AuthorOnCamel

ఓ స్వప్న సంచారి యాత్రాకథనం: సిల్క్ రూట్‌లో సాహస యాత్ర

Download PDF   ePub   MOBI

“The wish to travel seems to me characteristically human: the desire to move, to satisfy your curiosity or ease your fears, to change the circumstances of your life, to be a stranger, to make a friend, to experience an exotic landscape, to risk the unknown..”
 ― Mr. Paul Theroux, The Tao of Travel: Enlightenments from Lives on the Road

పై వాక్యాలకి అద్దం పట్టిన పుస్తకం పరవస్తు లోకేశ్వర్ గారి “సిల్క్ రూట్‌లో సాహస యాత్ర“. తెలుగులో ఈ మధ్య కాలంలో వచ్చిన యాత్రాసాహిత్యంలో ఆసక్తికరమైన పుస్తకం.

మనలో చాలామందికి పర్యటనలంటే ఇష్టమే. ఎక్కువగా స్కూల్, కాలేజి స్థాయిలలో విజ్ఞాన, విహార యాత్రలతో సరిపోతుంది. మరికొందరు ఆధ్యాత్మిక ప్రదేశాలు తిరుగుతారు. ఇలాంటి వాళ్లు టూరిస్టులు కాని, ట్రావెలర్లు కాదు. టూరిస్టులకు పర్యాటక స్థలాల సందర్శనం ఆనందమిస్తే, ట్రావెలర్లకి ప్రయాణమే ఆనందాన్నిస్తుంది. పరాయి దేశాలలో, భాష కూడా తెలీని పరిస్థితులలో ఒక లక్ష్యం కోసం ప్రయాణించడం కష్టమే. అయితే లోకేశ్వర్ గారు అరవై రెండు సంవత్సరాల వయసులో, ఒంటరిగా, సరైన అన్నపానీయాలు కూడా లేకుండా, ఎన్నో కష్టాలకోర్చి ఒక ట్రావెలర్‌గా ప్రయాణంలోని ఆనందాన్ని ఆస్వాదించడమే కాకుండా, ఆ ఆనందాన్ని మనకూ పంచారు.

ఇలా తిరగడానికి రచయితని ప్రేరేపించిన చోదకశక్తి ఏది? “నా జీవితంలో నన్ను నడిపించే నావ నేను చదివిన సాహిత్యమే. అక్షరాలను ఆచరణలో అనువదించుకున్న ఫలితమే నా దేశదిమ్మరి తనం. నా నిరంతర యాత్రలు. ఎంతకూ తీరని ఓ సుదీర్ఘ సంచార దాహం.” అని అంటారాయన. పూర్వజన్మలో తానొక ప్రయాణాల పక్షినేమోనని అనుకుంటారయన. సైబీరియా మంచు ఎడారుల నుండి బయలుదేరి, ఎండలు మండే ఇసుక ఎడారులను ధిక్కరించి, మానస సరోవరం దాటి హిమవన్నగములనధిగమించి మన దేశంలో, మన ఊరిలోని రాగిచెట్టుపై ప్రతిఏటా వాలే సిలికాన్‌ పక్షిని తనేనేమో అని అనుకుంటారు.

పంచి బనూ

ఉడ్‌తే ఫిరూఁ

నీలిగగన్‌ మే..

అని పాడుకుంటారు.

వీరు గతంలో బుద్ధుడి జన్మస్థలమైన నేపాలులోని ‘లుంబినివనం’ నుండి గౌతముడు మహాపరినిర్వాణం చెందిన‘కుసినారా’ దాకా రెండుసార్లు పర్యటించారు. మధ్యమధ్య మజిలీలుగా బుద్ధుడు నడయాడిన నేలలో, సంచరించిన అడుగుజాడలలో శ్రావస్తి, జేతవనం, కోశాంబి, వైశాలీ, నలందా, రాజగృహ, గృధ్రకూట పర్వతం, వేణూవనం, బోధగయ, సారనాథ్‌లలో సంచరించారు. అంతేకాదు, హైదరాబాద్‌ నుండి ఛత్తీస్‌గడ్‌కు స్కూటర్‌ యాత్ర చేసి అడవుల్ని, కొండల్ని చుట్టి, మందుపాతరలను దాటిన సాహసవంతుడాయన. మరి ఈయనకి పర్యటనలంటే ఎందుకింత మోజని పాఠకులకి సందేహం రావడంలో ఆశ్చర్యం లేదు. జవాబు ఆయన మాటల్లోనే విందాం.

“నా భ్రమణ కాంక్ష మూలాలు మా పూర్వీకుల రక్తం నుండి వారసత్వంగా వొచ్చినట్లుంది. రామానుజుడి భోధనల ఆధారంగా వైష్ణవ మతప్రచారం కోసం మా పూర్వీకులు తమిళదేశం నుండి బయలుదేరి దేశాటనం చేసారు. మా మాతామహుడు వొందేళ్లక్రిందట కాలినడకన హైద్రాబాదు పట్నం నుండి ఓఢ్రదేశంలోని పూరీజగన్నాధానికి వెళ్లిన వైనం గుర్తొచ్చింది”. ఇంకా, “పుస్తకాలు అందరూ చదువుతారు కాని అందులోని ప్రదేశాల అన్వేషణ కోసం, ఆ అక్షరాల అడుగుజాడలలో ఆ బాటలలో నడిచే అదృష్టం కొందరికే దక్కుతుంది. ఆ కొందరిలో నేనొక్కడిని ” అని అంటారు.

మరి ఆయన ఈసారి “సిల్క్ రూట్” ఎంచుకోడానికి కారణం ఏమిటి? సిల్క్ రూట్ ప్రాముఖ్యత ఏమిటని కొందరికి సందేహం కలగవచ్చు. రెండున్నర వేల సంవత్సరాల క్రితం నుండి 13వ శతాబ్దంలో సముద్ర మార్గాల ఆవిష్కరణ వరకూ ఆసియా దేశాలకు, యూరపు దేశాలకు మధ్య ‘వారధి’గా ఉపయోగపడిన మార్గమే ‘సిల్కురోడ్డు’. అయితే ఈ మార్గం వాణిజ్య వ్యాపారాలకే పరిమితం కాక విజ్ఞాన శాస్త్రాలు, కళలు, మతాలు, సంస్కృతుల పరస్పర మార్పిడికి, ప్రభావాలకు కూడా ఉపయోగపడింది. ఆసియా ప్రాచీన నాగరికత ఈ ‘బంగారు పట్టుదారుల’ ద్వారానే యూరపు దేశాలలోకి ప్రవహించి విస్తరించింది.

Posted in 2014, Uncategorized, జనవరి, పుస్తక సమీక్ష and tagged , , , , , , , , .

One Comment

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.