front cover

అతీత మానవుని అన్వేషణలో: పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా

Download PDF   ePub   MOBI

మనసుకి ఉల్లాసాన్ని కలిగించే నవలలు కొన్నైతే, మనసు లోతుల్లోకి ప్రయాణింపజేసి సాధారణ పాఠకులకు అంతగా పరిచయం లేని మనోమయ ప్రపంచంలో త్రిప్పి తీసుకువచ్చేవి మరికొన్ని. కానీ తాత్వికదృష్టితో ఇలాంటి రచనలు చేయగల రచయితలు చాలా అరుదుగా కనపడతారు. అలాంటి వారిలో త్రిపురనేని గోపీచంద్ ముందు వరసలో ఉంటారు. అలా పూర్తి తాత్విక దృష్టితో వ్రాయబడిన నవల పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా.

కేశవమూర్తి, సుజాతలది అన్యోన్య దాంపత్యం. కేశవమూర్తి మంచి పేరున్న రచయిత. విలువలు కలిగిన జీవితం గడిపేవాడు. ఏదో ఒక సిద్ధాంతాన్ని అంటి పెట్టుకుని మిగిలిన సిద్ధాంతాలను విమర్శించడం మానవాభ్యుదయానికి అతి పెద్ద అడ్డంకి అని భావించే మనస్తత్వం కలవాడు. ఇక సుజాత పండిత పరమేశ్వరశాస్త్రి గారి పెంపుడు కూతురు. గట్టి సాంప్రదాయవాది అయిన తండ్రిని ఎదిరించి కేశవమూర్తిని కులాంతర వివాహం చేసుకుంటుంది. భర్తని ప్రేమానురాగాలతో అనుగమించే ఇల్లాలు. ఇలా ఉండగా పరమేశ్వర శాస్త్రి గారి ఆస్తి కేశవమూర్తికి దక్కకుండా చేయాలని ప్రయత్నం చేస్తుంటారు కేశవమూర్తి పాత మిత్రులు కొందరు. కేశవమూర్తికి ఉన్న పేరు, మంచితనాలే వారికి అతనిపై ఉన్న ద్వేషానికి కారణం. ఈ ముఠాకు సీమంతం నాయకత్వం వహిస్తుంటాడు. పరమేశ్వరశాస్త్రి గారి కోరిక మేరకు ఆయన ఆస్తితో ఒక సంస్కృత కళాశాల స్థాపించబోతున్నామని, దానికి తాము నిర్వాహకులుగా ఉండి భాషా సంప్రదాయాలకు సేవ చేస్తామని కనపడిన వారందరితో చెబుతుంటారు. ఈ విషయంలో శాస్త్రి గారు కూడా అంగీకారం తెలిపారనే వారు భావిస్తుంటారు. పైకి పవిత్రమైన ఆలోచనలా కనిపించినా ఆస్తి మొత్తం వారి క్రిందకు రావాలన్నదే వారి లక్ష్యం.

వీరందరూ కలిసి కేశవమూర్తి కుటుంబాన్ని ఎన్ని ఇబ్బందుల పాల్జేశారు, వాటినుండి కేశవమూర్తి, సుజాత ఎలా బయటపడ్డారు, చివరికి పండిత పరమేశ్వరశాస్త్రి గారు తన వీలునామాలో ఏం వ్రాశారు అన్నదే మిగిలిన కథ.

పైకి కథ ఒకింత మామూలుగా ఉన్నట్లు కనిపించినా, పాత్రల సృజన, సంఘటనల చిత్రీకరణలోనే రచయిత అసలు శక్తి తెలుస్తుంది. అయితే రచయిత అంతర్లీనంగా చెప్పదలచుకున్నది, అతీత మానవుని ఆవిర్భావం గురించి. మనిషి తనకంటూ కొన్ని సిద్ధాంతాల గిరి గీసుకుని మనస్తత్వాన్ని కుచింప చేసుకోకుండా మనసుపైనున్న ఒక్కో అంతస్తునూ అధిగమించి అతీత మానసిక స్థాయికి ఎదగాలన్నది రచయిత చెప్పదలచుకున్న ఉద్దేశ్యం. ఇందుకు ఉదాహరణగా, కమ్యూనిస్టుల త్యాగపరత్వం, పట్టుదలలకు ఆధ్యాత్మిక దృష్టి తోడైతే ఈ దేశ చరిత్ర మరోవిధంగా ఉండేదని కేశవమూర్తి స్వగతంలో అనుకుంటాడు. ఇక్కడ ఆధ్యాత్మికత అంటే భగవంతునిపై నమ్మకం కాదు, మానవపరిణామ దశలో మానసిక స్థాయిని దాటిన మరో దశ ఉందని తెలుసుకోవడం అంటాడు. ఈ అతీత మానవుని గురించి, ఈ మనసు పై అంతస్తుల గురించి రామమోహనశాస్త్రి పాత్రతో విపులంగా చెప్పిస్తాడు రచయిత.

భర్తను అమితంగా ప్రేమిస్తూ అనుగమించే పాత్ర సుజాతది. భర్తపై అంత ప్రేమ, గౌరవం ఉండి కూడా సీమంతం పన్నిన ఉచ్చులో చిక్కుకొని భర్తను అనుమానిస్తుంది. చెప్పకుండా ఇంటి నుండి వెళ్ళిపోతుంది. తరువాత తప్పు తెలుసుకొని భర్తను చేరుకుంటుంది. తన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న సీమంతాన్ని, తనమీద లేనిపోని విషయాలను పత్రికలో వ్రాసిన కృష్ణమూర్తిని, అకారణంగా తనపై నిందలు వేసే రాధారమణ, శారద్వతుడు, నాసరయ్య వీరందరినీ క్షమించేస్తాడు కేశవమూర్తి. ఇంతటి దారుణాలు చేస్తున్నా వారినలా ఎందుకు క్షమిస్తున్నాడో అర్థంకాక చదివే పాఠకుడు అయోమయంలో పడతాడు. కానీ ముందుకు వెళ్ళేకొద్దీ రచయిత కోరుకున్న అతీతమానవుడు కేశవమూర్తేనని అర్థమవుతుంది. అరవిందులను దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు అరవిందులు, మదర్ కేశవమూర్తివైపు నిశ్చలమైన దృక్కులను ప్రసరించడంతో ఈ విషయం రూఢీ అవుతుంది.

ఇంకా ఈ నవలలో మార్క్సిస్టులమని చెప్పుకునే కుహనా కమ్యూనిస్టుల గురించి, లిమిటెడ్ కంపెనీల పేరుతో జరిగే మోసాల గురించి, మనుగడ కోసం సీనీ ప్రముఖులపై బురదజల్లే సినీపత్రికల గురించి రచయిత పాఠకులకు ఒక అవగాహన కలిపిస్తాడు.

భావాల కోసం పుస్తకాలు చదవకూడదని, మన భావాలను విశాలపరచుకోవడం కోసం పుస్తకాలను చదవాలంటాడు. సాధారణంగా అదృష్టం అలవాటైతే దానివల్ల వచ్చే ఆనందానికి విలువ లేకుండా పోతుంది అందుకే జాగ్రత్తగా ఉండాలంటాడు. జ్ఞానాన్ని తట్టుకోవడం అందరివల్లా కాదని, మానవ పురోగమనానికి ముఖ్య అడ్డంకి… అంతవరకూ ఊతంగా ఉన్న ఆధారాలను విడిచిపెట్టి ముందుకు వెళ్లడంలో ఉండే భయమేనంటాడు. ఇలా విభిన్న విషయాలను చర్చిస్తూ, తన అభిప్రాయాలు వ్యక్తీకరిస్తాడు. అంతే కాకుండా మధ్య మధ్యలో పాత్రలతోనే కథ చెప్పించడం అనే ప్రక్రియ ద్వారా సూటిగా పాఠకుని హృదయంలోనికి తను చెప్పదలచుకొన్న భావాలు చొచ్చుకు పోయేటట్లు చేస్తాడు. మొత్తంమీద నవల చివరికి వచ్చేసరికి పాఠకునికి అతీత మానవుని స్వరూపం కళ్లముందు మెరుస్తుంది. ఆ భావాల బరువుని మోయలేక అతని కనురెప్పలు మూసుకుపోవడం మాత్రం నిశ్చయం.

చివరిగా ఒక మాటలో చెప్పాలంటే… తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలచిపోయే తత్వవేత్తలు వంటి అసాధారణ రచన చేసిన గోపీచంద్ తాత్వికభావాలకు నవలారూపమే… ఈ పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా!

– త్రిసత్య కామరాజన్

ప్రాప్తి:

అశోక్ బుక్ సెంటర్front cover

13-1-1C, St, Anthony Church Compound

Jagadamba Junction

Visakhapatnam 530 002

Phones: (0891) 2565995, 2561055

*

అక్షర

Plot No. 46, Srinagar Colony,

Hyderabad – 500 073

Phone: 040 23736262

వెల: రూ. 100/-

Download PDF   ePub   MOBI

Posted in 2014, జనవరి, పుస్తక సమీక్ష and tagged , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.