gaa devudu jpeg

గా దేవుడు మీరే. . . మళ్ళా!!

Download PDF    ePub    MOBI

కొక్కొరొకో. . . ముసుగుతన్ని ముడుసుకోని పండుకున్న నాని సెవులల్ల నూటొక్క రాగం ఇనిపిత్తంది. కోడి పుంజు కూతలకు గోడ మీద బల్లి కీసు గళంతోని తాళం ఏత్తంది. అంట్లింట నుండి బోళ్ళ సప్పుడు, బోళ్ళ మీద ఘల్లు ఘల్లుమని అమ్మ సేతికున్న గాజుల దరువు, సలికాలపు సన్నపు గాలికి కిర్రు కిర్రున ఊగే కిటికీ సప్పుడు అన్నీ కలెగలిసి నానికి సుప్రభాతం లెక్క ఇనవడ్తంది. లేత్తే ఎక్కడ గీ సంగీతం ఆగుద్దోనని నాని ఇంకా ముడుసుకున్డు సెవులు రిక్కాయించి. మల్ల కోడిపుంజు ఊకుంటదా?, తలాపుకచ్చి కూసింది,సెవులు కోరికింది, అయినా సుత నాని లెవ్వలే.

నడుం మీదెక్కి డాన్స్ జేసింది. గప్పుడు నానికి సెక్కలగులయి నవ్వచ్చింది, సెంగున లేసి దాన్ని దొరకవట్టిండు. సాన సేపట్నుంచి దుప్పట్లకి సొర్రడానికి సందు దొరక్క తల్లడిల్లిన ఎండపొడ సర్రున అచ్చి నాని సెంప మీద సురుక్కున మెరిసింది. ఈకల్ని నిమురుకుంట సవరిత్తూంటే నాని అరసేతులకు మెత్తగా యెచ్చగా తగిల్నయి. కాళ్ళ గోర్లు కొచ్ఛగా తొడల మీద గుచ్చుతన్నయి. కోడిపుంజును సంకలవెట్టుకోని మెల్లగా లేసిండు, కడుపుబ్బి నెక్కరు గుండి తపుక్కున తెగిపోయేటట్టుంది, కని ముందుగాలా కోడిపుంజు కడుపు నిండినంకనే నాని కడుపు నిండుకోవాలే. మంచం మీన్నుంచి లేసి మూడడుగులేసి కుడిసేయి సాపిండు, ఇసుర్రౌతు మీద వెట్టిన జొన్నల బస్త తలిగింది. పిడికెడు జొన్నలు తీసి గచ్చుమీదేసి పుంజునిడిసిండు. ఆన్నుంచి రెండడుగులేత్తే ఇంటెన్క గడుప, రెండు మెట్ల గద్దె దిగితే ఆకిలి, ఐదడుగుల ఆకిలి దాటితే పెంట, నాని రెండడుగులు పెంట లోపలికి వోయి నెక్కరు గుండిప్పిండు, ఆనకట్ట గేట్లు తెరిసినట్టు బొయ్యిమని సొద, కింద వరక్కాయిదం అల్లల్లాడుతున్న సప్పుడు, పెండ బుడిదిలవన్న పిల్లి పక్క తడిసిందో ఎమో మ్యావ్‌వని లేసి పెయ్యి ఇరిసింది. నెక్కరు గుండి వెట్టుకుంట కుడి కాలుతోని మెల్లగా అటు ఇటు తడిమితే సిన్న బండ తలిగింది, ఎడవచేయితో తీసి రైయ్యిన పిల్లి మీదికి ఇసిరిండు, దానికి తగిలినట్టే ఉంది, క్యావ్ క్యావ్ మని ఒర్రుకుంట తడికె సందుల కెళ్ళి అవతలికురికింది. నాని మొకంల యిజయ గర్వం. మ్యావ్ మ్యావ్‌మనే అరుపులు నానికి సావు సప్పుల్ల లెక్క ఇనవడ్తయి. గీదినికి కారణవేందో కనుక్కోవాల్నంటే రకుతం కాలువలు గట్టి పారిన ఫ్లాష్‌బ్యాక్‌లకి పోవాలే. గీ కోడిపుంజు ఉంది గదా, దీని తల్లి పది గుడ్లు పొదిగి పదికి పది పిల్లల్ని జేసింది. బుచ్చి బుచ్చి పిల్లలు, అర సేతుల పోసుకున్న నూకల్ని సిన్న సిన్న ముక్కుల్తో పొడుసుకోని తింటా ఉంటే నానికి గమ్మతిగా అనిపించేది. గీ కోడి పిల్లల్తోనే దినాం పొద్దుగూకేది నానికి. గా టైమ్‌ల్నే పిల్లికి సుతా పాలు పోసి పెంచుతుండే. కని పిల్లి పాలు తాక్కుంటనే రకుతం రుసి మరిగింది. నవరాత్రులకు రోజుకో కోడిపిల్ల సొప్పున పండుగ జేసుకుంది, దస్రనాడు తల్లినే మింగింది. నానికి ఏమైందో సమజయేటాల్లకు లింకు లిటుక్కుమని ఒక్క పిల్ల మిగిలింది. పిల్లిని పిల్లి లెక్కనే దొరకవట్టి పందిరి గుంజగ్గట్టి సింత బరిగెల్తో సిత్తం కొట్టిండు, పిల్లిని సంపుతే పాపంరో అని అమ్మ మొత్తుకోని ఆపకుంటే గానాడు నిఖార్సుగ సంపెటోడే. గప్పట్నుంచి మ్యావ్ మ్యావ్ మనే అరుపుకు నాని సెవులకు మధ్య పచ్చి గడ్డి, ఎండిన గడ్డి అసలుకి గడ్డే లేకున్నా గూడా భగ్గుమంటంది. నాని ఆకిట్లకచ్చి ఎడుమకు తిరిగి ఆరడుగులేసి మల్లా కుడికి తిరిగి నాలుగడుగులేసిండు. ఇంటి ముంగట ఆకిట్లేసిన ముగ్గు పిండి అరి కాళ్ళకు పొడి పొడిగా అంటింది. ఇంకో రెండడుగులేసి అరుగు మీద పొద్దటి ఎండ పొడకు యెచ్చగా గూసున్నడు. “నాని లేసినవరా? ఎడున్నవ్” ఇంట్ల నుంచి అమ్మ. “పండ్లు తొముకో పో. . . తానం జేత్తువు ఉడుకు నీళ్ళు వెట్టిన” అనుకుంట అమ్మ ఇంటి ముంగటికచ్చింది. కాళ్ళ పట్ట గొలుసుల సప్పుడు ఒక్కొక్క గద్దె దిగ్గుంట ఆకిట్ల నుంచి పదడుగుల దూరంల ఆగినయి.

బళ బళ ఖాళీ బొక్కెన సప్పుడు, గిర గిర గిరుక సప్పుడు, దభెళ్ళున నీళ్ళల మునిగిన బొక్కెన సప్పుడు, మల్లా బరువుతోని కిర్రు కిర్రున గిరుక సప్పుడు. . . నీల్జేదేటప్పుడు నానికి గీ సప్పుల్లు భలే gaa devudu jpegఅనిపిత్తయి. “అమ్మ నేను కొద్దిగాగినంక తానం జేత్తనే, సలి వెడ్తంది” అని గావురానికి వోయిండు. “సుక్కురారం గాదురా, తాలారా తానం జేసి దేవుడికి దణ్ణం పెట్టుకుంటనేనాయే అన్నం దొరుకేది. . . లేలే” సేది నీళ్ళు భళ్ళున గోళెంల వోసింది. నాని అరుగు మీంచి లేసి గోళెం దగ్గరికి నడిసిండు. “మెల్లగ రా… జారి వడ్తవ్” అమ్మ ఇంకో బొక్కెన సేదింది. నాని సెంబు కోసం ఎతుకుతండు. “కుడి సెయ్యి దిక్కుంది” బొక్కెన మల్లా బాయిలేసింది. సెంబందుకోని నాని గోళెంల నీళ్ళు ముంచిండు. ఎడమసేయి దిక్కు తిరిగి సక్కగా ఐదడుగులేసిండు. లేత ఆకులు సేతికి తగిల్నయి, సెంబెడ్నీళ్ళు సెట్టు మొదట్ల కుమ్మరించిండు. ఆకుల్ని సుతారంగా నిమిరితే, సన్నని ఈనెలు సేతికి తగుల్తున్నయి. ఒకటి, రెండు, మూడు అని గీమజ్జె అమ్మ దగ్గర నేర్సుకున్న అంకెల గానెంతో దాని ఆకుల లెక్క తేల్చిండు. “అమ్మ గిదీనికి ఇంకో ఆకు పుట్టిందే… నిన్న ఎనిమిదే ఉండే, ఇయ్యాల ఏడున్నయి” ఎనిమిదిల ఏడుల పెద్దదేదో మర్సిపోయి సంబురంగా చెప్పిండు. “నీ సంబురం సల్లగుండా… జల్దిరా తానం జెద్దువు” ఉడుకు నీళ్ళు తెద్దామని అంటిట్లకు వొయింది. నాని బాయికాడికచ్చి, దాని గోడ వట్టుకొని లోపలికి తొంగి, మొకం బాయిల వెట్టిండు, లోపల్నుంచి సెవులకు యెచ్చని గాలి తగిలింది. “కూ…” అని కూసిండు, బాయి గూడ “కూ…” అని కూసింది. “ఓ” అన్నడు, మళ్ళా “ఓ” అని బదులిచ్చింది. భూం అని భయపెట్టిత్తే గంతే గట్టిగా భూం అన్నది. “బాయిల మొకం పెట్టద్దురాని ఎంత జెప్పిన ఇనవెందిరా… జప్పన బట్టలిడువు” ఉడుకు నీళ్ళు తెచ్చి పోసింది అమ్మ. “అమ్మ… నీళ్ళు గీ బాయిల కెట్లత్తయే” ఎనుకకు తిరిగి రెండడుగులు ఎయ్యంగనే సేతికి బాల్చి తగిలింది. “బాయిల ఊట అత్తది, గా ఊటతోని నీళ్ళురుతయి” నాని అంగి లాగిప్పింది. “గా ఊట ఎట్లత్తది” బాల్చి పక్కకు గూసునో నీళ్ళను గుప్పిట్ల దొరకవడ్తండు. “భూమిల గంగుంటది, బాయి తవ్వితే సన్నగా ఊట అత్తది, ఆ ఊటతోనే నీళ్ళురుతయి” సెప్పిందే మళ్లా సెప్పి సెంబడు గొరెచ్చన్నీళ్ళు నెత్తి మీద కుమ్మరించింది. “వాన వడ్డప్పుడు సుత, బాయిల నీళ్ళు మీదికచ్చినయంటవు గదా?” ఇదివరకు సెప్పిందానికి, ఇప్పుడు సెప్పేదానికి పొంతన కుదర్తలేదన్నట్టు అడిగిండు. “గదేరా… వాన నీళ్ళు భూమిలింకి, బాయిలకి నీళ్ళు ఊరుతయి” పెయ్యంతా సబ్బు వెట్టింది. “మళ్ళా భూమిల గంగుంటదన్నవు?” జారే మొల్తాడుని పైకి ఎగ దోపుకుంట అడిగిండు. “యచ్చ ప్రశ్నల్నేసి ఒర్రియకురా… మొకం పట్టు సబ్బు రాత్త” మొకానికి సబ్బు వెట్టి నాలుగైదు సెంబులు నీళ్ళు కుమ్మరించింది, దణ్ణెం మీదున్న తువాల్దీసి సుట్టి ఇంట్లకు తీసుకవోయింది. ట్రింగ్… ట్రింగ్… అని సైకిల్ గంట మొగంగనే “అగ్గో… బాపచ్చిండు” అన్నడు నెత్తికి నూనె రాత్తున్న అమ్మతోని. “ఊరు మీదవడి తిరుగుడు సాలయిందా? బల్లేకోయి పెద్దసార్ని అడిగత్తా అంటివి… ఏవాయే?” సక్కటి పాపిట తీసి దూసింది. “గాన్నుంచే అత్తున్న గని… ఇన్ని మంచినీళ్ళీయి” అంగిప్పి సిలక్కోయ్యకు తగిలేసిండు. “మరేమనే… బల్లే సేర్సుకుంటరటనా?” అంటింట్లకోయింది. “సేర్సుకునే రూలున్నా, మేము జాగర్తగా జూసుకోలేం, సుండి పోరగాండ్లేవలయినా ఏడిపిత్తే ఎవల్ది బాద్దెత? అని అంటండు!!” గట గట నీళ్ళు తాగి నిట్టుర్సిండు. “మరేంజేసుడేంది?” సిన్న గలసలా ఛాయిచ్చింది. “పట్నంల ఓ ఇస్కులుందట… సిఫార్సు జేత్త అంటండు” బల్ల మీద గూసోని ఏడేడి ఛాయి ఓ గుక్క మింగిండు. “పట్నమా? మన తోనేడైతది?” దేవుని అర్రలకోయింది. “పట్నవంటే యాదికచ్చే… నాని గాన్ని పరీచ్ఛ జేసివోయిన డాకుటరు మల్లా మతులావు ఏమన్నా పంపిండా?” దేవుడి పటాలు తుడుసుడు వెట్టింది. “గిప్పుడే అత్తాదే? గానాడే జెప్పే… మనోడి నంబరు అచ్చేటానికియాడాదే వడ్తదో ఐదేండ్లే వడ్తదో తెల్వదని” ఆఖరి బొట్టు ఛాయి తాగి గలాస కింద వెట్టిండు. “ఇగ ఎదురు జూసుకుంట సేతులు ముడుసుకోని ఇంట్ల గూసునుడేనా?” దీపం వత్తులు ఒత్తుకుంట నిష్ఠురమాడింది. “మరేం జేసుడే… మన సేతుల ఎమన్నుందా? ఆడి అదృట్టం ఎట్లుంటే అట్లయిద్ది” సిలక్కొయ్యకున్న అంగి తీసి ఏసుకోని “సంఘం కాడికొయ్యత్తా” అని గడపదాటిండు. ఒత్తులెక్కిచ్చి దీపంల నూనె పోసి మ్కుట్టిచ్చింది. ఒత్తులెక్కిచ్చి దీపంల నూనే పోసి ముట్టిచ్చింది. కొబ్బరికాయ కొట్టి తీర్థం ఓ గాలసల పట్టింది. గాలికి ఊగుతున్న సెట్ల ఆకుల సప్పుడుని సెవులు రిక్కించి ఇనుకుంట, అట్లనే నోరుతోని సప్పుడు జేత్తుండు నాని. దేవుని అర్రలకు తీసుకవోయి బొట్టు వెట్టి, తీర్థం నోట్ల వోసింది. “దేవుడకి దండం పెట్టి ఏడు కొండలెక్కి కళ్ళారా జల్ది నిన్ను సుడాలే సామీ! అని మొక్కు” అని జెప్పి దేవుడి పటమున్న దిక్కు నానిని తిప్పింది. “ముందుగాల నాకు నిన్ను సుడాలనుందే అమ్మా” అనుకుంట దేవుడకి దండం పెట్టిండు నాని!! గీ కథ సదివే మీకు జరంత పుణ్యం ఉంటంది, మీ అక్కెర తీరినంక నానికి ఆళ్ళమ్మను జూపెట్టి మీరే గా దేవుడు కారాదుండ్రి.

Download PDF    ePub    MOBI

Posted in 2014, కథ, జనవరి and tagged , , , .

3 Comments

  1. చాలా బావుంది.
    కానీ నాని కి కళ్లు లేవన్న విషయం చాలా ముందే తెలిసిపోయేలా ఉంది. అంటే రచయిత ఉద్దేశం చివరి వరకూ దాన్ని హోల్డ్ చేసి ట్విస్ట్ లా రివీల్ చెయ్యడం ఉద్దేశం కాకపోతే ఫర్వాలేదు. లేదంటే ఇంకొంచెం వర్క్ చేసుంటే బావుండేది.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.