Ernest_Hemingway_1950

సాహితీ ముచ్చట్లు

Download PDF   ePub   MOBI
(ఈ శీర్షికన రచయితలకు సంబంధించిన ఆసక్తికరమైన అనెక్‌డోట్స్ ను పంచుకుందామని. మీకు గుర్తున్నవి కూడా రాసి పంపించండి.)

ఆరు పదాల కథ

9463262061_e3435c317c_c

హెమింగ్వే గురించి ప్రచారంలో ఉన్న పిట్టకథల్లో ఇది ఒకటి. ఆయన ఒకసారి తోటి రచయితలతో కలిసి రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్నాడు. మాటల సందర్భంలో తాను కేవలం ఆరు పదాల్లో కథ రాయగలనన్నాడు. మిత్రులంతా అసాధ్యం అన్నారు. అయితే పందెం కాయమన్నాడు. ఒక్కొక్కరూ పదేసి డాలర్లు తీసి టేబిల్ మీద పెట్టారు. హెమింగ్వే అక్కడున్న పేపర్ నాప్‌కిన్ మీద ఇలా రాశాడు:  For sale: baby shoes, never worn (అమ్మకానికి: పసిబిడ్డ బూట్లు, ఇప్పటి దాకా వాడనివి). అది మిత్రులకు ఇచ్చాడు. వాళ్లు ఆశ్చర్యపోతుండగానే, పందెం డబ్బును లాక్కున్నాడు. ఇంతకీ ఏంటి ఈ కథకు అర్థం? చాలా చెప్పుకోవచ్చు. కానీ ఆ అమ్మాయికి అబార్షన్ అయి ఉంటుందనుకుంటేనే… ఈ ఆరు పదాల వెనకా తచ్చాడే సున్నితమైన విషాదానికి జస్టిఫికేషన్ ఉంటుంది.

 

కుళ్లు అలవాట్లు

ddddరచయితలకు చిత్రమైన వర్కింగ్ హేబిట్స్ ఉంటాయి. కొన్ని మూఢనమ్మకాల్లా కనిపిస్తాయేమో కూడా. హెమింగ్వే రాయటం మొదలెట్టే ముందు పెన్సిళ్లకు చెక్కు తీసేవాడట. ఎడ్గార్ అలెన్‌పో తన పెంపుడు పిల్లి చుట్టుపక్కల ఉంటేనే రాయగలిగేవాడట. ఇలాంటివాటికన్నా చిత్రమైంది ప్రసిద్ధ జర్మన్ రచయిత ఫ్రెడరిక్ షిల్లర్ (Schiller) కున్న అలవాటు. దీని గురించి బయటి ప్రపంచానికి చెప్పింది కూడా గెథె (Goethe) అనే మరో ప్రసిద్ధ రచయితే. షిల్లర్ మరణానంతరం తన ఇంటర్వ్యూ తీసుకోవటానికి వచ్చిన ఒక బయోగ్రాఫర్‌కి ఈ విషయం వెల్లడించాడు గెథె. ఒకసారి గెథె తన మిత్రుడైన షిల్లర్ ఇంటికి వెళ్లాడు. అప్పుడు షిల్లర్ ఇంట్లో లేడు. ఎదురుచూడాల్సిన సమయాన్ని మాత్రం వృథాగా ఎందుకుపోనివ్వాలని, గెథె ఏవో నోట్సు రాసుకోవటానికి షిల్లర్ రాతబల్ల దగ్గరకు వెళ్లి కూర్చున్నాడు. కూర్చోగానే ఆయన ముక్కుపుటాల్ని ఏదో ఘాటైన వాసన ఉక్కిరిబిక్కిరి చేసింది. ముక్కును ఆరాగా అన్ని వైపులా ఎక్కుపెట్టి చివరకు ఆ వాసన జన్మస్థానం ఎక్కడో కనుక్కోగలిగాడు. అది ఎక్కణ్ణుంచో కాదు, షిల్లర్ రాతబల్ల సొరుగు నుంచే వస్తుంది. గెథె తెరిచి చూస్తే, అందులో కొన్ని కుళ్లిపోయిన ఆపిల్ పళ్లున్నాయి. తర్వాత షిల్లర్ భార్య ద్వారా తెలిసిందేమిటంటే, షిల్లర్‌కు ఆ వాసన ప్రేరణగా పని చేసేదట, అది లేకపోతే రాత సరిగా సాగేది కాదట.

షిల్లర్ అలవాట్లలో చిత్రమైన విభాగంలో చేరేది ఇదొక్కటే కాదు. ఆయనకి రాసుకుంటున్నపుడు ఎవరైనా అతిథులొస్తే వళ్లు మండేది. ఇలాంటి అంతరాయాన్ని నివారించటానికి రాత్రుళ్ళు అందరూ పడుకున్నప్పుడే రాసుకునేవాడు. నిద్రమత్తు నివారించటానికి స్ట్రాంగ్ కాఫీ పుచ్చుకునేవాడు, మరీ కళ్లు మూతలు పడిపోతుంటే రాతబల్ల కింద ఒక పాత్రలో చల్లటి నీళ్లు పెట్టి అందులో కాళ్ళు ముంచేవాడు.

 భ్రద్రత vs సృజనాత్మకత

SherwoodAnderson

షెర్‌వుడ్ ఆండర్సన్ ప్రముఖ అమెరికన్ నవలా రచయిత. ఆయన మొదటి ప్రచురణకర్తలు ఆయనలోని ప్రతిభను గుర్తించి, ఆర్థిక బాధలు లేకుంటే మరింత బాగా రాస్తాడని భావించి, వారం వారం చెక్‌ల రూపంలో డబ్బు పంపించేవారు. కొన్ని వారాల తర్వాత ఆయన తనకు అందిన కొత్త చెక్‌ను పట్టుకుని ప్రచురణ కార్యాలయానికి వచ్చాడు. దాన్ని తిరిగి ఇచ్చేస్తూ అన్నాడు: ‘మరీ ఇంత భద్రమైన జీవితం నా ముఖం వైపు తొంగి చూస్తోంటే నేను రాయలేకపోతున్నాను’.

వాస్తవకల్పితాలు

Honore-de-Balzac

ఫ్రెంచి రచయిత బాల్జాక్ మృత్యుశయ్య మీద రేపో మాపో అన్న క్షణాల్లో ఉన్నప్పటి సంగతి. ఆయన్ను చూస్తున్న డాక్టరు కూడా ఇక ఏం లాభం లేదనేశాడు. అప్పుడాయన, ‘మీ వల్ల కాకపోతే బియాంచన్‌ని పిలుచుకురండి’ అని చెప్పాడట.  డాక్టర్ బియాంచన్ అంటే బాల్జాక్ రాసిన ప్రసిద్ధ నవల ‘హ్యూమన్ కామెడీ’లో ఒక పాత్ర.

సాహితీ ముచ్చట్లు Download PDF     సాహితీ ముచ్చట్లు Download ePub     సాహితీ ముచ్చట్లు Download MOBI
Posted in 2013, డిసెంబరు, సాహితీ ముచ్చట్లు and tagged , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.