ss trans NEW1

గణపతి వైద్యం

Download PDF epub MOBI

“అబ్బా…”- అరిచింది మంజుల. ఎంత నొప్పిగా ఉందో ఆ అరుపులోనే తెలుస్తోంది. ఏమైనా తను ఓ భోళా మనిషి. ఆనందమైనా, దుఃఖమైనా వెంటనే ప్రదర్శిస్తుంది.

నేను వెనక్కి తిరిగి ఆమె వైపు చూసాను. పొద్దున్నే లేచి, బల్ల మీద పరిచి ఉన్న పిల్లల స్కూలు యూనిఫామ్స్ ఇస్త్రీ చేస్తున్నాను. “ఏమైంది?” అన్నాను కాస్త కంగారుగా.

“మోచెయ్యి గోడకి కొట్టుకున్నాను…” – అంది మంజుల, ఇంకా నొప్పితో విలవిలలాడుతూ. తను వంటింట్లోకి వస్తోంటే, పరాకుగా ఉండడం వల్ల మోచెయ్యి గోడకి గట్టిగా తగిలినట్లుంది. హాల్లోకి వంటింట్లోంచే దారి ఉంది, దానికి తలుపులు లేవు.

మంజు మీద జాలేసింది. కానీ తిరిగే కాలు, వాగే నోరు ఊరుకోవన్నట్లు, నా నోటి తీట ఊరుకోదు. మా ఆవిడ్ని ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉంటాను, మా ఇద్దరి మధ్య వాగ్యుద్ధాలకు కారణమవుతూంటాను.

“హాఁ…. బహుశా నిన్న రాత్రి కురిసిన వర్షానికి, మన ఇల్లు ముడుచుకుపోయిందేమో…” అన్నాను హాస్యంగా.

నాకేసి కోపంగా చూసింది మంజు. “నేను కొంచెం లావయ్యానని నాకు తెలుసు… మీరేం వేళాకోళం చెయక్కర్లా…”.

“అహ.. అది కాదు..” అంటూ అనవసరంగా నోరు జారి చిక్కుకున్న ఆ విపత్కర పరిస్థితిలోంచి బయటపడేందుకు ప్రయత్నించాను.

“ఓ సన్నని నాజూకైన పిల్లని చూడమని మీ అమ్మగారిని అడగొచ్చుగా, తమరికి మరో పిల్లని… ఓ మెరుపుతీగని చూడమంటే ఆవిడ ఇప్పటికీ సిద్ధమే….” అంది వ్యంగ్యంగా.

ఇంక మంజు మాటల ప్రవాహం మొదలయింది. ఎంత తక్కువ తిన్నా, బరువు పెరిగిపోతున్నానని, ఇంటి పనులన్నీ చేయడానికి తనకి శక్తి కావాలని, కుటుంబ బాధ్యతలెక్కువై పోయి తనని తాను పట్టించుకోడం మానేసానని వాపోయింది.

ఇది మాకు మాములే. మంజు ఓ తేనెటీగలాంటింది. ఎంతో కష్టపడుతూ, సంగీతాన్నీ, మధువుని అందించే తేనేతీగలు… తేనెపుట్టని కెలికితే మాత్రం….. కుట్టందే వదిలిపెట్టవు. తను మా ఇంటి ఇరుసు. మా వ్యవహారాలన్నీ తన చుట్టే తిరుగుతాయి. మా సత్తువకి కారణం తనే.

“అయ్యయ్యో… అవన్నీ సరదా కోసం అన్న మాటలు మంజూ! మన పెళ్ళయిన కొత్తలో నువ్వు ఎలా ఉన్నావో, ఇప్పుడూ అలానే ఉన్నావు, 17 ఏళ్ళయినా….” తను చల్లబడటానికి కాసేపు ఆగి, “అప్పటికీ ఇప్పటికీ పెద్ద తేడా ఏం లేదు….” అని ముగించాను.

కానీ వెటకారానికి అలవాటు పడ్డ నా నోరు అక్కడితో ఆగలేదు. “అయినా, ఇదంతా మన వాషింగ్ మెషిన్ వల్లే. అది నీ బట్టల్ని బిగుతు చేస్తున్నట్లుంది… అంతే. ఇదివరకు మనం బట్టలు చేత్తో ఉతుక్కునేవాళ్ళం…”

ఈసారి నేను తనని ఆపలేకపోయాను. నిజానికి తనదేం మరీ అంత ఊబకాయం కాదు, నేను ఊరికే హాస్యమాడతున్నాను, కానీ అలా తనని నమ్మించలేకపోయాను. బరువు తగ్గి, 17 ఏళ్ళ క్రితం తనెలా ఉండేదో ప్రపంచానికి మరోసారి చూపిస్తానని శపధం చేసింది మంజు.

***

“నిజంగానా…?” మంజుల ఫోన్‌లో అడుగుతోంది. తను వాళ్ళక్కతో మాట్లాడుతోంది. “అమెరికాలోని ఆ మూలికామందు అంత శక్తివంతమైనదా? నమ్మలేకుండా ఉన్నాను. మూడు నెలల్లో పది కిలోల బరువు తగ్గచ్చా….?”

“నువ్వు మూడు నెలల్లో పది కిలోల బరువు తగ్గితే, నీకు కాన్సరన్న మాటే….” అన్నాను సరదాగా. “ఆ మందు కాన్సర్‌ని కూడా నయం చేస్తుందా…” నేను నా లాప్‌టాప్ నుంచి కళ్ళెత్తకుండానే అడిగాను.

“అదేం కాదులే…. ఆయనెప్పుడూ అంతే… నిత్య శంకితుడు…..” అని ఫోన్‌లో చెబుతోంది మంజు. బహుశా వాళ్ళ అక్కకి నా మాటలు వినబడి ఉంటాయి. “సరే ఆ మందు ఎక్కడ దొరుకుతుందో, ఎంతవుందో చెప్పు…” అంటోంది మంజు.

వివరాలన్నీ సేకరించాకా, ఫోన్‌ని రిసీవర్ మీద గట్టిగా చప్పుడయ్యేలా విసురుగా పెట్టింది మంజు. “మీ వెధవ జోకులేవీ మా అక్క మీద వేయకండి… దానిది సున్నితమైన మనసు…” అంది.

“అది కాదు మంజు…” అన్నాను తనను ఓదారుస్తూ. “చూడు, అన్ని రకాల మూలికా వైద్యానికి భారతదేశం పెట్టింది పేరు. మరి నువ్వేమో అమెరికా నుంచి మూలికల మందు తెప్పించుకోవాలనుకుంటున్నావు. అసలు అదేంటో, ఏం చేస్తుందో మనకి తెలియదు. అటువంటి మందులని ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు.”

“నా సలహా ఏంటంటే… నీ ఆరోగ్యంపైన నీకేవైనా అనుమానాలుంటే… ఓసారి హెల్త్ చెకప్ చేయించుకోడం మంచిది…” అన్నాను.

“అదేం కాదు….” నా మాటలని తీవ్రంగా ఖండించింది మంజుల. “మా అక్క వాళ్ళ స్నేహితురాలు వాడిందట. చాలా మంచి ఫలితం కనబడిందట.. కాబట్టి మరేం పర్వాలేదు. నేను సన్నగా, నాజూగ్గా తయారవుతానని అసూయ పడకండి….” అంది.

***

మరుసటి రోజు రాత్రి భోజనాలు చేస్తూ మాట్లాడుకుంటున్నాం. “మా అక్క చెప్పిన మందు గురించి ఇంకో సంగతి తెలిసింది. దాని వల్ల పిత్తాశయంలో ఏవో సమస్యలు వస్తాయట.. నా ఫ్రెండ్ శాంతి తెలుసుగా, వాళ్ళ స్నేహితులెవరో ఈ మందు వాడి చాలా ఇబ్బందులు పడ్డారట….” అంది.

“నేను ముందే చెప్పానుగా…..”

“అదేం కాదు. ఆ మందుకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని మీరేం చెప్పలేదు. ఎప్పుడూ ఏదో ఒకటి నెగటివ్‌గానే మాట్లాడుతుంటారు. ఆ మందు గురించి మా శాంతే సరీగ్గా చెప్పింది…”

“ఓహ్, అలాగా… నిజమే అయ్యుంటుంది…. కానీ మా బంధువుల్లోనూ, నా స్నేహితుల్లోనూ ఎవరికీ ఊబకాయం లేదు. కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ గురించి నాకు సరీగ్గా తెలియదు….”

ఈ వెధవ వ్యాఖ్యతో మళ్ళీ మొదలైంది మా గొడవ.

“అంటే మీ ఉద్దేశంలో మా బంధువులు, నా మిత్రులు అంతా ఊబకాయులా?” కోపంగా అడిగింది మంజు.

“సారీ మంజూ…. నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను. నీది ఊబకాయం కాదు. నువ్వు పర్‌ఫెక్ట్‌గా ఉన్నావు. గుమ్మడికాయలా గుండ్రంగా…..” అన్నాను. నేను మరో సారి మాటలు తూలుతున్నానని గ్రహించి నాలుక కరుచుకున్నాను.

“అయితే, గుమ్మడికాయలా గుండ్రంగా ఉండడం ఆరోగ్యానికి చాలా మంచిదని నేను ఎక్కడో చదివాను…” అంటూ తనని ఊరడించడానికి ప్రయత్నించి మరింత రెచ్చగొట్టాను. తనే మాత్రం లావు లేదని నాకు నిజంగా తెలిసినా, మంజుని మాత్రం ఒప్పించలేకపోయాను.

***

రోజూవారీ వ్యవహారాలలో పడి, ఈ సంగతి మర్చిపోయాను. కొన్ని రోజుల తర్వాత బాల్కనీ లోంచి మంజుల, మా ఎదురింటావిడ మాట్లాడుకోడం నా చెవిన బడింది.

“మీరు ఆకుకూరలు ఇక్కడ ఎక్కడ కొంటారు?” అడుగుతోంది ఆవిడ.

“ఆకుకూరల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి..” అంది మంజుల. “ఈ మధ్య నాకొచ్చిన ఒక ఈ-మెయిల్ ఫార్వార్డ్‌లో చదివాను – ఆకుకూరలపైన చిన్న చిన్న కీటకాల గుడ్లు ఉంటాయట. అవి మాములు కంటికి కనపడవట. వాటిని తింటే చాలా సమస్యలొస్తాయట. మనకి ఖచ్చితంగా తెలిస్తే గాని ఆకుకూరలు తినకూడదని దాని సారాశం…..” చెప్పుకొచ్చింది మంజు.

“ఆకుకూరలనేం వుంది లెండి, ఈ రోజుల్లో పళ్ళలో కూడా ఎన్నో రసాయనాలు ఉంటున్నాయట. మొదట్లో బరువు తగ్గడం కోసం నేను ఆకుకూరలు, పళ్ళు మాత్రమే తిందామనుకున్నాను. కానీ ఇంటర్‌నెట్‍లో వెతికి చూస్తే, మనలాంటి నగరాలలో ఆకుకూరలు, పళ్ళు తీసుకోడం కూడా ఆరోగ్యానికి హానికరమే అని తెలిసింది…” అంది ఎదురింటామె.

“ఇంతకీ మీరు వాకర్ ప్రయత్నించారా?” అడిగిందామె మంజుని, “బరువు తగ్గడానికి వాకర్ చాలా మంచిదట. మా చెల్లెలు వాకర్ వాడి 15 కిలోలు బరువు తగ్గింది. మా తమ్ముడికి అటువంటి వాకర్లు అమ్మే కొట్టుంది. వాడిని మీకు ఫోన్ చేయమని చెబుతాను. ఎంతో అవదు, పదివేల రూపాయలంతే…..” అందామె.

“తప్పకుండా. నేను సిద్ధం. మీ తమ్ముడి ఫోన్ నెంబర్ ఇవ్వండి….” అంది మంజు.

***

“శనివారం ఒకసారి ఎదురింటావిడ తమ్ముడితో మాట్లాడుదాం. ఆయన కొట్లోంచి వాకర్ ఆర్డర్ చేయాలి. కాకపోతే దాన్ని ఎక్కడ పెట్టాలన్నదే సమస్య. బెడ్ రూమ్‍లో పెడదామా?” అంది మంజు

“కానీ మన బెడ్ రూమ్ చిన్నది కదా, సరిపోతుందా?” అన్నాన్నేను.

“ఎక్కడోక్కడ పెట్టాలిగా… పోనీ హాల్లో పెడదామా?”

“అది కాదోయ్… నువ్వు అసలు లావుగానే లేవు. పూర్తి ఫిట్‌గా, అందంగా ఉన్నావు. నీకెందుకా అభిప్రాయం కలిగిందో అర్థం కావడం లేదు… బహుశా మన అద్దం నిన్నలా లావుగా చూపిస్తుందేమో….”

మళ్లీ నోరు జారాను. ఇలా ఎందుకు మాట తూల్తానో నాకు అర్థం కాదు.

“అదిగో మళ్ళీ ఎగతాళి చేస్తున్నారు… ఎలాగొలా బరువుతగ్గుతాను…. వాకర్ కోసం ఎక్కడోక్కడ స్థలం చూస్తాను, లేదా ఇంకేదైనా చేసైనా తగ్గుతాను. మీరే చూద్దురుగాని…”

***

“ఎలకలది ఇష్టారాజ్యం అయిపోయింది. చూడండి, పొద్దున్నే ఇల్లంతా ఎలా పరిగెడుతున్నాయో. అసలు ఎలకల బోను ఎలా వాడాలో కూడా మీకు తెలియదులా ఉంది. లేకపోతే, ఆ బోనులో ఒక్క ఎలక కూడా పడదేం….?”

హాల్లోంచి వంటింట్లోకి వెళ్ళే దారి మొదట్లో నిలుచుని, నాతో మాట్లాడుతోంది మంజుల. నేను ఆమె పక్కన నిలుచుని ఉన్నాను.

“ఆఁ. నేను ఎలకల బోను బానే వాడాను. కానీ ఏం జరిగిందో తెలుసా? నిన్న నువ్వు చేసిన గారెలలో ఒక ముక్కని రాత్రి బోనులో ఉంచాను. తెల్లవారి లేచి చూస్తే, ఇంకేముంది! గారె పక్కనే ఉల్లిపాయ ముక్క ఉంది. బహుశా ఎలకకి ఉల్లిపాయ గారె కావాలేమో….?”

“ఏంటి జోకులా….? నేను చేసిన గారెలు ఎలకకి కూడా నచ్చవన్నది మీ వెటకారం ఐతే, మీరే స్వయంగా గారెలు చేయచ్చుగా? సరే, ఎలక నేను చేసిన గారెని ముట్టుకోలేదు… మరి మీరు చేస్తేనో… ss trans NEW1 - Copyకనీసం చీమలు కూడా ముట్టుకోవు….”

కాస్త దూరంలో కూర్చుని మా అబ్బాయి తెలుగు రైమ్స్ చదువుతూ – “ఏనుగమ్మా ఏనుగు… మాఊరొచ్చిం దేనుగు… మంచినీళ్ళు తాగిందేనుగు… ఏనుగమ్మా అమ్మ.. ఏనుగమ్మా” అంటూ కూడబలుక్కుంటున్నాడు. అప్రయత్నంగా ఎందుకో నాకు నవ్వొచ్చింది.

“ఏంటి నేను ఏనుగులా ఉన్నానా….?” కోపంగా అంది మంజు.

“అబ్బా, అదేం కాదు మంజూ. ఎందుకో కారణం తెలియదు గానీ, కొద్ది రోజులుగా నువ్వు చాలా బరువు తగ్గావు. బాగా సన్నబడ్డావు. నేనేదో సరదా హాస్యమాడుతున్నాను అంతే. అయితే ఇప్పుడు సీరియస్‌గా అడుగుతున్నాను – చెప్పు బరువు తగ్గడానికి ఏం చేసావు?” అని ఓ క్షణం ఆగి,

“పైగా మనం ఇంకా వాకర్ కూడా కొనలేదు. మరి బరువెలా తగ్గావా అని నాకు ఆశ్చర్యంగా ఉంది” అన్నాను.

“నిజంగానా…” అంది మంజు… “నేనేమీ ప్రత్యేకించి చేయలేదు మరి….” అంటూ ఆలోచనలో పడింది.

“మనింటి దగ్గర్లోని సిద్ధి బుద్ధి వినాయకుడి గుడిలో వారం రోజుల్నించి రోజూ 108 ప్రదక్షిణాలు చేస్తున్నాను. అప్పట్లో మీకు ఒంట్లో బాలేనప్పుడు మండలం పాటు రోజూ 108 ప్రదక్షిణాలు చేస్తానని మొక్కుకున్నాను. ఆ మొక్కు తీర్చనేలేదు. క్రితం వారం మీరు ఛాతి నొప్పి అని చెప్పినప్పుడు ఆ మొక్కు సంగతి గుర్తొచ్చింది. వెంటనే ప్రదక్షిణాలు ప్రారంభించాను. ఈ హడావుడిలో పడి మిగతా విషయాలేవి పట్టించుకోలేదు…” అంది.

“ఓహ్, ఈ విషయం నాకు తెలీదు. ఇప్పుడు నువ్వెంతో ఫిట్‌గా కనిపిస్తున్నావు…” అన్నాను.

“బుకాయించద్దు… చెబితే ప్రతీదాన్ని అతిశయోక్తిగా చెబుతారు లేదంటే మరీ శంకిస్తారు… నిజం చెప్పండి నేను సన్నగా కనిపిస్తున్నానా?”

ఇంతలో “అమ్మా… ఎలక… ఎలక…” అంటూ మా అబ్బాయి గట్టిగా అరిచాడు. మేమలా మాట్లాడుకుంటుండగానే ఓ ఎలక హాల్లోకి వంటింట్లోకి పరిగెత్తుకు వచ్చింది. తన పాదాల మధ్య నుంచి ఎలక వంటింట్లోకి రావడం చూసి మంజు గబుక్కున పైకి గెంతింది.

తను పడిపోకుండా ఆపడం కోసం తనని నేను ఎత్తుకున్నాను. ఇలా కిందకి దిగిందో లేదో ఎలక మళ్ళీ మంజు పాదాల మధ్య నుంచి దూరి మాయమైపోయింది. దాంతో మంజు మళ్ళీ గెంతింది. మళ్లీ తనని పొదివి పట్టుకున్నాను.

“చూసావా, నువ్వెంత బక్కపలచగా అయిపోయావో. ఎలక నీ పాదాల మధ్య నుంచి వెడుతుంటే, నేను నిన్ను తేలికగా ఎత్తుకోగలిగాను. అదే నువ్వు లావుగా ఉంటే ఇలా ఎత్తుకోగలిగేవాడినా చెప్పు….”

అసలే మంజులవి పెద్ద కళ్ళు. అవి ఇప్పుడు మరింత పెద్దవయ్యాయి. “నన్నెత్తారా? నేను అంతగా సన్నబడ్డానా? నిజంగానా?… అంది కళ్ళలో మెరుపులతో.

“అవును. కావాలంటే ఇంకోసారి ఎత్తుకుని చూపిస్తాను…”

“వద్దులెండి… అయినా పిల్లల ముందు ఏంటా చేష్టలు…” అంటూ సిగ్గు పడింది.

“ఓ వినాయకుడా, నీకూ , నీ ఎలకకీ థాంక్స్. మా ప్రియమైన వాళ్ల కోసం కొన్ని కొంటె అబద్ధాలు చెప్పక తప్పదు…..” ఈ సారి నా మనసు మాట్లాడింది. నేను మాటలు బయటకు రాకుండా పెదాలను వేళ్ళతో బంధించేసాను.

“ఆరోగ్యంగా ఉండడానికి – రోజూ గణపతి గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయడం! మనసు, గుండె రెండిటికీ వ్యాయామం కదూ. ఇంతకంటే మంచి వైద్యం ఏముంటుంది?…” లోగొంతుతో అనుకున్నాను.

“ఏదో అంటున్నారు… ” అంది మంజు.

“ఏం లేదు. నీ నాజూకుదనాన్ని మెచ్చుకుంటున్నా. అంతే….”

*

ఆంగ్ల మూలం: రాజారాం బాలాజీ

స్వేచ్ఛానువాదం: కొల్లూరి సోమ శంకర్

Download PDF epub MOBI

 

Posted in 2014, అనువాదం, జనవరి and tagged , , .

One Comment

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.