ss trans NEW1

గణపతి వైద్యం

Download PDF epub MOBI

“అబ్బా…”- అరిచింది మంజుల. ఎంత నొప్పిగా ఉందో ఆ అరుపులోనే తెలుస్తోంది. ఏమైనా తను ఓ భోళా మనిషి. ఆనందమైనా, దుఃఖమైనా వెంటనే ప్రదర్శిస్తుంది.

నేను వెనక్కి తిరిగి ఆమె వైపు చూసాను. పొద్దున్నే లేచి, బల్ల మీద పరిచి ఉన్న పిల్లల స్కూలు యూనిఫామ్స్ ఇస్త్రీ చేస్తున్నాను. “ఏమైంది?” అన్నాను కాస్త కంగారుగా.

“మోచెయ్యి గోడకి కొట్టుకున్నాను…” – అంది మంజుల, ఇంకా నొప్పితో విలవిలలాడుతూ. తను వంటింట్లోకి వస్తోంటే, పరాకుగా ఉండడం వల్ల మోచెయ్యి గోడకి గట్టిగా తగిలినట్లుంది. హాల్లోకి వంటింట్లోంచే దారి ఉంది, దానికి తలుపులు లేవు.

మంజు మీద జాలేసింది. కానీ తిరిగే కాలు, వాగే నోరు ఊరుకోవన్నట్లు, నా నోటి తీట ఊరుకోదు. మా ఆవిడ్ని ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉంటాను, మా ఇద్దరి మధ్య వాగ్యుద్ధాలకు కారణమవుతూంటాను.

“హాఁ…. బహుశా నిన్న రాత్రి కురిసిన వర్షానికి, మన ఇల్లు ముడుచుకుపోయిందేమో…” అన్నాను హాస్యంగా.

నాకేసి కోపంగా చూసింది మంజు. “నేను కొంచెం లావయ్యానని నాకు తెలుసు… మీరేం వేళాకోళం చెయక్కర్లా…”.

“అహ.. అది కాదు..” అంటూ అనవసరంగా నోరు జారి చిక్కుకున్న ఆ విపత్కర పరిస్థితిలోంచి బయటపడేందుకు ప్రయత్నించాను.

“ఓ సన్నని నాజూకైన పిల్లని చూడమని మీ అమ్మగారిని అడగొచ్చుగా, తమరికి మరో పిల్లని… ఓ మెరుపుతీగని చూడమంటే ఆవిడ ఇప్పటికీ సిద్ధమే….” అంది వ్యంగ్యంగా.

ఇంక మంజు మాటల ప్రవాహం మొదలయింది. ఎంత తక్కువ తిన్నా, బరువు పెరిగిపోతున్నానని, ఇంటి పనులన్నీ చేయడానికి తనకి శక్తి కావాలని, కుటుంబ బాధ్యతలెక్కువై పోయి తనని తాను పట్టించుకోడం మానేసానని వాపోయింది.

ఇది మాకు మాములే. మంజు ఓ తేనెటీగలాంటింది. ఎంతో కష్టపడుతూ, సంగీతాన్నీ, మధువుని అందించే తేనేతీగలు… తేనెపుట్టని కెలికితే మాత్రం….. కుట్టందే వదిలిపెట్టవు. తను మా ఇంటి ఇరుసు. మా వ్యవహారాలన్నీ తన చుట్టే తిరుగుతాయి. మా సత్తువకి కారణం తనే.

“అయ్యయ్యో… అవన్నీ సరదా కోసం అన్న మాటలు మంజూ! మన పెళ్ళయిన కొత్తలో నువ్వు ఎలా ఉన్నావో, ఇప్పుడూ అలానే ఉన్నావు, 17 ఏళ్ళయినా….” తను చల్లబడటానికి కాసేపు ఆగి, “అప్పటికీ ఇప్పటికీ పెద్ద తేడా ఏం లేదు….” అని ముగించాను.

కానీ వెటకారానికి అలవాటు పడ్డ నా నోరు అక్కడితో ఆగలేదు. “అయినా, ఇదంతా మన వాషింగ్ మెషిన్ వల్లే. అది నీ బట్టల్ని బిగుతు చేస్తున్నట్లుంది… అంతే. ఇదివరకు మనం బట్టలు చేత్తో ఉతుక్కునేవాళ్ళం…”

ఈసారి నేను తనని ఆపలేకపోయాను. నిజానికి తనదేం మరీ అంత ఊబకాయం కాదు, నేను ఊరికే హాస్యమాడతున్నాను, కానీ అలా తనని నమ్మించలేకపోయాను. బరువు తగ్గి, 17 ఏళ్ళ క్రితం తనెలా ఉండేదో ప్రపంచానికి మరోసారి చూపిస్తానని శపధం చేసింది మంజు.

***

“నిజంగానా…?” మంజుల ఫోన్‌లో అడుగుతోంది. తను వాళ్ళక్కతో మాట్లాడుతోంది. “అమెరికాలోని ఆ మూలికామందు అంత శక్తివంతమైనదా? నమ్మలేకుండా ఉన్నాను. మూడు నెలల్లో పది కిలోల బరువు తగ్గచ్చా….?”

“నువ్వు మూడు నెలల్లో పది కిలోల బరువు తగ్గితే, నీకు కాన్సరన్న మాటే….” అన్నాను సరదాగా. “ఆ మందు కాన్సర్‌ని కూడా నయం చేస్తుందా…” నేను నా లాప్‌టాప్ నుంచి కళ్ళెత్తకుండానే అడిగాను.

“అదేం కాదులే…. ఆయనెప్పుడూ అంతే… నిత్య శంకితుడు…..” అని ఫోన్‌లో చెబుతోంది మంజు. బహుశా వాళ్ళ అక్కకి నా మాటలు వినబడి ఉంటాయి. “సరే ఆ మందు ఎక్కడ దొరుకుతుందో, ఎంతవుందో చెప్పు…” అంటోంది మంజు.

వివరాలన్నీ సేకరించాకా, ఫోన్‌ని రిసీవర్ మీద గట్టిగా చప్పుడయ్యేలా విసురుగా పెట్టింది మంజు. “మీ వెధవ జోకులేవీ మా అక్క మీద వేయకండి… దానిది సున్నితమైన మనసు…” అంది.

“అది కాదు మంజు…” అన్నాను తనను ఓదారుస్తూ. “చూడు, అన్ని రకాల మూలికా వైద్యానికి భారతదేశం పెట్టింది పేరు. మరి నువ్వేమో అమెరికా నుంచి మూలికల మందు తెప్పించుకోవాలనుకుంటున్నావు. అసలు అదేంటో, ఏం చేస్తుందో మనకి తెలియదు. అటువంటి మందులని ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు.”

“నా సలహా ఏంటంటే… నీ ఆరోగ్యంపైన నీకేవైనా అనుమానాలుంటే… ఓసారి హెల్త్ చెకప్ చేయించుకోడం మంచిది…” అన్నాను.

“అదేం కాదు….” నా మాటలని తీవ్రంగా ఖండించింది మంజుల. “మా అక్క వాళ్ళ స్నేహితురాలు వాడిందట. చాలా మంచి ఫలితం కనబడిందట.. కాబట్టి మరేం పర్వాలేదు. నేను సన్నగా, నాజూగ్గా తయారవుతానని అసూయ పడకండి….” అంది.

***

Posted in 2014, అనువాదం, జనవరి and tagged , , .

One Comment

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.