bhagavamtam garo poem

బాటసారీ నీ దారి పేరు సెలయేరు

Download PDF     ePub     MOBI

 

బాటసారీ

నీ దారి పేరు సెలయేరు . . .

 

ఈ రాత్రిని

చంద్రునిలోకి ఒంపు . . .

నీ కలని

bhagavamtam garo poem

దారుల వెనుక వెళ్లిపోయిన

తోటల నీడల్తో నింపు . . .

నిద్ర లేవగానే

నిన్నటి నీ రాత్రి అర్థమేమిటని

ఎవరైనా అడిగితే

అంతర్ధానం అని చెప్పు . . .

* * *

ఈ ఉదయాన్ని

సూర్యుని మొదటి కిరణం ముందు

ఊరేగించు . . .

నీ దినచర్యను

పక్షి ఎగిరిపోయాక ఊగుతోన్న

ఆకు నుండి ప్రారంభించు . . .

దార్లో ఎవరైనా

నీ స్వస్థలం ఏమిటని అడిగితే

స్థలకాలం అని చెప్పు . . .

* * *

ఈ మధ్యాహ్నాన్ని

రేడియో పాత పాట చివర

కునుకు తీయించు . . .

మిగిలిన ప్రయాణాన్ని

కాకి మేల్కొలుపు నుండి కదిలించు . . .

కొత్త ఊరి పొలిమేరల్లో ఎదురైన ఎవరైనా

ఎక్కడి నుండి వస్తున్నావని అడిగితే

పాట చివర మొదలైన బాట దగ్గరి నుండి

అని చెప్పు . . .

* * *

ఈ సాయంత్రాన్ని

నీ నీడలోకి అనువదించు . . .

నీ నీడని

కవిత్వంలోకి ఆహ్వానించు . . .

ఈ కవితకు శీర్షికేమిటని

తోటి బాటసారులెవరైనా అడిగితే

‘జీవితేచ్ఛ’ అని

రాత్రిలోకి చూస్తూ జవాబు చెప్పు . . .

 

(మిత్రుడు బాదర్ల అజయ్ ప్రసాద్‌కి)

– భగవంతం

Download PDF     ePub     MOBI

Posted in 2013, కవిత, డిసెంబరు and tagged , .

10 Comments

 1. bhagavantham gaaroo … kavitha chaalaa baagundi. kavitha loni aayuvu pattaina bhavaanni kaakundaa , daanni anbhoothinchakundaa , daantloni akshara doshaalo , marinke doshaalo lekkisthoo koorchune arasalanu chooshe chaalaa jaali vesthundi. kavithvaanni anubhavinche hrudayaaniki kavi bhavana thappa kavithalo maremee kanapadadu

 2. >> ~(Tilde)
  అది లినక్స్ వంటి సిస్టములలో హోమ్ డైరెక్టరీ సూచించడానికి కూడా వాడతారు. అంటే మీ స్వంతం అయినవి అక్కడ నుండి మొదలవుతాయని.
  అలానే ఈమెయిల్లలో కూడా ఇట్లు పలానా పలానా అని వ్రాసే బదులు సింపులుగా ~Kiran అని వ్రాస్తుంటారు. సుమారుగా అనే అర్థం పాత తరానిదనుకుంటాను.
  ~Chavakiran

  • ప్రసాద్ గారు, కవిత పబ్లిష్ అయిన రెండు రోజులకు భగవంతం గారు మరికొన్ని సవరణలు జత చేశారు. ఆ సవరణలు వెబ్‌సైట్లో అయ్యాయి గానీ, పీడిఎఫ్ లో కాలేదు. ఇప్పుడు సవరించాం. ఇక ఆ Tilda అలవాటు మాత్రం నాదే. దానికి ఆ అర్థం ఉందని తెలియదు. దాన్ని కూడా మార్చాను. Thank you for such a detailed response.

 3. PDFలు ఇవ్వడం చాల ముచ్చటగా ఉంది. చూడ్డానికి ముద్దుగా ఉంటాయని PDFలంటే నాకు పిచ్చి. కవి పేరుకి ముందు ~(Tilde) బావులేదు. ~ అంటే Approximately అని అర్ధం. కవి స్థైర్యాన్ని చులకన చేస్తున్నాది. భగవంతం మా Dharma brother అని కవితలోనికి ప్రవేశించేను. కవితలకి డబల్ స్పేసింగ్ పనికిరాదు. వెంటనే ఎక్కడుందా అని వెతుక్కుంటున్న మరుసటి పంక్తిని ఎడంగా పెట్టి, అనవసరమైన దూరాన్ని కల్పిస్తాయి. “బాటసారీ నీ దారి పేరు సెలయేరు …” లోన బాటసారీ అక్ఖల్లేదు – అది సూచ్యంగా వదిలెస్తే కవిత సాంద్రతరమౌతుంది. మూడు చుక్కలు (Ellipsis) అసంపూర్తినీ, సందిగ్ధతనూ సూచించేవి, వాటికి ఈ కవితలో ఎంతమాత్రం చోటులేదు. కవి ‘బాటసారి ‘కి (తనకు తానే) స్పష్టంగా ఇస్తున్న ఆజ్ఞాపనలు ఇవన్నీ. సందిగ్ధత, సంశయం చుక్కలు నప్పలేదు. బస్తీ మే సవాల్గా ఒక్క చుక్క చాలదా?!

  “నిద్ర లేవగానే”, “ఎవరైనా అడిగితే” రెండూ కలిసి అవసరమైన దానికంటే ఎక్కువ జాగాని కబ్జా చేసుకుని ఔద్వేగిక ఆవరణను పలచన చేస్తున్నాయి. రెండవ ఖండం ఉదయాన్ని గురించి ఆసాంతం ఒద్దికగా అమిరింది. ఇది:

  “దినచర్యను
  పక్షి ఎగిరిపోయాక ఊగుతోన్న
  ఆకు నుండి ప్రారంభించు” తో ప్రారంభించవలిసిందని అనిపిస్తుంది – chronology నప్పుతుంది. ఖండాలకు మధ్య విరామ చిహ్నాలుగా ఒక పెద్ద నల్ల చందమామ బాగుండేది (…) బదులు.

  “కొత్త ఊరి పొలిమేరల్లో” దగ్గర్నుండి నాలుగు పంక్తుల్నీ ఇంకా బిగించి నేయాలి.

  “తోటి బాటసారులెవరైనా” అన్న మాట – భావనతో, మాటలతో ఏదో ఇబ్బందిగా, గుద్దుకున్నట్టు ఉంది.
  “తోటి బాటసారులెవరైనా అడిగితే
  జీవితేచ్ఛ అని
  రాత్రిలోకి చూస్తూ జవాబు చెప్పు”
  అనే పాదాలు అవసరమైనంత కంటే ఎక్కువ జాగాని వాడుకుని కవితను, ముఖ్యంగా poetic closureను ఒదులు చేస్తున్నాయి.

  బాటసారికి తన నడక మీద కాదా, అడుగడుగునా ఎవరైనా అడిగితే ఏం చెప్పాలో stock answers మీదనా ధ్యాస అనిపించేలాగ ప్రతీ ఖండం ముగింపులోనూ వచ్చి ఉదాత్తమైన బేవార్సు ప్రయాణాన్ని న్యూనపరుస్తున్నాయి. సెలయేళ్ళలోన బాటలు అంతరిక్షంలో నిద్దర్లూ చేసుకునే ముసాఫిర్కి ఎవరైనా ఏదైనా ఫలానా అని అడిగితే ఎంత, అడక్కపోతే ఎంత?

  ఈ లోకస్పృహకు పరాకాష్ట లాగ “ఈ కవితకు శీర్షికేమిటని” అనే ఊహ పానకంలో పుడకలాగ On the Roadలా ఆంతరంగికమైన బాటసారి ప్రయాణం లోకి కవికి అసందర్భంగా వాచ్యంగా చొచ్చుకుని వచ్చే అవకాశాన్ని ఇచ్చి, ఖఠక్కుమని పంటికి తగుల్తున్నాది.

  నీ, నీ, ఈ వంటి సర్వనామాలు మోతాదు మించి sprinkle అయ్యేయి. కొన్ని కొన్ని చోట్ల తీసీసి చూస్తే అందం ఇనుమడిస్తుంది.

  ఈ దశలో ఉన్న కవితకి ఎదురుగా గంటలు గంటలు కూచుని దాన్నే పులుసటుకులు ధ్యానం చెయ్యగా చెయ్యగా అది తనంతట తనే, కవి ప్రయత్నాల జాడలన్నింటినీ తుడిచి తనను తనే పరిశుభ్రం చేసుకుంటుంది, బిగువు చేసుకుంటుంది.
  రెండో ఖండంలో అలా అయ్యింది.
  అప్రయత్నంగా అయ్యింది.

  S. K. ప్రసాద్

  • కనక ప్రసాద్ గారికి నమస్తే,

   మీ ఆత్మీయతకు ధన్యవాదాలు. కవితలో మీరు భావించినట్లుగా “బాటసారి”ని నేను కాదండి, నా మిత్రుడు.

   ఏడాది క్రితం తన జీవితంలో సంభవించిన విషాద సంఘటన వల్ల తీవ్ర మనోవ్యధకు లోనై, జీవించడం పట్ల ఇచ్ఛను కోల్పోతున్న సమయంలో అతనికి ఓదార్పుగా నాలుగు మాటలు చెప్పాలని అనుకుంటున్నపుడు రాసిన కవిత ఇది.

   తన నిరాశాజనకమైన మాటలు ఏ ఆత్మహత్యకో పాల్పడతాడేమోనన్న ఆందోళనని కలిగించడం వల్ల అసలతను భూమ్మీదే లేకపోవడం కన్నా ఏ సంచారిలానో లోకంలో కదులుతూ ఉన్నా చాలు అనుకున్నాను. అందుకే “బాటసారీ”, “జీవితేచ్ఛ” లాంటి పదాల్ని కవితలో వాడకుండా ఉండలేకపోయాను. అవి వాడకుండా కూడా ఆ భావం వచ్చేలా చెప్పవచ్చేమో కానీ, ఆ అక్షరాలు (ముఖ్యంగా బాటసారీ లోని “రీ” అనే అక్షరం, జీవితేచ్ఛలోని “చ్ఛ” అనేవి) ధైర్యవచనాలు చెపుతూ నా చేతిని మిత్రుడి భుజం మీద వేసి ప్రేమగా నొక్కుతున్నప్పటి శబ్దాల్లా అనిపించాయి. అందుకని ఆ రెండు పదాల మీద వ్యామోహం వదులుకోలేకపోయాను.

   అలాగే – మూడుచుక్కల్ని “ఎలిప్సిస్” అని అంటారనీ, అవి అసంపూర్తిని, సందిగ్ధతనూ సూచిస్తాయనీ తెలియదు. కవితలో ప్రతి ఖండం చివరా మూడుచుక్కలు పెట్టి ముచ్చటపడే అలవాటు నాది. కాగితం ఎడమపక్క నుండి మొదలైన అక్షరాల మెట్ల నుండి నడుచుకుంటూ వచ్చి – కుడి పక్క తెల్లని ఖాళీ జాగాలా ఉన్న నదిలోకి వదిలే దీపాల్లా అనిపించి నా కంటిని మురిపిస్తాయా చుక్కలు. అయితే కవి కంటి మీది హాయి ఐన సిరాచుక్కలు పఠిత పంటి కింది రాయిలా కూడా మారొచ్చని తెలిసింది కాబట్టి మధ్యే మార్గంగానో ఉభయతారకంగానో ఇకపై రాసుకుంటున్నప్పుడు వాటిని నా కోసం అలాగే పెట్టేసుకుని ప్రపంచం మీదికి వదులుతున్నప్పుడు మాత్రం అవి లేకుండా చూసుకోవచ్చనీ అనిపిస్తోందిప్పుడు.

   అలాగే “ఎవరైనా అడిగితే – ఫలానా అని చెప్పు” లాంటి మాటలు బాటసారి ప్రయాణంలోని నడకలో అతడు ఒక అడుగు వేస్తున్నప్పుడు పుట్టే ప్రశ్న లాంటి శబ్దానికీ, మరో అడుగు వేస్తూ ఇస్తున్న జవాబులాంటి శబ్దంలా భావించాను. కాని చదువరులకు అది ప్రతీకాత్మకంగా కాకుండా ముసాఫిర్ ప్రయాణంలోకి అనవసరంగా చొచ్చుకు వచ్చిన లోకస్పృహలా కూడా అనిపించే అవకాశం ఉందని ఊహించలేకపోయాను. కవితలో కవి చెవికి వినిపించిన శబ్దం పాఠకుడి కంటికీ అలాగే కనిపించాలన్న రూలేం లేదని తెలుస్తోంది. ఇవన్నీ పక్కనపెడితే ఏది తెలిసినా తెలియకపోయినా ఒక్కటి మాత్రం బాగా తెలుస్తోంది. అక్కడెక్కడో అమెరికా నుండి ఆసియాఖండంలోని మా ఊరి దాకా మీ పొడవాటి చెయ్యిని చాపి ఆ చేయిని నా భుజం మీద వేసి “సోదరా! ఇలాంటి జాగ్రత్తలు తీసుకోరా అయ్య! చాలా బాగుంటుంది” అని ప్రేమతో చెబుతోన్న దృశ్యం మాత్రం కళ్లకు స్పష్టంగా తెలుస్తూ నీళ్లను తెప్పిస్తోంది. కృతజ్ఞతలు.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.