metamorphosis 2

రూపాంతరం [2]

Download PDF   ePub   MOBI

కాఫ్కా “మెటమార్ఫసిస్” ఈ తెలుగు అనువాదం వారం వారం ధారావాహికంగా ఇస్తున్నాం. ఇది రెండవ భాగం. మొదట్నుంచి చివరి దాకా ఒకే ఇంటిలో జరిగే ఈ రచనను సరిగ్గా ఆస్వాదించటానికి, ఆ ఇంటి అమరిక తెలియటం కూడా ముఖ్యమని నా భావన. అందుకే, ఆ ప్లాను ఇక్కడ ఇచ్చాను.  – మెహెర్

దీని ముందు భాగం

గ్రెగర్ ఆ గదిలోకి వెంటనే రాలేదు, తలుపు రెండో రెక్క గట్టిగా బోల్టు వేసి ఉంటే దానికి ఆనుకున్నాడు, ఇప్పుడు అతని శరీరం అర్ధభాగం మాత్రమే కనపడుతోంది, పైన తల ఒక వైపుకు వాలి ఉంది, దానితో అందరి వైపూ ఓరగా తొంగి చూస్తున్నాడు. బయట వాతావరణంలో ఇప్పుడు కాస్త వెలుగొచ్చినట్టుంది; వీధవతల ఒక పొడవాటి బూడిద రంగు భవనంలో కొంత భాగం కనిపిస్తోంది – అది ఒక ఆసుపత్రి – దానికి వరుస కిటికీలున్నాయి; వాన ఇంకా పడుతూనే ఉంది, ఇందాకటి కన్నా పెద్ద చినుకుల్తో పడుతోంది, చూట్టానికి ఎవరో ఒక్కొక్క చినుకునూ పట్టుకుని భూమ్మీదకు గిరవాటేస్తున్నట్టున్నాయి. టేబిల్ మీద టిఫిన్ దండిగా వడ్డించి ఉంది, తండ్రికి రోజులో టిఫినే ప్రధాన ఆహారం, కాబట్టి గంటల కొద్దీ దాని ముందు కూర్చుని అన్ని న్యూస్ పేపర్లూ చదువుతూ నెమ్మదిగా తింటాడు. ఎదుట గోడకి ఒక ఫోటో వేలాడుతోంది, అది గ్రెగర్ సైన్యంలో పని చేసినప్పటిది, అందులో అతను లెఫ్టినెంట్ హోదాలో, కత్తి పిడిపై చేయి వేసి, లెక్కలేనట్టు నవ్వుతూ, తన యూనిఫాంకూ, సైనిక ఠీవికీ దక్కాల్సిన గౌరవాన్ని తనకిమ్మన్నట్టు నిల్చున్నాడు. హాల్లోకి వెళ్ళే తలుపు తెరిచి ఉంది, ఫ్రంట్ డోరు కూడా తెరిచే ఉండటంతో, ఇక్కణ్ణించే బయట లాండింగూ, మెట్ల పైభాగమూ కనపడుతున్నాయి.

గ్రెగర్ నోరు విప్పాడు – అతనికి తెలుసు ప్రస్తుతం అక్కడ నిబ్బరంగా ఉన్నది తానొక్కడే అని – ‘సరేనా, నేను ఇప్పుడే రెడీ అయి, నా శాంపిల్సు తీసుకుని Rupantaram Stampబయల్దేరిపోతాను. మీరు నన్నిక వదులుతారా? నేనేం మరీ అంత మొండిఘటాన్ని కాదనీ, నాకు నా పని అంటే చాలా ఇష్టమనీ మీకూ తెలుసు కదా సార్; రోజూ ప్రయాణాలు తప్పని ఈ ఉద్యోగం కాస్త కష్టమే, కానీ అది లేకుండా నన్ను నేను ఊహించుకోలేను. ఎక్కడికి సార్ వెళ్తున్నారు? మళ్ళీ ఆఫీసుకు వెళ్తున్నారా? అంతే కదూ? ఇక్కడ పరిస్థితి ఉన్నదున్నట్టు చెప్తారు కదూ? ఒక వ్యక్తి తాత్కాలికంగా పని చేయలేని పరిస్థితిలో పడినంత మాత్రాన, అతను ఇదివరకూ ఎంత పనిమంతుడో మర్చిపోకూడదు కదా, ఆ కష్టమేదో దాటిపోయాకా అతను అంతకుముందు కన్నా చలాకీగా చురుకుగా పని చేసి తీరతాడని నమ్మకపోతే ఎలా. మన ఆఫీసు యజమానికి నేను చాలా బాకీ ఉన్నానని మీకూ తెలుసు. మరోపక్క నాకు నా తల్లిదండ్రుల పట్లా, చెల్లాయి పట్లా నెరవేర్చాల్సిన బాధ్యతలున్నాయి. నేను చాలా ఇరకాటంలో ఉన్నాను, కానీ ఎలాగోలా బయటపడతానన్న ఆశ ఉంది. ఈలోగా మీరు పరిస్థితుల్ని మరింత కనాకష్టం చేయొద్దు. దయచేసి ఆఫీసులో నా తరపున మాట్లాడండి! ట్రావెలింగ్ సేల్స్‌మెన్లంటే ఎవరికీ సానుభూతి ఉండదు, నాకు తెలుసు. వాళ్ళేదో మూటల కొద్దీ డబ్బు కూడబెట్టి విలాసంగా బతుకుతారని అంతా అనుకుంటారు. ఈ తప్పుడు అభిప్రాయాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఎవరికీ లేకపోవటంతో అదలా చెల్లుబాటైపోతోంది. కానీ మిగతా సిబ్బంది మాట ఎలా ఉన్నా, మీకు ఈ విషయాలపై మంచి అవగాహన ఉంది, నిజానికి – మనలో మన మాటగా చెప్తున్నాను – మన యజమాని కన్నా మంచి అవగాహన ఉంది, ఆయన ఎంత లేదన్నా యజమాని కాబట్టి, తన ఉద్యోగుల్లో కొందరి పట్ల తప్పుడు అభిప్రాయమున్నా చెల్లిపోతుంది. మీరుమాత్రం అలాక్కాదు, మీకు అంతా తెలుసు, ట్రావెలింగ్ సేల్స్‌మెన్ ఏడాది పొడుగునా ఆఫీసు ఆవరణలో లేకుండా బయటే తిరుగుతుంటాడు గనుక, కిట్టనివాళ్ళు అతనిపై నిరాధారమైన ఫిర్యాదులు చేయటం, అపనిందలు మోపటం చాలా సులువు, అతను వాటిని అరికట్టలేడు, ఎందుకంటే చాలా వరకూ అవి ఉన్నాయన్న సంగతే అతనికి తెలియదు, ఎప్పుడో ఏదో ప్రయాణాన్ని ముగించుకుని అలసటగా తిరిగి వచ్చాకనే వాటి పర్యవసానాలు అతనికి ఎదురవుతాయి, ఇక అప్పటికి అవి ఎక్కణ్ణించి పుట్టుకొచ్చాయో తెలుసుకోవాలన్నా తెలుసుకోలేడు. సార్, అలా వెళ్ళిపోకండి, నా మాటల్లో కొంతైనా నిజం ఉందని మీరు నమ్ముతున్నారని ఏదో ఒక మాట ద్వారా చెప్పకుండా దయచేసి అలా వెళ్ళిపోకండి!’

కానీ గ్రెగర్ మాట్లాడటం మొదలుపెట్టాడో లేదో పెద్దగుమాస్తా వీపు చూపిస్తూ అటు తిరిగిపోయాడు, నోరు బార్లా తెరిచి, వణుకుతున్న భుజాల మీదుగా గ్రెగర్ వైపు అలాగే చూస్తూండిపోయాడు. గ్రెగర్ మాట్లాడుతున్నంత సేపూ అతను స్థిరంగా లేడు, గ్రెగర్ మీంచి కళ్ళు తప్పిపోనివ్వకుండా తలుపు వైపు వెళ్ళటం మొదలుపెట్టాడు, కానీ, తాను ఈ గది వదిలి వెళ్ళటం ద్వారా ఏవో అదృశ్య ఆదేశాల్ని ధిక్కరిస్తున్నట్టు, చాలా నెమ్మదిగా వెళ్ళాడు. గడప దాకా చేరుకున్నాక, ఏదో ముల్లు దిగినవాడిలా చప్పున కాలెత్తి లివింగ్ రూము నుంచి హాల్లోకి అడుగుపెట్టాడు. ఒకసారి హాల్లోకి చేరుకోగానే, బయట అలౌకిక మోక్షమేదో తనకు అందుబాటులో ఉన్నట్టుగా, చేతుల్ని సాగినంట దూరం మెట్ల వైపు చాపాడు.

Posted in 2014, జనవరి, రూపాంతరం, సీరియల్ and tagged , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.