metamorphosis 2

రూపాంతరం [3]

Download PDF   ePub   MOBI

కాఫ్కా “మెటమార్ఫసిస్” ఈ తెలుగు అనువాదం వారం వారం ధారావాహికంగా ఇస్తున్నాం. ఇది మూడవ భాగం. మొదట్నుంచి చివరి దాకా ఒకే ఇంటిలో జరిగే ఈ రచనను సరిగ్గా ఆస్వాదించటానికి, ఆ ఇంటి అమరిక తెలియటం కూడా ముఖ్యమని నా భావన. అందుకే, ఆ ప్లాను ఇక్కడ ఇచ్చాను.  – మెహెర్

దీని ముందు భాగం

గ్రెగర్‌భోజనం ప్రతి రోజూ ఇదే పద్ధతిలో అయ్యేది, తల్లిదండ్రులూ పనమ్మాయీ ఇంకా నిద్రలేవకముందే ఒకసారీ, కుటుంబమంతా మధ్యాహ్న భోజనం చేశాకా మరొకసారీ వడ్డించబడేది, మధ్యాహ్న భోజనం కాగానే తల్లిదండ్రులిద్దరూ కాసేపు కునుకు తీసేవారు, పనమ్మాయిని చెల్లాయి ఏదో ఒక పని మీద బయటకు పంపించేది. అతను తిండికి మాడకూడదని ఆమెకి ఎంత ఉందో ఆమె తల్లిదండ్రులకూ అంతే ఉంటుందనటంలో సందేహమేం లేదు, కానీ ఆ ఏర్పాట్ల గురించి ప్రత్యక్షంగా తెలుసుకునేంత ధైర్యం వారికి లేదేమో, లేదా అసలే బాధలో ఉన్న వాళ్ళని మరింత బాధ పెట్టకూడదన్న ఉద్దేశంతో అతని చెల్లే వాళ్ళను ఈ బాధ్యత నుంచి మినహాయించిందో.

ఆ మొదటి రోజు ఇంటికి పిలుచుకువచ్చిన వైద్యుణ్ణీ, తాళాలు పగలగొట్టేవాణ్ణి, తిరిగి ఏ సాకు చెప్పి వెనక్కు పంపించారో గ్రెగర్‌ తెలుసుకోలేకపోయాడు; అతను మాట్లాడేది ఇతరులకు అర్థం కావట్లేదు సరే, కానీ తమ మాటలైనా అతనికి అర్థం కావచ్చేమో అన్న అనుమానం వాళ్ళలో ఎవరికీ రాలేదు, చెల్లాయితో సహా; అందుకే అతని గదిలో ఉన్నపుడు ఆమె అడపాదడపా నిట్టూర్పులు విడవటమో, దేవుళ్ళకు మొర పెట్టుకోవడమో చేసేదే తప్ప, అంతకుమించి ఏమీ మాట్లాడేది కాదు. కానీ రోజులు గడిచి ఈ పరిస్థితికి అలవాటుపడే కొద్దీ ఆమె నోరు విప్పటం ప్రారంభించింది, ఆ మాటల్లో జాలి ఉండేది, కనీసం ఉండేదని అనుకోవచ్చు. తాను పెట్టిన పదార్థాలన్నింటినీ గ్రెగర్ ఖాళీ చేసినపుడు, ‘ఇవాళ బాగా తిన్నాడు,’ అనేది, దానికి విరుద్ధంగా జరిగినపుడు (రాన్రానూ అలా జరగటం ఎక్కువైంది), ఆమె చాలా బాధగా: ‘మళ్ళీ ఇవాళ అంతా వదిలేశాడు,’ అనేది.

 గ్రెగర్‌కి ఏ వార్తా సూటిగా తెలిసేది కాదు, పక్క గదుల నుంచి కొంత విని తెలుసుకునేవాడు, చిన్నగా ఏ గొంతు వినపడినా, అతను వెంటనే అటువైపున్న తలుపు దగ్గరకు వెళ్ళి తన శరీరం మొత్తాన్ని దానికి అదిమిపెట్టిRupantaram Stamp శ్రద్ధగా వినేవాడు. తొలి రోజుల్లో అతని ప్రస్తావన పరోక్షంగానైనా లేకుండా ఏ సంభాషణా పూర్తయ్యేది కాదు. ఒక రెండ్రోజులైతే భోజనాలైనప్పుడల్లా గ్రెగర్‌ని ఏం చేయాలన్న విషయమై చర్చలు సాగేవి; భోజనాలయ్యాకా కూడా అవే కొనసాగేవి, ఫ్లాట్‌లో ఒంటరిగా ఉండటానికి ఎవరూ ఇష్టపడక, అలాగని దాన్ని ఖాళీగానూ వదిలేయలేక, కుటుంబసభ్యుల్లో ఎవరో ఒక ఇద్దరు ఎప్పుడూ ఇంట్లో ఉండేలా చూసుకునేవారు. పనమ్మాయైతే – ఆమెకు విషయం ఎంత వరకూ తెలుసో తెలియదు గానీ – మొదటి రోజే తల్లి కాళ్ళ మీద సాగిలబడిపోయి తనను పనిలోంచి తీసేయమని బతిమాలింది, ఒక పావుగంట తర్వాత సెలవు తీసుకుని వెళ్తూ, తనను తీసేయటం ద్వారా ఈ కుటుంబం తనకు ఎంతో మేలు చేసినట్టు కళ్ళమ్మటా నీళ్ళతో కృతజ్ఞతలు తెలుపుకుంది, ఈ విషయం గురించి బయటెక్కడా మాట్లాడనని ఎవరూ అడక్కపోయినా ఒట్టు కూడా వేసింది.

దాంతో ఇప్పుడు వంటపని తల్లి పైనా, చెల్లాయి పైనా పడింది; అయినా అదేం పెద్ద పని కాదు, ఈ మధ్య ఆ కుటుంబం సరిగా తిండి తినటమే తగ్గించింది. ఇంకో ముద్ద తినమంటూ వాళ్ళు ఒకర్నొకరు నిష్పలంగా బతిమాలుకోవటం గ్రెగర్ వినిపిస్తూనే ఉండేది, దానికి స్పందన కూడా ఎప్పుడూ ఒకటే: ‘వద్దు, సరిపడా తిన్నాను,’ అన్న అర్థం వచ్చేలా ఏదో అనేవాళ్ళు. వాళ్ళు తాగేది కూడా తక్కువే. చెల్లాయి తరచూ తండ్రిని బీరేమైనా కావాలా అని అడిగేది, స్వయంగా తనే వెళ్ళి తెస్తాననేది; ఆయన్నుంచి జవాబేమీ రాకపోతే, కూతురి చేత పని చేయించుకుంటున్నాడనే బాధ నుంచి తప్పించటానికన్నట్టు, ఎవర్నయినా పంపించయినా తెప్పిస్తాననేది; కానీ చివరకు తండ్రి ‘వద్దు’ అని గట్టిగా చెప్పటంతో ఆ ప్రస్తావన ముగిసేది.

తండ్రి మొట్టమొదటి రోజే కుటుంబం ఆర్థిక పరిస్థితి ఏమిటో, ఇప్పుడు తమ ముందున్న అవకాశాలేమిటో తల్లికీ చెల్లాయికీ వివరించి చెప్పాడు. చెప్తున్నవాడల్లా మధ్య మధ్యలో టేబిల్ దగ్గర్నుంచి లేచి వెళ్ళి, ఐదేళ్ళ క్రితం తన వ్యాపారం దివాలా తీసినపుడు రక్షించి తెచ్చుకున్న ఒక ఇనప్పెట్టె నుంచి, ఏదో రసీదు పుస్తకమో నోటు పుస్తకమో పట్టుకొచ్చేవాడు. పకడ్బందీగా ఉండే ఆ ఇనప్పెట్టె గడియ తెరుచుకోవటం, అందులోంచి కావాల్సింది తీసుకున్నాకా మళ్ళీ మూసేయటం ఇవన్నీ గ్రెగర్‌కి వినపడేవి. అతను గదిలో బంధీ అయిన దగ్గర్నుంచీ ఇప్పటిదాకా విన్న విషయాలన్నింటిలోకీ కాస్త సంతోషాన్ని కలిగించే విషయం తండ్రి ఇచ్చిన ఈ వివరణలే. గ్రెగర్ ఇప్పటి దాకా తండ్రి పాత వ్యాపారం నుంచి ఒక్క పైసా కూడా మిగల్లేదని అనుకునేవాడు, తండ్రి కూడా మిగిలిందని ఎప్పుడూ చెప్పలేదు, గ్రెగర్ గుచ్చి అడగనూ లేదు. ఆ రోజుల్లో గ్రెగర్‌కున్న లక్ష్యమల్లా ఒకటే, తన కుటుంబాన్ని నిరాశలో కూరుకుపోయేట్టు చేసిన ఆ దివాలా తాలూకు జ్ఞాపకాల్నించి వాళ్ళను వీలైనంత తొందరగా బయటపడేయటం. అందుకు తన శక్తులన్నీ కూడదీసుకుని పని చేశాడు, చిన్న గుమాస్తా స్థాయి నుంచి చాలా వేగంగా ట్రావెలింగ్ సేల్స్‌మెన్ స్థాయికి చేరుకున్నాడు, ఆ హోదాకి చేరాకా అతని రాబడి అవకాశాలు పెరిగాయి, అతని విజయాలు కమీషన్ల రూపేణా తక్షణం డబ్బుగా మారేవి, దాన్ని వెంటనే తీసుకెళ్ళి ఆనందాశ్చర్యాలతో మెరిసే కుటుంబ సభ్యుల కళ్ళ ముందే టేబిల్ మీద పెట్టేవాడు. ఆ రోజులే వేరు, గ్రెగర్ తర్వాత కూడా డబ్బు బానే సంపాదించినా, కుటుంబం ఖర్చులన్నీ తనే భరించినా, ఆ రోజుల వైభవం మళ్ళీ ఆ స్థాయిలో ఎప్పుడూ పునరావృతం కాలేదు. వాళ్ళకు అది మామూలైపోయింది, కుటుంబానికీ, గ్రెగర్‌కీ కూడా; డబ్బు కృతజ్ఞతాపూర్వకంగానే తీసుకునేవాళ్ళు, అతను కూడా ఆనందంగానే ఇచ్చేవాడు, కానీ ఇదివరకట్లా అందులో ఎటువంటి ఆత్మీయ భావనా ఉండేది కాదు. చెల్లాయితో మాత్రం ఎప్పుడూ సన్నిహితంగానే ఉండేవాడు, ఆమె భవిష్యత్తు కోసం గుట్టుగా ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నాడు. ఆమె గ్రెగర్‌లా గాక సంగీత ప్రియురాలు, పైగా మనసు కరిగేలా వయొలిన్ వాయించగలదు, కాబట్టి, ఎంత ఖర్చయినా ఎలాగోలా భరించి, ఆమెను వచ్చే ఏడాది సంగీత కళాశాలలో చేరుద్దాం అనుకున్నాడు. గ్రెగర్ ఇంటి దగ్గర ఉండేది తక్కువే అయినా, ఆ ఉన్న కొన్ని సందర్భాల్లోనూ చెల్లాయితో ఎప్పుడు మాట్లాడినా ఈ సంగీత కళాశాల ప్రస్తావనకు వచ్చేది, కానీ దాన్ని అందరాని కలగానే చూసేవారు, తల్లిదండ్రులైతే ఆ ప్రస్తావన కూడా ఇష్టపడేవారు కాదు; కానీ ఈ విషయంలో గ్రెగర్ నిర్ణయం తీసేసుకున్నాడు, రాబోయే క్రిస్మస్ పండగ నాడు ఆ నిర్ణయాన్ని అట్టహాసంగా ప్రకటించాలనుకున్నాడు కూడా.

గ్రెగర్ అలా తలుపులకు ఆనుకు నిలబడి వింటున్నప్పుడు ఇలాంటి నిష్పలమైన ఆలోచనలే అతని మనసులోకి వచ్చి పోయేవి. ఒక్కోసారి భరింపరాని నిస్పృహ ఆవరించి వినటం మానేసి పరాకులో పడిపోయేవాడు, అతని తల పొరబాట్న తలుపుకు తగిలేది, చప్పున దాన్ని నిటారుగా నిలబెట్టుకునేవాడు, ఎందుకంటే ఏ చిన్న అలికిడైనా పక్క గదిలో అందరూ నిశ్శబ్దమైపోయేవారు. కొద్ది విరామం తర్వాత తండ్రి, బహుశా తలుపు వైపు చూస్తూ కాబోలు, ‘ఏం చేస్తుంటాడో ఇప్పుడు,’ అనేవాడు, ఆ తర్వాత నెమ్మదిగా అంతరాయాన్నించి తేరుకుని సంభాషణ తిరిగి కొనసాగేది.

Posted in 2014, జనవరి, రూపాంతరం, సీరియల్ and tagged , , , , , , , .

One Comment

  1. “ఇక చెల్లాయి, ఆమెకు పదిహేడేళ్ళొచ్చాయన్న మాటే గానీ ఇంకా చిన్న పిల్లే, అందమైన దుస్తులు వేసుకోవటం, ఆలస్యంగా నిద్ర లేవటం, ఇంటి పనుల్లో చేతనైనంత సాయం చేయటం, ఏవో చిరు సరదాల్లో పాలుపంచుకోవటం, అన్నింటికన్నా ముఖ్యంగా వయొలిన్ వాయించటం, ఇలా సాగే జీవితంలో జోక్యం చేసుకోవటమే పెద్ద పాపం, అలాంటిది డబ్బు కోసం ఆమెను పనిలో పెట్టాలా? ” – ఇలా ఆలోచించాలంటే ఎంత అందమయిన మనసు ఉండాలి. అనువాదం చాలా బాగుంది.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.