softwarescaled

సాఫ్ట్‌వేర్ ‘ఇతి’హాస్యం [4]

Download PDF

అత్యధికంగా అమ్ముడుపోయిన ఈ-పుస్తకంగా పేరు తెచ్చుకున్న “రామ్॒@శృతి.కామ్” రచయిత అద్దంకి అనంతరామయ్య రాసిన రెండవ హాస్య నవల ఈ “సాఫ్ట్‌వేర్ ‘ఇతి’హాస్యం”. దీన్ని వారం వారం సీరియలైజ్ చేస్తున్నాం. ఇది నాల్గవ భాగం.

దీని ముందు భాగం

చల్లని గాలి,రకరకాల పూలు చెట్ల నుండి వీచే సువాసన పక్షుల కిలకిలలతో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నది.అంతా నిశ్శబ్దం. అజయ్ ఆ మంచం మీద వెనక్కు వాలిపోయి ఆలోచనలో పడ్డాడు. గొడవపడ్డ మేనేజరు గురించి,తారసపడ్డ లావణ్య గురించి, ఇలా ఆలోచిస్తూ, మెల్లిగా మగత నిద్రలోకి జారుకున్నాడు. పది నిముషాల తర్వాత వెంకటరావు తన పని పూర్తిచేసి వచ్చి,అజయ్ ని తట్టాడు. “భలే నిద్ర పట్టేసిందిరా ! రాత్రంతా నిద్ర లేదు కదా” అన్నాడు అజయ్, చెరిగిపోయిన జుట్టుని దువ్వుకుంటూ. “ఎన్ని రోజులుంటావ్?” అడిగాడు వెంకటరావు. “ఆదివారం రాత్రి బయలుదేరాలి . సోమవారం నుంచి మళ్లీ మామూలే కదా !” అన్నాడు అజయ్.

పెంకు పంచలోకి వెళ్లి , రెండు పెద్ద జామకాయలు తెచ్చి, చెరొకటి ఇస్తూ , “చెట్టు కాయలురా” అని అన్నాడు వెంకటరావు. “కాయలు చెట్లకు కాయకుండా మనుషులకు కాస్తాయా? కాసినా వాటిని మనం తినగలమా? నువ్వు నీ అతి” అని అజయ్ అనటంతో , ముగ్గురూ ఒక్కసారిగా నవ్వారు . ఇంతలో అజయ్ కి నిషా నుండి ఫోను వచ్చింది. “రాత్రికి చేస్తాను, అప్పుడైతే ప్రశాంతంగా మాట్లాడవచ్చు” అని చెప్పి ఫోను పెట్టేశాడు. అప్పటికే సాయంత్రం ఆరు కావస్తున్నది. “నేను ఇంటికి వెళ్లి నేరుగా షాపుకు వచ్చేస్తా . నాన్న ఇంటికి వచ్చేస్తుంటారు. ఉదయం కనీసం పలకరించలేదు. కాసేపు ఇంట్లో కనపడి వస్తాను” అని చెప్పి గుప్తా బండి మీద ఇంటికి బయలుదేరాడు అజయ్. పొలం పని ముగియటంతో , వెంకటరావు గుప్తా కలిసి, గుప్తా కొట్టు దగ్గరకి చేరారు.

“సొంత ఇల్లు, ఇంటి ముందు కారు పట్టేంత ఖాళి స్థలం, ఇంటివెనుక నాలుగు మొక్కలు పెంచేంత ఖాళి స్థలం, సగటు మధ్య తరగతి కుటుంబం అజయ్ ది. ఇంటికి చేరేసరికి, వాళ్ళ నాన్నగారు తెల్లని లుంగీ ,బనియన్తో మడత మంచం మీద చల్లగాలికి కూర్చొని ఉన్నాడు. “ఎప్పుడొస్తాడు ,నీ స్నేహితుడు అమెరికా నుంచి ?” అని అడిగాడు “ఇందాకే వచ్చాడు నాన్న , కాసేపు ఆగి వెళ్లి కలవాలి” అని చెప్పాడు. “నువ్వు చెప్పా పెట్టకుండా వచ్చే సరికి ,ఖంగారు పడ్డాను. ఎందుకు వచ్చావో అని” అన్నాడు. అజయ్ ఉలకలేదు, పలకలేదు. “ఎలా ఉంది ఉద్యోగం ,పని ఒత్తిడి విపరీతంగా ఏమీ లేదు కదా?” అని అడిగాడు. “పెద్దగా ఒత్తిడి ఏమీ లేదు నాన్న. నెలకొక వారం రోజులు పని బాగా ఉంటుంది. మిగతా రోజులు మామూలే” అని చెప్పాడు. ఇద్దరూ కలిసి ఇంట్లోకి వెళ్లారు.తనకోసం అప్పుడే చేస్తున్న పకోడీల వాసన, ముక్కుకి బలంగా తాకటంతో వంటింట్లోకి వెళ్ళాడు.అక్కడే వంట చేసే గట్టు పైన కూర్చొని పకోడీలు ఒక్కొక్కటి తినటం మొదలుపెట్టాడు.”ఇంకా ఏంటి హైదరాబాదు విశేషాలూ ?” అని వాళ్ళ అమ్మ అడిగింది.హైదరాబాదుకేమి హాయిగా ఉందంటూ, తినటం పూర్తి చేసి నేరుగా CM దగ్గరకు వెళ్ళాడు.

పెళ్ళిళ్ళు ,పండుగల కాలం కాకపోవటంతో, కొట్టు మొత్తం ఖాళీగానే ఉన్నది. కాని CM మాత్రం చాలా హడావుడిగా లెక్కలు చూసుకుంటున్నాడు. తనకోసం వేసిన కుర్చీలో కూర్చున్నాడు అజయ్. పని చేసే కుర్రాడు గ్లాసులో మంచినీళ్ళు తీసుకొచ్చి అజయ్ కి ఇస్తూ “టీ నా కాఫీ నా అన్నా” అని అడిగాడు. “ఇప్పుడేమీ వద్దు తమ్ముడు మీ అన్న కప్పు టీ కూడా అప్పు కింద రాసి, వడ్డీ కూడా వేస్తాడు” అన్నాడు గుప్తా కేసి చూస్తూ. ఆ మాటకు గుప్తా కోపంగా ముఖం మార్చి, ఆ కుర్రవాడిని “ఏరా ,ఒళ్ళు ఎలా ఉంది? సాఫ్ట్ వేర్ వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు, ఏది పడితే అది తాగుతారనుకున్నావా ఏంటి? చల్లని కోకో , చిల్డ్ బీరో అడగాలి కాని” అని అనటంతో అంతా నవ్వుల్లో మునిగిపోయారు.

గుప్తా అజయ్ వైపు తిరిగి “ ఓ పది నిముషాలురా! లెక్క తేల్చి వస్తా” అన్నాడు. పరవాలేదు అన్నట్టు సైగ చేశాడు అజయ్. రోడ్డు మీద వెళ్ళే ఆటోల ,బస్సుల మోత బాగా వినిపిస్తున్నది. ఇవాళ రేపు, క్షణం తోచకపోతే అరక్షణంలో చేసే పని సెల్ ఫోనుతో ఆడుకోవటం. అజయ్ అమెరికా నుంచి ఇష్టంగా తెప్పించుకున్న ఐఫోనుని, ప్రేమతో తీసి చూస్తున్నాడు. అప్పటికే నిషా “ఏమి చేస్తున్నావు? మిస్సింగ్ యు” అని సందేశాన్ని పంపింది. “ఎవరిని ఏమి చేస్తే ఎవరు ఊరుకుంటారు ?” అని అజయ్ సమాధానం పంపాడు. “ఒకసారి చేస్తే కదా ఊరుకుంటారో లేదో తెలిసేది” అని నిషా పపింది. “చేసెయ్యరా బాబు, అంతలా అడుగుతున్నప్పుడు ఏదో ఒకటి చేసెయ్” అని వేణు వెనుకనుంచి అనటంతో అజయ్ ఉలిక్కి పడి వెనక్కి తిరిగి చూశాడు.

అప్పటికే అజయ్ సెల్లుని చాటుగా గమనిస్తున్న వేణుబాబు వికటాట్టహాసం చేశాడు. “ఏరా ఎంతసేపు అయింది వచ్చి” అని అడిగాడు అజయ్ వేణుని, తన సెల్ జేబులో దాచేస్తూ . “ఇప్పుడే వచ్చాలేరా! కంగారు పడకు ఇంతకు ముందువి చదవలేదు”, అని నవ్వటం మొదలుపెట్టాడు. “ఆఫీసులో కలీగ్ రా! ఏదో సహాయం చేయమంటేను…” అని దీర్ఘం తీశాడు, తప్పించుకోవటానికి ప్రయత్నిస్తూ. “కలీగా, కలరింగా . . . అయినా నీ గొడవ నాకెందుకులేరా! నువ్వు ఏది చేయాలనుకుంటే అది చెయ్యి” అని వెటకారం చేశాడు. “ఇంకా ఏంటి విశేషాలు?” అన్నాడు అజయ్. “ఇందాకే వెంకటరావు చెప్పాడురా, సాఫ్టోడు సెలవులకు వచ్చాడని, ఒకసారి దర్శనం చేసుకొని వెళ్దామని వచ్చాను.. ఎలాగూ CM గారికి కూడా ముఖం చూపించినట్లు ఉంటుంది కదా” అన్నాడు వేణు, “చూపిస్తావు, చూపిస్తావు ఇవ్వాల్సిన డబ్బులు ఇమన్నప్పుడు, ఎక్కడ పెట్టుకు తిరుగుతావురా ఆ ముఖాన్ని?” అని CM అన్నాడు, తన పనిలోంచి కొంచెం బయటకు వచ్చి. “ఏ జన్మలో ఏ పాపం చేశానో , నీ దగ్గర అప్పు చేశాను” అన్నాడు వేణు .

Posted in 2014, జనవరి, సాఫ్ట్‌వేర్ ఇతిహాస్యం, సీరియల్ and tagged , , , , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.