metamorphosis 2

రూపాంతరం [4]

Download PDF

Download Total Work PDF

కాఫ్కా “మెటమార్ఫసిస్” ఈ తెలుగు అనువాదం వారం వారం ధారావాహికంగా ఇస్తున్నాం. ఇది ఆఖరి భాగం. మొదట్నుంచి చివరి దాకా ఒకే ఇంటిలో జరిగే ఈ రచనను సరిగ్గా ఆస్వాదించటానికి, ఆ ఇంటి అమరిక తెలియటం కూడా ముఖ్యమని నా భావన. అందుకే, ఆ ప్లాను ఇక్కడ ఇచ్చాను.  – మెహెర్

దీని ముందు భాగం

3

ఈ గాయం గ్రెగర్‌ని నెల రోజుల పాటు లేవనీయకుండా చేసింది, దాని గుర్తుగా ఆ ఆపిల్ ఇంకా అతని మాంసంలోనే ఉంది, దాన్ని తొలగించే ధైర్యం ఎవరికీ లేకపోయింది. ఈ గాయం వల్ల తండ్రికి మాత్రం ఒక విషయం అర్థమైంది, ఎంత జుగుప్సాకరమైన రూపంలో ఉన్నా, గ్రెగర్‌కూడా తన కుటుంబంలో ఒక సభ్యుడే, అతణ్ణి శత్రువుగా చూడకూడదు, కుటుంబం పట్ల తన బాధ్యతలో భాగంగా, జుగుప్సను అణచుకుని, అతణ్ణి భరించాలి, తప్పదు.

గాయం కారణంగా గ్రెగర్ కొన్ని కదలికల్ని శాశ్వతంగా కోల్పోయాడు, ఇపుడు రోగిష్టి ముసలివాడిలా కొన్ని నిముషాలపాటు నరకప్రాయంగా కష్టపడితే తప్ప గదిలో ఆ చివర్నించి ఈ చివరి దాకా పాకలేకపోతున్నాడు, ఇక గోడ మీద పాకడమన్న ప్రశ్నే లేకుండా పోయింది, అయితే క్షీణించిన ఈ పరిస్థితికి ఊరటగా అతనికొక సదుపాయం అందజేయబడింది: ప్రతీ రోజూ సాయంత్రం వేళ లివింగ్ రూము వైపు తలుపు కాసేపు తెరిచి ఉంచేవాళ్ళు, అతను ఆ సమయం ఎప్పుడవుతుందా అని ఓ గంటా రెండు గంటల ముందు నుంచే తలుపు వైపు చూస్తూండేవాడు; అది ఎప్పటికో తెరుచుకునేది, బయట అతని కుటుంబమంతా టేబిల్ చుట్టూ చేరి దీపం వెలుగులో మాట్లాడుకునేవారు, అతను వాళ్ళెవరికీ కనపడని తన గది చీకటి మూలలో కూర్చుని, ఇదివరకట్లా దొంగచాటుగా కాకుండా, పరస్పర ఒప్పందం మీదే, వాళ్ళ సంభాషణ వినేవాడు.

అయితే ఈ సంభాషణలు పాతరోజుల్లోలా సరదాగా సాగేవి కావు, అప్పట్లో గ్రెగర్ ఎక్కడో తాను బస చేసిన చిన్న మురికి హోటల్ గదిలో చెమ్మటిల్లిన మంచం మీద అలసటగా వాలిన క్షణాల్లో కూడా ఈ సంభాషణల్ని ఎంతోRupantaram Stamp మురిపెంగా తలుచుకునేవాడు. ఇప్పటి సంభాషణల్లో జీవం లేదు. రాత్రి భోజనం కాగానే తండ్రి పడక్కుర్చీలోనే నిద్రపోయేవాడు; తల్లీ, చెల్లాయీ చప్పుడు చేయవద్దని ఒకరికొకరు జాగ్రత్త చెప్పుకునేవారు; తల్లి దీపం వైపుకు బాగా వంగి ఏదో ఫాషన్ స్టోరు కోసం లోదుస్తులు కుట్టేది; సేల్స్ గర్ల్‌గా ఉద్యోగం సంపాయించిన చెల్లాయి, అంతకంటే మెరుగైన అవకాశాల కోసం, రాత్రుళ్ళు ఫ్రెంచీ, షార్ట్‌హాండూ నేర్చుకునేది. అప్పుడపుడూ తండ్రి ఉన్నట్టుండి లేచేవాడు, తాను అప్పటిదాకా నిద్రలోకి జారుకున్నాడన్న సంగతి మర్చిపోయినట్టు, తల్లితో, ‘ఇవాళ ఇంతసేపు కుడుతున్నావేమిటే!’ అనేవాడు, అన్న మరుక్షణం మళ్ళీ నిద్రలోకి జారుకునేవాడు, ఆడవాళ్ళిద్దరూ ఒకరివైపొకరు చూసి నీరసంగా నవ్వుకునేవారు.

అదేం మంకుతనమో గానీ, తండ్రి ఇంటి దగ్గర కూడా తన బాంకు బంట్రోతు యూనిఫాంని విప్పటానికి ఒప్పుకునేవాడు కాదు, ఓ పక్క ఆయన పాత డ్రెస్సింగ్ గౌను ఊరకనే బట్టలకొక్కేనికి వేలాడేది, ఆయన మాత్రం, విధి నిర్వహణకు ఎప్పుడంటే అప్పుడు తయారే అన్నట్టూ, ఇక్కడ కూడా పై అధికారికి ఏ క్షణానైనా అందుబాటులో ఉన్నట్టూ, యూనిఫాం పూర్తిగా ధరించి, అలానే పడక్కుర్చీలో పడుకునేవాడు. అసలే ఆ యూనిఫాం ఏ మంత కొత్తది కాదు, దానికి తోడు ఇలా అతిగా వాడటం వల్ల, గ్రెగర్ తల్లీ చెల్లాయీ ఎంత శ్రద్ధగా ఉతికి పెడుతున్నా, క్రమంగా దాని మెరుగు తగ్గిపోసాగింది. గ్రెగర్ చాలాసార్లు సాయంత్రమల్లా ఆ మరకలతో నిండిన, పాలిష్డ్ బొత్తాలతో మెరిసే యూనిఫాంని అలాగే చూస్తూండిపోయేవాడు. తండ్రి మాత్రం అంత ఇబ్బందికరమైన యూనిఫాంలోనూ చాలా ప్రశాంతంగా నిద్రపోయేవాడు.

గడియారం పది కొట్టగానే తల్లి మెత్తని మాటలతో తండ్రిని నిద్ర లేపేది, ఆయన్ని మంచం మీదకు వెళ్ళి పడుకోమని బతిమాలేది, ఇలా కుర్చీలో పడుకోవటం వల్ల సరైన నిద్ర పట్టదు, మళ్ళీ తెల్లారి ఆరింటికి లేచి డ్యూటీకి వెళ్ళాలంటే మంచి నిద్ర తప్పనిసరి. కానీ ఆయన మాత్రం, ఈ మధ్య బాంకు బంట్రోతు అయిందగ్గర్నుంచీ కొత్తగా నేర్చిన మంకుతనం ప్రదర్శిస్తూ, తానింకా కాసేపు టేబిల్ దగ్గరే కూచుంటాననేవాడు, కానీ మళ్ళీ నిద్రలోకి జారుకునేవాడు; ఇక ఆ తర్వాత ఆయన్ని పడక్కుర్చీ నుంచి కదపాలంటే విశ్వప్రయత్నమే చేయాల్సొచ్చేది. గ్రెగర్ తల్లీ చెల్లాయీ కలిసి లోపలికి వెళ్లి పడుకొమ్మని ఎంతగా పోరినా, ఆయన పైకి లేవటానికి ససేమిరా అంటూ కళ్ళు కూడా తెరవకుండా ఓ పావుగంట తల అడ్డంగా ఆడిస్తూనే ఉండేవాడు. గ్రెగర్ తల్లి ఆయన భుజాన్ని పట్టుకు లాగుతూ, చెవిలో బుజ్జగింపుగా మాట్లాడేది, చెల్లాయి కూడా తన పని పక్కన పెట్టి తల్లికి సాయం వెళ్ళేది, అయినా ఆయన అంగుళం కదిలేవాడు కాదు. సరికదా మరింతగా పడక్కుర్చీలో కూరుకుపోయేవాడు. ఇలా లాభం లేదని ఆడవాళ్ళిద్దరూ ఆయన చంకల కింద చేతులు పెట్టి పైకి లేపేందుకు ప్రయత్నించేవారు, అప్పుడు కానీ కళ్ళు తెరిచే వాడు కాదు, అటూ ఇటూ ఆడవాళ్ళిద్దరి వైపూ మార్చి మార్చి చూస్తూ, ‘ఇదీ, ఈ ముసలితనంలో నాకు దొరికిన మనశ్శాంతి!’ అనేవాడు, నెమ్మదిగా ఇద్దరాడవాళ్ళ మీదా బరువు మోపి కాళ్ళపై లేచి నిలబడేవాడు, వాళ్ళు మీదే వాలిపోయి గుమ్మం దాకా వెళ్ళేవాడు, అక్కడ ఇద్దర్నీ విడిపించుకుని వాళ్ళకి చేయి ఊపుతూ తనంతట తాను లోపలికి నడిచేవాడు, ఆయనకు మంచం దగ్గర సాయపడేందుకు తల్లి తన కుట్టుపనీ, చెల్లాయి తన పెన్నూ వదిలేసి, ఆయన వెనకే లోపలికి వెళ్ళేవారు.

ఇలా పని భారంతో కుంగి అలసిపోతున్న కుటుంబంలో మరీ అవసరమైతే తప్ప గ్రెగర్‌ని పట్టించుకునే తీరిక ఎవరికుంటుంది? ఇంట్లో మనుషుల సంఖ్య కూడా తగ్గిపోయింది; పనమ్మాయిని పంపించేశారు; ఒక చప్రాసీని మాత్రం కుదుర్చుకున్నారు. ఆమె పొడుగ్గా, మొరటు శరీరంతో, ముగ్గుబుట్టలాంటి తెల్లని చింపిరి జుట్టుతో ఉండేది; ఉదయమూ, సాయంత్రమూ వచ్చి ఇల్లు ఊడ్చి వెళ్ళిపోయేది; ఇక మిగతా పనంతా అతని తల్లే తన కుట్టుపనితో పాటూ చూసుకునేది. గతంలో ఏవైనా వేడుకలూ పండుగలూ వచ్చిన సందర్భాల్లో తల్లీ చెల్లాయీ ఎంతో ఇష్టంగా వేసుకునే ఇంటి నగలు కూడా ఇప్పుడు అమ్మేసుకోవాల్సి వచ్చింది, అవి అమ్మగా వచ్చిన ధరల గురించి ఒక రోజు వాళ్ళు మాట్లాడుకుంటుంటే గ్రెగర్‌కి ఈ విషయం తెలిసింది. వాళ్ళు అన్నింటికన్నా ఎక్కువగా ఈ ఫ్లాట్ గురించే వాపోయేవారు, అది ప్రస్తుత పరిస్థితిలో వాళ్ళకో మోయలేని బరువుగా మారింది, కానీ గ్రెగర్‌ని ఇక్కణ్ణించి బదలాయించటం అసాధ్యం గనుక, దీన్ని వదిలి వెళ్ళలేకపోతున్నారు. కానీ గ్రెగర్‌కి తెలుసు, అదొక్కటే కారణం కాదని, అంతగా అతణ్ణి బదిలీ చేయాలనుకుంటే అదేం పెద్ద విషయం కాదు, తగిన కొలతలున్న పెట్టెకి గాలి ఆడేలా కన్నాలు చేసి అందులో అతణ్ణి మోసుకుపోవచ్చు, కానీ వాళ్ళు మారలేకపోవటానికి అసలు కారణం నిస్పృహ, తాము ఓ వెలికి రాలేని ఊబిలో కూరుకుపోయామన్న నిస్పృహ, తమ స్నేహితుల్లో గానీ బంధువుల్లో గానీ ఎవరికీ దాపురించనంత పెద్ద దౌర్భాగ్యం తమకు దాపురించిందన్న నిరాశ. వాళ్ళు ఇప్పటికే పేదవాళ్ళ నుంచి ప్రపంచం ఏం ఆశిస్తుందో అదంతా నెరవేరుస్తున్నారు; తండ్రి బాంకు గుమాస్తాలకు టిఫిన్ తెచ్చిపెడుతున్నాడు, తల్లి అపరిచితుల కోసం లోదుస్తులు తయారు చేస్తోంది, చెల్లాయి కస్టమర్ల ఆదేశానుసారం కౌంటరు వెనుక అటూ యిటూ తిరుగుతోంది; ఇక ఇంతకన్నా చేయటం ఆ కుటుంబానికి సాధ్యం కాదు. తండ్రిని మంచం మీద పడుకోబెట్టిన తర్వాత, తల్లీ చెల్లాయీ తిరిగి లివింగ్ రూములోకి వచ్చి, తమ పనుల్ని ఎక్కడివక్కడే వదిలేసి, కుర్చీల్ని దగ్గరకు లాక్కొని, చెంపా చెంపా రాసుకునేంత దగ్గరగా కూర్చునేవారు; తల్లి గ్రెగర్ గది వైపు చూపిస్తూ, ‘గ్రెటె, ఆ తలుపు మూసేయ్,’ అనేది, అతను చీకట్లో మిగిలిపోయేవాడు, ఆ పక్కగదిలో ఆడవాళ్ళిద్దరూ కలిసి ఏడ్చి తమ కన్నీటి బరువు దింపుకునేవారు, లేదా బహుశా ఎండిపోయిన కళ్ళతో టేబిల్ కేసి చూస్తూ కూచునేవారు. ఇలాంటప్పుడే గ్రెగర్ గాయం ఎవరో పనిగట్టుకు కెలికినట్టు మళ్ళీ సలిపేది.

Posted in 2014, జనవరి, రూపాంతరం, సీరియల్ and tagged , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.