Sriramana1 - Copy (2)

‘గింజకి జీవశక్తి ఉంటే అది ఎక్కడ పడేసినా పోదు’ ~ శ్రీరమణతో ముఖాముఖి

Download PDF   ePub   MOBI

శ్రీరమణ గారి మాటలు వినడం అనేది ఆయన రచనలు చదవటం కన్నా భిన్నమైన అనుభూతిని కలిగిస్తుంది. ఆయన రాసిన కాలమ్ నో కథనో చదువుతున్నప్పుడు మన పఠనం నిపుణుడైన సారథి ఆధ్వర్యంలో గతుకుల్లేని రోడ్డుపై నింపాదిగా సాగిపోతున్నట్టు ఉంటుంది. శ్రీరమణ గారి మాటలు వింటున్నపుడు మాత్రం, జడి వానలో దట్టమైన అడవి నట్టనడిన దారి తప్పిపోయినట్టు ఉంటుంది. కానీ మీకు ‘ఫలానా చోటకి వెళ్లాలీ’ అన్న పట్టింపు ఏమీ లేకపోతే, ఈ అడవిలో దారి తప్పిపోవడం అనేది, రోడ్డుపై  తిన్నగా సాగిపోవటం కన్నా కూడా, చాలా బాగుంటుంది. మాట్లాడుతూ ఆయన చేసే శాఖా చంక్రమణాలు ఒక్కోసారి అసలు విషయం కన్నా రుచిగా ఉంటాయి. ఇంటర్వ్యూ చేస్తున్నపుడు ఒకటే అనిపించింది, ప్రశ్నలు తయారు చేసుకుని ఆయన్ని అడగడం కాదు, ఆయన మాట్లాడిన తర్వాత తదనుగుణంగా ప్రశ్నలు తయారు చేసుకుంటే బాగుండేదీ అని. కానీ మాట్లాడటానికి అసలంటూ ఏదో ఒక మిష కావాలి కాబట్టి, ఈ ప్రశ్నలు అందుకు మాత్రం ఉపయోగపడ్డాయి. ~ మెహెర్

కథలు రాయాలన్న ప్రేరణ ఎలా కలిగింది?

నాది ఒక కాలమిస్టుగా ట్రైన్ అయిన మైండ్. చాన్నాళ్ల దాకా కథలు రాయాలన్న కోరిక లేదు. ఒక్కోసారి పెద్ద కథలుగా రాయాల్సిన థీమ్స్‌ కూడా కుదించి కాలమ్స్ లో వాడేసేవాణ్ణి.  అలా ఖర్చయిపోయేవి. కథలు రాయాలనిపించటానికి నా పల్లెటూరి నేపథ్యం ప్రధాన కారణం. నాకు అక్కడి మనుషులన్నా, వాళ్ల మధ్య అనుబంధాలన్నా చాలా ఇష్టం. నేను ఎప్పుడూ చెప్తూంటాను, ఒక మహానగరాన్ని అర్థం చేసుకోవాలంటే పది – పదిహేను రోజులు చాలు, కానీ ఒక పల్లెటూర్ని అర్థం చేసుకోవాలంటే ఓ పాతికేళ్ళు అక్కడ గడిపితే తప్ప సాధ్యం కాదు. ఆ వాతావరణాన్నీ, ఆ మనుషుల్నీ, వాళ్లు ఏ సందర్భానికి ఎలా స్పందిస్తారనేదన్నీ, పట్టుకోవటం కష్టం. ఎంత చిన్న పల్లెటూరైతే అంత కష్టం. కానీ ఒక నగరంలో ఫైవ్‌స్టార్ హోటలూ, ఎయిర్‌పోర్టూ ఇలాంటి వ్యవస్థల్ని తీసుకున్నామనుకోండీ… ఫైవ్‌స్టార్ హోటల్లో ఒక్కసారి దిగితే చాలు, వాళ్ళ ఫాల్స్ మర్యాదలూ, ‘హౌ ఈజ్ యువర్ డే సర్’ అని అడగటం, మనం ఇంతని టిప్ ఇవ్వడం… ఇవన్నీ అలవాటైపోతాయి. అలాగే ఎయిర్‌పోర్టుకు ఓ నాలుగైదుసార్లు వెళితే చాలు, బోర్డింగ్ పాస్ ఎక్కడ తీసుకోవాలీ, లోపలికెళితే ఎయిర్ ‌హోస్టెస్‌లు మనని ఎలా రిసీవ్ చేసుకుంటారూ… ఇలాంటి మెకానిజాలు సులువుగానే అర్థమైపోతాయి. కానీ పల్లెటూరిలో ప్రతి రోజూ ఒక అనుభవమే. అక్కడ ఓ బిడ్డపుట్టినా సందడే, ఓ గేదె ఈనినా సందడే. పెళ్ళంటే సందడి, చావంటే సందడి.

అందుకే నేను కాళీపట్నం రామారావుగారి ‘చావు’ అనే కథని ఒప్పుకోలేను. ఊళ్ళో చనిపోతే కట్టెలు కరువయ్యాయి అని రాశాడాయన. నాకు ఇప్పుడు అరవయ్యేళ్ళు, నిన్నగాక మొన్న కూడా మా ఊరు వెళ్ళి వచ్చాను. పల్లెటూళ్లో అలాంటి పరిస్థితి ఎప్పుడూ రాదు. అక్కడ బతికున్నంత వరకూ మనిషి తన కుటుంబంలో ఒక సభ్యుడు, అతను కట్టెలా మారిన తర్వాత అది మొత్తం ఊరికి సంబంధించిన సమస్య. శవదహనం అయ్యేదాకా ఊళ్ళో పొయ్యి వెలగటానికి లేదు. ఊరి పెద్దో మరొకరో వచ్చి ‘ఏంటి బాబూ పరిస్థితి, డబ్బులున్నాయా’ అని అడుగుతారు. అప్పుడిక స్నేహితులూ శత్రువులూ అని ఉండరు. రావణుణ్ణి చంపాకా రాముడు విభీషణునితో, ‘వెళ్లు మీ అన్నయ్య కర్మకాండ సక్రమంగా జరిగేట్టు చూడు’ అంటాడు. ‘నువ్వేనా ఇలా అంటోంది’ అని అడిగితే, ‘ప్రాణమున్నంత వరకూ పేచీ గానీ, శవంతో నాకు తగాదా ఏమిటీ’ అంటాడు. పల్లెటూరివాళ్ళ మనసుల్లో ఇవన్నీ ఉండకపోవచ్చు గానీ, వాళ్లలో ఒక ఆచారంగా ఇంకిపోయాయి. ఎవరికన్నా ఏదన్నా కష్టం వస్తే వెళ్తారు. ముఖ్యంగా చావు విషయంలో పదిమందీ వచ్చి నిలబడతారు. ‘పోయినవాడు పోగా నాకు వీళ్లంతా ఉన్నారూ’ అనే భావన ఆ వెనక మిగిలిపోయిన వాళ్లలో కలుగుతుంది.

అలాగే ‘ఫలానా వాళ్ల ఇల్లెక్కడా’ అని నగరవాసిని అడిగితే ఒక్క నిముషం కూడా ఆలోచించడు, తెలిస్తే తెలుసంటాడు, లేపోతే తెలీదంటాడు. పల్లెటూళ్లలో అలాక్కాదు. మనల్ని వెంటేసుకెళ్తాడు, తెలీకపోతే, నాకు తెలీదుగానీ ఫలానా వాడికి తెలుసని అక్కడికి తీసుకెళ్తాడు. దారి పొడుగునా (మన సిటీ నుంచి వెళ్లిన వాళ్లకు కాస్త చికాగ్గా అనిపించినా) బోలెడు కూపీ లాగుతాడు, ‘అబ్బాయిగారు మీరెక్కణ్ణించి వస్తున్నారు, ఎందుకొస్తున్నారు, ఫలానావాడితో మీకెలా పరిచయం’ ఇవన్నీ అడుగుతాడు. అలాగని ఇందులో పెద్ద కుతూహలమూ ఉండదూ, ఇదేమీ spying కాదు. వాళ్ళలో మనిషి తత్త్వమే అంత. ఆ చిరునామా దొరికే దాకా మన కోసం నానా అవస్థా పడతాడు. They are made like that. సందులూ గొందులతో తికమకగా ఉండే పల్లెటూరి వీధుల్లాగే, అక్కడి మనుషుల మనసులు కూడా సంక్లిష్టమైన వైరుధ్యాలతో ఉంటాయి. వారు ఎప్పుడు ఎలా స్పందిస్తారో తెలియదు. ఆసక్తికరంగా ఉంటారు. సున్నితంగా కూడా ఉంటారు. ఇది నేను చూసిన ప్రపంచం, నాకు తెలిసిన జీవితం. ఈ వాతావరణాన్ని కథల్లో పట్టుకోవాలన్న తపనే నా చేత కథలు రాయించింది.

మీరు కాలమ్ రాయడం మొదలుపెడితే, మొదటి వాక్యం నుంచి చివరి వాక్యం దాకా కొట్టివేతలు లేకుండా రాసుకుంటూ పోతారు. మరి మీ కథా రచన ఇంత సాఫీగా సాగుతుందా?

కాలమ్ విషయం వేరు, ఆ మూణ్ణాలుగు రోజుల్లో జరుగుతున్న ఏ టాపిక్ తీసుకుంటే రక్తి కట్టించగలమో మనకు ముందే తెలుస్తుంది. ఏ రోజుకారోజు పొద్దున్నే పేపర్ చదువుకుని ఆఫీసుకి వచ్చేటప్పటికి ఆద్యంతాలతో సహా ఏం రాయాలో అంతా మనసులో సిద్ధంగా ఉంటుంది. ఏళ్ల తరబడి సాధన వల్ల కొంత వస్తుంది. ఆ రెండు మూడు పేజీల పరిమితి దగ్గర పడుతుండగానే మనసులో ఒక closure వచ్చేస్తుంది.

కానీ కథకు అలాంటి పరిమితులేవీ ఉండవు కదా. ఎన్ని పేజీలైనా ఉండొచ్చు. ‘మిథునం’ కథ ఐతే చాలా ఎక్కువ పేజీలు రాశాను. ఒక పది పేజీల దాకా అనవసరం అనిపించి తీసేశాను. కథ పూర్తి చేయటానికి నాకు దాదాపు ఏడాది పట్టింది.

‘మిథునం’ కథలో జంటకు నిజ జీవితంలో ప్రేరణ ఎవరన్నా ఉన్నారా?

మా బ్రాహ్మణ అగ్రహారంలో మావయ్య అత్తయ్య వరసైన వాళ్లు కొంతమంది ఉన్నారు. పుట్టిన చోటే మట్టిలో కలిసి పోవాలన్నది వాళ్ళ తత్త్వం. వాళ్లలో తొమ్మిదేసి మంది పిల్లలున్నవాళ్లు కూడా ఉన్నారు. ఆ పిల్లలు ఒక్కొక్కళ్లు జీతంలోంచి యాభై తీసి ఇంటికి పంపించినా ఇక్కడ వీళ్ల జీవితం సుఖంగా గడిచిపోయేది. వీళ్లు కూడా ఖర్చులు పెద్ద పెట్టుకోకుండా కావాల్సినవన్నీ ఇంటిలోనే పండించుకునేవారు. పిల్లలు పంపించిన దాంట్లో కొంత పక్కకు తీసి దాచేవారు. మళ్ళీ ఆ పిల్లలు పండగలకు వచ్చినపుడు తిరిగి వాళ్ళకే ఖర్చుపెట్టేవారు. ఆ పిల్లల ఉద్యోగాలు కూడా ఇప్పటి ఉద్యోగాల్లా కాదు.  ఏ రైల్వేలోనో, ఏ సెక్రటేరియట్లోనో, లేదా ఏ టీచరుగానో పని చేస్తూ, ఏడాదికి ఒక నెల రోజులు సెలవు పెట్టుకుని ఇంటికి రాగలిగే వీలు కలిగి ఉండేవాళ్లు.

 ఆ దంపతుల జీవితాలు అలా ఊళ్లోనే సాఫీగా సాగిపోయేవి. చక్కగా వేళకి తినేవారు, ఇన్‌సెక్యూరిటీ లేదు, అంతో ఇంతో పొలం ఉండేది, పలకరించే మనుషులుండేవాళ్ళు, ‘నాయనా నాకీ పని కావాల్రా’ అంటే చేసిపెట్టే మాలాంటి పిల్లలుండేవాళ్లు. ఎలక్ట్రిసిటీ కూడా ఎరుగరు, ఏదో సూర్యుడు ఉండగానే కబుర్లు చెప్పుకుంటూ అన్నాలు తినేసేవాళ్లు. కాలక్షేపానికి పుస్తకాలుండేవి, అవి కూడా పెద్ద పెద్ద లైబ్రరీలేం కాదు, భారతమో రామాయణమో ఉంటే చాలు, అవి అయిపోగానే మళ్లీ వాటినే మొదట్నుంచీ చదువుకుంటూ ఉండేవాళ్లు… ఇది గొప్ప జీవితం అంటారా అంటే… మరి గొప్ప జీవితమే కదా! డెబ్భయి ఎనభై ఏళ్లు హాయిగా బీపీ షుగర్లు లేకుండా గడిపి వెళిపోయారు. కోల్పోయింది ఏముంది? ప్రేమ పొందారు, ఇచ్చారు. నాకు ఇలాంటి జీవితాల్లోనే చాలా లగ్జరీ ఉందనిపిస్తుంది. ‘నాకింతకన్నా ఏం కావాలి’ అనుకున్నవాడికన్నా కోటీశ్వరుడు లేడు.

ఈ అంతరించిపోయిన వ్యవస్థని చూపించగలగడం వల్లనే ‘మిథునం’ అంత ఆదరణ పొందగలిగింది. ‘సామాజిక స్పృహ’ లేదన్నారు కొందరు. నిజమే, పెట్టాలని నేను అనుకోలేదు కూడా.

రాయటానికి కష్టపడిన కథ?

5th-photo-220x300కష్టపడితే మంచి కథ వచ్చేస్తుందన్న హామీ ఏం లేదు. కానీ నా కథల్లో నాకు దగ్గరిగా తెలియకుండా రాసినవి గానీ, ముందస్తు ఆలోచన లేకుండా రాసినవి గానీ ఏం లేవు. మాలతీ చందూర్ గారు ‘బంగారు మురుగు’ కథ చదివి, ‘ఏవయ్యా ఎంత కాలం పట్టింది’ అని అడిగారు. ఏడాది పట్టిందన్నాను. ‘అనుకున్నానయ్యా, మేం కథలు రాసేవాళ్లం కథలు చదివేటప్పుడు ఎక్కడన్నా ఒక వాక్యం తీసేయగలమా అన్న దృష్టితో చదువుతాం, అలా తీసేయగలిగింది ఏం దొరకలేదు నాకు’ అన్నారు.

ఆ కథ రాసినపుడు నేను కార్డు ముక్కల మీద రాసుకున్నాను. మూడేసి వాక్యాలు పట్టే తెల్లకాగితం ముక్కలవి. కొట్టివేసి రాసుకోవడానికి  కింద ఇంకాస్త ఖాళీ ఉండేది. ఒకే విషయాన్ని చెప్పే మూడేసి వాక్యాల్ని ఇలా వేర్వేరు కార్డుల మీద రాసుకుని వాటిని రీఅసెంబుల్ చేసుకుంటూ పోయేవాణ్ణి. ఒకటి, రెండు, మూడు అంటూ వాటికి నెంబర్లు కేటాయించడం, ఆ వరస కుదరట్లేదనిపించినప్పుడు మూడోది తీసుకెళ్లి అక్కడ పైన వేస్తే ఎలా ఉంటుందో చూడటం, అనవసరమైన ముక్కలు పక్కకి తీసేయడం… ఇలా చేసేవాణ్ణి. దీని వల్ల క్లీన్‌గా చదువుకోవడానికి వీలుండేది.

అలాగే నేను కథలకి ఫ్లాటు వెతుక్కోవడమూ, ఇది ఇట్లా ఉంటే బాగుంటుందా, అట్లా ఉంటే బాగుంటుందా ఆలోచించడమూ… ఇవేమీ ఉండవు. ఇది ఇట్లా ఉందంటే ఇట్లా ఉంది, అంతే. ‘బంగారు మురుగు’ కథ తీసుకుంటే, అది ఫస్ట్‌పెర్సన్… నా కథ… నా జీవితంలో భాగం. అట్లాంటపుడు అది అట్లా జరిగిందంటే జరిగింది అంతే.

 ‘మిథునం’ కథ ముగింపుని ‘అదేంటండీ.. అట్లా రాశారు’ అన్నవాళ్లున్నారు. నా వరకూ నేను అలాగే ఉంటుందనుకున్నాను. ఆవిడ అంటుంది కదా చివర్లో, ‘నేను ముందు పోయుంటే ఇవన్నీ ఆయనకు ఎవరు చేసిపెడతారూ’ అని. నిజానికి ప్రేమ ఉంటే అంతే. ఆడవాళ్లు అలాగే అనుకుంటారు. ఎందుకంటే మగాడు తనది కాని ఇంట్లో – అది కొడుకు ఇల్లయినా, కూతురు ఇల్లయినా – గడప దాటి వంటింట్లోకి అంత చొరవగా వెళ్లలేడు. ఆడది వెళ్తుంది, పెద్దరికంగా వంటిల్లు చక్కబెడుతుంది. మగాడు అరుగు మీద కూచోవాల్సిందే. పెడితే తినాలి, లేపోతే లేదు, ‘అమ్మాయీ నాకు అన్నం పెట్టలేదేం’ అని నోరు తెరిచి అడగలేడు. ఇది తెలిసిన వాళ్లెవరైనా ఒప్పుకుంటారు. అయితే, బయటపడరు. నేను బయటపడి రాశానంతే.

మీ రచనల్లో మీరే గుర్తించక, ఎవరైనా చెప్పినపుడు ‘అవున్నిజమే కదా’ అనిపించిన విషయాలేవైనా ఉన్నాయా?

కథల వెనక నేను పడిన శ్రమ కథలో కనపడకపోయినా, గుర్తించిన పాఠకులున్నారు. నేను మొన్న అమెరికా వెళ్లినపుడు ఒకాయన ‘మిథునం’ కథ గురించి మాట్లాడుతూ, అందులో మళ్లీ ఇరవై నాలుగు కథలున్నాయన్నారు. కావాలంటే చెప్తానని మొదటి వాక్యాలు కొన్ని చదివి, ‘ఇదిగో ఇక్కడికో కథ అయిపోయింది, మళ్లీ ఇంకో కథ మొదలైంది, ఇలా ఆవృతాలు ఆవృతాలుగా ఇన్ని కథలుండటం మూలాన్నే దీన్ని మళ్లీ మళ్లీ చదువుతున్నాం’ అన్నారు.

మిథునం ఫీటు రిపీటు చేయగలమో లేదో అన్న ఒత్తిడి మీరు ఇప్పుడు రాస్తున్న, రాయబోయే రచనల మీద ఉంటోందా?

కొంత ఉంటుంది. ‘మనకూ కొంతమంది పాఠకులున్నారూ, రాసింది బాగోలేకపొతే, ఈయన ఇది రాయకపోతే ఏమైందీ అనుకుంటారు కదా’ అని లోపల ఉంటుంది. కానీ కనీసం నావరకూ సంతృప్తి లేకుండా నేను ఏ కథా మొదలుపెట్టను. అలా ఒకసారి కథ మన మనసులోకి వచ్చాకా, దానికి రూపం ఏర్పడ్డాకా, ఇక రాయకుండా ఉండలేని స్థితి ఒకటి వస్తుంది, ఒక బరువులాగా ఉంటుంది లోపల, అప్పుడిక దాన్ని వదిలించుకోవాలీ అనుకుంటాం. అప్పుడిక అది ఎలా ఉంటే అలా ఉంటుంది.

మిథునం కథకు తనికెళ్ల భరణి సినీ అనువాదంపై మీ అభిప్రాయం ఏమిటి?

నాకు నచ్చింది. ఉన్నది ఉన్నట్టు తీస్తే ఆ కథ గంట కన్నా ఎక్కువ రాదు. కాబట్టి పెంచక తప్పలేదు. నా కథకి ఒక texture ఉంటుంది, నిడివి పెంచినా అది పోకుండా పెంచాలి. ఆయన నన్ను అడిగారు, కూడా ఉండి చేయమని. కానీ నేను చెప్పాను: ‘అదంతా కాపీనమండీ, మన కథ మనకేదో బంగారమనిపిస్తుంది, దానికి కాస్త పేరొచ్చాకా మరీను, కాబట్టి నేనొస్తే కథ చెడిపోతుంది. మీకొక అభిప్రాయం ఉంటుంది, దాన్ని కాదని మీరూ వెళ్లలేరు, మీరూ రచయితే కాబట్టి, మీరు తీయదల్చుకున్నట్టు తీయండీ’ అని వదిలేశాను. కథని పెంచటం అన్నది కొంత కమర్షియల్ వయబిలిటీ కోసం చేశారు. అందుకే ఎన్నో కోట్లు పెట్టి తీసిన సినిమాలు ఇలా వచ్చి అలా వెళిపోతున్న సమయంలో, కోటి రూపాయలతో తీసిన సినిమా ఓ పాతిక ముప్ఫై కేంద్రాల్లో జెన్యూన్‌గా యాభై రోజులు ఆడింది, దాని డబ్బులు దానికొచ్చాయి, బాగుందన్నారంతా. అది చాలు నాకు.

మీ పాత్రల్లో మీకు బాగా ఇష్టమైన పాత్ర?

ధనలక్ష్మి’ కథలో ధనలక్ష్మి పాత్రంటే ఇష్టం. ఆమె కల్పితం కాదు, నేను చూశాను ఆ అమ్మాయిని. చాలా చిన్న వయసులోనే పెళ్లవటం, ఆస్తంతా పోగొట్టుకుని పదహారేళ్ల భర్తతో రోడ్డున పడటం. . . ఇది చాలా పెద్ద విపత్తు, ఇంకొకళ్లయితే బెదిరిపోయే పరిస్థితి. కానీ ఆమె చిన్న వ్యాపారం పెట్టుకుని, భర్తకి ధైర్యమిచ్చి, కాపురం ఏమవకుండా ‘నాదేం లేదు అంతా ఆయనే’ అంటూ అతని అహాన్ని తృప్తి పరుస్తూ… చదువూ సంధ్యా లేకపోయినా వ్యాపారాభివృద్ధికి మార్కెటింగ్ టెక్నిక్స్ అన్నీ వాడుతూ… అలా నెట్టుకొచ్చింది. అలాంటివాళ్లంటే నాకు చాలా ఇష్టం, గౌరవం, అడ్మిరేషన్.

మీరు రాసిన ఏకైక నవల ‘ప్రేమపల్లకీ’ గురించి చెప్పండి?

ఆంధ్రజ్యోతిలో పని చేస్తున్నపుడు పురాణంగారు ఆ నవల రాయమని ప్రోత్సహించారు. ‘మీరు రాయండి, ఒక్కసారే అంతా ఇవ్వనక్కర్లేదు కదా, ఇక్కడే ఉంటారు కాబట్టి వారం వారం రాస్తూపొండి’ అన్నారు. సరే అని మొదలుపెట్టాను. కానీ ముందుగా ఒక విస్తృతమైన ప్రణాళిక లేకుండా మొదలుపెట్టడం వలన, అదేదో కాలమ్ లాగా వారం వారం రాయటంగా అయిపోయింది. శైలి వలన ఏదో రీడబిలిటీ వస్తే వచ్చి ఉంటుంది గానీ, అదేం గొప్ప నవల అంటానికి లేదు. నాకు పెద్దగా సంతృప్తినివ్వలేదు.

మళ్లీ ఎందుకు రాయలేదు నవల?

రాయాలనే ఉంది గానీ, దానికి ఎక్కువ సమయం కావాలి. అలాగే ఇతివృత్తం ఏది తీసుకోవాలీ అన్న మీమాంస కూడా కొంత ఉంది. కానీ నిజానికి నా కథలు కూడా నవలల్లాగే విస్తారమైన కాలపు కాన్వాస్ మీద సాగుతాయి. మిథునం, బంగారుమురుగు, ధనలక్ష్మి, షోడానాయుడు ఇవన్నీ ఎన్నో ఏళ్ల కథని క్లుప్తంగా ఇముడ్చుకున్నవే. కానీ ఎప్పటికైనా నవల రాయాలనే ఉంది, రాస్తాను.

మీకు బాగా నచ్చిన రచయితలు?

పాత తరంలో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రచనలంటే చాలా ఇష్టం. ‘వడ్ల గింజలు’ గానీ, ‘గులాబీ అత్తరు’ గానీ… ఇప్పటికీ ఆయన పుస్తకం ఎప్పుడు కంటపడినా తెరిచి చదవాలనిపిస్తుంది. గొప్ప వచనం ఆయనది. ‘అమ్మలక్కల దగ్గర నేర్చుకున్నాను నా భాషను’ అంటాడు. మొదట్లో రాసిన కథలు వదిలేస్తే, తర్వాత వచ్చిన వాటిలో ఈ వాడుక భాష పునాదిగా ఒక అద్భుతమైన శైలిని పట్టుకున్నాడాయన.

నా ముందు తరంలోకి వస్తే… ముళ్లపూడి వెంకట రమణ గారు. అప్పటి దాకా కథలు చాలామంది పల్లెల నేపథ్యంలోనే రాసేవాళ్లు. కథల్ని అర్బనైజ్ చేసి, ఆకలీ, నిరుద్యోగం వంటి ఇతివృత్తాల మీద రాశాడాయన. ఆయన వాక్య నిర్మాణం, కష్టాల్ని కూడా నవ్వుతూ చెప్పగలగటం… నాకు నచ్చుతాయి.

తర్వాత రావిశాస్త్రిగారు. ఆయన మనుషుల్ని బాగా పట్టుకోగలడు. కానీ రాన్రానూ శిల్పం ఆయన్ని డామినేట్ చేసిందనిపిస్తుంది. ఆయన ఏం చెప్పదల్చుకున్నాడన్న దానికంటే, ఆయన భలే తమాషాగా చెప్పాడే అన్న దాని మీదకే దృష్టి వెళ్లిపోతుంది. ప్రతీ వాక్యంలోనూ అలంకారాలు, చమత్కారాలూ గుప్పించేసరికి చిన్న కథ కూడా చాలా విస్తృతమైపోయి, చివరికి చదవటం అనేది ఒక శ్రమగా మారిపోతుంది. ఈ ఒక్క విషయంలో తప్ప, ఆయనంటే నాకు చాలా అభిమానం.

వీళ్లతో పాటు, తెలుగు వచనం గురించి చెప్పేటపుడు మీరు తరచూ దువ్వూరి వేంకటరమణ శాస్త్రి, ఎస్వీ భుజంగరాయశర్మ, దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గార్ల పేర్లు కూడా ప్రస్తావిస్తూ ఉంటారు. వీరిలో మీకు నచ్చిందేమిటి…

ఉదాహరణకి, మీరు భుజంగరాయశర్మ గారి వచనం చదివితే… అది ఒక పచ్చకర్పూర పరిమళం… అంతే! ఇంకోటేమిటంటే, ఆయన తిన్నగా మనతోనే మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ‘మాళవిక పాదాలు నాకిష్టం…’ అని మొదలుపెడతాడు. ఇక అక్కడితో ఆపలేం.

పైగా వీళ్లందరూ రేడియోకి ఎక్కువగా రాసినవాళ్లు. (కృష్ణశాస్త్రిగారైతే అన్నీ రేడియోకే రాశారు.) దాంతో ఆ మాట్లాడుతున్నట్టుండే శైలి వీళ్లకి ఉంటుంది. వీళ్లెవరూ అనవసరంగా పెద్ద మాటలు వేయరు. అవసరమైన చోటే వాడతారు. ‘భాష మీద అధికారం’ అంటే శబ్దాలు తెలియటం కాదు, శబ్దాలు ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడకూడదూ అనేది తెలియటం.

దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. సినిమాల్లో పని చేసే రోజుల్లో మా సినిమాలు చాలా వాటికి కె.వి. మహదేవన్ గారు సంగీత దర్శకుడు. మాతో చనువుగా ఉండేవారు. పాటల రికార్డింగ్ జరిగేటపుడు ఆయన ట్రూపులో ఒకతను కొబ్బరి చిప్పల ఆకారంలో మెటల్ తో చేసి ఉండే వాయిద్యాల్ని రెండు చేతుల్లోనూ పట్టుకుని అప్పుడప్పుడూ ఆడిస్తుండేవాడు. ఆ రోజుల్లో కాల్షీటుకు నూట యాభై రూపాయలు. అతను పాటకి రెండు సార్లు వాటిని ఇలా ఆడించి నూటయాభై జేబులో వేసుకుని వెళ్లిపోయేవాడు. ఆ రోజుల్లో నూటయాభై అంటే మాటలు కాదు. నేను ఇది చూసీ చూసీ… కెవి మహదేవన్‌తో సరదాగా, ‘మామా, నేనూ రెండు కొబ్బరి కాయలు కొనుక్కుంటాను. నాకూ ఇవ్వచ్చు కదా. ఆ మాత్రం నేనూ ఆడించగలను’ అన్నాను. ఆయన నవ్వి, ‘ఒరేయ్, ఆయన పాల్ఘాటు అయ్యరు. ఆయనకి ఎప్పుడు వాయించాలో మాత్రమే కాదు, ఎప్పుడు వాయించకూడదో కూడా తెలుసు, ఆ మిగతా అప్పుడు సైలెంటుగా ఉండటం తెలిసినందుకు ఇస్తున్నాం ఆయనకి డబ్బులు, నీకు తెలుసునా, తెలీదు కదా’ అన్నారు. అలాగా… శబ్దం మీద సాధికారత ఉండటం అంటే పెద్ద పెద్ద మాటలు కంకర్రాళ్లలాగా విసరటం కాదు. అలాంటి వాళ్ల వచనం చదవలేం మనం. మాట డెన్సిటీ తెలిసుండాలి, తూచి వేయాలి. ఇవన్నీ తెలిసిన వాళ్ళు దువ్వూరి, చెళ్ళపిళ్ళ వీళ్లంతా. పైగా ఆ శైలి. మనల్ని వాళ్లతో కలిపేసుకుని చెప్తుంటారు. ఇదంతా వాళ్ళు ప్రయత్నం మీద చేసేది కాదు. ఒక వాక్యం రాసి ఆగి, చదువుకుని, ఇది మన శైలిలో లేదని దిద్దుకుంటూ పోతే వచ్చేది కాదు. వాళ్లకు స్వభావరీత్యా వచ్చేస్తుందనిపిస్తుంది.

ముళ్లపూడి ప్రభావం మీపై ఏ విషయంలోనైనా ఉందా?

లేదు. అసలు ఆయన జీవితం, బయల్దేరిన స్థానం, చేరుకున్న గమ్యం ఇవన్నీ పూర్తిగా వేరు. ఆయన చూసిన కష్టమూ సుఖమూ రెండూ నేను చూడలేదు. లేమి అనేది ఎరగను, అట్లా అని పెద్ద రిచెస్ కూడా ఏం లేవు.  మా నాన్న టీచరు, పల్లెటూళ్లో కాస్త పొలం అదీ ఉండేది. చిన్న కుటుంబం, చదువులోనైనా ఎందులోనైనా నేను కోరుకున్నది చేసే స్వేచ్ఛ ఉండేది. అట్లాంటి జీవితం నుంచి వచ్చినవాణ్ణి. ఒక పూట అన్నం లేపోతే ఏమవుతుందో నాకు తెలియదు. అందుకే నేను వాటి గురించి రాయను కూడా రాయను. లేని విషయాలు గ్లోరిఫై చేసుకుని చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు.

నండూరి రామ్మోహనరావు గారు నేను పేరడీలవీ రాస్తున్న కొత్తల్లో, ‘జాగ్రత్తండీ, మీదంటూ ఒక శైలి ఉంది దాన్ని కోల్పోవద్దు. ఒక రచయితను ఇమిటేట్ చేయటం వాళ్లకు గౌరవం కానీ మీకు కాదు’ అని పదే పదే చెప్పేవారు. నా శైలి ఏమిటంటే (నా బలహీనత అని కూడా అనుకోవచ్చు), ఏదన్నా కొంచెం చెప్పేటప్పటికి ఫిలసాఫికల్ ధోరణి వచ్చేస్తుంది. నాలుగైదు వాక్యాలకి ఒక వేదాంతం వాక్యం వచ్చేస్తుంది. నాకు దాని మీదున్న వ్యామోహం కారణం కావచ్చు. అది నిహిలిజం కాదు, ఒక తాత్త్విక ధోరణి, అంతే.

శైలి విషయంలో కూడా ముళ్లపూడీ నేనూ భిన్నమే. నాకు చిన్న వాక్యాలు రాయటం అలవాటు. అలాగే ఉపమానాల మీద ఆయనకున్నంత మోజు నాకు లేదు. ఆయన ఒక సందర్భానికి ఐదారు ఉపమానాలు వేస్తే గానీ ఊరుకోరు. అలాంటివి చదువుకుని ఆనందిస్తాను గానీ, నేను వాడను.

ఎవరితోనూ పంచుకోని ముళ్లపూడి జ్ఞాపకం ఏదైనా చెప్పండి.

రమణ గారికీ మాకూ ప్రయాణాలంటే ఇష్టం. ఆయన ఏం తోచకపోతే రాజమండ్రి వెళ్దాం, గోదావరి చూద్దాం అనేవారు. పనిలేకపోయినా సరే. ఇక పని ఉంటే సరే సరి. ఎక్కడికి వెళ్లినా విమానాల కంటే రైలు ఫ్రిఫర్ చేసేవాళ్లం. విమానమైతే రెండు గంటల్లో దిగిపోతాం. రైలైతే మాట్లాడుకుంటూ వెళ్లొచ్చు కదా అని. మా అలవాటేంటంటే – నేనూ, రమణ గారూ, బాపు గారూ వెళ్తుంటే ఇంకో అరటిక్కెట్టు కొని నాలుగు బెర్తుల ఫస్ట్‌క్లాస్ కూపే బుక్ చేసుకునేవాళ్లం, కబుర్లు చెప్పుకుంటూ వెళ్లేవాళ్లం. అలాగే ఒకసారి నేనూ రమణగారూ వెళ్తున్నాం. మద్రాసులో హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ ఎక్కితే రాత్రి తొమ్మిదిన్నరకి ఒంగోలు స్టేషన్ వచ్చేది. ఆ రోజు ఒంగోలు వచ్చేసరికి మా భోజనాలు అయిపోయాయి. మామూలుగా రమణగారు ఎక్కడికి వెళ్లినా, మేం ఉన్నది ఇద్దరు ముగ్గురే అయినా, భోజనం మాత్రం ఇంకో ఒకరిద్దరికి సరిపడా తీసుకొచ్చేవారు. అన్నం లేని వాళ్లెవరన్నా వస్తే వాళ్ళకి పెట్టాలని.

ఆయన ఫిలాసఫీ ఏంటంటే, అన్నం ఎప్పుడూ వృథా కాదు, ‘మనం తింటాం, ఎవరికన్నా పెడతాం, పారేస్తే పక్షులు తింటాయి, చీమలు తింటాయి…’ ఇట్లా ఉండేది. ఇంకోటేంటంటే…  ఆయన చిన్నప్పుడు అనుభవించిన లేమి వల్ల కాబోలు, ఆయనకెప్పుడూ అన్నం చాలా కనపడాలి, సాంబారు చాలా కనపడాలి, అన్నీ చాలా చాలా చూడాలి. ఆఫీసుకి కేరేజి తెప్పించినప్పుడు కూడా,  తినేవాళ్లు నలుగురుంటే అరడజను మందికి తెప్పించేవారు. సినిమా షూటింగుల్లో ఆయన మిగతావేవీ పట్టించుకునేవారు కాదు. ‘భోజనం తెచ్చారా, టిఫిన్లు బాగా పెట్టారా, వాళ్లకు నాన్ వెజిటేరియన్ పెట్టాల్సిందే’ ఇట్లా. కొంతమంది అనేవాళ్లు, ‘వాళ్లు ఇంటి దగ్గర నాన్ వెజ్ తినటం లేదు కదాండి, మరి ఇక్కడెందుకూ’  అని. ‘వాళ్లు ఇంటి దగ్గర తినకపోవచ్చు, కానీ అక్కడ ప్రేమాభినాలతో వడ్డించి పెట్టే భార్యో చెల్లెలో అక్కో ఉంటారు, ఇక్కడ ఉండరు కదా’ అనేవారాయన. కొందరు తాము పడ్డ కష్టం అందరి మీదా రుద్దాలనుకుంటారు. కొందరు మనం పడ్డ కష్టం ఇంకోళ్లు పడకూడదూ అనుకుంటారు. రమణ గారు రెండో జాతి. ఎవరన్నా భోజన సమయంలో వేషం కోసం వస్తే, ‘బాబూ ముందు కాళ్లూ చేతులూ కడుక్కుని మాతో పాటూ అన్నం తిను. నీకు వేషం ప్రస్తుతం ఇవ్వలేను. అన్నం కావాలంటే పెడతాను. తిని వెళ్లు. వెళ్ళేటపుడు ఇదిగో బస్సులో వెళ్లు’ అంటూ పదిరూపాయలు చేతిలో పెట్టి పంపేవారు.

సరే – ఒంగోలు చేరే సరికి రాత్రి పదయింది. ఫ్లాట్‌ఫాంపై ఒక బిచ్చగత్తె – చంకలో చిన్న పిల్లాడున్నాడు, ఆమె చేయి పట్టుకుని ఓ మూణ్ణాల్గేళ్ల పిల్లాడున్నాడు – ‘అయ్యా అమ్మా’ అని తిరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఏసీ వచ్చాకా కిటికీలు అద్దాలతో మూసేస్తున్నారు గానీ, అప్పట్లో ఫస్ట్ క్లాసే కదా. అడ్డంగా చువ్వలుండేవి. ఆ అమ్మాయి అరుస్తోంది. ఈయనేమో లోపల కూర్చున్నారు. మిగిలిన భోజనం ఆమెకి ఇవ్వాలని. అటు తిరిగి వెళ్లి ఇవ్వాలంటే మూడు నాలుగు కూపేలు దాటాలి, అయినా అక్కడ డోర్స్ లాక్ చేసి ఉంటాయి. ఇక ఎలా ఇవ్వాలో తెలియక, ఆయన స్టీలు కేరేజీ గిన్నెలు విడదీసి ‘తీస్కో తీస్కో’ అంటూ ఆ అమ్మాయికి ఇచ్చేశారు. విడిగా ఏవో స్వీటూ హాటూ పేకెట్లు ఉంటే అవి కూడా ఇచ్చేసి, చివరికి కేరేజ్ సెట్ చేసే కడ్డీ తో సహా ఇచ్చేశారు. ఆ అమ్మాయి దణ్ణాలు పెడుతూ ఆ మూడు గిన్నెలూ సర్దుకుని వెళిపోయింది. అక్కడ నేనేం మాట్లాడలేదు. హైదరాబాదు వెళ్లిన తర్వాత మర్నాటి పొద్దున్న టిఫిన్ చేస్తున్నపుడు, ‘మీరు చేసిన పని బాగానే ఉంది కానీండి..  తర్వాత ఏం జరిగుంటుందో తెలుసా,’ అన్నాను. ఏం జరిగుంటుందీ అన్నారు. ‘గేటు దగ్గర పోలీసాడు కనిపిస్తాడు. ఏం దొంగముండా ఎక్కడ కాజేశావని వాడు లాక్కుని ఉంటాడు కేరేజి’ అన్నాను. ఆయన అప్పుడేం మాట్లాడలేదు. టిఫిన్ అయ్యాకా, ‘ఎందుకు రమణగారు నా మైండ్ పాడు చేశారు’ అన్నారు. నేను అన్న తర్వాత ఆయనకి కూడా అదే అనిపించి ఉంటుంది. చాలా రోజులు ఆ ఊహ ఆయన్ని హాంట్ చేసింది. నేను అలా అనకుండా ఉండాల్సిందే అనుకున్నాను తర్వాత.

రచయిత మీద వయసు ప్రభావం ఉంటుందా? మీ విషయంలో చెప్పండి?

అదేమీ ఉండదు. విశ్వనాథ, ఆరుద్ర, ముళ్లపూడి అందరూ చివరి దాకా రాస్తూనే ఉన్నారు. శైలి ఎక్కడికీ పోదు. కానీ ఇతివృత్తాల విషయంలో అప్‌డేట్ అవుతున్నారా, లేక మొదలుపెట్టిన చోటే చతికిలపడ్డారా అన్నదే ప్రశ్న. కాలాన్ని బట్టి మారని నైజం కొందరికి ఉంటుంది. మాట్లాడితే, ‘మా రోజుల్లో…’ అని మొదలుపెడతారు. మూడొందలేళ్ల క్రితం కూడా ఇలాగే మాట్లాడి ఉంటారు, ‘ఈ యువత ఇలా ఉంటే ఈ దేశం ఎటుపోతుంది, ఈ ప్రపంచం ఏమైపోతుందీ’ అని. ఏమైపోయింది? అది ఎటో అటు పోతూనే ఉంటుంది. వెళ్లిపోతున్న రైలుని కదలకుండా చూస్తూ కూర్చున్నట్టు వాళ్లు మాత్రం ఉన్న చోటే మిగిలిపోతారు

అస్తిత్వ వాదాల గురించి?

వాదాలు రావటం కరెక్టే. మైనారిటీలు వాళ్ల సమస్యల గురించి రాసుకోవాలి. కానీ అందరూ అన్నీ రాయాలనటం, నిర్దేశించటం సబబు కాదు. రచయితకు స్వేచ్ఛ ఇవ్వాలి. వాడెప్పుడో ఒకటి రాస్తాడు, సామాజిక స్పృహతోనో, అది లేకుండానో. అంతే తప్ప, విరసం వాళ్లలాగా, ఇదే రచన, ఇలాగే రాయాలి అని చిలక్కొయ్య కేసి తగిలించేయకూడదు.

వాదాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒకటి చెప్పాలి. నా కథ ‘మిథునం’ ఆ ఏడాది వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్‌ల ‘కథ’ సంకలనంలో రాలేదు.  ఆ యేటి సంకలనానికి జంపాల చౌదరిగారు ముందు మాట రాస్తూ, ‘మిథునం ఈ సంకలనంలో చేరకపోవటం వల్ల మిథునానికి నష్టం లేదు గానీ, ఈ సంకలనానికి వెలితిగానే ఉంటుంది’ అని రాశారు. ఈ మధ్య తానా సభలకు అమెరికా వెళ్లినపుడు నాతో బాటు వాసిరెడ్డి నవీన్ గారు కూడా వచ్చారు. అక్కడ చికాగోలో ఒక తెలుగు మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ, ‘ఆ ఏటి సంకలనంలో మిథునం కథ చేర్చనందుకు శ్రీరమణ గారికీ, జంపాల చౌదరి గారికీ ఈనాడు సభాముఖంగా క్షమాపణ చెప్తున్నాను. అప్పట్లో జరిగిన నిజమేమిటంటే – పెళ్లి అనేది భ్రమ, అది అక్కర్లేదు అనే ఒక ఫెమినిస్టు వాదాన్ని కూలగొట్టడానికి ఈయన ప్లాన్డ్‌గా ఈ కథ రాశాడని అనుకున్నాం. ఆ వాదానికి విఘాతం కల్పించటానికి, మేరేజ్ అనే ఇన్‌స్టిట్యూషన్‌ని అప్‌హోల్డ్ చేస్తూ రాసిన ఈ కథని వేయద్దనుకున్నాం’ అని పెద్దమనసుతో ఒప్పుకున్నారు. నేను ఒకటే అనుకుంటా, గింజకి జీవశక్తి ఉంటే అది ఎక్కడ పడేసినా పోదు.

ఇది సంజీవదేవ్ శతజయంతి సంవత్సరం. ఆయన గురించీ, ఆయనతో మీకు చాలా అనుబంధం ఉంది కదూ?

అవును, నా ఫార్మటివ్ ఇయర్స్‌లో, ఆ ఇరవై – పాతికేళ్ల మధ్య వయసులో నాపై ఆయన ప్రభావం చాలా ఉంది. ఓ ఐదేళ్లు ఆయన వెంటే తిరిగాను నేను. ఆయన ఎక్కడకు వెళ్లినా కూడా వెళ్లేవాణ్ణి. ‘నువ్వు పక్కన లేపోతే నన్నెవరూ గుర్తుపట్టడం లేదయ్యా’ అన్నాడొకసారి సరదాగా.

కోరుకున్నట్టు జీవితం గడపగలిగారు. టాటా బిర్లాలకైనా అదంత సులువుగా సాధ్యమవుతుందనుకోను. ఇష్టమైతే మాట్లాడేవారు. ఇష్టమైతే రాసేవారు. వచ్చేపోయేవాళ్లతో, ఆతిథ్యాలతో… వాళ్లిల్లు ఎప్పుడూ సందడి సందడిగా ఉండేది. దీక్ష పట్టి రాయాలనుకున్న మనిషి కాదు. నాకు పుస్తకాలక్కర్లేదు, అచ్చులక్కర్లేదు, పుస్తక సభలక్కర్లేదు, పద్మశ్రీలక్కర్లేదు… నేను ఉత్తరాలు రాసుకుంటాను చాలు అనుకున్న మనిషి.

ఏ రచయితనైనా అంచనా వేయాలంటే అతని సమకాలీన పరిస్థితుల్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. సంజీవదేవ్ యాక్టివ్‌గా ఉన్న సమయంలో మన రాష్ట్రం అంతటా దేశభక్తీ, సంఘ సంస్కరణా అలుముకుని ఉన్నాయి. ఒకపక్క ‘ఎలుతరంతా మేసి ఏరు నెమరేసింది’ అంటూ నండూరి సుబ్బారావు ‘ఎంకిపాటలు’ వినిపిస్తున్నారు, మరోపక్క ‘అవిసి పువ్వులు రెండు అందకున్నయి నాకు తుంచినా సిగలోన తురిమి పోదువుగాని, రావోయి బంగారుమామ’ అంటూ కొనకళ్ల వెంకటరత్నం ‘బంగారుమామ’ పాటలు కడుతున్నారు; ఒకపక్క ‘పాండవోద్యోగ విజయాలు’, ‘గయోపాఖ్యానం’ లాంటి నాటకాలకు జనం బ్రహ్మరథం పడుతున్నారు; ఆ నాటకాల్లో నటులు ఓ డివి సుబ్బారావు గారన్నా, ఓ షణ్ముక ఆంజనేయులు గారన్నా, పూసపాటి నరసింహమూర్తి గారన్నా… ఇవాళ సినిమా వాళ్లకున్నంత గ్లామరు; ఒకపక్క పత్రికల్ని ‘ప్రబోధించిరి’, ‘అభిభాషించిరి’ లాంటి పాత భాష నుంచి బయటపడేస్తూ కృష్ణాపత్రిక లో మట్నూరు కృష్ణారావు, ఆంధ్రప్రభలో నార్ల వెంకటేశ్వరరావు భాషకు ఒక కొత్త ఒరవడి తెస్తున్నారు.

ముప్ఫయి ఐదేళ్ల వయసున్న సంజీవదేవ్ చుట్టూతా అలుముకున్న వాతావరణం ఇది. ఇలాంటి సమయంలో ఆయన ఈస్థటిక్స్‌ వైపు దృష్టిమళ్లించారు. ఇప్పుడు అనొచ్చు కొందరు ‘ఆయన దంతపు సౌధాల్లోంచి ఎగిరిపోయే కొంగల్నీ, తెరచాప పడవల్నీ చూస్తూ కూర్చున్నాడూ’ అని. కాని నిజానికి ఈస్థటిక్స్‌ని ఎవ్వరూ వదిలిపెట్టలేదు. చలం ‘మహాప్రస్థానా’నికి యోగ్యతాపత్రం రాస్తూ, ‘సంధ్యను చూశావా అంటే ఎవరా సంధ్య అంటే నేనేం చెప్పనూ’ అంటాడు, మరి మహాప్రస్థానంలో ఈస్థటిక్ రిఫరెన్సు ఎందుకు ఇచ్చాడూ? ఈస్థటిక్స్ అనగానే అదేదో వెన్నెల గురించీ, కొబ్బరాకుల గురించీ అనుకోవక్కర్లా. శ్రీశ్రీ ‘నా ఊళ కేదార గౌళ’ అన్నాడెందుకూ, ఏ ఫాక్టరీ సైరనో అనెందుకు అనలేదు, అక్కడ రాగం పేరు ఎందుకుపెట్టడం? తిలక్ ‘నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు’ అన్నాడు. అంత అందంగానే రాశాడు.  అదేవీ తప్పు కాదు. ఎవరూ వాళ్లని సామాజిక స్పృహ లేదని వెలివేయలేదు.

మీ మాటల్లో శంకరుని ప్రస్తావన తరచూ వస్తుంది. ఆయన తత్త్వం మీకు ఇష్టమా?

ఆ మధ్య ఒకసారి ఒక మీటింగ్‌లో ఇదే ప్రశ్న అడిగారు, ‘మీరు శంకరుని మాయావాదాన్ని ఎందుకు నమ్ముతారూ’ అని. నేను తిరిగి రెండే ప్రశ్నలు అడిగాను. ‘సత్యం రామలింగరాజు జైలు కెందుకు వెళ్ళాడు, వైయెస్ రాజశేఖర రెడ్డి పదిహేను నిముషాల్లోఎట్ట చచ్చిపోయాడూ’ అని. ఆయన హెలికాఫ్టర్ ఎక్కుతూ ‘వచ్చాకా మాట్లాడుకుందాం బ్రదర్’ అని ఎక్కి ఉంటాడు, కాని తర్వాత లేడు. ఇంకోపక్క అన్ని కోట్లు ఉన్న రామలింగరాజుకి జైల్లో ఎందుకు కూర్చోవాల్సి వచ్చింది? ఏం తక్కువైంది, ఏది ఆయన్ని నేరానికి ప్రేరేపించింది? వీటికి శంకరుని మాయావాదమే సమాధానం చెప్తుంది.

నువ్వు చూస్తున్నదంతా మాయ అనడం, ఇది కాదు వేరే రియాలిటీ ఉన్నదనడం… నాకు తెలుసు… అది భ్రమలో పెట్టడం అని.  ఎవడైనా ‘నా కాళ్లలో ముళ్లు దిగుతున్నాయిరా’ అంటే ‘అది భ్రమరా’ అంటే ఎట్లాగా, ఓ పక్క వాడు కాళ్ళకు చెప్పుల్లేక చస్తుంటే! కానీ ఎందుకో అలా అనుకోవడం జీవితాన్ని తేలిక పరుస్తుంది. అంతకుమించి ఏం లేదు.

మీ తర్వాతి కథా సంపుటి ఎప్పుడు రాబోతోంది?

నా తర్వాతి కథా సంపుటి ‘సింహాచలం సంపెంగ’ బహుశా వచ్చే ఏడాది వస్తుంది. ఇందులో పది కథలుంటాయి. దీంతో పాటు నావి ఇంకో ఇరవైకి పైగా పుస్తకాలు రాబోతున్నాయి. ఇప్పటికీ నన్ను ‘మిథునం’, ‘పేరడీ’ల రచయితగానే గుర్తించే పరిస్థితి ఉంది. ఇవి విడుదలయ్యాకా ఆ ముద్ర పోతుందనే అనుకుంటున్నాను.

 *

శ్రీరమణ గారి ఇంటర్వ్యూ: Download PDF   /   Download EPUB   /   Download MOBI

 

బాహ్య లంకెలు:

శ్రీరమణ పుస్తకాలు కినిగెలో ఇక్కడ ఉన్నాయి. 

Posted in 2013, ఇంటర్వ్యూ, డిసెంబరు and tagged , , , .

8 Comments

 1. బంగారు మురుగు

  ఈ కథ అంత బామ్మ చుట్టూ అల్లుకుని ఉంది. నిజంగా ఆ బామ్మ అదృష్ఠ వంతురాలు. ఆచారవంతుడైన కొడుకు, కోడలు, ఒక్కగానొక్క మనవడు, మంచి ఇల్లు. ఇవే కాకుండా బామ్మ మనసు మంచిది. ఇటువంటి కలతలు లేని వ్యక్తిత్వం, మంచి ఆరోగ్యవంతమైన మనస్సు, శరీరము కలిగివుండటం ఎంతైనా అదృష్టం, ఆమె ఏనాడో చేసుకున్న పుణ్యము.

  బామ్మ ఫిలాసఫీ : 1) దయ కంటే పుణ్యం లేదు, నిర్దయ కంటే పాపం లేదు
  2) చెట్టుకు చెంబెడు నీరు, పక్షికి గుప్పెడు గింజలు పశువుకు నాలుగు పరకలు,
  ఆఁకొన్న వాడికి పట్టెడు మెతుకులు.

  ఇక్కడ బామ్మకు గురువులు, స్వాముల మీద నమ్మకము లేదని అనిపిస్తుంది. అయితే ఆవిడ చిన్న తనములో అవన్నీ పాటించి ఉండబట్టే ఈ రోజు కొడుక్కు ఆ ఆచారాలు అబ్బి ఉంటాయి కానీ, ఎంతైనా తల్లి మనసు, కొడుకు సంతోషంగా (మిగతా వాళ్ళలా)సంసారము చేసుకోకుండా, ఈ పల్లకీలు, మఠాలు చుట్టూ తిరుగుతూ ఉంటె నచ్చదు. అందుకే ఆలా అంటుండవచ్చు. నిజానికి మనకు గురువు ఎందుకు ? ఒక బరువు కోసం. ‘అన్ని ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది అన్నట్టు’, గురువుగా ఒకరిని నియమించుకొని వారి దగ్గర విద్యతో పాటు వినయము నేర్చుకోవడమే ప్రధానము. విద్య, వినయము రెండు ఉంటేనే ఈ నరుడు ఉత్తముడు అవుతాడు. అదీగాక అందరికి సూక్ష్మంగా, ఆలోచించి నిర్ణయాలు తీసుకొనే శక్తి ఉండదు. అందుకే తమపై ఒక గురువును నియమించుకోవడం చాల మంచి పద్దతి. తప్పు జరగకుండా చూసుకోవడం, ఆచారం, సంప్రదాయం పాటించడం వల్ల ఎన్నో అనర్థాలు జరగకుండా ముందే నివారించవచ్చు. అయితే ‘అతి సర్వత్రా వర్జయేత్’ కాబట్టి ఈ కాలములో మన ఇంటికి వచ్చి భోంచేసే వాళ్ళు కరువైనారు కాబట్టి అటువంటి వారిని మనమే వెదికి సహాయము అందించడము ఎంతైనా అవసరము. ప్రతి వ్యక్తి తన సంపాదనలో 1/16 వంతు కనీసము దాన ధర్మాలకు వినియోగించాలని ఒక ప్రఖ్యాత గురువు స్వామి శివానంద (రిషికేష్) తన ఆధ్యాత్మిక సూత్రములలో బోధించారు. దానము అనగా లేని వాడికి పెట్టడము, మరి ధర్మము అనగా గురువాజ్ఞ ప్రకారము అభిషేకాలు, హోమాలు, శాంతి కార్యక్రమములు నిర్వహించడము. ప్రతి గృహస్థుడు నియమము ప్రకారము శాంతి, సమృద్ధి కొరకు (కనీసము సామూహికంగానైనా) నెలకు ఒక్క సారి రుద్ర హోమము చేయాలి. ఇది గనుక ప్రతి దేవాలయం వేదికగా నిర్వహించితే మన సుఖ శాంతులకు ఎవరు భంగము కలిగించలేరు. అందుకే స్త్రీ లకు ఆధ్యాత్మిక విద్యలో ప్రవేశము ఉండాలి. శాస్త్రము తెలుసుకోవాలి.

  బామ్మ వరకు చూస్తే తనకు ఉన్నంత లో చాదస్తం లేకుండా, సంతోషం గా మనవడితో కాలక్షేపము చేస్తూ ఉండగలగడం ఎంతో మంచి ఆదర్శం, అదృష్టం కూడా. కష్టమైన పనులు చేయలేకున్నా నిండుగా వాకిలి అంతా ముగ్గులు పెట్టటం ఎంతో ఆరోగ్య వంతమైన అలవాటు. లక్ష్మి కళ అంటే లక్ష్మి ఎక్కడో బైట నుంచి రాదు. సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి ఇల్లు అంతా శుభ్రము చేసుకోవడం వల్ల మనలోపలి అలక్ష్మీ పోవడం ద్వారా (మన ఒంట్లోని మలినాలను) తొలగించు కోవడం ద్వారా లక్ష్మి రావడానికి అవకాశం ఉంటుంది. అష్ట లక్ష్మిలలో మంచి ఆరోగ్యము, మంచి సంతానము కూడా లక్ష్మి గానే భావిస్తారు. వీటన్నిటికీ ఈ ముగ్గులు పెట్టటం అనే అలవాటు ఎంతో ఉపకరిస్తుంది. అలాగే దేవుళ్ళకు మేలుకొలుపులు పాడటం. నిత్యం సుప్రభాతం వినబడే ఇంట్లో ఉదయం కనబడే కళ మన కళ్ళకు ఎంతో ఇంపుగా ఉంటుంది. ఆడవాళ్లు ఈ విధంగా ఉండటం ఇంటికి ఎంతో గొప్ప ప్రాభవాన్ని తెచ్చిపెడుతుంది అనడం లో సందేహము లేదు. తల్లి చేస్తూ పిల్లలకు ఎలా చేయాలో చిన్నప్పటి నుండి సెలవు రోజులలో నేర్పుతూ ఉంటే పిల్లలు కూడా ఆడుతూ పాడుతూ ఎలా పని చేసుకోవాలో తెలుసుకుంటారు. అయితే దీనికి పురుషల మరియు పిల్లలలో ఉండవలిసిన క్రమశిక్షణ కొరవడడము వలన పొద్దు పోయే వరకు ఏవొ అర్థం లేని టీవీ కార్యక్రమములు చూస్తూ కాల క్షేపము చేయడము వలన జీవన శైలి వ్యాధులు (Life Style Diseases) ప్రబలుతున్నాయి. అంటే మనదేశము లో ఏ ఋతువులో ఎలాంటి ఆహారము తినాలో ఏ శరీర తత్వము వాళ్ళు ఎలాంటి జీవన విధానము అలవాటు చేసుకోవాలో తెలుసుకోకుండా అమెరికా వాళ్లు మేలుకొని ఉండగా అర్ధ రాత్రి, ఆడ మగా తేడా లేకుండా గర్భిణీ స్త్రీలు, చంటి బిడ్డ తల్లులు సైతం పని చేయడము, ప్రకృతికి విరుద్ధముగా ప్రవర్తించడమే అవుతుంది. ఇవన్నీ మనకు బోధించే వ్యక్తి ఒక్క గురువే. ఒక ఆయుర్వేద వైద్యుడు, ఒక జ్యోతిష పండితుడు, ఒక ఆధ్యాత్మిక గురువు వీరు ముగ్గురు మన జీవితంలో అత్యంత ముఖ్య మైన భాగముగా మనము భావించాలి. మనము ఎలా ఉన్నామో మనకు తెలియదు కేవలము అద్దము లో మాత్రమే కనబడుతుంది. భర్తకు భార్య, భార్యకు భర్త ఇలా అద్దములాగ ఉపయోగ పడగలగాలి. మరి వారిద్దరికీ కావలిసిన ఉపయుక్తమైన జ్ఞానమును గురువుల వద్దనుంచే సంగ్రహించాలి. అంతేగాని googleలో రెమెడీవల్ల జీవితం బాగుపడదు. మనకు తెలుసు షేర్ చేస్తాము కానీ పాటించము. గురువు ఎంత తక్కువ స్థాయి వ్యక్తి అయినా సరే అతని మీద మనకు ఉండే నమ్మకమే మనలను ఉద్ధరిస్తుంది. ఒక పరమాచార్య వంటి గురువులు మనకు దొరికేంత వరకు ఉన్న గురువునే పరమ గురువులుగా భావించవలసిన అవసరము ఉంది. ఏ గురువైన శాస్త్రములో ఉన్నది చెబుతారు. మారుతున్న కాలానికి అనుగుణముగా, రోజు కాక పోయిన నెలకొకసారైనా పాటించ వలసిన అవసరం మనకు ఉంది. ఆధునిక విద్యలో ఆధ్యాత్మిక కోణము కొరవడడము కారణంగా గత రెండు తరాలు అధికంగా నష్ట పోయాయి. మళ్ళీ పునరుద్ధరించు కోవలిసిన అవసరము ఎంతైనా ఉంది.

  స్త్రీలు తప్పని సరై ఉద్యోగము చేయ వలిసి రావడము మన సమాజానికి, సంస్కృతి కి ఒక గొడ్డలి పెట్టు లా పరిణమిస్తూంది. నిజమే స్త్రీలు తాము శక్తి స్వరూపులమని నిరూపించుకుంటున్నారు. మనందరమూ చప్పట్లు కొడుతున్నాము. అయితే స్త్రీ ఎంత సంపాదించినా తీరిక వేళలో తన కుటుంబముతో కలిసి వారికి వండి వడ్డించడమే భాగ్యముగ భావిస్తూ వస్తోంది. ఆ కోరిక తీరలేనపుడు ఇంక ఎవరికోసము సంపాదించాలి. స్త్రీ సహజమైన మాతృత్వము ఎలా సంతోషిస్తుంది. కేవలం సంపాదన మాత్రమే మనలను ఉద్దరించలేదు. తన భర్తను పిల్లలను సంస్కరించుకోలేని భార్య సంసారము దుఃఖమయమే అవుతుంది. మన ముందు తరాలవారిలో కనీసము స్త్రీలు గృహిణులుగా ఆచారాలు పాటించేవారు. అప్పటికే పురుషులు డబ్బు సంపాదించే యంత్రాలుగామారి ఆచారాలను గాలికి వదిలేసినారు. ఇప్పుడు స్త్రీలు కూడా ఉద్యోగ బాట పట్టి డబ్బు సంపాదించ గలుగు తున్నారేగాని, ఆ డబ్బు ధర్మ బద్దముగా ఎలా వినియోగించాలో తెలుసుకోలేక పోతున్నారు. అలా తెలుసుకోగలిగితే మనము ఒక ఆరోగ్య వంతమైన సమాజమును నిర్మించుకోగలగడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ కాలములో బామ్మలా మనవడిని కనిపెట్టుకుని ఉండి తమ వంశాంకురాన్ని తీర్చిదిద్దగలిగే ఓపిక ఎంతమంది స్త్రీ లకు ఉందండి. వాళ్ళు దుడుకు మా మాట వినరని అంటారేమో. అక్కడే వారి అనుభవము, నేర్పు తెలుస్తుంది. వాళ్ళు అది తమ బాధ్యతగా భావించాలి. తల్లి తండ్రులకు పిల్లలకు మధ్య వారధిగా మాట్లాడగలగాలి. పిల్లల సంతోషము చూడగలగాలి. అల్లాగే తల్లిదండ్రులు తమ పెద్దలు చెప్పిన మాటలకు కొంత విలువ ఇచ్చి మాట్లాడితే ఆ సంస్కారము పిల్లలకు కూడా అలవడుతుంది.

  కథలో అన్ని పాత్రలు తాము తమ వయస్సుకు తగ్గట్టు ప్రవర్తించారు. ఏమి సందేహము లేదు. ఒక్క గురువు ధర్మమూ విషయము తప్ప. రచయిత శ్రీ రమణ ఇంత మంచి రచన చేసినందుకు ఎంతైనా అభినందనీయులు. అతి తక్కువ మాటలలో ఎక్కువ భావాల్ని చెప్పడంలో ఆయన కృతకృత్యులైనారు.

 2. “….పెళ్లి అనేది భ్రమ, అది అక్కర్లేదు అనే ఒక ఫెమినిస్టు వాదాన్ని…” ఇదెక్కడి వాదం?! పైగా అది “అడ్డు” పెట్టుకుని మిథునం కథను ఒకానొక సంకలనం వెయ్యకపోవటమా !!! ఎంతటి నిరక్షరాశ్యత పేరుకుని పొతే అలా అనుకునే స్థితిలో ఉంటారు?

 3. Sri Ramana garu naa abhimana rachayitha… vaari anni kadhalu, rangula ratnam , parodys , articles ( Sri Channel, Guttonkaya Manava Sambandhalu etc) anni naku istam. Ma abbayi ( 15 years) ki chala chala istam. Nenu Maa vadu ramana gari rachanala gurinchi chala chala discussions chesukoni anandistu vuntam.

 4. ఒక్క రమణ గారే కాదు. ఎవరి ప్రతిభైనా మిథునాన్ని బట్టే! మరి ఇన్నాళ్ళూ ఈయన్ని అక్షరాలా భరించిన శ్రీమతి రమణ గారి కి కూడా
  ఓ60 శాతం క్రెడిట్ ఇవ్వాల్సిందే

 5. వరంగల్ లో ఒక మోతుబరి రచయితతో మిథునం గురించి మాట్లాడుతూ ఉంటే, “ఆ కథలో ఏముందండీ! ఒక బ్రాహ్మణుడి భోజన ప్రియత్వం గురించి రాశాడాయన” అని కొట్టిపారేశాడు. అదే మొదటిసారి, ఆఖరి సారి మిథునం కథ నచ్చని వ్యక్తిని నేను చూడడం. మిథునంతో పాటు నాకు బాగా నచ్చిన కథలు ధనలక్ష్మి, పెళ్ళి.

  ఈ ముఖాముఖీ చదువుతూ ఉంటే శ్రీరమణ గారి గురించే కాకుండా అనేక ఇతర తెలుగు రచయితలగురించి కూడ తెలిసింది. చాల బాగా రాశారు.

 6. “ఒక మహానగరాన్ని అర్థం చేసుకోవాలంటే పది – పదిహేను రోజులు చాలు, కానీ ఒక పల్లెటూర్ని అర్థం చేసుకోవాలంటే ఓ పాతికేళ్ళు అక్కడ గడిపితే తప్ప సాధ్యం కాదు.” – ఈ ఒక్క మాట చాలు నాకు.