softwarescaled

సాఫ్ట్‌వేర్ ‘ఇతి’హాస్యం [2]

Download PDF   ePub   MOBI

అత్యధికంగా అమ్ముడుపోయిన ఈ-పుస్తకంగా పేరు తెచ్చుకున్న “రామ్॒@శృతి.కామ్” రచయిత అద్దంకి అనంతరామయ్య రాసిన రెండవ హాస్య నవల ఈ “సాఫ్ట్‌వేర్ ‘ఇతి’హాస్యం”. దీన్ని వారం వారం సీరియలైజ్ చేస్తున్నాం.  ఇది రెండవ భాగం.

దీని ముందు భాగం

అజయ్ పుట్టి పెరిగింది అద్దంకిలోనే. ఇంటర్ విజయవాడలో, ఇంజనీరింగ్ ఒంగోలులో చేసి, ఇప్పుడు హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నాడు. సెల్ ఫోను ఉంటే బ్యాటరీ ఉంచటం ఎంత తప్పనిసరో, ఉద్యోగంతో పాటు ప్రియురాలు ఉండటం కూడా అంతే తప్పనిసరి. ఒక్కటే తేడా, బ్యాటరీకి ఛార్జ్ చేస్తే సెల్ ఫోను పనిచేస్తుంది. ప్రియురాలిని ఛార్జ్ చేస్తే ప్రియురాలే సంతోషిస్తుంది. ప్రియుడికి మిగిలేది మనస్సుకి తృప్తి, జేబుకి చిల్లి .

నిషా, అజయ్ కి హుషారెక్కించే అమ్మాయి. వీళ్ళ ప్రేమకి, వర్షానికి చిన్న సంబంధం ఉన్నది. అప్పుడు అజయ్ ఇంజనీరింగ్ కాలేజి చేరిన మొదటి రోజులు. కాలేజీ చేరిన వారానికి అనుకోకుండా అజయ్ కి నిషాతో పరిచయం అయ్యింది. ఆ రోజు అజయ్ కి ఎప్పటికీ గుర్తుండి పోయే రోజు. అసలే శ్రావణ మాసం, ఆంగ్లంలో చెప్పాలంటే ఆగస్టు నెల. ఊరంతా పెళ్ళిళ్ళు, రాష్ట్రమంతా వర్షాలు.

అజయ్ తన క్రొత్త బండి మీద కాలేజీకి వస్తున్నాడు. కాలేజీ గేటు దగ్గరకి రాగానే వర్షం జోరందుకుంది. బండి వేగం పెంచాడు. ఆ వర్షంలో నిషా తడుస్తూ, నడుస్తూ ఉన్నది. అజయ్ బండి నిషా దగ్గర ఆపి, software for uploadఎక్కమన్నట్టు సైగ చేశాడు. “పర్వాలేదు” అంటూ నిషా నడకలో వేగాన్ని పెంచింది. “ చాలా దూరం ఉంది, పర్లేదు ఎక్కు” అని అజయ్ ఇంకొంచెం గట్టిగా అడిగాడు. మారు మాట్లాడకుండా బండి ఎక్కి కూర్చున్నది. క్షణాల్లో ఇద్దరూ కాలేజీలో ఉన్నారు. “ఏ బ్రాంచ్?” అని అడిగాడు అజయ్ తన తలకున్న హెల్మెట్ తీసి, తలను చేతితో తుడుచుకుంటూ. “ఇ.సి.ఈ సార్” అని చెప్పింది తన ముఖాన ఉన్న ముసుగుని తీస్తూ. ‘సార్’ అనటంతోనే అజయ్ కి విషయం అర్థం అయ్యింది . నిషా తనని సీనియర్ అనుకుంటున్నది అని.

“ఏ ఊరు?” అని అడిగాడు . తనని చూడగానే అజయ్ కి గుండెలో టిమటిమలు మొదలు అయ్యాయి. తను ఏ ఊరిపేరు చెప్పిందో కూడా తన చెవులకు వినపడలేదు. ఆకాశంలో విహరిస్తున్న దేవకన్యలలో నుంచి ఒక సుందరి మెరుపుకి భయపడి కిందకి జారిపడిందేమో అన్నంత అందంగా తోచింది . “కనీసం థాంక్స్ కుడా చెప్పలేదు, ఏ బడిలో చదువుకున్నావు? ఇవేమీ నేర్పలేదా?” అన్నాడు అజయ్ కోపాన్ని నటిస్తూ. “సారీ సార్ సీనియర్ అనే భయంతో చెప్పలేదు, థాంక్స్” అని నవ్వింది. “సీనియర్లంతా రాక్షసులు కాదు, స్టాఫ్ అంతా దేవుళ్ళు కాదు! సీనియర్స్ లో కుడా మంచోళ్ళు ఉంటారు. నా పేరు అజయ్” అని చెయ్యి చాపాడు. నిషా కూడా తన పేరు చెప్పి ఇచ్చింది, చెయ్యి. ఎవరి తరగతులకు వారు వెళ్ళిపోయారు.

అజయ్ తన ఇతర స్నేహితుల ద్వారా నిషా గురించి వివరాలు సేకరించాడు. హాస్టల్లో ఉంటుంది , హార్లిక్స్ తాగుతుంది, హై హీల్స్ వేస్తుంది, హార్డ్ వర్క్ చేస్తుంది, హచ్చ్ సిమ్ వాడుతుంది, హిందీ కూడా మాట్లాడుతుంది, హంబుల్ నెస్ ఎక్కువ , హెల్పింగ్ నేచర్ తక్కువ. ఆ తరువాత రోజున కాలేజీ లో అజయ్ నిషా కోసం వెతుకుంటూ ఉండగా దూరాన నిషా ఎవరితోనో మాట్లాడుతూ కనిపించటంతో ఆ వైపుగా వెళ్ళాడు. తనని నిషా కూడా చూసింది. “అజయ్ సార్” అని పిలిచింది. అజయ్ నిషా దగ్గరకు వెళ్ళాడు. అజయ్ ని చూడగానే అక్కడ ఉన్న వాళ్ళ ముఖం రంగు మారిపోయింది. తను సీనియర్ అని అంతా భయపడి పోతున్నారనుకున్నాడు అజయ్.

“వీడేనా నీకు తెలిసిన సీనియర్” అన్నాడు ఆ గుంపులో ఒకడు. “వీళ్ళు నన్ను ర్యాగింగ్ చేస్తున్నారు సార్” అని అజయ్ కి ఫిర్యాదు చేసింది నిషా. కుడితిలో పడ్డ ఎలుక లాగ అయ్యాడు అజయ్. సాఫ్ట్ వేర్ పరి భాషలో చెప్పాలంటే వైరస్సున్న కంప్యూటర్ కు గుచ్చుకున్న కొత్త పెన్ డ్రైవ్ లాగా అయ్యాడు. “ఏ బ్రాంచ్ రా నువ్వు?” అని అడగడటంతో “కంప్యూటర్స్ సార్” అన్నాడు అజయ్, భయంగా సీనియర్ ని, జాలిగా నిషాని చూస్తూ. “చేరి వారం కూడా కాలేదు, అప్పుడే ర్యాగింగ్ మొదలు పెట్టావారా? వీడి సంగతి మేము చూస్తాం” అని సీనియర్ చెప్పటంతో నిషా తన స్నేహితులతో వెళ్ళిపోయింది.

ఆ రోజు సీనియర్లంతా కలిసి అజయ్ ని ఆడుకోని, ఆరేశారు. తర్వాత రోజు కాలేజీ క్యాంటీన్ లో టిఫిన్ చేస్తున్నాడు. దూరంగా నిషా కూడా టిఫిన్ చేస్తుండటం గమనించాడు. తన దగ్గరకి వెళ్లి కూర్చున్నాడు. “సారీ! ఏదో సరదాకి ఆట పట్టించటానికి సీనియర్ అని చెప్పాను” అన్నాడు అజయ్. నిషా ఏమి మాట్లాడలేదు. “ఐయామ్ రియల్లీ సారీ!” అన్నాడు. “ఇట్స్ ఓకే , నిన్ను బాగా ఆడుకున్నారా?” అని నిషా అడిగింది. అవునన్నట్టు అజయ్ తలూపాడు . “మరి సీనియర్ అని చెప్తే ఆడుకోరా” అన్నది నిషా. “ఏంటి సీనియర్ మళ్ళీ ర్యాగింగ్ చేస్తున్నాడా?” అని వెనుకనుంచి అజయ్ భుజం మీద చేతులు వేసి అడిగాడు ఒక సీనియర్. “అదేమీ లేదు సార్!” అని నిషా అక్కడనుండి త్వరత్వరగా వెళ్ళిపోయింది. అజయ్ వెనక్కుతిరిగి చుస్తే, అదే సీనియర్ నవ్వుతూ నిలబడి ఉన్నాడు . రెండో రోజు కూడా అజయ్ ని దిగ్విజయంగా ఆడుకున్నారు.

Posted in 2014, జనవరి, సాఫ్ట్‌వేర్ ఇతిహాస్యం, సీరియల్ and tagged , , , , , , , , , , .

4 Comments

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.