metamorphosis 2

రూపాంతరం [1]

Download PDF   ePub   MOBI

కాఫ్కా “మెటమార్ఫసిస్” ఈ తెలుగు అనువాదం వారం వారం ధారావాహికంగా ఇస్తున్నాం. ఇది మొదటి భాగం.  మొదట్నుంచి చివరిదాకా ఒకే ఇంటిలో జరిగే ఈ రచనను సరిగ్గా ఆస్వాదించటానికి, ఆ ఇంటి అమరిక తెలియటం కూడా ముఖ్యమని నా భావన. అందుకే, ఆ ప్లాను ఇక్కడ ఇచ్చాను.  – మెహెర్ 

1

గ్రెగర్ జమ్జా ఒక ఉదయం కలత కలల్నించి నిద్ర లేచే సరికి, మంచంపై తానో ఒక పెద్ద కీటకంగా మారిపోయి ఉన్నాడని గమనించాడు. అతను గట్టిగా పెంకు లాగా ఉన్న వీపు మీద పడుకుని ఉన్నాడు, తల కొంచెం పైకెత్తి చూస్తే ఉబ్బెత్తుగా బ్రౌన్ రంగులో ఉంది పొట్ట, దాన్ని అడ్డంగా విడదీస్తూ బిరుసైన చాపాలుగా వంగిన పలకలు ఉన్నాయి, పొట్ట మీద దుప్పటి నిలకడగా నిలవలేక ఏ క్షణానైనా జారిపోయేట్టుంది. ఈ శరీరపు భారీతనం పోలిస్తే చాలా బక్కగా ఉన్న కాళ్ళు బోలెడన్ని అతని కళ్ళ ముందు నిస్సహాయంగా కదులుతున్నాయి.

‘ఏమయింది నాకు?’ అనుకున్నాడు. ఇది కలైతే కాదు. అతని గది, మనుషులుండే మామూలు గది, బహుశా కాస్త చిన్నది, చిరపరిచితమైన నాలుగు గోడల మధ్యా స్తబ్ధుగా ఉంది. బల్ల మీద కొన్ని దుస్తుల శాంపిళ్లు విప్పి పడేసి ఉన్నాయి – జమ్జా ఒక ట్రావెలింగ్ సేల్స్‌మెన్ – బల్ల పైనున్న గోడ మీద అతను ఈమధ్యే ఒక పత్రికలోంచి కత్తిరించి అందమైన గిల్టు ఫ్రేములో బిగించి పెట్టుకున్న బొమ్మ ఒకటి వేలాడుతోంది. అందులో ఒక అమ్మాయి ఉన్ని టోపీ పెట్టుకుని, ఉన్ని శాలువా వేసుకుని, నిటారుగా కూర్చుంది, ముంజేతిని పూర్తిగా కప్పేసిన ఉన్ని చేతొడుగును చూపరుల వైపు చాపుతోంది.

తర్వాత గ్రెగర్ కిటికీ వైపు చూశాడు, బయట వాతావరణం మబ్బుగా ఉంది – కిటికీ చువ్వల మీద వాన చినుకుల చప్పుడు వినిపిస్తోంది – అతనికి దిగులుగా అనిపించింది. ‘ఇంకాసేపు నిద్రపోతే ఈ గోలంతా మర్చిపోవచ్చు,’ అనుకున్నాడు, కానీ అది అంత సులువు కాదని వెంటనే అర్థమైంది, అతనికేమో కుడి వైపుకు ఒత్తిగిలి పడుకోవటం అలవాటు, ఇప్పుడున్న స్థితిలో అది కుదరటం లేదు. ఎంత బలంగా అటు వైపు ఊగినా, తిరిగి మళ్ళీ తన వీపు మీదకే వచ్చి పడుతున్నాడు. అలా ఓ వంద సార్లయినా ప్రయత్నించి ఉంటాడు, కలవరంగా అల్లల్లాడుతున్న తన కాళ్ళను చూడలేక కళ్ళు కూడా మూసుకున్నాడు, చివరికి తన పక్క భాగంలోంచి సన్నగా ఇదివరకెన్నడూ లేని ఓ నొప్పి మొదలవటంతో ఇక ఆ ప్రయత్నం మానుకున్నాడు.

‘దేవుడా! ఈ గొడ్డు చాకిరీ ఉద్యోగాన్ని ఎందుకు ఎన్నుకున్నానో నేను! పొడిచిన పొద్దు గుంకే దాకా ప్రయాణాలతోనే సరిపోతోంది. ఆఫీసులో ఒక చోట నిలకడగా కూర్చుని చేసే పనితో పోలిస్తే, అసలే ఇందులోRupantaram Stamp ఉద్యోగపరమైన ఒత్తిళ్ళు చాలా ఎక్కువ. అవి చాలవన్నట్టు, ఈ ప్రయాణాల అలసట, రైళ్ళు అందుతాయో లేదోననే గాభరా, వేళా పాళా లేని చెత్త తిండి, చిరకాలం మిగిలే దగ్గరి స్నేహాలకు అవకాశం లేకుండా ఎప్పటికీ పరిచయమాత్రంగానే మిగిలిపోయే ఎడతెగని ముఖాల ప్రవాహం… గంగలో కలవనీ ఇదంతా!’ అతనికి పొట్ట మీద చిన్న దురద మొదలైంది; తన్ను తాను నెమ్మదిగా మంచం పై భాగానికి లాక్కున్నాడు, అలాగైతే తల కాస్త పైకెత్తి చూసే వీలుంది; అతనికి దురద పెడుతున్న చోటు కనిపించింది, అక్కడ తెల్లని చుక్కల్లాంటి మచ్చలు గుంపుగా ఉన్నాయి, అవేమిటో అతనికి అర్థం కాలేదు; పరీక్షిద్దామని ఒక కాలు అక్కడ తగిలించాడు గానీ ఆ స్పర్శకు వళ్లంతా జివ్వుమనటంతో చప్పున వెనక్కు లాక్కున్నాడు.

మళ్ళీ యథాస్థానానికి జారిపోయాడు. ‘మరీ పెందలాడే లేస్తే ఒక్కోసారి ఇలాంటి పిచ్చి భ్రమలే కలుగుతాయి,’ అనుకున్నాడు, ‘ఏ మనిషికైనా సరిపడా నిద్ర అవసరం. మిగతా సేల్స్‌మెన్స్ అంతా జనానాలో ఆడవాళ్ళలా సుఖంగా ఉంటారు. మొన్నటికి మొన్న, పొద్దున్నే నేను కలెక్ట్ చేసిన ఆర్డర్లు రాద్దామని హోటల్‌కి వెళ్ళేసరికి, ఆ దొరగార్లందరూ ఇంకా టిఫిన్లు తినటంలోనే ఉన్నారు. అదే నేను గనక అలా చేస్తే మా యజమాని వెంటనే నన్ను ఉద్యోగంలోంచి పీకి పారేస్తాడు. ఏమో ఎవరు చెప్పొచ్చారు, అలా జరగటమే మంచిదేమో. నా తల్లిదండ్రుల గురించి ఆలోచించి వెనక్కు తగ్గాల్సి వస్తోంది గానీ, లేకపోతే ఎప్పుడో రాజీనామా ఇచ్చేసేవాణ్ణి, తిన్నగా లోపలికి దూసుకుపోయి మా యజమాని ముందు నిలబడి అతని గురించి నేనేమనుకుంటున్నానో నిర్మొహమాటంగా చెప్పేసేవాణ్ణి, దెబ్బకి డెస్కు మీంచి జారి పడేవాడు! అయినా అదేం పద్ధతో, అలా డెస్కు మీద ఎత్తుగా కూర్చుని ఉద్యోగులతో కిందికి చూస్తూ మాట్లాడటం, పైగా అతనికి చెవుడు కావటంతో దగ్గరగా మాట్లాడితే తప్ప వినపడదు కూడానూ. ఏదో ఒకటిలే, నాకు మాత్రం ఇంకా ఆశ చావలేదు; అతనికి నా తల్లిదండ్రులు చెల్లించాల్సిన బాకీ మొత్తం తీర్చేశాకా (దానికి ఒక ఐదారేళ్ళు పట్టొచ్చు) అప్పుడిక నేననుకున్నట్టే చేస్తాను. ఈ చాకిరీ నుంచి పూర్తిగా బయటపడతాను. అదంతా తర్వాత గానీ, ప్రస్తుతానికి, నేను ఇక లేవటం మంచిది, నా రైలు ఐదింటికి బయల్దేరిపోతుంది.’

అతను పక్కన సొరుగులబల్ల మీద టిక్ టిక్ మంటున్న అలారం వైపు చూశాడు. ‘అరె!’ అనుకున్నాడు. అప్పుడే ఆరున్నర దాటిపోయింది, అలారం ముళ్ళు ముందుకు కదుల్తూనే ఉన్నాయి, పావు తక్కువ ఏడు అవటానికి ఇంకెంతో సేపు పట్టదు. అలారం మోగలేదా? మంచం మీంచి చూట్టానికైతే అది నాలుగు గంటలకు సరిగ్గానే పెట్టి ఉంది; చెవులు చిల్లులు పడే ఆ మోతకి ఎవరన్నా ప్రశాంతంగా పడుకోగలరా? మరి, తను మాత్రం ప్రశాంతం కన్నా కూడా గాఢంగా నిద్రపోయాడు. ఇపుడేం చేయాలి? తర్వాతి రైలు ఏడింటికి ఉంది; పిచ్చెత్తినట్టు పరిగెడితే తప్ప దాన్నందుకోలేడు, పైగా అతని శాంపిళ్ళన్నీ ఇంకా సర్దకుండా ఎక్కడివక్కడే పడి ఉన్నాయి; అతనికి వంట్లో ఏమంత చురుగ్గా కూడా అనిపించటం లేదు. ఒకవేళ ఆ రైలు అందుకోగలిగినా, యజమానితో చీవాట్లు ఎలాగూ తప్పవు, ఎందుకంటే ఇప్పటికే ఐదింటి రైలు దగ్గర కూలీ ఎదురు చూసి చూసి వెళ్ళిపోయుంటాడు, బహుశా ఈపాటికే నేను రాలేదన్న విషయం చేరవేస్సి ఉంటాడు. అసలే వాడు యజమానికి ఒక చెంచా లాంటి వాడు, వెన్నెముక లేని మూర్ఖుడు. తనకు ఒంట్లో బాగా లేదని చెప్తే? కానీ అదేమంత నమ్మశక్యంగా ఉండదే. గ్రెగర్ తన ఐదేళ్ళ ఉద్యోగ జీవితంలో ఎన్నడూ సెలవు పెట్టి ఎరుగడు. యజమాని తప్పకుండా ఆరోగ్య బీమా వైద్యుణ్ణి వెంటబెట్టుకుని వచ్చేస్తాడు, అప్పుడిక తన సోమరితనానికి తల్లిదండ్రులు మాట పడాల్సి వస్తుంది, సంజాయిషీ ఏమన్నా చెపుదామన్నా యజమాని వినే రకం కాదు, బీమా వైద్యుణ్ణి చూపించి తన నోరు మూయిస్తాడు, ఆ బీమా వాడి దృష్టిలోనేమో ప్రపంచం అంతా ఆరోగ్యంగా ఉండి కూడా పని ఎగ్గొట్టే మనుషుల్తో కిక్కిరిసిపోయి ఉంటుంది. నిజానికి తన విషయంలో ఆ వైద్యుడి అభిప్రాయం తప్పేమీ కాదు కూడా? కాస్త నిద్రమత్తు తప్పిస్తే (అది కూడా ఇంత నిద్ర తర్వాత అర్థరహితమే) గ్రెగర్ బానే ఉన్నాడు, చాలా ఆకలిగా కూడా ఉంది.

మంచం మీంచి దిగేందుకు ఇంకా మనస్కరించక, అతను వేగంగా ఇదంతా ఆలోచిస్తుండగా – అలారం ఇక పావుతక్కువ ఏడును చూపించబోతోందనగా – తలగడ వైపున్న తలుపు దగ్గర, సంకోచంగా తడుతున్న చప్పుడు వినపడింది. ‘గ్రెగర్,’ అంది ఓ గొంతు – అది అతని తల్లి గొంతు – ‘పావుతక్కువ ఏడయిపోయిందిరా. రైలు అందుకోవా?’ ఎంత మార్దవమైన గొంతు! గ్రెగర్ దానికి బదులివ్వబోయిన వాడల్లా, తన గొంతు విని తానే తుళ్ళిపడ్డాడు; అది అవటానికి తన గొంతే కానీ, దాంతో పాటూ, అట్టడుగునుంచి, ఏదో కీచుమనే శబ్దం పెల్లుబుకుతోంది; దాని వల్ల అతని మాటలు క్షణం పాటు మాత్రమే స్పష్టంగా వినపడుతున్నాయి, మరుక్షణం ఎంతగా కలుషితమైపోతున్నాయంటే, అవతలి వాళ్ళకు తాము వింటున్నది అసలు మాటలేనా అన్న సందేహం కలిగి తీరుతుంది. గ్రెగర్ వివరంగా జవాబిద్దామనుకున్న వాడల్లా, ఇక చేసేది లేక, ‘ఇప్పుడే లేస్తున్నా అమ్మా,’ అని మాత్రం అనగలిగాడు. మధ్యలో చెక్క తలుపు వుండటం వల్ల గ్రెగర్ గొంతులోని మార్పు బయటికి తెలిసినట్టు లేదు, తల్లి ఈ మాటలకు సంతృప్తి చెంది వెళ్ళిపోయింది. కానీ ఈ క్లుప్త సంభాషణ కారణంగా ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ, తాము అనుకున్నట్టు గ్రెగర్ ఇంకా ఆఫీసుకు బయల్దేరలేదనీ, ఇంట్లోనే ఉన్నాడనీ అర్థమైంది, దాంతో అతని తండ్రి పక్కనున్న తలుపుల్లో ఒక దాన్ని నెమ్మదిగానే కానీ, పిడికిలితో తట్టసాగాడు. ‘గ్రెగర్, గ్రెగర్, ఏమైంది నీకు?’ అన్నాడు. కాసేపాగి, ఇంకాస్త కటువైన గొంతుతో, ‘గ్రెగర్! గ్రెగర్!’ అని మళ్ళీ పిలిచాడు. ఈలోగా రెండో పక్క తలుపు నుంచి అతని చెల్లాయి గొంతు మృదువుగా, జాలిగా వినిపించింది: ‘గ్రెగర్? వంట్లో బాలేదా? ఏమైనా కావాలా?’ అందామె. గ్రెగర్ ఇరు వైపులకూ ఒకేసారి, ‘నేను వస్తున్నాను,’ అంటూ జవాబిచ్చాడు, తన గొంతును మామూలుగా ధ్వనింపజేసేందుకు చాలా ప్రయాసతో ప్రతీ పదాన్నీ పట్టి పట్టి పలుకుతూ, పదాల మధ్య పెద్ద విరామాలిస్తూ మాట్లాడాడు. తండ్రి తిరిగి తన టిఫిన్ దగ్గరకు వెళ్ళిపోయాడు, చెల్లాయి మాత్రం గుస గుసగా, ‘తలుపు తీయి, గ్రెగర్, దయచేసి,’ అంది. కానీ గ్రెగర్‌కు ఆ ఉద్దేశం లేదు, అలా తలుపులు మూసి పడుకునే తన అలవాటును అభినందించుకున్నాడు కూడా, ట్రావెలింగ్ సేల్స్‌మెన్‌గా రాత్రుళ్ళు తలుపులన్నీ బిడాయించుకు పడుకోవటం అలవాటైంది, ఆఖరుకు అది తన ఇల్లయినా సరే.

మొదట నింపాదిగా లేవాలి, డ్రెస్ చేసుకోవాలి, అన్నింటికన్నా ముఖ్యంగా టిఫిన్ చేయాలి; అప్పుడు తర్వాతి సంగతి ఆలోచించాలి, అంతే తప్ప, ఊరకనే ఇలా మంచం మీద పడుకుని ఆలోచించటం వల్ల ప్రయోజనమేం లేదు. అతనికో సంగతి గుర్తొచ్చింది, ఇదివరకూ కూడా చాలాసార్లు నిద్రలో ఏదో ఇబ్బందిగా అనిపించేది, తీరా లేచి చూసేసరికి అదంతా సరైన భంగిమలో పడుకోకపోవటం వల్ల కలిగిన భ్రమగా తేలేది, పొద్దున్నే చుట్టుముట్టిన ఈ భ్రమలన్నీ క్రమంగా ఎలా తొలిగిపోనున్నాయో చూడాలని అతనికి చాలా కోరికగా ఉంది. ఇక తన గొంతులో వచ్చిన మార్పు బహుశా జలుబు చేస్తుందనటానికి ఒక సూచన మాత్రమే, అది ట్రావెలింగ్ సేల్స్‌మెన్లందరికీ ఎదురయ్యే ఇబ్బందే.

Posted in 2014, జనవరి, రూపాంతరం, సీరియల్ and tagged , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.