softwarescaled

సాఫ్ట్‌వేర్ ‘ఇతి’హాస్యం [3]

Download PDF   ePub   MOBI

అత్యధికంగా అమ్ముడుపోయిన ఈ-పుస్తకంగా పేరు తెచ్చుకున్న “రామ్॒@శృతి.కామ్” రచయిత అద్దంకి అనంతరామయ్య రాసిన రెండవ హాస్య నవల ఈ “సాఫ్ట్‌వేర్ ‘ఇతి’హాస్యం”. దీన్ని వారం వారం సీరియలైజ్ చేస్తున్నాం.  ఇది మూడవ భాగం.

దీని ముందుభాగం

మానేజరు గొడవతో మనస్సు బాగోక, అనుకున్నట్టుగానే అద్దంకి పయనం అయ్యాడు. తాను అరగంట ముందుగా వస్తే తన బస్సు రావాల్సిన సమయానికన్నా గంట ఆలస్యం అని చెప్పటంతో, చేసేది ఏమి లేక, వచ్చి పోయే బస్సులను లెక్కేస్తూ నిలబడ్డాడు. “బస్ స్టాప్ లోనే ఉన్నా డాడీ! బస్సు గంట ఆలస్యం అట, అది వచ్చాక చేస్తాను” అని ఫోనులో మాట్లాడుతున్న ఒక అందమైన అమ్మాయి అజయ్ కంట పడింది. ఆసక్తిగా అజయ్ ఒక చెవి అటు వైపు వేసాడు. “ఏ విషయం మెయిల్ చేస్తామని చెప్పాడు. నేనైతే బాగానే చేశాను” అని వినపడింది. ఇంజనీరింగ్ అయిపోయి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నదన్న విషయం అర్థమైంది అజయ్ కి. “ఉద్యోగం వచ్చేదాకా, అది రాలేదన్న బాధ మాత్రమే ఉంటుంది. వచ్చాక అస్సలు బాధలు మొదలవుతాయి” అని మనసులో అనుకున్నాడు అజయ్.

ఆ అమ్మాయిని పైనుండి కింద దాక తన కళ్ళతో స్కాన్ చేయటం మొదలు పెట్టాడు. “ఇప్పుడే షోరూమ్ నుండి వచ్చిన వోల్వో బస్సులాగుంది” అనుకున్నాడు. పోలిక బాగోలేకపోయినా అమ్మాయి బాగుందన్న విషయం అర్థం అవ్వాలి. అజయ్ తనని చూడటం ఆ అమ్మాయి కూడా గమనించింది, అజయ్ ని తిరిగి చూడటం మొదలు పెట్టింది . “టైం బాగలేనప్పుడు కూడా మన టైమింగ్ బాగానే ఉన్నదే” అని మనసులో అనుకున్నాడు. కాసేపటికి ఆ అమ్మాయి అజయ్ దగ్గరకి వచ్చి “మీరు అజయ్ కదా! నా పేరు లావణ్య గుర్తుపట్టారా?” అన్నది. ఆశ్చర్యంతో “ఇందాకటి నుండి అదే చూస్తున్నా ఎక్కడో చూసినట్టున్నది, గుర్తుకు రావటం లేదు” అన్నాడు. “మీరు R N E C కాలేజీలో మాకు సీనియర్ సార్. మాకు మీరు క్యాంపస్ ట్రైనింగ్ కూడా ఇచ్చారు” అన్నది, అజయ్ ఆశ్చర్యానికి తెర దించుతూ.

“అదీ సంగతి! మనదగ్గర ట్రైనింగ్ తీసుకున్నాక ఇంక ఉద్యోగం ఏమొస్తుంది?” అని మనస్సులో అనుకొని, “ఓ నైస్ , ఏమి చేస్తున్నావు ఇప్పుడు?” అని అడిగాడు.software for upload “ క్యాంపస్ లో జాబ్ రాలేదు మీకు లాగా, అందుకని జాబ్ ట్రై చేస్తున్నా?” అన్నది. “ఇంకా ముత్యం కంపెనీలోనే చేస్తున్నారా మీరు?” అని అడిగింది. “అవును అక్కడే చేస్తున్నాను” అన్నాడు అజయ్. “హే, నిషా అక్క ఎలా ఉన్నది? ఎప్పుడు మీ పెళ్లి, ఆల్రెడీ చేసేసుకున్నారా?” అని అడిగింది, అందమైన తనకళ్ళను పెద్దవి చేస్తూ. “ తను బాగానే ఉన్నది. పెళ్లి గురించి ఇంకా ఏమి అనుకోలేదు” అన్నాడు. ఈలోగా నిషా ఫోన్ చేసింది, బస్సు ఎక్కావా?” అని . తన బస్సు ఆలస్యం అయిన సంగతి, లావణ్య పరిచయం అయిన సంగతి వివరించాడు. నిషా కూడా లావణ్య తో మాట్లాడింది. ఇంతలో బస్సు కుడా రానే వచ్చింది. ఇద్దరిదీ ఒకే బస్సు. అజయ్ ఎడమ వరుసలో, సరిగ్గా అదే వైపు కుడి వరసలో లావణ్య కూర్చున్నారు. తెల్లవార్లూ ముచ్చట్లతోనే సరిపోయింది. ఫోను నెంబర్లులు తీసుకోవటం, ఫేసుబుక్కులో కూడుకోవటం టక టక జరిగిపోయాయి. ఏమాటకామాట ఒక స్మార్ట్ ఫోన్, దానిలో ఇంటర్నెట్ ఉంటే ప్రపంచం మన చేతుల్లో ఉన్న భావన కలుగుతుంది. తెల్లవారుఝామున అజయ్ అద్దంకిలో దిగాడు. లావణ్య వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది.

అద్దంకి అటు పట్టణం కాదు , ఇటు పల్లెటూరు కాదు . నాలుగు సినిమా హళ్ళు ,రెండు డిగ్రీ కాలేజీలు, అరడజను ఇంటర్నెట్ పాయింట్లు, డజను మెడికల్ షాప్ లు ,ఒక పోలీస్ స్టేషన్ , పది మంది పోలీసులు. క్లుప్తంగా, ఇది ఆ ఊరు పరిస్థితి. స్టేషన్, పోలీసులని మొదలయ్యిందని ఇదేదో రక్తపు కధ అనుకునేరు . దేవుడి దయ వల్ల ఇంకా అంత హింస ఊరిని తాకలేదు .

అజయ్ ఎక్కువగా బయటి ఊర్లలోనే చదవటంతో, ఆ ఊర్లో తనకున్న మిత్రులు అందరూ బాల్య మిత్రులే. తన బాల్య స్నేహితులందరిలోకీ ఎక్కువ చదువుకున్నది అజయ్ మాత్రమే. కొంతమంది వ్యాపారాల్లోను, వ్యవసాయంలోను, స్థిరపడాల్సి రావటంతో చదువుకోలేదు. కొంతమంది సరిగా చదువుకోకపోవటంవల్ల వ్యాపారాల్లోకి రావాల్సి వచ్చింది. చదువుకోకపోయినా అజయ్ కన్నా ఎక్కువగానే సంపాదించగలుగుతున్నారు.

రియల్ ఎస్టేట్ అన్న పేరుతో భూమి ధరకు రెక్కలు రావటంతో, ఆ రెక్కలు పట్టుకొని బాగానే గడించారు. అజయ్ నాన్నగారు బ్యాంక్ లో ఆఫీసర్. ఒక్కగానొక్క కొడుకు కావటంతో, అజయ్ ఇంట్లో కన్నా బజారులోనే ఎక్కువ సమయం గడుపుతుంటాడు. బాల్య స్నేహితులంతా కలిసి బజార్ల వెంట తిరుగుతుంటే, ఆ బజారులకే కళ వచ్చేది.

ఊరికి నడిమధ్యలో పెద్ద సిమెంటు రోడ్డు, ఆ రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించటం అశోకుడు మర్చిపోయాడేమో, అందుకే వాటి స్థానం లో వాణిజ్య సముదాయాలు ఏర్పడ్డాయి. చుట్టుప్రక్కల పల్లెటూర్లు చాలా వరకు ఆ బజారునే ఆశ్రయించి ఉండటంతో, అది ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది.అదే బజారు లో అజయ్ చిన్ననాటి మిత్రుడు CM ,బట్టల వ్యాపారం చేస్తుంటాడు. CM అంటే ఏ రాష్ట్రానికో అనే అనుమానం రాక మానదు. రంగు రంగు బట్టలతో తప్ప రాజకీయాలతో ఇతనికి సంభందం లేదు. వస్త్ర వ్యాపారి గనుక, ఆంగ్లంలో క్లాత్ మర్చెంట్ అనే పదాలలో మొదటి రెండక్షరాలని కలిపి CM అని పిలుస్తుంటారు.

CM అసలి పేరు శ్రీనివాస గుప్త. చిత్రగుప్తుడు అందరి తప్పులు రాస్తే, ఈ గుప్తుడు అందరి అప్పులు రాస్తుంటాడు. వీళ్ళ మిత్ర బృందం లో ఎవరికి డబ్బు అవసరం వచ్చినా మొదట గుర్తుకు వచ్చేది గుప్తుడే. ఇంటర్ వరకూ ఇరగదీసి చదివాడు. కాని వ్యాపారం చేయాలని ఇంట్లో పట్టు పట్టటంతో, చేసేది లేక పరీక్షలు రాయటం మానేసి పద్దులు రాయటం మొదలు పెట్టాడు, అలా రాస్తూనే ఉండిపోయాడు. బాల్యమిత్రులకి తప్పించి సొంత బాబాయికైనా వడ్డీ లేనిదే డబ్బు ఇవ్వడు. వస్త్ర వ్యాపారనికే పరిమితం కాకుండా, భూ క్రయ విక్రయాలు, షేర్లు, ఇలా పలు రకాలుగా సంపాదిస్తున్నాడు. దాదాపు అన్ని బ్యాంకులలో ఖాతాలలో పాటు వాటిల్లో డబ్బులు కూడా ఉన్నాయి. ఈ బాల్యమిత్రులందరికీ దాదాపు పదేళ్లుగా ఈ గుప్తుడి వస్త్ర దుకాణమే విశ్రాంతి భవనంగా పని చేస్తున్నది.

Posted in 2014, జనవరి, సాఫ్ట్‌వేర్ ఇతిహాస్యం, సీరియల్ and tagged , , , , , , , , , , .

One Comment

  1. super asalu aa climate ni vivarinchaaru abbbabba super andi alanti climate lo mitrulato kaalakshepam ante ..chepaalenu gud going andi waitingn for the next part…..entina city vaallam…ilanti kathala kosam paritapinche vaallam enta tondaraga ayite anta tondaraga post cheyandi please………

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.