James_Thurber_NYWTS

ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ వాల్టర్ మిట్టీ

Download PDF    ePub    MOBI
cinema venuka kathalu“సినిమా వెనుక కథలు” శీర్షికన వస్తున్న రెండో కథ ఇది. చిన్న కథ లోని ముఖ్యమైన ఆలోచనను తీసుకుని, దానిని విస్తరించి పూర్తి స్థాయి చలనచిత్రంగా రూపొందించడంలో విజయవంతమైన వాటిలో ఒకటి. “సీక్రెట్ లైఫ్ ఆఫ్ వాల్టర్ మిట్టీ” చాలా చిన్న కథ. కానీ విస్తరించడానికి ఎంతో అవకాశం ఉన్న కథ. కాబట్టే ఐదు పేజీలైనా లేని ఈ కథ 1947 లోనే ఒక పూర్తి స్థాయి చలనచిత్రంగా తెరకెక్కింది; వారం క్రితమే (డిశెంబర్, 25, 2013) మరోసారి అమెరికాలో ఈ కథ ఆధారంగా రూపొంచించబడ్డ మరో చలనచిత్రం విడుదలైంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ కథ రచయిత జేమ్స్ థర్బర్, తన కథ ఆధారంగా సినిమా తీయకుండా ఉండడానికి ఒక నిర్మాతకు పదివేల డాలర్లు ఎదురివ్వడానికి సిద్ధపడ్డాడట. చాలా గమ్మత్తుగా సాగే ఈ కథలో ముఖ్య పాత్రధారి వాల్టర్ మిట్టీ. కథ పరంగా చూస్తే ఇందులోనుంచి కేవలం సెటప్ మాత్రమే తీసుకోగలిగే అవకాశం ఉంది. 1947 లో వచ్చిన సినిమాలో మిట్టీ పాత్ర వయసు తగ్గించి, అతని భార్య స్థానంలో తల్లి పాత్రని ప్రవేశ పెట్టారు. ఆ పైన మరి కొన్ని కొత్త పాత్రలను పరిచయం చేయడమే కాకుండా, కలల్లో మాత్రమే కాకుండా చివరికి నిజజీవితంలో కూడా హీరో గా నిలిచిపోయే పాత్రలా మిట్టీ పాత్ర ను రూపొందించారు. ఈ కథ ప్రేరణతోనే మన తెలుగు రచయిత త్రిపుర “సుబ్బారాయుడి రహస్య జీవితం” కథను రాశారు.  – వెంకట్ సిద్ధారెడ్డి

ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ వాల్టర్ మిట్టీ

- జేమ్స్ థర్బర్ (James Thurber)

“మనం బయల్దేరుతున్నాం!” కమాండర్ గొంతు కంచులా మోగింది. అతను యూనిఫామ్ ధరించి ఉన్నాడు; భారీ అల్లికలు కలిగిన తెల్లని టోపీని ఒక వైపుగా కిందకి లాగి స్టైలిష్ గా తలపై పెట్టుకున్నాడు. “నన్నడిగితే ఈ తుఫాన్లో మనం ముందుకు వెళ్లడం ఏ మాత్రం మంచిది కాదు సార్”. “నేను నిన్ను అడగడం లేదు లెప్టెనెంట్ బెర్గ్. మనం బయల్దేరుతున్నాం! హెడ్ లైట్స్ స్విచాన్ చేయండి! ఇంజన్ సామర్థ్యాన్ని 8500కు పెంచండి!” అన్నాడు కమాండర్. ఇంజన్ విభాగంలోని సిలిండర్లు సంఘటితమై భారీ శబ్దం చేస్తున్నాయి: టా-టకటా-టకటా-టకటా-టాటకటా. పైలట్ సీటు దగ్గరున్న కిటీకీ అద్దంపై ఏర్పడిన మంచు వైపు తేరిపార చూసాడు కమాండర్. దగ్గరకు నడిచి అక్కడున్న క్లిష్టమైన అమరికలో ఉన్న మీటలను అటూయిటూ మార్చాడు. “ఎనిమిదవ నెంబర్ సహాయక ఇంజన్ ని కూడా ఆన్ చేయండి” అంటూ అరిచాడు. ఆ మాట అందుకుని, “ఎనిమిదవ నెంబర్ సహాయక ఇంజెన్ ని ఆన్ చేయండి” అంటూ తన వాళ్లవైపు చూసి అరిచాడు లెఫ్టెనెంట్ బెర్గ్. “మూడో నెంబర్ ఫిరంగిలో మందుగుండు పూర్తిగా నింపండి!” అరిచాడు కమాండర్. “మూడో నెంబర్ ఫిరంగిలో మందుగుండు పూర్తిగా నింపండి!” హైడ్రోప్లేన్ లోని ఎనిమిది ఇంజన్లు గట్టి శబ్దం చేస్తూ మొదలయ్యాయి. ప్లేన్ లోని వివిధ భాగాలను సిద్ధం చేస్తూన్న సిబ్బంది ఒకరి వైపొకరు చూసుకుని నవ్వుకున్నారు, “ఈ ముసలాడు ఎలాగోలా మనల్ని ఇక్కడ్నుంచి బయటపడేస్తాడు. అసాధ్యుడు. అసలు భయమన్నది ఏ కోశానా లేదు!” ఒకరితో ఒకరు అనుకున్నారు.

“చాలా స్పీడ్ గా వెళ్తున్నారు” అరిచింది మిట్టీ భార్య . “ఎందుకంత స్పీడు? అవతలేం మునిగిపోయిందని” అడిగింది.

“ఏంటీ?” అన్నాడు వాల్టర్ మిట్టీ. తన పక్క సీట్లో కూర్చుని ఉన్న తన భార్య వైపు ఆశ్చర్యంగా చూశాడు; నిర్ఘాంతపోయాడు. ఓ క్షణం అతనికేమీ అర్థం కాలేదు. గుంపులోనుంచి తోసుకొచ్చి అకారణంగా తన మీద అరిచి గోలచేసే వింత మహిళలా అనిపించిందామె. “యాభై ఐదులో వెళ్తున్నారు మీరు,” అందామె. “నలభై కిలోమీటర్ల స్పీడు కి మించి వెళ్లడం నాకిష్టముండదని మీకు తెలుసు కదా. యాభై ఐదులో ఉన్నారు మీరు.” వాల్టర్ మిట్టీ ఏమీ మాట్లాడలేదు. ఇరవై ఏళ్ల తన విమానయానపు అనుభవంలోకెల్లా అతి ఘోరమైన తుఫానులో దూసుకెళ్తున్న SN202 హైడ్రోప్లేన్ చప్పుళ్లు తన మదిలోనుంచి మెల్లగా జారుకుంటుండగా, నగరంలోని షాపింగ్ మాల్ వైపు మౌనంగా తన కారుని పోనిచ్చాడు. “మీకు మళ్లీ ఏదో అయ్యింది. ఎందుకలా బిగుసుకుపోతున్నారు?” అంది అతని భార్య. “చెప్తే వినరు. డాక్టర్ రెన్షా కి చూపించుకోండి ఒకసారి. ఎందుకైనా మంచిది.”

వాల్టర్ మిట్టీ కారు ని షాపింగ్ మాల్ ముందు ఆపాడు. “నేను హెయిర్ కటింగ్ చేసుకుని వచ్చే లోగా మీరెళ్లి మంచి బూట్లు కొనుక్కోండి,” అందామె కారులోనుంచి దిగడానికి సిద్ధమవుతూ. “నాకేమీ అవసరం లేదు,” అన్నాడు మిట్టీ. “మీతో వాదించే సమయం నాకు లేదు. అయినా మీరింకా వయసులో ఉన్నారనుకుంటున్నారేమో,” అంటూ అద్దంలో ఒకసారి తనని చూసుకుని కారు లోనుంచి దిగిందామె. ఆమె దిగగానే మిట్టీ కారు ని ముందుకు తియ్యడానికి సిద్ధమయ్యాడు. “మీ గ్లొవ్స్ ఏమైపోయాయి? ఈ చలిలో మీరు గొవ్స్ ఎందుకు వేసుకోవటం లేదు?” మిట్టీ మౌనంగా తన ప్యాంట్ జేబులోనుంచి గ్లొవ్స్ తీసుకుని చేతులకు వేసుకున్నాడు. ఆమె అలా షాపింగ్ మాల్ లోకి వెళ్లగానే కారుని ముందుకు పోనిచ్చాడు. కారు ఒక రెడ్ సిగ్నల్ దగ్గర ఆగగానే గ్లొవ్స్ తీసి వేసే ప్రయత్నం చేస్తుండగా ట్రాఫిక్ సిగ్నల్ రంగు మారింది. పక్కనే ఉన్న పోలీసు వాడు “బ్రదర్, కారు తీయండి,” అని హడావుడి చేయడంతో గ్లొవ్స్ వెనక్కి లాక్కుని అక్కడ్నుంచి బయల్దేరాడు. ఏ లక్ష్యం లేకుండా కాసేపు నగర వీధుల్లో చక్కర్లు కొట్టాడు మిట్టీ. కాసేపటికి హాస్పిటల్ పక్కన ఉన్న పార్కింగ్ స్థలం వైపు కి కారుని పోనిచ్చాడు.

“…వెలింగ్టన్ మెక్మిలాన్ అనీ ఒక కోటీశ్వరుడు,” అంది నర్స్. “అవునా?” అన్నాడు మిట్టీ, తన చేతికి ఉన్న గ్లొవ్స్ తీస్తూ. “ప్రస్తుతం కేస్ ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు?” అని అడిగాడు. “డాక్టర్ రెన్షా మరియు డాక్టర్ బెన్‍బో. వాళ్లతోపాటు ఇద్దరు స్పెషలిష్ట్ లు కూడా ఉన్నారు; డాక్టర్ రెమింగ్టన్ న్యూయార్క్ నుంచి వచ్చారు. డాక్టర్ పిచర్డ్ మిట్‌ఫోర్డ్ లండన్ నుంచి ఈ కేసు కోసం ప్రత్యేకంగా వచ్చారు.” నర్స్ తో పాటు మిట్టీ కారిడార్ లో నడుస్తుండగా ఒక గది తలుపు తెరుచుకుని డాక్టర్ రెన్షా బయటకు వచ్చాడు. అతని మొహంలో తీవ్రమైన అలసట, ఆందోళన కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. “హలో మిట్టీ. నీకు మెక్మిలాన్ తెలుసు కదా! అదే కోటీశ్వరుడు; రూజ్‌వెల్ట్ కి మంచి స్నేహితుడు కూడా! అతని కేసు మా చావుకొచ్చింది… క్లోమ వాయువులు కాలేయంలోకి పాకడంతో పరిస్థితి విషమించింది. మీరొక సారి చూడగలిగితే…” అన్నాడతను. “తప్పకుండా,” అన్నాడు మిట్టీ.

Posted in 2014, అనువాదం, జనవరి, సినిమా వెనుక కథలు and tagged , , , , , .

One Comment

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.