిపోయేట్టు.

ఆ భయానకమైన బొమ్మ ఊహల్లో చెదిరిపోయి, కళ్ళముందు సజీవమైనట్టు, ఒక మగ ఆకారం ఎదురుగా వచ్చి నుంచుంది. సూటూ, బూటూ బట్టి బాస్ అనుకోవాలే తప్ప, లేకపోతే ఖాళీ కప్పులు తీసేవాడని అనుకునే అవకాశం ఉన్నట్టుగా ఉన్నాడు ఆ శాల్తీ.

“హాయ్.. నా పేరు నేను చెప్పను. చెప్పి మీకాలాన్ని వృధా చేయదల్చుకోలేదు. నాకు తెల్సు మీరు చాలా బిజీ ప్రోఫెషనల్స్ అని. మీరు ఇక్కడ వెచ్చించే ప్రతి సెకనుకి నేను విలువ ఉండేలా చూస్తాను. నాతో మాట్లాడిన ఈ గంట తర్వాత, అసలు మీకు జీవితం గురించి… ”

“వెచ్చించటం అంటే గుర్తొచ్చింది. నావి రెండువేలు కట్ చేశారు మీవాళ్ళు. ఎందుకు? నా డబ్బులు కావాలంటే ఈ ఆఫీసులో కలెక్ట్ చేసుకోమన్నారు.” అంటూ జేబులో నస మొదలెట్టిన మొబైల్‌ను బయటకు తీసి నోటిఫికేషన్స్ చూసుకున్నాడు.

“అక్కడికీ వస్తా.. మీ డబ్బు ఎక్కడికీ పోలేదు. మా దగ్గరే క్షేమంగా ఉంది. దాని గురించి మాట్లాడుకుందాం. ”

“మాటలనవసరం. నా డబ్బు నా అనుమతి లేకుండా తీసుకున్నందుకు ఫ్రాడ్ కేస్ పెడతా. ప్రజలను అమాయకులను చేసి ఆత్మహత్యలకి పురిగొల్పుతున్నారని మీడియాకి చెప్తా..” అంటూ ఆవేశపడి, ఫేస్‌బుక్ మెసంజర్‌లో, “చాలా బాగున్నావు. పీచ్ కలర్ నీ ఒంటి మీద అదుర్స్. కాన్ట్ వెయిట్ టు హగ్ యు!” అని టైపు చేసి, “మర్యాదగా నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వండి, లేదా…” అని ఎదురుగా ఉన్నవాడిని హెచ్చరించాడు.

అవతలివాడు అంతలా ఆవేశపడుతున్నా ఆవగింజంతన్నా ఆందోళన చెందకుండా, “ముందు నా మాటలు విని, ఆలోచించి. ఆ తర్వాత ఏం చేయాలనుకున్నా నాకు ఒకే. డెత్ ఇన్స్యూరెన్స్ అన్నది వినటానికి కొత్తగా ఉండి, అలా అంటున్నారుగానీ.. ”

“కొత్తగా కాదు. చెత్తగా ఉంది.” అని కిసుక్కున నవ్వాడు, చాలా సేపట్నించి డైలాగ్ లేనివాడు.

“వినేవాళ్ళుంటే ఏమైనా చెప్తార్రా వీళ్ళు! డెత్ ఇన్స్యూరెన్స్ అట.. డెత్ ఇన్స్యూరెన్స్! చావడానికి డబ్బెవ్వరు కడతారు?” అన్నాడు దొరికిందే సందని ఇంకొకడు.

వీళ్ళిద్దరి మాటలు వింటున్నవాడు, మెల్లిగా నవ్వి, “కాసేపు ఆగితే మీరే కడతారు.” అని అనుకొని, పైకి – “చనిపోవడం గురించి ఎంత తేలిగ్గా మాట్లాడుతున్నారే? మీరెప్పుడన్నా చనిపోవడానికి ప్రయత్నించారా?”

అడ్డంగా తలూపారు ఇద్దరు.

“కనీసం సూసైడ్ చేసుకోవాలి అనుకున్నారా?”

“దానికేం భాగ్యం. సెకనుకి అరవైసార్లు!” అని ఒకడు అనగానే,

“మీకు పెళ్ళైయ్యుంటుంది!”

“వీడికి ఇప్పుడు అవ్వబోతుంది. ఆ పెళ్ళి షాపింగ్‌కని వెళ్తేనే…”

మగ్గురూ కాసేపు ఫ్లాష్‌బాక్‍లోకి వెళ్ళారు — ఆ ఉదయం పెళ్ళి షాపింగ్‌కని బయలుదేరాడు, పెళ్ళికాబోతున్నవాడు. కాసేపటికి పెళ్ళైపోయినవాడికి వాట్సాప్‌లో టెలిగ్రామ్ ఇచ్చాడు, “స్టార్ ఇమ్మీడియట్లీ” అని. వాడు వచ్చీరాగానే స్ఫృహ కోల్పోయాడు. హాస్పిటల్‌కు తీసుకెళ్తే, మొదట సూసైడ్ కేస్ అని తేల్చారు. దబాయిస్తే, “ప్రిపరేషన్ లేకుండా ఆడవాళ్ళతో షాపింగ్‌కు వెళ్ళటం ప్రాణాంతకమైనది. పెళ్ళిలాంటి భారీ షాపింగ్ చేయాల్సి వచ్చినప్పుడు ముందుగా మా దగ్గర ప్రి-షాపింగ్-ట్రీట్మెంట్స్ తీసుకుంటే మానసిక, శారీరక నష్టాలను చాలా వరకూ అదుపు చేయవచ్చు. మా ట్రీట్మెంట్స్ లో భాగంగా శరీరానికి మంచి తిండి, నీరు, వ్యాయామం అందించి భారీ బాగులు మోయడానికి మిమ్మల్ని సిద్ధపరచడమే కాక, మెడిటేషన్, యోగ నిద్ర ద్వారా షాపింగ్‌లో సెలక్షన్ అనే ప్రహసనాన్ని నెగ్గుకురావడమెలానో భోదిస్తాం.” అని లెక్చరిచ్చి, రెండు బాటిళ్ళ సెలైన్ ఎక్కించి, బిల్ తడిపి మోపెడు చేసి డిస్‌చార్జ్ చేశారు. తిరిగి మాల్‌కి వెళ్ళే ఓపికలేక, ఆఫీసుకెళ్ళి ఆ దెయ్యంతో దొబ్బించుకునేంత విరక్తి రాక, సినిమాకు వెళ్దామని నిశ్చయించుకుని, బుక్‍మైషో.కామ్ అని కొడితే-

“అవునూ.. నేను బుక్‌మైషో.కామ్ అనే కొట్టా.. అది మీ సైట్‌కి ఆటోమేటిక్‌గా రీడైరెక్ట్ ఎలా అయ్యింది?”

“మీరతడి ఫోనులో కొట్టుంటారు?”

“అవును. వీడి ఫోన్‌లోనే కొట్టా. అందుకేగా వాడి డబ్బులు దొబ్బాయ్”

“నా ఫోన్ అయితే ఏంటి?”

“గత కొన్ని నెలలుగా మీరు డిప్రషన్‌లో ఉన్నారు. జీవితం మీద విరక్తి వచ్చి.”

“రాదు మరి! వాళ్ళ అమ్మ మాత్రం ఎంతని ఓపిక పడుతుంది? ఆ పిల్లని మర్చిపోరా అని మేమెంత చెప్పినా విన్లేదు. సన్యాసం తీసుకోని సన్నాసిలా ఇరవైలు దాటేశాడు. ముప్ఫై రాగానే ‘లూజర్’ అని అందరూ మొదలెట్టారు. ఇంకా చూస్తూ ఉండలేక వాళ్ళ అమ్మ ఈ పెళ్ళికి ఒప్పించింది.”

“నువ్వుండ్రా.. అయినా నేను డిప్రషన్‌లో ఉన్నానని మీకెలా తెల్సు?”

“వెబ్. మీరు చేసే సెర్చెస్, మీ మెసేజెస్, మీ మెయిల్స్ వీటిలో మీరు సమస్యలతో బాధపడుతున్నారని తెల్సింది. అందుకే, మీ ఫోన్‌లో మాత్రమే మా వెబ్‌సైట్ దానంతట అదే తెరుచుకుంటుంది.”

“నా మెసేజెస్ అవీ ట్రాక్ ఎందుకు చేస్తున్నారు? ప్రైవసీ అంటూ లేదా?”

“వెబ్ ఆండ్ ప్రైవసీ? మీరు ఉత్త అమాయకుల్లా ఉన్నారు.. మళ్ళీ మెడలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ టాగ్! మేం పనిగట్టుకొని మిమ్మల్ని ట్రాక్ చేయలేదు. మేము కొనుక్కున్న డేటాపై అనాలసిస్ చేస్తే, మీరు మాకు క్లైయింట్ అయ్యే అవకాశం కనిపించింది. ప్రజలవద్దకు పాలనలా మాది కూడా…”

“ఆ… మీది కూడా? కూడా? ఆలోచనరాని వాళ్ళని కూడా ఆత్మహత్య చేసుకునేలా చేస్తారా? ఇది ఎంత ఇల్లీగలో తెలీదా మీకు?”

“అదెంత ట్రాజిక్కో మీకు అర్థం కావడం లేదు. రావడం మన ఇష్టం కాదు. పోవడం మన ఇష్టం కాదు. ఇష్టం లేకపోయినా, ఎంత కష్టమవుతున్నా టైమ్ అయ్యేంతవరకూ బతకాల్సిందే! ఆ టైమ్ ఎప్పుడు అవుతుందో తెలీదు. టైమ్ అయ్యాక ఇక్కడ నుండి ఎక్కడికి పోతామో తెలీదు. మీరిందాక రిసప్షన్‌లో పది నిముషాలు కూర్చున్నారా? ఎంత చిరాగ్గా అనిపించలేదూ? అక్కడనుండి లేచివెళ్ళిపోవాలనుకున్నారా లేదా?”

“మళ్ళీ ఆగిపోయాడు కదండీ! ఇంకెక్కడికీ వెళ్ళకలేక.”

“వెళ్ళలేక ఆగిపోయే అగత్యంలానే, ఆగలేక వెళ్ళిపోవటమూ ఓ అగత్యమే! అదీ అర్థంచేసుకోదగ్గదే! అలా అర్థంచేసుకునే మేము ఇది మొదలెట్టాం. కొందరు సైలెంట్‌గా వెళ్ళిపోవాలనుకుంటారు. కొందరికి వయెలెంట్ అంటారు. కొందరికి తాము చేసుకుంటుంది సూసైడ్ అని తమకే తెలీకూడదు. ఫాంటసీ డెత్. డిజనైర్ డెత్. అన్నీ మేం చూసుకుంటాం. ఎందుకంటే, జీవితం అమ్మలాంటిది. మన తాహతకు తగ్గట్టు దాన్ని ఎలా చూసుకున్నా, అసలు చూసుకున్నా చూసుకోకపోయినా, అది సర్దుకుపోతుంది. మనం రాట్-రేస్‌లో పడి లైఫ్‌కి టార్గెట్స్ సెట్ చేస్తాంగానీ.. అదేం ఆశించదు. బట్.. చావు. అది భార్యలాంటిది. డిమాండింగ్. అన్‌డివైడెడ్ ఎటెన్షన్ కావాలి దానికి. కంప్లీట్ డెడికేషన్. నో టూ టైమింగ్! లైఫ్ దేముంది బాస్? స్లీప్ ప్లస్ స్లీప్‌వాకింగ్ అయినా సరిపోతుంది. బట్ డెత్..”

వింటున్న ఇద్దరూ దీర్ఘాలోచనలో పడ్డారు. చెప్పేవాడు ఇప్పటికిప్పుడు ఆత్మహత్య చేసుకునేదాకా వదిలేలా లేడని వాళ్ళకి అర్థమయ్యింది. ఆ ముక్క గ్రహించినవాడిలా..

“భయపడకండి. నేనేం సూసైడ్ చేసుకోమనడం లేదు మీ ఇద్దరిని. మీరింకా ఆ స్టేజికి రాలేదు. మా టాగ్‌లైన్‌లో అస్యూరెన్స్ తో పాటు ఇన్స్యూరెన్స్ కూడా ఉంది. జీవిత భీమా గురించి మీకు తెల్సిందే! ఈ కాన్సెప్ట్ అర్థమవ్వడానికి ఒక ఉదాహరణ తీసుకుందాం. మీరో రైల్లో ఒక ఊరు నుండి ఇంకో ఊరికి ప్రయాణిస్తున్నారు అనుకుందాం. మీరున్న భోగికి నిప్పంటుకుంది. కూర్చున్నవాళ్ళు కూర్చున్నట్టు కాలిపోయారు. ప్రభుత్వం వేసిన కమిటి దాన్ని అక్సిడెంట్ అని తేలుస్తుంది. జీవిత భీమా వాళ్ళు మీ కుటుంబానికి రావాల్సిన డబ్బు ఇచ్చేస్తారు. కానీ, ఇక్కడో ట్విస్ట్. బెర్త్ నెంబర్ బట్టి, ఏవో డి.ఎన్.ఎ పరీక్షలు బట్టి మీదంటూ మీవాళ్ళకి అప్పగించిన ‘బాడీ’ మీది కాదు, తమవాళ్ళదంటూ కొందరు వస్తారు. ఎక్కడో జరిగిన పొరపాటు వలన ఎవరిదో బాడి మీది అనుకోబడింది. అందుకని మీ అస్థికలు వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఇందరు ఉండీ మీది దిక్కులేని చావు అయ్యిందే అని మీవాళ్ళ ఆవేదనలో, జీవిత భీమావాళ్ళొచ్చి మీ చావు ఖరారు అవ్వలేదు కాబట్టి డబ్బు ఇవ్వమూ అంటారు. ఇక్కడే మేం సాయం చేస్తాం. మీవాళ్ళని మీచావు నుండి కాపాడుతాం, కొద్దిగా అయినా..”

ఇద్దరూ కొయ్యబారిపోయారు సంఘటలను ఊహించుకుంటూ. ఇద్దరి ముందుకి మంచినీళ్ల బాటిల్ తోస్తూ, దొరికిందే సందని ఇంకో ఉదాహరణ చెప్పాడు.

“మీరో టెర్రరిస్ట్ అటాక్‌లో పోయారు. కారణాంతరాల వల్ల మీరూ ఒక టెర్రరిస్ట్ అని అపోహ పడతారు పోలీసులు. సాఫ్ట్వేర్ ఇంజినీరే టెర్రరిస్ట్ అని వార్తల్లో వస్తుంది ఈలోపు. అప్పటిదాకా మీకున్న పేరు, ప్రతిష్ట అంతా నాశనం. మీవాళ్ళని సమాజం హీనంగా చూస్తుంది. జీవిత భీమా వాళ్ళు డబ్బులిచ్చే సమస్యే లేదు. ఇప్పుడు మీ పేరునూ, మీవాళ్ళ మనశ్శాంతిని తిరిగి రాబట్టాలంటే కోర్టులు చుట్టూ తిరగాలి. ఎవరు తిరుగుతారు? మేం తిరుగుతాం.”

మంచినీళ్ళు గడగడా తాగారు ఇద్దరూ.

“మీరేవేవో చెప్పి మమల్ని భయపెట్టడానికి చూస్తున్నారు. మేమిలా దారుణంగా పోతామని మీరెలా చెప్పగలరు?”

“దారుణమో కాదో మీరెలా చెప్పగలరు?”

సమాధానం చెప్పలేక ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకొని, ఇంకా సమాధానం దొరక్క, తప్పించుకోవడానికి మొబైల్ వంక చూశారు. పెళ్ళైనవాడికి యాభై మిస్డ్ కాల్స్. పెళ్ళికాబోతున్నవాడికి నూట యాభై మిస్డ్ కాల్స్ వచ్చున్నాయి.

“సరేనండి. మేమిక బయలుదేరుతాం. మీరు చెప్పినవన్నీ ఆలోచించి ఒకట్రెండు రోజుల్లో ఏ పాలసిలో చేరాలో చెప్తాం” అంటూ లేవబోయారు.

“మళ్ళీ రానవసరంలేదు. మీకు నప్పే పాలసిలో మిమల్ని చేర్చేశాం.” అని అన్నాడు. టక్కున మొబైల్ మోగింది. చూస్తే నాలుగు లక్షలు కట్ అయ్యి ఉన్నాయి. “ఇందాక మీరిద్దరూ షాక్‌లో ఉన్నప్పుడే మా బయోమెట్రిక్ అథెన్టికేషన్ పనిచేసుకుపోయింది. ఇహ, ఫార్మాలిటీస్ అన్నీ అయినట్టే! వెళ్ళండి. పోవాలనుకున్నప్పుడు మళ్ళీ వద్దురుగానీ.”

ఇద్దరూ బయటకొచ్చారు. గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు.

“ఆడి మాటల్లో పడి నాలుగు లక్షలు బొక్క పెట్టించుకున్నాం కదరా!”

“అసలు మనం ప్రాణాలతో బయటకొస్తామని అనుకోలేదు. ఈపూట చస్తేగానీ వదలడనుకున్నాను.”

“ఎందుకురా మనకేం ఇలా జరుగుతుంది? మనమేం చేశామని?”

“ఆడు రావటం మన ఇష్టం కాదు, పోవటం మన ఇష్టం కాదు అని అన్నాడుగా! ఈ రాకపోకల మధ్యన అంతా మన ఇష్టమే అయినట్టు, మనం కోరుకున్నదే అన్నట్టు బిల్డప్ ఉంది చూశావూ.. అదే మనల్ని వెధవల్ని చేసిపడేస్తుంది. ఎవడో చేతగాని వాడు, ఏదో రాయాలని ప్రయత్నించి మన రాతనిలా తగలెట్టాడు. ఏం చేయగలం?!”

*

Download PDF EPUB MOBI

రెగ్యులర్ అప్డేట్స్ కోసం కినిగె పత్రిక ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి.
Posted in 2015, కథ, మే and tagged , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.